madabhusi Sridhar
-
రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!
భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణ మన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం. సందేహం లేదు. ఒక గౌరవ వందన గీతం. ఈ పీఠిక పాట కాదు, ఒక పాఠం. ఒక ప్రతిజ్ఞ. ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం! ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నియంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కానీ రక్షిస్తామన్నవారూ, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారూ, అర్థం చేసు కోవలసిన వారూ అందరూ మరిచిపోయారు!! ఈ పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది! పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించినందుకూ, పీఠిక చదివి నందుకూ, రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకూ చంద్రశేఖర్ ఆజాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యూఏపీఏ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరకు ఢిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకూ, న్యాయాధికారులకూ, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకూ... అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడూ, ఆ రాజ్యాంగం సరైనదైనపుడూ, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గానీ బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనుల మధ్య! ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాల యాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో అధికారికంగా ఆరంభిం చారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పీఠిక చదివారు. న్యాయ, పర్యావరణ శాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా చదవాలని ఆదేశం జారీ చేశాయి. ఇదీ మన పీఠిక! దీన్ని అవతారిక అనీ అంటారు. ఇంగ్లీషులో ప్రియాంబుల్ అన్నారు. భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను; ఆలోచనా, భావ ప్రకటనా, మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ, అవకాశా ల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్నీ, జాతి ఐక్యత– సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనీ; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీ కరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించు కున్నాం. మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. (చదవండి: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) 1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు. విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలో అంతర్భా గమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పు చెప్పింది. అంతకు ముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియ మాలు కొన్ని మొదటినుంచీ ఉండటం; మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరుతూ ఉండటం గమనించవలసి ఉంది. భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడటానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతమైన, సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచీ, చట్టాల లోంచీ బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓటర్లను ప్రేరేపించడంతోనే మొదలై, ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి వాటిని చూడడం లేదు. తాతల నాటి కట్టడాలు తమ ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్నీ, కులాన్నీ నిత్యం వల్లిస్తూ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం. (చదవండి: ఒక తీర్పు – అనేక సందేహాలు) - ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
పైలట్ మనవాడైతే విమానం హైజాక్ ఎందుకు?
కేంద్రంలో బీజేపీ అధికారంతో కళకళలాడుతూ ఉంటే, అధికారం లేక అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ విలవిలలాడుతుంటే, ఏవిధంగానైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని తోచిన వ్యూహాలన్నీ పన్నుతుంటే, మధ్య (మద్య) తరగతి జనం, మతం పేరున విడిపోయి బీజేపీకి ఓటు వేయడమంటే హిందూమతానికి, సాక్షాత్తూ భగవంతుడికి ఓటువేయడమనే మాయమత్తులో కొట్టుమిట్టాడుతున్న దుర్దశలో ఉన్నారు. నాయకత్వ సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ దిక్కూ మొక్కూ లేకుండా క్షీణిస్తున్న దయనీయ వాతావరణంలో కూడా, బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ సీట్లు ఇచ్చి గద్దెను అప్పగిం చారు. అది ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఓటు. అధికారం పంచుకోవడంలో రాజకీయ నాయకుల మధ్య సఖ్యత ఏ మాత్రం ఉండదు, దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో బందిపోటు దొంగల మధ్య అద్భుతమైన సఖ్యత ఉంటుంది. అధికారం పంచుకునేప్పుడు నేతలకు రాజ్యాంగం అడ్డురాదు. కాని బందిపోట్లు నిశ్శబ్దంగా డబ్బు పంచుకోకపోతే ఇండియన్ పీనల్ కోడ్ అడ్డు వస్తుంది. ప్రశాంతంగా లూటీ సొమ్ము పంచుకోగలిగి నంత మాత్రాన బందిపోట్లను మంచివాళ్లని అనలేము. అశోక్ గెహ్లాట్, సచిన్ మధ్య వర్గ రాజకీయాల ఔన్నత్య నీచత్వాల గురించి చర్చించే పని లేదు. కాంగ్రెస్ వల్ల పదవులు పొందిన జ్యోతిరాదిత్య సింధియా కానీ, సచిన్ పైలట్ కానీ, వారిని అదిరించి, బెదిరించి పార్టీ మారడానికి ప్రోత్సహిస్తున్న బీజేపీగానీ ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి జనం ఓటు వేస్తే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీతో కలవడం పార్టీకి ద్రోహం చేయడమే అన్నారు. నిజానికి ఆయన ఆపార్టీకి ఓటేసిన ఓటర్లకు ద్రోహం చేసారు. ఈ ప్రజాద్రోహం, ఐపీసీలో ఉన్న రాజ ద్రోహం కన్నా ఘోరనేరం. జ్యోతిరాదిత్య సింధియా రాజ కుటుంబానికి చెందిన వాడంటారు. ఒకవేళ ఆయన రాజే అయితే ఇది రాజు చేసిన ప్రజాద్రోహం అవుతుంది. సత్యమేవజయతే (సత్యం ఒక్కటే జయిస్తుంది అని దీని అర్థమని చాలామందికి తెలియదు) అనే ధ్యేయవాక్యంతో మనదేశం వర్ధిల్లుతున్నది. కానీ ఈ దేశంలో ఉన్నంత అసత్యం మరెక్కడయినా ఉందో లేదో. సత్యం చెప్పినందుకు మెప్పు లభించకపోయినా అసత్యం చెప్పిన వాడు అందలాలు ఎక్కుతాడు. వాట్సాప్ ద్వారా కోట్లాది ప్రజలకు ఫేక్ న్యూస్ చేర్చి అధికారంలోకి వచ్చామని సగర్వంగా ఊరేగే పార్టీలున్న దేశం మనది. కాంగ్రెస్ తరఫున పోటీచేసి కాంగ్రెస్ వాగ్దానాలు అమలుచేస్తానని చెప్పి గెలిచి, ఆ తరువాత బీజేపీలో చేరే వారు, (ఆ విధంగా పార్టీ మార్చే అందరూ కూడా) అసత్యనేరానికి జైల్లో ఉండవలసిన వారు. ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి, ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన నితీశ్ కుమార్, ఆర్జేడీని వదిలేసి రాజీనామా చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకుని మరునాడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం కూడా ఇటువంటి ప్రజాద్రోహమే. అసత్యనేరం కూడా. ఈవిధంగా ప్రజాద్రోహం చేసి పార్టీ మారి వచ్చే వారిని అందలాలెక్కించే పార్టీలు కూడా నేరగాళ్లే. ఈ రోజు సచిన్ పైలట్ ఒక సంచలన యువకిశోరం. నిన్న జ్యోతిరాదిత్య సింధియా కూడా. సచిన్ నాన్న చనిపోయినప్పుడు తన వయసు 23. వాళ్ల అమ్మగారి స్థానంలో 26 ఏళ్లకే ఎంపీ అయిపోయాడు. 32 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి. 36 సంవత్సరాల వయసులో రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. 40 ఏళ్లకు ఉపముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకేమీ ఈయనగారికి ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర లేదు. ఇంకా కావాలి. ఏదో కావాలి. అహం కారం, దురాశ కలిసినప్పుడు తమకు ఓట్లేసిన ప్రజలు, టికెటిచ్చిన పార్టీ గుర్తుకురావు. ఈ కనులకు కమ్మిన పొరలను తీయడానికి కాటరాక్టు ఆపరేషన్లు ఉండవు. రాహుల్ గాంధీ అవమానించి ఉంటాడు. సోనియా తిట్టి ఉంటుంది. లేదా ఇంకెవరో ఏదో అని ఉంటారు. వారి ఆత్మగౌరవం (అహంకారానికి వేసిన మేకప్ పదం) దెబ్బతిని ఉంటుంది. ఇది ఒక కోణం. ఎక్కడో జనం డబ్బు తినేసి ఉంటారు. సాక్ష్యాలతో సహా వీరు చేసిన ఏదో నేరం దొరికిపోయి ఉంటుంది. ఆదాయం పన్ను ఎగవేసి ఉంటారు. జైల్లో ఆర్థిక నేరస్తుడిగా ఉండడం కన్న అధికారపార్టీలో మంత్రిగా ఉండడం గొప్ప కీర్తి కదా. అప్పుడు ఆత్మగౌరవానికి ఏ లోపమూ ఉండదు. కనుక ‘నేను బీజేపీలో చేరడం లేదు’ అని సచిన్ పైలట్ చెప్పడం మనదేశానికి తాటికాయ అక్షరాల వార్త. కరోనాతో ఎంత మంది జనం చస్తే ఏమిటి, వారికి చికిత్స చేయాల్సిన ప్రజారోగ్యం రోగాన పడి మంచాన పడి గింజుకుంటేనేమిటి? కాంగ్రెస్ చేతిలోంచి ఇంకో ప్రభుత్వం మన చేతిలోకి వస్తుంటే.. అని బీజేపీ పండుగ చేసుకోవచ్చు. అయితే పైలట్ మనవాడయితే విమానాన్ని హైజాక్ చేయడమెందుకు? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నిలదీయండి.. నిలబడండి!
వసుదైక కుటుంబం, ఇంట్లోనే అందరూ ఉంటే అంతకన్నా కావలసిందేమిటి? ఇల్లే స్వర్గం... ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.. ఇవన్నీ భావావేశాలు, అందమైన కవితలు. అర్థాంగి, సుమంగళి, సతీఅనసూ య వంటి పాతకాలం సినీ పైత్య ప్రకోపాలు. ప్రవచనానంద స్వాముల పవిత్ర నినాదాలు. మానవత్వం పరిమళించే కొన్ని సంస్కారవంతమైన కుటుంబాలకు మాత్రమే పరిమితమైన వాస్తవాలు. మనదేశంలో లాక్డౌన్ మొదలయిన తరువాత నెలరోజుల్లో 500 గృహహింస కేసులు వచ్చాయట. ప్రపంచమంతటా 20 శాతం పెరిగాయని ఐక్యరాజ్యసమితి లెక్క. జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసి వివాహితల్లో ప్రతి మూడో మహిళ గృహహింసకు గురవుతున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భర్తల వల్ల 31 శాతం మహిళలు శారీరక, లైంగిక, మానసిక హింసలకు గురవుతున్నారు. 27శాతం భర్తలు భార్యలను కొడుతున్నారు. 13 శాతం మానసికంగా చిత్రవధ చేస్తున్నారని సర్వే తెలిపింది. ఆర్థిక హింస గురించి వీరు పట్టించుకోలేదు. వండి పెడుతుంటే బుద్ధిగా ఉండలేక ఇంతులను హింసించడం పతనమవుతున్న కుటుంబ సంబంధాల ప్రతీక. కోడల్ని వేధించడం, భార్యను సాధించడం. భర్తలను కూడా సాధిస్తున్నారని ఎవరైనా అనొచ్చు. కాని అటువంటి ఫిర్యాదులున్నట్టు దాఖలా లేదు. ఇటీవల రాచకొండ పోలీసులు ఒక గృహిణిని గృహహింస నుంచి కాపాడారు. 498ఎ ఐపిసి దుర్వినియోగం అవుతున్నదని భార్యా బాధితుల సంఘాలు తీవ్రంగా ప్రచారం చేసినా ఈ దేశపు ఆడపడుచులకు ఆ సెక్షన్ అవసరం ఇంకా తీరలేదనే రుజువులు రోజూ కనిపిస్తాయి. కోవిడ్ కాలంలో, కోవిడ్ తరువాత అనే తేడాలు పెద్దగా లేవు. కోవిడ్ కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కనుక వేధించడానికి అనేక సదుపాయాలున్నాయి. ఇంటి హింస ఎదురైతే తమకు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు ప్రకటించారు. పోలీసులు టెలికౌన్సెలింగ్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. కరోనా మనుషులను ఒంటరి చేస్తున్నది. జీవిత భాగస్వాములే కాదు, కన్నకొడుకులు కూతుళ్లు.. తల్లిదండ్రులకు కూడా కరోనా ఉందన్న అనుమానంతో దూరంగా ఉండమంటున్నారు. దాన్ని సామాజిక దూరం అని పిలుస్తున్నారు. కుటుంబాల మధ్య దూరం పెంచి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు దగ్గినా సరే భయపడే పుత్రరత్నాల ధైర్యసాహసాలు బయపడుతున్నాయి. హాస్పిటల్ వారు ఆదరిస్తే అదృష్టం. లేకపోతే దిక్కులేదు. కరోనా అంటురోగంతోపాటు ప్రబలుతున్న ఇంటి రోగం ఈ గృహహింస. శారీరకంగా, మానసికంగా, ఆడవారిని హింసించే సంఘటనలు పెరిగాయని జాతీయ మహిళా కమిష న్ కూడా హెచ్చరించింది. ఆర్థికహింస కూడా ఉంటుంది కాని బయటపడదు. కనిపించదు. బెదిరింపులు, దాడులు, అవమానించడం, తిట్టడం, కొట్టడం, నీ సంగతి చూస్తా అనడం, తిండి పెట్టకపోవడం, మంచి నీళ్లకు కూడా బాధించడం, అక్రమ సంబంధాలు, రోగాలు అంటగట్టడం ఇవన్నీ హింసకిందికే వస్తాయి. పట్టించుకోకుండా వదిలేస్తే, ఒత్తిడి వల్ల మానసిక శారీరక రుగ్మతలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పిల్లలుంటే వారు మరింత ఒత్తిడికి గురవుతారు. కనుక ఈ దుర్మార్గుల నుంచి మహిళలు ఆత్మరక్షణ చేసుకోవలసిందే. కొడుకుల తిట్లకు అవమానాలకు తల్లులు గురికావడం కూడా కోవిడ్ రోజుల్లో మామూలై పోయింది. ఇటువంటి ఫిర్యాదులు కూడా చేసి తల్లులు, వయోధిక వృద్ధుల సంక్షేమ చట్టం సాయంతో, కొడుకులను కూడా సరిచేసుకునే అవకాశం ఉపయోగించుకోవాలి. కోవిడ్ కదా ఎవ్వరికి చెప్పుకున్నా ఏం లాభం అని అనుకోకుండా వెంటనే మిత్రుడికో ఆప్తుడైన బంధువుకో, ఇరుగుపొరుగువారికో చెప్పుకోవడం వల్ల ఒంటరిగా మారి దెబ్బతినే అవకాశాలు తగ్గే వీలుంది. జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ ద్వారా కూడా అలర్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. 07217735372కు బాధితులు అలర్ట్ సందేశాలు పంపవచ్చని జాతీయ మహిళా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. SఏఉఖౖఉSS అనే ఎన్జీవో కూడా అందుబాటులో ఉంటానని ప్రకటించింది. నారీడాట్‌కామ్ వారు హెల్ప్‌లైన్ సౌకర్యం కల్పించారు. నందితాదాస్ అనే నటి, దర్శకురాలు ‘లిజెన్ టు హర్’ అని ఈ వేధింపులపైన ఒక చిన్న సినిమా కూడా తీశారు. మహిళలు తమను కాపాడుకోవడానికి ట్విట్టర్ వేదికను కూడా వాడుకోవచ్చు. హైదరాబాద్‌లో షీటీంలతో పోలీసులు రక్షణ కార్య క్రమాన్ని చేపట్టారు. పోలీసు అదనపు కమిషనర్ క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ ఆధ్వర్యంలో 100 షీటీంలు పనిచేస్తున్నాయి. ఎక్కడ మహిళలను వేధించే అవకాశాలున్నాయో ముందే గుర్తించి అక్కడ నిఘా ఎక్కువ చేసామని చెబుతున్నారు. నేరాల తీవ్రత తక్కువైతే కౌన్సిలింగ్ చేస్తారు, దారుణ నేరాలు చేస్తే నిర్భయ చట్టం కింద కేసులు పెడతారు. 100 నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులను షీ విభాగం తీసుకుంటుంది. దౌర్జన్యం చేసే వారితోనే బాధితులు కూడా ఒకే కప్పుకింద నివసించవలసి రావడం చాలా ప్రమాదకరమైన దురదృష్టం. భయపడితే నిర్భయ చట్టం కూడా ఉపయోగపడదు. కుటుంబమైనా రాష్ట్రమైనా, దేశమైనా నిలదీయకపోతే నిలబడడం సాధ్యంకాదు. ప్రశ్నిస్తేనే పౌరసత్వమైనా, మానవత్వమైనా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నేరస్తుల చెరలో ‘న్యాయ’ శాస్త్రం
లా కళాశాలల్లో క్రిమినల్ లా, ప్రొసీజర్ గురించి పాఠాలు చెబుతూ ఉంటాం. తరగతి గదిలో చెప్పేదానికి, కోర్టుల్లో జరిగేదానికి తేడాలు ఉంటా యని నవ్వుకుంటూ ఉంటారు. తీవ్ర నేరం జరిగితే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడం అనేది మొదటి దశ. ఇదే లేకపోతే అసలు దర్యాప్తులు నేర విచారణలు ఉండవు. శిక్ష సంగతి తలెత్తదు. బీజేపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ చేసే విధిని ధైర్యంగా నిర్వర్తించే పోలీసు అధికారులు ఈ దేశంలో లేరా? అది జరగాలనే న్యాయవాదులు, న్యాయమూర్తులన్నా ఉన్నారా? ఈ అన్యాయం భరించలేక హర్షమందర్ అనే మానవహక్కులవాది డిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని హైకోర్టు మెట్లెక్కవలసి రావడమే పెద్ద విషాదం. ముఖ్యమైన మూడు కొత్త పాఠాలు ఇవి. 1. నేరం జరిగితే మొదటి సమాచార నివేదిక పేరుతో కేసు నమోదు చేయాలని తరగతి గదిలో చెబుతాం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: తగిన వాతావరణం ఏర్పడి పరి స్థితులు అనుకూలంగా ఉంటే తప్ప నేరం జరి గినా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి వీల్లేదని సోలిసిటర్ జనరల్ వాదించారు. 2. ఒకవేళ ఎక్స్ అనే వ్యక్తిపై నేరారోపణ వస్తే అతని మీద ఫిర్యాదు రూపంలో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలన్నది క్రిమినల్ లా పాఠం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: ఎక్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలంటే ఏబీసీడీ నుంచి జడ్ దాకా అందరిమీదా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లేకపోతే లేదు. 3. న్యాయం కోరే వ్యక్తి ఎవరైనా సరే అతని దరఖాస్తులో నిజం ఉంటే న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందని తరగతి గదిలో చెప్పే పాఠం. కొత్తగా ప్రధాన న్యాయమూర్తి గారి ప్రవచనం: న్యాయం చేయాలని కోరే వ్యక్తికి న్యాయవ్యవస్థమీద విశ్వాసం ఉందని రుజువు అయితేనే ఆయన దరఖాస్తు విచారణ చేయాలి. హింసాద్వేషాలు వెదజల్లే ప్రసంగాలు నినాదాలు చేసిన మంత్రిగారు అనురాగ్ థాకూర్, కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపైన ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారో లేదో ఒకరోజులో తెలియజేయండి అని డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ బెంచ్ హర్షమందర్ కేసు విచారణలో సూచించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం కుదరదు. ఎందుకంటే ప్రాథమికంగా నేరం జరిగిన ఆధారాలుంటే నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పోలీసులకే ఉంది. కనుక ఆలోచించి రేపు సాయంత్రంలోగా చెప్పండి అని మాత్రమే జస్టిస్ మురళీధర్ అన్నారు. అంతే, న్యాయశాఖ ఆగమేఘాలమీద అర్థరాత్రి బదిలీ ఉత్తర్వులు తయారు చేసింది. జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతితో సంతకం చేయించి మరీ ప్రకటించింది ఫిబ్రవరి 12నే సుప్రీంకోర్టు కొలీజియం మురళీధర్ బదిలీ ప్రతిపాదనను ఆమోదించింది కనుక అని చెప్పింది. మురళీధర్ బదిలీకి కొలీజియం ఇంతవరకు కారణాలు తెలియజేయలేదు. మరునాడు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జడ్జిగారి ధర్మాసనం ఆ కేసును నెల వాయిదా వేసింది. బీజేపీ నాయకుల హింసాద్వేష ప్రసంగాలమీద కేసులు త్వరగా వినాలని, ఢిల్లీ హైకోర్టు అంత సుదీర్ఘ వాయిదా వేయడం తగదని సుప్రీంకోర్టు మార్చి 4న మరో కేసులో చెప్పడం కారు చీకటిలో చిరు కాంతిరేఖ. కానీ, ఇందులో కూడా తిరకాసు ఉంది. అదేమంటే ఒక ప్రసంగం చేస్తూ హర్షమందర్ తనకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్నారని పోలీసుశాఖ ఒక అఫిడవిట్ వేసింది. కోపిం చిన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ముందీ సంగతి తేల్చండి తరువాతే అసలు కేసు వింటాం అన్నారు. కానీ, పిటిషనర్‌కు విశ్వాసం ఉన్నా లేకపోయినా న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగం మీద న్యాయమూర్తులకు విశ్వాసం ఉంది గనుక కేసు వినవలసి ఉంటుంది కదా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అసలు నేరస్తులు ఎవరు?
దిశను దారుణంగా హతమార్చిన దుర్మార్గులకు మరణ దండన విధించాలనేవారు కొందరయితే, వాళ్లను ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు వెంటనే చంపేయండి, లేకపోతే మీకు తుపాకులెందుకు అని పోలీసులను రెచ్చ గొట్టేవారు ఇంకెందరో. ఫేస్బుక్, ట్విట్టర్లో అడ్డూ అదుపులేకుండా నోటికి వచ్చింది రాస్తున్నారు. మరణదండన వద్దనే వారిని తిడుతున్నారు. లైంగిక నేరాల బాధితులను వివరించే చిత్రాలను చూపవద్దని, వారి పేర్లు వెల్లడి చేయవద్దనే నియమాలను పట్టించుకోకుండా హతురాలి పేరు రాసి, ఫొటోలు వేసి నేరాలు చేసినవారు కోకొల్లలు. సభ్యత సంస్కారాలు కనీస జ్ఞానం కూడా లేకుండా చదువుకున్నవారు, రచయితలు, కవులు, ఫేస్బుక్ నీతివంతులు కూడా ఇష్టంవచ్చినట్టు అనవసరంగా ఈ నేరాలు చేస్తూ, రేప్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరే అర్హత ఉందా? చాటుమాటుగా సాగిన అత్యాచారాన్ని మాటలతో మళ్లీ చేయడంతో సమానం–బాధితురాలి వివరాలు ఫొటోలు ప్రచురించడం. నాలుగైదు రోజులపాటు మీడియాలో, సోషల్ మీడియాలో బాధితురాలి వివరాలను బాధ్యతారహితంగా వాడిన తరువాత పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ ఆమె పేరు దిశ అని మార్చి పుణ్యం కట్టుకున్నారు. రేప్ బాధితురాలు బతికి ఉంటే ఆమెను వైద్యంపేరుతో మెడికల్ రేప్‌నకు గురిచేస్తారు. పోలీసులు దర్యాప్తు రేప్‌నకు పాల్పడతారు. తరువాత కేసు విచారణ పేరుతో లాయర్లు లీగల్ రేప్‌తో బాధిస్తారు. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారీ పత్రికల కలం వీరులు టీవీల కెమెరా వీరులు మీడియా రేప్ సాగిస్తూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి వివరాలు రాస్తూ ఫేస్బుక్ వగైరాలలో మాటల అత్యాచారాలు నిర్వహించే నీతిమంతులకు లెక్కే లేదు. ఇటువంటి వాటికి అందరినీ జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు. కానీ లైంగిక నేరాల బాధితులైన బాలికలు, మహిళల పేర్లు వెల్లడి చేస్తే రెండేళ్ల కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష విధించాలని సెక్షన్ 228ఏ వివరిస్తున్నది. ఐపీసీ సెక్షన్లు 376, 376ఏ, 376బి, 376సి, 376డిలో లైంగిక నేరాల నిర్వచనాలు ఉన్నాయి, ఈ నేరాలలో బాధితురాలి పేరును ప్రచురించినా, లేదా మరేరకంగానైనా వెల్లడించినా (వచన కవితలతో సహా) రెండేళ్ల కఠిన లేదా సాధా రణ కారాగార శిక్షను, దాంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. పరిశోధనకు దర్యాప్తునకు అవ సరమనుకున్నపుడు పోలీసు అధికారి లిఖితపూ ర్వక అనుమతితో బాధితురాలి పేరును ప్రస్తావించ వచ్చు. లేదా బాధితురాలు లిఖితపూర్వక అనుమతితో ప్రచురించవచ్చు. బాధితురాలు జీవించి లేకపోతే లేదా మానసిక స్థిమితం లేకపోతే ఆమె దగ్గరి బంధువు లిఖిత పూర్వకంగా సంబంధిత సంక్షేమ సంస్థ అధ్యక్షుల ద్వారా అనుమతి ఇచ్చి ఉంటే ప్రచురించవచ్చు. కోర్టు వ్యవహారాలలో పేరు రాయడం తప్పనిసరి అనుకుంటే కోర్టు అనుమతితో ప్రచురించవచ్చు. ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఒక వివరణలో, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులో బాధితురాలిపేరు ప్రచురించడం నేరం కాదని పేర్కొన్నారు. అంటే సుప్రీం కోర్టు హైకోర్టు కాకుండా మరే కోర్టు తీర్పులోనైనా బాధితురాలి పేరు రాయడం నేరమే అవుతుందని చాలా స్పష్టం. క్రిమినాలజీ అని ఒక బోధనాంశం ఉంది. అందులో నేరాలు చేయడానికి సామాజిక కారణాలు ఏమిటి అని పరిశోధిస్తారు. బోధిస్తారు. చాలా కాలం కిందట అక్కినేని నాగేశ్వరరావు నిర్మించి నటించిన సుడిగుండాలు సినిమాలో కుటుంబంలో పరిస్థితులు, సమాజంలో బలహీనతలు, లోపాలు, పత్రికలు, డిటెక్టివ్ లేదా అశ్లీల నవలలు (ఆనాటి మీడియా) లో వచ్చిన రాతలు, నిరుద్యోగం వల్ల పనిలేని తనం, విచ్చల విడిగాపారే మద్యం, టోకు మద్యం దుకాణాలుగా మారిపోయి, ఆ సొమ్ముమీద బతికే అవినీతి ప్రభుత్వాలు ఏ విధంగా ఒక కౌమార వయస్కుడైన జులాయిని హత్యచేసే స్థాయికి దిగజార్చాయో వివరిస్తూ, అతని నేరానికి దోహదం చేసిన వారు నేరగాళ్లు కారా, అయితే ఎవరెవరిని, ఎందరిని, ఉరి తీయాలి? అని ప్రశ్నిస్తాడు కథానాయకుడు. దిశ విషయంలో కలం వీరులు బాధితురాలి ఫొటో చూపడానికి కారణాలేమిటి? ఈనేరానికి వేలాదిమందిని రెండేళ్ల పాటు జైళ్లలో పెట్టడానికి ముందుగా జైళ్లు కట్టాలి. కడదామా? తరువాత మేపడానికి తిండి ఏర్పాట్లు చేయాలి. చేద్దామా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, madabhushi.sridhar@gmail.com. -
ఒకే రాజ్యాంగం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక నిజమేనా?
ఒకే దేశం ఒకే రాజ్యాం గం, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక అని లాల్‌ఖిలా నుంచి ప్రధాని నినదించారు. ఒకే దేశం. మనది రాష్ట్రాల సమూహం, రాజ్యాల సంఘం. భిన్నత్వంలో ఏకత్వం మన లక్షణం కాని, వైవి ధ్యంలేని ఏకత్వం కాదు. మనమంతా ఒకటి కాదు అంటే నమ్మడం కష్టం కానీ.. విడివిడి సంస్కృతులు, భాషలతో జీవించే విభిన్న జీవన స్రవంతులన్నీ కలిసి ఒక దేశంగా ఉన్నాయనే వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం. మన రాజ్యాంగం ఒకటే, మన ఐపీసీ ఒకటే, మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ఒకటే కానీ, రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు కొన్ని సవరణలు చేసుకునే అధికారాలు, చట్టాలు చేసుకునే స్వతంత్రత రాష్ట్రాలకు ఉన్నాయి. ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఉపేంద్ర బక్షీ, మనకు మూడు రాజ్యాంగాలు ఉన్నాయంటారు. ఒకటి 1950లో మనం రాసుకున్నది. మరొకటి వంద సవరణల ద్వారా మనం మార్చుకున్నది. మూడోది మన నియమాలు, సవరణల అసలు స్వరూపం ఏమిటో చెప్పే సుప్రీంకోర్టు తీర్పులలో వ్యక్తమైంది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంది. అయినా ఆదేశం ఒకటి కాదనగలరా? అనేక రాజ్యాలు, చట్టాలు, సంప్రదాయాలు ఉండడం అవలక్షణం కాదు, అవసరమైన వైవిధ్య లక్షణం. ఇక ఒకదేశం ఒక పన్ను. పన్నులు కట్టేవాడికి తెలుస్తుంది ఎన్నిరకాల పన్నులు కడుతున్నాడో. అసలు ఒకే పన్ను అనే మాట ఒక ఫన్. ఒక పరి హాసం, ఒక అవాస్తవం. జీఎస్టీలే రెండు రకాలు, ఒకటి కేంద్రానిది మరొకటి రాష్ట్రానిది. అది కూడా అన్నిటికీ ఒకే రేటు కాదు. నానా రేట్లు ఉన్నాయి. ఆదాయం పన్ను, సంపద పన్ను, శిస్తులు వంటివి జీఎస్టీ కాకుండా, ముందునుంచే ఉన్నాయని అందరికీ తెలుసు. మరో చోద్యం, వింత ఏమిటంటే.. ఒకే దేశం, ఒకే ఎన్నిక. జమ్మూ కశ్మీర్లో శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నిక జరిపించడానికి అసలు ఏ అడ్డూ లేదు. రాజకీయ ప్రయోజనాలమీద ఆశలే ఎన్నికల్ని నిర్ణయిస్తాయి. ఆ ‘‘ఒకే ఎన్నిక’’ను జరపలేక చతికిలపడిన వారిదే ఈ నినాదం. కాంగ్రెస్ ప్రభుత్వాలు 356వ అధికరణాన్ని, అందులో లభించే అత్యవసర అధికారాన్ని అకారణంగా, అక్రమ కారణంగా 90 సార్లకు పైగా దుర్వినియోగం వల్ల ఒకే ఎన్నికలు జరపడం సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత 356 అధికరణాన్ని దుర్వినియోగం చేయడంలో పద్ధతులు, ప్రయత్నాలు, వ్యూహాలు మారాయి. టోకు ఫిరాయింపులు చేయించే ధనవ్యాపార రాజకీయం విజృంభిస్తున్నది. మూడింట రెండు వంతుల మంది సభ్యులు లేకపోతే, ఎంఎల్యేలను కొని, ఫైవ్‌స్టార్ హోటళ్లలో స్టాక్‌గా పారేస్తారు. ప్రభుత్వాలను పడగొట్టి, గద్దెనెక్కుతారు. వీలుకాకపోతే గందరగోళం సృష్టించి ఓటింగ్‌లో గెలిచి ప్రభుత్వాన్నో ప్రతిపక్షాన్నో కొని పడేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే సర్కారును రద్దు చేస్తారు. అనుకూలంగా ఉంటే తమ పార్టీ తీర్థం పుచ్చుకోమంటారు. తెలంగాణ, ఆంధ్ర మరికొన్ని రాష్ట్రాలలో జమిలి ఎన్నికలు సహజంగా జరిగేవి. తెలంగాణ ఎన్నికలను ముందుకు జరిపిందెవరు? అప్పుడు ఒకే ఎన్నిక విధానం ఏమైంది? ఆర్నెల్లలోనే రెండు ఎన్నికలకు రాష్ట్రం ఎందుకు సమాయత్తం కావలసి వచ్చింది? కాలం, చట్టం, ఆచారం అనుకూలంగా ఉన్నా ఒకే రాష్ట్రం రెండు ఎన్నికలను కనీసం రెండు రాష్ట్రాలలో అమలు చేయలేని ప్రభుత్వం దారి ఏమిటో దాని శుధ్ధి బుద్ధి ఏమిటో? అత్యధిక రాష్ట్రాలలో పాలిస్తున్న బీజేపీ, వేరే పార్టీల అధీనంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్రాన్ని కాదని వ్యతిరేకించే ధైర్యమున్న ముఖ్యమంత్రులు తక్కువే. మూడింట రెండు వంతుల ఆధిక్యతతో, సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం పొందడం కూడా ఇప్పుడున్న పరిస్థితులతో కష్టం కాదని రుజువైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి 2024 ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేం కాదు. కానీ నిర్వహిస్తారా? తమకు గెలిచే అవకాశం ఉందనుకుంటేనే జరుగుతాయా? రాష్ట్రంలో లోక్‌సభకు, శాసనసభకు ఒకే ఎన్నిక జరిపించడానికి అడ్డొచ్చిన అవసరాలే జమిలి ఎన్నికలకూ ఏర్పడతాయి.నినాదాలు చేయడంవేరు, విధానాలు రచిం చడం వేరు. విధానాలను సక్రమంగా రచించడం కోసమే సంవిధానం ఉంది. సంవిధానాన్ని కాదనుకుంటే, లేదనుకుంటే, ఉన్నా అది వేరు పాలన వేరు అనుకుంటే వారికి ఏదీ చెప్పడం సాధ్యం కాదు. స్వేచ్ఛగా వ్యవహరించి, శాస్త్రీయంగా ఆలోచించి, సహేతుకంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, ధైర్యంగా చెప్పగలవాళ్లుంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. మూఢంగా నమ్మడం మతంలో కుదురుతుందేమో కానీ సమాజంలో, రాజకీయంలో సాగించకూడదు. అభివృద్ధిని అవసరమైన వస్తువులాగా చూపి, టెర్రరిజం ప్రమాదాన్ని భయానక వాతావరణం కల్పించడానికి అనువుగా వాడుకుని, స్వతంత్రతను, స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, అధికార వికేంద్రీకరణను దెబ్బతీస్తూ ఉంటే మౌనంగా ఉండడం నేరమవుతుంది. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి వచ్చే ప్రమాదం కన్నా గుడ్డిగా ఆమోదించేవారి వల్ల ప్రమాదం ఎక్కువ. అయితే ఎవరేమన్నా, అనుకున్నా, తిట్టినా లైక్ చేయకపోయినా, నిజానిజాలను హేతుబద్ధంగా విశ్లేషించడం రాజ్యాంగ విధి, చట్టపరమైన బాధ్యత, నైతిక బాధ్యత, దేశ భక్తుల బాధ్యత. భయపడకండి, ధైర్యంగా విమర్శించండి, ఆ విమర్శల జడివానలకు బ్రిటిష్ పాలకులే పారిపోయారు. విమర్శాస్త్రం ముందు స్వార్థపర అవకాశ వాద రాజకీయులేం నిలబడతారు? స్వాతంత్య్ర దినోత్సవంలో దినం కాదు ప్రధానం, ఉత్సవం అంతకన్నా ప్రధానం కాదు. స్వతంత్రం ప్రధానం. దినాలు, ఉత్సవాలు మనకు స్వాతంత్య్రాన్ని గుర్తు చేయాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మోదీ పూసిన మలాము
రాజ్యాంగం (జమ్మూకశ్మీర్‌కు వర్తింపు) ఉత్తర్వు 2019 అనే పేరుతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. అది గెజిట్‌లో ప్రచురించి దాని ప్రతిని అమిత్ షా పార్లమెంటులో ప్రకటించి తర్వాత తీర్మానంగా మార్చి ఓటింగ్‌కు పెట్టారు. పార్లమెంటు ఆమోదించిన తరువాత కేంద్ర మంత్రి మండలి.. రాష్ట్రపతి చేత ఉత్తర్వు సంతకం చేయించిందని అనుకోవాలా? లదాఖ్‌ను జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి రెండింటినీ విడివిడిగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019 రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. జమ్మూకశ్మీర్‌కు ఇక గవర్నర్ ఉండరు. కేంద్ర హోంమంత్రికి నివేదించే కింది ఉద్యోగిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. కశ్మీర్ సీఎం కన్నా శ్రీనగర్ మేయర్‌కు ఎక్కువ అధికారాలుంటాయి. ఆర్టికల్ 370 రాజ్యాంగం 21వ భాగంలోని అనేక ప్రత్యేక తాత్కాలిక నియమాలలో ఒకటి. దీన్ని అనుసరించి 1954 ఆర్డర్ ద్వారా రాష్ట్రపతి ఆర్టికల్ 35ఎ చేర్చారు. ఇది రాజ్యాంగం ప్రధానభాగంలో కనిపించదు. చివరన అనుబంధం1లో ఉంటుంది. జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసులెవరు, వారి ప్రత్యేక హక్కులు అధికారాలు ఏమిటి అని ఇది వివరిస్తుంది. 35ఏని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చకుండా 370 దారిలో చేర్చడం తప్పు అని వాదిస్తూ ఒక పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. ఆర్టికల్ 370 తాత్కాలిక నియమం. దీన్ని మార్చాలన్నా, తొలగించాలన్నా, కొనసాగించాలన్నా అధికారం జమ్మూకశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయకసభకు మాత్రమే ఉంది. రాజ్యాంగసభ తమకోసం రాజ్యాంగం రూపొందించి, ఆమోదించి, 370 కొనసాగించాలని నిర్ణయించి, అందులో మార్పులు చేయాలంటే రాజ్యాంగసభ సిఫార్సు అవసరమని నిర్ధారించి రాజ్యాంగ సభను రద్దు చేసింది. జనాభిప్రాయసేకరణ చేసి అందుకు అనుగుణంగా శాశ్వత నియమం చేసేందుకుగాను 370ని తాత్కాలికం అన్నారని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ఈ 370 ఒక మోసమని, ఈ తాత్కాలిక నియమం తొలగించాలని కుమారి విజయలక్ష్మి ఝా 2017లో ఢిల్లీ హైకోర్టులో యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కొట్టివేశారు.(https://indiankanoon.org/doc /153910827/). రాజ్యాంగంలో తాత్కాలికం అని రాసి ఉన్నప్పటికీ 370 తాత్కాలికం కాదని ఏప్రిల్ 2018లో సుప్రీంకోర్టు మరో కేసులో చెప్పింది. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు (https:// indiankanoon.org/doc/105489743/) వింటూ సుప్రీంకోర్టు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చారిత్రక కారణాలు ఆధారమని సమర్థించింది. ఎస్బీఐ కేసులో సుప్రీం కోర్టు మన రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగమనీ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అవసరమనీ, 370 తాత్కాలికం కాదనీ మళ్లీ చెప్పింది. 369 ఆర్టికల్‌కు అయిదేళ్ల కాలపరిమితి ఉంది. 370లో అదేమీ లేదు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగసభ ఆమోదం లేకుండా 370ని తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. పార్లమెంటుకు, రాష్ట్రపతికి 370(2) తాత్కాలిక నియమాల కింద లభించిన అధికారాలు జమ్మూకశ్మీర్ రాజ్యాంగసభ తుది ఆమోదంపైనే కొనసాగుతాయని 1959లో ప్రేమ్‌నాథ్ కౌల్ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం (https://indiankanoon.org/doc-/816126/) నిర్ణయించింది. జమ్మూకశ్మీర్ రాజ్యాంగసభ రద్దయిన తరువాత కూడా 370 కొనసాగుతుందని, అది ఎన్నడూ నిలిచిపోదని అయిదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. ఏ ట్రీటీలో (ఒప్పందం), అక్సెసన్ డీడ్‌లో, కోర్టు తీర్పులో, చట్టంలో, నియమాల్లో, ఆచారంలో, వాడుకలో ఏమున్నా తమ ఉత్తర్వు మాత్రమే చెల్లుతుందని ఆగస్టు 5 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నట్టు హోంమంత్రి పార్లమెంటు ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. అంతకుముందు 370ని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దారుణంగా దుర్వినియోగం చేశాయి. రాజ్యాంగంలోని కేంద్ర అధికారాల జాబితాలోని 97 ఎంట్రీలలో 94 జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. 395 అధికరణాలలో 260 వర్తిస్తాయి. 12 షెడ్యూళ్లలో 7 వర్తిస్తాయి. జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలో అనేకానేక సవరణలు చేసింది కేంద్రం. అన్నింటికీ మించి రాష్ట్రపతి పాలన విధించే 356 నిబంధన కూడ జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశారు. గవర్నర్‌ను శాసనసభ ఎంపిక చేయాలన్న రాష్ట్ర రాజ్యాంగ నియమాన్ని నీరుగార్చి గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలన్న నియమాన్ని కూడా చాలా నిశ్శబ్దంగా అందరి ఆమోదంతో మార్చేశారు. నెహ్రూ పాలనలో 1954 ప్రెసిడెన్సియల్ ఆర్డర్ ద్వారా దాదాపు మొత్తం రాజ్యాంగాన్ని, కొన్ని వివాదాస్పద సవరణ చట్టాలతో సహా జమ్మూ కశ్మీర్‌కు వర్తింపచేశారు. మిగిలిన అడుగూబొడుగూ నియమాలేవైనా ఉంటే మోదీ సర్కార్ వాటిని కూడా విస్తరించింది. ఇద్దరు ప్రధానులూ ఘోరాలు చేశారా, ఒకరిది ఘోర తప్పిదమా, మరొకరిది చరిత్రాత్మక విజయమా, ఎవరిదేది? ఎక్కువ రాజ్యాంగ నియమాలను కశ్మీర్‌కు వర్తింపచేసిన ప్రధాని ఎవరు అనే క్విజ్ పెడితే మోదీ గెలుస్తారా? షా నిలుస్తారా? మహావక్త, మంచి ప్రధానిగా పేరుతెచ్చుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయీ కశ్మీరియత్, ఇన్సానియత్, జమ్హూరియత్ ద్వారా కశ్మీర్‌తో స్నేహ సౌహార్ద సంబంధాలు పెంచుకోవాలన్నారు. మరి నెహ్రూనే కాదు వాజ్‌పేయి కూడా ఘోరతప్పిదం చేసినట్టేనా? వ్యాసకర్త: మాడభూషి శ్రీదర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, madabhushi.sridhar@gmail.com -
రాజ్యాంగమా... ఉన్నావా?
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన రెండునెలల తరువాత 2017 జూలై 11న ఒక అమ్మాయి అదృశ్యమైంది. జూలై 17న ఉన్నావ్ బాలికకు ఉద్యోగం ఆశ చూపి గ్యాంగ్ రేప్ చేశారని తేలింది. ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్, సోదరుడు అతుల్ సింగ్, మరికొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపణ. జూలై 20, 2017న ఆ అమ్మాయి కనిపించింది. ఉన్నావ్ తీసుకువచ్చారు. ఎంతో అల్లరి తరువాత ఫిబ్రవరి 24, 2018న ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యు లను బెదిరించే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆమె తండ్రి సురేంద్రను ఇంటివాళ్లు చూస్తుండగా చెట్టుకు కట్టివేసి కర్రలు, బెల్ట్, రాడ్లతో అతుల్ సింగ్, అనుచరులు దారుణంగా కొట్టారు. గాయపడిన సురేంద్రను ఏ దవాఖానా చేర్చుకోలేదు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ సురేంద్రను ఏప్రిల్ 4, 2018న అరెస్టు చేశారు. నన్నురేప్ చేశారని ఎంత మొత్తుకున్నా ఒక్కడూ వినడం లేదు. పైగా నన్ను బెదిరిస్తున్నారు, వాళ్లను అరెస్టు చేయండి, లేకపోతే మీ కళ్లముందే చస్తానని బాధితురాలు ఏప్రిల్ 8, 2018న ముఖ్యమంత్రి ఇంటిముందు ఆత్మహత్యాప్రయత్నం చేసింది. అప్పుడు దేశం మొత్తానికి ఈ ఘోరం గురించి తెలిసింది. ఏప్రిల్ 10న అతుల్ సింగ్ సహా నలుగురిని సురేంద్రను కొట్టిన కేసులో అరెస్టు చేశారు. మూడు రోజుల తరువాత ఏప్రిల్ 12న సురేంద్ర గాయాలతో చనిపోయాడు. యూపీ ప్రభుత్వం కేసును సీబీఐకి ఇచ్చింది. సెంగార్ ను ఎందుకు ఇంకా అరెస్టుచేయలే దని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్ ఐ ఆర్ లో ఆయన పేరుంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. మేం ఎందుకు అరెస్టు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారి ఓ.పి. సింగ్ అమాయకంగా ప్రశ్నించారు. ఏప్రిల్ 13న సెంగార్‌ను ప్రశ్నించడానికి తీసుకువెళ్లి మరు నాడు అరెస్టు చేశారు. స్వయంగా బాలికను సెంగార్ దగ్గరకు తీసుకువెళ్లి, లోపల రేప్ చేస్తుంటే తలుపు దగ్గర కాపలా కాసిన ఆరోపణపై శశిసింగ్ అనే మహిళామణిని సీబీఐ ఏప్రిల్ 15న అరెస్టు చేసింది. ఈలోగా ఎమ్మెల్యేగారి భక్త బృందం మా ఎమ్మెల్యే నిర్దోషి అని ఏప్రిల్ 23న ఒక ర్యాలీ తీసారు. 2018 జూలై 7న సురేంద్ర హత్యకేసులో అయిదుగురిపైన సీబీఐ నేరాలు మోపింది. 11న సెంగార్, శశిసింగ్ల పైన సీబీఐ అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. తండ్రిపైన దొంగ కేసుల కుట్ర చేసినందుకు ముగ్గురు పోలీసు అధికారుల మీద మరో ఇద్దరి మీద 13న కేసులు పెట్టారు. జూలై 31, 2018న రేపిస్టులకు మరణశిక్ష విధించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆగస్టు 18న సురేంద్ర హత్యకేసులో కీలకమైన సాక్షి యూనుస్ అనుమానాస్పదంగా మరణించాడు. డిసెంబర్ 17న రేప్ బాధితురాలి బంధువులపైన దొంగ పత్రాలు ఇచ్చారనే ఆరోపణపై శశిసింగ్ భర్త కేసు పెట్టారు. జూన్ 6, 2019న ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ సెంగార్ ను సీతాపూర్ జైల్లో కలిసి తనను జైలు నుంచే గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 20 ఏళ్ల కిందట హత్యా ప్రయత్నం చేసాడన్న పాత కేసు తవ్వి జూలై 4న బాధితురాలి బాబాయికి పదేళ్ల జైలు శిక్షవేసారు. జూలై 28న బాధితురాలి బంధువులు లాయర్ మహేంద్ర సింగ్ కలిసి ప్రయాణిస్తున్న వాహనానికి యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు చనిపోయారు. జూలై 29న రాజ్యసభలో సెంగార్ నేరచరిత్రపైన గందరగోళం జరిగింది. 30న ఇండియాగేట్ దగ్గర నిరసనలు చేశారు. బీజేపీ అతన్ని పార్టీనుంచి బహిష్కరించినట్టు తాజా వార్త. బాధితురాలు, ఆమెలో ధైర్యం బతకాలి. లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్‌ను తట్టుకుని తనను బలాత్కరించాడని నమ్మించేట్టు చెప్పగలిగితేనే ఈ ఎమ్మెల్యేగారు అసెంబ్లీకి కాకుండా జైలుకు వెళ్లగలుగుతాడు. నిర్దోషిగా విడుదలైతే, మంత్రులంతా వెళ్లి పూల మాలలతో స్వాగతం చెప్పి వీలైతే మంత్రిని చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఆయనచే ప్రమాణం కూడా చేయిస్తారేమో, ఎవరికి తెలుసు? యూపీలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఎంత యోగి అయితే అంత ఆత్మవిశ్వాసం అన్నమాట. యోగులు కాని మనవంటి వారికి అది అర్థం కాదు. ఆయనకు మించిన ఆత్మవిశ్వాసం కలిగిన యోధుడు సెంగార్. ఎందుకంటే ఆయన గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సీబీఐ పోలీసు కస్టడీలోనే ఉన్నా, అత్యంత యాదృచ్ఛికంగా ఇక్కడ ప్రమాదం జరిగిపోయింది. రాయ్‌బరేలీ దగ్గర జరిగిన ప్రమాదంలో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోయారు. బాధితురాలు తమపై ఇది హత్యాకుట్ర అని ఫిర్యాదు చేసిన తరువాత జూలై 29న యూపీ పోలీసులు సెంగార్ మరో తొమ్మిది మంది పైన హత్యకేసు నమోదు చేశారు. తెలుగు సినిమా కథ కాదిది. యోగి, మహా రాజ్ అని పేర్లుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లో ఎంఎల్యేలు, ఎంపీలు మంత్రులు సాగి స్తున్న దురన్యాయాలు. కీచక రాజకీయ వేదిక ఉన్నావ్ రాజ్యాంగాన్ని ఉన్నావా అని అడుగుతున్నది. వ్యాసకర్త :మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ -
ఆర్టీఐకి మరణశాసనం
ప్రధానమంత్రి మోదీ పారదర్శకత అంటే చాలా ఇష్టపడతారు. అవినీతిని సహించేది లేదని పదేపదే చెప్పారు. గుజరాత్లో అనేకసార్లు, కేంద్రంలో ప్రధానిగా రెండుసార్లు గెలిపించారంటే మోదీ మాటను జనం పూర్తిగా నమ్మారని నమ్మక తప్పదు. పారదర్శకతను పెంచడానికి మాత్రమే ఆర్టీ ఐని సవరిస్తున్నానని మంత్రిగారు, బీజేపీ అధికార ప్రతినిధులు నమ్మబలుకుతూనే ఉన్నారు. ప్రభుత్వం దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని, గుట్టు దాచడంకన్న విప్పి చెప్పడంలోనే వారి శ్రేయస్సు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ, పదిరూపాయలు పడేసి ఆర్టీఐ కింద ఓ దరఖాస్తు రాసేసి మా ప్రాణం తీస్తున్నారని ప్రభుత్వ పెద్దలు కోప్పడుతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని నిస్తేజం చేయడానికి కేంద్రం దాదాపు తొమ్మిది నెలల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కాస్త వెనుకంజ వేసింది. తరువాత మే నెలలో జరిగిన ఎన్నికలలో ప్రజలు అద్భుతమైన రీతిలో విజయం కట్టబెట్టడంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే సాహసిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సవరణ తంతు పూర్తి చేసి సమాచార కమిషనర్లను తమ కింది స్థాయి ఉద్యోగులుగా మార్చడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నది. లోక్‌సభలో, రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. రాష్ట్రపతి అయినా దీని మీద సంతకం పెట్టకుండా ఆపుతారేమోననుకుంటే అది దింపుడు కళ్లం ఆశేనేమో. ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషన్‌తో సమా చార కమిషనర్‌కు సమాన స్థాయి, హోదా, అధికారం వేతనం ఉండాలని చట్టం నిర్దేశించింది. ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కలిగి ఉంటారు. అయిదేళ్లు లేదా 65 సంవ త్సరాల వయసు ఏది ముందైతే ఆ కాలానికి పదవి ముగుస్తుందని చట్టంలో చేర్చారు. అంటే ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై కమిషనర్ మనుగడ ఆధారపడదు. కనుక ప్రభుత్వ పెద్దల ఆగ్రహానుగ్రహాలతో సంబం ధం లేకుండా సొంతంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పెద్ద అధికారులు తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని పౌరుడు ఈ చట్టం కింద తెలుసుకునే హక్కు పొందాడు. నిజానికి ఈ సమాచారం వెల్లడికావడం వల్ల ఎవరికీ హాని ఉండదు. కానీ వెల్లడైన ఈ సమాచారం ద్వారా అందాకా దాగిన రహస్యాలు బయటపడితే జైలుకు పోయే ప్రమాదం కూడా వస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారు. ఈ భయం ఆర్టీఐకి ఎసరుగా మారింది. ఆర్టీఐ పూర్తిగా తీసివేయడానికి కూడా ఈ పాలకులకు భయమే. కనుక ఆర్టీఐ కోరలు పీకాలి. కాటేయడానికి వీల్లేని పాముగా మార్చి, వారి నాగస్వరానికి నాట్యం చేసే బానిసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ స్థాయిని సమాచార కమిషనర్‌కు ఇవ్వడం తప్పు కనుక తగ్గిస్తాం అని చట్టం లక్ష్యాల ప్రకటనలో పేర్కొన్నారు. తగ్గించనీ అనుకుందాం. ఏ స్థాయికి తగ్గిస్తారు? ఆ విషయం రహస్యం. పోనీ తగ్గించే జీతం ఎంత? అయిదేళ్ల పదవీకాలాన్ని ఎంత కాలానికి తగ్గిస్తారు? అదీ చెప్పరు. మామూలు జనాలకే కాదు, పార్లమెంటు సభ్యులకు కూడా చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామని చెబుతూ, సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెం టుకు కూడా చెప్పకుండా దాచడమే పారదర్శకత పెంచడమా? తాము నిర్దేశించబోయే నియమాలకు అనుగుణంగా కమిషనర్ స్థాయి నిర్ణయిస్తామని చేర్చ డమే ఈ చట్టం సవరణ. అంటే స్థిరంగా ఒక పాలసీ లేదు. ప్రభుత్వంలో ఎవరుంటే వారి ఇష్టం వచ్చిన రీతిలో స్థాయిని నిర్ణయించుకోవచ్చు అని దీని అర్థం. ఉదా‘‘కు... ఓసారి ఇద్దరు కమిషనర్లను నియమించా లనుకుంటే అప్పుడు కొన్ని సూత్రాలు కనిపెడతారు. ఓ రెండేళ్ల పదవీకాలం, జాయింట్ సెక్రటరీ హోదా అని, ఆ తరువాత రెండేళ్లకు వచ్చే ఖాళీలు పూరించడానికి పూనుకున్నప్పుడు మూడేళ్ల పదవీకాలం, డిప్యూటీ సెక్రటరీ హోదా అని కూడా అనవచ్చు. రాష్ట్రాలు నియమించే కమిషనర్లకు కూడా కేంద్రమే హోదాను, వేతనాన్ని, పదవీకాలాన్ని నిర్ణయిస్తుందట. జనం అడిగిన సమాచారం ప్రభుత్వానికి ఇబ్బందికరమైతే ఇవ్వకూడదు అన్నది పైకి చెప్పని ఆదేశం. బహిరంగ రహస్యం. కాగితాల మీద కనిపించదు. సమాచార హక్కు సవరణను కనుక రెండు సభలు ఆమోదిస్తే, ఇక మళ్లీ సవరించే అవసరం లేదు. ఆ చట్టంలో మిగిలేది ఏమీ ఉండదు కనుక. ఈ బిల్లును అత్యంత రహస్యంగా కాపాడి, సభ్యులు చదువుకుని మార్పులు ప్రతిపాదించే వీలు లేకుండా బిల్లు ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పి, హడావుడిగా ముందుకు తోశారు. ఈ హక్కును అమలులో నీరుగార్చేందుకు, అనేక ప్రభుత్వ విభాగాలలో ఒకదానిగా మార్చి అనుబంధ శాఖగా మార్చేందుకు వేసిన పకడ్బందీ ప్రణాళిక అని స్పష్టంగా విశదమవుతూ ఉన్నది. పార్లమెంటు నుంచి అధికారాన్ని గుంజుకునే సవరణ ఇది. ఇది ఆర్టీఐ కమిషనర్ వ్యవస్థకు మరణశాసనం. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అడవి దొంగలెవరు?
సుప్రీంకోర్టు ముందున్న సమస్య, కాగజ్‌నగర్ మండలంలో సార్సాల శివార్ల అడవుల్లో జరిగిన దాడులను విచారిస్తున్న పోలీసుల ముందున్న సమస్య ఒకటే. ఎవరు అడవులను ఆక్రమిస్తున్నారు? తరతరాలనుంచి అడవుల్లో ఉంటున్న ఆదివాసులను ఎవరు తరిమేస్తున్నారు? పోడు వ్యవసాయం కొన్ని తెగల ఆదివాసులకు జీవన వృత్తి. గిరిజనేతర వ్యాపార రాజకీయ శక్తులకు అది లాభదాయకమైన వ్యాపారం. ఆదివాసులకు అడవుల్లో బతికే హక్కు, అటవీ ఉత్పత్తులను వాడుకునే అధికారం ఇవ్వాలని శతాబ్దాల కాలం నుంచి సాగిన ఉద్యమాల ఫలితంగా 2006లో అటవీవాసుల హక్కులను గుర్తిం చారు కాని విధివిధానాలను ఎంత దుర్మార్గంగా వక్రీకరిస్తున్నారో తెలియదా? ఆక్రమణ దారులెవరో అటవీ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యేలు ఎవరికి అండగా ఉన్నారో తెలియదా? ఆక్రమణ దారుల అవినీతికా లేక ఆదివాసుల హక్కులకా ఈ చట్టాలు? అడవిలో సంపదను చూస్తున్న ప్రభువులకు ఆదివాసుల బ్రతుకులు కనిపించడం లేదా? ఆంగ్లేయుల పాలన, నిజాంపాలనలో కూడా ఇదే సమస్య తలెత్తింది. నిరంకుశ పాలన సాగిస్తున్న అటవీ అధికారులపైన, వారిని వాడుకుంటున్న పాలకులమీద ఉద్యమించారు. ఆస్ట్రియన్ సామాజిక శాస్త్రవేత్త హైమండార్ఫ్ నిజాం ఆహ్వానం పైన తెలంగాణ జిల్లాలకు వచ్చి ఆదిలాబాద్ తదితర ఆదివాసుల పరిస్థితులు పరిశీలించి వారికోసం ప్రత్యేక హక్కులను గుర్తించి అమలు చేయవలసిన అవసరం ఉందని వివరించాక కొంత అర్థం అయింది. గిరి జనుల భూములను గిరిజనులకే ప్రత్యేకించాలనే చట్టాలు కూడా వచ్చాయి. వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కింద గిరిజనేతరులు భూములు కొన్నా వాటిని తిరిగి గిరిజనులకు ఇప్పించడానికి అధికారులకు, ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చారు. అభివృద్ధి చేస్తాం అంటూ అడవుల్లో జొరబడి, అమాయకులైన వారిని మోసం చేసి, వారి భూములు ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం అభివృద్ధి అనీ, ఆక్రమించిన వారిలో కూడా పేదలు ఉన్నారని వారిని వెళ్లగొడితే హక్కులకు భంగం అని వాదించే మేధావులు చాలా మందే ఉన్నారు. డబ్బు సంపాదించడం, ఎన్నికల్లో గెలవడం తప్ప మరో లక్ష్యంలేని పార్టీలు, నేతలు పుట్టుకొచ్చిన ఈ కాలంలో ఆదివాసుల బతుకుల గురించి వారికి అర్థమయ్యేట్టు చెప్పడం సాధ్యమా?గిరిజనేతరులపై భూమి ఆక్రమణ నిషేధ చట్టం వన్ ఆఫ్ సెవెంటీకి తూట్లుపొడిచిన వారెందరో. అధికారులు ఆదివాసులను వెళ్లగొట్టి అడవులను ఆక్రమించి టేకును, ఎర్రచందనాన్ని ఇతర అటవీ సంపదను స్మగ్లింగ్ చేస్తూ ధనికులైపోతున్నారు. రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు. గెలిచే గుర్రాల పేరిట ఈ నేర సంపన్నులకే పార్టీ టికెట్లు అమ్ముకుని ఎమ్మెల్యేలుగా మార్చుతున్నారు. అటవీ అధికారులమీద పెత్తనం చెలాయించి తాము, తమ సోదరులు, అనుయాయులు ఆక్రమించిన భూములను రక్షించుకోవడానికి ఇటువంటి ఎమ్మె ల్యేలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. అడవులను డొల్లచేసే నాయకులు ఎమ్మెల్యేలవుతారు. వారు కూడా పార్టీ ఫిరాయిస్తారు. దోచుకో, దాచుకో, కష్టమైతే పార్టీ మారు, అనే విధానానికి రాజకీయపార్టీలు ముగింపు పాడేదాకా అడవులు ఆక్రమిస్తారు, గనులు తవ్వుకుం టారు, ఏవో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప పార్టీ ఫిరాయింపులన్నీ దోచింది దాచడానికే. ఆదివాసుల హక్కులపై అటవీ అధికారులు అన్యాయంగా చేస్తున్న దాడులు నిజమైన ఆదివాసులకు హాని కలిగిస్తున్నాయి. పై అధికారులు, రాజ కీయ నాయకులు మొత్తం అడవులకే ఎసరు పెడుతూ ఉంటే, కింది అధికారులు అవినీతిపరులై పోతున్నారు. అన్నలు ఎమ్మెల్యేలయితే తమ్ములు ఏ వ్యాపారమైనా చేస్తారేమో అని ఇటీవల సిర్పూర్ కాగజ్ నగర్ సార్సాల గ్రామంలో అటవీ అధికారిణి అని తపై జరిగిన దాడి నిరూపిస్తున్నది. ఎమ్మెల్యేగారు తమ్ముడిని రక్షించడానికి జనం ఏ విధంగా అబద్ధం చెప్పాలో ప్రబోధిస్తున్న వీడియో కూడా వైరల్‌గా ప్రసారం అవుతున్నది. 2009లో కోనేరు కోనప్పను స్మగ్లర్ వీరప్పన్‌తో పోల్చుతూ కేసీఆర్ ప్రచారం చేసిన నాటి వీడియోలు కూడా ప్రసారంలో ఉన్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచిన ఇతడిని తర్వాత తెరాస లోకి చేర్చుకున్నారు. ఇన్నాళ్లకు ఈ వీడియోలు బయటపడ్డాయి. ఈ విధంగా సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అధికార ఎంఎల్ఏపై కూడా కేసులుంటాయా? సోషల్ మీడియా ప్రభావంతో నేరాలపై వెల్లడవుతున్న ఎలక్ట్రానిక్ రికార్డులకు చట్టం ప్రకారం సాక్ష్య విలువ ఇచ్చారు. ఇవి కత్తిరించి అతికించినవి కావని ప్రయోగశాలలో తేలితే చాలు.. ఇందులో ఉన్న అంశాలను నిజాలుగా భావించాలి. న్యాయస్థానాలు ఇంట ర్నెట్లో ఉన్న పత్రాలకు, దృశ్యాలకు మళ్లీ బలపరిచే సాక్ష్యాలు అడగకుండా నేరగాళ్లను పట్టుకుని శిక్షించకపోతే ఈ దురన్యాయాలకు సాక్ష్యాలే ఉండవు. కొత్త టెక్నాలజీతో కొత్త నేరాలు చేసే ప్రభుత్వ నేరగాళ్లకు శిక్షలు పడేదెట్లా? వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు పుల్వామాలో మన కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళం జవాన్లు 40 మందిని బలిగొన్న టెర్రరిజం భూతానికి మూలాలు కనుగొని దాన్ని కూకటివేళ్లతో సహా పెరికివేయడానికి మార్గాలు వెతకవలసిన రోజులివి. భయంకరమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు ఫిబ్రవరి 8న హెచ్చరిక జారీ చేశారు. ‘మీరు వెళ్లే రోడ్డును పేలుడు పదార్థాలను పూర్తిగా ఏరిపారేసి శుధ్ధి చేయండి. ఎందుకంటే పేలుడు పదార్థాలు వాడే అవకాశాలున్నట్టు మాకు సమాచారం అందింది. చాలా అర్జంట్ విషయం’ అని జనరల్ పోల్ కశ్మీర్ జోన్ వారు పీసీఆర్ కశ్మీర్ ద్వారా సమాచారం పంపారు. ఈ సమాచారం ముందే అందినా ఈ దారుణాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించే మార్గంలోకి ఆ వ్యాన్ ఎలా రాగలిగింది? దాన్ని అడ్డుకోలేకపోయారా? అసలు చెక్‌పోస్ట్‌లే లేవా? పోనీ లేవనే అనుకుందాం. వేలాదిమంది జవాన్లను రోడ్ మార్గం ద్వారా తరలించే ముందు సెక్యూరిటీ కోసం అప్పుడైనా చెక్ చేయరా? జమ్మూ శ్రీనగర్ హైవేలో ఆర్డీఎక్స్ నింపిన వాహనాలను చెక్ చేయడానికి మూడు చోట్ల బారి యర్లు ఉండేవి. కానీ ఈ బారియర్లను మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో నడిచిన సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని, అందుకే పుల్వామా జవాన్లమీద దాడిచేసిన వాహనాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారని జేఎన్‌యూలో లా గవర్నెన్స్ అండ్ డిజాస్టర్ స్టడీస్ ప్రొఫెసర్ అమితా సింగ్ విమర్శిం చారు. ఆయనపై ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతకుముం దున్న బారియర్లను తొలగించారా లేదా అన్నది ప్రశ్న. తొలగిస్తే ఎందుకో చెప్పాలి. తొలగించకపోతే ఆ విషయం రూఢీగా చెప్పాలి. కానీ ప్రొఫెసర్‌ను దుర్భాషలాడి ఏం ప్రయోజనం? మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ ఒక టీవీ చర్చలో పాల్గొంటూ ఆ రోడ్ మీద చెక్‌పోస్టులను, బారియర్లను ముఫ్తీ ఆదేశాలవల్ల తొలగించారని చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. అక్కడ బారియర్లను తొలగించడం వల్లనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పాలనాపరమైన నిర్లక్ష్యాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల టెర్రరిస్టు ఘాతుకాలు ఆపగలిగి కూడా ఆపలేకపోతున్నారేమోనని ఈ రెండు వాదాలు విన్న తరువాత జనం అనుమానించవలసి వస్తుంది. ఫిబ్రవరి 16న సుబ్రమణ్య∙స్వామి ఒక ట్వీట్ చేశారు. ‘‘2014లో ఒక మారుతీ కార్ మూడు చెక్ పాయింట్లను దాటుకుని దూసుకు పోయిందని, ఆ కారుపైన కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరు అనుమతించారు? ఆ ఉత్తర్వు ఇచ్చిన వ్యక్తి జవాన్ల మరణానికి బాధ్యత వహించాలి. ఆ ఆర్మీ జవాన్లు ఇంకా జైల్లో ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇండియా టుడే వారి ఫేక్ న్యూస్ వ్యతిరేక వార్ రూం విభాగం వారు ఇందులో నిజానిజాలను పరిశోధించారు. బక్షీ చెప్పిన సంఘటన నవంబర్ 3, 2014 ఛట్టెర్గాం (బుద్గాం జిల్లా)లో జరిగింది. అయిదుగురు యువకులు ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయనీ, 53వ రాష్ట్రీయ రైఫిల్ మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారనీ, ఈ సంఘటనపై భిన్నవాదాలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ఉటంకిస్తూ ఇండియా టుడే వివరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నారని పీడీపీ అధికారంలోకి ఇంకా రాలేదని వివరించారు. కాల్పులు జరిపిన వారిపై చడూరా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 231 – 2014లో నమోదయింది. ఆర్మీ అధికారులు కూడా కాల్పులు జరపడం పొరబాటే అని అంగీకరించారు. 9 మంది సైనికులమీద కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీలో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు. కానీ ఎవరినీ జైలుకు పంపలేదు. ఈ విషయాన్ని బక్షీకి తెలియజేస్తే, ఆయనకూడా పొరబాటు తెలుసుకున్నారని తేలింది. అయినా íపీడీపీ ప్రభుత్వం సెక్యూరిటీ చెకింగ్‌ను సడ లించడం వల్లనే కశ్మీర్ లోయలో కల్లోల సంఘటన జరిగిందని బక్షీ విమర్శించారు. తప్పుడు వార్తలను ఖండించి నిజానిజాలు తెలియజేయడం గొప్ప సేవ. టీవీ చర్చల్లో, ట్వీట్ వ్యాఖ్యల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ నిబంధనలు సడలించడం, బారియర్లు తొలగించడం తప్పుడు నిర్ణయాలు కావా? పేలుడు పదార్థాలు నింపుకున్న వాహనం సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొనడం నిజం, అందాకా ఆ వాహనాన్ని ఎవరూ చెక్ చేయలేదనేది నిజం. వేలాది మంది జవాన్లను తరలించడానికి రోడ్డు దారి భద్రం కాదని, హెలికాప్టర్ల ద్వారా పంపాలని కోరినా నిరాకరించడం కూడా నిజం. నిజానిజాలను పరిశోధించాల్సిన బాధ్యత, నిజాలను జనం ముందుంచాల్సిన బాధ్యత లేదా? పాలనా వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు ఎంతటి దారుణాని కైనా దారితీస్తాయి. తప్పుడు వార్తలు ఆ దారుణాలను ఇంకా మండిస్తాయి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
హైదరాబాద్: చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటారు కానీ అది ఎప్పటికీ జరగడం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగబద్ధ సంస్థలు– చట్టబద్ధ పాలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. అవినీతి నేరాలను పరిశోధించటం కోసం ఏర్పాటుచేసిన సంస్థపైనే ఆరోపణలు వస్తే ఇక అవినీతిని నిరోధించడం ఎలా అని ప్రశ్నించారు. సమాచార చట్టం కింద సీబీఐని ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. సీబీఐలో ఉన్న 11 మందిని తీసేశారని, వారిని ఎక్కడికి బదిలీ చేశారో ఇంతవరకు తెలియదన్నారు. సీబీఐ డైరెక్టర్‌ను ఒక్కసారిగా తీసివేస్తే ఉన్న కేసు విషయాలు ఎవరు విచారణ చేపట్టాలని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టర్‌ను నియమించే సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇక సీబీఐ కన్నా గొప్ప సంస్థ ఆర్బీఐ అని, సీబీఐలో దొంగలు కనపడతారు కానీ ఆర్బీఐలో కనబడరని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చి పారదర్శకత కోసం మా సమాచారం ఇస్తామని ముందుకు రాదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పాలిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఎస్.వినయ్‌కుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
నోటా నొక్కద్దు, ఓటేసి గెలవండి
‘పోటీలో ఉన్నవారెవరికీ నేను ఓటు వేయను’ అని ఓ హక్కును సుప్రీంకోర్టు 2013లో సృష్టించింది. ఇది హక్కు కాదు పెద్ద చిక్కు. ఎన్నికల్లో కావలసిన సంస్కరణలు తేకుండా, వద్దనే హక్కు నివ్వడం ఏ ప్రయోజనమూలేని మార్పు. ఓట్లు చీల్చి బలీయమైన ఒక అభ్యర్థిని ఎన్నుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదు. ఇంతకు ముందు కూడా ఈ గొప్ప హక్కు ఉందని చాలామందికి తట్టదు. మనకు ఏ ఎన్నికల్లో నైనా 80 శాతంకన్న ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం అరుదు. సగటున 70 శాతం మంది ఓటు వేస్తారనుకుంటే 30 శాతం మంది నోటాను నోటి మాటతో వాడుకున్నట్టేకదా. ఈ నోటాను తిరస్కార హక్కు అని కూడా వర్ణిస్తున్నారు. ఎవరిని తిరస్కరిస్తున్నారు? అభ్యర్థినా, మొత్తం ఎన్నికనా? లేక అన్ని పార్టీలను కలిసి తిరస్కరిస్తున్నారా? లేదా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడే మళ్లీ పోటీచేస్తే వద్దంటున్నారని భావిం చాలా? మళ్లీ పోటీలో ఉన్న ఎమ్మెల్యేను కాకుండా మరొకరిని ఎన్నుకొంటే అది కూడా తిరస్కార ఓటు కదా? ఒక్క మాజీ ఎమ్మెల్యేనేమిటి మొత్తంగా ప్రభుత్వాన్ని కూడా తిరస్కరించి కొత్త పార్టీని గద్దెనెక్కించే హక్కు అధికారం ఓటర్లకు ఇదివరకే ఉంది. తిరస్కార ఓటు వేయడానికి వేరే రిజిస్టర్లో సంతకం చేసి విడి బ్యాలెట్ వాడేవారు. నోటాతో వచ్చిన కొత్త హక్కు ఏదీ లేదు. సీరియస్‌గా గెలవడానికి కాకుండా ఊరికే పోటీ చేసే వారితో అగమ్యగోచరంగా తయారైన బ్యాలెట్ పొడుగు పెంచి మరో మీట పెట్టడమే ఘన విజయం. ప్రజాప్రతినిధిగా సరిగ్గా వ్యవహరిం చని బాధ్యతారహితుడైన నాయకుడిని వెనక్కి రమ్మనడానికి ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తే అందులో మెజారిటీ వస్తే అది రీకాల్ హక్కు. అది లేదు. నోటా అంటే అది కాదు. ఈరోజుల్లో ఎన్నిక ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా లేక పరోక్ష మోసాలవేదికా? ఒక పార్టీ తాను గెలవడం కోసం పోటీ చేయడం లేదు. గెలవగలదనుకున్న రెండో పార్టీని ఓడించడానికి వీలుగా వారి ఓట్లను చీల్చడానికి పోటీ చేస్తున్నారు. మూడో పార్టీ పోటీ చేయకుండా తన బలగాన్ని బలాన్ని నాలుగో పార్టీకి అనుకూలంగా వాడుకోవడం ఎన్నికల వ్యూహమట. బలమైన అభ్యర్థికి పోటీగా ఆయన కులానికి లేదా మతానికి చెందిన మరొకరిని నిలబెట్టి ఆయనకు విపరీతంగా డబ్బు పెట్టుబడి పెట్టడాన్ని చాణక్యంగానూ గొప్ప వ్యూహంగానూ అభివర్ణిస్తున్నారు. ఒకటో పార్టీ తమను ఇన్నాళ్లూ వ్యతిరేకించి దుమ్మెత్తిపోసిన రెండో పార్టీకి విపరీతంగా డబ్బిచ్చి వారి అభ్యర్థుల్ని కూడా ఎంపికచేసే దౌర్భాగ్యం. మమ్మల్ని తిట్టినా ఫరవాలేదు, మీరు గట్టిగా ప్రచారం చేసి అయిదారు వేల ఓట్లు సంపాదించండి చాలు, మిగతాదిమేం చూసుకుంటాం అంటారు. ఒక నీతి, నియమం, రీతి, రివా జులేని వ్యక్తులు, పార్టీలు పుట్టుకొచ్చిన ఈ రోజుల్లో ఎవరు నిజమైన అభ్యర్థిగా మన ముందు సీరియస్ పోటీ ఇస్తున్నాడో తెలియడం లేదు. ఈ మురికి కొత్తగా వచ్చింది. దీన్ని నోటా కడిగి వేస్తుందా? మన ఎన్నికల విధానాన్ని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానం అంటారు. పోటీలో ఉన్న వారిలో మిగిలిన వారికన్న ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా సరే అతన్ని ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఆయన గారు అయిదేళ్లు మనకు ప్రతినిధిగా కాకుండా ప్రభువుగా వ్యవహరిస్తారు. ఓ సారి అస్సాం ఎన్నికలను ప్రత్యర్థులు బహిష్కరించారు. అయినా పోలీసులు సైనిక దళాల సాయంతో ఎన్నికలు నిర్వహించారు. లక్ష ఓట్లు ఉన్న నియోజక వర్గంలో ఇరవై ఓట్లు మాత్రమే పోల్ కావడం, 99 వేల 980 మంది నోటా అనడం, మిగిలిన 20 మందిలో నాలుగు ఓట్లు చెల్లకపోవడం, 16లో సగం కన్న తక్కువ 7 ఓట్లే వచ్చినా, మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు నాలుగు, అయిదు ఓట్లు రావడం వల్ల గెలవడం జరిగిపోయింది. ఇంతకన్న దారుణ ప్రహసనం మరొకటి ఉండదు. అయితే అంకెలు కాస్త పెరిగి 30 వేలు ఓట్లువచ్చిన నేత, 29 వేల 990 వచ్చిన వ్యక్తిమీద పది ఓట్ల ఆధిక్యత కలిగిన అభ్యర్థిగా గెలుస్తాడు. ఓటు వేయని వారిని, ఇతరులకు ఓటు వేసిన వారిని కలుపుకుంటే గెలిచిన నేతకు మొత్తం ఓట్లలో 30 శాతం రాకపోయినా మొత్తం నియోజక వర్గానికి ప్రతినిధి అవుతారు. ప్రతి ఓటరు పోలింగ్ బూత్‌కు స్వయంగా రావడం ఎంత ముఖ్యమో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎంచుకోవడం కూడా అంతే అవసరం. అయిదేళ్ల తరువాత వచ్చిన అరుదైన అవకాశం, మనకు ఇచ్చిన వాగ్దానాలు చెల్లించని అభ్యర్థిని ఓడించే అవకాశం, నమ్మదగిన వాగ్దానాలుచేసి మనతో ఉంటాడనుకున్న అభ్యర్థిని గెలిపించే అవకాశం వాడుకోవలసిందే. అంతేగాని నోటా మీట నొక్కితే మన నోరు మనం నొక్కుకున్నట్టే. వ్యాసకర్త మాజీ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
విరమణతోనూ దక్కని పింఛను
దశాబ్దాలు పనిచేసి రిటై రైన వారికి నెలనెలా పింఛ ను ఇవ్వాలని పీఎఫ్ చట్టం 1952, పింఛను పథకం 1995 స్పష్టంగా నిర్దేశి స్తున్నాయి. కానీ విరమణ చేసి చాలా ఏళ్లు గడచినా పెన్షన్ దక్కని బెనర్జీ అనే వృద్ధుడి పక్షాన ప్రవీణ్ కోహ్లీ అనే వ్యక్తి పోరాటం జరిపాడు. వినియో గదారుల కమిషన్ బెనర్జీకి అనుకూల తీర్పుఇచ్చినా పింఛను ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? అంటూ కోహ్లీ కొన్ని ప్రశ్న లు వేశాడు. పీఎఫ్ ఆఫీస్ నిష్క్రియ వల్ల బెనర్జీ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. తన మిత్రుడు బెనర్జీ తరఫున కోహ్లీ వేసిన ఆర్టీఐ దరఖాస్తుతో పని జరిగింది. కోల్‌కతాలో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి కోసం గుర్గావ్ నుంచి అతని మిత్రుడు ఆర్టీఐ దర ఖాస్తుపెడితే, ఢిల్లీ దగ్గరి గుర్గావ్ నుంచి కోల్‌కతా వచ్చి దస్త్రాలు చూసుకుని ప్రతులు తీసు కోవాల న్నారు. దీంతో రెండో అప్పీలులో కోహ్లీ తన మిత్రు డు కష్టాలు ఏకరువు పెట్టారు. 1969లో సర్వీసులో చేరి 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన బెనర్జీకి నెల పింఛనుకు అర్హుడు. కానీ ఇవ్వలేదు. కోల్‌కతా జిల్లా వినియో గదారుల ఫోరంలో కేసు ఓడిపోయాడు. రాష్ట్ర కమిష న్ బెనర్జీకి పింఛను అర్హత ఉందని వెంటనే చెల్లిం చాలని ఆదేశించింది. విరామం లేకుండా 33 ఏళ్ల 7 నెలలు పనిచేసిన బెనర్జీకి పింఛను ఆపాల్సిన కారణ మే లేదని, పింఛను పథకం కింద మూడునెలల్లో ఆయన పింఛను లెక్కించి 2002 సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి పింఛను ఇవ్వాలని ఆదేశించింది. 26వేల 400 రూపాయలు తప్ప మరే ఇతరమైన తగ్గింపులు చేయరాదని, నెల రోజుల్లోగా బెనర్జీకిS పింఛను బకాయిలన్నీ చెల్లిం చాలని, అన్యాయంగా పింఛను ఇవ్వనందుకు జరి మానాగా 12 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఆదేశించింది. కానీ, ఏదో అన్యాయం జరిగినట్టు కోల్‌కతా ఈపీఎఫ్ జాతీయ వినియోగదారుల కమి షన్ కు అప్పీలు చేుసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఉత్తర్వును ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ హుందాగా గౌరవించాల్సింది. కానీ అన్యాయంగా జాతీయ ఫోరం దాకా లాగడం న్యాయం కాదు. పీఎఫ్ సంస్థ ఈ ఉద్యోగికి ఇచ్చే స్వల్ప పింఛను కన్నా చాలా ఎక్కువ డబ్బు ఖర్చుచేసి ఈ అప్పీలు వేసి ఉంటుందని జాతీయ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంత జరిగాక కూడా ఆ పేద కార్మికుడిపై ఈపీఎఫ్ పగ బట్టినట్టు సుప్రీంకోర్టులో జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెల్లదని దుర్మార్గంగా అప్పీలు దాఖలు చేసింది. తరువాత ఎవరో పుణ్యాత్ముడైన అధికారి ఆదేశాల మేరకు ఈ అప్పీలును ఉపసంహరించుకుంది. ఇప్పుడైనా పింఛను ఇస్తారేమో అనుకుంటే బెనర్జీకి నిరాశే ఎదు రయింది. తీర్పు అమలు చేయలేదు. కేవలం ఒక నెల వేయి రూపాయల పింఛను ఇచ్చి, ‘‘ఇంతే. నీకేమీ రాదు. నీ పింఛనుసొమ్మంతా సంస్థ స్వాధీనం చేసు కుంది,’’ అని ఈపీఎఫ్ నిర్దయగా ఉత్తర్వులు జారీ చేసింది. బెనర్జీ పింఛను నిరాకరణ కథ ప్రభుత్వ హింస, సర్కారీ క్రూరత్వానికి ఒక ఉదాహరణ. జాతీ య వినియోగదారుల కమిషన్ తీర్పును కూడా అమ లు చేయకపోవడం అన్యాయం అని అతను మొర బెటు ్టకుంటే వినేవాడు లేడు. ప్రధానమంత్రికి, కేంద్ర కార్మి క శాఖ కార్యదర్శికి విన్నపాలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ దయ రాలేదు. కనీసం పీఎఫ్ ఛీఫ్ కమిషనర్ అయినా వినిపించుకుంటారేమో అనుకు న్నారు. కానీ ఆయనకు కూడా తీరిక లేదు. ఆ దశలో ఆర్టీఐ దరఖాస్తు వేస్తే అది కూడా దున్నపోతుమీద వానే అయింది. జితేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ అనే సామాన్య ఉద్యోగికి జార్ఖండ్ ప్రభుత్వం పింఛను నిరాకరించడమేగాక, ఈ విషయమై ఈ విధంగానే సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఉద్యోగ విరమణ చేసిన సామాన్య పౌరుడిపై పోరాడింది. పింఛను, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు కావు. అది వారి రాజ్యాంగ హక్కు (300 ఏ). వారి ఆస్తి. ప్రభుత్వం వాటిని అకారణంగా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. పైగా పింఛను, గ్రాట్యుటీ మొత్తాలను నిలిపివేసి, స్వాధీనం చేసుకునే అధికా రాన్ని ప్రభుత్వానికి ఏ చట్టమూ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఉద్యోగుల పింఛను పథకం –1995 ప్రకారం ఉద్యోగుల యజ మానులు లేదా సంస్థలు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆ సంస్థల నుంచి జరిమా నా, నష్టపరిహారాలను వసూలు చేయాలని పన్నెండో నియమం అధికారాన్ని ఇస్తున్నది. మొత్తం దస్తావే జుల ప్రతులు బెనర్జీకి ఇవ్వాలని, నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూ డదోచెప్పాలని, కార్మికుడిని వేధిం చినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. (ప్రవీణ్ కోహ్లీ వర్సెస్ ఇపీఎఫ్ఓ కొల్కత్తా ఇఐఇ/ఉ్కఊౖఎ/అ/2018/153919 కేసులో 28.9.2018 నాటి ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఫైళ్ల దొంగను పట్టుకునేదెవరు?
విశ్లేషణ విజేంద్రసింగ్ జఫా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. తప్పుచేసిన వాడు తన బాస్ అయినా సరే జఫా బాణం గురి తప్పేది కాదు. అవినీతిపరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నవభారతంలో ఇలాంటి అధికారికి ఎదురయ్యే కష్టాలు ఊహించ వచ్చు. తనను కొందరు ఇబ్బందుల పాలు చేసే తప్పుడు ఆరోపణలు కల్పించి, విచా రణ పేరుతో వేధిస్తూ నిందలు మోపారని, వాటి సంగతేమిటో చెప్పాలని ఆర్టీఐ కింద జఫా అడిగారు. రిటైరై 23 ఏళ్లయినా ఈ నిందల సంగతి తేల్చడం లేదని, ప్రశాంతంగా బతక నీయడం లేదనీ జఫా అన్నారు. సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖను విభజిం చడానికి ముందు దానితో ఉన్న విజిలెన్స్ విభాగాన్ని అడగాలని ఓ సీపీఐఓ జవాబిచ్చారు. సామాజిక న్యాయ శాఖ నుంచి ఆదివాసీల మంత్రిత్వ శాఖను 1999లో విభజించారని, కాని ఈ దస్తావేజులు తమకు బదిలీ చేయలేదని ఆ సీపీఐఓ జవాబి చ్చారు. ఎంత వెతికినా 1995 నాటి కాగితాలు కనిపించలేదని విజి లెన్స్ వారు చెప్పారు. ఆయన రెండో అప్పీలు వేయక తప్పలేదు. ఫైళ్లు కనిపించడం లేదంటూ ప్రజాసమాచార అధికారులు చెబు తున్నారు. అమాయకులను రక్షించడానికి, అవినీతి తిమింగలాలను శిక్షించడానికి రికార్డులు, ఫైళ్లు అవసరం. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది కనుక జనం అడుగుతున్నారు. జారిపోతున్న ఫైళ్లు, పారిపోతున్న నేరగాళ్ల గురించి నిలదీస్తున్నారు. నిజానికి ఆర్టీఐ చట్టాన్ని ఎడాపెడా వాడుకుంటున్నవారు మామూలు జనం కాదు, అధికారులు, ఉద్యోగులు, రిటైరైన వారు, సస్పెండు అయిన వారు, విచారణకు గురైనవారు, ప్రమోషన్ ఎందుకు రాలేదనే అసంతృప్తితో ఉండే ఉద్యోగులు. అంతేగాని నిరుద్యోగులు కాదు. ఆర్టీఐని దుర్విని యోగం చేసేది కూడా ఈ ఉద్యోగులే. మామూలు జనం అడిగితే కలి సికట్టుగా నిలబడి సమాచారాన్ని నిరాకరించేది కూడా ఈ ఉద్యోగులే. ఈ ఆర్టీఐ దరఖాస్తును ఫుట్‌బాల్‌ను తన్నినట్టు గోల్ చేరకుండా ఆపే శాఖలన్నింటి సీపీఐఓలు సమన్వయం చేసుకుని ఫైళ్ల సంగతి తేల్చకపోవడం సమాచార నిరాకరణగా పరిగణిస్తారు. దీంతో తలా పాతికవేల జరిమానా విధించక తప్పదని నోటీసులు జారీ చేసింది సమాచార కమిషన్. ఫైళ్లు మాయమైతే అధికారులు, కార్యాలయాలు చేయవలసిన విధి విధానాల్ని ఖరారు చేయాలని, ప్రమాణాలు నిర్ధారించి, శిక్షలు నిర్ణయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. పోయిన కాగితాలు వెతకకుండా, కేవలం పోయాయని చెప్పడం నిర్లక్ష్యంగా భావించి అందుకు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా నియ మాలు రూపొందించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. పాతికవేల జరిమానా భయం పనిచేసింది. ‘ఆర్టీఐ దరఖాస్తులో ఇచ్చిన ఫైలు నంబరు ఆధారంగా వెతికితే ఏదీ దొరకలేదు. కానీ నంబరును వదిలేసి అన్ని ఫైళ్లూ బాగా వెతికాం. అప్పుడు ఈ ఫైలు దొరికింది’అని íసీపీఐఓలు జవాబిచ్చారు. జఫాకు అన్ని కాగితాల ధ్రువీకరణ ప్రతులు పంపించేశామని వివరించారు. ‘మేము ఏ ఆర్టీఐ దరఖాస్తును తిరస్కరించడం లేదు. కేవలం ఫైళ్లు దొరకలేదని వెతుకు తున్నామని మాత్రమే వివరణ ఇస్తాం’ అని వారు చెబుతున్నారు. చివ రిరోజున శత్రు మిత్రుల నకిలీ ఆరోపణలు, వేధింపు చార్జిషీట్లు, ఆ తరువాత ఏమయ్యాయో చెప్పకపోవడం కుర్చీ బాబుల క్రూర చర్య. కుర్చీ దిగిన వెంటనే ఆ వ్యక్తిని, అదే కుర్చీలో కూర్చున్న అధికారి వేధించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం. పగబట్టి, లేదా రాజకీయ నాయకులను ఆశ్రయించే వెన్నెముకలేని దుర్మార్గపు అధికా రులు వాడుకునే ఆయుధం. రిటైర్మెంట్ నాడు ఆరోపణలు చేయడం, తరువాత చెప్పక పోవడం. ఆ తర్వాత కుర్చీ దిగిపోయిన అధికారు లకు దిక్కుండదు. మంచి అధికారైనా అవినీతిపరుడైనా ఆయనను పలకరించే వారు కూడా కరువైపోతారు. ఆయన కార్యాలయానికి రాలేడు. ఉత్తరాలు రాస్తే జవాబివ్వరు. తన మీద మచ్చ తొలగిపోయే పత్రాలు చివరి దశలోనైనా దొరికినందుకు జఫా సంతోషించారని సీపీ ఐఓలు విన్నవించారు. ఇండియాలో ఫైళ్ల దొంగను దేవుడు మాత్రం ఏం చేయగలడు? (విజేంద్రసింగ్ జఫా కేసు ఇఐఇ/MౖSఒఉ/అ/ 2017/181342లో సీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
రహస్యమే అనర్థాలకు మూలం
విశ్లేషణ ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్స్టాల్మెంట్ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు? వైద్య వివరాలను రహస్యంగా దాచే విషయంలో డాక్టర్లు వైద్య కంపెనీల విధానాన్ని అమలు చేయడమే అన్ని సమస్యలకు కారణం. లక్షల రూపాయలు తీసుకుని ఆస్పత్రిలో ఏం చికిత్స చేస్తున్నారో ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడు, ఆ కాగితాలను అప్పటికప్పుడే ఎందుకు ఇవ్వరు? ఆ రికార్డు ఎవరిది? రోగం తనది, డబ్బు తనది, వైద్యశాలను ఎంచుకుని కోరి చికిత్సకోసం వచ్చినపుడు, చికిత్స వల్ల కలిగే బాధ, నిర్లక్ష్యం ఒక వేళ ఉంటే, అందుకు పడే బాధ తనది, ఒకవేళ ఆరోగ్యం బాగైతే బాగుపడేది తను. మరి రికార్డులు తనవి కాదా? అవి వైద్యశాల యజమానుల సొమ్మా? వైద్యశాల సొంతదారుల పొగరంతా బిల్లుగుమస్తా ప్రదర్శిస్తుంటాడు. డాక్టర్ మర్యాదగా మాట్లాడతాడు. రోగిని, బంధువులను గౌరవిస్తాడు. బిల్లింగ్ గుమస్తా మాత్రం పెత్తనం చలాయిస్తుంటాడు. అతని దగ్గర పడిగాపులు కాయాలి. ఈ వైద్య కంపినీలకు బిల్లింగ్ గుమ స్తాలను సంస్కరించాలన్న ధ్యాస ఉండదు. బాకీలన్నీ అడిగినట్టేనా అని విచారిస్తూ డిశ్చార్జి చేయడంలో విపరీతమైన ఆలస్యం చేస్తుంటాడు. డాక్టరు కరుణించినా గుమస్తా వరమివ్వడు. బిల్లింగ్ దగ్గర ఉన్నపుడు యాజ మాన్యపు డబ్బు జబ్బు గుమస్తాకు అంటుకుంటుంది. వైద్యవిద్య ఖరీదు లక్షలు దాటి కోట్లకు పడగెత్తింది. ప్రతిభ లేకపోయినా సీట్లు కొనుక్కునే వారు, ప్రతిభ ఉన్నా భారీ ఫీజు చెల్లించడానికి అప్పులు చేసేవారూ కూడా ఎంత త్వరగా లాభాలు సంపాదించి వడ్డీ చెల్లించాలనే లక్ష్యంతో ఏమైనా చేస్తూనే ఉంటారు. ఒక్కో రోగి లోపలికి వస్తుంటే ఇన్స్టాల్మెంట్ చెల్లింపు అయిపోతున్నట్టు వైద్య పెట్టుబడిదారుడికి కనిపిస్తూ ఉంటుంది. మనుషుల రోగాలే వీరి లాభాలు. ఉచి తంగా వైద్యం చేయనవసరం లేదు. అడ్డూ అదుపూ, నిజం న్యాయం లేని తప్పుడు చికిత్సలు, అన్యాయపు బిల్లులను ఏం చేయాలి? ఈ బందిపోటు దోపిడీని ఎవరు ఆపుతారు? పట్టుదల ఉన్న రోగి గానీ, వారి బంధువులు గానీ కోర్టుకు వెళ్లాలంటే ఈ వైద్య వ్యాపారి అవసరమైన కాగి తాలేవీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఒక్కో కాగితం వారి తప్పుడు చికిత్సలకు తప్పుడు బిల్లులకు సాక్ష్యాలు కనుక. దొంగతనాన్ని బయటపెట్టే సీసీ టీవీ కెమెరాల్లాంటివి ఆ కాగితాలు. కనుకనే రోగికి ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఈ వైద్య దుకాణాల బహిరంగ బందిపోటు దోపిడీని అరికట్టే మొట్టమొదటి చర్య రికార్డులు ఇచ్చే బాధ్యతను వారి మీద మోపడమే. ఒక్కరోజు చికిత్స కాగితం ఇవ్వకపోయినా 50 వేలు ప్రభుత్వానికి, 50 వేలు రోగికి చెల్లించాలనే కఠిన నిబంధనలతో కూడిన చట్టం రావాలి. ఇటువంటి నేరాలు వారంలో అయిదు జరిగితే ఆ వైద్యశాల ఎండీకి నెలరోజుల జైలుశిక్ష విధించాలి. చికిత్స చేసి డాక్టర్ల చికిత్సానుమతి రద్దు చేయాలి. అప్పుడు కాని రోగికి రికార్డులు ఇవ్వాలనే బుద్ధి, రికార్డులు ఇస్తున్నాం గనుక దొంగతనం చేయరాదన్న ఆలోచన వైద్యవ్యాపారులకు కలుగుతుంది. అది చాలా అవసరం. వైద్య సేవలు చేస్తామనే ప్రతిపాదనను రోగి అంగీకరించడంతో ఏర్పాటయిన ఒప్పందం నుంచి రికార్డులు పుట్టాయి కనుక రోగ నిర్ధారణ పరీక్ష నివేదికలు, స్కాన్ నివేదికలు, చికిత్సా పత్రాలు ఆ రోగికి చెందుతాయి. ఎప్పటికప్పుడు ఆ పత్రాలన్నీ రోగికి లేదా అతని బంధువులకు ఇవ్వాల్సిందే. వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షన్ 2(1) కింద వినియోగదారుడు అంటే ఎవరైతే నిర్ధారిత, చెల్లిస్తానన్న, చెల్లించిన, పాక్షికంగా చెల్లించిన, వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన ప్రతిఫలానికి బదులుగా సేవలను స్వీకరించిన వ్యక్తి అని అర్థం. సెక్షన్ 2(1)(ఓ)లో సేవలను నిర్వచించారు. డాక్టర్లు వైద్యశాలల సేవలను ఈ చట్టం పరిధిలోకి తేవడం సరికాదని, తాము బాధ్యులం కాదని డాక్టర్లు వాదించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వి.పి. శాంత(1995) అనే కేసులో సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించి మెడికల్ ప్రాక్టీషనర్ల సేవలు ఈ చట్టం కిందకు వస్తాయని తీర్పు చెప్పింది. వినియోగదారుల చట్టం సెక్షన్ 2(ఎఫ్) లోపం అంటే ఏమిటో నిర్వచించింది. వస్తువులలో అసంపూర్ణత, లోటు, తగినంత లేకపోవడం, నాణ్యత క్షీణిం చడం, పనిచేసే తీరులో తేడా రావడం, చట్టంలో లేదా ఒప్పందంలో నిర్ణయించినంతమేరకు పనిచేయకపోవడం. ఇదే తరహాలో సెక్షన్ 2(జి) సేవలలో లోపాన్ని నిర్వచించింది. చట్టం నిర్దేశించినంత మేరకు లేదా ఒప్పుకున్నంత మేరకు సేవలను నిర్వహించకపోవడం, సేవలు అసంపూర్ణంగా ఉండడం, లోపాలు ఉండడం, నాణ్యత లోపించడం వంటివి జరిగితే నష్టపరిహారాన్ని కోరవచ్చు. ఈ లెక్కన రోగికి రికార్డులు ఇవ్వకపోవడం సేవాలోపం లేదా నిర్లక్ష్యం కూడా కావచ్చు. ఫోర్స్ వర్సెస్ ఎం జ్ఞానేశ్వరరావు కేసులో కేసుషీట్ను సక్రమంగా నిర్వహించకపోవడం, ఇంతకుమునుపు చేసిన నిర్ధారణ పరీక్షల వివరాలు కేస్‌షీట్‌లో చేర్చకపోవడం, రోగి అంగీకారం పత్రాలను పారవేయడం నిర్లక్ష్యం కిందకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల మిషన్ తీర్పు చెప్పింది. ఎక్స్ రే ఫిల్మ్ సరైన సమయంలో ఇవ్వకపోవడం సేవాలోపమే అని వి.పి. శాంత వర్సెస్ కాస్మొపాలిటన్ హాస్పటల్ కేసులో నిర్ణయించారు. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
డోపింగ్ చట్టబద్దమా నేరమా?
విశ్లేషణ దేశంలో యాంటీ డోపింగ్ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో లేనందున క్రీడాకారులు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. తాత్కాలికంగా శక్తిని పెంచే ఉత్ప్రేరక మత్తు మందులను వాడి ఆటల్లో గెలిచే అవినీతి విస్తరిస్తున్నది. క్రీడాస్ఫూర్తితో జీవి తాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలనే నీతి సూత్రాలు చిన్నప్పటి పెద్దమాట. ఇప్పుడు ఏదో రకంగా గెలవడమే కర్తవ్యంగా క్రీడాకారులు భావిం చడం విచారకరం. దీన్ని డోపింగ్ అంటున్నారు. తప్పుడు ప్రేరకాల నేరాన్ని (డోపింగ్) అరికట్టడానికి మనం ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం? మన విధా నం న్యాయంగా లేదని విమర్శిస్తూ దీపక్ సాంధూ అనే క్రీడాభిమాని ఒక ఆర్టీఐ దరఖాస్తులో విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రాలలోనూ ప్రేరకాల వాడకాన్ని కనిపెట్టి నిరోధించడానికి కఠిన విధానాలను అనుసరించడంలేదని ఆయన అంటున్నారు. ప్రపంచ ప్రేరక వ్యతిరేక సంస్థ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) 2015లో ఒక నియమావళిని రూపొందించింది. పరీక్షలు నిర్వహించి తొండి చేసి గెలవాలని చూసే మోసపూరిత ఆటగాళ్లను పట్టుకొని నిషేధించేందుకు ప్రమాణాలను నిర్దేశించింది. పరిశోధన, రసాయన మందుల పరి మాణం ఎంత ఉండాలని కూడా వివరించింది. క్రీడాకారుని శరీరంలో ప్రవేశించిన మందు పరిమాణాన్ని, అతనికి ప్రేరకం అందిన వనరులను కని పెట్టే ప్రక్రియను కూడా నిర్దేశించింది. మనదేశంలో ఈ ప్రేరకాల నిరోధక పద్ధతులు, ప్రయోగశాలలో కనిపెట్టి అరికట్టే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎందుకు లేవన్నది ప్రధానమైన ప్రశ్న. అందువల్ల జాతీయస్థాయి పోటీలకు చేరుకునే వారు అందుకు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. అంటే పరోక్షంగా జిల్లా, రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలలో ప్రేరకాలు వాడి గెలిచేం దుకు మనదేశంలో వీలుంది. దాన్ని చట్ట వ్యతిరేకతగా భావించడానికి వీల్లేదు. అంటే ప్రేరకాల వాడకం జాతీయస్థాయి కింది అన్ని స్థాయిల్లో చట్టబద్ధం, ఆ తరువాత నేరం. మనకు జాతీయ ప్రేరక నిరోధక సంస్థ, జాతీయ ప్రేరక పరీక్షా ప్రయోగశాల ఉన్నాయి. కాని ప్రాంతీయస్థాయిలో ఈ ప్రయోగశాలలు లేక, అక్కడి క్రీడాకారులను పరీ క్షించే విధానం లేక, ప్రేరకాలు వాడే వారు జాతీయస్థాయి దాకా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాడా సంస్థ పరిశీలన ప్రకారం 2015, 2016 సంవత్సరాలలో పోటీనుంచి ఎంతమందిని తప్పించారు? ఎంతమందిని అనుమతించారు? ఎన్ని ప్రయోగాలు జరిపారు, ఎందరు ప్రేరకాలు తీసుకున్నారని తేలింది? వారిపై తీసుకున్న చర్యలు, నిషేధంవంటి వివరాలు కోరారు దీపక్ సాం«ధూ. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గానీ ఏ జవాబూ ఇవ్వలేదు. ప్రజాసమాచార అధికారి కొన్ని సంబంధిత పత్రాల ప్రతులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే ఇచ్చిన 122 పేజీల పత్రాలలో ఒక్కటి కూడా ధృవీకరణ లేదని దీపక్ సాంధూ విమర్శించారు. ముంబై ఐబీబీఎఫ్ వారి ప్రజాసమాచార అధికారి సంతకం చేయలేదు, స్టాంపుకూడా కొట్టలేదు. క్రీడా సంస్థల జాబితా ఇచ్చారుగాని వారు 2015–16 సంవత్సరంలో నాడా సంస్థకు రాసిన ఉత్తరాల ప్రతులు ఇవ్వలేదని, 10.8.2017న తాను రాసిన లేఖకు జవాబు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెక్షన్ 4(1) సి ప్రకారం కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా ప్రకటించేటప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ఆ విధానాలకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలముందు తమంత తామే ఉంచవలసి ఉంటుంది. ప్రాంతీయ రాష్ట్రస్థాయిల్లో అసలు ప్రేరకాల వాడకాన్ని నిరోధించే విధానమే ప్రభుత్వం రూపొం దించలేదు. దీనివల్ల జాతీయస్థాయికి వచ్చేదాకా అసలు ఈ పరీక్షే లేకుండా పోయింది. దీనివల్ల ప్రతి భావంతులైన, సహజంగా ఆడగల స్తోమతగల అర్హులైన ఆటగాళ్లు పోటీలో మిగిలే అవకాశమే లేదు. జిల్లాస్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో చివరకు ప్రాంతీయ స్థాయిలో కూడా ఆటగాళ్లు ఈ ప్రేరకాల ప్రభావంతో ఆడి, సహజంగా ఆడే పోటీదారులపై గెలిచిపోతూ ఉంటారు. ఒకవేళ జాతీయ స్థాయిలో పట్టుబడినా అప్పటికే ఆ క్రీడాకారుడు సహజ క్రీడాకారులను వెనక్కితోసి జాతీయ స్థాయికి చేరి ఉంటాడు. కానీ నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఈ అనారోగ్యకరమైన విధానాన్ని మార్చి అన్ని స్థాయిలలో ప్రేరకాల వాడకాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలని కమిషన్ సిఫార్సుచేసింది. సమాచారం అభ్యర్థించిన దీపక్ సాంధూ అడిగిన విషయాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలనకు సమర్పించాలని, అందులో ఆయన కోరిన పత్రాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. దీపక్ సాంధూ దాఖలుచేసిన అన్ని సమాచార దరఖాస్తులకు సంబంధించిన దస్తావేజులను చూపాలని ఆదేశించింది. (దీపక్ సాంధూ వర్సెస్ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఇఐఇ/ అౖఐN/అ/ 2017/140574 కేసులో 21.11.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
భద్రత సమాచారమూ ఇవ్వరా?
విశ్లేషణ రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? 1. రైళ్ల రక్షణ హెచ్చరిక వ్యవస్థ (ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టం)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (íసీఈఎల్) 2013లో ప్రతిపాదించిన పథకానికి మంజూరు చేసిన వ్యయం ఎంత? 2. మంజూరుపత్రం కాపీ ఇవ్వండి. 3. విడుదలైన డబ్బు వినియోగించినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 4. సీఈఎల్‌కు విడుదల చేసిన నిధుల వివరాలు ఇవ్వండి. 5. సీఈఎల్ పథకాన్ని పూర్తిచేసినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 6. ప్రాజెక్టు పూర్తికాకపోతే కారణాలు తెలపండి, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పండి. 7. మంజూరు చేసిన వ్యయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి అయిందా? కాక అదనపు ఖర్చును మంజూరు చేస్తూ జారీ చేసిన పత్రం నకలు ఇవ్వండి. 8. ఈ ప్రాజెక్టు టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలించి ఉంటుంది. వారి నివేదికలో ఆర్థిక సాంకేతిక లోపాల గురించి ప్రస్తావిస్తే ఆ వివరాలు ఇవ్వండని ఎనిమిది అంశాలమీద సమాచారాన్ని అడిగారు అస్తిత్వ అనే వ్యక్తి. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డీఎస్ఐఆర్) జవాబు ఇవ్వాలి. కానీ ఇదంతా వ్యక్తిగతమట. సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వరట. అస్తిత్వ అడిగిన సమాచారం సంక్షిప్తంగానైనా ఇవ్వాలని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. ప్రాజెక్టు వివరాలను వ్యక్తిగత సమాచారమంటూ తిరస్కరించడం తీవ్రమైన విషయం. రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? పోనీ íసీపీఐఓ భావించినట్టు ఇది వ్యక్తిగత సమాచారమని అనుకున్నా, దానికి జనహితం అనే మినహాయింపు ఉంది కదా! ఆ జనహితం కోసమైనా ఈ సమాచారం ఇవ్వవచ్చు కదా? ఆర్టీఐ దరఖాస్తు 23.5.2017న దాఖలైంది. విమల్ కుమార్ వరుణ్ ఆ దరఖాస్తును జి– విభా గం శాస్త్రజ్ఞుడు బీఎన్ సర్కార్‌కు పంపారు. సెక్షన్ 5(4) కింద అస్తిత్వగారు కోరిన సమాచారం ఇవ్వాలని కోరుతూ 25.5.2017న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని సమాచార కమిషన్‌కు వివరణతో పాటు సమర్పించారు. అయినా బీఎన్ సర్కార్ ఇది వ్యక్తిగత సమాచారమనీ, సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వడం చెల్లదనీ జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఆదేశం తరువాత కూడా పూర్తి సమాచారం రాలేదని అస్తిత్వ కమిషన్‌కు వివరించారు. సీఇఎల్కు పరిశోధన చేయడానికి గాను తమ విభాగం (డీఎస్ఐఆర్) ఆర్థిక సాయం చేస్తుందని, మార్కెట్ అవసరాలను అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు చేయడానికి సహకరించి, ఆ వస్తువులను వాణిజ్యపరంగా వినియోగిస్తుందని వివరించారు. కొన్ని ధృవపత్రాలు కూడా అస్తిత్వకు ఇచ్చామనీ, అయితే పొరబాటున వాటిని ధృవీకరించడం మరి చిపోయామనీ చెప్పారు. అయితే సీఈఎల్ అనేది కంపెనీ కనుక, వాణిజ్య వ్యవహారాలను నడుపుతుంది కనుక అడిగిన సమాచారం మొత్తం ఇస్తే అందులో వాణిజ్య రహస్యాలు ఉంటాయి కనుక ఇవ్వకూడదని సెక్షన్ 8(1)(డి) కింద మినహా యింపు వర్తిస్తుందని భావించామని, కానీ పొరబాటున సెక్షన్ 8(1)(జె) అని రాశామని కూడా సీపీఐఓ తన వివరణలో తెలియజేశారు. రికార్డు పరిశీలిస్తే డిసెంబర్ 13 (2017)న ఇచ్చిన జవాబుల్లో కూడా డీమ్డ్ పీఐఓ బీఎన్ సర్కార్ 5,6,7,8 అంశాలకు సరైన జవాబు, పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. అయిదో అంశంపైన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పలేదు. ఆరో ప్రశ్నకు ఆలస్యంగా ‘పరిశీలనలో ఉంది’ అని జవాబు ఇచ్చారు. ఏ పరిశీలన? ఎవరి పరిశీలన? ఏడో పాయింట్‌కు నాట్ అప్లికబుల్ అని ఊరుకున్నారు. మొత్తం ప్రాజెక్టు మంజూరైన వ్యయానికి లోబడి ఉందా లేదా అంటే వర్తించదు అని జవాబిస్తారా? ఎనిమిదో పాయింట్‌కు అటువంటి కమిటీ లేదు. కమిటీ ఏ లోపాన్నీ కనిపెట్టలేదని జవాబు. 5 నుంచి 8 వరకు పాయింట్లకు వాణిజ్య రహస్యానికి సంబంధమే లేదు. కనుక 8(1)(డి) కూడా వర్తించదు. బీఎన్ సర్కార్ గారు మళ్లీ మళ్లీ 8(1)(డి)నే వర్తిస్తుందని, పత్రాలను ధృవీకరించనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఇవ్వాల్సిన జవాబులా ఇవి? విమల్ కుమార్ వరుణ్ సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని స్పష్టంగా లేఖ రాశారు. కానీ సమాచారం అధీనంలో ఉన్న శాస్త్రజ్ఞుడైన సర్కార్ నిరాకరించడం వల్ల ఇవ్వలేకపోయారు. అస్తిత్వ ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనేకానేక లోపాలను వివరిస్తూ ఆడిట్ ఇచ్చిన ఒక నివేదిక భాగాలను కమిషన్‌కు సమర్పించారు. వీటికి జవాబి వ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. (అస్తిత్వ వర్సెస్ సైన్స్/టెక్నాలజీ మంత్రిత్వశాఖ CIC/DOSIR/A/2017/159662 కేసులో సీఐసీ 12 జనవరి 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాఢభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచారం ఎవరి సొంతం?
ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం సమాచార హక్కు చట్టమే. ఒక పథకం కింద ప్రభుత్వం ఎవరెవరికి ఇళ్లు ఇచ్చింది? వారు ఏ కార్యాలయాలలో పనిచేసేవారు? బ్యాంకు రుణాలు తీసుకున్నవారెవరు? బ్యాంకులతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకుని వారికి టైటిల్ డీడ్ ఇచ్చిన వారెవరు? అని డాక్టర్ కె. వెంకటరావు గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖను అడిగారు. బ్యాంకుల సమాచారమంతా ఇవ్వడానికి వీల్లేదు కనుక, అవి సిస్టంలో అందుబాటులో సిద్ధంగా ఆ సమాచారం లేదు కనుక సెక్షన్ 8(1)(జె) ప్రకారం ఇవ్వజాలమని ప్రజా సమాచార అధికారి తిరస్కరించారు. ఆ నియమాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడం చెల్లదంటూ వెంకటరావు సమాచార కమిషన్ ముందుకు వచ్చారు. సమాచారం అందుబాటులో లేదని అనడం కూడా విచిత్రమైన జవాబు. ఇళ్లు కేటాయించడం, వాయిదాల్లో డబ్బు వసూలు చేయడం, అప్పులు ఇవ్వడం, ఆ వివాదాలు కుదర్చడం మొదలైన వాటికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులు లేకుండా ఉండడం సాధ్యమా? కొన్ని శాశ్వత రికార్డులు నిర్వహించడం అవసరం కాదా? ఆర్టీఐ కింద అడిగిన అంశాలలో ఏది వ్యక్తిగతం, ఏది ఇవ్వడానికి వీలైన అంశం అని ఆలోచించినట్టు కనిపించదు. పార్లమెంట్ లేదా శాసనసభలు అడిగితే కాదనడానికి వీల్లేని సమాచారాన్ని ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వాలని సెక్షన్ 8 కింద మినహాయింపులకు వర్తించే ఒక నియమం ఉందని దాన్ని అమలు చేయాలని అనిల్ కుమార్ వర్సెస్ డీఓపీటీæ కేసులో సీఐసీ 2006లో (CIC Appeal No. 76/IC/ (A)/2006) లో వివరించింది. ఇంటికోసం వెంకటరావు కొంత అప్పు చేశారు. బ్యాంకుతో, ప్రభుత్వ సంస్థతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బ్యాంకుకు దరఖాస్తుదారు ఇంటి యాజమాన్య ధ్రువపత్రం టైటిల్ డీడ్‌ను పూచీకత్తు కింద బ్యాంకుకు ప్రభుత్వ విభాగం ఇవ్వాలి. కానీ అడ్మినిస్ట్రేటర్ బ్యాంకుకు ఆ టైటిల్ డీడ్ ఇవ్వకుండా అక్రమంగా జి. నిర్మల అనే ఒక మహిళ (తమిళనాడులోని ఏసీపీ గారి భార్య)కు ఇచ్చారని, దీని వల్ల తాను అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చిందని, తన ఇంటిని తాను సాధించడానికి నానా తంటాలు పడవలసి వచ్చిం దని వెంకటరావు వివరించారు. తనకు ఏ సమాచారమూ ఇవ్వవద్దని అధికారులమీద ఒత్తిడి తెచ్చారని, అందుకే పీఐఓ మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దరఖాస్తుదారుడు ఈ కేసులో మొత్తం ఇళ్లు పొందిన వారి పేర్లు, వారి రుణాలు, బ్యాంకుల పేర్లు, టైటిల్ డీడ్స్ అడిగినప్పటికీ తన ఇంటి కేటాయింపు చెల్లింపులకు సంబంధించిన దస్తావేజు ఆయన పరిశీలనకు ఇచ్చినా, అందులో ఆయనకు కావలసిన పత్రాల ప్రతులను ఇచ్చినా సరిపోయేది. రెండో అప్పీలును సాధారణంగా కమిషన్ వీడియో అనుసంధానం ద్వారా విచారిస్తుంది. ఈ కేసు విషయంలో బెంగళూరులో ఉన్న అప్పీలుదారును ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారు. తాను రాలేనని, మరో తేదీన విచారించాలని, లేదా వీడియో సంధానం చేయాలని ఆయన కోరాడు. కానీ ఆ విషయం పట్టించుకోకుండా, విచారణ ముగించి కేంద్ర సమాచార కమిషన్ సమాచారం ఇవ్వరాదనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం న్యాయం కాదంటూ వెంకటరావు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను స్వీకరించి, వెంకటరావు సమాచార అభ్యర్థనను పునఃపరిశీలించాలని కమిషన్‌కు పంపించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ పేరులోనే గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన అనే సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ అని ఉంది. ఎవరెవరికి ఇళ్లు ఇచ్చారు, ఎందరు రుణాలు తీసుకున్నారు, వారి టైటిల్ డీడ్స్ బ్యాంకులకు ఇచ్చారా లేదా అనే అంశాలలో ఎవరి సొంత సమాచారం ఉందో, ఆ వివరాలు ఇస్తే ఎవరి ప్రైవసీ గుట్టు రట్టు అవుతుందో వివరించే బాధ్యత ప్రభుత్వ సమాచార అధికారిపైన ఉంది. ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం ఏదయినా ఉంటే అది సమాచార హక్కు చట్టమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తే అక్రమాలు జరగవనడానికి ఈ కేసే ఒక ఉదాహరణ. ఆ కేసులో జరిగిన అక్రమాలను దాచడానికే సమాచారం దాస్తున్నారనే ఆరోపణలు కూడా అప్పుడే వస్తాయి. టైటిల్ డీడ్ కూడా ప్రయివేటు పత్రం కాదు. రిజిస్టర్ చేసిన టైటిల్ ఆస్తి మార్పిడికి సాక్ష్యం. అది రహస్యంగా ఉండే అవకాశమేలేదు. ఆ సమాచారం ఇవ్వాలని, నిరాకరించినందుకు సంజాయిషీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (డాక్టర్ కె. వెంకటరావు, వర్సెస్ గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ CIC/KY/A/2014/901399 కేసులో 17 నవంబర్ 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
మచ్చుకైనా లేని పారదర్శకత!
విశ్లేషణ విజిలెన్స్ అంటే అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యం. అవినీతి, లంచగొండితనాన్ని ఏ విధంగా తగ్గించాలనే విషయంలో చర్యల కన్న ఎక్కువగా చర్చలే జరుగుతుం టాయి. ఆ చర్చల పర్యవసానం పెద్దగా ఉండకపోయినా, చాలామందిలో కొంత ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ చివరివారంలో విజిలెన్స్ వారోత్సవం జరుపుతారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆవిర్భవించిన సందర్భంలో ఈ వారోత్సవాలు నిర్వహించాలి. ఈ సంవత్సరం ‘నా కల అవినీతి రహిత భారతం’ అనే అంశం మీద చర్చలు సమావేశాలు, పోటీలు జరిపించాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. లంచాలు లేని సమాజం వినడానికి ఊహించడానికి చాలా బాగుంది. కాని అవినీతి అంటే కేవలం లంచాలు తీసుకోవడం మాత్రమే కాదు. నోటికొచ్చినట్టు అబద్ధం ఆడటంతో మొదలై, ఒక రీతి రివాజు లేకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించడం, ఆలోచనా వివేకం లేకుండా తగాదాలు పెట్టుకోవడం, ఎప్పుడూ మరొకరిని ఏడిపిస్తూ వినోదించడం, పరోపకారం మాట అటుంచి అవసరమైన సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేవి దారుణమైన వ్యక్తిత్వాలు. ఇదంతా అవినీతి. విజిలెన్స్ అంటే జాగరూకత, అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం, ఆ వ్యవస్థలు ఉంటే వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యమవుతుంది. ఉదాహరణకు హైవేల మీద పౌరులకు జాగ్రత్తలు తెలియజేసే వ్యవస్థ లేకపోవడం, రెండుమూడు మైళ్లదాకా కనీస వైద్య సదుపాయాలు సమాచార ప్రసార వ్యవస్థ లేకపోవడం తీవ్రమైన లోపాలు. శరవేగంగా వెళ్లగల జాతీయ రహదారులు ప్రగతికి మార్గాలే. కాని వాటి నిర్వహణలో అనుబంధ సేవల కల్పనలో నియమాలు పాటించకపోవడం వల్ల అవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ఎవరూ ఏమీ చేయడం లేదు. రైళ్లు పట్టాలు తప్పుతూ ఉంటే, ప్రమాదాలు జరుగుతూ ఉంటే పట్టించుకునే వాడు లేడు. రోడ్డు దాటే వంతెనలు లేక, మెట్రో, లోకల్ రైల్వేస్టేషన్ల ద్వారా జనం అవతలి పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ రద్దీలో ఇరుక్కుపోయి తొక్కిసలాటలో ప్రాణాలు పోతుంటే గాని పాదచారుల వంతెనలు రోడ్డు పక్కన కాలిబాటల అవసరాలు గుర్తుకు రావడం లేదు. ఇవన్నీ అక్రమాలు, ఇదంతా అవినీతి. వర్షాలకు అవిభాజ్య కవల సోదరులు వరదలు. రోడ్డుమీదనుంచి నీళ్లు ఎటుపోవాలో ప్రణాళికలో ఉండదు. అసలు వానలే రావనే నమ్మకంతో రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అభివృద్ధి పనులకోసం పౌరుల భూములు ప్రభుత్వం స్వీకరిస్తుంది. దాన్ని సేకరణ అంటారు. నిజానికి అది స్వాధీనం చేసుకోవడమే. అవసరం ఏమిటో వారు నిర్ధారించి, వారే నష్టపరిహారాన్ని నిర్ణయించి, తప్పనిసరిగా భూమిని ఇచ్చేయాలని ఆదేశించడానికి కావలసిన అధికారాన్నిస్తూ భూసేకరణ చట్టం ఒకటి బ్రిటిష్ కాలంలో రూపొందించారు. దాన్నే 2013దాకా అమలు చేశారు. కాని అందులో అన్యాయంగా ప్రభుత్వం ప్రజల భూములను స్వాధీనంచేసుకుంటూ ఉంటే పరిష్కారం లేకుండా పోయింది. కోర్టుల్లో ఏళ్లతరబడి పోరాడితే న్యాయం దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి నెలకొన్నది. ఎన్నెన్నో ప్రాజెక్టులకోసం భూములు స్వాధీనం చేసుకున్నారు కాని పరిహారాలే ఇవ్వలేదు. వ్వజూపిన పరిహారం సరిపోదని వాదిస్తే కోర్టులెక్కాల్సి వచ్చేది. కోర్టుల్లో ఇరవై ఏళ్ల తరువాత కనీసం పది శాతం కూడా ధర పెరిగేది కాదు. ఖర్చులతో పోల్చితే పరిహారం పెంపు మరింత నష్టం కలిగించేది. ఈ చట్టం స్వతంత్ర భారత దేశంలో ప్రతిజిల్లాలో అవినీతిని పెంచి పోషించింది. వందల వేలు లక్షల కోట్లరూపాయల లంచగొండితనాన్ని ఈ చట్టం కనుసన్నల్లో ప్రజలు కళ్లారా చూసారు. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు భూములను స్వాధీనం చేసుకుని తమకు అనుకూలంగా వాడుకున్న సందర్భాలు కోకొల్లలు. భూసేకరణ నోటిఫికేషన్ లు జారీ చేయడం కూడా భారీ కుంభకోణాల పుట్టగా తయారైంది. ఫలానా చోట ప్రాజెక్టు వస్తుందని ముందే సమాచారం లోపాయికారిగా కొందరికే చెప్పి, చుట్టు పక్కల భూములు తామే తక్కువ ధరకు కొని, ప్రాజెక్టు వల్ల భూమి ధర పెంచి లక్షల కోట్ల రూపాయలు దండుకొనే అవినీతి అసలు పట్టుకునే అవకాశమే లేదు. ఈ దుర్మార్గపు చట్టం నుంచి విముక్తికోసం పోరాటాలు ఉద్యమాలు జరిగాయి. చివరకు ఎన్నో నియమాలను ప్రతిపాదించి, ఎందరితోనో చర్చించి 2013లో ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. లోపాలేమీ లేవని చెప్పడానికి వీల్లేకపోయినా ఈ చట్టం కింద భూమి కోల్పోయే వారికి కావలసినంత నష్టపరిహారం కోరే అవకాశం లభించింది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే మొత్తం భూమి స్వాధీన వ్యవహారాలు పారదర్శకంగా సాగించాలనే నియమం. ఏ ప్రాజెక్టుకోసం ఎవరి భూమి ఎంత మేరకు, ఎంత ధర ఇచ్చి తీసుకుంటున్నారనే ప్రతి అంశాన్ని ప్రతిదశలో ప్రజలకు తెలియజేసే పారదర్శకత ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. కాని ఆ పారదర్శకతను కూడా పాటించకుండా ఈ చట్టాన్నే పక్కకు బెట్టి భూములు సేకరించే విధానాలను కనిపెట్టారు. అవినీతికి ఆస్కా రంలేని పారదర్శక విధానాలు లేకుండా నిఘాలు, విజి లెన్స్‌లు ఉపయోగపడవు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అక్కడా లైంగిక వేధింపులేనా?
విశ్లేషణ సమాచార కమిషన్ ఆదేశించినట్లు తెలిసి కూడా ఆ ఫైలును పరిశీలనకు అందుబాటులో ఉంచకపోవడం అడ్డంకులు సృష్టించడమే అవుతుంది. అలా చేయడం సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద జరిమానా విధించ తగిన తప్పిదమవుతుంది. మహిళల మానవ హక్కులకు భంగం కలిగితే వారి పక్షాన నిలిచి, ఆరోపణలపైన విచారణ జరిపించి న్యాయం చేయడమే జాతీయ మహిళా హక్కుల కమిషన్ విధి. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990, సెక్షన్ 10 ప్రకారం మహిళలకు రాజ్యాం గంలో లభించిన రక్షణలు భంగపడినట్టు ఆరోపణ వస్తే పరిశోధించాలి. ఇతర చట్టాలలో హక్కులను భంగపరిచిన అధికారిక సంస్థలపైన వ్యక్తులపైన ఏం చర్యలు తీసుకున్నారని అడగాలి. తమంత తామే కూడా తమ దృష్టికి వచ్చిన హక్కుల హరణ పైన విచారణ ప్రారంభించాల్సి ఉంటుంది. డిప్యూటీ సెక్రటరీ రాజు తమపైన లైంగిక వేధింపులు జరిపారని మెంబర్ సెక్రటరీకి ఆ కమిషన్‌లో పరిశోధనాధికారిగా పనిచేసే మహిళలు ఇద్దరు ఫిర్యాదు చేశారు. అయినా ఏమీ జరగలేదనీ, పైగా తన ఉద్యోగం ఊడబీకారని ఒక బాధిత మహిళ కేంద్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీలులో వివరించారు. కనీసం ఆర్టీఐ కింద సమాచారాన్ని కూడా ఇవ్వలేదని, కావలసిన దస్తావేజులు చూపలేదని, మొదటి అప్పీలు విచారణ జరపలేదని విన్నవించారు. లైంగిక ఆరోపణలకు గురైన అధికారి అక్కడ పాలనాధికారిగా, సమాచార మొదటి అప్పెల్లేట్ అధికారిగా ఉన్నందున, సమాచారం ఇవ్వకుండా ఆయనే అడ్డుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. సీఈసీ జూలై 16న మహిళా కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. సీఐసీ ఆదేశాల ప్రకారం ఇద్దరు అధికారులు వివరణ సమర్పించారు. అందులో సమాచార నిరాకరణ న్యాయమైందని చెప్పలేకపోయారు. కనుక ఇద్దరూ 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. సమాచార కమిషన్ ఆదేశించిన విషయం తెలిసి కూడా ఆ ఫైలును పరిశీలనకు అందుబాటులో ఉంచకపోవడం అడ్డంకులు సృష్టించడమే అవుతుందని, ఆ విధంగా అడ్డంకులు సృష్టించడం సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద జరిమానా విధించతగిన తప్పిదం అవుతుందని సమాచార కమిషన్ గుర్తు చేస్తూ, ఆ విధంగా ఫైలు ఎందుకు ఆపేశారో వివరించాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలిని కోరింది. బాధితురాలి ప్రకారం.. వీవీబీ రాజు డిప్యుటీ సెక్రటరీగా పదవిలోకి వచ్చినప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. సంతకాలు పెట్టడానికి ఇదివరకు ఫైళ్లను పై అధికారికి పంపడం ఆయన సంతకాలు చేయడం మామూలే. కాని ఈ రాజు ఫైళ్లపై సంతకాలకు మహిళా పరిశోధనాధికారి స్వయంగా రావాలని షరతు విధిం చారు. ఫైళ్లతో వెళితే గంటలపాటు ఎదురు చూస్తూ అక్కడే ఉండాలి. పనివేళలు ముగిసిన తరువాత కూడా ఫైళ్లతో రమ్మంటారు. నేను అధ్యక్షురాలికి ఇతర అధికారులకు ఈ విషయాలు వివరించాను. ఫైళ్లు తీసుకొని రాజువద్దకు వెళ్లక తప్పదని వారు సలహా ఇచ్చారు. నా పనితీరుపైన ఏడేళ్లుగా ఏ ఫిర్యాదులు లేవు. పరిశోధన అధికారి పేరుతో ఉద్యోగం ఇచ్చారు. జీతం కేవలం పది వేల రూపాయలు. సంతకాలకోసం తన దగ్గరకు రావడం లేదని నా ఫైళ్లు పాడుచేసే పని ప్రారంభించారు. నేను రాజుపైన లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన తరువాత నా కష్టాలు తీవ్రమైనాయి. నాపైన లేని ఫిర్యాదులు ఉన్నట్టు చూపారు. ఆ ఫిర్యాదుల ఫైల్ చూపమంటే ఇంతవరకు చూపలేదు. నాజీతం తగ్గిం చారు. నాతోపాటు ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగుల టర్మ్‌ను కొనసాగించలేదు. తరువాత కొన్నాళ్లకు ఇద్దరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కేవలం నన్ను తొలగించడానికే ఈ కుట్ర అన్నది సుస్పష్టం. ఇకపోతే సాక్షులం దరూ కాంట్రాక్టు ఉద్యోగులు. రాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఉద్యోగం ఊడుతుంది. ఇంక్రిమెంట్లు రావు. అందుకు నా పరిస్థితే ఉదాహరణ. నీకు మద్దతుగా సాక్ష్యం చెబితే మా ఉద్యోగాలు పోతాయి బతకడం చాలా కష్టం అని నా మిత్రులంతా నాకు వివరించారు. ఒక్క రాకేశ్ రాణి మాత్రం ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. కానీ ఆమె మాటలకు విలువ ఇవ్వలేదు. రాజుకి చైర్ పర్సన్ మద్దతు ఉంది. ఆమెతో చెప్పుకున్నా ఏ ప్రయోజనం లేదు. నాతో ఎవరూ మాట్లడవద్దని చైర్ పర్సన్ ఆదేశించారు. నా ఉద్యోగం ఊడబీకే దాకా నాతో ఎవ్వరూ ఆఫీసులో మాట్లాడలేదు. నన్ను చాలా బాధపెట్టారు, వేధించారు. అంతా ఈ రాజు వల్లనే. ఈ వ్యక్తికి ఎందుకు మద్దతు ఇస్తారో తెలియడం లేదు’’ అని ఆమె వివరిస్తూంటే అరగంటదాకా సమాచార కమిషన్ విస్తుబోయింది. రాజుకూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూసిన ఆమె దుఃఖం ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. రాజు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు, తాను తప్పుచేయలేదని వివరించలేదు. మొత్తం ఫైళ్లు చూపాలని, బాధితురాలికి రూ. 50 వేలు పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. (జాతీయ మహిళా కమిషన్ కేసు CIC/NCFWO/A/2017/135800లో జూలై 26న ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ప్రేమ వివాహాలకూ ఆర్టీఐ
విశ్లేషణ తమ పిల్లలు ఎవరిని ఎప్పుడు వివాహం చేసుకుంటున్నారో తెలుసుకునే హక్కు తమకు లేదా? అనే తల్లిదండ్రుల ఆవేదన సబబే. కానీ అన్ని విధాలుగా అర్హులైన వారి ప్రేమ స్వేచ్ఛను, జీవన హక్కును హరించడం చట్ట ప్రకారం చెల్లదు. పెళ్లిని రిజిస్టర్ చేయడానికి ఉన్న నియమాలు, పద్ధతులు, పత్రాలు, ఫీజు, సాక్షుల అర్హ తల వివరాలు ఇవ్వాలంటూ ఒక తల్లి ఆర్టీఐ కింద వివాహాల రిజిస్ట్రార్‌ను కోరారు. పిల్లలు వివాహం చేసుకునే విషయమై తల్లిదండ్రులకు నోటీసు ఇవ్వ కూడదని నిర్దేశించే నియమా లున్నాయా? మోసపూరితమైన వివాహాలు చేసుకునే వారికి ఏ విధమైన శిక్ష విధిస్తారు? అనేవి అసలు ప్రశ్నలు. ప్రేమపేరుతో వంచనలు, తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహాలు చేసుకుంటూ ఉంటే.. ప్రభుత్వం కూడా వారికి చెప్పనవసరం లేదని నియమాలు చేసిందా? అని ఆమె ప్రశ్న. మోసపూరితమైన పెళ్లిళ్లను ఆపకపోతే జీవితాలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆమె ఆవేదన. కని పెంచి, పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసి ఆశలు నింపుకుని అనుబంధాలు అల్లుకున్న కుటుంబం.. పిల్లలకు 18, 21 ఏళ్ల వయసు రాగానే తమ బాంధవ్యాలను వదులుకోవాలని ఎక్కడుంది? కనీసం తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎవరిని ఎప్పుడు వివాహం చేసుకుంటున్నారో తెలుసుకునే హక్కు లేదా? రిజిస్టర్ చేసే అధికారులైనా చెప్పకూడదా? పిల్లలకోసం జీవి తాలు ధారపోసిన తల్లిదండ్రుల ఆవేదన ఇది. మన పూర్వీకులు 8 రకాల వివాహాలను గుర్తిం చారు. అవి బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. ఆధునిక ప్రేమవివాహాలను గాంధర్వ వివాహాలతో పోల్చవచ్చు. అన్నీ అబద్ధాలు చెప్పి చేసుకునే మోసపు పెళ్లిళ్లు పైశాచం అని వేరే చెప్పనవసరం లేదు. వధువు డబ్బు ఇస్తేనే చేసుకునే పెళ్లి నవనాగరిక దుర్మార్గమనీ, డబ్బుకోసం భార్యలను చంపడం అనాగరిక ఆధునికత అనీ మన పూర్వీకులకు తెలియదు కాబట్టి ఇలాంటి వాటిని వారు ఊహించలేదు. మతాచార వివాహాలను హిందూ, క్రైస్తవ, ముస్లిం వివాహ చట్టాలు గుర్తించారుు. మతా తీత, దేశాంతర, కులాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం చేశారు. అన్నాచెల్లెళ్ల వంటి రక్త సంబం ధీకుల మధ్య వివాహాలను నిషేధించారు. భాగస్వామి బతికుండగా పెళ్లి చేసుకోవడం నేరం. ఊరేగింపులు, ఉత్సవాలు సమాజానికి తెలియజేసే పద్ధతులు. ఫలానా జంట చట్టబద్ధ్దమైన వివాహ బంధంలో ఉన్నారని ఇవి వివరిస్తారుు. అయితే ఉత్సవాలు అనేవి ప్రత్యేకచట్టం కింద సాక్ష్యాలు కావు, ధ్రువపత్రమే సాక్ష్యం. కనుక రిజి స్ట్రేషన్‌కు ముందు నెలరోజుల నోటీసు ఇస్తారు. మొత్తం ప్రపంచానికే ఈ నోటీసు. కాని ఈ నోటీసు రిజిస్ట్రేషన్ ఆఫీసు గోడలకే పరిమితం అవుతుంది. కొందరు పత్రి కల్లో ప్రచురిస్తారు. ఈ ఇద్దరి వివాహానికి అభ్యంతరాలు ఏమిటో తెలియజేయాలని సమాజాన్ని కోరడమే ఈ నోటీసుల ఉద్దేశం. వారి మధ్య నిషేధ సంబంధాలున్నా, లేదా వారికి ఇదివరకే పెళ్లరుునా, ఆ విషయాలు రిజి స్ట్రార్‌కు తెలియజేయాలి. అభ్యంతరాలు నిజమే అరుుతే వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ముందు వివాదం తేల్చుకుని రమ్మంటారు. నిజానికి ఈ నోటీసు చాలా కీలకమైంది. కాని ఖాళీ లాంఛనంగా మారింది. గతంలో చేసుకున్న వివాహ వివరాలను రహస్యంగా దాచుకుంటారు. ఆఫీసు గోడలమీద నోటీసులు వెతు క్కోవడం తల్లిదండ్రులకు, మొదటి భార్యలకు, ఇతర ప్రేమికులకు సాధ్యం కాదు. పత్రికల్లో వేయడం కొంత వరకు నయం. అరుునా అదీ చూస్తారని గ్యారంటీ లేదు. నోటీసు ఇచ్చిన ప్రేమికులు నెలరోజులు ఆగాలి. లేక పోతే అది మోసమే. వివాహ అధికారి దర్యాప్తు చేయాలి. సమన్లు జారీ చేసి రమ్మనాలి, పత్రాలు తెమ్మనాలి. అరుుతే మరొక తీవ్ర ప్రమాదం కూడా పొంచి ఉంది. కులాంతర వివాహాలను, తమకు నచ్చని వివా హాలను ఆమోదించని తల్లిదండ్రులు, బంధువులే శత్రు వులుగా మారి చివరకు కూతుళ్లను అల్లుళ్లను హత్య చేరుుంచే దారుణాలు జరుగుతున్నారుు. ఖాప్ పంచా యతీల నుంచి, వివాహ వ్యతిరేక ఫత్వాలనుంచి వధూ వరులను రక్షించే బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. పెళ్లి స్వేచ్ఛ ఉన్నా మోసంచేయడం నేరమే. అర్హులైన వారి ప్రేమస్వేచ్ఛను, జీవన హక్కును హరించడం చెల్లదు. తమకు ఈ ప్రమాదం ఉందని మేజర్ యువతీ యువ కులు దరఖాస్తు పెడితే, ఇతర అర్హతలన్నీ సరిపోరుున పక్షంలో, వారికి భద్రత కలిగించే ఏర్పాట్లు చేయాలి. వివాహాల నోటీసులను రిజిస్ట్రార్ కార్యాలయం అధి కారిక వెబ్సైట్లో ప్రచురించాలని, అనర్హుల వివాహాల నిరోధానికి ఇది ఉపయోగపడుతుందని సమాచార కమి షన్ నిర్ణరుుంచింది. (శశి వర్సెస్ ఎస్డీఎం కేసు నెంబర్ సీఐసీ, ఎస్ఏఏ, 2016, 001556 కేసులో ఆగస్టు 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
విద్యార్హతల వివరాలు రహస్యమా?
ప్రతి పట్టభద్రుడికి వచ్చిన మార్కుల వివరాలు, డిగ్రీలో చేరిన తేదీ, పూర్తి చేసిన తేదీ, మొదలైన వివరాలన్నీ ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది శాశ్వత రికార్డుగా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది రహస్య రికార్డు కాదు. చదువు సంగతి వ్యక్తి స్వవిషయమా లేక బహిరంగ సమాచారమా? పట్టభద్ర, స్నాతకోత్తర విద్య (పీజీ)లకు సంబంధించిన పట్టాల వివరాలు వ్యక్తుల సొంత సమా చారం కనుక రహస్యమంటూ ఎవరికీ చెప్పకూడదా? లేదంటే పదిమందికీ తెలియాలా? త్యాగి 1999లో ప్రైవేటు అభ్యర్థిగా పరీక్ష రాసి పట్టా సాధించాడు. అతని పట్టా వివరాలు అడుగుతూ సుభాష్ స.హ. దరఖాస్తు పెట్టుకున్నాడు. అది మూడో వ్యక్తి సొంత సమాచారమని కనుక ఇవ్వలేమని జవాబిచ్చాడు పీఐఓ. మొదటి అప్పీలులో కూడా సీబీఎస్ఈ వారు సమాచారం ఇవ్వలేదు. అతను కాలేజీకి వెళ్లకుండానే పరీక్ష రాసి ఉంటాడని సుభాష్ అనుమానిస్తున్నాడు. కాని ప్రైవేటు అభ్యర్థి అంటే అర్థం-పాఠాలు వినకుండా వెళ్లవచ్చనే. అయితే స.హ. చట్టం కింద చదువు వివ రాలు ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? అనే ప్రశ్న ముఖ్య మైంది. మార్కుల పత్రం ఇవ్వడానికి పేజీకి 250 రూపాయల చొప్పున ఇవ్వాలని పీఐఓ అడిగాడనీ ఇది సమాచారహక్కు నియమాలకు వ్యతిరేకమని సుభాష్ విమర్శించారు. మూడో వ్యక్తికి చెందిన సమాచారమే అనుకున్నా, అతని అభిప్రాయం తెలుసుకొనడానిక నోటీసులు ఇవ్వాలని చట్టం సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ఆయనకు అభ్యంతరం లేకపోతే ఇవ్వవచ్చు. ఒకవేళ వద్దని అంటే, ఆ సమాచారం వెల్లడించడంలో ప్రజా ప్రయోజనం ఏదన్నా ఉందా లేదా అని ఆలోచించే బాధ్యత సమాచార అధికారి మీద ఉంది. ఎందుకంటే ప్రైవేటు అభ్యర్థి తరగతులకు హాజరు కానవసరం లేదనేది సౌకర్యం. కనుక వ్యక్తిగత విషయాలని అనుకుంటే అందుకు ప్రజాప్రయోజనం లేదని తిరస్కరించవచ్చు. కాని అసలు సమస్య చదువుల సమాచారం సొంతమా కాదా అనేది. ఏడో తరగతి పాసైతే ఎనిమిదో తరగతిలోకి, పది పాసైతే ఇంటర్ మీడియెట్లోకి, అందులో ఉత్తీర్ణుడైతే డిగ్రీ చదువుకు అర్హత లభిస్తుంది. ప్రవేశించిన నాటి నుంచి విద్యాలయంలో ఉత్తీర్ణులయ్యే దాకా రిజిస్టర్లో నమోదు చేయడం, రిజల్ట్ ప్రకటించడం, మార్కుల శాతం, ఫస్ట్, సెకండ్ క్లాస్, డిస్టింక్షన్ వర్గీకరణ, ర్యాంకులు బంగారు పతకాలు ఉంటే ఆ వివరాలు, ఇవన్నీ ఎక్కడా సొంతం అని దాచుకోరు, ప్రతిచోటా చెప్పుకుంటారు, ర్యాంక్ అవసరమైతే పోల్చి చూసుకోవడానికి అడుగుతారు. పై చదువులకోసం, ఉద్యోగాల కోసం బయోడేటాలో విద్యార్హతలు ఏమిటో చెప్పుకోక తప్పదు. విద్యార్థులే స్వయంగా విద్యార్హత ప్రతులు, మార్కుల జాబితాలు ఇస్తూనే ఉంటారు. ఫొటోకాపీ సౌకర్యం లేనపుడు టైప్ చేయించి విద్యాధికుని సంతకాలు చేయించి ఇవ్వవలసి వచ్చేది. డిగ్రీ పూర్తికాగానే స్నాతకోత్సవం ఉంటుంది. కాన్వొకేషన్లో జరిగే పని పట్టాల ప్రదానమే. చదువులు ముగిసిన వారు ఆ చదువుల ఆధారంగా ఆ పట్టాలు ఎక్కుతారు. చదువుకున్న చదువు ఇచ్చే సంస్కారానికి తగ్గట్టుగా బతుకుతాం అని ప్రతి పట్టభద్రుడు ప్రమాణం చేయాలి. రాష్ర్ట ప్రభుత్వాధినేత అయిన గవర్నర్, విశ్వ విద్యాలయం ఛాన్స్లర్ హోదాలో విద్యార్థుల చేత ఆ ప్రమాణాలు చేయిస్తారు. పట్టాల పండుగ నాడు రాలేని విద్యార్థి అటువంటి ప్రమాణం ప్రతిమీద సంతకం చేసి ఇన్ ఆబ్సెన్షియా ఫారం నింపితేనే అతనికి పట్టా గైర్హాజరీలో ఇస్తారు. నిర్ణీత ఫీజు చెల్లించాలి. అంటే ఉత్సవంలో హాజరైనా కాకపోయినా ప్రమాణం తప్పదు. ప్రైవేటు హోదాలో చదివినా, తరగతులకు హాజరుకాక పోయినా పాఠాలు వినకపోయినా, పరీక్ష రాసి ఉత్తీర్ణుడైన ప్రతి పట్టభద్రుడు ప్రమాణం చేయాల్సిందే. విద్యార్హతలకు తగిన విధమైన జీవనం సాగిస్తామని బాస చేసిన విద్యావంతులు తమ విద్యార్జన వివరాలు రహస్యమని దాచుకుంటామంటే అది ఎంతవరకు చెల్లుతుంది? విచిత్రమేమంటే చాలా మంది విద్యార్థులకు ఈ వాగ్దానం గుర్తుండదు. తాము గైర్హాజరీ ఫారంలో కూడా వాగ్దానాన్ని రాసి కింద సంతకం చేసిన విషయం గుర్తుండదు. కనుక ఆ వాగ్దానాన్ని పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నే తలెత్తదు. కాని ఆ చదువులు, అర్హతలు, పట్టాలు బహిరంగ వ్యవహారాలనీ, దాచుకునే రహస్యాలు కాదనీ అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రతి పట్టభద్రుడికి వచ్చిన మార్కుల వివరాలు, డిగ్రీలో చేరిన తేదీ, పూర్తిచేసిన తేదీ, మొదలైన వివరాలన్నీ ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది శాశ్వత రికార్డుగా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది రహస్య రికార్డు కాదు. వివాహాల రిజిస్టర్ వలె, స్థిరాస్తి క్రయవిక్రయాల నమోదు రిజిస్టర్ వలె, ఇవి విశ్వవిద్యాలయ కార్యాలయాలలో కాపాడుకోవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. దీని ఆధారంగానే పట్టాల ప్రతులను ఇస్తారు. పోగొట్టుకున్న వారికి మళ్లీ పట్టా తయారుచేసి ఇస్తారు. ఈ రిజిస్టర్‌ను పరిశీలించడానికి, కావలసిన పేజీ ప్రతిని తీసుకోవ డానికి వీలుంది. ఈ హక్కు సమాచార హక్కు చట్టం రాకముందు కూడా ఉంది. (సుభాష్ చంద్రత్యాగి వర్సెస్ సీబీఎస్ఈ కేసు CIC/SA/2016/001451 లో సమాచార కమిషన్ 2016 జూలై27న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
లా శాఖకు హైకోర్టు చురక!
- విశ్లేషణ యాసిడ్ దాడి, రేప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని చంపే అధికారం మహిళలకు ఉందంటూ.. పార్లమెంటు ఐపీసీకి చేసిన సవరణ మరుగునపడితే మహిళ లకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుస్తుంది? బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌ఎస్‌యూఐ) విద్యార్థి వంశ్ శరద్ గుప్తకు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1972 పూర్తి పాఠం అవసరమైంది. ఎక్కడా దొర కలేదు. న్యాయ మంత్రిత్వ శాఖ లా విభాగం అధికారిక వెబ్సైట్ http://indiacode.nic.inలో ఆ చట్టం పాఠం ఉన్నా ఒక్క వాక్యం కూడా వరసగా చదవలేనంత జటిలంగా ఉంది. విద్యార్థులకు ఉపయోగమయ్యే ఈ వెబ్సైట్లో కొన్ని చట్టాలు అసలు చదవలేమనీ, ప్రైవేట్ పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలలో మూల చట్టం తప్పులు లేకుండా ఉందనలేమనీ, అధికారిక ప్రతినిధుల ఈమెయిల్ ఐడీలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 1908లో రూపొందించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ తాజా ప్రతి అధికారిక వెబ్సైట్లో లేదు. అడిగితే 1908 నాటి ప్రతిని, ఆ తరువాత పార్లమెంటు చేసిన వందకు పైగా సవరణల ప్రతులను ఇస్తున్నారు. వీటన్నింటిని సమన్వయం చేసి చట్టం పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. సవరణలను చేరుస్తూ నవీకరించిన తాజా ప్రతిని తయారు చేయవలసిన బాధ్యత శాసనాల విభాగానిదే. సవరించిన చట్టాల్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అమ్ముకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం సవరించిన ప్రతిని అందుబాటులోకి తేవలసి ఉంది. సవరించిన రూపంలో వందలాది చట్టాలను ఇచ్చే స్థితి లేదు. శాసన విభాగం పీఐఓ సవరించిన తాజా శాసన పాఠాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైందని, ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని వివరించారు. హిందీ భాషలో కూడా చట్టాలను అనువదించే కార్యక్రమం సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రస్తుత దశ, పూర్తయ్యే గడువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. దరఖాస్తుకు నెలరోజుల్లో జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు పట్టించుకోలేదు. తమ ఈ మెయిల్ పనిచేస్తుందో లేదో చూసుకోరు. తాము పాటించవలసిన చట్టాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ చట్టాల సమాచారం ప్రభుత్వం స్వయంగా వెల్లడించాల్సింది పోయి అడిగినా చెప్పకపోవడం ఆర్టీఐ ఉల్లంఘన అవుతుందంటూ విద్యార్థులకు కలిగిన నష్టాన్ని పూరించడానికి రూ.10 వేలను యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ప్రభుత్వమే నడిపే విశ్వవిద్యాలయానికి రూ. 10వేలు ఇస్తే ప్రభుత్వానికి ఏ నష్టమూ లేదు. ఇవ్వకపోతే యూనివర్సిటీ సీఐసీలో ఫిర్యాదు కూడా చేయకపోవచ్చు. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, అన్యాయమనీ నష్టపరిహారం ఆదేశం రద్దు చేయాలని శాసన మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాన్ని అస్పష్టంగా, అసందిగ్ధంగా అందుబాటులో లేకుండా చేయడం అంటే దాన్ని రహస్యంగా మార్చి చట్టాలను తెలుసుకునే ప్రజల హక్కును భంగపరచరాదని, ఐటీని ఉపయోగించుకుని చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అనీ, సవరణలతో సంస్కరించిన చట్టాల పూర్తి ప్రతులను వెబ్సైట్లో ఉంచాలనీ, గ్రంథాలయానికి పదివేలు పరిహారం ఇవ్వాలనీ, ిసీఐసీ ఆదేశిస్తే దానిపై రిట్ పిటిషన్ వేయడాన్ని ఢిల్లీ హైకోర్ట్టు ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. మహిళ తనపై యాసిడ్ దాడి జరిగినా, రేప్ ప్రయత్నం జరిగినా ఆత్మరక్షణ కోసం దాడి చేసే వ్యక్తిని చంపే అధికారం ఉందంటూ నిర్భయ చట్టం ద్వారా పార్లమెంటు ఇటీవల ఐపీసీని సవరించింది. ఈ సవరణతో కూడిన తాజా ఐపీసీని సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయకపోతే మహిళలు తమను రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుసుకుంటారు? ఇటువంటి తాజా శాసన సవరణ విషయాలను ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. దీనిపైన రిట్ దాఖలు చేసిన విద్యార్థి ఆర్టీఐని సరైన రీతిలో దరఖాస్తు వేయలేదని, ఫీజు ఇవ్వలేదని, మొదటి అప్పీలు వేయలేదని కనుక రెండో అప్పీలు వినరాదని శాసన విభాగం వాదించింది. దీన్ని తిప్పికొడుతూ ఢిల్లీ హైకోర్టు గణనీయమైన తీర్పు ఇచ్చింది. ిసీఐసీ తీర్పుపై విచారించేందుకు హైకోర్టు అప్పీలు కోర్టు కాదని, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అసలు న్యాయానికి అడ్డుతగలకూడదని హితవు చెప్పింది. సీఐసీ ఇచ్చిన ఆదేశం సమంజసమనీ, న్యాయ విధానాన్ని ముందుకు నడిపేదిగానూ ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ వివరించారు. అసలు చట్టాలు ఒక క్లిక్‌లో అందు బాటులో తేవాల్సిన బాధ్యత ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంపైన ఉందని సీఐసీ సరిగ్గానే చెప్పారు... ప్రభుత్వమే అన్ని చట్టాలను అందుబాటులో ఉంచాలి. రూ.10వేల పరిహారం గురించి లేవనెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేయడానికి రూ.10వేల కన్న ఎక్కువే ప్రభుత్వం ఖర్చుచేసి ఉంటుంది. కనుక సీఐసీ ఆదేశించిన రూ.10వేలను ఈ పిటిషన్ వేయడానికి కారకులైన అధికారుల జీతాలనుంచి మినహాయించి పరిహారం చెల్లించాలి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సామాన్య జనంపై.. కోర్టుల్లో ప్రభుత్వాలే సుదీర్ఘ సమరాలు చేయడం ఎంత అసమంజసమో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పులో వివరించింది. (సీఐసీలో ఈ రచయిత ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు రిట్ పిటిషన్(సి) 4761-2016లో మే 24 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com