Life Partner
-
తెగిన గాలిపటం జీవిత భాగస్వామిని చేరుతుందట!
నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్‌లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్‌కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు. మీరఠ్‌లో వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు. -
ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా?
‘నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఫలానా హీరోలా ఉండాలి’ ‘నాకు భార్య కావాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి’ ఇలాంటి... డైలాగ్‌లు టీన్స్ నుంచి ట్వంటీస్ వరకు చెప్పేవే. అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు వాస్తవంలోకి తెచ్చేవి. అనేకానేక రాజీలతో బాసికానికి తలవంచి ఏడడుగులు పడేవి. అది ఒకప్పుడు... ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ మారింది. కొత్తకాలంలో కట్నం కాలగర్భంలోకి కలిసిపోనుందా? అయితే... ఇది మంచి పరిణామమే. అమ్మాయి విద్య ఉద్యోగాలతో సాధికారత సాధించిందా? అయితే... ఇది ఇంకా గొప్ప శుభపరిణామమే. భాగస్వామి ఎంపికలో యువత ప్రాధాన్యాలెలా ఉన్నాయి? ఇండియాలో పెళ్లిళ్లను ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడా? అధ్యక్షుడిగా ట్రంప్ పోయినా ట్రంప్ భయం ఇంకా ఉందా? ‘పెళ్లిలో పెళ్లి కుదరడం’ ఒకప్పటి మాట. అంటే బంధువుల పెళ్లిలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు బంధువులందరి దృష్టిలో పడతారు. ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? వంటి వివరాలన్నీ కబుర్లలో భాగంగా బంధువులందరికీ చేరిపోయేవి. అబ్బాయికీ, అమ్మాయికీ బంధుత్వం కలిసే ఎవరో పెద్దవాళ్లు ఎవరో ఓ మాటగా అంటారు. మాటలు కలుపుకుంటారు. పెళ్లి కుదిరేది. శ్రావణమాసం పెళ్లిలో కలిసిన అమ్మాయి, అబ్బాయి విజయదశమి ముహూర్తాల్లో వధూవరులయ్యేవాళ్లు. మరి ఇప్పుడు... కాలం మారింది. ఎంతగా మారిందీ అంటే... బంధువులను కూడా ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌గా పలకరించుకునే తరం ఇది. దగ్గరి బంధువుల అమ్మాయి, అబ్బాయిల వివరాలు కూడా మ్యారేజ్ బ్యూరోల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. సమాజంలో వచ్చిన ఈ మార్పుతోపాటు... జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వచ్చిన మార్పు కూడా పెద్దదే. నుదుట బాసికాలు, మెడలో పూలదండలు ధరించకపోతే పెళ్లిపీటల మీద ఉన్న వాళ్లు వధూవరులా లేక కన్యాదాతలా అనే సందేహం కూడా ఎదురవుతుంటుంది. ‘తొలి ప్రసవం కనీసం ముప్పై ఏళ్ల లోపు జరగడం శ్రేయస్కరం’ అని వైద్యరంగం చెబుతూనే ఉంది. కానీ ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు పెళ్లికి సిద్ధమయ్యేటప్పటికే ముప్పయ్ దాటుతున్నాయి. ఆలస్యానికి కారణాలు ఒకటి–రెండు కాదు, అనేకం. భాగస్వామిని ఎంచుకోవడం పట్ల సమాజం ఎలా ఉందో తెలియాలంటే మ్యారేజ్ బ్యూరోతో మాట్లాడడం ఓ సులువైన మార్గం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు కోటిరెడ్డి, జ్యోతి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి, శ్రీకాకుళంలోని శ్రీసాయి నరసింహ సేవాసంఘం నిర్వహకులు కరణం నరసింగరావు, తిరుపతికి చెందిన సాయి మ్యాట్రిమొనీ నిర్వాహకురాలు పసుపులేటి శ్వేత అనేక ఆసక్తికరమైన విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఇదీ నా స్టైల్ షీట్! ‘‘పెళ్లి కుదర్చడం అనేది ఓ యాభై ఏళ్ల కిందట ఉన్నంత సులభం కాదిప్పుడు. తెరిచిన పుస్తకంలా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ల మధ్య వివాహం జరిగే రోజులు కావివి. ఖండాల అవతలి వ్యక్తులతోనూ పెళ్లిబంధం కలపాలి. ప్రేమ పెళ్లిళ్లను పక్కన పెడితే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వాళ్లే మా దగ్గరకు వస్తారు. వాళ్లు తమ గురించి ఏ వివరాలిస్తారో ఆ వివరాలనే అవతలి వాళ్లకు అందివ్వగలుగుతాం. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. వంద పెళ్లిళ్లలో ఒక్క పెళ్లి విఫలమైనా మేము ఎక్కడో లోపం చేశామేమో అనిపిస్తుంది. నేను ఇరవై ఏళ్లుగా ఈ ఫీల్డులో ఉన్నాను. వేలాది మంది క్లయింట్లతో మాట్లాడాను. రెండువేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. ఈ అనుభవంతో ఈ ప్రొఫెషన్ని సమగ్రంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు నేనుగా కొన్ని నియమాలను రూపొందించుకున్నాను. ► అబ్బాయి, అమ్మాయి ఉద్యోగం, చదువు, ఆస్తిపాస్తుల గురించి ప్రశ్నావళిలో ఇచ్చిన వివరాలు వాస్తవమేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. సమగ్రంగా విచారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ఇలాంటి ఎంక్వయిరీ కూడా మ్యారేజ్ బ్యూరో చేసి పెట్టగలగాలి. అలాగే ఆధార్ నంబర్, శాలరీ సర్టిఫికేట్లు తీసుకునే నియమం బ్యూరోలకు ఉంటే అబద్ధాలతో పెళ్లి చేసుకోవచ్చనే దురాలోచనను మొగ్గలోనే అరికట్టవచ్చు. ► యువతీయువకులు భాగస్వామి ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. తమకు నచ్చిన అంశాలన్నీ ఒక వ్యక్తిలో రాశిపోసి ఉండడం సాధ్యం కాదని, మనం కోరుకున్న లక్షణాలతో ఓ వ్యక్తిని తయారు చేయలేమని, ఉన్న ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది అని పెద్దవాళ్లు చెప్పట్లేదు. ఈ విషయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు’’ అన్నారు కోటిరెడ్డి. ఇన్ని వడపోతలు పూర్తయి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఈ తరం తల్లిదండ్రులకు తప్పడం లేదు. అందుకే వైవాహిక బంధం బలపడే వరకు కొంత కనిపెట్టి ఉండాలి. గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే సరి చేయడం వరకే ఉండాలి పెద్దవాళ్ల జోక్యం. పిల్లల జీవితంలోకి దూరిపోయి వాళ్ల జీవితాలను తామే జీవించాలనుకోకూడదు. ఇప్పటి పేరెంట్స్ దాదాపు చదువుకున్న వాళ్లే. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా కోడలు వచ్చి తమను చూసుకోవాలనే ఆంక్షల్లేవు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ల కుటుంబం వాళ్లను దిద్దుకోమని నూతన దంపతులను వేరే ఇంట్లో ఉంచడానికే ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన సంగతి... తల్లిదండ్రులు వృత్తి వ్యాపారాల్లో రిటైరై ఉంటే, పిల్లల పెళ్లి బాధ్యత పూర్తయిన తరవాత తమకిష్టమైన లేదా సమాజహితమైన వ్యాపకాన్ని పెట్టుకోవాలి. – వాకా మంజులారెడ్డి ట్రంప్ ప్రభావం నేను పాతికేళ్లుగా వివాహవేదిక నడుపుతున్నాను. అప్పట్లో అమ్మాయి తల్లిదండ్రులైనా, అబ్బాయి తల్లిదండ్రులైనా అవతలి వారి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా గమనించేవారు. ఇప్పుడు డబ్బు, ఆస్తులు ప్రధానం అయ్యాయి. పాతికేళ్ల కిందట విదేశాల మోజు బాగా ఉండేది. పదవ తరగతి అమ్మాయికి కూడా యూఎస్ సంబంధాల కోసం ప్రయత్నించేవారు. ఈ ట్రెండ్ 1990– 2000 మధ్య బాగా ఉండేది. ఇప్పుడు అమ్మాయిలే చదువుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయిలు, అలాగే అక్క, అన్న విదేశాల్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే విదేశీ సంబంధాలు కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయికి యూఎస్ అబ్బాయితో పెళ్లి చేసినవాళ్లు, అమ్మాయిని అమెరికా పంపించడానికి వీసా రాక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలున్నాయి కాబట్టి అమ్మాయి మా కళ్ల ముందే ఉంటుంది, ఇండియా సంబంధాలే చెప్పండి అంటున్నారు. అయితే అబ్బాయికి లక్ష రూపాయల జీతం ఉన్నా సరే ‘ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద జీతం ఉన్నవాళ్లను చెప్పండి’ అంటున్నారు. పైగా ‘మా అమ్మాయి సర్దుకుపోలేదు, కాబట్టి ఉమ్మడి కుటుంబం వద్దు’ అనే నిబంధనలు ఎక్కువయ్యాయి. కట్నం అనేది పెద్ద విషయంగా చర్చకు రావడం లేదు. ఆడంబరాలు మాత్రం ఆకాశమే హద్దు అన్నంతగా పెరిగిపోయాయి. ఇక పెళ్లి వయసుదాటిపోతోందనే ఆందోళన అటు పేరెంట్స్‌లోనూ కనిపంచడం లేదు, పెళ్లి చేసుకోవాల్సిన యువతీయువకుల్లోనూ కనిపించడం లేదు. ముప్పై సంవత్సరాలు దాటుతున్నా కూడా వయసును పట్టించుకోవడం లేదు. – జొన్నలగడ్డ జ్యోతి మళ్లీ యూఎస్ క్రేజ్ పదేళ్లుగా ఈ వ్యాపకంలో ఉన్నాను. మొదట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నాలుగైదు సంబంధాలు చూసి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు నలభై– యాభై సంబంధాలు చూసినా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. వయసు మీరిపోతున్నా ఎవరికీ పట్టింపు ఉండడం లేదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా భాగస్వామి కోసం బంగారాన్ని గీటుపెట్టినట్లు చూస్తున్నారు. అబ్బాయి క్యాప్ పెట్టుకున్న ఫొటో పంపిస్తే ‘బట్టతల కావచ్చు, క్యాప్ లేని ఫొటోలు పంపించండి’ అంటున్నారు అమ్మాయిలు. ఇక అబ్బాయిలు కూడా తాము యావరేజ్‌గా ఉన్నా సరే... అందమైన అమ్మాయి కావాలంటారు. అబ్బాయిలైనా కొంతవరకు రాజీపడుతున్నారు కానీ అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. ఓ మంచి మార్పు ఏమిటంటే... కట్నం ప్రాధాన్యం లేని విషయమైపోయింది. అలాగే ట్రంప్ హయాంలో అమ్మాయి తల్లిదండ్రులు యూఎస్ సంబంధాలు వద్దనేవాళ్లు. ఇప్పుడు మళ్లీ యూఎస్ సంబంధాలకు క్రేజ్ పెరిగింది. – శ్వేత పసుపులేటి నిర్ణయం వధూవరులదే! అమ్మాయికి పెళ్లి చేయాలంటే... ఓ ఇరవై ఏళ్ల కిందట అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు చదువు, ఉద్యోగం మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటోంది. వ్యాపారం అనగానే ‘రిస్క్ అవసరమా’ అంటున్నారు. వ్యవసాయం అయితే ఇక నాలుగో ప్రాధాన్యంలోకి వెళ్లిపోయింది. కరోనా తర్వాత విదేశాలంటే భయపడుతున్నారు. అంతవరకు విదేశాలతో సంబంధం లేని వాళ్లు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. వధువు అక్క లేదా అన్న యూఎస్, యూకేల్లో ఉన్న ఆ దేశంలో ఉన్న అబ్బాయికే మొగ్గు చూపుతున్నారు. ఇక డిమాండ్ల విషయానికి వస్తే... వరుని ఎంపిక విషయంలో అమ్మాయిలు చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎంతో కొంత రాజీ పడుతున్నది అబ్బాయిలే. చాదస్తం తగ్గింది ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిని ఒకప్పుడు వధూవరుల తల్లిదండ్రులు కుదిర్చేవాళ్లు, ఇప్పుడు వధూవరులు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు (అరేంజ్డ్ మ్యారేజ్‌ల విషయంలో కూడా). ఇప్పుడు దాదాపుగా అందరూ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులే. వాళ్లు కొడుకు, కూతురు ఇద్దరినీ చదివిస్తున్నారు. ఇద్దరినీ ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఆస్తిని దాదాపుగా సమంగా ఇస్తున్నారు. దీంతో కట్నం ప్రస్తావన ప్రధానంగా కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూడా పరిణతి చెందారు. ఒకప్పటిలాగ కోడలు తెల్లవారు జామున లేచి ఇంటి పనులు చక్కబెట్టాలని, తాము నిద్రలేచే సరికి కాఫీ కప్పుతో సిద్ధంగా ఉండాలనే చాదస్తాల్లేవు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటి పనుల్లోనే అలసిపోవాలని కోరుకోవడం లేదు. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసిన వెంటనే వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయి పిల్లలతో కలిసి జీవించాలనుకోవడం లేదు. బాధ్యతలు పూర్తయిన తమ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. – కరణం నరసింగరావు లేటెస్ట్ ఫొటోలుండాలి! మ్యారేజ్ బ్యూరోలో మేము ఒక ప్రశ్నావళిని సమగ్రంగా రూపొందించుకున్నాం. అబ్బాయి లేదా అమ్మాయితో స్వయంగా మాట్లాడతాం. సాధ్యమైతే బ్యూరోలోనే లైవ్ ఫొటో షూట్ చేయడం మంచిది. పేరెంట్స్ ఇచ్చే ఫైల్ ఫొటోలు కొన్ని సందర్భాల్లో బాగా పాతవి ఉంటాయి. ఫొటోలు ఉన్నట్లుగా లైవ్‌లో లేనట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా డిజప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మిగిలిన ప్రత్యేకతలేవీ పరిగణనలోకి రావు. – కోటిరెడ్డి -
‘అలాంటి అమ్మాయి అయితే ఓకే’.. పెళ్లిపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉండిపోయారు. అయితే, తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన రాహుల్.. పెళ్లిపై పలు విషయాలు పంచుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇరువురి గుణాలు కలగలిసిన భాగస్వామితో జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్. ఈ క్రమంలో ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని అడగగా ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యం ఇస్తాను(నా ఆలోచనల్లో లేదు). కానీ, నా తల్లి, నాయనమ్మల గుణాలు కలగలిసి ఉంటే మంచిది.’ అని సమాధానమిచ్చారు రాహుల్. ఈ సందర్భంగా మోటర్ సైకిల్, సైకిల్ నడపడానికి తాను ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు రాహుల్. ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే చైనా సంస్థను గుర్తు చేసుకున్నారు. తన ఇంటర్వ్యూను ట్విట్టర్లో షేర్ చేసిన రాహుల్ తనకు కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద ఉన్న సీఆర్-వీ కారు తన తల్లిదని స్పష్టం చేశారు. కార్లు, బైకుల అంటే తనకు ఇష్టం లేదని, కానీ, రైడ్‌కు వెళ్లడమంటే ఇష్టమని చెప్పారు. ఇదీ చూడండి: రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్! -
జీవిత భాగస్వామి విషయంలో అసంతృప్తి ఉండకూడదు..!
మనిషి జీవితంలో తనకున్న వాటిలో ముఖ్యంగా మూడు విషయాల్లో ఎప్పుడూ అసంతృప్తి పొందకూడదని పెద్దలు చెబుతారు. సంతోషస్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే... వాటిలో మొదటిది కళత్రం. అంటే తనకు జీవిత భాగస్వామిగా లభించినవారు. అంటే వివాహం తరువాత తాను తాళికట్టి తెచ్చుకున్న భార్య. ఏడడుగులు వేసి సహధర్మచారిణిగా ఉంటానని భర్తగా అంగీకరించి అతని వెంట నడిచి వచ్చిన స్త్రీ. ధర్మం, అర్థం, కామం... ఈ మూడూ వారికే పరిమితం. పరస్పరం దాటి వెళ్ళడానికి వీలు లేదు. సముద్రుడు చాలా శక్తిమంతుడు. తలచుకుంటే భూమినంతటినీ ముంచెత్తగలడు. అయినా తనకు తాను ఒక నియమం పెట్టుకున్నాడు. నేను చెలియలికట్ట దాటను... అన్నాడు. అందువల్ల కెరటాలు ఒడ్డువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి. అలా కాకుండా ఏ రోజయినా సునామీలాంటివి వచ్చి చెలియలికట్ట దాటితే అది చరిత్రలో భయంకరమైన రోజవుతుంది. అంటే తమలో వచ్చిన భావావేశాన్ని భార్యాభర్తలలో ఏ ఒక్కరయినా నియంత్రించుకోలేకపోతే ... అది చెలియలికట్ట దాటిన పరిస్థితి. అందుకే ఎప్పుడూ వారిరువురూ పరస్పరం పూర్తి సంతృప్తి పొంది ఉండాలి. ఏకారణం చేతనయినా వారిలో ఏ ఒక్కరికయినా అసంతృప్తి పొడసూపిందనుకోండి. అప్పుడెలా ఉండాలి... అంగవైకల్యంతో తమ కడుపున పుట్టిన బిడ్డను తల్లిగా కానీ, తండ్రిగా కానీ ఎంత ఎక్కువ శ్రద్ధతో, అధిక ప్రేమానురాగాలతో, అన్నిటికీ మించి అత్యధిక ఓర్పుతో చూసుకుంటారో భార్యాభర్తలు కూడా తమలో పుట్టిన అసంతృప్తిని దిగమింగి తమ భాగస్వామిని అంత శ్రద్ధగా చూసుకోగలగాలి. బంగారు పాత్రలో పోసుకు తాగినా పాయసమే, కడుక్కుని కుండలో పోసుకు తాగినా పాయసమే. పాత్రలు వేరయినా పాయసం మాత్రం ఒక్కటే. అందుకే జీవిత భాగస్వామిని దాటి ధర్మార్థకామములను పొందే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే అధార్మికమైన కార్యాలపట్ల మనసు లగ్నం అవుతుంది. దానివలన ధర్మం పట్టుకోల్పోతుంది. అశాంతి కలుగుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. కారణం... ఉన్నదానిలో తృప్తి లేదు. కోరుకున్నది అన్నివేళలా అందుబాటులో ఉండదు. పైగా చేయకూడనిది చేస్తున్నానేమో అన్న అపరాధ భావన వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, జీవితాలను పతనం చేస్తుంది. ‘పరస్త్రీసంగ దోషేన బహవో మరణంగతా..’ పరస్త్రీ (పరపురుషుడి) వ్యామోహం ... ఆ భావన, ఆ ఉద్వేగం, ఆ భయం... లోపల ఆ రహస్యాన్ని దాచుకోవడంలో ఉన్న ఉద్విగ్నత... అనారోగ్యానికి, అకాలమరణానికి కూడా దారితీస్తాయి. అందుకే జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తి అన్నమాట దరిచేరనీయవద్దు. భార్యలో భర్తకు కానీ, భర్తలో భార్యకు కానీ బలముంటే సంతోషించాలి, బలహీనతుంటే... భగవంతుడిచ్చిన పిల్లల విషయంలో చూపిన ఓర్పు, సానుభూతి, ప్రేమానురాగాలనే చూపాలి. అంతేతప్ప జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి స్థానం ఇవ్వకూడదు. -
అందుకోసమే లైఫ్ పార్ట్నర్ కావాలంటున్న పాపులర్ సింగర్
Mika Singh Revealed Why He Looking For His Life Partner: బాలీవుడ్ పాపులర్ సింగర్లో ఒకరు మికా సింగ్. అనేక పాటలను తన హుషారైన గాత్రంతో పాడి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన తన జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెట్టనున్నాడు. అది కూడా ఎందుకోసమో వివరించాడు. రాఖీ సావంత్, మల్లికా షెరావత్, రతన్ రాజ్‌పుత్, రాహుల్ మహాజన్ తర్వాతి ఇప్పుడు మికా సింగ్ కోసం స్వయంవరం ఏర్పాటు చేయనుంది ఓ నేషనల్ ఛానెల్. మికా ది వోహ్తి అనే పేరుతో ఒక రియాలిటీ షోను ప్రారంభిస్తోంది స్టార్ భారత్ ఛానెల్. ఇప్పటికే ఈ షోలో పాల్గోనేవారికోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. ఈ స్వయంవరం ఎందుకు అనే విషయాన్ని ఈ షో ప్రోమో ద్వారా తెలియజేశాడు మికా. ఈ ప్రోమోలో 'నేను 2000కుపైగా వివాహాల్లో ప్రదర్శించాను. అలాగే ఎన్నో పాటలు పాడి కెరీర్లో విజయం సాధించాలన్నేదే నా ఉద్దేశం. నా మొదటి పాట మౌజా హి మౌజా పాడినప్పుడు ఇలాగే కొనసాగాలని అనుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్. రెహమాన్, ఇతర ప్రముఖ సంగీత దర్శకుల్లాగా గొప్పవాన్ని కావాలనుకుంటున్నాను. భగవంతుని దయతో నేను ముందుకు సాగుతున్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దలేర్ పాజీ, భాభిజీ కోరారు. నా బంధువుల కోరిక నిమిత్తం నేను నా జీవిత భాగస్వామిని వెతకాలనుకుంటున్నా. వారి కోరికను నేను నెరవేర్చాలని అనుకుంటున్నా. అందుకోసం వారిని కొద్ది సమయం వేచి ఉండమని అభ్యర్థించాను.' అని మికా తెలిపాడు. ఇంకా వివరిస్తూ 'నేను టీవీ ఛానెల్ నుంచి ఈ ఆఫర్ అందుకున్నట్లు మా దలేర్ పాజీకి తెలియజేశాను. అతను సంతోషంతో అవును.. నువ్ ఎందుకు ఇలా ప్రయత్నించకూడదు ? నీకు సరైనా జీవిత భాగస్వామి దొరుకుతుంది.' అని పేర్కొన్నాడు. అలాగే ఈ టీవీ షో డబ్బు కోసం చేయట్లేదని మికా సింగ్ తెలిపాడు. View this post on Instagram A post shared by STAR Bharat (@starbharat) -
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్‌లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్‌ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్‌మాల్‌లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్‌ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్‌లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్‌గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్‌ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్‌ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!!
కాళ్ల వేళ్లను బట్టి, చేతి రేఖలను బట్టి ఎటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. ఒక్కోసారి అంచనాలు బోల్తాకొట్టి, అటుఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐతే తాజాగా ఓ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని చెప్పింది. ‘మిర్రర్’ ఆన్లైన్ సైట్ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’అనే డేటింగ్ సైట్ పురుషులపై నిర్వహించిన సర్వే ప్రకారం మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో వివరించింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తెల్పింది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! ముఖ్యంగా 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం చీటింగ్ చేసే అవకాశం ఉందని, 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం ఉంటుందని ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో అంగీకరించారట కూడా. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ చేతి రేఖలనుబట్టి, కాలి పరిమాణాలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే ఏ కొద్దిమందినో ప్రామాణికంగా తీసుకుని మొత్తం పురుషులు ఇలాగే ఉంటారని సైన్స్ కూడా చెప్పలేదు. ఏమంటారు? చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
ప్రణాళికతోనే ప్రశాంతత
భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా. భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి... అనురాగ్ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్ చేస్తాడు. తన కెరీర్ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్ టైమ్ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి. వైద్యనాథన్ (44) ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం. ఆస్తుల వివరాలు... వైద్య నాథన్ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్ లేదా డిజిటల్ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైద్యనాథన్ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్షిప్ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. వైద్యనాథన్ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు. దాంతో వైద్యనాథన్ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్ మరణించే నాటికి అతని ఈపీఎఫ్ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్డేట్ అయి లేదు. బ్యాలన్స్ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వైద్యనాథన్ రియల్ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్ ఎస్టేట్‌పైనా ఎక్స్పోజర్ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి. -
విభేదాల మధ్య మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉండగలరా?
కాపురంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో మనస్పర్థలూ అంతే సహజం. కాని కొంతమందికి జీవితంలో మనశ్శాంతి కరువవుతుంది. జీవితభాగస్వామి బాధపెడుతుంటే భార్య/భర్త తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురికావలసి వస్తుంది. అర్థం చేసుకోని లైఫ్పార్ట్నర్ దొరికినప్పుడు సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అయితే మీరే అర్థం చేసుకోగలిగినప్పుడు బాధపెట్టే జీవితభాగస్వామితో సర్దుకొని పోవచ్చు. కాని దానికీ పరిధి ఉంటుంది. బాధ పెట్టడం మరీ ఎక్కువైనప్పుడు, మీరు భరించలేని స్థితికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారమయ్యేవరకు మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు దూరంగా ఉండటమే మంచిది. అయితే పరిస్థితి అంతదూరం రానివ్వకుండా మీ జీవితభాగస్వామితో కలిసివుండే ప్రయత్నం చేయచ్చు. బాధపెట్టే మీ జీవితభాగస్వామితో కలిసి ఉండగలరా? మీలో ఆ నైపుణ్యం, ఓర్పు ఉందా? 1. మీ జీవితభాగస్వామి బలహీనతలను అర్థం చేసుకొని, వారిని క్షమించగలరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. ఎవరైనా ప్రతిసారీ తప్పు చేయరని నమ్ముతారు. బాధతో ఉన్నప్పుడు మీ జీవితభాగస్వామితో మీరు గడిపిన సంతోష క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. మిమ్మల్ని బాధలకు గురిచేసిన సంఘటనలను మనసులో ఉంచుకోరు. ప్రతిరోజూ కొంత సమయాన్ని విశ్రాంతిగా గడుపుతారు. ఎ. అవును బి. కాదు 4. ప్రతిమనిషికీ సమస్యలుంటాయనుకుంటారు. జీవించినంత కాలం ఆనందంగా ఉండాలని మనసులో గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. మీలా సమస్యల్లో బాధ పడేవారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, వీలైతే మీ జీవితభాగస్వామికి నచ్చిన విధంగా నడుచుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఎప్పుడూ అధైర్యపడరు. సమస్యలను ఎదుర్కొనేందు ధైర్యం అవసరమనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. లైఫ్పార్ట్నర్ బాధ పెట్టేటప్పుడు మాట్లాడకుండా ఉండరు. వారి సమస్య ఏమిటని ప్రశ్నిస్తారు. మీరెంత బాధ పడుతున్నారో వివరించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. వాదనకు దిగరు. ఎక్కువసేపు వాదోపవాదాలను కొనసాగనివ్వరు. ఆర్గ్యుమెంట్ వల్ల రిలేషన్ మరింత దెబ్బతింటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 10. ఎక్కువ కాలం మీ భాగస్వామిపై కోపాన్ని ప్రదర్శించరు. ఆందోళనతో మీ నిద్ర, ఆరోగ్యం చెడగొట్టుకోరు.(ఇదే సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ ఆనందంగానే ఉంటారని గుర్తించగలరు). ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీ లైఫ్ పార్ట్నర్ ఇబ్బందులకు గురిచేస్తున్నా వారితో సర్దుకుపోవాలనుకుంటారు. మీలో సహనగుణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవితభాగస్వామితో కలిసుండేలా చేస్తుంది. కోపం వచ్చినా మీ పార్ట్నర్ను అర్థం చేసుకుంటారు. ‘బి’ సమాధానాలు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే బాధపెట్టే మీ పార్ట్నర్తో మీరు కలిసివుండలేరు. సర్దుకుపోలేక పోవటం వల్ల అలజడికి గురవుతారు. మీ మధ్య చిన్న చిన్న విషయాల వల్ల విభేదాలు వచ్చినా, మీ జీవితభాగస్వామి కలిగించే ఇబ్బందులు మితిమీరకుండా ఉన్నా వాటిని క్షమించటానికి ట్రై చేయండి. ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. -
రాహుల్‌గాంధీకి పెళ్లి కావాలని!
గోరఖ్‌పూర్: రాహుల్ గాంధీకి జీవితభాగస్వామి రావాలని భగవంతుడిని వేడుకున్నానని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి సోమవారం వ్యాఖ్యానించారు. ఉత్తరభారతంలో తొలి శ్రావణ సోమవారం సందర్భంగా సాధ్వి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అని సాధ్వి వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలుచేయడం ఇలాంటి వ్యక్తులకు ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడే వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
అలాంటి మగాడు కావాలి : రకుల్
సాక్షి, సినిమా: నేను పెళ్లి చేసుకునేవాడు అంతకు మించినోడయి ఉండాలంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఇంతకు ముందు టాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన ఈ బ్యూటీకిప్పుడు అక్కడ జోరు తగ్గింది. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా నటించిన స్పైడర్ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఒక లెవల్‌కు రావాలని ఆశించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఆ చిత్రం గట్టిదెబ్బే కొట్టింది. దీంతో విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం చేజారిపోయింది. అయితే కార్తీతో జత కట్టిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విజయ్ రకుల్‌కు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం కోసం ఎదురుచూస్తోంది. హిందీలో రెండు అవకాశాలను దక్కించుకున్న రకుల్ దక్షిణాదిలోనే మరిన్ని చిత్రాల్లో నటించాలని తనే స్వయంగా అవకాశాల వేట ప్రారంభించిదట. ఇటీవల ఈ బ్యూటీ ఇచ్చిన భేటీలో నేను ఆధ్యాత్మిక బాటలో పయనించడం ప్రారంభించాను. చిన్న తనంలోనే భక్తి పుస్తకాలను ఇష్టంగా చదివేదాన్ని. అవే నా మనసులో ఆధ్యాత్మిక చింతన కలిగించాయి. చాలా మంది నటీమణులు తమ కెరీర్‌కు ప్రణాళికలను రచించుకుంటారు. తనకలాంటివేవీలేవు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వల్ల మంచి విషయాలు వాటంతట అవే అమరుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను నటినికావాలని కోరుకోలేదు. పాకెట్ మనీ కోసమే నటించడానికి వచ్చాను. కెమెరా ముందుకు వచ్చిన తరువాతే నటనను కొనసాగించాను. నిబద్ధతలో జీవిస్తే ప్రణాళికలు లాంటివి అవసరం లేదు. నేను ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండడం వల్ల పరిణితి చెందాను. మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. 10 ఏళ్ల తరువాత తిరిగి చూసుకుంటే ప్రతి చిత్రం గుర్తిండిపోవాలి. సినిమా నిరంతరం కాదు. అభిమానుల ఆదరణ ఉన్నంతవరకూ దిక్కడ కొనసాగగలం. అందుకే విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్‌లో జిమ్‌ను ప్రారంభించాను. ఎలాంటి మగాడు మీకు నచ్చుతాడు అని అడుగుతున్నారని, తన ఎత్తు 5.9 అడుగులని, అంతకు మించిన ఎత్తు కలిగిన వాడై ఉండాలి అని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. -
తండ్రిగా మీరు బెస్టా?
సెల్ఫ్‌చెక్ చిన్న కుటుంబాలు సంఖ్య పెరగడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణమైంది. ఈ క్రమంలో భర్తగా, తండ్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలూ మారాయి. మంచిభర్త ఆటోమేటిగ్గా మంచి తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. 1. మీరు వారానికి 20 గంటలకంటే ఎక్కువ టైమ్ టీవీ చూడడానికి కేటాయిస్తున్నారు. ఎ. కాదు బి. అవును 2. ప్రతిరోజూ పిల్లలతో కనీసం పదిహేను నిమిషాల సమయాన్ని కూడా గడపలేకపోతున్నారు. ఎ. కాదు బి. అవును 3. పిచ్చాపాటిగా కబుర్లు చెబుతూ పిల్లల అభిప్రాయాలను తెలుసుకుంటూ అవసరమైతే వాటిని సరిదిద్దుతారు. ఎ. అవును బి. కాదు 4. మీ దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా లైఫ్ పార్ట్నర్తో గడిపే టైమ్ తగ్గుతోంది. ఎ. కాదు బి. అవును 5. మీ కుటుంబంలో జరిగే ప్రతి పనిలోనూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీ పాత్ర ఉంటుంది. ఎ. అవును బి. కాదు 6. కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బయటకు వెళ్లిన సందర్భాలకు కొదవలేదు. ఎ. అవును బి. కాదు 7. మీకు వృత్తివ్యాపారాలు– కుటుంబ బాధ్యతలకు మధ్య కచ్చితమైన విభజన రేఖ ఉంది. అలాగే మీ అభిరుచి కోసం కొంత పర్సనల్ స్పేస్ మిగుల్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. టైమ్ మేనేజ్మెంట్ పాటిస్తున్నారు కాబట్టి ఎప్పుడూ కంగారు, ఒత్తిడి లాంటివి ఉండవు. మీ రొటీన్లో వ్యాయామం కూడా ఉంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు మంచి భర్తగా, మంచి తండ్రిగా సక్సెస్ అవుతున్నారనుకోవచ్చు, ‘బి’లు ఎక్కువైతే చక్కని ఫ్యామిలీమేన్ కావాలంటే మీరు కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. -
దంపతుల మధ్య షేరింగ్ ఉందా?
సెల్ఫ్ చెక్ పండ్లు... ఆటవస్తువు... పుస్తకాలు... బట్టలు... వీటిని చిన్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు పంచుకోవటం సహజం. తల్లిదండ్రుల ప్రేమను కూడా పిల్లలు పంచుకోవాల్సిందే! కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పిల్లలు పెద్దవారవటం పెళ్లి చేసుకుని భార్య/భర్తగా మారటం సహజం. ఇప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌తో ప్రతి ఒక్కటీ షేర్ చేసుకోవలసి ఉంటుంది. ‘‘మా ఆయన బంగారం, మా శ్రీమతి పంచదార’’ ఇలాంటి డైలాగులను అనిపించుకోవాలంటే మీ భార్య/భర్తతో అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా ఉండాలి. మీ దంపతులు మ్యారీడ్ లైఫ్‌ని ఎలా షేర్ చేసుకుంటున్నారు? ఇచ్చిపుచ్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉంటున్నారా? ఇది తెలుసుకోవటానికి ఒకసారి సెల్ఫ్‌చెక్ చేసుకోండి. 1. మీ దంపతులు మీ అనుభవాలన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకుంటారు. చాలా పర్సనల్ విషయాలు కూడా మినహాయింపు కాదు. ఎ. అవును బి. కాదు 2. ఇప్పుడు పూర్తి చేస్తోన్న క్విజని కూడ ఇద్దరూ కలసి పూర్తి చేస్తారు. ‘ఎ’, ‘బి’ లు టిక్ చేసేటప్పుడు నిజాయితీగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లల్ని పెంచటంలో మీ బాధ్యతల నిర్వహణలో తేడాలు రానివ్వరు. ఎ. అవును బి. కాదు 4. బ్యాంకులో మీ దంపతులకు జాయింట్ ఎకౌంటులు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల్లో మీ మధ్య విభేదాలు రావు. ఎ. అవును బి. కాదు 5. ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్ విషయంలో ఇద్దరూ సంప్రదించుకుని బాధ్యతలు పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లలపై ఇద్దరూ ఒకేరకమైన ప్రేమను చూపుతారు. ఎ. అవును బి. కాదు 7. ఇంటిపనులు మీరు చేయాలంటే, మీరు చేయాలని పంతాలకు పోరు. సమయాన్ని అనుసరించి ఇద్దరూ పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఖాళీ సమయాన్ని ఎవరికి వారుగా గడపకుండా ఇద్దరు కలసి ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 9. మీ అభిరుచులు, వైఖరులు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయని చెప్పగలరు. లేకున్నా ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. మీ భార్య/భర్తను కోపగించుక్ను సందర్భాలు చాలా తక్కువ. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీ దంపతులు అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని కలిగి ఉంటారు. భార్య/భర్త నుంచి ఎంత ఆశిస్తారో అంత ఇవ్వటానికి వెనకాడరు. మీలా మీ లైఫ్పార్ట్నర్ కూడా ఉంటే మీ సంసారం ఆనంద సాగరమే. లైఫ్పార్ట్నర్ నుంచి సహకారం లేకపోతే, వారిని ప్రేమతో జయించటం మీ చేతుల్లోనే ఉంటుంది. ‘బి’లు ఎక్కువ వస్తే జీవితభాగస్వామితో అరమరికలు లేకుండా ఉండడం మీకు చేతకావట్లేదనే అర్థం. కష్టసుఖాలను పంచుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు మీరున్న దానికి భిన్నంగా ప్రయత్నించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది. -
లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలనుకుంటున్నారు?
సెల్ఫ్‌చెక్ ‘‘శీనుగాడికి వయసైపోతోందండీ త్వరగా పెళ్లి చేయాలి... గీత చదువు ఈ ఏడాదితో అయిపోతుంది కదా! అమ్మడు పెళ్లి విషయం ఆలోచించాలోయ్’’... ఇలా తల్లిదండ్రులు ఎదిగిన పిల్లల పెళిళ్ల గురించి ఆలోచించటం సహజం. పెద్దల సంగతి ఎలా ఉన్నా కాబోయే జీవితభాగస్వామి ఇలా ఉండాలని, సినిమాల్లో హీరో, హీరోయిన్లు పాటలు పాడుతుంటారు. కొందరు పైపై మెరుగులకో, ఫ్యాషన్కో ఇంపార్టెన్స్ ఇస్తే మరికొందరు జీవితాన్ని వాస్తవంగా చూస్తారు. మ్యారీడ్ లైఫ్‌ను లోతుగా గమనిస్తారు. మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? బాధ్యతాయుతంగా ఉండేవారిని ఇష్టపడుతున్నారా? లేక ఊహలకే ప్రాధాన్యం ఇచ్చేవారిని కోరుకుంటున్నారా? ►మీకు కాబోయే భార్య/భర్తకు మంచి మనసు ఉండాలని కేరింగ్ ఆటిట్యూడ్ ఉండాలనుకుంటారు. అందం మీ దృష్టిలో రెండోదిగా ఉంటుంది. ►ఎ. అవును బి. కాదు ►వాస్తవ కథాంశంతో (రియాలిటీ బేస్డ్ డ్రామా) ఉన్న సినిమాలను ఇష్టపడతారు. ►ఎ. అవును బి. కాదు ►భాగస్వామి ఇచ్చే బహుమతులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. వారిని అర్థం చేసుకోవటానికే చొరవ చూపిస్తారు. ►ఎ. అవును బి. కాదు ►మీ లైఫ్ పార్ట్నర్కే ప్రాముఖ్యాన్నిస్తారు. ఇతర స్త్రీ/పురుషులతో చనువుగా ఉండాలనుకోరు. మీ హద్దులను దాటే ప్రయత్నం ఎప్పటికీ చేయరు. ►ఎ. అవును బి. కాదు ►ఎవరో ఎక్కడో మీకోసం పుట్టే ఉంటారనే భావనతో మీరు ఏకీభవించరు. ►ఎ. అవును బి. కాదు ►కాబోయే జీవితభాగస్వామిని పూర్తిగా నమ్ముతారు. వారి గతం గురించి ఆరా తీయరు, అనుమానించరు. ►ఎ. అవును బి. కాదు ►మీ గురించి మీ భార్య/భర్త ఎప్పుడూ ఉన్నతంగా మాట్లాడాలను కోరు, వారి అభిప్రాయలకే చోటిస్తారు. ►ఎ. అవును బి. కాదు ►లైఫ్పార్ట్నర్ ప్రాక్టికల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. ►ఎ. అవును బి. కాదు ►భార్యాభర్తలు కాకముందే ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందనుకుంటారు. ►ఎ. అవును బి. కాదు ► లైఫ్పార్ట్నర్ నుంచి చిన్న ఇబ్బందులొచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం మీలో ఉంటుంది. ►ఎ. అవును బి. కాదు ‘బి’ లు ఏడు వస్తే మీరు జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. లైఫ్పార్ట్నర్ విషయంలో కూడా మీ ఆటిట్యూడ్ అలానే ఉంటుంది. క్రమశిక్షణ మీకు చాలా తక్కువగా ఉంటుంది. లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ మీద కూడ మీకు నమ్మకం ఉండచ్చు. వాస్తవికతకు చాలా దూరంగా ఉంటారు. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు ఉన్నతమైన జీవితభాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు. పూర్తి పాజిటివ్ లక్షణాలున్న లైఫ్పార్ట్నర్ కావాలనుకుంటారు. అదేవిధంగా మీరూ ప్రవర్తించగలరు. జీవితభాగస్వామిలో రియాలిటీనే ఇష్టపడతారు. -
’నావాడు హాట్‌గా కాదు.. నైస్‌గా ఉండాలి’
ముంబయి: తనకు కాబోయే వాడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదని, మనసులు దోచుకునేవాడు కావాల్సినవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పింది. అయితే, అతడు మంచి లక్షణాలు కలిగి ఉండాలని, మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది. ’నా జీవితంలో భాగస్వామి వచ్చినప్పుడు అతడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదు.. అతడు హాట్ గా ఉన్నాడా లేదా అని కాదు.. మంచి మనసున్న వాడైతే చాలు. చాలా ఫన్నీగా ఉండాలి. బాధ్యతతో ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి’ అని చెప్పింది. ఈ ఏడాది ఆమె నటించిన ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ చిత్రాలకు అవార్డులు వస్తాయా అని ప్రశ్నించగా ఇంకా ఏడాది పూర్తవలేదుగా.. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అవార్డులు రివార్డులు ప్రేక్షకుల నుంచి కోరుకుంటాను. వారు డియర్ జిందగీ సినిమాకు వచ్చి ఆ చిత్రాన్ని ఇష్టపడతారని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. -
అలాంటి వ్యక్తినే పెళ్లాడతా!
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతుంటారు. అందుకే, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలని అంటారు. కాబోయే భర్త గురించి ప్రతి అమ్మాయికీ, కట్టుకునే భార్య గురించి ప్రతి అబ్బాయికీ కొన్ని కలలు ఉంటాయి. ‘ఇలాంటి వ్యక్తిని పెళ్లాడితే మిగతా జీవితం బాగుంటుంది’ అని ఆ వ్యక్తి ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో కూడా ఊహించుకుంటారు. ఓ సందర్భంలో పెళ్లి గురించి శ్రుతీహాసన్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘రైట్ టైమ్ వచ్చినప్పుడు నా పెళ్లవుతుంది’ అన్నారు. మీక్కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? నటుణ్ణి పెళ్లాడతారా? సోర్ట్స్ మ్యాన్ అయితే బాగుంటుందనుకుంటున్నారా? మ్యూజిక్ ఫీల్డ్ అయితే బెస్ట్ అనే ఫీలింగ్ ఉందా? లేక నైన్ టూ సిక్స్ జాబ్ చేసే అబ్బాయి చాలనుకుంటు న్నారా? అనే ఆప్షన్స్‌ని శ్రుతీహాసన్ ముందుంచితే - ‘‘ర్యాన్ గోస్లింగ్ (కెనడియన్ నటుడు, సంగీత దర్శకుడు)లా హాట్‌గా కనిపించే న్యూక్లియర్ ఫిజిస్ట్ని పెళ్లాడాలని ఉంది. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి చెప్పాలంటే.. సంగీతదర్శకుణ్ణి లేకపోతే నటుణ్ణి పెళ్లాడతా. మంచి రచయితతో పెళ్లి కుదిరినా హ్యాపీయే’’ అన్నారు. మరి.. శ్రుతీహాసన్ కోరుకున్నట్లే జరుగు తుందా? లేక ఆమె కోరుకున్నదానికి వ్యతిరేకంగా వేరే రంగానికి చెందిన వ్యక్తితోనే ఆమె వివాహ బంధం ముడిపడుతుందా? అనేది కాలమే చెప్పాలి. -
లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: బ్రౌన్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. కొత్తభాగస్వామితో మీ వ్యాపారం లాభాలబాటలో నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పొదుపుకి ఇది తగిన సమయం. అయితే పెట్టుబడుల విషయంలో కాదు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాటలకీ, చేతలకీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) చెడు సంఘటనలేమీ జరగవు. అనవసరంగా భయపడకండి. మీ ఉద్యోగంలో, కెరీర్లో అనుకూలమైన మార్పు ఉండవచ్చు. అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కొత్త అవకాశం ఒకటి మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఆఫీసులో కొత్త పని ఏమైనా అప్పగిస్తే మీకు రానున్న ప్రమోషన్‌కు అదో సూచనగా గ్రహించండి. మీరు ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: ఎల్లో క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, విజయం మీ వెంటే ఉందని గ్రహించండి. అత్యాధునికమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. గతంలో మీరెప్పుడూ చూడని కొత్తప్రదేశాలకు విహార యాత్రకు వెళతారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటును, దుడుకుతనాన్ని ప్రదర్శించకండి. కలిసొచ్చే రంగు: సిల్వర్ లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రేమకు ఇది చాలా అనుకూలమైన వారం. చంద్రుని మూలంగా మీ ప్రేమ ఫలిస్తుంది. ఆరోగ్యపరంగా ఏమాత్రం తేడాగా అనిపించినా, అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మీ పని ప్రదేశంలో డబ్బు విషయంలో కొందరు మీ మీద అసూయగా ఉన్నారు, వారి వల్ల మీకు ముప్పు ఏర్పడవచ్చు. జాగ్రత్తపడండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన శైలిలో పని చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు; మిమ్మల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజం. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరువ చేసి, మీకు విజయాన్ని చేకూర్చి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే అన్నింటికన్నా కెరీరే ప్రధానమని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రస్ట్ కలర్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఇల్లు లేదా ఉద్యోగం మారవచ్చు. పనుల విషయంలో చురుగ్గా, సమస్యల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. అనేక రకాల ప్రతికూలతలను ఈవారం అధిగమిస్తారు. విజయానికి చేరువ అవుతారు. మీ సన్నిహితుడొకరు డబ్బు విషయంలో మీ వైఖరికి చాలా విసుగు చెందవచ్చు కనక హుందాగా వ్యవహరించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీరు ఎదురు చూస్తున్న ఆరోగ్యం, ఆనందం, డబ్బు... ఈ మూడూ తాంబూలంలో పెట్టి ఎవరో ఇచ్చినట్లుగా మీకు అందుతాయి. ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలే కావచ్చు. మీ నిబద్ధతే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని గ్రహించండి. కొంతదూరంలో ఉన్న సన్నిహిత బంధువును కలుస్తారు. కలిసొచ్చే రంగు: ఎల్లో అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీ కలలు నెరవేర్చుకోవడానికీ, విదేశీ యానం చేయాలన్న మీ కోరిక తీరడానికీ తగిన సమయమిది. ఆధ్యాత్మికంగా ఇది మీలో మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం లేదా మీ పెట్టుబడులకు కొంత విరామం ఇచ్చి ఆ పెట్టుబడి అనేది నిజంగా అవసరమో కాదో, అనేది తేల్చుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) రకరకాల ఆలోచనలతో మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అనేకమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిలో సరైనదేదో ఎంపిక చేసుకోవడమే మీ ముందున్న ప్రధాన కర్తవ్యం. ప్రేమ విషయంలో అపార్థాలు తలెత్తుతాయి. ఫెంగ్‌షుయ్ పరికరాలతో ఇంటిని అలంకరించి, ఆనందాన్ని పొందండి. కలిసొచ్చే రంగు: వైట్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అప్రయత్నంగానే పనులు నెరవేరతాయి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోవడం మంచిది. వీలయినంతవరకూ కొత్త వస్తువాహనాలని కొనుగోలు చేయడం సరికాదు. శనిదోషం ఉన్న కారణంగా పరిచితులతో కూడా ఆర్థికమైన లావాదేవీలూ మరింత చనువుగా ఉండటాలూ క్షేమకరం కాదు. దూరపు ప్రయాణాలని మరీ అవసరమైతేనే చేయండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు వస్తుంది. ఆ కారణంగా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవాళ్లు ఎక్కువ అవుతారు కాబట్టి అందరితోనూ కలివిడిగానే ప్రవర్తించండి తప్ప, అహంకరించడం, కొందరిని దూరం చేసుకోవడం, అహంకరించడం మంచిది కాదు. మీ పై అధికారితో ఉన్న దగ్గరితనం లేదా పలుకుబడినీ గురించి మీకు మీరుగా చాటింపు వేసుకోవద్దు. జెమిని (మే 21-జూన్ 21) నిర్మాణరంగంలో ఉన్న వారికి తగిన రాబడులు వస్తాయి. వినోద పర్యాటక రంగాల్లో ఉన్నవారికి నష్టాలుండవు. కుటుంబంలో ఐకమత్యం ఉన్న కారణంగా మీకు కొత్త శక్తి వచ్చినట్లుంటుంది. ఆస్తి కొనుగోళ్ల విషయంలో అనుభవజ్ఞులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని వెంటనే తీసుకోండి. అత్తమామలతో ప్రేమగా ఉండండి. అలాగని తలిదండ్రులని తక్కువ చేయకండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఏదైనా జరగరానిది జరుగుతుందేమోననే ఆందోళన పూర్తిగా తగ్గిపోతుంది. మీరు నడుస్తున్న ధర్మమార్గం మిమ్మల్ని పూర్తిగా రక్షించే మాట నిశ్చయం. మీవైపు మాట్లాడేందుకు మరికొందరు ఉన్నారనే ఆనందం మీకు కొండంత ధైర్యాన్ని కలుగజేస్తుంది. కోర్టు తీర్పు వాయిదాలు పడుతూ కొంత నిరుత్సాహాన్ని కలుగజేస్తుంది. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. లియో (జూలై 24-ఆగస్టు 23) అప్పులను మెల్లమెల్లగా తీర్చివేస్తూ ఒడ్డుకి చేరుతున్నందుకు సంతోషంగా ఉంటారు. మీ శ్రేయోభిలాషులు మీ పక్షాన నిలబడి మీకు అవసరమైన సందర్భంలో అక్కరకు వస్తారు. రుణాన్ని చేయవలసి వచ్చినప్పుడు మొహమాటం లేకుండా తీసుకోబోయే రుణానికి సంబంధించిన అన్ని వివరాలనీ లిఖితపూర్వకంగా తీసుకోండి. లేనిపక్షంలో మీకు తీవ్ర కష్టాన్ని కలిగించవచ్చు. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరగక వాయిదా పడవచ్చు. ముఖ్యంగా న్యాయ- వైద్యరంగాల్లోని వారికి చేతికందాల్సిన సొమ్ము మరింత ఆలస్యం కావచ్చు. అనుకోకుండా విదేశీ ప్రయాణం లేదా వ్యాపారాల్లో వృద్ధికోసం స్వదేశంలోనే మరో ప్రదేశానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొహమాటమనేది అన్ని సందర్భాల్లోనూ సరికాదనే ఓ జీవితపాఠాన్ని నేర్చుకుంటారు. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ప్రయాణాల్లో వాహనాల విషయంలోనూ, బంగారు, వెండి వస్తువుల విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూలత అంతంతమాత్రంగా ఉండటం వల్ల మానసిక అశాంతి కలిగే అవకాశముంది. మీ వ్యాపారంలో ఏదైనా అధర్మ మార్గాలు ఉన్నట్లయితే అవి బహిరంగపడే అవకాశాలున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీ వృత్తివ్యాపారాలని గురించి అప్రమత్తత అవసరం. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) న్యాయస్థానంలో మీరు విజేత అవుతారు. కోర్టుకేసుల్లో జయాపజయాలతో మానసికంగా వైకల్యాన్ని పొందద్దు. కాలం కలిసిరాని పక్షంలో వచ్చే సమస్యలు ఇవే. కలిసొచ్చిన కాలంలో మీకు కలిగిన విజయాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దైవధ్యానమే ప్రశాంతతనిస్తుంది తప్ప వ్యాపార ప్రకటనలకి లోనై వేటి వెంటనో పడకండి. డబ్బు వృథా చేసుకోకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) జీవితమంటే ఉద్యోగ నిర్వహణకే అని అనుకోకండి. పై అధికారులు ఒత్తిడి చేస్తుంటే మృదువుగా వివరించి చెప్పి చేయలేననే యథార్థాన్ని చెప్పండి. వారి అంగీకారం ఉంటుంది మీకు. వీలయినంతవరకూ - కాదు- తప్పక నిదానంగానే న డవాలి తప్ప ఈ కాలంలో దూకుడుతనం ఏ మాత్రమూ సరికాదు. ఇతరులతో చాడీలు చెప్పడం- వినడం మంచిది కాదని గ్రహించండి . క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కుటుంబసభ్యులతో, తోటివారితో వాగ్వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. బలమైన వాదాన్ని వినిపించాల్సి వస్తే మాత్రం వెనుకాడవద్దు. ఎవరితో విరోధమో వారితోనే నేరుగా మాట్లాడడం మంచిది తప్ప, మీ అభిప్రాయాన్ని మధ్యవర్తి ద్వారా విన్పించడం మంచిది కానే కాదు ఈ కాలంలో. కుటుంబ సభ్యులతో విరోధాల విషయంలో పట్టుదలలకి వెళ్లడం సరికాదు. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) పలుకుబడి గల ఒక వ్యక్తి తారసపడవచ్చు. మీ ఉద్యోగం స్థిరపడటం, సంతానానికి సంబంధించిన పనుల్లో పురోగతి కనిపించడం వంటి సూచనలు కలగవచ్చు. దానధర్మాలు, తీర్థయాత్రలూ చేసే అవకాశముంది. మీరు పెట్టబోయే నూతన వ్యాపారానికి గానీ మరేదైనా నూతన కార్యక్రమానికి గానీ తాత్కాలికంగా వ్యతిరేకత ఎదురయినా తొందరలో అనుకూలత సిద్ధిస్తుంది. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారం విద్య... మీకు అంత ఆనందంగా అన్పించకపోవచ్చు. అయితే మరోచోట ఉద్యోగ, వృత్తి వ్యాపార విద్యలకి తగిన అవకాశాన్ని చూసుకుని ముందడుగు వేయడం మంచిది. అనాలోచితంగా, తాత్కాలిక ఆవేశంతో చేస్తున్న పనిని విరమించడం వల్ల తీవ్ర ఇబ్బంది కలగవచ్చు. అయిన వాళ్లే మీపట్ల వ్యతిరేకతని పరోక్షంగా చూపిస్తూ ఉండచ్చు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
లైఫ్ పార్టనర్‌ను పరిచయం చేసిన మనోజ్
-
విమెన్స్ రోజు వేడుకలు
సాక్షి ఫ్యామిలీ అందిస్తోంది మార్చి 8 మహిళ పురస్కారాలు మీ ఎంట్రీలు పంపడానికి గడువు తేదీ జనవరి 31 4 కేటగిరీలలో 8 అవార్డులు అమ్మ అమృతమూర్తి ప్రతి అమ్మ బెస్ట్ మదరే. అయితే మీకు తెలిసిన బెస్ట్ మదర్ ఎవరో మాకు రాసి పంపండి. మీ సొంత మదర్ అయినా పర్వాలేదు. కానీ ఎందుకు బెస్ట్ మదరో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. అర్ధాంగి జీవన సహచరి మీ జీవిత భాగస్వామిని మీరు మీ బెస్ట్ బెటర్ హాఫ్ అనుకుంటున్నారా? అయితే ఆవిడ ఎందుకు అంత బెస్ట్ అయ్యారో కనీసం ఐదు కారణాలైనా రాసి పంపాలి. యువతి శక్తి స్వరూపిణి మీ కాలేజీలోనైనా, మీ చుట్టు పక్కలైనా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యువతి ఉన్నారా? ఉంటే ఆ యువతి ఎవరో, ఆ సాహసం ఏమిటో మాకు రాసి పంపండి. మహిళారైతు భూదేవి మీ ప్రాంతంలో ఆదర్శప్రాయురాలైన మహిళా రైతు ఉన్నారా? ఆమె గురించి రాస్తూ, ఎందుకు ఆదర్శమయ్యారో రాసి పంపండి. సూచనలు: ఈ నాలుగు కేటగిరీలలో మీరు దేనిలోనైనా పాల్గొనవచ్చు. (2వ కేటగిరీలో భర్త మాత్రమే పాల్గొనాలి. రుజువుగా భార్యాభర్తలు కలిసి దిగిన ఫొటోను పంపించాలి. నిర్థారణ కోసం దంపతుల ఇద్దరి ఫోన్ నెంబర్లను ఇవ్వాలి.) గడువులోపు వచ్చిన ఎంట్రీలన్నిటినీ పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత పొందిన వాటిలో కేటగిరీకి 8 చొప్పున ఎంపిక చేసి, మొదట వాటిని ఫ్యామిలీలో ప్రచురిస్తాం. ఆ 8 మందిలో ఇద్దరిని ప్రత్యేక జ్యూరీ ద్వారా అవార్డుకు ఎంపిక చేస్తాం. అలా నాలుగు కేటగిరీలలో ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటిస్తాం. వారిని మార్చి 8న హైదరాబాదులో సాక్షి సన్మానిస్తుంది. అవార్డులను బహుకరిస్తుంది. ఎవరి గురించి రాస్తున్నారో వారి ఫొటో తప్పనిసరిగా పంపాలి. ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, ‘ఫ్యామిలీ’, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500 034. e-mail: march8family@gmail.com -
కొత్త సంవత్సరం... కొత్తగా..!
వాయనం న్యూ ఇయర్ కే కాదు... జీవితంలోకి కొంత గుడ్నెస్కు కూడా వెల్కమ్ చెప్పాల్సిన సమయం ఇది. కొన్ని తీర్మానాలు చేసుకొని అలవాట్లలోనూ, దృక్పథంలోనూ కొంత మార్పు తీసుకురావడం ద్వారా జీవితాన్ని కొత్త రకంగా ఆస్వాదించవచ్చు. మరి నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్న సందర్భంగా జంటగా ఆహ్వానించదగ్గ రెజల్యూషన్స్ ఇవి.. అభినందనతో ఆప్యాయత కురిపించండి... సహాయం చేస్తే కృత జ్ఞత, పదాలతోనే ఒక అభినందన... భార్యాభర్తల మధ్య ఇవి అవసరమా? అనొచ్చు. అయితే జీవిత భాగస్వామికి మానసిక ఆనందాన్ని అందించడంలో కృతజ్ఞత తెలపడం, పదాలతో ప్రేమను వ్యక్తీకరించడం అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి అంటారు రిలేషన్షిప్ అండ్ మ్యారిటల్ కౌన్సిలర్లు. ఈ అలవాటు చాలా జంటల్లో ఉండదని కూడా వారు చెబుతున్నారు. వారిలో మీరూ ఒకరైతే అభినందనతో అప్యాయతను కురిపించడం మొదలు పెట్టండి. జంటగా బయటకు వెళ్లండి! భార్యాభర్తలిద్దరూ కలసి చివరి సారి సినిమాకు వెళ్లింది ఎప్పుడు? ఈ మధ్యలో ఇద్దరూ కలసి చిన్న ట్రిప్ ఎక్కడికైనా వెళ్లారా? ఇలాంటి లోటు ఏమైనా ఉంటే దాన్ని భర్తీ చేస్తూ బయటకు వెళ్లడం అనే అలవాటును చేసుకోవాల్సిన సమయం ఇదే. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా బిజీగా మారిపోయిన జీవితంలో కొంత రిలీఫ్ తీసుకోండి. దంపతులు ఇద్దరూ కలసి ఇన్ని రోజులకొకసారి అన్నట్టుగా క్యాండిల్‌లైట్ డిన్నర్‌కో, సినిమాకో.. లేక ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా టూర్‌కో వెళ్లే ప్లాన్ చేసుకోండి. ఇవి బంధాన్ని బలోపేతం చేయడమే గాక లైఫ్‌లో కొత్త జోష్‌ను ఇస్తాయనడంలో సందేహం లేదు. మీతో పాటు వాళ్లనూ హ్యాపీగా ఉంచండి... పరిధిని పెంచుకోండి. నలుగురి బాగు కోసం మీ శక్తిని ఉపయోగించండి. అనాథాశ్రమాల వరకూ వె ళ్లండి. అక్కడి పిల్లలను సరదాగా పలకరించి రావడంతో పాటు, విద్య విషయంలో వారికి మెంటర్స్గా కూడా వ్యవహరించవచ్చు. ఓల్డేజి హోమ్స్‌లోని వృద్ధులను పలకరించి రండి. తద్వారా జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. మనుషుల నుంచి ప్రేమాఆప్యాయతలు ఆశించే వారి సాంగత్యం జీవితంపై కొత్త ప్రభావాన్ని చూపగలదు. భవిష్యత్తు కోసం ఆదాను ప్రారంభించండి... దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రేమాప్యాయతలే కాదు... డబ్బు కూడా అవసరమే. అలాంటి ఇంధనం విషయంలో కూడా కొత్త దృక్పథాన్ని అలవరచుకోండి. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ‘ఆదా’ ఆలోచనను ఇప్పుడే అమలు పెట్టండి. దుబారా నిరోధించి పొదుపు ఖాతాను ప్రారంభించండి. ప్లాన్ చేసుకొని పొదుపు మొదలుపెడుతూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పడం కన్నా గొప్ప స్టార్ట్ ఇంకేముంటుంది! ⇒ భాగస్వామి ఉద్యోగ, వ్యక్తిగత బాధ్యతలకు సమాధాన పడటంలో చొరవ చూపండి. ⇒ అడగాలనుకొని ఆగిపోయిన మాటలను అడిగేయడం మొదలుపెట్టండి. చెప్పాలనుకొన్నది సూటిగా చెప్పడం అలవాటు చేసుకోండి. మనసులోని అపోహలను తగ్గించుకోవడానికి ఇంతకన్నా మార్గం ఉండదు కదా! ⇒ భాగస్వామిని యథాతథంగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. తను మారాలి... అనే భావనను వదిలి న్యూ ఇయర్ నుంచి తనకు అనుగుణంగా నడచుకోండి. ⇒ ఎలాంటి సమస్య విషయంలోనైనా ఇంతకు మించిన పరిష్కారం లేదు కదా. ⇒ ఇలాంటివే కాకుండా... వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులనుబట్టి దాంపత్యం ఆనందమయం అయ్యేందుకు తగిన కొత్త ఆలోచన చేయండి. రానున్న మూడు రోజుల్లో ఆలోచించి జనవరి ఒకటో తేదీ నుంచి దాన్ని అమల్లో పెట్టేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్! -
పెళ్లికి తొందరెందుకంటున్న యువత
కామారెడ్డి: గతంలో పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకునేవారు. వారు నిర్ణయించిన సమయంలో వివాహం జరిగేది. అయితే మారిన పరిస్థితుల్లో యువతలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి సంపాదన లేకుండా వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబా న్ని పోషించలేమని, ఇదే సమయంలో కన్నవారికి భారం కాకూడదన్న భావనతో చాలా మంది పెళ్లికి తొందరపడ డం లేదు. ఎంతో కొంత సంపాదించినపుడే సొంత జీవితాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. బాల్య వివాహాలను నివారించేందుకుగాను ప్రభుత్వాలు వివాహ వయస్సును పురుషులకు21సంవత్సరాలు, స్త్రీలకు 18సంవత్సరాలుగా నిర్ణయించాయి. నిరక్షరాస్యత ఉన్న కుటుంబాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చదువుకున్న కుటుం బాల్లో మాత్రం చాలా వరకు బాల్యవివాహాలు జరుగడం లేదు. పిల్లల పె ళ్లిళ్లతో బాధ్యతలు తీర్చుకుందామని తల్లిదండ్రులు భావిస్తున్నా, తాము జీవితంలో స్థిరపడనిదే వివాహం చే సుకోమంటూ పిల్లలు స్పష్టం చేస్తున్నా రు. దీంతో చాలా మంది 25 యేళ్లు దాటిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఉద్యోగం తరువాతే.. చదువుకున్న యువకులు ఉద్యోగం వచ్చిన తరువాతనే వివాహం చేసుకోవాలనే భావన పెంచుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడానికి బీఈడీ, డీఈడీ చదివిన వారు డీఎస్సీల కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని, తరువాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఉద్యోగం తరువాతనే సిగ్నల్స్ పంపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల మాటను కాదనలేకపోతున్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నా సరే స్థిరపడ్డ తరువాతనే వివాహం అంటుండడంతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. చదువును మధ్యలో వదిలేసి, వివిధ వృత్తులు, వ్యాపారాలవైపు చూస్తున్నవారు సైతం స్థిరపడ్డ తరువాతనే పెళ్లంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోనైతే ఇటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమ్మాయిలైతే.. చదువుకున్న అమ్మాయిలైతే ఉద్యోగాలు వచ్చినా కొంతకాలం ఆగుతామనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ చదువులకు లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు, పెళ్లి కట్నాలు, ఇతర ఖర్చులకు కూడా అప్పులు చేస్తున్నారని, ఉద్యోగం రాగానే వివాహం చేసుకుంటే కన్నవారికి ఏమీ చేయలేమన్న భావన వారిలో ఉంది. కూతురి వివాహం చేసి తమ బాధ్యత తీర్చుకుందామనే తల్లిదండ్రులకు, కొంతకాలం తరువాత చేసుకుంటామంటూ వారిని సముదాయిస్తున్నారు. తమ ఉద్యోగ వేతనం తల్లిదండ్రులు ఎంతో కొంత అనుభవించాలని కూతుళ్లు కోరుకుంటున్నారు. -
అతడి కోసం ఆమె
హృదయం: ‘పాశ్చాత్యులకు ఎమోషన్స్ ఉండవు’, ‘వివాహ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వరు’, ‘జీవిత భాగస్వామి కోసం త్యాగాలు చెయ్యరు’, ‘ఎవరి జీవితాలు వాళ్లవి’... ఇలాంటి అభిప్రాయాలు చాలానే ఉంటాయి మనకు. ఈ అభిప్రాయాలు నిజమే అవడానికి ఉదాహరణలు కూడా బోలెడు కనిపిస్తాయి. కానీ బ్రిటన్‌కు చెందిన జాన్ - నికోలాల కథ తెలుసుకున్నాక, మన అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సిందే. తొలి చూపులోనే ప్రేమ గురించి వింటుంటాం. కంటుంటాం! కానీ జాన్ - నికోలాలది తొలిచూపు ప్రేమ కాదు, తొలిచూపు పెళ్లి. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, తనే నా జీవిత భాగస్వామి అన్న అభిప్రాయానికి వచ్చేశారు. ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడమే కాదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ పరస్పర అంగీకారంతో నిర్ణయం కూడా తీసేసుకున్నారు. కొన్ని రోజులకే వాళ్లిద్దరి పెళ్లయిపోయింది. వెంటనే హనీమూన్‌కు వెళ్లిపోయారు. రెండు వారాలపాటు ప్రపంచాన్ని మరిచిపోయారు జాన్, నికోలా. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జీవిత కాలానికి సరిపడా అనుభూతులతో ఇంటికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత దైనందిన జీవితం మొదలైంది. ఇంట్లోనూ రోజూ హనీమూన్లాగే గడిచింది. ఓవైపు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూనే ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగించారు. కానీ, ఆ సంతోషానికి రెండు వారాల్లోనే తెరపడింది. ఓ రోజు జాన్ రక్తపు వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. షాక్ తిన్న నికోలా అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు. జాన్‌కు ట్యూమర్ ఉందని. అది ముదిరి క్యాన్సర్‌గా మారిందన్నాడు. ఇద్దరూ నిలువునా కూలిపోయారు. కొన్ని రోజులు గడిచాక, జాన్ ఎక్కువ కాలం బతకడన్న చేదు నిజాన్ని కూడా చెప్పారు వైద్యులు. అయినా చికిత్స మొదలుపెట్టారు. జాన్, నికోలాలకు ఆసుపత్రే ఇల్లయింది. జాన్ మృత్యు పోరాటం మొదలైంది. జాన్‌కు కూడా తన పరిస్థితి అర్థమైంది. చికిత్స సాగుతుండగా నికోలాను పిలిచి, తన జీవిత కాల కోరిక గురించి చెప్పాడు. తండ్రి కావడమే ఆ కోరిక. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నికోలాకు. అయినా దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. నిజానికి జాన్ పరిస్థితి చూస్తే, ఏ అమ్మాయీ తల్లి కావడం గురించి ఆలోచించదు. కానీ నికోలా జాన్ కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఎవరెంత వారించినా, వినకుండా తాను తల్లి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. వైద్యులకు విషయం చెబితే, జాన్‌కు కీమోథెరపీ చేశాక పిల్లలు పుట్టే అవకాశం తక్కువని భావించి, అతడి వీర్య కణాలు తీసుకున్నారు. వాటితో నికోలాను తల్లిని చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అది విజయవంతమైంది. ఆమె గర్భం దాల్చింది. స్కానింగ్ చేస్తే కడుపులో ఉన్నది కవలలని కూడా తేలింది. అయితే ఇంత సంతోషకరమైన వార్త తెలిసేసరికే జాన్ మృత్యువుకు మరింత చేరువైపోయాడు. కదల్లేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. అయినా భార్య ఆ సంగతి చెప్పగానే, చిన్న మూలుగు ద్వారా తన సంతోషాన్ని వెల్లడించాడు. అయితే ఆ వార్త వినడం కోసమే అన్ని రోజులు ఆగాడో ఏమో... అది తెలిసిన రెండో రోజుకే జాన్ ప్రాణాలు వదిలాడు. ప్రాణంలా ప్రేమించిన భర్త దూరమైనా, అతడి ఆఖరు కోరిక తీర్చడం కోసం గుండె దిటవు చేసుకుంది నికోలా. అతడి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తూ కడుపులోని చిన్నారుల్ని క్షేమంగా బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఐదు నెలలు గడిచాయి. అప్పుడామెకు ఆరో నెల. అంతా సవ్యంగా సాగిపోతుండగా, నికోలాకు వినికిడి సమస్య మొదలైంది. విపరీతమైన తలపోటు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే, మళ్లీ ఓ పిడుగులాంటి వార్త. ఆమెకు కూడా ట్యూమర్ ఉందన్నారు వైద్యులు. తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది నికోలా. అప్పటికే ఎంతో పోరాడిన తాను, ఇక పోరాటం చేయలేననుకుంది. కడుపులోని బిడ్డల్ని, జాన్‌ను తలుచుకుని కొన్ని రోజులపాటు ఏడ్చింది. దేవుణ్ని నిందించింది. కానీ చివరికి భర్త ఆఖరు కోరికను గుర్తుచేసుకుంది. కడుపును తడిమి చూసుకుంది. వాళ్లకోసమైనా బతకాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు అండగా నిలిచారు. అందరి సహకారంతో ట్యూమర్‌పై పోరాటం సాగించింది. ఆ పోరాటం సాగుతుండగానే, ఆమె ఇద్దరు పండంటి మగ కవలల్ని ప్రసవించింది. ఇప్పుడామెకు ప్రాణాపాయం తప్పింది. కానీ ట్యూమర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. పిల్లల్ని చూసుకున్నాక, ఆమెకు జీవితంపై మరింత ఆశ కలిగింది. జాన్ ఆలోచనలు తెలిసిన నికోలా... అతడి ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా జీవన పోరాటం సాగిస్తోంది. అంతేకాదు.. ట్యూమర్, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు ఓ ట్రస్టు ఆరంభించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తోంది. జాన్ తన ఆఖరు కోరిక గురించి చెప్పకపోయి ఉంటే... ఈపాటికి తాను కూడా మృత్యు ఒడికి చేరేదాన్నని, జాన్ కోసం, పిల్లల కోసం పోరాడటం వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని అంటుంది నికోలా. -
షవర్...బ్యాచిలర్ పార్టీ లాగే
గంటకోసారి ఫోన్ కబుర్లు, నిమిషానికోసారి టెక్స్ట్ మెసేజ్‌లు, రోజుకోసారి ఎఫ్బీ అప్డేట్లూ... ఇలా అనుక్షణం మనతోనే మన కోసమే అన్నట్టున్న మన క్లోజ్ ఫ్రెండ్ మరికొన్ని క్షణాల్లో మరొకరి జీవిత భాగస్వామి. మన కోసం వెచ్చించిన టైమ్ ఇక తన లైఫ్ పార్ట్నర్ కోసం ఖర్చు చేయాలి. మనకు చెప్పిన స్వీట్‌నథింగ్స్ తన మనిషితో పంచుకోవాలి. ఇంత దూరాన్ని భరించాలంటే దానికి ముందు ఎంత దగ్గరితనం అనుభవించాలి? అందుకే మగవాళ్ల కోసం పుట్టుకొచ్చాయి బ్యాచిలర్ పార్టీలు. అదే కోవలో అమ్మాయిలు అమ్మాయిల కోసం పుట్టించిన పార్టీలే ‘బ్రైడల్ షవర్’లు. పెళ్లికూతురు కాబోతున్న అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పేందుకు, బహుమతులు అందించేందుకు పెళ్లి రోజు దాకా ఆగాలా? ఆమెకు ప్రాణంలా మెలిగిన వారు కూడా పెళ్లిరోజునో, రిసెప్షన్ రోజునో వెళ్లి, గుంపులో గోవిందా అన్నట్టు ఓ గిఫ్ట్ప్యాకెట్ చేతిలో పెట్టేసి తిరిగి వచ్చేయాలా? ఠాట్... కుదరదంటే కుదరదనుకుంటున్నారు నవతరం. అందుకే బ్రైడల్ షవర్ పార్టీలకు హుషారుగా పచ్చజెండా ఊపేస్తున్నారు. చారిత్రక మూలాలూ... పెళ్లి పీటలు ఎక్కకుండానే ఏర్పాటు చేసే వేదికే బ్రైడల్ షవర్. చాలా కాలం కిందటే అంటే దాదాపు 1890 ప్రాంతం నుంచే నెదర్లాండ్స్, బెల్జియంలలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా కట్నకానుకల వంటి ఆచారాల సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిందట. పెళ్లి కూతురికి కావల్సినవి అందించలేక తండ్రి చేతులెత్తేసినప్పుడు, లేదా తనకు ఇష్టం లేని వివాహం చేసుకుంటున్న కూతురిని తల్లిదండ్రులు పట్టించుకోనప్పుడు... స్నేహితులే చొరవ తీసుకుని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేవారట. పెళ్లి చేసుకుంటున్నవారికి కావల్సిన వస్తువుల్ని, వారి సంసారానికి అవసరమైనవి సేకరించడానికి దీన్ని ఒక మార్గంగా ఆచారంలోకి తెచ్చారట. అదే కోవలో ఇంగ్లండ్‌లో బ్రైడ్ ఏలె పేరుతో కూడా ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించేవారు. పెళ్లికూతురు, ఆమె స్నేహితులు కలిసి బీరు తయారు చేసి దాన్ని విక్రయించేవారట. తద్వారా వచ్చిన డబ్బులతో పెళ్లి ఖర్చులు పెట్టుకునేవారట. ఇది పెళ్లికి ఒక్కరోజు ముందు నిర్వహించేవారట. ఏదైతేనేం... మరింత ఆధునికతను సంతరించుకున్న ఈ సరదా సందడి... ఇటీవలి కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి... సహజంగానే అక్కడ నుంచి మన దేశానికి అలా మన కాస్మొపాలిటన్ సిటీకి కూడా వచ్చేసింది. వెళ్లిరావమ్మా... పెళ్లికూతురా... నగరంలో బ్రైడల్ షవర్లు ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఇవి ఊపందుకుంటున్నాయి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని తెలియగానే... ఆమె స్నేహితులంతా కలిసి చర్చించుకుని ఆ అమ్మాయి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీలో ఆడి పాడడం, జ్ఞాపకాలు పంచుకోవడం, బహుమతులు అందించడం వంటివన్నీ సందడిగా సాగిపోతున్నాయి. వేడుక ముగిసే సమయానికి అందరూ కలిసి ఆమెను సాదరంగా సాగనంపడం కూడా. ఈ సందర్భంలో కొన్ని జతల కళ్లు చెమర్చడం వంటి సన్నివేశాలూ ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని పలు రెస్టారెంట్స్, కాఫీషాప్స్, పబ్స్, క్లబ్స్... వంటివి ఈ తరహా బ్రైడల్ షవర్లకు ప్రస్తుతం వేదికలుగా మారాయి. పలువురు ఈవెంట్ మేనేజర్లు వీటిని నిర్వహించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా పార్టీలకు మగవాళ్లను అనుమతించడం కనపడనప్పటికీ భవిష్యత్తులో ఈ నిబంధన మాయమవ్వొచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే నగరానికి చెందిన మోడల్ సిపిక ఖండేల్వాల్ స్నేహితులు గత ఏడాదే ఆమె కోసం బ్రైడల్ షవర్ నిర్వహించారు. గ్లామర్ రంగ యువత ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్న ప్రచారం మరింతమందికి స్ఫూర్తినిస్తోంది. సో.. బ్యాచిలర్ పార్టీల్లానే నగరం నలుమూలలా బ్రైడల్ షవర్లు కూడా పార్టీ ప్రియుల్ని తడిపి ముద్దచేయడం ఖాయం. ఎస్.సత్యబాబు -
హృదయం: మళ్లీ పెళ్లి..!
పెళ్లి ప్రాధాన్యత గురించి చెప్పే సమయంలో ‘‘వయసులో ఉన్నప్పుడు పర్లేదు కాని వయసైపోయాక, ఒక తోడు అవసరం తెలుస్తుంది’’ అంటారు. ఈ మాట అక్షరాలా నిజం అంటున్నారు సీనియర్ సిటిజన్స్. వేర్వేరు కారణాల వల్ల జీవిత భాగస్వామి దూరమై, బిజీ బిజీగా గడిపే పిల్లలకు చేరువ కాలేక... తోడొకరుండిన అదే భాగ్యమూ అనుకుంటున్న పెద్దలు... తలపండిన వయసులో పెళ్లిళ్లకు సై అంటున్నారు. ఆ భాగ్యం కోసం అవసరమైతే కంటికిరెప్పల్లా పెంచుకున్న పిల్లలను సైతం ఎదిరిస్తున్నారు. ఈ రెండు కధనాలే దీనికి నిదర్శనం... తోడొకరుండిన అదే భాగ్యమూ.... ఆరోగ్యమూ... ‘‘ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటో నాకు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో ఆయనకు తెలియదు’ అన్నారు రాజేశ్వరి. విజయవాడ, స్టెల్లా కాలేజీ దగ్గర తన ప్రస్తుత భర్త కోటేశ్వరరావుతో కలిసి నివసిస్తున్నారామె. వ్యవసాయ నేపథ్యం గల కోటేశ్వరరావు(75) ఆరేళ్ల క్రితం భార్యను కోల్పోయారు. మరోవైపు పిల్లలు కూడా లేకపోవడంతో మరింత ఒంటరి అయ్యారు. ఈ పరిస్థితిలో ఆయనకు రాజేశ్వరి (61) పరిచయం అయ్యారు. ఇరువురి అంగీకారంతో గత ఏడాది కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న రాజేశ్వరి 30 ఏళ్ల క్రితం భర్తను పోగొట్టుకున్నా పిల్లలను చక్కగా పెంచి జీవితంలో స్థిరపడేలా చేశారు. అనంతరం అకస్మాత్తుగా ఆవరించిన ఒంటరితనాన్ని ఆమె కోటేశ్వరరావు పరిచయంతో దూరం చేసుకోగలిగారు. ‘‘నా బాగోగులు చూసుకునేందుకు నా కంట్లో ఐ డ్రాప్ వేసేందుకు ఓ సహచరి ఉంది’ అని కోటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తుంటే, ‘‘నేను ఏ గుడికి వెళ్లాలన్నా, పేరంటానికి వెళ్లాలన్నా ఓ తోడున్నార’’ని రాజేశ్వరి సంబరంగా చెబుతున్నారు. మన సమాజంలోకి అనూహ్యంగా చొచ్చుకుపోతూ... ‘మలి దశలో మనువు’ అనే సరికొత్త పంథా... రాన్రానూ ఓ సంప్రదాయంలా స్థిరపడుతోంది. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి... ఓ చిన్న ఓదార్పు కోసం, ఓ మనసైన తోడు కోసం పరితపిస్తున్న పెద్దల చివరి మజిలీలోని ‘చిన్ని చిన్ని’ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు నవతరం మీద ఉందనేది నిజం. మనకు తోడు అత్యవసరమైన వయసులో జీవితభాగస్వామి దూరం కావడం చాలా క్షోభకు గురిచేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడం ద్వారా ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడం ఇరు జీవితాలకే కాదు వారి కుటుంబాలకు కూడా మేలు చేస్తుంది. అందుకే పెద్ద వయసు పెళ్ళిళ్లను ప్రోత్సహించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మరిన్ని వివరాలు కావల్సిన వారు ఫోన్: 8106367014లో సంప్రదించండి లేదా... తోడునీడ వెబ్సైట్లో చూడవచ్చు. - రాజేశ్వరి, తోడునీడ పెళ్లాడదామా? పిల్లల్ని అడిగి చెబుతా... ఒకప్పుడు ఇది పెద్ద జోక్. అయితే ఇప్పుడు ‘నిఖా’ర్సయిన నిజం. మలిదశలో మనువు కోరుకుంటున్న వారికి పిల్లల అంగీకారం అత్యవసరంగా మారుతోంది. చాలా మంది పిల్లల అభీష్టానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేక తమ ఇష్టాలను చంపుకుంటుంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈశ్వరరావు (65), కుమారి (60) (పేర్లు మార్చాం) మాత్రం ‘పిల్లల్ని’ ఎదిరించారు. అదెలా అంటే... ఎనిమిదేళ్ల క్రితం భార్యను కోల్పోయిన ఈశ్వరరావు, భర్త మరణంతో ముగ్గురు పిల్లల్ని పోషించలేక తంటాలు పడుతున్న కుమారి తోడు నీడ అనే వృద్ధుల సేవా సంస్థ ద్వారా తొలిసారి కలిశారు. మొదటిచూపులోనే ఈశ్వరరావుకు కుమారి నచ్చేశారు. ‘‘నిన్నే పెళ్లాడుతా’’నన్నారు. అందుకామె ‘‘పిల్లల్నడిగి చెబుతా’’ అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది. దీనికి ఈశ్వరరావు కుటుంబం నుంచి ఏ అభ్యంతరం రాలేదు కాని కుమారి పిల్లలు ఒప్పుకోం అన్నారు. నిరుద్యోగిగా ఉన్న ఓ కొడుకైతే... ఇకపై అలాంటి సంస్థల దగ్గరకు వెళితే ఊరుకోనంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే కుమారిని మనసా వాచా ఇష్టపడిన ఈశ్వరరావు... ఆమెని ఇంట్లో నుంచి తీసుకువచ్చి గుడిలో పెళ్లి చేసేసుకున్నారు. తన ఇంటికి తెచ్చేసుకున్నారు. ఇది తెలుసుకున్న ఆమె కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈశ్వరరావును కొట్టి, తల్లిని తనతో పాటు తన ఇంటికి తీసుకుపోయాడు. అంతే కాదు తను బయటకు వెళ్లేటప్పుడు చెల్లిని తల్లికి కాపలా పెట్టాడు. అయితే ఈశ్వరరావు, కుమారి ఈసారి ఎవరికీ తెలీని మారుమూల ప్రాంతంలో సంసారం మొదలెట్టారు. తల్లి జాడ తెలియకపోవడంతో... కాస్త దిగొచ్చిన ఆ కొడుకు ‘తోడు నీడ’ సహాయంతో రాజీకి సిద్ధమయ్యాడు. చివరకు...కుమారి కొడుకు జీవితంలో స్థిరపడేలా చూస్తాననీ, ఆమె కూతురి పెళ్లి చేస్తానని ఈశ్వరరావు మాట ఇచ్చి ఆమె కొడుకును ఒప్పించారు. ఆ తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కూడా. నాలుగేళ్ల వయసున్న వీరి కాపురం ఇప్పుడు ఆనందంగా సాగిపోతోంది. - ఎస్.సత్యబాబు, ఫొటో: కోటేశ్వరరావు