lok adalat
-
99.90, 98.74, 98.88.. ఇవేమీ పరీక్షల్లో మార్కులు కాదు!
సాక్షి, హైదరాబాద్: 99.90, 98.74, 98.88.. ఇవి పదో తరగతి ఫలితాలో, ఇంటర్ ఫలితాలో కాదు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎస్ ఎల్ఎస్ఏ) సాధించిన రికార్డులు. వరుసగా ఒకటి, రెండో, మూడో జాతీయ లోక్ అదాలత్‌లలో దేశ వ్యాప్తంగా కేసుల పరిష్కారంలో నంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణకన్నా పెద్ద రాష్ట్రాలున్నా ఏటా రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరిస్తూ మన్ననలు పొందుతోంది. కక్షిదారులకు పరిహారం చెల్లింపుల్లోనూ అగ్రగామిగా సేవలందిస్తోంది. ప్రజలకు ఉచిత న్యాయం, సత్వర న్యాయమే ధ్యేయంగా పనిచేస్తోంది. న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతోంది. భవిష్యత్‌లో నూటికి నూరు శాతం కేసుల పరిష్కారమే కాకుండా.. గ్రామీణ ప్రజల వద్దకు చేరుకునేందుకు టీజీఎస్ ఎల్ఎస్ఏ ప్యాట్రన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, టీజీఎస్ ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 9న జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక దినోత్సోవం సందర్భంగా ప్రత్యేక కథనం..భారం లేకుండా పరిష్కారంరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏటా నాలుగుసార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్న్జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో అదాలత్‌లు నిర్వహించారు. న్యాయపరమైన భారాన్ని తగ్గించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందజేయడమే అదాలత్‌ల లక్ష్యం. ఇక్కడ ప్రీ లిటిగేషన్(ఇంకా కోర్టులో కేసు వేయనివి), పెండింగ్ (సివిల్, రాజీ పడదగిన క్రిమినల్) కేసులను కూడా పరిష్కరిస్తారు. వ్యాజ్యాలను సామరస్య పూర్వకంగా పరిష్కారించుకోవడానికి అదాలత్ ఓ చక్కని వేదిక. కోర్టుల్లో నమోదు కాని కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ నేరాలు, ట్రాఫిక్ చలా¯Œనాలు, రెవెన్యూ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్‌లు, చెక్ బౌన్స్ కేసులతో సహా కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న పలు కేసులు, కార్మిక, వివాహ వివాదాలు (విడాకుల కేసులు మినహా), భూ సేకరణ కేసులు, వినియోగదారుల విషయాలను పరిష్కరిస్తుంది.ఆశ్రయించండి ఇలా.. ఉచిత, సత్వర న్యాయం కోసం మండల న్యాయ సేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోగాని, వ్యక్తిగతంగాగానీ న్యాయ సాయం కోరవచ్చు.ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక లోక్ అదాలత్‌లలో కక్షిదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందిస్తున్నాం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికగా ఎదిగేందుకు చర్యలు చేపట్టాం. ప్రచార మాధ్య మాల ద్వారా అదాలత్‌పై విస్తృత మైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే జిల్లా, మండల స్థాయిల్లో లోక్ అదాలత్‌లను ఇంకా బలోపేతం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మెరుగుపర్చ డానికి అథారిటీ ప్యాట్ర¯న్న్చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్న్జస్టిస్ సుజోయ్‌పాల్ కృషి చేస్తున్నారు. వారి నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యమైంది. న్యాయమూర్తులు, లీగల్ సర్వీసెస్ సంస్థల సహకారంతో భవిష్యత్‌లో 100 శాతం కేసులు పరిష్కరిస్తాం. – సీహెచ్ పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎస్ఎల్ఎస్ఏఉచిత న్యాయం ఎవరు కోరవచ్చు?న్యాయసేవాధికార చట్టం 1987లోని సెక్షన్ 12 ప్రకారం.. ఎస్టీ, ఎస్సీ, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళలు, పిల్లలు, అంగవైకల్య బాధితులు, విపత్తు బాధితులు, జాతి వైషమ్యాలతో హింసకు గురైనవారు, కులం పేరుతో వేధింపులకు గురైన వారు అథారిటీ నుంచి ఉచిత న్యాయ సాయం పొందవచ్చులోక్ అదాలత్లలోని ప్రత్యేక సేవలు న్యాయవాదిని నియమించుకోలేని అర్హులైన వారికి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. పిటిషన్లు, అప్పీల్ వేసేందుకు ప్యానల్ లాయర్లు అందుబాటులో ఉంటారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచలనలు కూడా ఇస్తారు. తీర్పులు, ఉత్తర్వులతో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఉచితంగా అందిస్తారు. -
ఒకేరోజు 12,39,044 కేసుల పరిష్కారం.. దేశంలోనే నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎస్ ఎల్ఎస్ఏ) నంబర్ వన్‌గా నిలిచింది. ఒకే రోజు 12,39,044 కేసులను పరిష్కరించి ఈ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో అథారిటీని హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సుజోయ్‌పాల్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని కేసులను పరిష్క రించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని అభిలషించారు. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా ఎదుగుతున్న అథారిటీకి ప్రజాదరణ పెరుగు తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. కోర్టులపై భారం తగ్గడంతోపాటు వేగంగా న్యాయం అందిస్తున్న అథారిటీ మరింత వృద్ధి సాధించాలని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి సోమవారం మీడియాతో మాట్లా డారు. 2024 సెప్టెంబర్ 14న నిర్వ హించిన లోక్ అదాలత్‌లో 12,39,044 కేసులను పరిష్కరించి రూ.250,19,44,447 పరిహారం కక్షిదారులకు అందజే శామని చెప్పారు. కేసుల సత్వర పరి ష్కారం, ఖర్చు లేకుండా న్యాయం అందించడమే లక్ష్యంగా అథారిటీ పనిచేస్తుందన్నారు. అథారిటీ ప్యా ట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, అథారిటీ ఎగ్జి క్యూటివ్ చైర్మన్, జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వం, సూచనలతో పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారం సాధ్యౖ మెందని వెల్లడించారు. వరుసగా రెండోసారి నంబర్ వన్‌గా నిలపడంలో సహకరించిన వారికి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సుజోయ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపార న్నారు. ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాన్ని విని యోగించుకుని వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని, అందుకు కక్షిదారులు ముందుకు రావా లని న్యాయమూర్తులు పిలుపునిచ్చినట్లు వివరించారు. -
Justice D.Y. Chandrachud: న్యాయప్రక్రియతో జనం విసుగెత్తిపోయారు
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
లోక్ అదాలత్‌లో 10,35,520 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టులో 132 కేసులు.. హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం.. రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 9,262.. వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 3,21,604 ఉన్నాయి. బాధితులకు రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.వినోద్‌కుమార్ రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో 365 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్ జి.శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి పాల్గొన్నారు. హైకోర్టులో 365 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.26.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. -
సమసిన ‘ఇవ–యశోద’ చిత్ర వివాదం
సాక్షి,సిటీబ్యూరో: సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్ర విషయంలో నిర్మాత, దర్శకులు, ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం సిటీ సివిల్ కోర్టు లోక్ అదాలత్ సమక్షంలో సుఖాంతంగా ముగిసింది. రెండో అదనపు చీఫ్ జడ్జ్ కె.ప్రభాకర్ రావు చొరవతో ఇరు వైపుల నుంచి సానుకూల స్పందన రావడంతో న్యాయస్థానంలో ఈ సమస్య రాజీ మార్గంలో సమసిపోయింది. ‘ఇవ–ఐవీఎఫ్’ సంస్థను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, చిత్రం షూటింగ్ సమయంలో ట్రేడ్ మార్క్ విషయంలో తెలియక జరిగిన పొరపాటు వల్లనే ఈ వివాదం తలెత్తిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇకపై సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా ఆ సంస్థ పేరును ఉచ్చరించే డైలాగులను, సంస్థ లోగో దృశ్యాలను చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు ‘ఇవ–ఐవీఎఫ్’ యాజమాన్యానికి తెలియజేయడంతో పాటు రాత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో సిటీ సివిల్ కోర్టులో ‘ఇవ–ఐవీఎఫ్’ దాఖలు చేసిన పిటిషన్‌ను మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు చిత్ర బృందంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజీ పడి ఉపసంహరించుకున్నారు. ‘ఇవ–ఐవీఎఫ్’ ప్రతిష్టను దిగజార్చేలా చిత్రంలో సన్నివేశాలున్నాయంటూ మోహన్‌రావు నవంబరు మూడో వారంలో సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన రెండవ అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర రావు డిసెంబరు 30 వరకు ఓటీటీ ప్లాట్ఫారంలో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దంటూ ఆదేశాలు జారీచేశారు. -
లోక్ అదాలత్‌లో 1,11,232 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 1,11,232 కేసులు పరిష్కారం కాగా, రూ.46.06 కోట్ల పరిహారం అందజేశారు. పరిష్కారం అయిన కేసుల్లో 97,455 పెండింగ్ కేసులు కాగా, 13,777 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో 418 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి ఆస్కారం ఉన్న కేసులను ఇందులో పరిష్కరించారు. ఇదిలా ఉంటే హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 511 కేసులను పరిష్కరించారు. రూ.4.01 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ నేతృత్వంలో కేసుల విచారణ జరిగింది. -
పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!
హుబ్లీ: పెళ్లయిన కొత్తలో గొడవలతో వేరుపడ్డారు. విడాకులు కూడా తీసుకుని 52 ఏళ్ల పాటు ఎవరికొద్దీ వారు జీవించారు. చివరకు లోక్ అదాలత్ వారిని ఒక్కటి చేసింది. ఈ అపరూప సన్నివేశం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కలఘటికిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లో చోటు చేసుకుంది. జెన్నూరు గ్రామానికి చెందిన బసప్ప అగడి (85), మాజీ భార్య కళవ్వ (80) 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కళవ్వకు బసప్ప ప్రతి నెలా భరణం చెల్లించేవాడు. గత కొన్ని నెలలుగా చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ కోర్టును ఆశ్రయించగా సోమవారం మెగా లోక్ అదాలత్‌లో జడ్జి జీఆర్ శెట్టర్ వారి సమస్యను పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న కళవ్వను చూసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి కలిసి జీవించాలంటూ హితబోధ చేశారు. దంపతులను ఒక్కటి చేసి పంపించారు. (క్లిక్: అయ్యబాబోయ్ ఏనుగులు.. పరుగో పరుగు!) -
తల్లిదండ్రులు.. దత్త పుత్రుడు.. సొంత కొడుకు !
సాక్షి, హైదరాబాద్: కష్టపడి పెంచి పెద్ద చేసిన దత్తపుత్రుడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో అతనికి ఆదివారం లోక్‌అదాలత్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించారు. నగరానికి చెందిన భార్యభర్తలకు పిల్లలు కలగకపోవటంతో ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులా అప్యాయంగా చూసుకున్నారు. ప్రయోజకుడ్ని చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చించారు. కొన్నేళ్ల తర్వాత ఆ జంటకు కుమారుడు కలిగాడు. దత్త పుత్రుడితో పాటు సొంత కొడుకును కూడా అల్లారుముద్దుగానే చూసుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు మొదలవ్వడంతో సొంత కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. ఇదే సమయంలో దత్త పుత్రుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోవటం మానేశాడు. వారింటిని ఆక్రమించేశారు. మరోవైపు సొంత కొడుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తల్లిదండ్రుల పోషణే గగనమైపోయింది. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్దచేసిన దత్త పుత్రుడ ప్రవర్తన చూసి కుంగిపోయిన వృద్ధ జంట.. అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి చొరవతో న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ సమక్షంలో వృద్ధ జంట, దత్తపుత్రుడు, ఆయన భార్య, సొంత కొడుకును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. దత్త పుత్రుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అనంతరం ఖలీల్ అనే వ్యక్తిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పు వసూలు కేసును ఉభయ పార్టీలు రాజీ పద్ధతిలో పరిష్కరించుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును , తన తల్లి మరణానంతరం ఆమె కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, ఎస్బీఐ కొంత అప్పును మినహాయించి కొడుకుతో రాజీకి ముందుకొచ్చింది. ప్రాథమిక దశలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఉభయ పక్షాలను సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా అభినందించి వారికి అవార్డు కాపీలను అందజేశారు. (చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం) -
1,518 సివిల్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో 1,518 సివిల్ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్ కేసులు, 1,092 ఎస్బీఐ బ్యాంక్ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్ లోనే సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్ జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో పరిష్కారమైన సివిల్ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి నాగభూషణం, మాట్లాడారు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్‌లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జ్ కె ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించారు. రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం రాచకొండ కమిషరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వీ బాల భాస్కర్ రావులు లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సిపి జీ సుధీర్ బాబు తదితర పోలీస్ అధికారులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. (చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు) -
జూన్ 26న జాతీయ లోక్ అదాలత్
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనియల్ కేసుల్లో రాజీ కోసం ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!) -
రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి. తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్ అదాలత్ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్ అదాలత్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే రూ.60 కోట్లు.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్ చెల్లింపులు జరిగాయి. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. నిమిషానికి 1000
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్‌టైమ్ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి. చదవండి:హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఇంజన్ లేదా చాసిస్ నంబర్ ఎంటర్ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్‌తోనే ఎంటర్ కావచ్చు. ఫోన్ నంబర్ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్ అదాలత్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. చదవండి: అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్ -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు.. గోల్డెన్ చాన్స్!
హిమాయత్‌నగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి తరుణ్ (పేరు మార్చడమైంది) గతేడాది మార్చిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఆయన బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ ఖరీదు సుమారు రూ. 11 వేల వరకు ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ. 10,500 జరిమానా విధిస్తుండటంతో బైక్ ఖరీదు, చలానా ఖరీదు ఒకే స్థాయిలో ఉండటంతో ఆయన బైక్‌ను స్టేషన్లో వదిలేశారు. ఇది ఒక్క తరుణ్ పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులు జరిమానా రూ. 10,500 చెల్లించలేక బైక్ ఖరీదు దాదాపుగా అంతే ఉండటంతో అక్కడే వదిలేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు 5,776 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఆయా వాహనాలను సీజ్ చేసి స్టేషన్ల ఆవరణల్లో ఉంచారు. అవికాస్తా దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు పాడవుతాయనే ఆందోళన ఉన్నా... అంత జరిమానా కట్టే పరిస్థితి లేక బాధపడని వారుండరు. ► అయితే ప్రభుత్వం వారందరికీ ఓ అవకాశాన్ని కల్పించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు లోక్‌అదాలత్‌లో తాము మద్యం సేవించి వాహనం నడిపినట్లు అంగీకరిస్తే రూ. 2100 చెల్లించి ఆ కేసు నుంచి బయటపడి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్పించారు. 36 నుంచి 100 బీఏసీ ఉంటే రూ. 2100, 100 నుంచి 200 బీఏసీ ఉంటే రూ. 3100, 200 నుంచి 300 బీఏసీ ఉంటే రూ. 4100 చెల్లించాలి. ► వాహనదారుడు మాత్రం తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు లోక్ అదాలత్‌లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. ► ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో 736 వాహనాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని వాహనాలను తీసుకున్నారు. ► మనో రంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కోర్టులో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని కల్పించారు. సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తే లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించి వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు... ► లోక్ అదాలత్ మార్చి 12వ తేదీ వరకు కొనసాగనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, డీసీఎంలు ఇలా అన్ని వాహనాలు సీజ్ అయి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉండగా వీరంతా ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసులను సంప్రదిస్తే పోలీసులే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానా చెల్లింపజేసి వాహనాన్ని అందజేస్తారు. మంచి అవకాశం చాలా మంది వాహనదారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు తీసుకోలేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ► కొన్ని ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అప్పటికే ప్రచారం చేశారు. ► సంబంధిత వాహనదారులకు కూడా లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి సమాచారం ఇస్తున్నారు. రోజూ వంద నుంచి 200 వాహనాలు ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలు విడుదల అవుతున్నాయని సబంధిత వర్గాలవారు చెబుతున్నారు. -
జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న
సాక్షి, హైదరాబాద్: కేసుల రాజీకి సంబంధించిన జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న జరగనుంది. దీనికి సంబంధించి న్యాయ విభాగం నుంచి నగర పోలీసులకు సమాచారం అందింది. ప్రజలకు ఉపయుక్తమైన లోక్ అదాలత్‌పై అందరికీ అవగాహన కల్పించాలని కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. వీలున్నంత వరకు అత్యధికులు దీన్ని వినియోగించుకుని, ఫలితాలు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను జోనల్ డీసీపీలకు అప్పగించారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేష్ రెడ్డి బుధవారం తన పరిధిలోని అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ భారీ లోక్ అదాలత్‌కు సంబంధించిన సమాచారం సంబంధిత వ్యక్తులకు అందించే బాధ్యతలను ఇన్స్పెక్టర్లు, సబ్– ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారా లోక్ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని రమేష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం) -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
61 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో దాదాపు 61 వేల కేసులను పరిష్కరించారు. ఇందులో 1,400 సివిల్, 52,420 వేల క్రిమినల్, విచారణ దశలో ఉన్న 7,180 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.60.52 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 203 కేసులు పరిష్కరించినట్లు అథారిటీ కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు. అలాగే సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 634 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.19.66 కోట్లు పరిహారంగా అందించినట్లు అథారిటీ చైర్మన్, చీఫ్ జడ్జి సుమలత, కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. సికింద్రాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో 120 కేసులను పరిష్కరించి రూ.5.90 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు పర్యవేక్షణలో ఈ అదాలత్ నిర్వహించినట్లు లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి శనివారం తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి... ‘వారిద్దరూ భార్యాభర్తలు. అభిప్రాయ భేదాలు రావడంతో 15 ఏళ్ల కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు పొందారు. కాలక్రమంలో వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని భావించారు. మళ్లీ వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టులోనే మళ్లీ వారు పిటిషన్ వేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం చేశాం. మళ్లీ పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని అనుకున్న వారి కోరిక తీరనుంది’అని లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసిన శ్రీనిజ సర్టిఫికెట్లు పోగొట్టిన ఘటనలో ఆ బ్యాంకు అధికారులను ఒప్పించి సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ రూ.1.15 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. -
ఒక్కరోజే 6,351 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో ఈ–లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, లీగల్ సరీ్వసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ–లోక్ అదాలత్ చేపట్టారు. హైకోర్టులో మూడు బెంచ్‌లు, 13 జిల్లాల్లోని కోర్టుల్లో 322 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ–లోక్ అదాలత్‌లో మొత్తం 6,351 కేసులను పరిష్కరించారు. రూ.33.77 కోట్లను సెటిల్మెంట్ కింద చెల్లింపులు చేశారు. ఈ–లోక్ అదాలత్‌కు సహకరించిన వారందరికీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టులో 262 కేసులు పరిష్కారం... హైకోర్టులో నిర్వహించిన ఈ–లోక్ అదాలత్ కేసులను న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య బెంచ్‌లు విచారించాయి. ఈ మూడు బెంచ్‌లు 368 కేసులను విచారించి, అందులో 262 కేసులను పరిష్కరించాయి. రూ.1.01 కోట్లను సెటిల్మెంట్ కింద నిర్ణయించాయి. హైకోర్టులో లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు. -
తొలిసారి హైకోర్టులో ఈ–లోక్ అదాలత్
సాక్షి, అమరావతి: హైకోర్టులో శనివారం నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌లో 187 కేసులు పరిష్కారం అయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మోటారు వాహన ప్రమాద అప్పీళ్లను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ–లోక్ అదాలత్‌కు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహించారు. 192 కేసులు విచారణకు రాగా, అందులో ఇద్దరు న్యాయమూర్తులు 187 కేసులు పరిష్కరించారు. బాధితులకు రూ.76.91 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో హైకోర్టులో తొలిసారి ఈ–లోక్ అదాలత్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో బీమా కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ–లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించినవారందరికీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఏవీ రమణకుమారి శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్క రోజులో 26,488 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్‌లను నిర్వహించారు. మొత్తంగా ఈ రోజు 26,488 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో హైకోర్టులో 503 కేసులు, కింది స్థాయి కోర్టుల్లో 25,985 కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ జాబితాలో వివాద ప్రారంభ దశలో ఉన్న 14,462 కేసులు, విచారణలో ఉన్న 11,523 కేసులున్నాయి. హైకోర్టు కేసులు రాజీ కావడం ద్వారా కక్షిదారులకు రూ. 4.71 కోట్లు అందనుంది. కింది స్థాయి కోర్టుల్లో కేసుల రాజీతో రూ. 54.60 కోట్ల మేరకు వాద, ప్రతివాదులకు చెల్లించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలు పలు కేసుల్ని రాజీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశాలతో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులు అన్ని జిల్లాల్లో లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో కేసులను వాద, ప్రతివాదుల అంగీకారంతో రాజీ అయ్యేలా చేశారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా పెద్ద సంఖ్యలో కేసుల్ని ఇరుపక్షాల అంగీకారంతో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సరస్సుల నగరాల.. సొగసులు కాపాడాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణ ముందుకు కదలకపోవడంతో ఇప్పుడు హైకోర్టే స్వయంగా రంగంలోకి దిగింది. సరస్సుల నగరంగా గతంలో ఉన్న ఖ్యాతిని నిలబెట్టి పూర్వవైభవం తెచ్చేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళణకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున ఓ న్యాయమూర్తి ఈ విధంగా చొరవ తీసుకుని సమావేశం జరపడం ఇదే మొదటిసారి. హైకోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరిగింది. సరస్సుల నగరాలుగా పేరుగడించిన హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, ఇప్పుడు ఆక్రమణలకు గురి కావడం, పరిశ్రమల వ్యర్థాలు, ఇతరాలతో అవి ఉనికిని కోల్పోవడంపై జస్టిస్ చౌహాన్ ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువులకు, మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపు విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు జస్టిస్ చౌహాన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు నెలల్లో మొదట ఓ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 405 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ చౌహాన్ దృష్టికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ తీసుకొచ్చారు. లోక్ అదాలత్‌ల్లో అనుభవజ్ఞులైన మధ్యవర్తుల ద్వారా ఈ కేసులను పరిష్కరిస్తామని జస్టిస్ చౌహాన్ చెప్పారు. మూసీ ప్రక్షాళణ కోసం ఏం చేయాలో క్షేత్రస్థాయి పరిస్థితులతో మూడు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ హామీ ఇచ్చారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నామో వివరిస్తూ నివేదిక ఇస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో, క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో మరోసారి సమావేశం అవుదామని అధికారులందరూ హామీ ఇచ్చారు. చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణకు చెందిన వ్యవహారాలను ఇకపై న్యాయసేవాధికార సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని జస్టిస్ చౌహాన్ వారికి స్పష్టంచేశారు. -
పరిష్కారమైన వివాదంపై అప్పీల్ ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: లోక్ అదాలత్‌లో పరిష్కారమైన ఓ వివాదంపై మళ్లీ అప్పీళ్లు దాఖలు చేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను భూస్థాపితం చేసేలా ఇటువంటి పనికిరాని వ్యాజ్యాలను దాఖలు చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేసినందుకు ఆ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలో జరిగిన లోక్ అదాలత్‌లో పెంటమ్మ, యేసమ్మ తదితరులకు పరిహారం చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో లోక్ అదాలత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సదరు బీమా కంపెనీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేషనల్ ఇన్సూరెన్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, లోక్ అదాలత్‌లో ఉత్తర్వులు జారీ చేసే సమయంలో తమ అధికారుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంది. -
బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు
కడప అర్బన్ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్ హోం నోడల్ ఆఫీసర్ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు. తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్ లోక్ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు.