pass away
-
కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్‌కు వెళ్తూ ఘటన
ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్‌దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్, న్యూ సౌత్‌వేల్స్ దిగ్గజం ఫ్రాంక్ మిస్సన్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఫ్రాంక్ మిస్సన్ శుక్రవారం తన సృగృహంలో తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని న్యూ సౌత్‌వేల్స్ క్రికెట్ ధ్రువీకరించింది. కాగా 1960 నుంచి 1961 మధ్య ఆసీస్ తరపున కేవలం ఐదు టెస్టులు మ్యాచ్‌లు ఆడిన మిస్సన్.. 16 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్‌తో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 4 వికెట్లు పడగొట్టి సత్తచాటారు.అయితే గాయం కారణం ఆయన కెరీర్లో మధ్యలోనే ముగిసిపోయింది. కానీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం మిస్సన్ మాత్రం అద్బుతమైన గణాంకాలను ఆయన నమోదు చేశారు. న్యూసౌత్‌వేల్స్ తరపున 71 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఫ్రాంక్ మిస్సన్ 177 వికెట్లు సాధించారు. కాగా మిస్సన్ క్రికెటర్ కాకముందు మంచి అథ్లెట్ కూడా. మిడిల్ డిస్టెన్స్ మాజీ కోచ్ పెర్సీ సెరుట్టితో మిస్సన్ శిక్షణ పొందాడు. ఆ తర్వాత చాలా మంది అథ్లెట్లకు కోచ్‌గా ఆయన పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన హెర్బ్ ఇలియట్కు శిక్షణనిచ్చి 1960లో రోమ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ల స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల పలువరు న్యూసౌత్‌వేల్స్ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత..
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రాహం థోర్ప్.. ఆదివారం ఆర్ధ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఈ దివంగత క్రికెటర్‌కు ఈసీబీ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది."ఈ రోజు వరల్డ్ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన హృదయాలతో మేము పంచుకుంటున్నాము. అతడి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈసీబీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా థోర్ప్ ఎంపికయ్యారు. కానీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham's death. pic.twitter.com/VMXqxVJJCh— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024 -
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. అతడు చివరగా వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు. ఆయనను అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునేవారు. భారత తరపున 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా దత్తాజీ వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. అందులో 14 సెంచరీలు ఉన్నాయి. -
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్(62) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వెల్లింగ్టన్లోని తప సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయన మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. కాగా స్టిర్లింగ్ టెస్టులు, వన్డేల్లోనూ కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1984 నుంచి 1986 మధ్య న్యూజిలాండ్ తరపున 6 టెస్టులు, 6 వన్డేలు ఆడిన స్టిర్లింగ్ ఓవరాల్‌గా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా రిచర్డ్ హ్యాడ్లీ, ఎవెన్ చాట్‌ఫీల్డ్, లాన్స్ కెయిర్న్స్ వంటి దిగ్గజ కివీస్ పేసర్లు అద్భుతంగా రానిస్తున్న సమయంలో.. స్టిర్లింగ్ అరంగేట్రం చేయడంతో పెద్దగా అవకాశాలు పొందలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం స్టిర్లింగ్‌కు మంచి రికార్డు ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్కు ప్రాతినిధ్యం వహించారు. 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టిర్లింగ్ 206 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 65 గేమ్‌లలో 90 వికెట్లు సాధించాడు. స్టిర్లింగ్ రిటైర్మెంట్ తర్వాత హాక్స్ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. కివీస్ యువ క్రికెటర్లను తయారు చేయడంలో స్టిర్లింగ్ తన వంతు పాత్రపోషించారు. చదవండి: నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ NZC is deeply saddened by the passing of former Test fast-bowler Derek Stirling, aged 62. "Billy" as he was known, played 6 Tests and 6 ODIs for his country and was a popular member of both the @CDCricket, and @cricketwgtninc sides. Our thoughts are with his family and friends. — BLACKCAPS (@BLACKCAPS) December 13, 2023 -
విండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్లైడ్ బట్స్(66) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. మరో దిగ్గజం జో సోలమన్(93) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. జో సోలమన్.. గయానాకు చెందిన జో సోలమన్ వెస్టిండీస్ క్రికెట్లో కొన్నాళ్లపాటు కీలక బ్యాటర్‌గా కొనసాగాడు. 1958 నుంచి 1965 మధ్య విండీస్ తరపున 27 టెస్టులు ఆడిన సోలమన్.. 34 సగటుతో 1326 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 1960లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సోలమన్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఆఖరి రోజు చివరి వరకు క్రీజులో నిలుచని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. క్లైడ్ బట్స్.. 1980లో వెస్టిండీస్ తరుపున క్లైడ్ బట్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటిలో విండీస్ ఫాస్ట్ బౌలర్లకు పేరు గాంచిన జట్టు. కానీ క్లైడ్ బట్స్ తన స్పిన్ బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జాతీయ జట్టు తరపున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ.. బట్స్‌కు దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్బుతమైన రికార్డు ఉంది. 87 ఫస్ట్‌క్లాస్, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో గయానాకు బట్ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన కామేంటేటర్‌గా, 2000లో విండీస్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. కాగా ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. వారి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ విండీస్ క్రికెట్ ట్విట్ చేసింది. -
టీమిండియా మాజీ కెప్టెన్ మృతి..
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం (అక్టోబర్ 23) సోమవారం తుది శ్వాస విడిచారు. బేడీ 1967 నుంచి 1979 మధ్య కాలంలో భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ కొనసాగారు. టీమిండియా తరపున 67 టెస్టులు ఆడిన బేడి.. ఏకంగా 266 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా పది వన్డేల్లో కూడా భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. 10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. 22 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా ఆయన వ్యవహరించారు. ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ఆయన నిలిచారు. అదే విధంగా భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 ప్రపంచ కప్‌లో భాగంగా తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టారు. అయన బౌలింగ్ కోటాలో ఏకంగా 8 మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. 1970లోనే పద్మ శ్రీ అవార్డు అందుకున్న బేడీ.. దేశీవాళీ క్రికెట్లో ఎక్కువగా ఢిల్లీ తరపున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆయన చాలా మంది క్రికెటర్లకు కోచ్‌గా, మెంటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఈ జెంటిల్మెన్ గేమ్‌లో కొంతకాలంగా వ్యాఖ్యాతగా తన సేవలు అందించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఆయన ఉన్నారు. మణిందర్ సింగ్,మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు భారత క్రికెట్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. 1990 తర్వాత బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా కూడా పనిచేశారు. -
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
హఫీజ్‌పేట్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. గత ఏడాది ఆయన కేన్సర్ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖుల నివాళి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
భారత క్రికెట్లో విషాదం.. సునీల్ దేవ్ కన్ను మూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన సునీల్ దేవ్(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచారు! ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా? -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు డెయిరీ రంగానికి ఎనలేని సేవ చేశారన్నారు. తులసీరావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆడారి తులసీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. చదవండి: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు -
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కన్నుమూత..
వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ డేవిడ్ ముర్రే(72) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముర్రే శనివారం బ్రిడ్జ్‌టౌన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కరీబియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన వికెట్ కీపర్లలో ముర్రే ఒకరు. అయితే మత్తు పదార్థాలకు బానిస కావడంతో ముర్రే క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలను ముర్రే ఎదుర్కొన్నారు. దీంతో అతను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టులో ముర్రేకు అవకాశం దక్కలేదు. ఇక వెస్టిండీస్ తరపున 19 టెస్టులు ఆడిన ముర్రే 601 పరుగులు సాధించారు. అదే విధంగా అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. చదవండి: NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు -
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ బెనర్జీ మృతి
కోల్‌కతా: అలనాటి మేటి ఫుట్‌బాలర్, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సమర్ ‘బద్రూ’ బెనర్జీ కన్ను మూశారు. 92 ఏళ్ల సమర్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హైదరాబాదీ సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్‌గా, సమర్ బెనర్జీ కెప్టెన్‌గా మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత్ 4–2తో ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్‌లో 1–4తో యుగోస్లావియా చేతిలో ఓడిన భారత్... కాంస్య పతక మ్యాచ్‌లో 0–3తో బల్గేరియా చేతిలో ఓడిపోయింది. దేశవాళీ ఫుట్‌బాల్‌లో విఖ్యాత మోహన్ బగాన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన సమర్ బెనర్జీ తన క్లబ్ జట్టుకు డ్యూరాండ్ కప్ (1953), రోవర్స్ కప్ (1955)లలో విజేతగా నిలిపారు. జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు రెండుసార్లు (1953, 1955) టైటిల్ అందించారు. అనంతరం సమర్ కోచ్‌గా మారి 1962లో బెంగాల్ జట్టు ఖాతాలో మరోసారి సంతోష్ ట్రోఫీని చేర్చారు. -
సంతూర్ విద్వాంసుడు సొపోరి కన్నుమూత
న్యూఢిల్లీ: సంతూర్ విద్వాంసుడు భజన్ సొపోరి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురుగ్రాం ఆస్పత్రిలో గురవారం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభయ్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంతూర్ మేస్ట్రో పండిట్ శివకుమార్ శర్మ మరణించిన కొన్ని వారాలకే సొపోరి కూడా వెళ్లిపోవడం సంగీత ప్రపంచంలో విషాదం నింపింది. కశ్మీర్‌కు చెందిన సొపోరి పదేళ్ల వయసులోనే కచేరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అలరించారు. హిందీ కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురీ, పర్షియన్, అరబిక్ భాషల్లో 6 వేలకుపైగా పాటలు కంపోజ్ చేశారు. గాలిబ్ గజల్స్‌కూ బాణీలు కట్టారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు. -
గుండెపోటుతో మరో క్రికెటర్ అకాల మరణం
ముంబై రంజీ జట్టు పేసర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తన మాజీ సహచర ఆటగాడు భవిన్ థక్కర్ ధృవీకరించాడు. కాగా 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాజేష్ వర్మ వర్మ అరంగేట్రం చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన వర్మ మొత్తం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతడు తన చివరి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడాడు. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజేష్ వర్మ 23 వికెట్లు పడగొట్టాడు. దీంట్లో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో రాజేష్ వర్మ భాగంగా ఉన్నాడు. "రాజేష్ వర్మ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. అండర్-19 నుంచి మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాం. 20 రోజుల క్రితం మేమిద్దరం కలిసి ఓ టోర్నమెంట్లో పాల్గొన్నాం. శనివారం (ఏప్రిల్ 23) నేను అతడితో దాదాపు 30 నిమిషాలు పాటు ఫోన్లో మాట్లాడాను. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటలకు అతడి చనిపోయాడాని నాకు ఫోన్ వచ్చింది. అతడు మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. అతడు మమ్మల్ని విడిచి వెళ్లి పోవడం చాలా బాధగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఠక్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు' -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్నా
స్పీకర్ బాక్సులు బద్దలయ్యాయి. స్తంభాలకు కట్టిన హారన్లు కేకపెట్టాయి. టేప్ రికార్డర్ల మోతకు అంతే లేదు. రేడియోలు మళ్లీ మళ్లీ పాడాయి. ‘జిమ్మీ.. జిమ్మీ.. ఆజా... ఆజా’... ‘హరి ఓం హరి... హరి ఓం హరి’... ‘మేరే దిల్ గాయేజా జు..జు.. జుబి జుబి జూబీ’... ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’... బప్పీ లహిరి అనే పేరు 1980లలో హోరై దేశాన్ని చుట్టేసింది. గంతులు రాని వాళ్లు గంతులేశారు. చిందులు వేయని వాళ్లు చిందులేశారు. ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచి బప్పీ లహిరి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ నృత్య సంగీతభరిత కాలం మరి తిరిగి రాదు. బప్పీ లహిరి ఇంటర్ వరకు కూడా చదువుకోలేదు. కాని ఉన్న చోటే ఉండిపోవడం మాత్రం బతుక్కు చేటు అని ముందే తెలుసుకున్నాడు. కోల్‌కతా మహా నగరం. తల్లిదండ్రులు అపరేష్ లహిరి, బాన్సురి లహిరి ఆ నగరంలో అంతో ఇంతో పేరున్న సంగీతకారులు. తల్లి క్లాసికల్ కచేరీలు ఇస్తుంది. బప్పీ ఒక్కగానొక్క కొడుకు. అయినా సరే ఉన్న చోటే ఉండటం సరికాదు అనుకున్నాడు బప్పీ. ముంబై వెళ్లాలి... సాధించాలి అనుకున్నాడు. సంగీత దర్శకుడుగా. 21 ఏళ్లు అప్పటికి. ముంబై చేరుకున్నాడు. కిశోర్ కుమార్ అతనికి దూరపు చుట్టం. హీరోయిన్ కాజోల్ తండ్రి సోము ముఖర్జీ దగ్గరి చుట్టం. సోము తీస్తున్న ‘నన్హా షికారి’ (1973) సినిమాకు సంగీతం చేశాడు. ఓకే అనిపించింది. ఆ తర్వాత తాహిర్ హుసేన్ తీసిన ‘జఖ్మీ’ (1975)తో గుర్తింపు వచ్చింది. 1977లో వచ్చిన ‘ఆప్ కీ ఖాతిర్’లోని ‘బంబై సే ఆయా మేరా దోస్త్... దోస్త్కో సలామ్ కరో’... పాట ఆల్మోస్ట్ డూపర్ హిట్ అయ్యింది. కాని అలాంటి గుర్తింపు కాదు బప్పీ కోరుకుంటున్నది. ఇంకా ఏదో చేయాలి. అప్పుడే అమెరికాలో కచేరీ చేసే చాన్స్ వచ్చింది. లోకం చూస్తే విషయం తెలుస్తుంది అని బయలు దేరాడు. పారే నీరే ఒండ్రుమట్టిని తోడు తీసుకుంటుంది. బప్పీ అమెరికాలోని చికాగోలో ఆ రాత్రి ఒక పబ్‌కు వెళ్లాడు. పబ్‌లో అంతా హోరుగా ఉంది. వెలిగే ఆరే దీపాలు. డాన్స్ చేస్తున్న జంటలు. ఒకతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ నచ్చిన బప్పీ అతని దగ్గరకు వెళ్లి ‘నువ్వు ప్లే చేస్తున్న సంగీతం ఏమిటి?’ అని అడిగాడు. ‘నేను డిస్క్ ప్లే చేస్తున్నాను. పబ్‌లో అందరూ డాన్స్ చేయడానికి ప్లే చేస్తున్నాను కనుక ఇది డిస్కో’ అన్నాడు. ఆ సౌండ్ బప్పీకి నచ్చింది. ఆ బీట్ కూడా. అది ఇండియాలో మొదలు కానున్న డిస్కో కాలానికి ఆరంభ క్షణం. ∙∙ పోటీదారుల్ని అర్థం చేసుకోకపోతే పోటీలో నిలవడం కష్టం. 1970ల కాలంలో బాలీవుడ్ సినిమా రంగం ఘనంగా ఉంది. పోటీలో గండర గండలు. ఎస్.డి. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్, కళ్యాణ్‌జీ–ఆనంద్జీ... వీళ్లంతా టాప్‌లో ఉన్నారు. వీళ్ల మధ్య బప్పీ నిలబడాలి. అతను చిన్నప్పటి నుంచి తబలా ప్లేయర్. ఏ బీట్ శ్రోతలకు హుషారునిస్తుందో తెలుసు. అదే సమయంలో తల్లి ద్వారా విన్న శాస్త్రీయ సంగీతం వల్ల ఏ స్వరం చెవికి ఇంపుగా ఉంటుందో కూడా తెలుసు. ఈ మెలోడీని, బీట్‌ని సరిగ్గా కలపగలిగితే చాలు అనుకున్నాడు బప్పీ. కొత్త సంగీత పరికరాలతో ఎప్పటికప్పుడు పోటీ పడే ఆర్.డి. బర్మన్ను ఎదుర్కొనాలంటే డిస్కో ఒక మార్గంగా కనిపించింది. అదే సమయంలో అమితాబ్ స్టార్‌డమ్‌ను తట్టుకోవడానికి మిథున్ చక్రవర్తి ప్రయత్నిస్తున్నాడు. మిథున్‌ను పెంచడానికి కూడా కొంత మంది ట్రై చేస్తున్నారు. బి.సుభాష్ అనే బి గ్రేడ్ దర్శకుడు బప్పీకి స్నేహితుడు. బప్పీ అప్పటికే డిస్కో బీట్తో ఒకటి రెండు పాటలు చేయడంతో ఇదేదో బాగుందే అనుకుని ‘డిస్కో డాన్సర్’ అనే కథను తయారు చేశాడు. మిథున్ హీరో. కాని బప్పీకి అర్థమైంది. ‘ఈ సినిమా నాది’ అనుకున్నాడు. డిస్కో మ్యూజిక్ నేపథ్యంలో పాటలు పుట్టాయి. 1982. సినిమా రిలీజైంది. నిజానికి పెద్దగా డాన్స్ రాని మిథున్ చక్రవర్తి డాన్సింగ్ స్టార్ అయ్యాడు. బప్పీ లహిరి డిస్కో కింగ్ అయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి పాట వీధి వీధి వాడ వాడ మార్మోగి పోయింది. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో, తిరునాళ్లలో, పెళ్లిళ్ల లో అందరూ ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాటకు డాన్స్ వేయడమే. ‘యాద్ ఆ రహా హై తేర ప్యార్’, ‘గోరోంకి నా కాలోంకి దునియా హై దిల్ వాలోంకి’, ‘కోయి యహా అహ నాచే నాచే’ హిట్టు మీద హిట్టు. దేశం ఇక డిస్కోలోకి మేల్కొంది. ∙∙ కృష్ణకు ఒక హిట్ ఎలాగైనా ఇవ్వాలని పట్టుదలగా కె.రాఘవేంద్రరావు తీసిన ‘ఊరికి మొనగాడు’ హిట్ కావడం బప్పీ లహిరికి లాభించింది. దానిని కృష్ణ ‘హిమ్మత్వాలా’ పేరుతో హిందీలో తీయాలని అనుకున్నప్పుడు బప్పీ లహిరిని సంగీతానికి ఎంచుకున్నాడు. ‘ఒక పాటలో బోలెడన్ని కుండలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా పాట చేయండి’ అని రాఘవేంద్రరావు అడిగితే ట్యూన్ కట్టేటప్పుడు తన ఎదురుగా ఐదారు తబలాల వరుస పెట్టుకుని ఉండే బప్పీ ఒక ట్యూన్ వినిపించాడు. పాట ఓకే అయ్యింది. షూటింగ్‌కు జితేంద్ర హాజరయ్యాడు. శ్రీదేవితో పాట. నగరాలో పాట విని ‘ఇదేం పాట డైరెక్టరు గారూ... ఇవేం స్టెప్పులు’ అని పైకే అనేశాడు. కాని చేయక తప్పలేదు. ‘హిమ్మత్వాలా’ రిలీజైంది. ఒక్క పాట. ‘నైనోమే సప్నా సప్నోమే సజ్నీ సజ్నీ పే దిల్ హోగయా’... ఎక్కడ చూసినా అదే. ‘హిమ్మత్వాలా’తో పాటు బప్పీ పాటా హిట్ అయ్యాయి. ఇక కె.రాఘవేంద్రరావు, జితేంద్ర, బప్పీ లహిరి ఒక టీమ్ అయ్యారు. తెలుగులో హిట్ అయిన ‘దేవత’ హిందీలో ‘తోఫా’(1984) గా రీమేక్ అయితే ‘తోఫా.. తోఫా.. తోఫా... లాయా లాయా లాయా’ హిట్. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ సినిమా ‘మవ్వాలి’గా రీమేక్ అయితే ‘ఉయ్యమ్మ.. ఉయ్యమ్మ ముష్కిల్ ఏ క్యా హోగయీ’ మాస్ హిట్. ‘ముందడుగు’ రీమేక్ ‘మక్సద్’, ‘జస్టిస్ చౌదరి’, ‘ఖైదీ’... ఈ సినిమాలన్నింటికీ బప్పీ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదంతా ముంబై నుంచి హైదరాబాద్‌కు బప్పీ రావడానికి కారణమైంది. ∙∙ కృష్ణ ఏది చేసినా ఘనంగా చేయాలనుకుంటాడు. ‘సింహాసనం’ (1986) రెండు భాషల్లో తీయ తలపెట్టిన భారీ జానపద చిత్రం. తెలుగులో తాను. హిందీలో జితేంద్ర. రెండు భాషల్లో హిట్ పాటలు తప్పవు కనుక బప్పీ లహిరిని రంగంలోకి దించాడు. నిజానికి కృష్ణకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడటం లేదు. రాజ్ సీతారాంతో సర్దుకోవాలి. కాని ఆ మైనస్‌ను కూడా పట్టించుకోని స్థాయిలో బప్పీ లహిరి భారీ హిట్ పాటలు అందించాడు. ‘ఆకాశంలో ఒక తార’ నేటికీ మోగుతూనే ఉంది. ఆ సినిమాలో ‘ఇది కల అని నేననుకోనా’, ‘గుమ్మా గుమ్మా’, ‘వహవ్వా నీ యవ్వనం’ మాస్‌ను క్యాసెట్లు కొనేలా చేశాయి. ఆ తర్వాత కృష్ణ హీరోగా భారీ ఖర్చుతో తీసిన సాధారణ సినిమా ‘తేనె మనసులు’కు, ‘నసీబ్’ రీమేక్‌గా చేసిన ‘త్రిమూర్తులు’కు పాటలు ఇచ్చాడు. కాని చిరంజీవి– బప్పీ లహిరి కాంబినేషన్లో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’ కలెక్షన్లలో అంతగా ఘనంగా లేకపోయినా పాటల్లో ఊపేసింది. ‘చుక్కల పల్లకిలో’, ‘రాధా రాధా మదిలో మన్మధ బాధ’కు తెర మీద కాగితపు ముక్కలు ఎగిరాయి. అయితే బప్పీ లహిరి అసలు సిసలు హిట్ ‘గ్యాంగ్ లీడర్’తో దక్కింది. ఆ సినిమాలో పాటలు చిరంజీవిని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేర్చాయి. ‘జీ ఏ ఎన్ జీ గ్యాంగ్ గ్యాంగ్’... ఎంత ఫాస్ట్ బీటో ‘భద్రాచలం కొండ’ అంత పల్లె బీట్తో ఆకట్టుకున్నాయి. ‘వానా వానా వెల్లువాయే’ పాట ‘రచ్చ’ సినిమాలో రీ మిక్స్ అయ్యేంత ఫ్రెష్‌గా నేటికీ ఉంది. ఆ పాటలో చిరంజీవి, విజయశాంతి గుర్తుండిపోయారు జల్లు కురిసే వానలాగా. చిరంజీవికే ‘రౌడీ అల్లుడు’ చేసిన బప్పీ బాలకృష్ణకు ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ చేశాడు. ∙∙ కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’తో హిందీ దేశానికి తెలిశాడని అనుకుంటాం కాని దానికి ముందే బప్పీ అతని చేత ‘టూటే ఖిలోనే’లో పాడించాడు. శేఖర్ కపూర్ హీరో. షబానా ఆజ్మీ హీరోయిన్. ‘మానాహో తుమ్ బేహద్ హసీన్’ పాట ఇప్పటికీ బాగుంటుంది. ఆ తర్వాత తెలుగులో మోహన్‌బాబు కోసం చేసిన పాటల్లో ఏసుదాస్‌కు మంచి పాటలు ఇచ్చాడు. ‘రౌడీ గారి పెళ్లాం’ ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’... ‘బ్రహ్మ’లో ‘ముసి ముసి నవ్వులలోనా’ పాటలు హిట్. ∙∙ బప్పీ లహిరి చాలా ప్రయోగాలు చేశాడు. డిస్కోలో ఇండియన్ మ్యూజిక్ ‘ఫ్యూజన్’ను ఆ రోజుల్లోనే ప్రయత్నించాడు. ‘నమక్ హలాల్’లో 12 నిమిషాల పాట ‘పగ్ ఘంగురూ బాంద్ మీరా నాచెరె’లో డిస్కోను, క్లాసికల్‌ను కలిపాడు. కిశోర్ కుమార్ దగ్గరకు ఈ పాట కోసం వెళితే సహనం తక్కువగా ఉండే ఆయన (ఎంత పెద్ద పాట పాడినా అదే పారితోషికం కనుక) ‘ఇంత పెద్ద పాట నా వల్ల కాదు. ఇలాంటివి రఫీ సాబ్ కదా పాడేది’ అన్నాట్ట. కాని బప్పీ పట్టుబట్టి పాడించాడు. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. మన జయప్రద అమితాబ్‌తో కలిసి నటించిన ‘షరాబీ’, ‘ఆజ్ కా అర్జున్’ సినిమాల్లో పాటలు బప్పీ చేయగా హిట్ అయ్యాయి. ‘షరాబీ’లో ‘దేదే ప్యార్ దే ప్యార్ దే’, ‘ఇంతెఖాల్ హోగయీ ఇంతెజార్కీ’... పాటలు ‘ఆజ్ కా అర్జున్’లో ‘గోరిహి కలాయియా’ పాటలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉన్నాయి. ∙∙ 1982 నుంచి 1990 వరకూ దాదాపు ఒక ప్రభంజనంలా బప్పీ కొనసాగాడు. డిస్కో తర్వాత బ్రేక్‌ను తెచ్చాడు. గోవిందా తొలి సినిమా ‘ఇల్జామ్’లో ‘ఐ యామ్ ఏ స్ట్రీట్ డాన్సర్’ పాటతో బ్రేక్ డాన్స్ పాటలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ట్రెండ్ కొంతకాలం సౌత్‌లో కూడా కొనసాగింది. చివరకు ఆనంద్– మిలింద్, నదీమ్ – శ్రావణ్ వచ్చే వరకూ అతనికి ఎదురు లేకపోయింది. ∙∙ బప్పీ లహిరి మాస్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఉండటానికే అతడు ఇష్టపడ్డాడు. బాలీవుడ్ కూడా అలాగే అతణ్ణి ఉంచింది. పెద్ద పెద్ద సినిమాలు, సీరియస్ కథాంశాలు అతని దాకా రాలేదు. క్లాసిక్స్ అంటూ చెప్పుకోవడానికి అతనికి ఏమీ లేవు. కాని అతడు మంచి పాటలు చేయగలడు. ‘ప్యార్ మే కభీ కభీ ఐసాహి హోతాహై’ (చల్తే చల్తే), ‘కిసీ నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై’ (ఐత్బార్), ‘జిద్ నా కరో అబ్ తో రుకో ఏ రాత్ నహీ ఆయేగీ’ (లహూ కే దో రంగ్) వంటి మంచి మెలోడీలు చేశాడు. బప్పీని సంగీత పండితులు నిరాకరించినా అన్ని పాటల్లో అతను తబలాను వాడే పద్ధతిని విశేషంగా మెచ్చుకుంటారు. అతడికి తబలా అంటే ఇష్టం కనుక ఎంతటి బీట్ ఆధారిత పాటలో కూడా తబలాను చాలా ప్రతిభావంతంగా ఇముడ్చుతాడు. బప్పీ లహిరిని 1980ల మాస్ పాటలకు ఐకాన్‌గా భావిస్తారు. అందుకే ‘డర్టీ పిక్చర్’ను తీసేప్పుడు ఆ కాలం మాస్ పాటకు సంకేతంగా బప్పీ స్టయిల్లో ‘ఊలాల ఊలాల’ పాట చేయించి అతని చేతే పాడించారు. బప్పీ, అలీషా చినాయ్, షరోన్ ప్రభాకర్ లాంటి గాయనులను సినిమాల్లోకి తెచ్చాడు. అతడు వెలుగుతున్నప్పుడు నిర్మాత దర్శకులే కాదు గాయనీ గాయకులు కూడా అతని ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. చివరి రోజుల్లో అతడు తనకు కనీసం ‘పద్మశ్రీ’ వస్తే బాగుండు అనుకున్నాడు. రాలేదు. ఒక కాలపు మాస్ ప్రేక్షకులు తనకు తెర మీద చిల్లర నాణేలు విరజిమ్ముతూ చేసిన సత్కారమే చాలనుకున్నాడు. అతను చేసిన మంచి పాటతోనే అతనికి వీడ్కోలు చెప్పవచ్చు. చల్తే చల్తే మేరే ఏ గీత్ యాత్ రఖ్నా కభి అల్విదా నా కెహెనా కభి అల్విదా నా కెహెనా... మైక్ టైసన్ ‘జింగిల్’ ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ 2018లో ఎమ్ఎమ్ఏ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చినప్పుడు ఆయన్ను స్వాగతిస్తూ జింగిల్ పాటను బప్పీ పాడాడు. ‘ఓమ్ స్వాగతమ్..’ అని ప్రారంభమయ్యే ఈపాట మైక్ టైసన్ ను కొనియాడుతూనే బప్పీ మార్క్‌ను చూపింది. బప్పీ... ది గోల్డ్ మ్యాన్ ‘నడిచే నగల దుకాణం’... బప్పీ లహిరి గురించి చాలామంది సరదాగా అనుకునే మాట ఇది. ఇక అందరూ ఆయన్ను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే మెడలో కొబ్బరి తాడుని తలపించే బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతులకు కడియాలు, మణికట్టు గొలుసులు... ఇలా బప్పీ ఒంటిపై బంగారం మెరిసేది. నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్నది ఆయన ఆకాంక్ష. అలాగే బంగారాన్ని అదృష్టంగా భావించి ఎప్పుడూ కనీసం ఎనిమిది చెయిన్ లను మెడలో వేసుకునేవారు. 1974లో బప్పీవాళ్ల అమ్మగారు తొలి బంగారపు గొలుసు ఇచ్చారు. తొలిసారి వేసుకున్న ఈ గొలుసు పేరు ‘ఏ హరే కృష్ణ చెయిన్ ’. తర్వాత భార్య చిత్రాణి 1977లో బంగారపు గొలుసు ఇచ్చారు. ఈ రెండింటికి తోడు మరికొన్ని బంగారపు గొలుసులు వేసుకుంటూ గోల్డ్ మ్యాన్, బ్లింగ్ మ్యాన్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే వినూత్న వస్త్రధారణ, ప్రత్యేకమైన సన్ గ్లాసెస్ ధరించేవారు బప్పీ. ఏదైనా సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలంటే ముందు రోజే ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ గ్లాసెస్ పెట్టుకోవాలి? ఏ ఆభరణాలు ధరించాలి? అనేది ప్లాన్ చేసేసుకునేవారట. విశేషం ఏంటంటే... వెరైటీ డ్రెస్సింగ్ మీద భర్తకి ఉన్న ఆసక్తి గమనించి, భార్య చిత్రాణి లహిరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బప్పీయే స్వయంగా చెప్పారు కూడా. కలసి రాని రాజకీయాలు 2014లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రస్తావిస్తూ, తనకు 754 గ్రాములు, భార్యకు 967 గ్రాముల బంగారం ఉందని, ఇద్దరిదీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నాయనీ బప్పీ పేర్కొన్నారు. అయితే సంగీత ప్రపంచంలో హిట్ రాగాలిచ్చిన బప్పీకి రాజకీయ జీవితం మాత్రం ఫ్లాప్ రాగం అనాలి. ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. – కె -
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ హయాంలో ఫరీదుద్దీన్ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చదవండి: సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్ -
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
బీజింగ్: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది. -
ప్రముఖ చరిత్రకారుడు పురందరే కన్నుమూత
పుణె: ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన సోమవారం పుణెలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన ఆయన వయసు 99 సంవత్సరాలు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకంతో ఆయన మహారాష్ట్ర వాసుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జానతా రాజా పేరుతో ఆయన రూపొందించిన నాటకం సైతం ఎంతో పేరొందింది. 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆయనను వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే మృతిపై ప్రధాని మోదీ తదితరులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పురందరే అంత్యక్రియలను పుణెలో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. -
పాక్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీర్‌ఖాన్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. 1936లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఖదీర్ ఖాన్ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్ ఖాన్ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆగస్ట్ 26వ తేదీన ఇస్లామాబాద్‌లోని ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీ(కేఆర్ఎల్) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కేఆర్‌ఎల్‌కి తీసుకు రాగా అక్కడే ఆయన కన్నుమూశారని మీడియా తెలిపింది. ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీదులో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఖదీర్‌ఖాన్ మృతికి అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్ ఖాన్ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది. -
తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే
ఖమ్మం: కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం జైత్రాంతండా గ్రామానికి చెందిన ధరావత్ కౌసల్య కుటుంబంలో చోటుచేసుకున్న వివాదానికి మనస్థాపం చెంది ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. అనంతరం ఖమ్మం ఆస్పత్రికి కౌసల్య కుమారుడు ధరావత్ సురేష్(25) తన తండ్రి ధరావత్ సూర్య, మామయ్య కేలోతు గోపీతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. ఈక్రమంలో ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ సమీపాన శివాయిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య, కేలోతు గోపీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఒకవైపు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందడం... తండ్రి, మామయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జైత్రాం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం