mummidivaram
-
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బంధువులకు ఘోర రోడ్డు ప్రమాదం
-
ముమ్మడివరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ
సాక్షి, కోనసీమ: జిల్లాలోని ముమ్మడివరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపాలెం వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో పాటుగా స్కూల్క్‌కు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరోవైపు.. ప్రమాదంలో లారీ కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. -
ఎమ్మెల్యే సతీష్ తనయుడు, మేనల్లుడికి గాయాలు
కాకినాడ క్రైం: తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పెద్ద కుమారుడు సుమంత్, ఎమ్మెల్యేకు వరుసకు మేనల్లుడైన కాకాడి లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అమలాపురంలోని నివాసం నుంచి సుమంత్, లోకేష్ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కాకినాడ బయలుదేరారు. పాత ఇంజరం వద్ద వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న లోకేష్‌తో పాటు ముందు సీటులో ఉన్న సుమంత్ గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే మొబైల్ పోలీసులు క్షతగాత్రులను యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సుమంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉండగా, లోకేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో సీఎం జగన్ పరామర్శ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు, మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యేకు బుధవారం ఫోన్‌చేసి పరామర్శించారు. గాయపడిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను పరామర్శించారు. -
తాగుబోతు భర్తకు ఎదురుపడ్డ భార్య, మత్తులో ప్రాణాలు తీసి..
ముమ్మిడివరం: భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు నక్కావారిపేటలో సోమవారం రాత్రి ఈ హత్యోదంతం జరిగింది. నక్కవారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 ఏళ్ల కిందట ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గా ఈశ్వరి(32)తో పెళ్లయింది. వీరికి 12 ఏళ్ల భరత్, తొమ్మిదేళ్ల శరత్ అనే ఇద్దరు కుమారులున్నారు. నగర పంచాయతీలో రవీంద్ర కాంట్రాక్టు ప్రాతిపదికపై చెత్త తరలింపు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఆ సమయంలో రవీంద్ర యానాంలో మద్యం తాగుతున్నట్టు తెలుసుకుని గట్టిగా నిలదీసింది. తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం బయలుదేరింది. 200 మీటర్ల దూరం వెళ్లేసరికి భర్త ఎదురు పడ్డాడు. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీంద్ర భార్య దుర్గా ఈశ్వరిపై దాడిచేశాడు. అతడి పిడిగుద్దులకు ఆమె కింద పడింది. వెంటనే ఆమె తలను రోడ్డుకు వేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతదేహన్ని రోడ్డు పక్కన కాలువలో పడేసి రవీంద్ర ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్సీ ఎం.మాధవరెడ్డి, సీఐ ఎం.జానకీరామ్, ఎస్సై కె.సురేష్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించారు. -
మద్యం మత్తులో మహిళపై హత్యాచారం
సాక్షి, ఐ.పోలవరం(ముమ్మిడివరం): తెలంగాణ లో ‘దిశ’ హత్యాచారం మరువకముందే ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో మద్యం మత్తులో ఓ మహిళపై హత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జి.వేమవరం గ్రామం చాకలిపేట చెరువుగట్టుకు చెందిన కేశనకుర్తి నాగమణి(60)పై సోమవారం రాత్రి ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న దూరపు బంధువు కేశనకుర్తి నాగబాబు ఈ హత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంటి పక్కనే ఉంటున్న ఓ వృద్ధురాలు మంగళవారం నాగమణిని పిలవగా.. ఆమె పలకలేదు. దీంతో తలుపు తట్టడంతో నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి స్థానికులకు చెప్పడంతో, వారు ఎస్సై ఎస్.రాముకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. క్లూస్ టీం హత్య జరిగిన గదిలో కారం జల్లి ఉండడం, మృతురాలి ఒంటిపై రక్తం ఉండడంతో పోలీసులు ఈ హత్య నగదు కోసమా, లైంగికదాడి జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ఇంటి ఆవరణ నుంచి రెండు ఇళ్ల అవతల ఉన్న నాగబాబు ఇంటికి వెళ్లి తిరిగి మృతురాలి ఇంటికి చేరుకొంది. దీంతో పోలీసులు నాగబాబు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులను, పక్కన ఉన్న వారిని విచారించారు. మృతురాలి ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఈ హత్య ఎలా జరిగిందనేది పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ జి.రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నాగమణి భర్త, కుమారుడు గతంలో చనిపోయారు. ప్రభుత్వం అందిస్తున్న ఫింఛననుతో ఆమె జీవనం సాగిస్తుంది. కూతురు హైదరాబాద్, కోడలు, మనుమలు భీమనపల్లిలో ఉంటున్నారు. నాగబాబు కుటుంబానికి నాగమణి కుటుంబానికి కుటుంబ గొడవలు ఉన్నట్టు సమాచారం. నాగబాబుకు వివాహమైనా భార్యతో గొడవపడడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య లేక పోవడంతో వ్యసనాలకు బానిసైన నాగబాబు సోమవారం రాత్రి మద్యం సేవించి నాగమణి ఇంటిలోకి వెళ్లాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వయస్సుతో సంబంధం లేకుండా విచక్షణా రహితంగా మహిళపై దాడి చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఘటనతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామంలో ఉన్న నాగబాబుకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి సీఐ రాజశేఖర్‌రెడ్డికి అప్పగించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని డీఎస్పీ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత ముగ్గురు వ్యక్తులు మహిళను గ్యాంగ్ రేప్ చేసి ఉండవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో నాగబాబుతో పాటు, గ్రామానికి చెందిన వర్రే బాబి, డేగల రాములను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కేవలం 24 గంటల్లోనే.. కేశనకుర్తి నాగమణి(60) హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన ఆరు గంటల్లోనే హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నామన్నారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా గ్రామానికి చెందిన నల్లా సుదర్శన్ ఇచ్చిన కీలక సమాచారంతో నిందితుడిని గుర్తించి కేసును కొలిక్కి తీసుకొచ్చారు. కేసును పక్కదోవ పట్టించేందుకే కారం చల్లడం.. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళపై హత్యాచారం చేయడమే కాకుండా కేసును పక్కదోవ పట్టించేందుకు నాగబాబు కారంను ఉపయోగించాడు. గతంలో నాగబాబు అతడి భార్య తరచూ గొడవలు పడడంతో గత ఏడాది సామర్లకోటలో 498 కేసు, అలాగే కాకినాడ సర్పవరంలో దొంగతనం కేసు నమోదయ్యాయి. దీంతో జైలు జీవితం అనుభవించిన నాగబాబు తోటి ఖైదీలు కారం చల్లితే కేసు తప్పుదోవ పట్టించవచ్చని తెలపడంతో కారం చల్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోస్టుమార్టానికి తరలింపు హత్యకు గురైన నాగమణి మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు’
సాక్షి, ముమ్మిడివరం: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 శాతం హామీలను అమలు చేశారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ మట్లాడుతూ.. ఇచ్చిన హామీని అమలు చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునన్నారని గుర్తు చేశారు. మత్స్యకార కుటుంబ్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే మత్స్యకార కుంటుంబాలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకంతో మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇచ్చినట్టుగానే మిగతా మత్స్యకారులకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారని కోరారు. జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకం తమకుందని ఎమ్మెల్యే సతీష్ అన్నారు. -
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముమ్మిడివరం నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు. వీటి అమలుకు సీఎం ఆ రోజు శ్రీకారం చుట్టనున్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్పీసీ) కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో.. ఆ మొత్తాన్ని తమ ప్రభుత్వమే ఇస్తుందని పాదయాత్రలో వాగ్దానం చేశారు. ఆమేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. అలాగే ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 21న సీఎం పర్యటన సాగనుందిలా.. ►ఉదయం 9.45 : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. ►ఉదయం 9.50 : రోడ్డు మార్గంలో బయలుదేరి ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామం చేరుకుంటారు. పశువుల్లంక నుంచి వలసలతిప్ప హై లెవెల్ బ్రిడ్జి (వైఎస్సార్ వారధి) ప్రారంభిస్తారు. ►ఉదయం 10.20 : ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభాస్థలికి చేరుకుంటారు. దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పస్తారు. జ్యోతి వెలిగించి, వందేమాతరం గేయం ఆలపిస్తారు. ►ఉదయం 10.40 – 11.00 : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. ►ఉదయం 11.00 – 11.45 : మత్స్యకార భరోసా, జీఎస్పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులు అందజేస్తారు. ►11.45 : సభా ప్రాంగణం నుంచి గాడిలంక హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 12 గంటలకు యానాం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 12.25 : పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల దివంతులైన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లిలోని తన నివాసానికి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ట్రాఫిక్ మళ్లింపు కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐ.పోలవరం, ముమ్మిడివరం, యానాం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మంగళ వారం తెలిపారు. అమలాపురం వైపు నుంచి కాకినాడ వెళ్లే లైట్ మోటార్ వాహనాలు (4 చక్రాలు), భారీ వాహనాలు (4 చక్రాల కన్నా ఎక్కువ ఉన్నవి) ఈదరపల్లి, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం మీదుగా వెళ్లాలి. కాకినాడ వైపు నుంచి అమలాపురం వైపు వెళ్లే లైట్ మోటార్ వాహనాలు, భారీ వాహనాలు యానాం, పిల్లంక, గోపులంక, రావులపాలెం మీదుగా వెళ్లాలి. ట్రాఫిక్ మళ్లింపునకు అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. -
‘21న సీఎం జగన్ ముమ్మిడివరంలో పర్యటన’
సాక్షి, తూర్పుగోదావరి: గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని పేర్కొన్నారు. సుమారు రూ.90 కోట్లు వేట నిషేధం నష్టపరిహరాన్ని మత్స్యకారులకు ఇవ్వాల్సి ఉందని వెంకటరణ తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారని గుర్తుచేశారు. నష్టపరిహరం కోసం ఓఎన్జీసీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని సీఎం జగన్ సంప్రదించారని పేర్కొన్నారు. సీఎం ముమ్ముడివరం పర్యటనలో ఆ నష్టపరిహరాన్ని అందిస్తారన్నారు. ఆ రోజు మత్స్యకారులకు డీజిల్ సబ్సీడి రూ.9 లకు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 84 బంక్‌లను గుర్తించామని వెల్లడించారు. డీజిల్ కొట్టించుకున్న రోజునే స్మార్ట్ కార్డు ద్వారా సబ్సీడి వస్తుందని స్పష్టం చేశారు. డీజిల్ సబ్సీడి కోసం మత్స్యకారులు గతంలో మాదిరిగా ప్రభుత్వాలు చుట్టు తిరిగే పరిస్ధితి లేదని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. -
రాలిపోయిన క్రీడా కుసుమం
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): క్రీడా కుసుమం రాలిపోయింది. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నాగబాబు కన్నుమూశాడు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడిని బాణసంచా పేలుడు పొట్టను పెట్టుకుంది. ఈ నెల 18న తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణ(18) నాలుగు రోజులపాటు నరకయాతన అనుభవించి మంగళవారం తనువు చాలించాడు. నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని జి.వేమవరం తీసుకువెళ్లారు. కన్నీటి వీడ్కోలు.. చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి అనంతలక్ష్మి, సోదరుడు పవన్ కృష్ణమూర్తిలు బోరున విలపించడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. నాగబాబుతో కలసి చదువుకున్న స్నేహితులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు సైతం నాగబాబు మృతదేహం వద్ద బోరున విలపించారు. పేలుడు ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి సత్యనారాయణకు కుమారుడి మరణవార్త తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు విషణ్ణవదనాలతో నాగబాబుకు కన్నీటి వీడ్కోలు పలికారు. వాలీబాల్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్ క్రీడల్లో విశేష ప్రతిభ నాగబాబు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆరో తరగతి నుంచి క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. అండర్–14, అండర్–19 విభాగాల్లో త్రోబాల్, సాఫ్ట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కురుక్షేత్రలో జరిగిన త్రోబాల్ చాంపియన్‌షిప్, హర్యానాలో జరిగిన వాలీబాల్ అండర్ 14 ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో ప్రతిభ కనబరిచాడు. రెండుసార్లు వాలీబాల్, నాలుగుసార్లు సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్టు జి.వేమవరం హైసూ్కల్ పీడీ స్వామి తెలిపారు. నాగబాబు ఐడియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన వైఎస్సార్ ఎస్జీఎఫ్ క్రీడల్లో పాల్గొన్నాడు. క్రీడల నుంచి 17వతేదీన తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే 18వ తేదీన తండ్రితోపాటు బాణసంచా తయారీకి వెళ్లి పేలుడు ఘటనలో బలయ్యాడు. రూ.10 లక్షల నష్ట పరిహారం జి.వేమవరం బాణసంచా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణకు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించినట్టు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బాణసంచా బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మంచి క్రీడాకారున్ని కల్పోవడం బాధాకరమన్నారు. బంగారంలాంటి క్రీడాకారున్ని కోల్పోయాం మంచి క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన క్రీడాకారున్ని కోల్పోయాం. సాధారణంగా క్రీడాకారులు ఏదో ఒక్క క్రీడలో రాణించడం జరుగుతుంటుంది. అయితే నాగబాబు అనేక క్రీడలలో రాణించడంతోపాటు అతిచిన్న వయస్సులోనే జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో సైతం 185 సెంమీ హైజంప్‌ను నాగబాబు అవలీలగా చేసేవాడు. ఇటువంటి క్రీడాకారున్ని కోల్పోవడం దురదృష్టకరం. ఎస్ఆర్కేయూ స్వామి, ఫిజికల్ డైరెక్టర్, జెడ్పీ హైసూ్కల్, జి.వేమవరం -
ఒకే అభ్యర్థి.. 3 జిల్లా ర్యాంకులు
బనగానపల్లె/ముమ్మిడివరం: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామానికి చెందిన బెడదల రాజశేఖర్‌రెడ్డి సచివాలయ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మూడు ర్యాంకులు సాధించి సత్తా చాటాడు. కేటగిరీ–2 గ్రూప్–ఏలో 106.75 మార్కులతో జిల్లాలో 8వ ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేటగిరీ–2 గ్రూప్ బీలో 109.25 మార్కులతో జిల్లాలో 4వ ర్యాంకు సాధించి.. సర్వేయర్, వీఆర్వో పోస్టులకు ఎంపికయ్యాడు. అలాగే కేటగిరీ–3లో 80 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుకు ఎంపికయ్యాడు. తాను వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ పోస్టులో చేరనున్నట్లు రాజశేఖర్‌రెడ్డి తెలిపాడు. రాజశేఖర్ 1–10వ తరగతి వరకు మండలంలోని ఇల్లూరుకొత్తపేట గ్రామంలోని పెండేకంటి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ గుంటూరులోని శ్రీచైతన్యలో, బీటెక్ కర్నూలు జి.పుల్లారెడ్డి కళాశాలలో, ఎంటెక్ ఎన్ఐఐ తిరుచ్చిలో చదివాడు. ఇతని తల్లిదండ్రులు బెడదల అచ్చమ్మ, బెడదల నారాయణరెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ‘తూర్పు’లో సురేష్‌కు ప్రథమ ర్యాంకు: గ్రామ సచివాలయ పరీక్షల్లో మత్స్యశాఖ సహాయకుల ఉద్యోగ విభాగంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లికి చెందిన గాలిదేవర సురేష్ 97.25 మార్కులు సాధించి జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. సురేష్ తండ్రి జీవీ.కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి భద్రకాళీ మాణిక్యాంబ గృహిణి. తండ్రి ప్రోత్సాహం, ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు సురేష్ తెలిపాడు. సురేష్ ముమ్మిడివరం ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్య, అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నెల్లూరు జిల్లా ముత్కూరు కాలేజీ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎంఎఫ్ఎస్సీ పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు రాశాడు. సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో తమ లాంటి అర్హులకు ఉద్యోగాలు వస్తున్నాయని సురేష్ ఆనందం వ్యక్తం చేశాడు. -
ప్రేమించాడు..పెళ్లి ముహుర్తం పెట్టాకా..
సాక్షి, తూర్పుగోదావరి(ముమ్మిడివరం) : ప్రేమించిన ప్రియుడు వివాహ ముహూర్తం పెట్టాక ముఖం చాటేయడంతో ప్రియురాలి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు ఛీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. కాకినాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ యాక్టు విభాగం డీఎస్పీ ఏబీజే తిలక్, ఎస్సై వెంకటరమణ మండలంలోని కొమానపల్లిలో బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. కొమానపల్లి గ్రామానికి చెందిన వంగలపూడి అమ్మాజీ, ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన అప్పాడి రాజేష్ అమలాపురంలో కంప్యూటర్ విద్య నేర్చుకొనే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తరువాత అమ్మాజీ ముమ్మిడివరంలో హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న సమయంలో రాజేష్ గత జూలై నెలలో పెళ్లి చేసుకుంటానని అమలాపురం సాయిబాబా గుడికి తీసుకు వెళ్లి నుదుట విభూది బొట్టు పెట్టి అక్కడి నుంచి ఓడల రేవు బీచ్‌కు తీసుకువెళ్లాడు. 29న హైదరాబాద్ ఆర్య సమాజానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుని, కొద్ది రోజులు అక్కడ వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. విషయం అమ్మాజీ తల్లిదండ్రులకు తెలియడంతో కొమానపల్లి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఆగస్టు 25న వారికి పెళ్లి చేయడానికి రాజేష్ తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే ఫైనాన్స్ కంపెనీలో తగవు ఉందని చెప్పి ఆగస్టు 17న స్నేహితులతో కలిసి వెళ్లిన రాజేష్ తిరిగి రాలేదని ఈ విషయంపై రాజేష్ తండ్రిని నిలదీస్తే వారి పెళ్లికి కులం అడ్డుగా చూపి నిరాకరించాడని అమ్మాజీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ముమ్మిడివరం ఎస్సై ఎం.పండుదొర ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్వగృహంలో సోమ వారం అమ్మాజీతో పాటు తల్లిదండ్రులు శంకరరావు, సత్యవతిలను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. -
మీరు డబ్బులిస్తేనే ఇళ్లు మంజూరు చేయిస్తా
సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి) : డబ్బులిస్తేనే ఇల్లు మంజూరు చేయిస్తామని డబ్బులు తీసుకున్న ఓ ‘తెలుగు తమ్ముడి’పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన అనుచరులతో దండెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓలేటి ధర్మారావు ఏడాది క్రితం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు రూ.50 వేలు ఇస్తే నీ ఇంటిబిల్లులు మంజూరు చేయిస్తానంటూ తెలుగుదేశం నాయకుడు కాలాడి వీరబాబు ఆయనకు చెప్పాడు. ఇంటి బిల్లులు నిలిచిపోవడంతో ధర్మారావు ఈఏడాది ఫిబ్రవరి నెలలో రూ.50 వేలు వీరబాబుకు ఇచ్చారు. అయినా పని కాకపోవడంతో శుక్రవారం ఓలేటి ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆగ్రహించిన కాలాడి వీర బాబు శనివారం తన అనుచరులతో ధర్మారావుపై దండెత్తాడు. ‘ఇంటి మంజూరు కోసం నేను సొమ్ము తీసుకున్నానని నాపై పోలీసు ఫిర్యాదు చేస్తావా?’ అంటూ వీరబాబు, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ధర్మారావు మరలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపాలెం గ్రామానికి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో 9 ఇళ్లు మంజూరయ్యాయి. వాటి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.50 వేలు చొప్పున వీరబాబు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మండల పరిధిలో టీడీపీ నాయకులు గృహనిర్మాణ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
డ్యాంలో కారు బోల్తా,వైఎస్సార్ సీపీ నేత మృతి
-
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి
సాక్షి కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వినోద్ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్‌లో పడిపోయింది. యానం నుంచి కోటిపల్లి వెళుతుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముమ్మిడివరం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
అందుకే నాపై 22 కేసులు : వైఎస్ జగన్
సాక్షి, తూర్పుగోదావరి : ‘చంద్రబాబునాయుడుపై ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉండడంతో టీడీపీ డైరెక్ట్‌గా పొత్తుపెట్టుకోవడానికి రాష్ట్రంలో ఏ పార్టీ ముందుకు రావడంలేదు. చివరకు పెయిడ్ యాక్టర్, చంద్రబాబు పార్ట్నర్ కూడా డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ఇక్కడి నాయకులను ప్రజలు నమ్మడంలేదని ఢిల్లీ నుంచి తెచ్చుకుని వారితో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే నాపై 22 కేసులు పెట్టించారు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఎమన్నారంటే.. గోదావరి పక్కనే ఉన్నా..తాగడానికి నీళ్లురావు మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరి దీవేనలతో 3,648 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశాను. నా పాదయాత్ర ఈ నియోజవకర్గం గుండా సాగింది. పాదయాత్రలో మీ బాధను విన్నా. మీ కష్టాలను దగ్గర ఉండి చూశా. ఇక్కడి మత్స్యకారులు నాదగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు గుర్తుకున్నాయి. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వల్ల వల్ల17 వేల మత్స్యకార కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ఒక్కొరికి రూ. 6750 చోప్పున 17నెలలు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం 6నెలల మాత్రమే చెల్లించారు. మిగిలిన 11 నెలలలో రూ.130కోట్లు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం స్సందించలేదు. ఇదే నియోజకవర్గంలో గోదావరి ఉంది కానీ తాగడానికి నీళ్లు లేవు. దాదాపు 60 గ్రామాలకు తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ వరి పండిస్తారు. మద్దతు ధర రూ.1750 కానీ క్వింటాల్‌కు కనీసం రూ. 1250నుంచి 1300 రూపాయలు కూడా రావు. అంటే బస్తాకు రూ. 1000 రాని పరిస్థితి. పంటచేతికొచ్చే సమయానికల్లా దళారీల దోపిడి మొదలవుతుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోదు. గోదావరి ప్రవహించే ఈ నేలపై ప్రజల గొంతు తడువదు. సాగునీరు అందదు. పెట్రోలియం వనరులు ఉన్నా నిరుద్యోగుల తలరాతలు మారవు. ఈ సమస్యలు అన్ని ఆ రోజు నా పాదయాత్ర మీరు నాతో చెప్పారు. మీ అందరికి చెబుతున్నా మీ బాధలు విన్నాను. కళ్లతో చూశా. మీ అందరికి ఈ వేదికపైకి చెబుతన్నా.. నేను ఉన్నాను. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావు చిన్నప్పుడు మనం కథలు వింటాం. మహాభారతం, రామాణాయం విన్నాం. రాక్షరసులు ఎలా ఉంటారో వింటాం. రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయని కథల్లో వింటాం. రావణాసురునికి 10తలలు ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఐదేళ్లు పాలించిన మన నారాసురునికి మాత్రం విడివిడిగా, వేరువేరుగా తలలు ఉంటాయి. చంద్రబాబుకి ఒక తల తన నెత్తిపై ఉంటుంది. ఇంకొక తల పెయిడ్ యాక్టర్, పెయిడ్ పార్ట్నర్ రూపంలో ఉంటుంది. ఇంకొక తల ఈనాడు దినపత్రిక, రాజ గురు రూపంలో ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా, దొంగపార్టీలు, దొంగ విశ్లేషకులు రూపంలో మరో తల ఉంటుంది. వైఎస్సార్సీపీ మాదిరే కండువా ఉండే వారి రూపంలో ఒక తల, డిల్లీ రూపంలో ఒక తల ఉంటుంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు రావు. అందుకే చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారు. 2014లో బాబు ఇచ్చిన హామీలపై చర్చ జరగకూండా చేస్తున్నారు. వీళ్లే హత్యలు చేయిస్తారు. వీళ్ల పోలీసులచే విచారణ చేయిస్తారు. వీళ్ల పేపర్ల చేత వక్రీకరించి రాయిస్తారు. ఇంతటి దారుణం పాలన ఉంది. వీళ్లు రోజుకో పుకార్లు పుట్టిస్తారు. రోజుకో పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఎదుటి ప్రత్యర్థి ఒక పార్టీతో పొత్తుపెట్టుకున్నారని చర్చలు జరుపుతారు. ఇదంతా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి పథకంలోనూ మోసం ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదు. రైతుల రుణమాఫీ చేయలేదు. రుణాలు ఏమో కానీ కనీసం వడ్డీలు కూడా మాఫీ కాలేదు. ఇచ్చే అరకొర నిధులు కూడా ఎన్నికల రోజు వరకు పెండింగ్. ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధులు వేస్తారట. ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి పథకంలోనూ, ప్రతి అడుగులోనే మోసాలు కన్పిస్తాయి. ఇదంతా ప్రజలు గమనించాలి. నాపై 22కేసులు.. పార్ట్‌నర్‌పై జీరో కేసులు చందబాబు పార్ట్నర్, పెయిడ్ యాక్టర్ గురించి చెప్పాలి. నా పార్ట్నర్ చాలా బాగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు పొగుడుతాడు. ఇదే యాక్టర్ నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్లో తెలుగు దేశం జెండాలు కనిపిస్తాయి. ఇదే యాక్టర్ నాలుగేళ్ల చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడు.. ఎన్నికలకు ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డఫ్ ఇస్తాడు. పోరాటం చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో నాపై 22కేసులు పెట్టారు. రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా వెళితే 8 కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారు. ఇలా నాకు 22 కేసులు చంద్రబాబు బహుమతిగా ఇచ్చాడు. ఇదే చంద్రబాబు తన యాక్టర్, పార్ట్నర్ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. వీళ్ల డ్రామాలు ఎలా ఉన్నాయో గమనించండి. చంద్రబాబు మీద ప్రజావ్యతిరేకత ఎలా ఉంది అంటే చివరకు తన పార్ట్నర్, యాక్టర్‌తో డైరెక్టుగా ముందు ఉండి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. గొప్పపాలన చేస్తే ఇది నా అభివృద్ధి అని చెప్పి ఓట్లు అడగాలి. కానీ చంద్రబాబు అలా చేయడంలేదు. ఎందుకంటే అభివృద్ధి అనేదే చేయలేదు. ఇదే పెద్దమనిషి తో పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉండడంతో ఇక్కడినాయకులు వద్దని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఫరూక్ అబ్దుల్లాను తెచ్చకొని నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఎన్నికలు దగ్గరుకు వచ్చాయి కాబట్టి ఉన్నది లేనట్లుగా చంద్రబాబు చూపిస్తారు. ప్రజలు ఇదంతా గమనించారు. డబ్బులకు మోసపోవద్దు ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్, ఎంపీ అభ్యర్థి అనురాధపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
విశేషాల సమాహారం.. ముమ్మిడివరం
సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి): జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం అంతర్జాతీయ రాజకీయాలకు వేదికగా మారింది. ఇద్దరు రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. దివంగత లోక్ సభస్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. ఈయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం, ఆ తర్వాత లోక్ సభ స్పీకరై ఈ నియోజకవర్గానికి ప్రత్యేకను తీసుకు వచ్చింది. ఆరుసార్లు గెలిచి జిల్లాలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందడం మరోవిశేషం. ఆధ్యాత్మిక కేంద్రంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాశస్త్యం ఉంది. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమం ఈ నియోజకవర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి ఈ ఖ్యాతి లభించింది. ఈ ఆశ్రమం సందర్శనకు భక్తులు విచ్చేస్తుంటారు. ఇలా రూపాంతరం చెంది.. చెయ్యేరు జనరల్ నియోజకవర్గం 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. అంతకు ముందు చెయ్యేరు నియోజక వర్గంగా ఉన్న సమయంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగగా రెండు సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండేసి పర్యాయాలు ప్రాతినిధ్యం వహించాయి. మొదటి సారి 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నడింపల్లి రామభద్రిరాజు సీపీఐ అభ్యర్థి సి.కృష్ణమూర్తిపై 8,637 ఓట్లతో గెలుపొందారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీకే రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావు 2,066 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావును స్వతంత్ర అభ్యర్థి సీబీకే రాజు 15,365ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పళ్ల వెంకట రావు ఇండింపెండెంట్ అభ్యర్థి జీవీరావుపై 11,304 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. పోటాపోటీగా.. ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గంగా మారాక తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి బి.అప్పలస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 13,228 ఓట్లతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పాందారు. 1983లో తెలుగు దేశం అభ్యర్థి వల్తాటి రాజా సక్కుబాయిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 36,225 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జీకే వరప్రసాద్‌ను టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తి 33,124 ఓట్ల తేడాతో ఓడించారు. 1989లో దేశం అభ్యర్థి పండు కృష్ణమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 6,749 ఓట్లతో విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సుబ్బారావు జిల్లలో తెలుగు దేశం ప్రభంజనాన్ని ఎదురొడ్డి టీడీపీ అభ్యర్థి మోకా ఆనందసాగర్పై 9,565 మోజార్టీతో రెండోసారి గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జిల్లాలో రికార్డు సృష్టించారు. బత్తిన మరణానంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుపై టీడీపీ అభ్యర్థి జీఎంసీ బాలయోగి 14,496 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో బాలయోగి అమలాపురం ఎంపీగా గెలుపు పొందడంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానంద 17,778 ఓట్లతేడాతో గెలుపొందారు. 1999లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా విశ్వరూప్, వివేకానందలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో వివేకానంద మరోసారి 10,742 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థి చెల్లి శేషకుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 15,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో.. మొత్తం ఓట్లు 2,20,223 పురుషులు 1,11.054 మహిళలు 1.09,164 ఇతరులు 5 కులాల వారీగా... శెట్టిబలిజలు 41,414 మాలలు 49,905 మాదిగలు 13,885 కాపులు 29,552 అగ్నికుల క్షత్రియలు 43,774 క్షత్రియులు 11,223 యాదవులు 2,870 రజకులు 2,070 విశ్వబ్రహ్మణులు 1.328 బ్రహ్మణులు 1.077 వైశ్యాస్ 1075 మండలాలు... ముమ్మిడివరం కాట్రేనికోన ఐ.పోలవరం తాళ్లరేవు నగర పంచాయతీ 1 పంచాయతీలు 63 పోలింగ్ స్టేషన్లు 268 భౌగోళికంగా.. రాజకీయంగా మార్పులు.. 2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం నియోజకవర్గం భౌగోళికంగా, రాజకీయంగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో చేరింది. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గం జనరల్‌గా మారింది. అప్పట్లో పీఆర్పీ ఆవిర్భావంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాసరాజు, పీఆర్పీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ 1924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. నియోజకవర్గంలో ఎస్సీ, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. బీసీ ఓట్లు 60 శాతం పైబడి ఉండటంతో ఎన్నికల్లో వీరే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. అలాగే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దాట్ల సుబ్బరాజు దాదాపు ఖరారైనట్టే. జనసేన పార్టీ అభ్యర్థిగా శెట్టిబలిజ సామాజికి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ పోటీలో ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెన్మత్స జగ్గప్పరాజు, గంగిరెడ్డి త్రినాథరావు, ముషిణి రామకృష్ణరావు, వేగేశ్న నరసింహరాజు, పి.ఉదయ భాస్కరవర్మ దరఖాస్తుల చేసుకున్నారు. -
పింఛన్ కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి..
సాక్షి, గుంటూరు మెడికల్/తాళ్లరేవు (ముమ్మిడివరం): పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగి విసిగి వేసారిన ఇద్దరు వృద్ధులు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరుకు చెందిన మోర బ్రహ్మారెడ్డి (70), తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిగొంది గ్రామానికి చెందిన దంగేటి నీలాద్రి (72) మృత్యువాత పడ్డారు. గుంటూరు నగరంలోని గుంటూరువారితోట నాలుగో లైనుకు చెందిన మోర బ్రహ్మారెడ్డి 3 రోజులుగా వృద్ధాప్య పింఛన్ కోసం తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు పింఛన్ కోసం స్కూల్ వద్దకు వెళ్లిన బ్రహ్మారెడ్డి తనకు ముందు వరుసలో చాలా మంది ఉన్నారని మళ్లీ ఇంటికి బయలుదేరాడు. స్కూల్ దాటి ఓల్డ్‌క్లబ్ రోడ్డులోని ప్రధాన రహదారిలో ఉన్న తులసి ఆస్పత్రి వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తులసి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిగొందిలోనూ.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ ప్రత్తిగొందికి చెందిన దంగేటి నీలాద్రి పింఛను తీసుకునేందుకు ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. అయితే ఎంతకీ పేరు రాకపోవడంతో మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అధికారులు మృతదేహాన్ని ఆటోలో ఇంటికి పంపించివేసి చేతులు దులుపుకున్నారు. గంటల తరబడి వేచి ఉండడం వల్లే నీలాద్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
బుగ్గైన బలుసుతిప్ప
వేటాడే నడి సంద్రంలోనే కాదు.. జీవించే నేలపై కూడా మత్స్యకారుల జీవితాలకు భరోసా లేకుండా పోయింది. ఎగిసిపడే అలలను.. లోతైన సముద్రాన్ని.. పెను తుపాన్లు దాటుకు వచ్చిన వారికి అగ్ని ప్రమాదం పెను నష్టాన్ని మిగిల్చింది. గంగమ్మ ఒడిలో సంపాదించుకున్న కొద్దిపాటి నగదు.. బంగారం అగ్నికి ఆహుతవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప గంగ పుత్రులకు మరోదారి లేకుండా పోయింది. తీర ‡గ్రామం బలుసుతిప్పలో శనివారం జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకార కుటుంబాలను నడివీధికి నెట్టింది. అగ్ని కీలలకు పెథాయ్ పెనుగాలులు తోడై, క్షణాల్లో 16 పూరిళ్లను భస్మీపటలం చేసింది. 24 కుటుంబాల వారిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. కాట్రేనికోన/ ముమ్మిడివరం/ఐ.పోలవరం: కాట్రేనికోన మండలంలోని మరో మత్స్యకార గ్రామం అగ్నిప్రమాదం బారిన పడింది. తీర ప్రాంత గ్రామం బలుసుతిప్పను శనివారం అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒకానొక సమయంలో గ్రామం మొత్తం తగలబడిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో పక్కా భవనాలు ఉండడంతో ప్రమాద ఉధృతి చాలా వరకూ తగ్గింది. లేకపోతే పెనుగాలులకు గ్రామంలోని వందలాది ఇళ్లు భస్మీపటలం అయ్యేవే. ఈ ప్రమాదంలో విలువైన బంగారం, వెండి, నగదు, దస్తావేజులు, ఇతర వస్తువులు కాలి బూడిదవడంతో రూ.కోటి వరకూ ఆస్తినష్టం ఏర్పడింది. కట్టెల పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వల వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గ్రామంలోని మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటాడగా వచ్చే కొద్దిపాటి సొమ్మును ఇంట్లోనే భద్రపరుచుకుంటారు. అలా దాచుకున్న నగదు, బంగారు వస్తువులు ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో గ్రామస్తులు ఆక్రందనలతో బయటకు పరుగులు తీశారు. కొందరు మంటలు ఎగసి పడకుండా చుట్టుపక్కల ఇళ్లపై నీళ్లుజల్లి ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఆకుల సరస్వతి ఇంట్లో నిద్రిస్తోంది. ఇంటి నుంచి మంటలు ఎగసి పడటంతో పక్కన ఉన్న వారు చూసి చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చింది. క్షణాల్లో అగ్నికీలలు ఎగసిపడి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను చుట్టుముట్టాయి. ప్రమాదంలో రేకాడి గవరమ్మ, ఆకుల అనపర్తి, సంగాని భూలక్ష్మి, మేడా వెంకటేశ్వర్లు, ఓలేటి సత్తిరాజు, ఆకుల వెంకటేశ్వర్లు, సంగాని ధర్మారావు, ఓలేటి భూలక్ష్మిలకు చెందిన ఇళ్లతో సహా మొత్తం 16 ఇళ్లు దగ్ధమయ్యాయి. రేకాడి గవరమ్మ, నరసింహమూర్తి దంపతులు గ్రామంలోనే చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకొంటూ జీవిస్తున్నారు. వారి చిన్న కుమార్తె జ్యోతికి వివాహం నిశ్చయం కావడంతో ఖర్చుల కోసం ఇంట్లో దాచిన రూ.ఐదు లక్షల నగదు, ఏడు కాసుల బంగారం భద్రపరిచారు. అగ్ని ప్రమాదంలో అవన్నీ కాలి బూడిదవడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాకినాడలో చదువుకుంటున్న తన కూతురిని చూడడానికి వెళ్లిన మేడా వెంకటేశ్వర్లు ఇల్లు బుగ్గయ్యింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు, డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. సంగాని ధర్మారావు, పార్వతి కుటుంబానికి చెందిన ఇంటితో పాటు, ఆరు కాసుల బంగారం, నగదు ఆగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: పొన్నాడ సతీష్‌కుమార్ బలుసుతిప్ప అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన గంటకే ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన ప్రతి ఇంటినీ పరిశీలించారు. గతంలో పల్లం, కొత్తపాలెం గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.8 వేలు, బియ్యం పంపిణీ చేసినందున, ఇప్పటి బాధితులకు కుటుంబానికి రూ.15 వేల చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పక్కా ఇళ్లకు నివేదిస్తాం: ఆర్డీవో బలుసుతిప్పఅగ్ని ప్రమాదంలో 16 ఇళ్లు కాలిపోగా 24 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని అమలాపురం ఆర్డీవో వెంకటరమణ తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 కేజీల బియ్యంతో పాటు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి మూడు పూటలా భోజనం పెడతామన్నారు. వారికి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. -
యువకుడి హత్య!
ముమ్మిడివరం: గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి గుర్తు పట్టకుండా అతడి ముఖం కాల్చి వేసి మురుగు నీటి కాలువలో పడవేసిన సంఘటన ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో చోటు చేసుకుంది. అమలాపురం–అయినాపురం మురుగునీటి కాలువ సీహెచ్ గున్నేపల్లి వంతెన వద్ద యువకుడిని హత్య చేసి పడేశారు. ఆదివారం రాత్రి సమయంలో హత్య చేసి కాలువలో పడవేసినట్టు స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. యువకుడి తలపై బలమైన ఆయుధంతో కొట్టి ఆపై ఈడ్చుకుంటూ కాలువ గట్టుపైకి తీసుకు వచ్చి మృతదేహం గుర్తు పట్టకుండా ముఖంపై కొబ్బరి ఆకులతో మంట వేసి కాల్చి వేసినట్టు అక్కడ ఆధారాలను బట్టి తెలుస్తోంది. యువకుడిని ఈడ్చుకుంటూ వచ్చినట్టు రక్తపు మరకలు ఉన్నాయి. ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, గోధుమ కలర్ షర్ట్ ధరించి ఉన్న ఇతడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటాయి. గ్రామ ఇన్చార్జ్ వీఆర్ఓ దార్ల వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ కేటీవీవీ రమణారావు, ఎస్బీ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్న ఒక షాపులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం డాగ్ స్కాడ్లను రప్పించారు. సీఐ ఎం.అర్జునరావు బృందం వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలం బ్రోనో ట్రైనర్ ఓ.రమణ ఆధారాల కోసం ప్రయత్నించారు. పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి స్థానిక ఆక్వా చెరువుల వద్ద గెస్టు హౌస్ మార్గం పల్లంకుర్రు రోడ్డు సమీపంలో ఓఎన్జీసీ సైటు వరకు వెళ్లి అక్కడ కొద్ది సేపు ఉండి అక్కడ సమీపంలో ఉన్న సత్తెమ్మ ఆలయ పరిసరాల్లో ఆగింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విడ్డూరం.. హోంమంత్రికి దారివ్వలేదని
సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి ముమ్మడివరం పోలీసులు అత్యుత్సాహం చూపారు. స్వామి భక్తిని నిరూపించుకొనే పని చేశారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా.. పోలీసుల అనుకుంటే కేసుల కొదవా అన్నట్లు ముమ్మడివరం పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బస్సును పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే. ఏం జరిగిందంటే.. హోంమంత్రి చిన రాజప్ప జిల్లా పర్యటన నిమిత్తం కాన్వాయ్ కాకినాడ - అమలాపురం మార్గంలో వెళ్తోంది. అదే మార్గంలో నాన్‌స్టాప్ సర్వీస్ ఆర్టీసీ బస్ వెళ్తోంది. రోడ్డులో ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ డైవర్ హోంమంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేక పోయారు. అంతే హోంమంత్రి దగ్గర స్వామి భక్తి నిరూపించుకొనే అవకాశం వచ్చిందనుకున్నారో ఏమో, ఆర్టీసీ బస్సును ముమ్మడివరం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి దారి ఇవ్వలేదంటూ బస్సును పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తాము ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలను ఇలా ఇబ్బందుల పాలు చేయడం ఏంటని మండిపడ్డారు. -
లంకవాసులకు పడవ ప్రయాణమే దిక్కు
-
అవినీతి గుట్టు రట్టు!
నగర పంచాయతీలో పనుల మాయజాలం విజిలెన్స్ తనిఖీలో బయటపడుతోన్న అక్రమాలు ముమ్మిడివరం : నగర పంచాయతీలో అవినీతి.. విజిలెన్స్ తనిఖీల్లో తవ్వేకొద్దీ బయటపడుతోంది. అవినీతి ఆరోపణలపై జూలై 6 నుంచి విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు వరకు అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడి పరిస్థితిపై విజిలెన్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. మూడేళ్లలో రూ.4 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు ఆందడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు పర్యాయాలు కార్యాలయంలో వివిధ శాఖల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఖాతాలలో... ఎస్సీ, ఎస్టీ నిధులు నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే.. ఆ ఖాతాలలో రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉద్యోగులను రాజమహేంద్రవరం విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రూ.4 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను పాలక వర్గం తీర్మానం లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. అసలేం జరిగిందంటే... టీడీపీకి చెందిన చైర్పర్సన్ భర్త ఆదేశాల మేరకు సబ్‌ప్లాన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాలకవర్గం సమావేశం నిర్వహించకుండానే...తీర్మానాల పుస్తకంలో సభ్యుల సంతకాలు తీసుకున్నట్టు అభియోగం. గౌరవ వేతనం కోసం మినిట్ బుక్‌లో సంతకం చేయాలని సభ్యులకు అబద్ధం చెప్పి ఈ పని కానిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు రూ.60.98 కోట్లు మంజూరయ్యాయి. ఒక్క ముమ్మిడివరం నగర పంచాయతీలోనే నామినేషన్ల పద్ధ్దతిపై పనులు అప్పగించారు. రూ.4 కోట్ల నిధులను 74 పనులకు రూ.5 లక్షల చొప్పున విభజించి అనుకూలురైన 10 మంది కాంట్రాక్టర్లకు ఈ పనులను అప్పగించి పర్సంటేజీల పర్వానికి తెర తీశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు 15 శాతం నుంచి 25 శాతం వరకు పర్సంటేజీలు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను విజిలెన్స్ అధికారులు సాంకేతిక పరంగా విచారణ చేశారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. -
పెళ్లి చేసుకోమంటే గోదావరిలోకి తోసేశాడు
ప్రేమించానని నమ్మించి యువతిని మోసగించిన ఓ ప్రబుద్ధుడు తూర్పు గోదావరి జిల్లా (ముమ్మిడివరం): నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు.. కడవరకు తోడుంటానని నమ్మించాడు. ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ఏకంగా పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ససేమిరా అన్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని రమ్మని చెప్పి వచ్చాక అర్ధరాత్రి గోదావరిలోకి తోసేశాడు ఓ మోసగాడు. ఈ దారుణమైన ఘటన యానాం–ఎదురల్లంక బాలయోగి వారధి వద్ద చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికిచెందిన ఓ యువతి (26), నాసిక శ్రీనివాసరావు (31) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎంబీఏ చదివిన ఆమె ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ప్రేమిస్తున్నానని చెప్పి తరువాత మొహం చాటేస్తుండడంతో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. దీంతో శ్రీనివాసరావు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ‘ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకుందా’మని ఆమెకు చెప్పి ఆదివారం యానాం–ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు రప్పించాడు. ఆమెతో అర్ధరాత్రి వరకు అక్కడే కాలక్షేపం చేసి ఎవరూ లేని సమయంలోఆమె తలపై కొట్టి, గొంతునుమిలి గోదావరిలోకి తోసేసి శ్రీనివాసరావు పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు బాధితురాలిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.