NCDC
-
రుణం ఇచ్చింది.. ‘మాఫీ’కి వద్దంది!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ కోసం అవసరమైన రూ. 31 వేల కోట్లలో రూ. 5–6 వేల కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలపై ఆ సంస్థ నీళ్లుచల్లింది. తెలంగాణ సర్కారు అడిగిన విధంగా రూ. 5 వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు మంజూరు చేసిన ఎన్సీడీసీ.. ఆ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించరాదని షరతు విధించింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నిధుల ధీమాతోనే... సహకార సంఘాలను, డీసీసీబీలను బలోపేతం చేయడానికి రూ. 5 వేల కోట్ల రుణ సాయం చేయాలని గతేడాది ఎన్సీడీసీని టెస్కాబ్ కోరింది. టెస్కాబ్, డీసీసీబీల నిర్వహణ తీరును పరిశీలించిన ఎన్సీడీసీ.. ఆ తర్వాత రుణం మంజూరు చేసింది. వాస్తవానికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రూ. 31 వేల కోట్లు ఎలా సమకూరుతాయన్న విషయాన్ని ఆర్థికశాఖ రహస్యంగానే ఉంచుతోంది. రుణమాఫీ చేయాల్సిన రైతుల వివరాలను తమకు ఇవ్వాలని అడిగిన ఆర్థికశాఖ అధికారులు సదరు మాఫీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు కూడా స్పష్టత ఇవ్వలేదు.ఇప్పటివరకు మొదటి విడత 11 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కోసం రూ. 6,070 కోట్లను సర్దుబాటు చేసి ఆ మేరకు రైతుల అప్పు ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సుమారు రూ. 25 వేల కోట్ల నిధులను వచ్చే నెలాఖరులోగా సర్దుబాటు చేయాల్సి ఉంది. రూ. 5 వేల కోట్లు ఎన్సీడీసీ నుంచి వస్తే మిగిలిన నిధులను ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని, అందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్సీడీసీ షరతు నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. రుణమాఫీకి మళ్లింపు సాధ్యమేనా? తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాల వివరణ కోరగా రుణమాఫీకి వినియోగించవద్దని అప్పు ఇచి్చన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నాయి. అప్పుగా ఇచి్చన నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న విషయమై ఏ క్షణంలోనైనా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థకు ఉందని చెబుతున్నాయి. అయితే ఈ రుణాన్ని టెస్కాబ్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డీసీసీబీలు తీసుకొనే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నాయి.ఒకవేళ రుణమాఫీ చేసుకుంటామని సదరు డీసీసీబీలు నిర్ణయం తీసుకున్నా ప్యాక్స్‌ల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింపజేయగలమని, అది కూడా ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణమాఫీ కోసం ఈ నిధులను వినియోగించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నందున ఏదో విధంగా ఆ నిధులను వాడుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకపోతే ప్యాక్స్‌ల ద్వారా రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం లేదా రైతులకు అందించే ఇతర సహకార కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించుకుంటామని టెస్కాబ్ అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతామని అంటున్నారు. -
రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం సర్కారు వేట ప్రారంభించింది. రూ.31 వేల కోట్లు సమకూర్చుకునేందుకు పలు జాతీయ బ్యాంకులను సంప్రదించింది. చివరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) అవసరమైన రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ నుంచి తొలివిడత రూ.3,955 కోట్ల రుణం తీసుకుంది. రెండోవిడతకు రూ.4,563 కోట్ల రుణం ఇవ్వాలని కోరగా.. ఎన్సీడీసీ చివరి నిమిషంలో ఆపేసింది. అప్పుడు రాజకీయ కారణాలు అడ్డుగా మారడంతో మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. ఇలాంటి విష యాల్లో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంలో ఎన్సీడీసీ ముందుంటుంది. దీంతో దాన్నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీసీ అధికారులతో చర్చలు జరిపింది.అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, కేంద్ర సహకారశాఖ పరిధిలో ఎన్సీడీసీ ఉన్నందున రాజకీయకారణాలు ఏమైనా అడ్డుగా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్సీడీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయి. ముంచుకొస్తున్న గడువు... వచ్చే ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం రూ. 31వేల కోట్లు అవసరం అవుతాయని ప్రకటించారు. సీఎం చెప్పిన గడువుకు మరో నెలన్నర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అంత భారీ మొత్తాన్ని ఏ విధంగా సమాకూర్చుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రుణమాఫీ కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా రుణం ఇవ్వాలంటే షరతులు ఉంటాయని ఎన్సీడీసీ అధికారులు అంటున్నట్టు తెలిసింది. అంతేగాక కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా అవసరమన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో రుణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే పార్టీ పనులతోపాటు ఈ విషయంపైనా తేల్చుకునేందుకు సీఎం ఢిల్లీలో నాలుగు రోజులుగా మకాం వేసినట్టు వ్యవసాయశాఖవర్గాలు అంటున్నాయి. ఇదిలాఉండగా, రుణం కోసం ముంబై వెళ్లి రిజర్వు బ్యాంకు వద్ద ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీడీసీపైనే ప్రభుత్వం ఆధారపడినట్టుగా చెబుతున్నారు. రుణం ఇస్తే ప్రభుత్వం అవసరమైన గ్యారంటీ ఎన్సీడీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథకంపై మంగళవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్ డాక్టర్. ఎస్.రాంచందర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఈలోగా లబ్ధిదారులను తీసుకెళ్లి గొర్రెలు కొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.500 కోట్లు విడుదల కాగా, గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులను ఇవ్వడంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు గాను ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లలో పశుసంవర్ధక శాఖ అధికారులున్నారు. కాగా, రెండో విడత పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 5వ తేదీన మంత్రి తలసాని నల్లగొండలో ప్రారంభించనుండగా, అదే రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభం కానుంది. -
‘రెండో విడత’ గొర్రె..పంపిణీకి కొర్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు నిధుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.4,565 కోట్ల రుణాన్ని మంజూరు చేసినా.. నిధులను విడుదల చేయకుండా కొర్రీలు పెడుతుండటంపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా ఆటంకాలు కల్పిస్తోందనే ఆరోపణలు అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తొలి విడత కోసం తీసుకున్న రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నా.. రెండో విడత నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటం సందేహాలకు తావిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్సీడీసీ బోర్డు సమావేశాలకు రాష్ట్ర అధికారులు హాజరై పథకం అమలు ఆవశ్యకతను, మొదటి విడత తీసుకున్న రుణం కింద తిరిగి చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలను, రెండో విడత కింద ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గల అవకాశాలను స్పష్టంగా వివరించినా.. కుంటిసాకులు చెప్తూ ఆపుతుండటం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సరేనంటూనే.. అభ్యంతరాలు వాస్తవానికి రెండో విడత గొర్రెల పంపిణీకి అవసరమైన నిధులను ఇచ్చేందుకు ఎన్సీడీసీ గత ఏడాది అక్టోబర్‌లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులను గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట విడుదల చేయాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు అవసరమైంది. ఈ పూచీకత్తు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత జాప్యం చేయగా.. కథ అడ్డం తిరిగింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ అప్పుల కింద పరిగణిస్తామని, ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలో లెక్కగడతామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో.. గత ఏడాది పలు ఆర్థిక సమీకరణాల కారణంగా ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. రెండో విడత కింద గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమై అధికారికంగా పూచీకత్తు ఇస్తూ ఎన్సీడీసీకి ప్రతిపాదనలు పంపింది. కానీ ఈసారి ఆడిట్ రిపోర్టు రూపంలో అడ్డంకి ఎదురైంది. తొలి విడత గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో పేర్కొనడంతో ఎన్సీడీసీ రుణం విడుదలపై పునరాలోచనలో పడింది. ఎన్సీడీసీ కేంద్ర మంత్రి అమిత్‌షా పరిధిలోని సహకార శాఖ పరిధిలోకి వస్తుందని.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ నడుమ రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎన్సీడీసీ బోర్డు సభ్యులు నిధుల విడుదలకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకసారి బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత నిధులను వెంటనే విడుదల చేయాలి. కానీ ఈ నిబంధనను ఉల్లంఘించి మరీ బోర్డు సభ్యులు కొందరు తెలంగాణకు నిధులు ఇవ్వద్దని పేచీ పెడుతున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ అధికారులు సుముఖంగా ఉన్నారని, ఇటీవలి బోర్డు సమావేశ ఎజెండాలో ఈ ప్రతిపాదన పెట్టారని.. కానీ కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని మరో సమావేశం వరకు ఈ నిధుల విడుదలను వాయిదా వేయించారని అంటున్నాయి. ఖజానా నుంచే సర్దుబాటుకు ఏర్పాట్లు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో గొర్రెల పంపిణీ పథకంపై చర్చ జరిగింది. రుణం మంజూరు చేసినా విడుదల చేయకుండా ఎన్సీడీసీ వ్యవహరిస్తున్న తీరు, రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులు తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. 10–15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అయితే రుణ విడుదలను ఎన్సీడీసీ వాయిదా వేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఖజానా నుంచే రెండో విడత పంపిణీకి అవసరమయ్యే నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. వారం, పదిరోజుల్లో జరిగే ఎన్సీడీసీ భేటీ వరకు వేచి చూస్తామని, ఈ దఫా కూడా నిధులను విడుదల చేయకపోతే.. రాష్ట్ర ఖజానా నుంచే విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆర్థికశాఖ అధికారి వెల్లడించారు. ఒక్క వాయిదా తప్పకుండా.. తొలి విడత గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ ఇచ్చిన రూ.3,955 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. 2017లో ఈ రుణం మంజూరుకాగా.. ఏటా మే, నవంబర్ మాసాల్లో వాయిదాలను జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 వాయిదాల్లో అసలు కింద రూ.2,626 కోట్లు, వడ్డీ కింద రూ.1,442 కోట్లు కలిపి రూ.4,068 కోట్లను చెల్లించింది. తొలి విడత రుణం 2025 మే నాటికి తీరిపోనుంది. ఇలా ఠంచన్‌గా రుణ వాయిదాలు చెల్లిస్తున్నా.. రెండో విడత కింద రూ.4,565 కోట్లను మంజూరు చేసి మరీ నిలిపివేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. రెండో విడత రుణం విడుదల చేసేందుకు.. కేంద్ర సహకార శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్‌షా అనుమతి కావాల్సిందేనని ఎన్సీడీసీ బోర్డులోని కీలక అధికారి ఒకరు మన రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. గొర్రెల పంపిణీ సంబంధిత గణాంకాలివీ.. ఇప్పటివరకు గొర్రెల పంపిణీ జరిగిన లబ్ధిదారుల సంఖ్య: 3.94 లక్షలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిన తీరు: 2014–15లో 1.28 కోట్ల నుంచి 2022–23 నాటికి 1.90 కోట్లకు.. మాంసం ఉత్పత్తి పెరిగిన తీరు: 2014–15లో 5.05 లక్షల టన్నుల నుంచి 2021–22 నాటికి 10.04 లక్షల టన్నులకు.. -
మనీ లేదాయె.. ‘మంద’ రాదాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. బాలారిష్టాలు, అవినీతి ఆరోపణలు, రీసైక్లింగ్ విమర్శల నడుమ మొదటి విడత గొర్రెల పంపిణీ జరగ్గా, రెండో విడత పంపిణీకి నిధుల లేమి అడ్డంకిగా ఉంది. మొదటి విడతలో నాలుగేళ్లపాటు జాప్యం చేసి 3.8 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 3.6 లక్షల యూనిట్లను మంజూరు చేసేందుకు అవసరమయ్యే రూ. 6 వేల కోట్లను రుణం కింద ఇవ్వా లని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ)కు 4 నెలల క్రితమే రాష్ట్ర గొర్రెల సమాఖ్య లేఖ రాసినా ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు రుణం వస్తుందో లేదో కూడా అర్థం కాని దుస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో గొర్రెల పంపిణీకి రూ.1,000 కోట్లు కేటాయించడం గమనార్హం. సమావేశం జరగలేదట! వాస్తవానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3.6 లక్షల యూనిట్ల పంపిణీకి గొర్రెలు, మేకలు పెంపకందారుల సమాఖ్యకు అనుమతినిచ్చింది. కానీ, ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన 3–4 వేల యూనిట్లు తప్పితే అదనంగా ఒక్క గొర్రెనూ పంపిణీ చేయలేదు. ఇందుకు ఎన్సీడీసీ రుణమే అవరోధంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్సీడీసీ బోర్డు సమావేశం జరగనందునే ఇంకా రుణం మంజూరు కావడం లేదని అధికారులు పైకి చెపుతున్నా.. ఆ రుణం మంజూరు లో ఎక్కడో తకరారు జరిగిందనే వాదన కూడా ఉంది. పెండింగ్‌కు ఎప్పుడు మోక్షం రెండో విడత అటుంచితే మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇందులో 21 గొర్రెలు ఒక యూనిట్‌గా లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, దాన్ని గత ఏడాది రూ.1.75లక్షలకు పెంచారు. అంటే లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన రూ.31,250కి తోడు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది. నాలుగేళ్ల క్రితమే డీడీలు కట్టినా ప్రభు త్వ జాప్యం వల్లనే తమకు గొర్రెలు రాలేదని, అందువల్ల ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లబ్ధిదారులు అప్పట్లో కోరారు. కానీ, గొర్రెల సమాఖ్య ఒప్పుకోలేదు. రుణ నిబంధనలు అంగీకరించవంటూ అదనపు వాటానూ కట్టించుకున్నారు. కానీ, అదనపు వాటా కట్టిన 28 వేల మం దికి పైగా లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు అదనపు వాటా చెల్లించి రెండు నెలలైనా ఎదురుచూపులు తప్పలేదు. రూ. 500 కోట్లు చేతులు మారాయి మొదటి విడత గొర్రెల పంపిణీలో అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. హైదరాబాద్‌లోని పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే వ్యవహారమంతా సాగిందని, యూనిట్‌కు రేటు పెట్టి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రూ.4 వేల కోట్ల వ్యయంతో సాగిన పంపిణీలో రూ.500 కోట్ల వరకు చేతులు మారాయనే చర్చ పశుసంవర్థక శాఖలో బహిరంగ రహస్యమే కావడం గమనార్హం. పంపిణీ కోసం దళారులు యూనియన్లుగా మారి ఒకచోట సమావేశమయ్యేంత స్థాయిలో అవినీతి జరిగిందని సమాచారం. ఇక, ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు గొర్రెలను ఎంపిక చేసే కాంట్రాక్టును కట్టబెట్టినా.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థను తప్పించారు. క్షేత్రస్థాయిలోని పశువైద్యుల మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా రూ.60–70 వేల వరకు డబ్బులిచ్చి అవకతవకలకు పాల్పడినట్లు కూడా వినిపిస్తోంది. నగదు బదిలీనే పరిష్కారం గొర్రెల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని పథకం మార్గదర్శకాల్లో పెట్టారు. కానీ, ఒక్కరోజు కూడా సీఎంవో సమీక్షించలేదు. అసలు దళారులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తేల్చాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గొల్ల, కుర్మలకు నగదు బదిలీ చేసి.. నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా తనిఖీ చేసి దుర్వినియోగం చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. మొదటి విడత పెండింగ్ యూనిట్లను పంపిణీ చేసి, బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీని కూడా త్వరగా చేపట్టాలి. – ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం -
రూ.100 కోట్లతో ఎన్సీడీసీ ఏర్పాటు
తాడేపల్లి రూరల్: దేశం మొత్తం మీద ఏదైనా ఆరోగ్యపరమైన విపత్తులు సంభవించినపుడు వాటి గురించి రీసెర్చ్ చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సెంటర్ (ఎన్సీడీసీ)ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొలనుకొండ నుంచి ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లే దారిలో రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కేటాయించారు. సర్వే నం. 372/10 రెండెకరాల భూమిని ఎన్సీడీసీ సంస్థకు అప్పగించాలని స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. 5వ తేదీన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రెండెకరాల స్థలం కేటాయించాం.. ఎన్సీడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలం కావాలని ప్రతిపాదనలు పంపింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ çఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిలోని జాతీయ రహదారి వెంబడి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే ఎన్సీడీసీకి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేస్తాం. – తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి -
ఏపీ, తెలంగాణాల్లో ప్రాణాంతక హెపటైటిస్.. నివారణ మార్గాలు తెలుసుకోండి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశ వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు భయం గొల్పుతున్నాయి. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న జనం..మరోవైపు అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ బారిన పడుతున్నారు. 15 ఏళ్ల వయసు దాటిన వారిలో దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బాధితులుండగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2.3 శాతం మంది ఉన్నట్లు తాజాగా ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ) వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనిపై తక్షణమే సత్వర చర్యలు చేపట్టాలని సూచించింది. హెపటైటిస్ ఎ, బి, సి, డితో పాటు హెపటైటిస్ ఇ వైరస్ కూడా ఉంది. ఈ వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికోసం ఏపీ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణకు చర్యలు చేపట్టింది. లక్ష మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ పూర్తి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే లక్ష మంది హెల్త్‌కేర్ వర్కర్లకు హెపటైటిస్ వ్యాక్సిన్ పూర్తి చేశారు. అంతేకాదు 101 జైళ్లలో ఉన్న 5,900 పైచిలుకు ఖైదీలకూ స్క్రీనింగ్ నిర్వహించి వ్యాక్సిన్ వేశారు. ఖైదీల్లో మరింత ఎక్కువగా హెపటైటిస్ బి వ్యాధులు కనిపించాయి. రాష్ట్రంలో సగటున 2.3 శాతం ఉండగా.. ఖైదీల్లో 2.7 శాతం మందికి నిర్ధారణ అయ్యింది. మరో 8 లక్షల మందికి వ్యాక్సిన్ రాష్ట్రంలో రిస్క్ గ్రూపులుగా చెప్పుకునే వాళ్లకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఐవీ, క్షయ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, సెక్స్ వర్కర్లు, ఎంఎస్ఎం (మేల్ సెక్స్ విత్ మేల్)కు వేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ.5 కోట్లు వ్యయం చేసి వ్యాక్సిన్ వేయనుంది. 560కి పైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అందరికీ హెపటైటిస్ స్క్రీనింగ్ చేయనున్నారు. నివారణ ఇలా.. ► శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్–ఏ వైరస్‌ను నివారించవచ్చు ► హెపటైటిస్ బి, సి రక్తమార్పిడి వల్ల వస్తాయి. శుభ్రంగా లేని సిరంజీలు, నీడిల్స్ వాడడం వల్ల వస్తాయి. ► ప్రతి గర్భిణికి ప్రసవానికి ముందు హెపటైటిస్ టెస్టు చేసి, బిడ్డకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► హెపటైటిస్ –సి మూడు నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది. ► మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా ఇస్తారు. ► విశృంఖల శృంగారం వల్ల హెపటైటిస్ బి, సి వస్తాయి. చిన్న పిల్లలకూ విధిగా హెపటైటిస్ టీకాలు వేయించాలి -
ఎట్టకేలకు సీసీఎస్‌కు నిధులు
సాక్షి, హైదరాబాద్: మూతపడే దశలో ఉన్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి ఎట్టకేలకు రవాణా సంస్థ నిధులు కేటాయించింది. వేయి కోట్లకు పైగా సంఘం నిధులు సొంతానికి వాడుకుని, దాన్ని దివాలా దశకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా దానికి రూ.90 కోట్లు అందజేసింది. త్వరలో నేషనల్ క్రెడిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎస్‌కు రూ.400 కోట్ల నిధులు సమకూర్చాల్సి ఉంది. కానీ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సీసీఎస్ కొంత బకాయి పడింది. అవి మొండి బకాయిలుగా మారటంతో సంఘం ప్రస్తుతం ఎన్పీఏ జాబితాలోకి చేరింది. ఆ బకాయిలు తీరిస్తేగానీ ఎన్సీడీసీ నుంచి రుణం పొందే వీలులేదు. ఈ నేపథ్యంలోనే అందుకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిందిగా సీసీఎస్ చాలాకాలంగా ఆర్టీసీని కోరుతోంది. కానీ పట్టించుకోలేదు. అయితే ఆర్టీసీ కొత్త ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. ఆ కసరత్తు వేగం అందుకుంది. నాలుగు రోజుల క్రితం రూ.90 కోట్లు సీసీఎస్‌కు అందాయి. వడ్డీ బకాయిలకు రూ.7.5 కోట్లు: తాజా నిధుల్లోంచి బ్యాంకు బకాయిల కిం ద రూ.80 కోట్లను చెల్లించిన సీసీఎస్, మిగతా మొత్తం నుంచి రిటైర్డ్ ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు చెల్లించనుంది. గత మూడు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తాన్ని సీసీఎస్‌లోనే డిపాజిట్ చేశారు. -
నిఫా కలకలం: 12 ఏళ్ల బాలుడు మృతి
తిరువనంతపురం: కోవిడ్‌తో విలవిల్లాడుతున్న కేరళను మరో మహమ్మారి భయపెడుతుంది. కేరళలో మరోసారి నిఫా వైరస్ వెలుగు చూసింది. తాజాగా కేరళలో నిఫా వైరస్ బారిన పడి ఓ బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో ఈనెల 3న కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అందులో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నిఫా వైరస్ కారణంగానే బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. వారందరిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పని ప్రారంభించామని తెలిపారు. (చదవండి: Covid-19: పదిరోజులు జాగ్రత్త.. లేదంటే..) కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిఫా వైరస్ వల్లే బాలుడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కోజికోడ్ పంపించింది. కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
Telangana: గొర్రెల పంపిణీపై కేంద్ర బృందం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర బృందం ప్రశంసలు లభించాయి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సభ్యులు సోమవారం ఇక్కడ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. సుధీర్‌కుమార్ శర్మ, ముఖేశ్‌కుమార్, భూపిందర్‌సింగ్, తెహెదుర్ రెహ్మాన్, వి.కె.దుబాసీ, శ్రీనివాసులతో కూడిన బృందం మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రం లో పశుసంపద అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి తలసాని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విరించారు. జీవాల వద్దకే వైద్యసేవలను తీసుకెళ్లేందుకు సంచార వైద్యశాలలను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అరగంటలో వైద్యం అవసరమున్న ప్రాంతాలకు తమ సిబ్బంది వెళ్లగలుగుతున్నారని చెప్పారు. మాంసం ఎగుమతి కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, గొర్రె పిల్లల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం అవసరమైన మార్కెట్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. అనంతరం ఎన్సీడీసీ సభ్యులు మాట్లాడుతూ పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, గొర్రెల పంపిణీలాంటి పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెల సమాఖ్య ఎండీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45 వేల నమూనాలను పరీక్షించగా ఈ డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూశాయని, మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు ఉన్నాయని తెలిపింది. ఈ పరివర్తనకు సంబంధించి చాలా తక్కువ కేసులు ఉన్నాయని చెబుతూ ఇవి పెరిగే ధోరణిని చూపిస్తుందని చెప్పలేమని స్పష్టం చేసింది. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో 20, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైందని విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ‘డెల్టా ప్లస్ మ్యుటేషన్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 12 జిల్లాల్లో దాదాపు 50 కేసులు గుర్తించాం. ఏ జిల్లాలో గానీ ఇది పెరుగుతున్న ధోరణిని చూపిస్తుందని చెప్పలేం‘అని సింగ్ తెలిపారు. డెల్టాలో కనిపించే ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను ఈ వేరియంట్లో కూడా గమనించవచ్చని వివరించారు. దేశంలో కరోనా వైరస్ యొక్క జన్యు పరిణామ క్రమ విశ్లేషణలో ఎన్సీడీసీ పాల్గొంటోందని తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ డెల్టా వేరియంట్‌ను అదనపు మ్యుటేషన్‌తో సూచిస్తుందని సింగ్ చెప్పారు. బి.1.617.2.1 గా పరిగణిస్తారని, డెల్టా వేరియంట్‌కు కె.417ఎన్ జన్యు వేరియంట్ కలవడం వల్ల డెల్టా ప్లస్ అయ్యిందని వివరించారు. కె.417ఎన్ బీటా వేరియంట్లో కూడా ఉండడంతో ఇది ప్రాముఖ్యత కలిగి ఉందని వివరించారు. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ప్లస్ గుర్తుతో సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీని అర్థం వ్యాప్తి తీవ్రత ఎక్కు వనో లేదా మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంద నో కాదు. అలాంటి శాస్త్రీయ ఆధారాలు తేలితే కచ్చితంగా తెలియజేస్తాం..‘అని ఆయన వివరించారు. డెల్టా వేరియంట్ వల్లే.. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లలో పాజిటివ్ నమూనాల్లో 50 శాతానికి పైగా నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉందని ఆయన తెలిపారు. ‘ఈ నేపథ్యంలో రెండో వేవ్ సమయంలో ఉప్పెనలా వచ్చిన కేసులు ఈ వేరియంట్ వల్లే అన్న నిర్ణయానికి వచ్చాం’అని సింగ్ వివరించారు. కొత్త కేసులు 51,667 దేశంలో 24 గంటల్లో కొత్తగా 51,667 కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,01,34,445కు చేరుకున్నాయని తెలిపింది. అదేవిధంగా, ఒక్క రోజులో ఈ మహమ్మారితో 1,329 మంది చనిపోగా మొత్తం మరణాలు 3,93,310కి చేరుకున్నాయి. అత్యధిక స్థాయి నుంచి 88% తగ్గుదల హా కోవిడ్ 19 కేసుల్లో దేశంలో అత్యధికంగా మే 7న 4,14,188 కొత్త కేసులు నమోదవగా, క్రమంగా తగ్గుతూ జూన్ 25 నాటికి 51,667 కేసులు నమోదయ్యాయి. అంటే మే 7 నుంచి జూన్ 25 నాటికి కొత్త కేసుల్లో 88 శాతం తగ్గుదల కనిపించింది. ► వారం రోజుల్లో కొత్త కేసుల నమోదులో సగటున రోజుకు 24 శాతం మేర తగ్గుదల నమోదైంది. మే రెండో వారంలో 6.7 శాతం తగ్గుదల, మూడో వారంలో 22.3 శాతం తగ్గుదల, నాలుగో వారంలో 23.3% తగ్గుదల, మే 29 నుంచి జూన్ 4 మధ్య 33.1% తగ్గుదల, జూన్ 5–11 మధ్య 31.3% తగ్గుదల, జూన్ 12–18 మధ్య 30.3%, గత వారం 23.8% తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుంది. అయితే ఇందుకు వీలుగా కోవిడ్ కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది. ► మే 4న దేశవ్యాప్తంగా 531 జిల్లాల్లో వందకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యేవి. జూన్ 2 నాటికి కేవలం 262 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యేవి. జూన్ 23 నాటికి ఇలా వందకు పైగా నమోదవుతున్న జిల్లాల సంఖ్య 125కు తగ్గింది. వీటిలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోని జిల్లాలే ఉన్నాయి. ► యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మే 10న అత్యధికంగా 31.3 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 6.13 లక్షలకు తగ్గింది. ఇదేస్థాయిలో మే 3వ తేదీన 81.8 శాతం ఉన్న రికవరీ రేటు క్రమంగా 96.7 శాతానికి చేరుకుంది. ► పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 30–మే 6 మధ్య అత్యధికంగా పాజిటివిటీ రేటు 21.6 శాతం ఉండగా, జూన్ 24 నాటికి అది 3.1 శాతానికి చేరుకుంది. ‘డెల్టా ప్లస్’పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ డెల్టా ప్లస్ కేసులు గుర్తించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తుల్లో కణాలతో బంధం ఏర్పర్చుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకోవడం వంటి లక్షణాలున్నాయన్నారు. -
ఉత్తరాదిలో యూకే వేరియంట్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్‌లో కొత్త రకాలు వెలుగులోకి వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టిన కొత్త రకం(యూకే వేరియెంట్) ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై పంజా విసురుతోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో డబుల్ మ్యుటెంట్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. దేశంలో ఉత్తరాది మినహా ఇతర ప్రాంతాల్లో యూకే వేరియంట్ (బీ1.1.7) ప్రభావం గత నెలన్నర రోజుల్లో గణనీయంగా పడిపోయిందన్నారు. యూకే వేరియంట్ కరోనా పాజిటివ్ కేసులు పంజాబ్‌లో 482, ఢిల్లీలో 516, మహారాష్ట్రలో 83, కర్ణాటకలో 82, తెలంగాణలో 192 బయటపడ్టాయని వెల్లడించారు. కేవలం మహారాష్ట్రలో బ్రెజిల్ రకం వైరస్ డబుల్ మ్యుటెంట్ వేరియంట్ (బి.1.617) కేసులు మహారాష్ట్రలో 761, పశ్చిమ బెంగాల్లో 124, ఢిల్లీలో 107, గుజరాత్లో 102 నమోదయ్యాయని సుజిత్ సింగ్ గుర్తుచేశారు. ఇక దక్షిణాఫ్రికా వేరియంట్ (బి.1.315) తెలంగాణ, ఢిల్లీలోనే అధికంగా కనిపిస్తోందని తెలిపారు. బ్రెజిలియన్ వేరియంట్(పీ1) మహారాష్ట్రలోనే స్వల్పంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో దాని ఉనికి కనిపించలేదన్నారు. కొత్త వేరియంట్లు బయటపడే జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైరస్ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు సుజిత్ సింగ్ సూచించారు. కాంట్రాక్టు ట్రేసింగ్ చాలా ముఖ్యమంత్రి చెప్పారు. -
భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్, ప్రభుత్వం చేపట్టిన ఇతర నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్–19 వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. దేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు ఈ సర్వేలో తేలిందని కేంద్రం గురువారం తెలియజేసింది. అయితే, కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్ ఇంకా చేరుకోలేదని తేల్చిచెప్పింది. ఈ సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి. మొదట సాధారణ జన సమూహంలో సార్స్–కోవ్–2 వైరస్ వ్యాప్తి తీరును పరిశీలించారు. రెండో భాగంలో కంటైన్మెంట్ జోన్లు, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎవరెవరు ఈ మహమ్మారి బారినపడ్డారో గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. రెండో భాగం సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖలు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) భాగస్వామ్యంతో మే నెలలో దేశవ్యాప్తంగా సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు. ► మొత్తం 83 జిల్లాల్లో 28,595 ఇళ్లల్లోని 26,400 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ► ఇప్పటిదాకా 65 జిల్లాల సర్వే ఫలితాలను క్రోడీకరించారు. ఈ జిల్లాల్లో 0.73 శాతం జనాభా సార్స్–కోవ్–2 వైరస్ ప్రభావానికి గురైనట్లు తేలింది. ► దేశంలో కరోనా వేగానికి అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్ కేసులను తగ్గించడంలో లాక్డౌన్, కంటైన్మెంట్ చర్యలు బాగా తోడ్పడ్డాయి. ► గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా ముప్పు పట్టణ ప్రాంతాల్లో 1.08 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధికం. ► పట్టణ మురికివాడల్లో లాక్డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశం ఉన్న గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక్కరోజులో 357 మరణాలు 24 గంటల్లో 9,996 కేసులు మొత్తం కేసులు 2,86,579 మరణాలు 8,102 ఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం నానాటికీ ఉధృతమవుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తొలిసారిగా 300 మార్కును దాటేసింది. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలోనే 9,996 కేసులు బయటపడ్డాయి. 357 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,86,579కు, మరణాలు 8,102కు చేరాయి. రెండో రోజు కూడా యాక్టివ్ కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండడం కొంత సానుకూల పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,37,448 కాగా, 1,41,028 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 49.21 శాతంగా నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత భారత్ ఐదో స్థానానికి చేరింది. దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు, అనుమానితులు వెంటనే రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అధికారుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందాలన్నారు. -
78 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా 2,549 మంది మరణించారు. మొత్తం 78,003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 3,722 కేసులు బయటపడ్డాయి. 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 49,219 కాగా, 26,234 మంది చికిత్స అనంతరం కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రికవరీ రేటు 33.63 శాతానికి పెరిగిందని వెల్లడించింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్రను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 975 మంది కరోనా వల్ల కన్నుమూశారు. అలాగే 25,922 పాజిటివ్ కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 13.9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు కరోనా కేసులు రెట్టింపయ్యే వ్యవధి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. గత మూడు రోజుల్లో ఈ వ్యవధి 13.9 రోజులకు చేరిందని చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను(ఎన్సీడీసీ) సందర్శించారు. కోబాస్–6800 టెస్టింగ్ మెషీన్లను జాతికి అంకితం చేశారు. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో గత 14 రోజులుగా 11.1 రోజులుగా ఉన్న కరోనా కేసుల డబ్లింగ్ టైమ్ గత 3 రోజులుగా 13.9 రోజులకు చేరడం శుభపరిణామమని అన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచామన్నారు. ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. అత్యాధునిక కోబాస్–6800 యంత్రంతో 24 గంటల్లోనే 1,200 కరోనా నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు. -
సహకార లావాదేవీలు పారదర్శకం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు వాటిని కంప్యూటరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్సీడీసీ (నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్), ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు) ఆర్థికకసాయం చేయనున్నాయి. ఎన్సీడీసీ 65 శాతం నిధులు రుణంగానూ, 20 శాతం సబ్సిడీగానూ అందిస్తుంటే 15 శాతం నిధులు ఆప్కాబ్ సమకూరుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణపై నిర్ణయం తీసుకోవడంతో అధికారులు దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కంప్యూటరీకరణ ఎందుకంటే.. - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని పాలకవర్గాలు, సిబ్బంది కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. - కంప్యూటర్ల వినియోగం లేకపోవడంతో ఒక సంఘంలో రుణాలు ఎగవేసిన రైతులు, వ్యాపారులు మరో సంఘంలోనూ రుణాలు పొందుతున్నారు. అక్కడా రుణాలు ఎగవేస్తుండటంతో సంఘాల ఆర్థికంగా నష్టపోతున్నాయి. - ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సహకార శాఖ పనితీరును అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సంస్థను నియమించాలని ఆదేశించారు. -దీంతో నాబ్కాన్స్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్)ను అధికారులు నియమించారు. ఆ సంస్థ ఇప్పటికే అనేక సంఘాల్లోని పరిస్థితులను పరిశీలించి అక్రమాలు నిలువరించడానికి కంప్యూటరీకరణ అనివార్యంగా పేర్కొంది. -
అవి అనువైన భవనాలు కావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలోని పాత భవనాలు జాతీయ అంటు వ్యాధులని యంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రానికి అనువైనవి కావని కేంద్రం స్పష్టం చేసింది. తమకు అనువైనచోట రెండెకరాలు కేటాయిస్తే అందులో భవనాలు నిర్మించుకుంటా మని కోరింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఎన్సీడీసీ అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లో తమ పరిశోధన కేంద్రానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన భవనాలను పరిశీలించారు. అవి పరిశోధన సంస్థకు యోగ్యంకావని నిర్ధారించారు. ఇటు యాచారం, శామీర్‌పేట, మానసిక చికిత్సాలయంలలో ఉన్న స్థలాలనూ పరిశీలించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. స్థలం గుర్తించే వరకు కోఠిలోని ఆరోగ్య కుటుం బ సంక్షేమ కమిషనరేట్‌లోని భవనాలను ఉపయోగించుకోవాలని వారిని ఆయన కోరారు. కేంద్ర బృందంతో భేటీ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావుతో కలసి మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల వైరస్‌లను గుర్తించడం, వాటిపై పరిశోధన చేసేందుకు రాష్ట్రంలో ఎన్సీడీసీ ఏర్పాటవుతోందన్నారు. కాగా, కేంద్ర బృందంతో భేటీ కోసం మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యా లయానికి వచ్చారు. ఆ సమయంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మరో సమావేశంలో ఉం డిపోయారు. కీలక సమావేశానికి ఉన్నతాధికారులెవ రూ హాజరుకాకపోవడంపై మీడియా ముందే ఈటల అసహనం వ్యక్తం చేశారు. ‘మిగతా అధికారులంతా ఏమయ్యారు’అని ఆయన అక్కడి అధికారులను ప్రశ్నించారు. కోఠిలో నిత్యం ఉండే కీలక అధికారులు ఒకరిద్దరు మినహా ఎవరూ మంత్రి సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ 20 శాతం సబ్సిడీతో రుణాలు జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 20 గొర్రెలు, పొట్టేలుకు రూ.లక్ష , 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లకు రూ.5లక్షలు, వంద గొర్రెలు, 25 పొట్టేళ్లకు రూ.50లక్షలు వంతున బ్యాంకులతో సంబంధం లేకుండా జిల్లా యూనియన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ లీగల్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ నర్రా వెంకటరమణమాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్తిబాబు, డాక్టర్ నీలం శారద, బమ్మిడి అప్పలనాయుడు, జి.నరసింహమూర్తి పాల్గొన్నారు. -
నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ?
కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. ఒకప్పుడు ఎబోలా వైరస్ బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ గబ్బిలాల వల్లే వచ్చిందని అన్నారని, కానీ తర్వాత ఆ వైరస్ చింపాంజీ, గొరిల్లాల నుంచి వ్యాప్తి చెందిందని తేలిందని వారు గుర్తు చేస్తున్నారు. అసలు మనుషులు సంచరించే ప్రదేశాల్లో గబ్బిలాలు తిరగవని, వాటి నుంచి వైరస్లు వ్యాప్తి చెందడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుందని బయోలజిస్టులు వాదిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గబ్బిలాలు ఆవాసం ఉండడానికి ఎక్కడా చోటు లేకపోవడం, సరైన తిండి దొరకకపోవడం వల్ల వాటిల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్లు వెదజల్లుతున్నాయని,అందువల్ల గబ్బిలాల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుంటే, వాటి వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అసలు భారత్‌లో ఎందరో గిరిజనులు గబ్బిలాల్ని ఆహారంగా తీసుకుంటారని, కానీ వారిలో ఎవరికీ ప్రాణాంతక వ్యాధి నిపా సోకిందనడానికి ఆధారాలు లేవని గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్న మాట. ‘పండ్లు తినేగబ్బిలాలు చూడడానికి భారీ సైజులో కనిపిస్తాయి. కానీ కేరళలో సీజ్ చేసిన బావిలో ఉన్న గబ్బిలాల్ని చూస్తే ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేరళలో వైరస్‌కు గబ్బిలాలే కారణమని ఇప్పట్నుంచి నిర్ధారించలేం‘ అని ఉస్మానియా యూనివర్సిటీకి డాక్టర్ సీహెచ్. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మరో శాస్త్రవేత్త రోహిత్ చక్రవర్తి కూడా ప్రాణాంతక వైరస్లు వచ్చినప్పుడల్లా ఇలా గబ్బిలాలే కారణమని భయపెట్టకుండా, శాస్త్రీయమైన ఆధారాలు కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే గబ్బిలాల ద్వారా 60 రకాల వైరస్లు వ్యాపిస్తాయని, అందులో నిపా, సార్స్ వంటి డజనకు పైగా వైరస్లు ప్రాణాంతకమైనవని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సీజన్లో కొన్ని రకాల గబ్బిలాలు మామిడి పళ్లు, పనస పండ్లు కొరికి పడేస్తాయని, అలా కొరికి పడేసిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళన వద్దు : కేంద్ర బృందం కేరళలో నిపా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) నేతృత్వంలోని కేంద్ర బృందం దీనికి స్థానిక పరిస్థితులే కారణమని అంటోంది. ప్రజలు భయాందోళనలకు గురి కావ్సలిన పనిలేదని చెబుతోంది. కేరళలోని ఒక ఇంట్లో బావిలో ఉన్న గబ్బిలాల నుంచే వైరస్ వ్యాప్తి చెందిందా లేదా అన్నది నిర్ధారించడానికి అక్కడ్నుంచి 60 రకాల శాంపిల్స్ సేకరించింది. ఈ శాంపిల్స్‌ను పరీక్షించే వరకు మరణాలకు కారణాలు వివరించలేమని చెబుతోంది. కేరళలో వైరస్‌కు గబ్బిలాలు కారణం కాకపోవచ్చునని అభిప్రాయపడుతోంది. కర్ణాటకకూ విస్తరించిన నిపా ? కేరళ సరిహద్దుల్ని దాటి నిపా వైరస్ కర్ణాటకకూ విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ పర్యటనకు వెళ్లి తిరిగి స్వస్థలం మంగుళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిపా వ్యాధి లక్షణాలతో బాధపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిపై నిపా వైరస్ దాడి చేసిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నిపాపై ఆందోళన చెందవద్దు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వ్యాధికి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల అవగాహనకు వచ్చిన మంత్రి.. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)తో, మణిపాల్‌లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ, రీసెర్చ్(ఎంసీవీఆర్)తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజల్లో చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు. -
మత్స్య అభివృద్ధికి రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో చేపలు లభ్యమయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి (ఐఎఫ్‌డీఎస్) రూపకల్పన చేసింది. ఈ పథకం అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, అవసరమైన మౌలిక సదుపాయా లను ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్య మార్కెటింగ్ సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సభ్యులు లబ్ధిపొందుతారు. రొయ్యలు, చెరువుల్లో, పంజరాల్లో చేపల సాగు వంటి విభిన్న పద్ధతుల ద్వారా చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అనేక రకాల పరికరాలు అందజేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. వాటిలో లబ్ధిదారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుంది. చేపలు అమ్ముకునేందుకు 50 వేల ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాటిని 75 శాతం రాయితీపై ఇవ్వనుంది. -
రూ.వెయ్యి కోట్లతో మత్స్య సంపద అభివృద్ధి
రెండేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్యకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) మంజూరు చేసిన రూ. వెయ్యి కోట్ల రుణాన్ని ఏ విధంగా ఖర్చుచేయాలన్న దానిపై మత్స్యశాఖ పలు ప్రణాళికలు రూపొందించింది. ఈ రుణంతో 2017–18, 2018–19 సంవత్సరాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రూ. వెయ్యి కోట్ల రుణంతో చేపట్టే కార్యక్రమాలతో 31 జిల్లాల్లోని 3.26 లక్షల మంది మత్స్య సహకార సంఘాల సభ్యులు లబ్దిపొందనున్నారు. 38 రకాల అంశాల్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. రెండేళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలు... ♦ జిల్లా మత్స్యకారుల సంఘాలు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీపై చేప విత్తన కేంద్రాలను బలోపేతం చేస్తారు. నూతన చేప విత్తన కేంద్రాల నిర్మాణం, రిటైల్ చేపల మార్కెట్లు, హోల్‌సేల్ చేపల మార్కెట్ల నిర్మాణం చేపడతారు. ♦ చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వేసేందుకు వంద శాతం గ్రాంటు ఇస్తారు. ఈ చెరువులపై మత్స్య సహకార సంఘాల సభ్యులకు హక్కులు ఇస్తారు. ♦ 75 శాతం సబ్సిడీతో చేప విత్తన హ్యాచరీస్, చేప పిల్లల విత్తన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కొత్త చేపల చెరువుల తవ్వకం, మొబైల్ షిప్ ఔట్లెట్ల ఏర్పాటు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తారు. ♦ మత్స్యకారులకు అవసరమైన వలలు, తూకం వేసే వస్తువులు, మోపెడ్లు, చేపల రవాణా ఆటోలు, ట్రక్కులకు ప్రస్తుతమున్న సబ్సిడీని 75 శాతానికి పెంచుతారు. ♦ నూతన పద్ధతుల్లో చేపల పెంపకం, చేప విత్తన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే మత్స్యకార సంఘాల సభ్యులను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు కేటాయిస్తారు. ♦ మత్స్య సహకార సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో రిజర్వాయర్లలో పది ఆక్వా టూరిజం కేంద్రాల ఏర్పాటుకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ♦ చేపల పెంపకంలో మెళకువలు నేర్పేలా మత్స్యసహకార సంఘాల సభ్యులకు వివిధ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ♦ మత్స్యరంగ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3.50 కోట్లు వంద శాతం గ్రాంటుపై కేటాయిస్తారు. -
మత్స్య సమాఖ్యకు రూ.వెయ్యి కోట్లు
అంగీకారం తెలిపిన ఎన్సీడీసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సమాఖ్యకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేర కు రాష్ట్ర పశుసంవర్థక శాఖకు లేఖ రాసింది. దీంతో రుణం విడుదలకు అవసరమయ్యే గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో రూ.600 కోట్లు ఎన్సీడీసీ రుణం కాగా, రూ.200కోట్లు కేంద్ర సబ్సిడీ, రూ. 200 కోట్లు లబ్ధిదారుల వాటా. అయితే సబ్సిడీ రూ.200 కోట్లు రాకుంటే దీనిని కూడా రుణ రూపంలోనే తీసుకోవాల ని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్సీడీసీ నుంచి మంజూరైన రుణం నుంచి చేపల విక్రయానికి సొసైటీ సభ్యత్వం కలిగిన మత్స్యకారులకు మోపెడ్లు, ఆటోట్రాలీలు, హైజెనిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను 75శాతం సబ్సిడీ పై ఇవ్వనున్నారు. ఇందుకు రూ.320 కోట్లు కేటాయించనున్నట్లు ఎన్సీడీసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఉంది. అలాగే మత్స్య సంపద పెం చేందుకు నీటి వనరుల అభివృద్ధి, చేప విత్తన క్షేత్రాలు, చేపల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్సీడీసీ రుణంలో కేటాయింపులు చేశా రు. ముఖ్యంగా మత్స్య సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా 250 రిటైల్ చేపల మార్కెట్ల నిర్మాణానికి రూ.25కోట్లు, 30 జిల్లాల్లో హోల్‌సేల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.60 కోట్లు ఇవ్వనున్నారు. 10 చేపవిత్తన క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తారు. వంద శాతం సబ్సిడీపై సొసైటీల ఆధ్వర్యంలో చేప విత్తనాలకు, రొయ్య పిల్లల పెంపకానికి రూ.98 కోట్లు, జిల్లా యూనియన్ల ద్వారా 30 రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధికి రూ. 60 కోట్లు ఇవ్వనున్నారు. చేపలు పట్టేందుకు అవసరమైన తెప్పలు, వలల కోసం రూ.82 కోట్లు, 50 ఐస్ ప్లాంట్లకు రూ.12.50 కోట్లు కేటాయిస్తారు. -
గొర్రెల పెంపకానికి సంపూర్ణ సహకారం
– ఎన్సీడీసీ చీఫ్ ముఖేశ్ కుమార్ – రాష్ట్ర పర్యటన అనంతరం జిల్లాకు నిధులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో గొర్రెల పెంపకాన్ని మరింత అభివద్ధి చేసేందుకు అన్నివిధాల సహకరిస్తామని జాతీయ సహకార అభివద్ధి సంస్థ(ఎన్సీడీసీ) చీఫ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని రీజినల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్‌తో కలసి మంగళవారం కర్నూలు వచ్చిన ఆయన పంచలింగాల, గొందిపర్ల, ఈ. తాండ్రపాడులోని గొర్రెల పెంపకందారులతో చర్చించారు. ఇప్పటి వరకు గొర్రెల పెంపకంలో ఎలా రాణిస్తున్నారు.. ఎన్సీడీసీ ద్వారా రుణాలు ఇస్తే ఏ విధంగా వినియోగించుకుంటారనే విషయాపై ఆరా తీశారు. రుణాలు తీసుకోవాలంటే ఆస్తులు తనఖా పెట్టాల్సింటుందని తెలిపారు. అనంతరం అమరావతి హోటల్లో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. కురువ, గొల్ల సామాజిక వర్గాల ప్రధాన వత్తి గొర్రెల పెంపకమేనని, తగిన చేయూతనిస్తే రాణిస్తారని ఈ సందర్భంగా చైర్మన్ వారికి వివరించారు. ఎన్సీడీసీ నిధులతో గొర్రెల పెంపకందారులను ఆదుకోవడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై ముఖేశ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సహకార అభివద్ధి సంస్థ గొర్రెల పెంపకంలాంటి వత్తులను ప్రోత్సహిస్తుందని, తగిన కార్యాచరణ ప్రణాళికలు సమర్పిస్తే జిల్లాకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటన ముగించిన తర్వాత ప్రతిపాధించిన మేరకు నిధులు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల అభివద్ధి విభాగం సహాయ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ సుంకన్న, జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కుటీర పరిశ్రమలకు ఎన్సీడీసీ చేయూత
ఐసీడీపీ డైరెక్టర్ డాక్టర్ ఇళంగోవెల్ వెల్లడి ఆత్రేయపురం : గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ఆధారంగా చేసుకుని జీవించే వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ఐసీడీపీ (ఇండస్ట్రియల్ కోఅపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) కృషి చేస్తుందని డైరెక్టర్ ఇళంగోవెల్ అన్నారు. మంగళవారం ఆత్రేయపురం సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పూతరేకులు, మామిడితాండ్ర, తాడితాండ్ర, పచ్చళ్ల తయారీ పరిశ్రమలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సొసైటీల ద్వారా కుటీర పరిశ్రమలకు, రైతుల యాంత్రీకరణ పనిముట్లకు రెండో విడత రుణాలు అందిస్తున్నట్టు వివరించారు. సహకార సొసైటీలకు గొడౌన్లు నిర్మించేందుకు రూ.15 లక్షలు ఐసీడీపీ ప్రాజెక్టు ద్వారా రుణంగా ఇస్తామని వివరించారు. కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందిస్తామని, ఒక్కొక్క మండలం నుంచి 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ పథకం ఐదేళ్ల పాటు ఉంటుందన్నారు. తొలుత ఆయన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డీసీసీబీ ఏజీఎం కృష్ణమూర్తిరాజు, డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు ఆయన వెంట ఉన్నారు.