Raj Babbar
-
రాజ్ జీవితంలో స్మిత ఓ కల
నదీరా జహీర్... కొన్ని హిందీ సినిమాల్లో కనిపించినా థియేటర్తోనే ఆమెకు ఎక్కువ అనుబంధం. నదీరాకు రాజ్‌తో పరిచయం అయిందీ ఆ వేదిక మీదే. ఈ ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థులు. నదీరా గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే ఆమె అతనికన్నా నాలుగేళ్లు సీనియర్. నదీరా నాటకాలు రాసి, దర్శకత్వం వహించే నాటికి రాజ్ బబ్బర్ గుర్తింపు కోసం తాపత్రయం పడ్తున్నాడు. అప్పుడే రాజ్ లీడ్‌రోల్‌గా ఓ నాటకాన్ని రచించి దర్శకత్వం వహించింది నదీరా. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సందర్భమూ అదే అయింది. నదీరాలోని స్నేహ స్వభావం, నిర్మొహమాటత్వం రాజ్‌ను ఆమెకు దగ్గర చేస్తే రాజ్‌లోని పట్టుదల నదీరా అతణ్ణి ఇష్టపడేలా చేసింది. ఆ ప్రేమ ఆ ఇద్దరినీ పెళ్లితో ఒక్కటి చేసింది. వాళ్ల బసను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ నుంచి ఢిల్లీలోని నదీరా వాళ్ల తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేర్చింది. ఆమె తల్లిగారింట్లో ఒక గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారిద్దరూ. ముంబై ఏడాది దాటేసరికి(జుహీ బబ్బర్‌కు) తల్లిదండ్రులయ్యారు. రాజ్ బబ్బర్ యాక్టింగ్ కెరీరే ముందుకు సాగలేదు. ఆర్థిక ఇబ్బందులూ తొలగలేదు. ఆ సమయంలో నదీరా సహనం, సంయమనమే రాజ్‌లో ధైర్యాన్ని పెంచింది. సినిమాల్లో రాణించాలనే కలను వీడకుండా చేసింది. తన స్కూటర్ అమ్మేసి.. వచ్చిన ఆరువేల రూపాయలను నదీరా చేతిలో పెట్టి ముంబై చేరుకున్నాడు రాజ్. అక్కడతను అవకాశాల కోసం చాలానే పోరాడాల్సి వచ్చింది. కుటుంబ భారాన్ని భర్త మీద వేయకుండా థియేటర్ పనితో ఆ బాధ్యతను తీసుకుంది నదీరా. నాలుగేళ్లు గడిచాయి. బాలీవుడ్లో బ్రేక్ సాధించాడు రాజ్. ‘కూతురిని తీసుకొని ముంబై వచ్చేయ్’ అని నదీరాకు చెప్పాడు. వెళ్లింది. తర్వాత యేడాదికి ఆ జంట కొడుకు (ఆర్య బబ్బర్)ను కన్నది. ఏక్జుట్ ఒక్కసారికే ఇరవై నాలుగు సినిమాలను సైన్ చేసేంత స్టార్ అయిపోయాడు రాజ్ బబ్బర్. నదీరా కూడా పని కల్పించుకుంది ‘ఏక్జుట్’ అనే థియేటర్ గ్రూప్ పెట్టి. ఆ బిజీ షెడ్యూల్లోనే రాజ్‌ను ఆకర్షించి.. అతని మదిని ఆక్రమించింది స్మితా పాటిల్. ఆ ప్రేమ సహజీవనమూ మొదలుపెట్టింది. ఆ కబుర్లను మీడియా మోస్తున్నా భర్త మీదున్న నమ్మకంతో వాటిని వదంతులుగానే వదిలేసింది నదీరా. కాని స్మిత, రాజ్‌ల పెళ్లి వార్తతో మాత్రం షాక్ అయింది, షేక్ అయింది నదీరా. లేమి కూడా తెప్పించని కన్నీళ్లని ఆ కలత తెప్పించింది. భర్తను నిలదీసింది. ‘నిజమే’ అని ఒప్పుకున్నాడు రాజ్. మౌనంగా పక్కకు తప్పుకుంది నదీరా. ఆ ఇంట్లోంచి, ఆ కుటుంబంలోంచి వెళ్లిపోయాడు రాజ్ బబ్బర్. హోమ్ బ్రేకర్.. డోర్‌మ్యాట్ ‘అమ్మా..’ అంటూ రెండూ కాళ్లను పట్టేసుకున్న ఆ పిల్లలే ఆమె నవ్వులయ్యారు. వాళ్ల సహాయంతోనే మనసులోని శూన్యాన్ని పూరించుకుంది. వాళ్ల కోసం నిలబడింది. రాజ్ బబ్బర్‌ను పెళ్లి చేసుకున్నందువల్ల కాపురం కూల్చేసిన స్త్రీగా స్మితను ఎలా ముద్రేశారో.. కాపురం నిలబెట్టుకోలేని బలహీనురాలిగా నదీరానూ చూశారు. ‘ఆ టైమ్‌లో ఆ కామెంట్లను తట్టుకోవడానికి నాకు ఊరటగా, ఓదార్పుగా పిల్లలైనా ఉన్నారు. స్మితకు అదీ లేకుండింది’ అని చెప్పింది నదీరా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నదీరా అన్నట్టుగా స్మితకు ఆ ఊరట దొరొకలేదు. ప్రాణంలా ఆమెను రాజ్ ప్రేమించనైతే ప్రేమించాడు కాని ఓదార్పు కాలేకపోయాడు. దాంతో స్మితను అభద్రత చుట్టముట్టేసింది. ఆ ప్రభావం తమ దాంపత్యం మీద పడకుండా చూసుకోవడం స్మితకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఓ బిడ్డను కని ఆ బంధాన్ని భద్రం చేసుకోవాలనుకుంది. బిడ్డను భర్తకు అందించి శాశ్వతంగా సెలవు తీసుంది. రాజ్ జీవితంలో స్మిత ఓ కలగా మిగిలిపోయింది. మళ్లీ చెంతకు.. రెండు వారాల పసిగుడ్డు ప్రతీక్‌ను స్మిత తల్లిదండ్రుల ఒళ్లో పెట్టి మళ్లీ నదీరా ఇంటి తలుపు తట్టాడు రాజ్ బబ్బర్. ఆహ్వానించింది నదీరా. ఆ చర్యే అందరినీ నిర్ఘాంతపరిచింది. ఇటు సంప్రదాయవాదులను, అటు స్త్రీవాదులనూ. నదీరా మీద విమర్శల వర్షం మళ్లీ మొదలైంది. ‘స్మిత మరణంతో ఒంటరైన రాజ్‌ను నేను యాక్సెప్ట్ చేస్తానని ఎవరూ ఊహించలేదు. ఫెమినిస్ట్‌లు నన్ను డోర్‌మ్యాట్ అన్నారు. ఆయనలా చేశాడని నేనూ అలాగే చేసి ఉంటే వాళ్లంతా నన్ను పొగిడేవాళ్లు. ఈ దశాబ్దపు మహిళ అంటూ నా మెడలో బంగారు పతకం వేసేవారేమో! కాని ఆ పొగడ్తలు, ఆ గోల్డ్‌మెడల్స్ నా సమస్యలను తీరుస్తాయా? పిల్లల మనసుకు అయిన గాయాలను మాన్పిస్తాయా? ఉన్నవాటిల్లో ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకున్నాను’ అంటూ స్పందించింది నదీరా. రాజ్ బబ్బర్ నటించిన ‘ప్రేమ్ గీత్’ సినిమాలో జగ్జీత్ సింగ్ ఆలపించిన గజల్ ఉంటుంది ‘హోఠోంసే ఛూలో తుమ్ .. మేరా గీత్ అమర్ కర్ దో’ అని. ఇందులో చివరగా ‘తుమ్ హార్ కే దిల్ అప్నా మేరీ జీత్ అమర్ కర్ దో.. ’ అని వస్తుంది. నదీరా చేసింది అదే.. ప్రేమించిన రాజ్ బబ్బర్ కోసం.. తన మనసును ఓడించి.. అతణ్ణి గెలిపించింది. ∙ఎస్సార్ ∙మొహబ్బతే -
ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా
భూమిక ‘అర్థ్’ (1982) తన జిందగీకి ప్రేరణే అంటాడు దర్శకుడు మహేశ్ భట్ (ఆ సినిమాకూ అతనే దర్శకుడు). కాని ఈ సినిమా స్మితాపాటిల్ జీవితం కూడా. అందులో ఆమెది పెళ్లయిన సినిమా దర్శకుడిని ప్రేమించే హీరోయిన్ భూమిక. తన లైఫ్‌ను పోలిన పాత్ర. అయితే ఆమె భర్త రాజ్‌బబ్బర్ మాత్రం దర్శకుడు కాదు కథానాయకుడు. స్మిత పాటిల్‌తో రాజ్‌తో ప్రేమలో పడేనాటికి అతను ఇద్దరు పిల్లల తండ్రి. ఈ జంట ప్రేమకథే నేటి మొహబ్బతేకి అంశం. కాని దీన్ని ముక్కోణంలో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్‌బబ్బర్ మొదటి భార్య నదీరా కూడా నటే. ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కమర్షియల్ హిందీ సినిమాతోపాటు పారలెల్ సినిమాతో పరిచయం ఉన్న ప్రేక్షకులకు రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్‌లు తెలిసే ఉంటారు. థియేటర్ అభిమానులకు నదీరా తెలియకపోయే ప్రసక్తే లేదు. ముందుగా స్మిత, రాజ్‌ల ప్రేమ ప్రయాణం.. గొడవతో మొదలైన స్నేహం.. రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్ కలిసి నటించిన తొలి సినిమా ‘తజుర్బా’. అయితే ఒకరికొకరు అపరిచితులుగానే ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ ఇద్దరే కలిసి నటించిన తర్వాత చిత్రం ‘భీగీ పల్కే’. ఆ షూటింగ్లో ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అది కూడా చిన్న గొడవతో. ‘ఆ సినిమా సెట్స్ మీద స్మితా పాటిల్ ఎవ్వరినీ లెక్కచేయనట్టుగా కొంచెం గర్వంగా కనిపించేది. ఆ ఆటిట్యూడ్‌కే ఆమెతో ప్రేమలో పడ్డా’ అని చెప్పాడు రాజ్‌బబ్బర్ ఓ ఇంటర్వ్యూలో. గొడవతో మొదలైన ఆ పరిచయం స్నేహంగా మారింది. భీగీ పల్కే షూటింగ్ పూర్తయ్యేలోపు వీళ్ల మధ్య ప్రేమా ఖరారైంది. మీడియాకు నిప్పందాలి కాని రాజేయడం ఎంతసేపు? అలా ఆ జంట ప్రేమను పేజీల్లో కాలమ్స్‌గా నింపేసుకుంది. అది రాజ్‌బబ్బర్ భార్య నదీరా కంటా పడింది. కాని భర్త మీదున్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ‘స్మిత నా భర్తతో చాలా క్లోజ్‌గా ఉందన్న విషయం నాకు తెలుసు. ఆమె రాజ్ సాహచర్యాన్ని కోరుకుంటోందనీ అర్థమైంది. ఒకవేళ్ల అది అఫైరే అయినా నాకు, పిల్లలకు రాజ్ దూరమవడనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పింది నదీరా ఒక ఇంటర్వ్యూలో. హోమ్ బ్రేకర్ నదీరా అనుకున్నట్లు జరగలేదు. రాజ్ పట్ల ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. స్మితను విడిచి ఉండలేని స్థితికి వచ్చాడు రాజ్. స్మితా అంతే రాజ్‌కు జీవితభాగస్వామి కావాలనుకుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాజ్.. నదీరాకు విడాకులు ఇవ్వకుండానే. ఆ ఇంటిని విడిచి స్మితాతో వచ్చేశాడు. హతాశురాలైంది నదీరా. సామాజిక స్పృహ ఉన్న నటిగా, అలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న స్మితా పాటిల్ మీద బాలీవుడ్ కుటుంబాలు ‘హోమ్ బ్రేకర్’ అనే ముద్రవేశాయి. ఆ రోజుల్లో ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందిస్తూ ‘కొన్ని విషయాలు అవతలివాళ్లకు అంత తేలికగా అర్థం కావు. అర్థం చేయించలేం కూడా. అందుకే సొసైటీ నన్నెట్లా చూస్తోంది.. ద్వేషిస్తోందా? శత్రువులా ట్రీట్ చేస్తోందా అని పట్టించుకోవట్లేదు’ అని చెప్పింది. విడాకులివ్వకుండా స్మితాపాటిల్ను పెళ్లి చేసుకోవడం పట్ల రాజ్‌బబ్బర్ కూడా స్పందించాడు... ‘స్మితాను ప్రేమించాను అంటే నదీరాతో నాకు స్పర్థలున్నాయని కాదు. ఇద్దరినీ ఇష్టపడ్డాను.. ఇద్దరినీ పెళ్లిచేసుకున్నాను. స్మిత పట్ల నాకున్న ఫీలింగ్స్‌ను నదీరా అర్థం చేసుకుంది. అది చాలు నాకు’ అని. అయితే.. ఆ ఇద్దరి దాంపత్య జీవితం ఊహించినంత సాఫీగా, సంతోషంగా సాగలేదు. బయట నుంచి పరుషమైన కామెంట్లను ఎన్ని ఎదుర్కొన్నా చిరునవ్వును చెదరనివ్వలేదు స్మితా. అభద్రత వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఒక బిడ్డను కని రాజ్‌తో ఉన్న తన ప్రేమ బంధాన్ని మరింత భద్రం చేసుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే కొడుకును కన్నది కాని మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోయింది. అటు రాజ్బబ్బర్కూ కలకాలం తోడు కాలేకపోయింది. ప్రతీక్ పుట్టిన రెండు వారాలకు బ్రెయిన్ హ్యామరేజ్‌తో 31 ఏళ్లకే కన్ను మూసింది స్మతాపాటిల్. ఆ నిష్క్రమణ స్మిత తల్లిదండ్రులు, రాజ్బబ్బర్నే కాదు నదీరానూ షాక్ గురిచేసింది. ‘స్మిత మరణం జీర్ణించుకోలేని విషాదం. మా అందరన్నీ కుప్పకూల్చింది. ప్రతీక్‌తో పాటు తను కన్న కలలనూ వదిలేసి అర్ధంతరంగా వెళ్లిపోయింది. తను లేని లోటు పూడ్చలేనిది’ అని చెప్తుంది నదీరా. ‘తను లేని ఈ లోకంలో నేను జీవచ్ఛవాన్నే. పనిలో పడి ఆ వేదనను మరిచిపోయే ప్రయత్నం చేశా. మనసుకైన గాయాన్ని మాత్రం మాన్చుకోలేకపోయా’ అంటాడు రాజ్‌బబ్బర్. కాని గాయపడిన ఆ మనసుకు సాంత్వననిచ్చి.. మళ్లీ అండగా నిలబడింది నదీరానే. -ఎస్సార్ -
తొలి పరిచయం!
జయప్రద తొలి పరిచయానికి శ్రీకారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ., మలయాళం, హిందీ, భోజ్ పురి.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన జయప్రద ఇప్పుడు తొలి పరిచయం ఏంటీ? అనుకోవచ్చు. ఆమె పంజాబీ తెరకు పరిచయం కానున్నారు. జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అమితాబ్ బచ్చన్, జయప్రద కాంబినేషన్లో ‘ఆజ్ కా అర్జున్’ (1990), రజనీకాంత్, ప్రేమ్ చోప్రా, రేఖ కాంబినేషన్ లో ‘ఫూల్ బనే అంగారే’ ఇంకా ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, అజయ్ దేవగన్ వంటి హీరోలతోనూ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగానూ బొకాడియాకి పేరుంది. తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ వోతీ దా వ్యాహ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా ‘భూత్.. అంకుల్–తుసీ గ్రేట్ హో’ని ఆరంభించారు బొకాడియా. జయప్రదకు పంజాబీలో ఇది తొలి సినిమా కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రాజ్ బబ్బర్ చేస్తున్న పంజాబీ సినిమా ఇదే కావడం విశేషం. -
ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమికి గురైన కాంగ్రెస్ పార్టీకి.. ఫలితాలకు బాధ్యత వహిస్తూ సీనియర్ నేతలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నో అశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ కేవలం ఒకే ఒక్కస్థానంలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితాల అనంతరం తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్ బీజేపీ అభ్యర్థి రాజ్‌కుమార్ చహర్ చేతిలో దారుణ ఓటమిని చవిచూశారు. కాగా 80 లోక్‌సభ స్థానాల్లో యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకేఒక స్థానంలో గెలుపొందింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో మాత్రమే విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 51 స్థానాలను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. -
‘మోదీ కుర్తా సైజ్ మమతాకు తెలుసు’
కోల్‌కత : మమతా బెనర్జీ తనకు ప్రతియేడు రెండు జతల కుర్తాలు, స్వీట్లు పంపుతారని బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. దీనిపై మమత భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే..‘ఈ సారి మోదీకి గులక రాళ్లతో చేసిన మిఠాయిలు పంపుతా.. అవి తిన్నవెంటనే ఆయన పళ్లు ఊడిపోవడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటుడు రాజ్‌బబ్బర్ మోదీ, దీదీ రాజకీయా దోస్తులు అంటూ విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో తయారయ్యే కమ్మని నేతి మిఠాయిలు, కుర్తాలు ఫేమస్. తమ రాష్టానికి వచ్చిన అతిథులకు ఈ రెండు బహుకరించడం మామూలే. అయితే, ఇప్పటివరకు మమతా ఏ పొలిటీషియన్‌కి కుర్తాలు బహుకరిచంలేదు. కేవలం 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తికి మాత్రమే గిఫ్ట్‌గా ఇచ్చారు. వారిమధ్య రాజకీయ స్నేహం ఉందని మోదీ మాటల్లో తెలిసిపోయింది. ఆయన కుర్తా కొలతలు దీదీకి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తనది 56 అంగుళాల ఛాతీ అని మోదీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని బబ్బర్ గుర్తు చేశారు. బెంగాల్లో బీజేపీ బలోపేతానికి తృణమూల్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. కాగా, బబ్బర్ వ్యాఖ్యలపై తృణమూల్ అధికార ప్రతినిధి పార్థ ఛటర్జీ మండిపడ్డారు. సినిమాల్లో మాదిరి ఇతరులపై అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.సినిమాలు రాజకీయాలు ఒకటి కావనే విషయం తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వామపక్ష నేత సీతారాం ఏచూరి కూడా టీఎంసీ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బెంగాల్లో కుస్తీ పడుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి.. ఢిల్లీలో దోస్తీ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ప్రజలు ఆమోదించరని అన్నారు. -
రాజ్‌బబ్బర్ స్థానం మార్పు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజ్‌బబ్బర్ ఫతేపూర్‌సిక్రీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఆయనకు పార్టీ మొరాదాబాద్ స్థానాన్ని కేటాయించింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఏడవ జాబితా విడుదలచేసింది. ఉత్తరప్రదేశ్‌లో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజ్‌బబ్బర్‌కు మొదట కేటాయించిన మొరాదాబాద్ నుంచి ప్రస్తుతం ఇమ్రాన్ ప్రతాప్‌గర్యిహా పోటీ చేయనున్నారు. రాజ్‌బబ్బర్ 1999, 2004లో ఆగ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం రాజ్‌బబ్బర్ మొరాదాబాద్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని తెలిసింది. నసీముద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం బిజ్నోర్‌నుంచి పోటీలో దిగుతున్నారు.. ప్రకటించిన పేర్లలో బరేలీ నుంచి ప్రవీణ్ అరోన్ కూడా ఉన్నారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంనుంచి విజయం సాధించారు. అలాగే బందా నుంచి బాల్కుమార్ పటేల్ బరిలో ఉన్నారు. దశాబ్దం క్రితం ఎన్కౌంటర్లో చనిపోయిన బందిపోటు శివకుమార్ అలియాస్ దదువాకు పటేల్ సోదరుడు. పటేల్‌కూడా గతంలో సమాజ్‌వాది పార్టీ నుంచి మీర్జాపూర్ నుంచి విజయం సాధించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఆ ఏడు స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ దూరం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలో తమ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని వెల్లడించింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి తరఫున బరిలో నిలిచే ప్రముఖులకు వ్యతిరేకంగా తాము పోటీ చేయడం లేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ ఆదివారం ప్రకటించారు. ఎస్పీ వ్యవస్థాకుడు ములాయం సింగ్ బరిలో నిలిచే మణిపూరి, ఆయన కోడలు బరిలో నిలిచే అవకాశం ఉన్న కానూజ్, అలాగే బీఎస్పీ అధినేత్రి మయావతి, ఆర్ఎల్డీ నేతలు అజిత్ సింగ్, జయంత్ చౌదరి బరిలో నిలిచే స్థానాలు ఉన్నాయని తెలిపారు. అలాగే అప్నాదళ్‌కు తాము రెండు సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్, మయావతి కూడా కాంగ్రెస్ పోటీ చేసే రెండు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదనే విషయాన్ని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం బరిలో నిలిచే అమేథి, రాయబరేలీలో అభ్యర్థులను నిలుపకూడదని ఎస్పీ, బీఎస్పీ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్యకాలంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. -
‘హనుమాన్ జోలికి వస్తే మీ లంకను కాల్చేస్తాడు’
జైపూర్ : హనుమంతుడిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బ్బర్ హితవు పలికారు. లేకుంటే ఆ హనుమంతుడే బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హనమంతుడు దళితుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హనమంతుడి కులం చర్చనీయాంశమైంది. అదే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ హనుమంతుడు బ్రాహ్మణుడంటే.. మరో ఎంపీ గిరిజనడన్నారు. ఇంకో బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటే యూపీ మంత్రి జాట్ అన్నారు. ఇలా హనమంతుడి పేరును రాజకీయం చేయడంపై రాజ్‌బబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ఇలానే చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. -
వారు పేదలను పొట్టనబెట్టుకుంటున్నారు..
జైపూర్ : కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించారు. ఉదయ్‌పూర్‌లో బీజేపీ ప్రచార ర్యాలీలో రాజ్‌బబ్బర్ మాట్లాడుతూ పేద ప్రజలను హతమార్చే హంతక ముఠా గుజరాత్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. గ్యాంగ్‌స్టర్ ముఠాలో ఒకరు బీజేపీ చీఫ్ కాగా, మరొకరు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ రూపాయి విలువ దిగజారుతున్న క్రమంలో రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లి 90 ఏళ్ల హీరాబెన్‌తో పోల్చడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వయసు స్ధాయిలో ఉంటే ప్రస్తుతం రూపాయి బలహీనపడుతూ ప్రధాని తల్లి వయసుకు క్షీణిస్తోందని రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఏడున జరగనుండగా, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
పోరాడలేక నా తల్లిపై దూషణలా?
ఛత్తర్పూర్/మంద్సౌర్: తనతో పోరాడే శక్తిలేని కాంగ్రెస్ నేతలు తన తల్లి హీరాబెన్ లక్ష్యంగా దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా తన చేతిలో ఓడిపోతున్న కాంగ్రెస్ నేతలు, పోరాడేందుకు మరే విషయం దొరక్కపోవడంతోనే వృద్ధురాలైన తన తల్లిని ఈ వివాదంలోకి లాగారని దుయ్యబట్టారు. దేశంలో రూపాయి విలువ మోదీ తల్లి వయస్సుకు దిగజారిందని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఈ మేరకు స్పందించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఛత్తస్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విపక్షాలపై మోదీ నిప్పులు చెరిగారు. ఆమెకు రాజకీయాలంటేనే తెలియదు.. ‘ఈ కాంగ్రెస్ నేతలకు నరేంద్ర మోదీపై పోరాడే శక్తి లేదు. 17–18 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతీసారి సవాల్ చేయడమే కాకుండా చిత్తుచిత్తుగా ఓడిస్తున్నా. కానీ మీరు ఈ రాజకీయ రొంపిలోకి నా తల్లిని లాగుతున్నారా? కాంగ్రెస్ నేతలకు ఇది సరైనదేనని అనిపిస్తోందా? మోదీపై చేసిన విమర్శలేవీ పనిచేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు నా తల్లి హీరాబెన్‌ను దుర్భాషలాడుతున్నారు. ఆమెను అవమానిస్తున్నారు. కానీ నా తల్లికి రాజనీతి(రాజకీయం) అనే పదంలో ఆర్ అనే అక్షరానికి అర్థం కూడా తెలియదు’ అని అన్నారు. మాది రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కాదు ఈ సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిం చారు. ‘నా ప్రభుత్వాన్ని ఓ మేడమ్(సోనియా) తన ఇంట్లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నియంత్రించడం లేదు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్. మేడమ్ హయాంలో ధనికుల కోసం బ్యాంకుల ఖజానాలను ఖాళీ చేసేశారు. కానీ, మా ప్రభుత్వం యువతకు సాధికారత కల్పిస్తోంది. అవినీతి అన్నది నాలుగు తరాల కాంగ్రెస్‌లో అనాదిగా వస్తున్న ఆచారం, సంస్కృతి. నోట్ల రద్దు తర్వాత తప్పుడు పేర్లు, చిరునామాలతో నడుస్తున్న మూడు లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయి.’ అని మోదీ తెలిపారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వస్తున్న ఆదరణ చూసి నామ్‌దార్(రాహుల్), రాజా (దిగ్విజయ్), మహారాజా (జ్యోతిరాదిత్య సింధియా)లు కలత చెందుతున్నారని ప్రధాని ఆరోపించారు. పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే.. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఉంటే దేశంలో రైతులు నాశనమయ్యేవారు కాదని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తప్పులు, లోపభూయిష్టౖ నిర్ణయాలతో రెతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం అవసరమనీ, అయితే తనకు నాలుగేళ్ల కాలం మాత్రమే లభించిందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు లభించిన సమయంలో సగం కాలం తనకు అధికారం అప్పగించినా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తానన్నారు. పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) అంటూ నాడు ఇందిర ఇచ్చిన నినాదం నేటికీ నెరవేర లేదని విమర్శించారు. -
‘నన్ను ఎదుర్కోలేక మా అమ్మను తిడుతున్నారు’
భోపాల్ : రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. కానీ తాను మాత్రం గత 17 ఏళ్లుగా కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ.. ఓడిస్తున్నాననీ తెలిపారు. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని, తమది రిమోట్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. ఇండోర్‌లో గత గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో సీపీ జోషి ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. -
కాంగ్రెస్ నేతల నోటి దురుసు
ఇండోర్/అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీపీ జోషి, రాజ్ బబ్బర్లు..ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు. మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి దిగువ కులాలకు చెందినవారని, వారికి హిందూయిజం గురించి ఏమీ తెలియదని సీపీ జోషి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్ బబ్బర్, జోషితో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు జోషి క్షమాపణ చెప్పినా బీజేపీ శాంతించలేదు. జోషి హిందూ మతం, సంస్కృతిని అవమానించారని, ధైర్యముంటే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌కు సవాలు విసిరింది. మన్మోహన్‌ను అవమానించారు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని అన్నారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని అన్నారు. -
రూపాయి విలువను మోదీ తల్లి వయస్సుతో పోల్చిన నేత..
భోపాల్ : రోజు రోజుకూ పడిపోతున్న రూపాయి విలువను మోదీ తల్లి వయసుతో పోల్చుతూ వివాదానికి తెరలేపారు కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ . మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఇండోర్‌లో రాజ్ బబ్బర్ మాట్లాడుతూ.. ‘మోదీ పడిపోతున్న రూపాయి విలువను.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వయసుతో పోల్చారు. కానీ ఈ రోజు రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోయింది. అది ఎంత తగ్గిందంటే మోదీ అమ్మగారి వయసంత’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాజ్ బబ్బర్ ఆయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. ‘ఆలయ నిర్మాణానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇప్పుడు ముస్లింలు కూడా రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఆలయాన్ని నిర్మిస్తానంటుంది కానీ ఎప్పుడనేది చెప్పడం లేదంటూ ఆరోపించారు. అయితే రాజ్ బబ్బర్ మాటలపై బీజేపీ మండి పడుతుంది. కాంగ్రెస్ పార్టీది ఎంతటి నీచమైన మనస్తత్వవమో బబ్బర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ విలువ పూర్తిగా పడిపోతుంది. ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. రాజ్ బబ్బర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. -
వారణాసి దుర్ఘటనపై రాజకీయ దుమారం
వారణాసి: ప్రఖ్యాత ఆథ్యాత్మిక నగరం వారణాసిలో ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేశారు. అధికారులు, ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. సదరు ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నది ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘యూపీ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్’’ సంస్థ కావడంతో ఇటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం ఫ్లైఓవర్ పిల్లర్ విరిగిపడి.. కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆలయాల ధ్వంసం వల్లే: యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ బుధవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మూడు వినాయకుడి ఆలయాలను ధ్వంసం చేశారని, దేవుడి శాపం వల్లే ఫ్లైఓవర్ కూలిపోయిందని స్థానికులు అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మొన్నటి ఉప ఎన్నికలకు ముందే ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న తొందరలో పనులను అడ్డదిడ్డంగా, నాసిరకంగా చేశారు. పైగా, ఇక్కడ మూడు వినాయకుడి గుడులు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జి కోసం వాటని ధ్వంసం చేశారని, ఆ శాపం వల్ల ఇంతటి విపత్తు సంభవించిందని వారు భావిస్తున్నారు’’ అని రాజ్ బబ్బర్ అన్నారు. కాగా, 2016నాటి కోల్‌కతా ఫ్లైఓవర్ దుర్ఘటన ‘‘తృణమూల్ కాంగ్రెస్‌కు దేవుడి హెచ్చరిక’’ అని మోదీ వ్యాఖ్యానించిన పాత వీడియోలు మళ్లీ వైరల్ అయ్యాయి. నాటి దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే. సూపర్ వైజర్‌పై కేసు: ఫ్లైఓవర్ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే నిర్మాణ సంస్థకు చెందిన పలువురు అధికారులు, ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రజల ప్రాణాలను హరించారంటూ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై సిగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఐపీసీ సెక్షన్ 304 కింద సంస్థ సూపర్ వైజర్‌పై కేసు నమోదుచేశామని సిగ్రా ఎస్ఐ ధనానంద్ త్రిపాఠి తెలిపారు. రూ. 200 లంచం తీసుకున్న చిరుద్యోగి అరెస్ట్: కాగా, వారణాసి ఫ్లైఓవర్ కూలిన ఘటనలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఒకానొక బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో వార్డుబాయ్ రెండు వందల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు చిరుద్యోగిని అరెస్టు చేశారు. -
సన్యాసిని సీఎం చేస్తే ఏం ఒరిగింది!
సాక్షి, భోపాల్: ఐదుగురు సాధువులకు మంత్రి పదవులు ఇవ్వడం మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. వారు ఏం సాధించారని మంత్రి హోదా కల్పిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రశ్నిస్తోంది. మత గురువులైన నర్మదానంద్ మహరాజ్, కంప్యూటర్ బాబా, హరిహరానంద్ మహరాజ్, భయ్యూ మహరాజ్, పండిత్ యోగేంద్ర మహంత్‌లకు మంత్రి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాజ్ బబ్బర్ బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాషాయం వస్త్రాలు ధరించిన సాధువులను చూపించి ఓట్లడిగి ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఓ సన్యాసిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. నేరాలు పెరిగిపోవడం, మత ఘర్షణలు జరగడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కేవలం తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకే బాబాలు, సాధువులకు పదవులు, హోదాలు బీజేపీ కల్పిస్తుందన్నారు. సహాయ మంత్రులుగా తమని నియమించడంపై కంప్యూటర్ బాబా స్పందించారు. బాబాలు, మత గురువులు, సాధువులకు పదవులు కట్టబెట్టడంలో తప్పేముందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మేం చేసిన పనికి ప్రతిఫలం లభించినట్లు భావిస్తున్నాం. నర్మదా ఘటాలా అవినీతితో పాటు నర్మదా నది పరిరక్షణలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటపెట్టినట్లు కంప్యూటర్ బాబా గుర్తుచేశారు. సాధువులను నర్మదా పరిరక్షణ నేపథ్యంలో సహాయ మంత్రులుగా నియమించడంలో తప్పేంలేదని, ప్రొటోకాల్ ప్రకారమే వారికి బాధ్యతలు అప్పగించామని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ తెలిపారు. దీంతో ప్రజలు భాగస్వాములుగా మారితే నది పరిరక్షణ పనులు తేలికగా జరుగుతాయని చెప్పారు. -
ఆయన రాజీనామా చేయలేదు
సాక్షి, మాంద్య (కర్ణాటక) : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి రాజ్‌బబ్బార్ తప్పుకోలేదని, రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. 'నేను మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజ్ బబ్బార్ రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి' అని తివారీ అన్నారు. అంతకుముందు ఓ వార్తా సంస్థలో వచ్చిన వార్తల ప్రకారం రాజ్ బబ్బార్ ఇలా చెప్పారు . 'కాంగ్రెస్ పార్టీలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు నాకు ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాను. వాటిని నిర్వర్తిస్తూ 2019 ఎన్నికలకు అనుగుణంగా పనిచేస్తాను. నేను ఏం చెప్పాలో అది మా పార్టీ అధ్యక్షుడికి చెబుతాను. కాంగ్రెస్ పార్టీ గత కొద్దికాలంగా ఓడిపోతూ వస్తోంది.. ఓడిపోతుంది' అంటూ ఆయన చెప్పారు. గోరఖ్‌పూర్, పుల్పూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపేలవమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో రాజీనామాలు.. ఇంకా ఎందరు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలలు పక్కకు తప్పుకునే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ముఖ్యనాయకులకు-కార్యకర్తలకు మధ్యనున్న గోడలు కూల్చేయడంతోపాటు యువతకు పెద్దపీట దక్కాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. నిన్న గోవా, గుజరాత్ పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. నేడు ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ రాజ్‌బబ్బర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంలో భాగంగా మరిన్ని సంస్థాగత మార్పులు తప్పవని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికి రాజీనామాలు చేసిన ముగ్గురే కాకుండా ఇంకొందరు పీసీసీ చీఫ్‌లు కూడా స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని తెలిపాయి. ఏపీ, తెలంగాణలోనూ మార్పులు? : సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మారుస్తారా, లేదా అనేది చర్చనీయాంశమైంది. రాజీనామాల విషయంలో ‘వయసు’ ప్రధానాంశం కాబట్టి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలకు ఎలాంటి ఢోకా ఉండబోదని సమాచారం. -
ఇక అమిత్ షా వంతు!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తెర మీదకు వచ్చిన ‘హిందూ’ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాహుల్ గాంధీ హిందువు కాదని బీజేపీ అంటే, ప్రధాని నరేంద్ర మోదీ హిందువుకాదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనికి ఇరుపక్షాల నేతలు ఆజ్యం పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి అమిత్ షా కూడా హిందువు కాదని పేర్కొంది. అమిత్ షా జైనుడని కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. ‘అమిత్ షా తాను హిందువునని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఆయన జైన్ మతానికి చెందినవారు. రాహుల్ గాంధీ ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి శివారాధన చేస్తున్నారు. ఇందిరా గాంధీ రుద్రాక్షమాల ధరించేవారు. శివుడిని పూజించేవారు మాత్రమే రుద్రాక్షమాల ధరిస్తార’ని రాజ్‌బబ్బర్ అన్నారు. సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో తాను హిందువును కాదంటూ రాహుల్ గాంధీ రిజిస్టర్లో పేర్కొన్నారంటూ బీజేపీ ఆరోపించడంతో వివాదం రేగింది. బీజేపీ ఆరోపణలను రాహుల్ తోసిపుచ్చారు. తాను శివభక్తుడినని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నిజమైన హిందువు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ.. హిందుత్వకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. -
13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ తీసుకున్నా : యంగ్ హీరో
ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న ప్రదానాంశం డ్రగ్స్. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ విషయంలో విచారణను ఎదుర్కొనగా మరికొంత మందికి ఈ విషయంలో ప్రమేయం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ వినియోగం పై స్పందించాడు. లెజెండరీ యాక్టర్స్ రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు ప్రతీక్ బబ్బర్ ఏక్ దివానా థా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతీక్ ' రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ లాంటి లెజెండ్ కడుపున పుట్టానే గాని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందరికీ నేను ప్రతీక్ బబ్బర్లాగే తెలుసు. కానీ నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు మనిషిగా వాటన్నింటినీ జయించాను. డ్రగ్స్ జీవితం ఎలా నాశనమవుతుంది? వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న విషయాలు మీతో పంచుకుంటున్నా... 13 ఏళ్ల వయసులో ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడేవాడిని. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వేదించేవి. దీంతో నా మనసు డ్రగ్స్‌వైపు మళ్లింది. ఎలాంటి డ్రగ్ అయినా ఆలోచించకుండా వాడేవాడిని. ఒక దశలో పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ గా మారిపోయా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను వేలెత్తి చూపుతారిని భయపడేవాడిని, నన్ను నేను కూడా చూసుకునేందుకు భయపడేవాడిని. మానేయాలన్న ఆలోచన వచ్చినా.. నా వల్ల అయ్యేది కాదు. చివరకు డాక్టర్లు నా సమస్యకు పరిష్కారం చూపించారు. జీవితం నాశనం చేసుకోవటం కన్నా.. కష్టపడి డ్రగ్స్ వాడకాన్ని మానేయటం కరెక్ట్' అంటూ తన అనుభవాలను అభిమానులకు వివరించాడు ప్రతీక్ బబ్బర్. -
ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్!
-
ఘోర పరాజయం.. యూపీలో తొలి వికెట్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్‌లో ఆంతర్మథనం మొదలైంది. ఈ పరాభవంతో పార్టీ అధినాయకత్వంపై సీనియర్ నేతలు నిరసనగళాలను విప్పుతున్నారు. ఇప్పటికే సత్యవ్రత చతుర్వేది లాంటి సీనియర్ నేతలు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలైన సమయంలో చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు మథనపడుతూ కూర్చుంటే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల పరాజయాల్లో రాహుల్‌గాంధీ పాత్ర ఏమీ లేదని గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నేతలు వెనుకేసుకొస్తుండగా.. చతుర్వేది లాంటి సీనియర్లు మాత్రం మండిపడుతున్నారు. నేరుగా రాహుల్ నాయకత్వాన్నే పలువురు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఎన్నికల పరాభవం నేపథ్యంలో యూపీ కాంగ్రెస్‌లో తొలి వికెట్ పడింది. ఎన్నికల సందర్భంగా యూపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ సినీ నటుడు రాజ్ బబ్బర్ తాజాగా తన పదవికి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. -
'బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నా.. ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరగనున్న తన నియోజకవర్గం లక్నో కంటోన్మెంట్ లో యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తో కలిసి మంగళవారం ఓ బహిరంగసభలో అపర్ణ పాల్గొన్నారు. నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఒకేతీరుగా వ్యవహరిస్తారని.. ఆ ఇద్దరిరి ఒకే స్వభావమని.. అభివృద్ధే వారి లక్ష్యమని కొనియాడారు. తమ పార్టీ ఇక్కడ రూ.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిందని, మరోసారి ఎస్పీని గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అపర్ణ తెలిపారు. నియోజకవర్గంలో ఆమె ఎక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ సభలలో 'ఫ్యూచర్ మినిస్టర్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 'నేను తొలుత ఇక్కడి ఆడపడుచును.. ఆ తర్వాతే కోడలుగా వచ్చాను' అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వరుసకు సోదరి అయిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తాను చాలా సన్నిహితంగా ఉంటామని, ఇద్దరి వ్యక్తిత్వాలు వేరని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను సంతోషంగా షేర్ చేసుకునేంతగా తమ మధ్య చనువు ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణ, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉండటం అపర్ణకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అపర్ణకు బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఈ స్థానంపై ఉంది. -
పొత్తుల సమస్యే లేదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బబ్బర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయగల సత్తా తమకుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని ఆయన అన్నారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమని ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ యూపీ చీఫ్ మాట్లాడటం గమనార్హం. ఇక పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం కొద్దమంది తన స్నేహితులకు మేలు చేయడానికే ఆయనిలా చేశారని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, దేశంలో స్వైపింగ్ సామ్రాజ్యం నడుపుతున్న కొద్దిమందికి దీనివల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికీ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు. -
మీ సేవలకు దండం.. ఇక పార్టీ నుంచి వెళ్లిపోండి!
పనిచేయని కాంగ్రెస్ నేతలకు పార్టీ చీఫ్ హుకుం లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు హస్తం అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. యూపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా నిద్రలేవాలని, తమ విశ్రాంత ధోరణిని విడనాడి.. రాష్ట్రమంతటా విస్తారమైన ప్రచారం చేసేందుకు సన్నద్ధం కావాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని, పార్టీ శ్రేణులు మొద్దునిద్ర వదలకపోతే బయటకు పంపిస్తామని బబ్బర్ హెచ్చరించారు. నిష్క్రియగా వ్యవహరించే నేతలంతా తమ దారి తాము చూసుకోవచ్చునని, పనిచేయని నేతలను పార్టీ నుంచి పంపించేస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో చురుగ్గా పాల్గొనే నేతలనే క్రియాశీలంగా ఉన్న నేతలుగా భావిస్తామని ఆయన 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. -
ఆమె వృద్ధురాలు.. ఆయన ఊసరవెళ్లి!
లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తేలికచేసి పారేశారు. ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌ను తన సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ యూపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆమె పేర్కొన్నారు. 'కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వృద్ధురాలు' అని విమర్శించారు. మాయావతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభివృద్ధికి చేసేందేమీ లేదని దుయ్యబట్టారు. ఇక యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ నియామకాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. తరచూ పార్టీలను మార్చే రాజ్ బబ్బర్ ఒక ఊసరవెళ్లిలాంటి వారని, ఆయనకు ఒక రాజకీయ పార్టీ మీదగానీ, రాజకీయ భావజాలంపైగానీ విశ్వాసం లేదని విమర్శించారు.