Minister Arun Jaitley
-
మరింత సరళంగా జీఎస్టీ!
న్యూఢిల్లీ: త్వరలో జీఎస్టీ మరింత సరళంగా మారనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. జీఎస్టీలో 12, 18% పన్ను శ్లాబులను ఒక్కటి చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘‘ఆదాయం పెరుగుదల నేపథ్యంలో సాధారణ వినియోగ వస్తువులకు 12–18% మధ్య ఒక్క టే ప్రామాణిక పన్ను రేటును భారత్ కలిగి ఉండాలి. కనీస అవసరాలపై సున్నా శాతం, ఐదు శాతం పన్నుతోపాటు, లగ్జరీ ఉత్పత్తులపై ఉన్న 28 శాతం పన్ను రేటు కూడా ఉంటాయి’’ అని జైట్లీ చెప్పారు. ఈ మేరకు ‘18 నెలల జీఎస్టీ’ పేరుతో ఫేస్బుక్లో మంత్రి ఓ పోస్ట్ పెట్టారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘1216 కమోడిటీలు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. ఇందులో 183పై సున్నా పన్ను రేటు అమలవుతోంది. 308 కమోడిటీలపై 5%, 178పై 12%, 517పై 18% రేటుంది. సంపన్న, హానికారక వస్తువులు, ఆటో విడిభాగాలు, డిష్ వాషర్లు, ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), సిమెంట్‌పై 28% పన్ను ఉంది. జీఎస్టీకి మారడం పూర్తవడంతో మొదటి విడత రేట్ల క్రమబద్ధీకరణకు చేరువయ్యాం. సంపన్న, హానికారక వస్తువులపై తప్ప మిగిలిన వాటిపై 28 శాతం పన్ను రేటు తొలగిస్తాం’’ అని అరుణ్ జైట్లీ తన పోస్ట్‌లో వివరించారు. 28% రేటులో సాధారణంగా వినియోగించే సిమెంట్, ఆటో విడిభాగాలే ఉన్నాయని, తదుపరి భేటీలో సిమెంట్‌ను 28 శాతం నుంచి మార్చుతామని చెప్పారు. 12, 18 శాతం పన్ను రేట్ల స్థానంలో మధ్యస్థంగా ఒకటే రేటుకు రోడ్‌మ్యాప్ రూపొందించాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. పన్ను ఆదాయం భారీగా పెరగాల్సి ఉందన్నారు. పన్నులు తగ్గాయి జీఎస్టీపై వస్తున్న విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు. నూతన పన్ను చట్టంతో పన్ను రేట్లు దిగిరావడంతోపాటు, ద్రవ్యోల్బణం, ఎగవేతలు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘‘పన్ను రేట్లు తగ్గాయి. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. అధిక వసూళ్లు, వ్యాపారం సులభతరం అయ్యాయి. పన్ను క్రమబద్ధీకరణ అధిక భాగం పూర్తయింది. వృద్ధి శాతం రానున్న సంవత్సరాల్లో పెరుగుతుంది’’ అని జైట్లీ చెప్పారు. గత శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 23 వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పలు వస్తువులను 28% రేటు నుంచి తక్కువ రేటు పరిధిలోకి తీసుకొచ్చింది. ‘‘దేశాన్ని 31% పరోక్ష పన్ను రేటుతో అణచేసిన వారు జీఎస్టీని తప్పకుండా పరిశీలించి ఉండాల్సింది. బాధ్యతలేని రాజకీయాలు, బాధ్యతారాహిత్య ఆర్థిక విధానాలు పతనానికే దారితీస్తాయి’’ అంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. జీఎస్టీ ఆదాయం గురించి వివరిస్తూ... ఆరు రాష్ట్రాలు ఆదాయ వృద్ధి లక్ష్యాలను చేరుకున్నాయని, ఏడు రాష్ట్రాలు లక్ష్యానికి సమీపంలో ఉన్నాయని చెప్పారు. ఇక ఆదాయ వసూలు లక్ష్యాలకు 18 రాష్ట్రాలు దూరంలో ఉండిపోయినట్టు పేర్కొన్నారు. మొదటి ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు నెలవారీ సగటున రూ.89,700 కోట్లుగా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.97,100 కోట్లకు పెరుగుతాయని ఆయన చెప్పారు. హెచ్‌యూఎల్ 383 కోట్ల అక్రమ లాభార్జన రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదిలీ చేయలేదని గుర్తింపు న్యూఢిల్లీ: జీఎస్టీలో పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా అగ్రగామి ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) రూ.383 కోట్ల మేర అక్రమంగా లాభాన్ని గడించినట్టు జీఎస్టీలోని అక్రమ లాభాల వ్యతిరేక విభాగం (ఎన్ఏఏ) గుర్తించింది. చాలా ఉత్పత్తులపై పన్ను రేటును 28% నుంచి 18%కి తగ్గించినప్పటికీ, ఆ మేరకు రేట్లను తగ్గించకుండా హెచ్‌యూఎల్ పూర్వపు అమ్మకపు ధరలకే విక్రయించింది. దీంతో హెచ్‌యూఎల్ రూ.383.55 కోట్ల మేర ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు నిరాకరించినట్టు ఎన్ఏఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మొత్తంలో సగం మేర అంటే రూ.191.68 కోట్లను వినియోగదారుల సంక్షేమ జాతీయ నిధికి హెచ్‌యూఎల్ జమ చేయాల్సి ఉంటుంది. మిగిలిన సగాన్ని ఉత్పత్తులు విక్రయించిన రాష్ట్రాల్లోని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. అయితే, జాతీయ నిధికి హెచ్‌యూఎల్ ఇప్పటికే రూ.160.23 కోట్లను జమ చేసింది. దీంతో మిగిలిన మేర జమ చేయాలి. -
జైట్లీపై ‘పిల్’ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. పిల్ వేయడానికి తగిన కారణమేమీ కనిపించడం లేదని, పైగా ఆర్థికమంత్రినే ఈ పిల్లో ప్రధాన పార్టీని చేయడం తగదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది .పిల్‌ను చూస్తుంటే, ఆర్థికమంత్రే డబ్బు కాజేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. తొలుత సుప్రీం కాస్ట్ విధించలేదు. పిల్‌ను కొట్టివేసిన తర్వాత కూడా న్యాయవాది వాదనలను కొనసాగించడంతో న్యాయస్థానం సంబంధిత కాస్ట్ విధించింది. -
డీఆర్ఐ భేష్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించే కేసులను డీల్ చేసే డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్)పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని అన్ని విచారణా సంస్థలు, ఏజెన్సీల్లో డీఆర్ఐ మాత్రమే ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. డీఆర్ఐ 61వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కస్టమ్స్ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్ లాంటి నేరాలను విచారించే అత్యున్నత సంస్థ డీఆర్ఐకి ఆయన కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అత్యున్నతమైన ప్రమాణాలు పాటించడం, విచారణను అతి గోప్యంగా ఉంచడం, పరిపూర్ణమైన సాధికార సంస్థగా మారాలన్న యోచనతో పనిచేయడం డీఆర్ఐకి చాలా అవసరమని సూచించారు. రచ్చ మంచిది కాదు ప్రాథమిక విచారణ ఆరంభం కాగానే తాము కనుగొన్న విషయాలను మీడియాకు వెల్లడించాలన్న దుగ్ధను ఆపుకోవాలని ఏజెన్సీ అధికారులకు అరుణ్‌జైట్లీ చురకలు వేశారు. ప్రతిచిన్న విషయాన్ని తుర్రుమంటూ మీడియా ముందు పంచుకోవడం సబబు కాదన్నారు. ఏజెన్సీలంటే అత్యున్నత వృత్తి ప్రమాణాలు పాటించాలని, అంతేకాని విచారణకు అవరోధాలు కలిగించేలా రచ్చకెక్కడం మంచిది కాదని చెప్పారు. ఇలా మీడియా ముందుకు పరిగెత్తే బదులు విచారిస్తున్న కేసులో బలమైన సాక్ష్యాలు సంపాదించేందుకు యత్నించాలన్నారు. విచారణాధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ జరపాలని హితవు చెప్పారు. నేరాన్ని రుజువు చేసి దోషులకు జరిమానాలు, శిక్షలు పడేలా చేయడమే ఏజెన్సీలకు అసలైన పరీక్షని చెప్పారు. మీడియా దృష్టి పడకుండా విచారణ సాగించడమే అధికారులకు మంచిదని జైట్లీ చెప్పారు. స్వీయ నియమావళి కీలకం విచారణా సంస్థల చుట్టూ వివాదాల ముసురు ముట్టిన వేళ ఇకపై అనవసరమైన ఆరోపణలు రాకుండా ఉండేందుకు కొన్ని నైతిక నియమాలుండాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు అత్యున్నతమైన వృత్తి ప్రమాణాలు పాటించడం, అనవసరంగా రచ్చకెక్కకుండా ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు పరిగెత్తకుండా సంయమనం పాటించడం.. లాంటి నియమాలు పాటించాలని జైట్లీ సూచించారు. నైతిక విలువలు, సమగ్రత, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడంపైనే ఒక ఏజెన్సీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని తెలిపారు. వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం కాగా వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. -
టాప్–50లోకి చేరడం సాధ్యమే: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల జాబితాలో టాప్–50లోకి చేరడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో భారత్ గతేడాది 100వ ర్యాంకు నుంచి ఈ ఏడాది 77వ స్థానానికి చేరుకున్న నేపథ్యంలో జైట్లీ తన స్పందనను ఓ బ్లాగులో తెలియజేశారు. టాప్–50లోకి చేరడానికి భారత్ 27 స్థానాల దూరంలో ఉన్నట్టు చెప్పారు. అసాధ్యంగా అనిపించేది, ఇప్పుడు సాధ్యమేనని చెప్పారాయన. ‘‘మోదీ సర్కారు హయాంలో మన దేశం 65 స్థానాలు ముందుకు వచ్చింది.’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. -
తగిన స్థాయిలోనే మారక నిల్వలు: జైట్లీ
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ తాజాగా జీవితకాల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ.. భారత్ వద్ద ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. టర్కీ ఆర్థిక సంక్షోభం కారణంగా ఫారెక్స్ మార్కెట్లో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఇప్పుడున్నటువంటి నిల్వలతో సమర్థవంతంగా ఎదుర్కునే సత్తా భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు. కరెన్సీ మార్కెట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నట్లు తెలిపారు. 403 బిలియన్ డాలర్లకు నిల్వలు రూపాయి మారకం విలువ 71 స్థాయికి క్షీణించడంతో కొన్నాళ్ల కిందటే గరిష్టస్థాయిలను నమోదుచేసిన మారక నిల్వలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కేంద్ర బ్యాంక్ సమాచారం ప్రకారం ఆగస్టు 3 నాటికి ఫారెక్స్ నిల్వలు 403 బిలియన్ డాలర్లుగా నిలిచాయి. అంతక్రితం వారం నాటి నిల్వలతో పోల్చితే 1.49 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే డాలరుతో రూపాయి విలువ 6.7 శాతం క్షీణించింది. -
మనసున లేనిది!
రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి. మాట జారితే వెనక్కు తీసుకోలేం. అలాగని మౌనంగా ఉండిపోతే.. మాట జారినప్పుడు జరిగే నష్టం కన్నా కొన్నిసార్లు మాటను బిగబట్టి ఉంచడమే ఎక్కువ చేటు చేస్తుంది. మరి ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనం వహించాలి? విజ్ఞులు, స్థితప్రజ్ఞులు అనుకుంటాం కానీ.. వారి దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి. ఇక మౌనం అనేది రక్తమూ కాదు. మాంసమూ కాదు. ఉద్వేగమూ కాదు. ఊహించిన ఉపద్రవాన్నో, ఊహించని ఉత్పాతాన్నో తప్పించుకోవడానికి మనిషి ఆశ్రయించే స్థితి. అది కొన్నిచోట్లే పనిచేస్తుంది. మిగతాచోట్ల మనిషిని అనామకం చేస్తుంది. ‘నిరర్థక మౌనం’ అవుతుంది. దాని కన్నా మాటే నయం. ప్రాణి అన్నాక యాక్షనో, రియాక్షనో ఉండకపోతే ఎలా! ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ మధ్య పెద్దగా మాట్లాడ్డం లేదు. ఏవో ఆరోగ్య కారణాలు. ఆయనకు బదులుగా ‘లా’ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నారు. మంత్రులకూ వాళ్లకూ ఎలా మాట్లాడాలో కూడా ప్రసాద్ చెబుతున్నారు. ‘కుఠువా’ మీద అలా మాట్లాడకండి, ‘ఉన్నావ్’ మీద అలా మాట్లాడండి అని ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. మోదీ అయితే.. ‘ఆచితూచి మాట్లాడండి’ అనే ఆదేశం కూడా జారీ చేశారు. అలా ఆదేశం జారీ అయిన కొద్ది గంటలకే కేంద్రమంత్రి సంతోష్ కుమార్ మాట జారారు. ‘ఇంత పెద్ద దేశంలో ఒకటీ అరా రేపులు జరగవా?!’ అన్నారు. తర్వాత.. ‘నా ఉద్దేశం అది కాదు’ అన్నారు. ఉద్దేశాలు ఏవైనా ఒకసారి జారిపోయాక మళ్లీ లేవలేం. ఒక్కోసారి ఉద్దేశం లేకుండా మాట వచ్చేస్తుందని మనోవైజ్ఞానిక నిపుణులు అంటారు. ‘ఫ్రాయిడియన్ స్లిప్’ అంటారు అలా జారడాన్ని. మనసులో లేనిది మాటగా బయటికి రావడం! సరే, వచ్చింది. నష్ట నివారణ ఏమిటి? రవిశంకర్ ప్రసాద్ అయితే ఒక మార్గం చెబుతున్నారు. ‘ట్విట్టర్ ఉంది కదా. అక్కడ మీ మాటలకు కరెక్షన్ చేసుకోండి’ అని. మాట గాయానికి ట్విట్టర్ కట్టు! – మాధవ్ శింగరాజు -
‘ప్రధానికి కేసీఆర్ దాసోహమయ్యారు’
సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై తనదైనరీతిలో విరుచుకుపడ్డారు. మోదీకి కేసీఆర్ దాసోహమయ్యారని, అందుకే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు లేకున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమన్నారు. కేసీఆర్ దేశం విడిచి పారిపోకుండా తన పాస్‌పోర్టును డీజీపీకి అప్పగించాలని ఎద్దేవా చేశారు. -
అరుణ్ జైట్లీ రాయని డైరీ
బడ్జెట్‌కి ముందు రోజు రాత్రి మోదీజీ నన్ను ఇంటికి పిలిచారు. నేనుండేది కైలాష్ కాలనీలో. మోదీజీ ఉండేది లోక్ కల్యాణ్ మార్గ్‌లో. పది కిలోమీటర్ల దూరం. ఇరవై నిమిషాల ప్రయాణం. నేను వెళ్లేసరికి ‘పంచవటి’లో మోదీజీ ఒక్కరే ఉన్నారు. బాల్కనీలో నిల్చుని దూరంగా ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు. ‘‘ప్రశాంతంగా లేను జైట్లీజీ’’ అన్నారు.. తల తిప్పకుండానే, నా అలికిడి విని. పంచవటి ప్రశాంతంగా ఉంటుంది. పంచవటిలో ఉన్నవాళ్లకే ప్రశాంతత ఉండదు! పంచవటిలో బీజేపీ ఒక టర్మే ఉంది. తర్వాత వనవాసంలోకి వెళ్లింది. తర్వాత మళ్లీ పంచవటిలోకి వచ్చింది. తర్వాత మళ్లీ వనవాసమేనా? ‘‘పంచవటి పేరైనా మార్చాలి. పంచవటి ఉన్న ప్లేస్ అయినా మార్చాలి మోదీజీ.. మనం’’ అన్నాను. ‘‘దేని గురించి జైట్లీజీ మీరు మాట్లాడుతున్నది?’’ అన్నారు మోదీజీ. ‘‘ప్రశాంతత గురించి మోదీజీ’’ అన్నాను. ఇద్దరం పక్కపక్కనే నిలబడి ఆకాశంలోకి చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. నిశ్శబ్దంగా ఉన్నారు మోదీజీ. ‘‘ఆకాశంలో ఏం చూస్తున్నారు మోదీజీ?’’ అని అడిగాను. ‘‘సామాన్యుడిని చూస్తున్నాను జైట్లీజీ. అందుకే ప్రశాంతంగా లేను’’ అన్నారు ఆయన.. ఇంకాస్త డీప్‌గా ఆకాశంలోకి చూస్తూ. ‘‘జైట్లీజీ.. మీ బడ్జెట్‌తో ధనవంతుడిని కొంచెం సామాన్యుడిగా, సామాన్యుడిని కొంచెం ధనవంతుడిగా మార్చగలరా?’’ అని అడిగారు. ఆ మాట కూడా ఆకాశంలోకి చూస్తూనే అడిగారు. నేనూ ఆకాశంలోకే చూస్తున్నాను. అక్కడ నాకు సామాన్యుడు కనిపించడం లేదు. మోదీజీ కనిపిస్తున్నారు! ఇక్కడున్న మోదీజీ ఆకాశంలో ఉన్న సామాన్యుడిని చూస్తున్నట్టుగానే, ఆకాశంలో కనిపిస్తున్న మోదీజీ ఇక్కడున్న సామాన్యుడిని చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. చేతులెత్తి దండం పెట్టాను! ‘‘ఎవరికి దండం పెడుతున్నారు జైట్లీజీ? సామాన్యుడికేనా?’’ అన్నారు మోదీజీ. మోదీజీలోని ప్రత్యేకత అదే. తనకు కనిపిస్తున్నదే అందరికీ కనిపిస్తూ ఉంటుందని అనుకుంటారు. ‘‘అవును మోదీజీ’’ అన్నాను. ‘‘పది కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నిముషాల్లో ఎవరైనా దాటేస్తారు జైట్లీజీ. ఇరవై కిలోమీటర్ల దూరాన్ని పది నిముషాల్లో దాటగలిగినవాళ్లే సామాన్యుడికి ఏమైనా చేయగలరు’’ అన్నారు మోదీజీ! అర్థమైంది. ఆకాశంలో మోదీజీ చూస్తున్నది సామాన్యుడిని కాదు. ఎవరి మీద కోపం వచ్చినా.. వారిని సామాన్యుడిలో చూసుకుంటారు మోదీజీ. అది ఆయనలోని ఇంకో ప్రత్యేకత. - మాధవ్ శింగరాజు -
రైతు బడ్జెట్ అంటే ఇదేనా?
త్రికాలమ్ వ్యాపార దృష్టి ఉన్నవారికి వ్యవసాయం అర్థం కాదు. వ్యవసాయదారులకు వ్యాపారం అంతుబట్టదు. వ్యవసాయంతో బొత్తిగా సంబంధం లేని వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీకీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకీ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన అవగాహన ఉన్నట్టు కనిపించడంలేదు. గుజరాత్ స్థానిక ఎన్నికలలోనూ, అసెంబ్లీ ఎన్నికలలోనూ రైతులు ఎదురు తిరిగిన ఫలితంగా గట్టి దెబ్బ తగిలిన తర్వాత మోదీకి రైతుల గోడు పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. జైట్లీ వార్షిక బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలి తాలు వెల్లడైనాయి. రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోవడమే కాకుండా వాటి పరిధిలోని మొత్తం 17 శాసనసభ స్థానాలలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గణనీయమైన మెజారిటీలు సాధించిందనే వార్త అధికార పార్టీ నేతలకు దిగ్భ్రాంతి కలి గించింది. 2014లో నగరజీవులతో పాటు రైతులు సైతం సమధికోత్సాహంతో ఓట్లు వేయబట్టే బీజేపీ మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలవగలిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు యూపీఏ–2 ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మిని మమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పి) చాలా తక్కువనీ, తాము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ స్వామినా«థన్ కమిటీ చేసిన సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తామనీ నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్ళు దాటినప్పటికీ వ్యవసాయదారుల పరిస్థితిలో మార్పులేదు. రుణభారం కారణంగా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. వ్యవసాయానికి పెద్దపీట? వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుం టున్నామనీ, ఖరీఫ్ తరుణంలో పంటలకు ఎంఎస్పిని స్వామినాథన్ చెప్పిన సూత్రం ప్రకారం నిర్ణయిస్తామనీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ‘హింగ్లీష్’ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది గొప్ప వరమనీ, రైతులను కష్టాల కడలి నుంచి రక్షించేందుకు ఉపకరిస్తుందనీ చెబుతూ ఉత్తరాది ప్రజలకు స్పష్టంగా, సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ భాగం మాత్రం హిందీలో చదివారు. ఎన్డీఏ బడ్జెట్ అటు స్టాక్మార్కెట్నూ, ఇటు వ్యవసాయరంగాన్నీ ఆగ్రహానికి గురి చేసింది. మధ్య తరగతినీ, ఉద్యోగ వర్గాలనూ నిరాశానిస్పృహలకు లోనుచేసింది. ఇన్ని వర్గాలకు సమానంగా మనస్తాపం కలిగించిన బడ్జెట్ ప్రతిపాదనలను జైట్లీ సమర్పించడం విశేషం. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలనే విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి బలమైన తార్కాణం 2015లో కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్టు. ఉత్పత్తి వ్యయంపైన యాభై శాతం అదనంగా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించడం సాధ్యం కాదని అందులో వాదించింది. అసలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మోదీ ఎన్నడూ ప్రస్తావించలేదంటూ కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్ 2017 మే నెలలో దబాయించారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్వయంగా ఈ నివేదిక గురించి ప్రస్తావించారు కనుక ఇప్పుడు ఎవ్వరూ కాదనలేరు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని బడ్జెట్‌కు ముందురోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయదారుల ఆదాయం పెరగడం లేదనీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదనీ, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారనీ నివేదించింది. వాతావరణంలో మార్పుల కారణంగా పంట దిగుబడి, వ్యవసాయదారుల ఆదాయం 25 శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది. రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోని రాష్ట్రం అంటూ దేశంలో ఈ రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర లోని విదర్భ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి అధికం. కానీ పంజాబ్ వంటి వ్యవసాయ విజయాలు సాధించిన రాష్ట్రంలోనూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న (భావాంతర్ భుక్తన్ యోజన) మధ్యప్రదేశ్‌లో కూడా రైతులు అప్పుల చెర నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మృత్యుముఖంలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న రైతులు ఏమి కోరుకుంటున్నారు? రైతు సంఘాలు చేస్తున్న మొదటి డిమాండ్ రుణమాఫీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పశ్చిమ యూపీలో రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రధాని ఆ రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలకు దాన్ని వర్తింపజేయలేదు. ఇతర రాష్ట్రాలలో ఆ ఊసే లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీ ఎన్నికలలో గట్టెక్కడానికి రుణమాఫీ మంత్రం ప్రయోగించారే కానీ దానిని ఒక విధానంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మోదీ సిద్ధంగా లేరు. అప్పు చేసి వ్యవసాయం చేసిన రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోతే వాటిని ఎట్లా తీర్చాలి? వ్యవసాయం గిట్టుబాటు అయ్యేవిధంగా కనీస మద్దతు ధర నిర్ణయించి, ఇంతవరకూ చేసిన రుణాలను రద్దు చేయగలిగితే బక్కౖ రెతు హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో కౌలు రైతుల సంఖ్య గణనీయం. వారికి రుణ సౌకర్యం కల్పించాలన్నది వ్యవసాయ సంఘాల రెండో డిమాండ్. ‘రుణ హామీ నిధి’ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులకు పూచీగా ప్రభుత్వం నిలవాలని వాటి అభ్యర్థన. వ్యవస్థాగతమైన రుణ సదుపాయం లేని కారణంగానే కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తున్నారనీ, బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చుననీ 1998లో ఆత్మహత్యల పరంపర మొదలైనప్పటి నుంచీ వ్యవసాయ సంఘాల నాయకులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నారు. రుణహామీ నిధిని జైట్లీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. నీతి ఆయోగ్ రూపొందించిన ‘భూమి కౌలుచట్టం’ ముసాయిదా కౌలుదారుల కంటే భూయజమానులకే అనుకూలంగా ఉంది. ఇదే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్పి నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఇందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేదు. అంత వ్యవధి ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతులను ఆదుకొని వారి ఓట్లు సంపాదించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ఎంఎస్పిని ఉదారంగా నిర్ణయించడమే కాకుండా వేగంగా, సమర్థంగా అమలు చేయాలి. నానాటికి తీసికట్టు ఎన్డీఏ హయాంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతలు నానాటికి తీసికట్టుగా ఉన్నాయనడానికి నిదర్శనం మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖ కేటాయింపుల తగ్గుదల. నిరుడు బడ్జెట్ వ్యయంలో వ్యవసాయ శాఖ వాటా 2.38 శాతం. మొన్నటి బడ్జెట్ ప్రతిపాదనలలో అది 2.3 శాతానికి పడిపోయింది. బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా రైతుల బతుకులను ఎట్లా బాగుచేస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు నిర్మిస్తామనీ, 22,000 గ్రామీణ మార్కెట్ యార్డ్‌లను అభివృద్ధి చేస్తామనీ ఆర్థికమంత్రి చేసిన ప్రతిపాదనలు స్వాగతించదగినవే. కానీ రైతులోకం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యకు ఇటువంటి అరకొర చర్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? నీరసించిపోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే పని అసంకల్పితంగానే మోదీ చేస్తున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది అందుకే. స్వామినాథన్ ఏమన్నాడు? రబీ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్పి నిర్ణయించామనీ, వచ్చే ఖరీఫ్‌కి కూడా అదేవిధంగా చేస్తామనీ జైట్లీ ప్రకటించారు. ఇంతకీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయదారుల జాతీయ కమిషన్ సర్వేలూ, చర్చలూ, సంప్రదింపులూ నిర్వహిం చింది. 2006లో మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా సాగు వ్యయం–ధరల కమిషన్ (సీఏసీపీ) పంట పండించడానికి పెట్టిన ఖర్చుకు మూడు రకాల నిర్వచనాలు ఇచ్చింది. ఒకటి ఏ2. రెండు ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడు సీ2. పంటలు పండించే క్రమంలో రైతు నగదు రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ చెల్లించిన మొత్తాలు కలిపి ఏ2 అంటారు. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, కూలీ, ఇంధనం, నీటి సరఫరా, తదితరాలపైన పెట్టిన ఖర్చుల మొత్తం ఇది. ఎఫ్ఎల్(ఫ్యామిలీ లేబర్) అంటే పొలంలో పనిచేసే కుటుంబ సభ్యుల శ్రమ విలువ. దీనిని లెక్క కట్టి ఏ2కి కలిపితే వచ్చేది ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. మూడో పద్ధతి అత్యంత సమగ్రమైనది. రైతుకు శ్రేయస్కరమైనది. ఏ2 ప్లస్ ఎఫ్ఎల్లో కలిపినవే కాకుండా భూమిని ఎవరికైనా అద్దెకు ఇస్తే వచ్చే అద్దె మొత్తం, దాని పైన వడ్డీ మొత్తం, ఇతరత్రా ఖర్చు కూడా కలిపితే వచ్చే మొత్తం సీ2. కేంద్ర ప్రభుత్వం 2018 రబీ పంటల నిమిత్తం 2017 అక్టోబర్‌లోనే ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే స్వామినాథన్ సూచించిన సూత్రం తేలికగా బోధపడుతుంది. టన్ను వరిధాన్యం పండించేం దుకు ఏ2 నిర్వచనం కింద రూ. 840 ఖర్చు అవుతుందనీ, ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ కింద రూ. 1,117 అవుతుందనీ, సీ2 ప్రకారం రూ. 1,484 ఖర్చు కాగలదనీ సీఏసీపీ నిర్ణయించింది. ఎంఎస్పిని రూ. 1,550గా ప్రతిపాదించింది. ఖరీఫ్‌లో ఇది ఎని మిది శాతం పెరిగి రూ. 1,675 కావచ్చు. ఎంఎస్పిని ఇరవై పంటలకు నిర్ణయిం చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది బియ్యం, గోధుమలను మాత్రమే. ఇది కూడా జాతీయ ఆహార భద్రతాచట్టం అమలు చేయడం కోసం విధిగా ఆహారధాన్యాలు కొనాలి కనుక. 2015లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వెల్ల డించిన గణాంకాల ప్రకారం 5.8 శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్పి రేటుకు ప్రభుత్వానికి ఆహారధాన్యాలు విక్రయించారు. మిగిలినవారంతా దళారుల కబంధహస్తాలలో చిక్కినవారే. వ్యవసాయదారుల సంస్థలు బడ్జెట్లో ప్రస్తావించిన ఎంఎస్పిపైన ఇంకా స్పష్టత రావలసి ఉన్నదని స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ఎంఎస్పి కంటే మార్కెట్ రేటు తక్కువ ఉంటే ప్రభుత్వం ఎంఎస్పి రేటుకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనీ, లేదా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు మండల స్థాయిలో పరిశోధన కేంద్రాలు నెలకొల్పాలనీ, నష్ట నివారణలో నైపుణ్యం కలిగిన ఒక మహిళనూ, ఒక పురుషుడినీ ప్రతి పంచాయతీ నుంచి ఈ కేంద్రాలలో నియమించాలనీ స్వామినాథన్ సూచించారు. మధ్యదళారుల పాత్రను రద్దు చేయడం, రైతులే వినియోగదారులకు నేరుగా ఆహారధాన్యాలు విక్రయించే వ్యవస్థను నిర్మించడం ద్వారా వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని పరిష్కరించవచ్చు. 1980ల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధి రేటు సగటున 2.5 శాతానికి మించలేదు. రైతు ఆదాయాన్ని ఐదారు సంవత్సరాలలో రెట్టింపు చేయాలంటే ఏటా15–20 శాతం వృద్ధి సాధించాలి. అది అసాధ్యం. ఇతర వినిమయ వస్తువులలాగానే ఆహారధాన్యాల ధరలను కూడా ఉత్పత్తిదారులకు గణనీయమైన లాభం లభించే విధంగా నిర్ణయించినప్పుడే రైతు లోగిలిలో విషాదం తొలగి పోయి ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకు మహారాష్ట్రలో జోరందుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఇంతకాలం ఆ సంస్థలపైన విధిస్తున్న 30 శాతం పన్ను రద్దు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్మడం ఈ సంస్థల బాధ్యత. మధ్యదళారులను పూర్తిగా తొలగించి, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ఠం చేసి, వ్యవస్థీకృతమైన రుణ సదుపాయం కలిగించి, వ్యవసాయ విస్తరణ అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహించి, సాగునీరు అందించేందుకు విశేష ప్రయత్నం చేయగలిగితే రైతులూ, కౌలురైతులూ కోలుకుం టారు. వ్యవసాయం తెలిసినవారూ, వ్యాపారంలో నైపుణ్యం ఉన్నవారూ భుజం భుజం కలిపి సమష్టిగా కృషి చేస్తే వ్యవసాయం కూడా లాభసాటి వ్యాసంగం కావచ్చు. ఈ దిశగా బృహత్ ప్రయత్నం జరగాలి. - కె. రామచంద్రమూర్తి -
అభాగ్యులకు అద్భుతమైన వరం ‘మోదీ కేర్’
అవలోకనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్) ప్రశంసనీయమైనది. అద్భుతమైనది. దీని అమలుకు ఎన్నో అవాంతరాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదని అంటున్నారు. ఇది నిజమే అయినా ఈ పథకం అమలు మొదలైతే అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను ఇది వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మారుస్తుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆశ్చర్యకరమైన, ఊహకం దని కోణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది రక్షణ వ్యయం అనుకున్నం తగా లేకపోవడం. ఇది రక్షణ నిపుణులను అసంతృప్తికి గురిచేసింది. మన దేశం ఏటా సైన్యంపై రూ. 4 లక్షల కోట్లు వ్యయం చేస్తుంది. జనాభాలో 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించదల్చుకున్న ఆరోగ్య బీమాకు ఖర్చయ్యేది రూ. 10,000 కోట్లు మాత్రమే. పింఛన్ కింద సైన్యానికిచ్చేది దీనికన్నా పది రెట్లు ఎక్కువ. ఆ వ్యయం ఇంచుమించు లక్ష కోట్లు. ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ అనేది పోస్టుమాన్, స్వీపర్ లేదా టీచర్ వంటి మరే ఇతర ప్రభుత్వోద్యోగి పొందని సౌకర్యం. రిటైరైన సైనికులు మాత్రమే ఈ పేద దేశంలో అలాంటి ప్రయోజనాలు సాధించుకోగలిగారు. రక్షణకు చేసే ఈ రూ. 4 లక్షల కోట్ల వ్యయంలో సీఆర్పీఎఫ్, ఇతర దళాలకు మన దేశం ఖర్చుచేసే రూ. 30,000 కోట్లు చేరదు. ఈ దళాలు కశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాశ్వత ప్రాతిపదికన రక్షణ బాధ్యతలు నిర్వ ర్తిస్తుంటాయి. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) కింద ఇవి కూడా ‘సాయుధ బలగాల’ నిర్వచనం కిందికొస్తాయి. ఆ చట్టం కింద రక్షణ పొందుతాయి. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని తగ్గించలేదు. ఆ వ్యయాన్ని 2014 నుంచీ ఏటా దాదాపు 6 శాతం మాత్రమే పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. అంటే కాస్త హెచ్చు తగ్గులతో వాస్తవ వ్యయం ఎప్పుడూ ఒకేలా ఉంటోందన్న మాట. ఒకపక్క చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ దశలో మన దేశం ఆ సవాలును ఎదుర్కొనడానికి సిద్ధపడటం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మాటలు తీవ్రంగా ఉన్నా చేతల్లో సాదాసీదాగా ఉండే మోదీ ఈ వైఖరిని నావరకైతే తెలివైనదిగానే భావిస్తాను. మనం నిరాయుధ దేశంగానో, ఒక చెంప కొడితే మరో చెంప చూపే విధంగా ఉండాలనో నేను అనడం లేదు. దేశాలు సైన్యాన్ని నిర్వహించుకోవడంపై నాకేం అభ్యంతరం లేదు. కానీ మన భద్రతకు సంబంధించి సరైన దృష్టికోణం ఉండాలి. అందుకు తగినట్టుగా ప్రాముఖ్యతనీయాలి. సగటు భారతీయ పౌరుడు చైనా దురాక్రమణ బెడద కంటే వ్యాధుల వల్ల లేదా పేదరికం వల్ల ఎక్కువ ప్రభావితమవుతాడు. అలా చూస్తే మనం రక్షణకు చెల్లించే మూల్యం రూ. 4 లక్షల కోట్లు, రక్షణ దళాల పింఛన్ కోసం చేసే లక్ష కోట్ల వ్యయం మరీ ఎక్కువనిపిస్తుంది. ఇతర నిపుణులు ఏమైనా అనుకోవచ్చుగానీ ఇలా పరిమితి పెట్టుకోవడం లేదా చడీ చప్పుడూ లేకుండా తగ్గించడం ద్వారా మోదీ చాలా మంచి పని చేశారనిపిస్తుంది. ఇక మోదీ కేర్‌గా అభివర్ణిస్తున్న ఆరోగ్యబీమా గురించి మాట్లాడుకుందాం. ఇది పది కోట్లమందికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఒక్కో కుటుంబంలో అయిదు గురు ఉంటారనుకుంటే దీనివల్ల 10 కోట్లమంది ప్రజానీకం లాభపడతారని భావించవచ్చు. ఈ కుటుంబాలన్నీ ఏడాదికి గరిష్టంగా రూ. 5 లక్షల చొప్పున లబ్ధి పొందుతాయి. ఈ పథకం గురించి నిపుణులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అందులో మొదటిది– ఆ పథకానికి జైట్లీ తగినంత కేటాయింపు చేయలేదన్నదే. అందుకు కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. వాస్తవానికి అంతకన్నా చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్యబీమా కల్పించడమంటే కుటుంబంలో ఒక్కొక్కరికి రూ. 1,100– రూ. 1,400 మధ్య చికిత్స కోసం ఖర్చు చేయదల్చుకున్నట్టు. అంటే ఆ పథకానికి ఏటా దాదాపు రూ. 11,000– రూ. 14,000 కోట్ల మధ్య ఖర్చవుతుంది. రెండోది– ఇప్పుడు జైట్లీ చేసింది కేవలం ప్రకటన మాత్రమే. ఆ పథకం గురించి, దాని అమలు గురించి విధివిధానాలు రూపొందించడానికి మరో ఆర్నెల్లు పడుతుంది. ఆ తర్వాతే పథకాన్ని అమలు చేస్తారు. ఇవన్నీ ముందు ఖరారు చేసుకుని ప్రకటించి ఉంటే బాగుండేది. మూడోది–పథకానికయ్యే వ్యయంలో సగం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంది. నాలుగు–ఈ తరహా పథకాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నాయి. అవి ప్రభావవంతంగా లేవు. అయిదు–ప్రామాణికమైన ఆస్పత్రి సదుపాయం లేకపోవడమన్నది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దేశంలో చాలాచోట్ల మంచి వైద్య సౌకర్యాలు లేవు. మౌలిక సదుపాయాల లేమిని బీమా ఆధారిత పథకం పరిష్కరించలేదు. ఆరు– వైద్య సదుపాయాల విషయంలో మన ప్రభుత్వాసుపత్రులు ప్రపంచంలోనే అత్యంత నాసిరకమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో పని ఎగ్గొట్టే తత్వం, జవాబుదారీతనం లేమి అధికం. సారాంశంలో ఇది పాలనకు సంబంధించిన సమస్య కూడా. దీన్ని ఉపే క్షించి బీమా పథకాలను రూపొందించడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోదగ్గవే. పరిష్కరించవలసినవే. అయినా ఈ ఆరోగ్య పథకం అద్భుతమైనదే. ఇప్పటికిది ప్రకటన మాత్రమే అయినా ఏదో దశలో ప్రభుత్వం వ్యయం చేయకతప్పనిది. ఈ పథకం దేశంలో అత్యంత బలహీనుల, అభాగ్యుల ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆరోగ్య పరిరక్షణను జాతీయ స్థాయి చర్చలోకి తెస్తుంది. రక్షణ, ఒకే ర్యాంక్–ఒకే పింఛన్ వంటి అంశాల్లా ఇన్నాళ్లూ ఇది చర్చకు రాలేదు. ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నంతకాలం ఈ పథకానికి అవసరమైన నిధులు లభిస్తాయి. ఆ నిధులు వచ్చాక పేద రోగులు సౌకర్యాల కోసం డిమాండు చేయడం ప్రారంభిస్తారు. రూ. 5 లక్షల పరిమితి సరిపోతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ కారణాలన్ని టివల్లా ఈ నిర్ణయం అద్భుతమైనదని నేననుకుంటున్నాను. మోదీ తన రాజకీయ జీవితంలో అవలంబిస్తూ వచ్చిన మెజారిటీ మతతత్వ విధానాలపై నాకు ప్రేమ గానీ, సానుభూతిగానీ లేవు. ఆయన ఏలుబడిలో జరిగినవి అత్యంత భయానకమై నవి, భీతిగొలిపేవి. అయితే మంచి చేసినప్పుడు ప్రశంసించడానికి అవి అడ్డు రాకూడదు. ఈ ఆరోగ్యపథకం జాతీయ స్థాయి సంభాషణను మార్చేసింది. అందుకే దీనికి మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి 5వ స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017–18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు. విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది. అంతర్రాష్ట్ర వాటాలు ఇలా.. అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది. మంత్రి కేటీఆర్ హర్షం విదేశీ ఎగుమతుల్లో 5వ స్థానంలో తెలంగాణ నిలవడం హర్షణీయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఉత్పత్తి రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరసన నిలవటం గర్వంగా ఉందన్నారు. -
సంస్కరణలతో పారదర్శకత, సమర్థత
సింగపూర్: మూడు కీలక సంస్కరణలైన ఆధార్ అనుసంధానం, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల వ్యవస్థలో పారదర్శకత, పాలనలో సమర్థత పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి తక్కువ నగదు కలిగిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ సంస్కరణలు సాయపడ్డాయన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఇన్వెస్టర్లతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రంగానికి ప్రేరణనిచ్చేందుకు భారత సర్కారు వరుస సంస్కరణలు అమలు చేసిందని చెప్పారు. జూలై 1 నుంచి ప్రవేశపెట్టిన జీఎస్టీతోపాటు బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అంశాలను జైట్లీ ప్రస్తావించారు. రీక్యాపిటలైజేషన్‌తో రెండు రకాల బ్యాలన్స్ షీట్ల సమస్యకు తెరపడుతుందని, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లధన నియంత్రణకు గాను గతేడాది తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆ తర్వాత దానికి కొనసాగింపుగా తీసుకున్న చర్యలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాల్లో మార్పులు అన్నీ భారత్‌ను మరింత స్వేచ్ఛాయుత, పెట్టుబడిదారీ స్నేహపూర్వక దేశంగా చేయాలన్న లక్ష్యంతోనేనని జైట్లీ వివరించారు. కేంద్ర సర్కారు గత మూడేళ్ల కాలంలో తీసుకున్న అనేక చర్యల ఫలితంగానే ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల సూచీలో భారత్ 142వ స్థానం నుంచి 100వ స్థానానికి చేరుకుందన్నారు. కాగా, రెండు రోజుల పర్యటనకు గాను సింగపూర్ వచ్చిన జైట్లీ సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ సీఈవో, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. భారత్‌లో పలు రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. -
సినిమాను కాపాడండి- సీనియర్ నటుడు
తమిళసినిమా: సినిమాను కాపాడండి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీకి నటుడు కమలహాసన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విధానం (జీఎస్టీ) జూలై 1న అమల్లోకి రానుంది. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని కోలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఈ విషయం పునఃపరిశీలించి పన్ను శాతాన్ని తగ్గించని పక్షంలో తాను సినిమాను వదిలేస్తానని నటుడు కమలహాసన్ ఇటీవల దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని తాము తప్పు పట్టడం లేదని, సినిమా టిక్కెట్లపై ఈ పన్ను విధానంతో 28శాతం అదనంగా భారం పడుతుందని, దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలకు తీవ్ర ముప్పు కలుగుతుందని కమలహాసన్ అన్నారు. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్‌ను వేడుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ సినిమాను కాపాడాలని కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీకి విజ్ఞప్తి చేశారు. -
స్వచ్ఛ ఎకానమీపైనే దృష్టి...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బెంగళూరు: సాహసోపేత నిర్ణయాలతో స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ సాధనే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, తద్వారా వచ్చే రాబడులను పేదల సంక్షేమానికి వినియోగించడంపైనే దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. బడ్జెట్ విశ్లేషణపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ అంశాలు తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నిర్ణయాధికారమే ఉండేది కాదని, కానీ దానికి భిన్నంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ క్రియాశీలకంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో రక్షణాత్మక ధోరణులు, అంతర్జాతీయంగా అనూహ్య మందగమనం వంటి వాటి ప్రభావం భారత్‌పై లేదని ’మేక్ ఇన్ ఇండియా–కర్ణాటక’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడులపైనే ప్రధాన దృష్టితో భారత్ ముందుకు సాగుతోందన్నారు. అసంఘటిత ఎకానమీని సంఘటిత వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు. దీనివల్ల రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ఆదాయాలు పెరగగలవన్నారు. -
నగదు బదిలీ... పన్నుల కోత!
2016–17 ఆర్థిక సర్వే చెబుతోందిదే... పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ ప్రతిపాదన సబ్సిడీల స్థానంలో అమలు చేయాలని సూచన ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలి... రియల్ ఎస్టేట్‌పై స్టాంప్ డ్యూటీలో కోత విధించాలి... మరింత మంది పన్ను పరిధిలోకి ... ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు షాక్... 6.5 శాతానికి పడిపోవచ్చు వచ్చే ఏడాది 6.75–7.5 శాతంగా అంచనా జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ ఫలాలు, నిర్మాణాత్మక సంస్కరణలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులే జీఎస్టీ పరిధిలోకి భూ, ఇతర స్థిరాస్తి లావాదేవీలు... పన్ను పరిధిలోకి ఇక వ్యవసాయ ఆదాయం! నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించేందుకు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాల మంత్రాన్ని ప్రయోగించనుందా? అరుణ్ జైట్లీ అటు సామాన్యులు, వేతన జీవులకు.. ఇటు కార్పొరేట్ వర్గాలకూ తీపి కబురు అందిస్తారా? సంస్కరణ మోత మోగుతుందా? ఆర్థిక సర్వే నివేదికను చూస్తే నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి పెద్దపీటవేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక పథకాల రూపంలో పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి... దీని స్థానంలో నగదు బదిలీ(సార్వత్రిక కేనీస ఆదాయం–యూబీఐ)ని ప్రవేశపెట్టాలంటూ సర్వే సూచించింది. అంతేకాదు.. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ)తో పాటు కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని పేర్కొంది. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు షాక్ తప్పదని తేల్చిచెప్పింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించినప్పటికీ.. వచ్చే ఏడాది మళ్లీ భారీగా పుంజుకోనుందని అభిప్రాయపడింది. మొత్తంమీద చూస్తే.. జైట్లీ ‘డ్రీమ్ బడ్జెట్’పై నెలకొన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016–17 ఆర్థిక సర్వేలో ప్రధానంగా దీన్ని ప్రస్తావించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నట్లుగా... ప్రజల కడగండ్లను తుడిచిపెట్టాలంటే పేదలందరికీ కనీస ఆదాయాన్ని(యూబీఐ) అందించాలంటూ సర్వేలో సూచించారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీలన్నింటినీ తొలగించి.. యూబీఐని ప్రవేశపెట్టాలని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది(2016–17) వృద్ధి రేటు కనీసం అర శాతం మేర దిగజారి 6.5 శాతానికి మందగించవచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం తిరిగి వృద్ధి 6.75–7.5 శాతం స్థాయికి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం చూసినా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపింది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. వ్యవసాయ ఆదాయంపైనా పన్ను...? ప్రభుత్వం పన్నుల తగ్గింపు విషయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని సర్వే సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్ల తగ్గింపునకే పరిమితం కాకుండా.. కార్పొరేట్ పన్నుల కోతకు సంబంధించిన కార్యాచరణ(టైమ్‌టేబుల్)ను వేగవంతం చేయాలని పేర్కొంది. అంతేకాదు ‘అధిక ఆదాయం కలిగిన వారందరూ’ పన్నులు కట్టేవిధంగా పన్నుల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఈ అధిక ఆదాయం కలిగినవారందరూ అంటే ఎవరనేది మాత్రం నిర్వచించలేదు. ప్రస్తుతం పన్నుల పరిధిలో లేని వ్యవసాయ ఆదాయాన్ని ఈ విధంగా ప్రస్తావించి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణల జోరు పెంచాలి... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు, డీమోనిటైజేషన్ ఫలాలతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలన్నీ అమలు చేయగలిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పరుగులు తీయడం ఖాయమని సర్వే నొక్కిచెప్పింది. మన ఆర్థిక వ్యవస్థకున్న వాస్తవ సామర్థ్యం ప్రకారం మధ్యకాలికంగా 8–10 శాతం వృద్ధిని అందుకోవడం సాధ్యమేనని తెలిపింది. 2015–16లో జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది(తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7.9 శాతం). ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతానికి తగ్గొచ్చనేది ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే, డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని ఈ అంచనాల్లో పూర్తిగా లెక్కలోకి తీసుకోలేదు. సంస్కరణల అమలు, విధానాత్మక చర్యల విషయంలో వెనకడుగు వేస్తే.. మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కూడా డీమోనిటైజేషన్ ప్రతికూలతలను ఆర్థిక వ్యవస్థ చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. రిస్కులపై అప్రమత్తత అవసరం... ‘నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరతతో కొన్ని వ్యవసాయోత్పత్తుల సరఫరాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పాలు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయల ఉత్పాదకత దిగజారింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పప్పుదినుసుల విషయంలో ఎదురైన తీవ్ర పరిస్థితులు(ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్నంటడం) ఇప్పుడు ఇతర వ్యవసాయోత్పత్తులపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సర్వే సూచించింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర ఎగబాకుతుండటం... అగ్ర దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పొంచిఉన్నాయని గుర్తుచేసింది. ‘క్రూడ్ ధర బ్యారెల్‌కు 60–65 డాలర్లకు గనుక ఎగబాకితే.. దేశీయంగా వినియోగం తగ్గేందుకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులకు ఆస్కారం తగ్గుతుంది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో ప్రైవేటు పెట్టుబడులను కూడా దెబ్బతీస్తుంది. అధిక క్రూడ్ ధర కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్క్ అధికమవుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని వివరించింది. సాధారణ స్థాయికి నగదు సరఫరా... నోట్ల రద్దు కారణంగా నెలకొన్న కరెన్సీ కొరత క్రమంగా తగ్గుము ఖం పడుతోందని సర్వే పేర్కొంది. కొత్త కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులోకి వస్తుండటంతో ఆర్థిక వృద్ధి కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘డీమోనిటైజేషన్ అనేది ద్రవ్యపరంగా అత్యంత అసాధారణ పరిణామాలకు కారకమైంది. నగదు సరఫరా, చలామణీని వ్యవస్థ నుంచి భారీగా తగ్గించేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మరోరకంగా కరెన్సీ భారీగా పెరిగింది. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తుందన్న విశ్వాసం పెంచాలంటే.. పన్ను చెల్లింపులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గుముఖం పడతాయి’ అని సర్వేలో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ వల్ల స్వల్పకాలంలో భారం పడినప్పటికీ.. దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చిచెప్పింది. జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టే్టట్... డీమోనిటైజేషన్ చాలా శక్తివంతమైన ప్రక్రియ అని.. దీని ప్రయోజనాలు కనబడాలంటే తగిన చర్యలు అవసరమని సర్వే ఐదంచెల వ్యూహాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జీఎస్టీ పరిధిని మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా నల్లధనం పోగుపడేందుకు మూలకారణంగా నిలుస్తున్న భూ క్రయవిక్రయాలు, ఇతరత్రా స్థిరాస్తి లావాదేవీలు, కార్యకలాపాలను జీఎస్టీ కిందికి తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లతో పాటు రియల్ ఎస్టేట్ స్టాంప్ డ్యూటీలను కూడా తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఐటీ పరిధిని నెమ్మదిగా విస్తరించాలని.. దీనికి రాజ్యాంగపరంగా తగిన విధానాలను పాటించాలని సూచించింది. అసమానతలను తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచాలని పేర్కొంది. ఈ ఏడాది చేపట్టిన అత్యంత కీలకమైన పాలసీ చర్యల్లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం... రూ.1,000; రూ.500 నోట్ల రద్దు నిలుస్తాయని తెలిపింది. జీఎస్టీ వల్ల భారత్‌లో ఏకీకృత మార్కెట్‌ను సృష్టిస్తుంది. పన్ను చెల్లింపులు, పరిపాలన మెరుగుపడటంతో పెట్టుబడులు, వృద్ధికి చేయూత లభిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకారం(కోపరేటివ్ ఫెడరలిజమ్) కొత్త పుంతలు తొక్కుతుంది’ అని పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై– నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాజా స్కీమ్)తో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.1 శాతానికి ఎగబాకనుంది. గతేడాది ఈ వృద్ధి 1.2 శాతమే. పారిశ్రామిక రంగం వృద్ధి మాత్రం 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గొచ్చు. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం. పొదుపులను ప్రోత్సహించాలి. దీనివల్ల విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడకుండా పెట్టుబడి నిధులు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలి. సామాజికపరమైన మార్పులకు దీర్ఘకాలంగా పరిష్కృతం కాకుండా ఉన్న మూడు కీలకమైన సవాళ్లను భవిష్యత్తులో మనం అధిగమించాల్సి ఉంటుంది. సంపద పంపిణీలో అసమర్థతలు, ప్రైవేటు రంగం–ప్రాపర్టీ హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి, సామర్థ్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి పుంజుకోలేకపోతుండటం వీటిలో ఉన్నాయి. ప్రతికూలతలను గుర్తించింది.. పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు .. ఎకానమీ ఎదుర్కొంటున్న ఎదురుగాలులను ఆర్థిక సర్వే స్పష్టంగా గుర్తించిందని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో సాహసోపేతమైన ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు. సంస్కరణలతో బడ్జెట్.. సర్వే బట్టి చూస్తే బడ్జెట్ సాహసోపేతంగా, సంస్కరణలతో కూడుకున్నదిగా ఉండొచ్చని తెలుస్తోంది. మౌలిక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. – రిచర్డ్ రేఖీ, సీఈవో, కేపీఎంజీ ఇండియా సవాళ్లు.. అవకాశాలు.. ఎకానమీ ఎదుర్కొం టున్న సవాళ్లు.. ముందున్న అవకాశాలను సర్వేలో స్పష్టంగా ప్రస్తావించారు. డిమాండ్‌కు ఊతమివ్వడం, పన్ను రేట్లు తగ్గించడం, పన్ను విధానాలను సంస్కరించడం తదితర చర్యలతో పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన మంచిదే. – పంకజ్ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలుండాలి.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, జీఎస్టీ అమలు ద్వారా ఎగుమతులకు మరింత ఊతమివ్వాలి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఎకానమీకి మళ్లీ ఊపిర్లూదేలా.. ఉపాధి కల్పనపై మరింత దృష్టి పెట్టాలి. అపారెల్ తదితర విభాగాల్లాగానే లెదర్, ఫుట్‌వేర్ రంగాలకూ సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వాలి. – ఎస్సీ రాల్హన్, ప్రెసిడెంట్, ఎఫ్ఐఈవో డిమాండ్‌కు తోడ్పాటు ఉండాలి.. డిమాండ్‌కు ఊతమిచ్చే లా బడ్జెట్ ఉండగలదని ఆశిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్సేషన్ వంటి ప్రత్యక్ష పన్నులను కొంత సడలిస్తే ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఆందోళనకరంగా రక్షణాత్మక ధోరణులు.. ప్రపంచ ఎకానమీకి పొంచి ఉన్న రిస్కులు.. వాటి ఫలితంగా చమురు రేట్ల పెరుగుదల, వాణిజ్య సమస్యలS రూపంలో భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాలను సర్వే గుర్తించింది. భారతీయ ఎగుమతులను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. – సునీల్ కనోడియా, ప్రెసిడెంట్, అసోచాం -
నగదు డిపాజిట్ చేసినంత మాత్రాన...నలుపు.. తెలుపైపోదు!
►డీమోనిటైజేషన్‌తో కరెన్సీ గోప్యత తొలగిపోయింది ►నల్లధనం ఎవరిదో బయటికొస్తుంది... ►భారీ డిపాజిట్లతో వడ్డీరేట్లు దిగొస్తున్నాయి ►ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసినంతమాత్రాన నల్లధనం చట్టబద్ధమైనదిగా మారిపోదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో కరెన్సీ గోప్యత అనేది పూర్తిగా తొలగిపోయిందని.. ఇప్పుడు నల్లధనం ఎవరిదనేది బయటపడుతుందని పేర్కొన్నారు. ‘డీమోనిటైజేషన్.. గత రెండు నెలల పరిస్థితి’ పేరుతో జైట్లీ ‘ఫేస్బుక్’లో చేసిన పోస్ట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యవస్థలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లలో 97 శాతం బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నల్లధనాన్ని ఏరిపారేయడంలో నోట్ల రద్దు సమర్థతపై పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు ఇక తొలగిపోయినట్లేనని... ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు. వడ్డీరేట్లు దిగొస్తున్నాయ్... డీమోనిటైజేషన్ కారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెల్లువెత్తడంతో వడ్డీరేట్లు దిగొచ్చేందకు దోహదం చేసిందని ఆర్థిక మంత్రి చెప్పారు. రుణ లభ్యత పెరగడంవల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకుంటుందని జైట్లీ వివరించారు. ‘86 శాతం కరెన్సీని(జీడీపీలో దీని వాటా 12.2 శాతం) మార్కెట్ నుంచి వెనక్కిలాగేసి.. దీని స్థానంలో కొత్త కరెన్సీని చేర్చడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ నిర్ణయంతో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇది ఎంతో సాహసోపేతమైన, శక్తియుక్తులతో కూడుకున్న చర్య. తాత్కాలికంగా కొన్ని సమస్యలు, విమర్శలు రావడం సహజం. ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రతికూలత ఉంటుంది. అయితే, బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల బారులు ఇప్పుడు కనబడటంలేదు. కొత్త కరెన్సీ సరఫరా(రీమోనిటైజేషన్) ప్రక్రియ జోరందుకోవడమే దీనికి కారణం’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్ను ఎగవేతను అనైతికంగా భావించడంలేదు... ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోయినా ఏమీ కాదులే అన్న ధోరణి కారణంగా దేశానికి చాలా నష్టం వాటిల్లిందనన్నారు. ‘125 కోట్లకుపైగా ప్రజలున్న ఇంత పెద్ద దేశంలో గత ఆర్థిక సంవత్సరం(2015–16) కేవలం 3.7 కోట్లమంది మాత్రమే పన్ను రిటర్నులు దాఖలు చేశారు. పన్ను ఎగవేతల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పన్ను ఎగవేత అనేది అనైతికంగా ఎవరూ భావించడంలేదు. జీవితంలో ఇదో భాగమైపోయింది. చాలా ప్రభు త్వాలు దీన్ని సర్వసాధారణమైన విషయంగానే కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఈ ‘సాధారణ’ అంశంలో మార్పువస్తుంది. అంతేకాదు మన దేశ ప్రజల వ్యయ ధోరణులు కూడా మారతాయి. సంస్కరణలు ఏవైనాకూడా విధ్వంసపూరితంగానే ఉంటాయి. తిరోగమన పంథాలో మార్పునకు దోహదం చేస్తాయి. డీమోనిటైజేషన్‌తో నిజాయితీపరులకు ప్రయోజనం లభిస్తుంది. మోసపూరితంగా వ్యవహరించేవారికి శిక్ష తప్పదు’అని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో ‘రంగు’ తేలుతుంది.. బ్యాంకుల్లోకి భారీస్థాయిలో వచ్చిన డిపాజిట్లను వడపోసే ప్రక్రియ జరుగుతోందని.. ఇందులో నల్లధనం గనుక బయటపడితే సంబంధిత వ్యక్తులను బయటికి లాగుతామని జైట్లీ చెప్పారు. ‘లెక్కచూపని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడిస్తే తక్కువ పన్నుతో బయటపడొచ్చు. అదే ఐటీ శాఖ గనుక పట్టుకుంటే భారీగా పన్ను, జరిమానా కక్కాల్సిందే’నని జైట్లీ స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్ ప్రక్రియ మొదలయ్యాక ప్రజలు చాలా ఓపిక, సహనంతో వ్యవహరించారని.. అశాంతి అనేది ఎక్కడా కనబడలేదన్నారు. అదే వారిద్దరికీ తేడా... ‘ప్రధాని మోదీ భావితరం శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనంతా వచ్చే పార్లమెంటు సమావేశాలను ఎలా అడ్డుకోవాలనేదానిపైనే ఉంది. అదే వారిద్దరి మధ్య తేడా’ అని జైట్లీ విమర్శలు గుప్పించారు. ‘నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలన్నీ కొరగాకుండా పోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోతుందంటూ వాళ్లు చేసిన గగ్గోలు తప్పని తేలింది. ప్రతిపక్షాల వైఖరివల్ల పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సాంకేతికత, మార్పు, సంస్కరణలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరం. నల్లధనానికి అనుకూలంగా వాళ్లు పనిచేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం’ అని జైట్ల పేర్కొన్నారు. -
ఉమ్మడి నియంత్రణపై పీటముడి
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కుదరని ఏకాభిప్రాయం ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలుపై నీలినీడలు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ నమూనా చట్టాలపై అంగీకారం పరిహార నిధిని పెంచాలని రాష్ట్రాల డిమాండ్ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులపై ఉమ్మడి నియంత్రణ అంశంలో శుక్రవారం ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు దాదాపు అసాధ్యమేనని భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం రెండో రోజు భేటీలో కేవలం జీఎస్టీ సహాయ చట్టాలపై అంగీకారం కుదిరింది. గత మూడు సమావేశాల నుంచి ఉమ్మడి నియంత్రణ, కీలకమైన ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ)పై కేంద్ర, రాష్ట్రాలు ప్రదర్శిస్తోన్న పట్టువిడుపు ఈ భేటీలోను కొనసాగింది. దీంతో జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించే తదుపరి భేటీలో వీటిపై అవగాహనకు రావచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపాక ఇంతవరకూ ఏడుసార్లు జీఎస్టీ కౌన్సిల్ భేటీ కాగా... కీలక అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని నాలుగు నెలలకు బదులు రెండు నెలలకోసారి చెల్లించాలని భేటీలో నిర్ణయించారు. నోట్ల రద్దుతో రాష్ట్రాలS ఆదాయాలకు గండి పడిందని, పరిహార నిధిని పెంచి ఆదుకోవాలంటూ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఏప్రిల్ 1 గడువుకు కట్టుబడి ఉన్నా: జైట్లీ భేటీ అనంతరం జైట్లీ మాట్లాడుతూ... సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ), ఎస్జీఎస్టీ(రాష్ట్రాల ఎస్జీటీ) నమూనా చట్టాలపై ఏకాభిప్రాయంతో పాటు పరిహార చట్టంపై అవగాహన కుదిరిందన్నారు. ‘అంగీకారం కుదరని ప్రధానాంశాల గురించి చెప్పాలంటే...ఐజీఎస్టీ, ఉమ్మడి నియంత్రణలపై ఏకాభిప్రాయం రాలేదు. ఉమ్మడి నియంత్రణపై జనవరి 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ఆ తర్వాతే ఏ వస్తువులు ఏ పన్ను పరిధిలోకి రావాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్ 1న జీఎస్టీ అమలుకు కట్టుబడి ఉన్నారా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘అందుకోసం శక్తి మేర ప్రయత్నిస్తున్నా.’ అని చెప్పారు. ఇంతవరకూ అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని, ఎక్కడా ఓటింగ్ లేదా ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలబించలేదన్నారు. నమూనా చట్టాలకు ఆమోదం జీఎస్టీ చట్టం ఆమోదం అనంతరం అమలుకు పరిశ్రమ వర్గాలు కోరుతున్న మూడు నెలల గడువుపై స్పందిస్తూ... అన్ని అడ్డంకులు అధిగమించాక ఆ అంశంపై చర్చిస్తామన్నారు. ‘మన ప్రయత్నం ఏంటంటే... వీలైనంత త్వరగా జీఎస్టీ ఆమోదం పొందడం.. మనం సరైన దిశలో వెళ్తున్నామని నేను భావిస్తున్నా’ అని చెప్పారు. గత మూడు సమావేశాల్లో భవిష్యత్ నమూనా చట్టాలతో పాటు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ నమూనా చట్టాల్లో 197 నిబంధనలు, 5 ప్రకరణల్నీ ఆమోదించామని వెల్లడించారు. ఉమ్మడి నియంత్రణపై మాట్లాడుతూ... ‘కేవలం ఒకే జీఎస్టీ చట్టం, రెండు నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని... అయితే పన్ను లెక్కల నిర్వహణ పరిధిని ఎలా విభజించాలన్నదే అసలు ప్రశ్న. అది చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని తెలిపారు. మాకూ పరిహారం కావాలి.. జీఎస్టీ అమలు అనంతరం కేవలం 4, 5 రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తే సరిపోతుందని కేంద్రం భావించగా... తాజాగా మరిన్ని రాష్ట్రాలు తమకూ పరిహారం చెల్లించాలంటూ ముందుకొస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడ్డ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సాయం చేయాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. దీంతో పరిహార చట్టంలో మార్పులు చేయనున్నారు. సెస్సు వసూలుతో ఏర్పాటు చేసే పరిహార నిధి మొత్తాన్ని పెంచడంతో పాటు.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన ఇతర పన్నులపై కూడా సెస్సు విధించే అవకాశముంది. ఈ అంశంపై జైట్లీ స్పందిస్తూ... ‘పరిహారం కేవలం జీఎస్టీ అమలుకు సంబంధించింది మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రతి రెండు నెలలకు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. నోట్ల రద్దుతో 30% ఆదాయం కోల్పోయాం: రాష్ట్రాలు ప్రస్తుతం నిర్ణయించిన రూ. 55 వేల కోట్ల పరిహార నిధి సరిపోదంటూ భేటీ అనంతరం పలు రాష్ట్రాలS ఆర్థిక మంత్రులు పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం చాలా రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 20–30 శాతం వరకూ మూడో, నాలుగో త్రైమాసికాల్లో రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోయాయని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా చెప్పారు. తమిళనాడు, జమ్మూ కశ్మీర్ ఆర్థిక శాఖ మంత్రులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
పన్ను నియంత్రణపై జీఎస్టీలో ప్రతిష్టంభన
ఏ పన్ను ఎవరి నియంత్రణలో ఉండాలన్న దానిపై విభేదాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ల తాజా వివరాలకు రాష్ట్రాల పట్టు నవంబర్ 24, 25 తేదీల్లో తదుపరి సమావేశం న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ)లో ఏయో పన్ను చెల్లింపుదారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సభ్యుల మధ్య అంగీకారం కుదరలేదు. పన్ను రేట్లకు గురువారం నాటి భేటీలో కౌన్సిల్ ఏకగీవ్రంగా ఆమోదం తెలపగా... పన్ను నియంత్రణపై విభేదాలతో త్వరితగతిన జీఎస్టీ అమలుకు అడ్డంకులేర్పడ్డాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు సాధ్యం కాకపోవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ తరగతి పన్ను చెల్లింపుదారులు కేంద్రం పరిధిలో ఉండాలి? ఏ తరగతి పన్నులు రాష్ట్రాల నియంత్రణలో ఉండాలి? అన్నదానిపై కేంద్ర, రాష్ట్రాలు చెరోవాదన వినిపించాయి. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్ చెల్లింపుదారులకు సంబంధించి తాజా వివరాలు అందుబాటులో లేకపోవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో నవంబర్ 9, 10 న జరగాల్సిన కౌన్సిల్ తదుపరి భేటీని రద్దు చేశారు. ఆ భేటీలో జీఎస్టీ ముసాయిదా చట్టంతో పాటు, ఇతర సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల్ని ఖరారు చేయాల్సి ఉంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు నవంబర్ 20న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమై... ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తారు. నవంబర్ 19న కూడా సమావేశమవుతాయని రాష్ట్రాల మంత్రులు తెలిపారు. వచ్చే భేటీలో డ్రాఫ్ట్ చట్టాలకు ఆమోదం తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నవంబర్ 24, 25 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిర్వహిస్తారు. ఆ భేటీలో పన్నులపై ద్వంద్వ నియంత్రణకు పరిష్కారంతో పాటు, ఏ పన్ను చెల్లింపుదారులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ), సీజీఎస్టీ(సెంట్రల్ జీఎస్టీ), ఎస్టీఎస్టీ(స్టేట్ జీఎస్టీ) ముసాయిదా చట్టాల్ని ఆమోదిస్తారు. భేటీకి ముందు జైట్లీ ఆశాభావం వ్యక్తం చేస్తూ... జీఎస్టీకి సంబంధించిన అన్ని విధివిధానాలు నవంబర్ 22లోపు పూర్తవుతాయని చెప్పారు. నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్ల్లమెంటు శీతాకాల భేటీలో సంబంధిత చట్టాలు ఆమోదం పొందుతాయన్నారు. హడావుడి నిర్ణయాలు వద్దు: రాష్ట్రాలు పన్నులపై ద్వంద్వ నియంత్రణ. ఇతర ఇబ్బం దులుంటే జీఎస్టీ అమలు ఆలస్యం అయ్యే అవకాశముందని సమావేశంలో పాల్గొన్న ఒక మంత్రి వెల్లడించారు. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని తాము కోరుకోవడం లేదని, సమాచారం మొత్తం అందాకే పన్నుల నియంత్రణపై తుది నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్‌పై తాజా వివరాలు అందుబాటులో లేవని, వాటి అందచేయాలంటూ కేంద్రాన్ని కోరామని మరో మంత్రి పేర్కొన్నారు. రూ. 1.5 కోట్ల కంటే తక్కువ సేవా పన్ను చెల్లింపులపై రాష్ట్రాలకు కూడా అధికారం ఉండాలని కోరారు. సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై విభేదాలు పన్నులపై ద్వంద్వ(కేంద్ర, రాష్ట్రాలు) నియంత్రణ సమస్య నివారిస్తూ... వేటిపై ఎవరికి అధికారం ఇవ్వాలన్న అంశంపై కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. 11 లక్షల సర్వీస్ ట్యాక్స్ ఖాతాలపై తమ నియంత్రణ ఉండాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా... కేంద్ర ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్షిక ఆదాయం రూ. 1.5 కోట్ల వరకూ ఉండే పన్ను ఖాతాల నియంత్రణ నుంచి రాష్ట్రాలు తప్పుకోవాలనేది కేంద్రం వాదన. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశంలో అంగీకారం కుదిరినా... అక్టోబర్ 19న నిర్వహించిన మూడో సమావేశంలో మాత్రం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. -
అరుణ్ జైట్లీ ఫోన్లో ఏం చెప్పారు?
సంభాషణ వివరాలను సీఎం చంద్రబాబు బయటపెట్టాలి: బొత్స హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనతో ఏం మాట్లాడారో.. ప్రత్యేక హోదాపై ఏం హామీ ఇచ్చారో ఆ సంభాషణ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడుకోవడం అనేది వారి వ్యక్తిగత వ్యవహారం కానే కాదని, అది ఏపీ ప్రజలకు సంబంధించిన విషయం కనుక వెల్లడించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తొలి రెండు రోజులు తమ సీట్ల వద్దే ఉండి నినాదాలు చేసిన టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి ఏం హామీ లభిస్తే బుధవారం సభలో మెదలకుండా ఉండిపోయారో... ఆందోళన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఎందాకైనా పోరాడుతాం ప్రత్యేక హోదా తప్ప వైఎస్సార్సీపీకి మరేమీ ఆమోదయోగ్యం కాదని బొత్స తేల్చిచెప్పారు. హోదా కోసం ఎంత దాకా అయినా పోరాడుతామన్నారు. ఏ ముఖ్యమంత్రి పైనైనా కేంద్రం గతంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందా? అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదా? ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ సీఎం పై విచారణ వేయలేదా? అని బొత్స గుర్తు చేశారు. కాగా, పోలవరానికి సంబంధించిన పత్రాలు ఏపీ నుంచి సకాలంలో అందనందువల్లే అనుమతులను పక్కన పెట్టామని కేంద్రం చెప్పడం సిగ్గు చేటన్నారు. -
రెట్రోస్పెక్టివ్ పన్నులపై వన్‌టైమ్ సెటిల్మెంట్కు ఒత్తిడి చేయం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలకూ పన్ను వర్తింపు) కేసులకు సంబంధించి వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం ఒత్తిడి చేయబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఒకపక్క, ఇలాంటి కేసుల్లో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ప్రభుత్వం కూడా రెట్రోస్పెక్టివ్ చట్టం ప్రకారం కొత్తగా ఎలాంటి నోటీసులూ జారీచేయదని చెబుతున్నప్పటికీ.. వొడాఫోన్, కెయిర్న్లకు గత నెలలో తాజాగా పన్ను నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఇప్పటికే పన్ను అసెస్మెంట్ ఆదేశాలు పంపిన కంపెనీలకు నిబంధనల ప్రకారం నోటీసుల జారీ కొనసాగుతుందని జైట్లీ స్పష్టం చేశారు. లేదంటే గతంలో నోటీసులు పంపిన అధికారులను కాగ్, సీబీఐలు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ‘నోటీసులు అందుకున్న కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్(పన్ను అసలు మొత్తాన్ని కడితే, వడ్డీ, జరిమానాలను మాఫీ చేయడం)కు ఓకే చెప్పొచ్చు. ఈ స్కీమ్ ప్రభుత్వం కల్పించిన ఒక ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే. దీన్ని ఆమోదించడం తప్పనిసరేమీకాదు. కావాలంటే, సంబంధిత కంపెనీలు తమ న్యాయపరమైన చర్యలను(లిటిగేషన్) కొనసాగించవచ్చు’ అని జైట్లీ తేల్చిచెప్పారు. 2006లో భారత్‌లోని వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆర్జించిన మూలదన లాభాలపై రూ.29,000 కోట్లమేర(దీనిలో వడ్డీయే రూ.18,000 కోట్లు) చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ గత నెలలో కెయిర్న్ ఎనర్జీకి తుది నోటీసులు జారీచేయడం తెలిసిందే. 2007లో హచిసన్ నుంచి 67 శాతం వాటా కొనుగోలుపై మూలధన లాభాల పన్ను కింద(వడ్డీ, జరిమానా కలిపి) రూ.14,200 కోట్లు చెల్లించాల్సిందిగా వొడాఫోన్‌కు కూడా ఐటీ శాఖ నోటీసులు పంపింది. జువెలర్స్‌పై వేధింపులు లేకుండా చర్యలు... పన్ను అధికారులు ఆభరణాల వర్తకులను వేధించకుండా ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుందని జైట్లీ హామీనిచ్చారు. అయితే, జువెలరీ లాంటి విలాసవంతమైన ఉత్పత్తులను పన్నుల జాబితాలో లేకుండా వదిలిపెట్టడం కుదరదని ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, ఆభరణాలపై సుంకం ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ; ఆల్ ఇండియా బులియన్ జువెలర్స్-స్వర్ణకార్ ఫెడరేషన్(ఏఐబీజేఎస్‌ఎఫ్) ఆదివారం స్పష్టం చేశాయి. కొన్ని జువెలరీ సంఘాలు కొనసాగిస్తున్న దేశవ్యాప్త సమ్మె 26వ రోజుకు చేరింది. -
ఎగవేతదారులపై సెబీ కొరడా
నిధులు సమీకరించకుండా నిషేధం ♦ కంపెనీల బోర్డు పదవులకూ నో న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్యలు తీసుకుంది. బ్యాంకు రుణాలఉ ఉద్దేశపూర్వకంగా ఎగవేసే వారి విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి వారు షేర్లను, బాండ్లను జారీ చేసి జనం నుంచి నిధులు సమీకరించకుండా నిషేధం విధించింది. వీరికి కంపెనీల బోర్డుల్లోనూ ఎలాంటి పదవినీ చేపట్టే అర్హత ఉండదు. రుణ ఎగవేత ఆరోపణలున్న వ్యాపారి విజయ్ మాల్యాపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆయన వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. అవన్నీ పోయే అవకాశముంది. మరోవైపు, సెక్యూరిటీస్, కమోడిటీస్ మార్కెట్లలో అవకతవకలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు బ్రోకింగ్ సంస్థలు.. ఇతర మధ్యవర్తులపై పర్యవేక్షణ పెంచాలని కూడా సెబీ నిర్ణయించింది. శనివారం జరిగిన బోర్డు భేటీలో పాల్గొన్న అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ వివరాలు తెలిపారు. విల్‌ఫుల్ డిఫాల్టరుగా నిర్ధారణ అయిన వ్యక్తి లేదా కంపెనీని మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించనివ్వడం రిస్కుతో కూడుకున్నదని అన్నారు. నోటిఫై చేసిన తర్వాతి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు, లిస్టెడ్ కంపెనీలను కొన్నప్పుడు యాజమాన్య అధికారాల బదిలీ, సంక్షోభంలో ఉన్న డెట్ సెక్యూరిటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు తదితర అంశాలనూ ఇందులో చర్చించారు. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు, కమోడిటీ డెరివేటివ్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బోర్డు సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. బీఎస్ఈ ఐపీవోకు అనుమతులు .. స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు సూత్రప్రాయంగా అనుమతినిచ్చినట్లు సిన్హా తెలిపారు. దీంతో మరో 6-9 నెలల్లోగా బీఎస్ఈ ఐపీవోకు మార్గం సుగమమైంది. జనవరిలోనే ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్న తాము... ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకున్నామని బీఎస్ఈ తెలిపింది. -
జైట్లీని కలిసిన ఠాకూర్
న్యూఢిల్లీ: బీసీసీఐలో తిరిగి పట్టు కోసం చేస్తున్న ఎన్.శ్రీనివాసన్ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వేగంగా పావులు కదుపుతున్నారు. శరద్ పవార్‌తో శ్రీని జతకట్టడం ఇష్టం లేని ఆయన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సహాయాన్ని కోరారు. ఇందులో భాగంగా తన వెంట పవార్ వర్గీయులైన శశాంక్ మనోహర్, అజయ్ షిర్కేలను మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. వీరంతా ప్రస్తుత పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వీరి సమావేశాన్ని బోర్డుకు చెందిన అధికారి ఒకరు ధృవీకరించారు. పవార్‌ను బాస్ చేయడంలో ఠాకూర్ వర్గానికి ఎలాంటి వ్యతిరేకత లేదని... ఆయనకు ఆసక్తి లేకపోతే, రాజీవ్‌శుక్లా లేదా షిర్కేలలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలనేది ఈ వర్గం ఆలోచన. వీరికి ఈస్ట్ జోన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరం. అవిషేక్‌ను కలిసిన జైట్లీ: దాల్మియా మృతి అనంతరం అరుణ్ జైట్లీ శనివారం ఆయన కుమారుడు అవిషేక్‌ను కలుసుకున్నారు. గంటన్నరపాటు వారి నివాసంలోనే గడిపిన జైట్లీ.. అవిషేక్‌తో వ్యక్తిగతంగా సంభాషించారు. క్యాబ్ చేతిలో జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ), త్రిపుర సీఏ ఓట్లు కూడా ఉండడంతో వీరి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
జైట్లీతో రాజన్ భేటీ...
న్యూఢిల్లీ: స్థూల ఆర్థికాంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెల 29న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున పరపతి విధానంలో కీలక పాలసీ రేట్లను కనీసం పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు గంట సేపు సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు చెప్పిన రాజన్.. వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్కడి వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిన దరిమిలా ప్రపంచ, దేశీ ఎకానమీల్లో పరిణామాలు, పరిస్థితులు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతిపై 20% రక్షణాత్మక సుంకం
తక్షణం అమల్లోకి - 200 రోజుల పాటు వర్తింపు - దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకే - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని కేటగిరీల ఉక్కు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం రక్షణాత్మక సుంకం విధించింది. చౌక ధరల్లో ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు వెల్లువెత్తుతుండటంతో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సుంకం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు. ఈ సుంకం 200 రోజుల పాటు అమల్లో ఉంటుందని వివరించారు. ఈ సుంకం పెంపు కారణంగా దేశీయ ఉక్కు రంగానికి లాభకరమని, ఈ లాభం స్వల్పకాలానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రక్షణాత్మక సుంకం అన్ని దేశాల దిగుమతులకు వర్తిస్తుంది. దిగుమతి సుంకం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాలకు వర్తించదు. చౌక ధరల ఉత్పత్తుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడు కోవడానికి నిర్దేశిత గడువు వరకూ రక్షణాత్మక సుంకాలు విధించడం వంటి తాత్కాలిక చర్యలు తీసుకోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. మరోవైపు చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో ఆ దేశం నుంచి ఉక్కు, ఇనుము ఉత్పత్తుల ధరలు తగ్గి దిగుమతులు పెరిగాయి. దీంతో గత నెలలో ప్రభుత్వం బేస్ మెటల్స్ దిగుమతులపై దిగుమతి సుంకాన్ని 2.5% పెంచింది. -
పన్ను విధానాలు స్థిరంగా ఉండేలా చూస్తాం
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి - ఇన్ఫ్రా, తయారీ, డిఫెన్స్‌ల్లో అవకాశాలు - అమెరికన్ ఇన్వెస్టర్లతో భేటీలో జైట్లీ న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు సముచితంగాను, స్థిరంగా ఉండేలా చూస్తామని అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఇక్కడి ఇన్ఫ్రా, తయారీ, రక్షణ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యాపారావకాశాలు అందిపుచ్చుకోవాలని ఆహ్వానించారు. సోమవారం ఇక్కడ 11వ ఇండో-యూఎస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం మరికొన్నేళ్లలో అయిదు రెట్లు ఎగిసి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ .. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. స్థిరమైన విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం తదితర చర్యలతో ఎకానమీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. పన్నులకు సంబంధించి వారసత్వంగా వచ్చిన సమస్యలను చట్టాలపరంగా, న్యాయస్థానాల తీర్పులపరంగా, విధాన నిర్ణయాల రూపంలోనూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజా సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.