raj kapoor
-
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
రాజ్‌కపూర్ శతజయంతి : జీనా ఇసీకా నామ్ హై!
జన్మించి నూరేళ్లు. మరణించి ముప్పై ఆరేళ్లు. మొదటి సినిమా ‘ఆగ్’ వచ్చి 75 ఏళ్లు. ఇవాళ్టికీ రష్యా వెళితే వినిపించే పాట ‘ఆవారా హూ’... చైనాలో పలికే భారతీయ నటుడి పేరు రాజ్ కపూర్. ‘ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియా’. మేరా జూతా హై జపానీ పంట్లూన్ ఇంగ్లిస్తానీ... కాని మనసు? ‘ఫిర్ భి దిల్ హై హిందూస్తానీ’. ఉత్సవంలా బతికి ఉత్సవంలా మరణించినవాడు రాజ్ కపూర్. ‘జీనా యహా.. మర్నా యహా’ సినిమాను ప్రేమించి పులకించినవాడు. అతనికి నివాళి. ఘన స్మరణ.మే 2, 1988.న్యూదిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియమ్... జాతీయ పురస్కారాల ప్రదానం. హాలు కిక్కిరిసి ఉంది. ప్రభుత్వ, సినీ రంగ పెద్దలు ఆసీనులై ఉన్నారు. వేదిక మీద రాష్ట్రపతి ఒక్కొక్కరి పేరు పిలిచి పురస్కారాలు అందిస్తున్నారు. ‘ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార బహూకరణ. గ్రహీత– రాజ్ కపూర్’. ఆ పేరు వినగానే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ వేదిక మీదకు రాబోతున్న రాజ్ కపూర్ కోసం చూస్తున్నారు. కాని ముందు వరుసలో ఉన్న రాజ్ కపూర్ కుర్చీలో నుంచి లేవలేకపోతున్నారు. కొన్ని నిముషాల ముందే ఆయనకు ఆస్తమా అటాక్ వచ్చింది. అలా రాకూడదని రెండు గంటల ముందు హోటల్లో ఇంజెక్షన్ చేసుకొని వచ్చారు. అయినా వచ్చింది. సభలో ఉన్నవారి ఎదురు చూపు. లేవలేని తన అశక్తత. మాట పెగలట్లేదు. కాని కళ్లు పని చేస్తున్నాయి. కళాకారుడి కళ్లు అవి. ‘నేను వేదిక మీదకు రాలేను రాష్ట్రపతి గారూ’... కళ్లతోనే మొర పెట్టుకున్నారు రాజ్ కపూర్. వేదిక మీద ఉన్న రాష్ట్రపతి కె.వెంకట్రామన్ ఆ కళ్లలోకి చూసి సంగతి గ్రహించారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండా స్వయంగా తానే వేదిక దిగి రాజ్ కపూర్ వైపు కదిలారు. ఆయన వస్తుంటే శక్తినంతా కూడగట్టుకుని రాజ్‌కపూర్ లేచి నిలబడ్డారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం’ సగౌరవంగా ఆయనకు దక్కింది. రాష్ట్రపతిని స్జేజ్ మీద నుంచి కిందకు వచ్చేలా చేసిన సంఘటన మరొకటి లేదు. రాజ్ కపూర్ మాత్రం? అలాంటి వాడు మరొకడున్నాడా ఏమిటి?1955.జవహర్లాల్ నెహ్రూ ‘సోవియెట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా’ను ప్రధాని హోదాలో సందర్శించారు. ఇరు దేశాల మధ్య స్నేహం వెల్లివిరుస్తున్న సమయం. రష్యన్లను, స్థానిక భారతీయులను ఉద్దేశించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడే సభ. ముందు నెహ్రూ మాట్లాడి జనాన్ని ఉత్సాహ పరిచి కూచున్నారు. నెహ్రూ గొప్ప వక్త. రష్యా ప్రధాని నికొలాయ్ బల్గనిన్కు నెహ్రూని మించి సభను రక్తి కట్టించాలనిపించింది. తన మంత్రులకు సైగ చేశారు. వాళ్లంతా వచ్చి బల్గనిన్ ఇరు పక్కలా నిలుచున్నారు. నెహ్రూకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా రష్యా ప్రధాని, మంత్రులు పాట అందుకున్నారు.ఆవారా హూ... ఆవారా హూ..యా గర్దిష్ మే హూ ఆస్మాన్కా తారాహూ ఆవారాహూ...జనం కేరింతలు. నెహ్రూ ఉన్న సభ అది. మార్మోగుతున్నది రాజ్ కపూర్ పేరు. ‘ఉదయాన్నే తెల్లబట్టలు వేసుకొని వెళ్లాలి. సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి రావాలి’ అని చెప్పాడు పృథ్వీరాజ్ కపూర్ తన పెద్ద కొడుకు రాజ్ కపూర్‌ని రంజిత్ స్టూడియోలో పనిలో పెట్టి. మెట్రిక్యులేషన్ తర్వాత ‘ఇక చదవను సినిమాల్లో పని చేస్తా’ అని రాజ్ కపూర్ కోరడంతో సినిమా తీయాలంటే అన్ని పనులు తెలియాలి అని స్టూడియో పనిలో పెట్టి పృథ్వీరాజ్ కపూర్ అన్న మాట అది. అప్పటికే ప్రాభవంలో ఉన్న నటుడి కొడుకైనప్పటికీ రాజ్ కపూర్ ఒక ఆర్డినరీ క్లాప్ బాయ్‌లానే జీవితాన్ని మొదలుపెట్టాడు. రంజిత్ స్టూడియో, బాంబే టాకిస్, ఫిల్మ్స్థాన్... వీటన్నింటిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి చివరకు తండ్రి దగ్గరే పృథ్వీ థియేటర్లో చేరితే పది రూపాయల జీతం, రెండు జతల బట్టలు, వానాకాలంలో ఉచితంగా వాడుకోవడానికి రైన్ కోట్, టోపీ దక్కాయి. రాజ్ కపూర్ అలా రాజ్ కపూర్ అయ్యాడు. తెల్లబట్టలు నల్లగా పీలికలయ్యేంతగా కష్టపడ్డాడు. కష్టం చేసేవాడిని అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఈ నీలికళ్ల అందగాడిలో ఏదో ఉంది అని దర్శకుడు కేదార్ శర్మ రాజ్ కపూర్‌తో హీరోగా అతని మొదటి సినిమా ‘నీల్ కమల్’ తీశాడు. హీరోయిన్ పదమూడేళ్ల మధుబాల. ఆడలేదు. అయితే సినిమాల్లో ఫస్ట్ టేక్ ఓకే కాకపోతే రీటేక్ చేయొచ్చు. రీటేక్ కోసం మరింత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకోనివాడు పోతాడు. రాజ్ కపూర్ పడి లేవడం తెలిసినవాడు.రాజ్ కపూర్‌కు పెళ్లయ్యింది (1946). ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని తానే ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా ‘ఆగ్’ (1947) తీశాడు. ఏంటి... మూతి మీద సరిగా మీసాలు కూడా రాని కుర్రాడు సినిమా తీయడమా.. ‘ఆగ్’ (మంట) అని టైటిలా? సీనియర్ డిస్ట్రిబ్యూటర్లకు ఒళ్లు మండింది. రాజ్ కపూర్ కనపడితే ‘ఏమయ్యా రాజ్. అన్నీ నువ్వే అయ్యి సినిమా తీస్తున్నావ్. సినిమా హాలు కూడా కట్టుకోరాదూ?’ అన్నారు. ‘హాలెందుకు?’ అనడిగాడు రాజ్ కపూర్. ‘ఎందుకేంటయ్యా. మంట అంటుకుంటే నీ హాలు బూడిదైతే చాలదా? మావన్నీ ఎందుకు?’ అన్నారు. హేళన అలా ఉంటుంది. ‘ఆగ్’ విడుదలైంది. ఓ మోస్తరుగా ఆడింది. నవ్వులు ఆగాయి. రాజ్‌కు తెలుసు... ఈ ప్రయత్నాలన్నీ అడ్డ పెడలు వేసి సైకిలు తొక్కడమేనని. సీటెక్కి తొక్కే సమయానికి తోటి కుర్రాళ్లు తోడవుతారని. అయ్యారు. కె.ఏ. అబ్బాస్ (రచయిత), శంకర్ జైకిషన్ (సంగీత దర్శకులు), ముకేష్ (గాయకుడు), శైలేంద్ర– హస్రత్ జైపూరి (గీత కర్తలు)... వీళ్ల తోడుగా రాజ్ కపూర్ మరో సినిమా తీశాడు. విడుదలైంది.బర్సాత్ (1949). భారీ హిట్. రాజ్ కపూర్ అట... నర్గిస్ అట... పదండి హాళ్లకు... కలుద్దాం వీళ్లను... థియేటర్లలో మంట అంటుకుంది... కలెక్షన్ల మంట... కాసుల మంట.... అగ్గితో కురిసే కుంభవృష్టి.రాజ్‌కపూర్ టీమ్‌కు ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు తోడయ్యారు. నర్గిస్, లతా మంగేష్కర్. ‘బర్సాత్’ లో నర్గిస్, రాజ్ కపూర్. ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు చేశారు. ఆవారా, ఆహ్, శ్రీ 420, చోరి చోరి.... కేవలం వినోదం రాజ్ కపూర్ ఉద్దేశం కాదు. కథ ఉంటుంది. జనం తమ కథే అనుకునే కథ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆనాటి రోజుల్లో అగమ్యంగా ఉన్న పేదవాళ్లు, ఎవరికీ పట్టని బీదలకు ప్రతినిధిగా కథానాయకుణ్ణి పెట్టి ‘ఆవారా’ తీశాడు. పని దొరక్క ఉపాధి కోసం వలసకు బయలుదేరి గ్రామీణ నిష్కల్మషం నుంచి నగర పతనాలకు ప్రయాణిస్తూ నైతిక ఘర్షణను ఎదుర్కుంటున్న యువకులకు ప్రతినిధిగా హీరోని పెట్టి ‘శ్రీ420’ తీశాడు. చార్లి చాప్లిన్‌ను పోలిన ఆహార్యం, చలాకీతనం, అమాయకత్వం.. తోడుగా వ్యక్తిత్వం ఉన్న పాత్రల్లో నర్గిస్... ఆ జంట పండింది. క్లాసిక్స్ అందరూ తీస్తారు. కాని కొందరు వాటితో అందరినీ తాకుతారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో భాగంగా రష్యాలో సినిమాల విడుదలకు మన దేశం అనుమతించింది. వాటిలో ప్రధానమైనవి రెండు: ‘దో భిగా జమీన్’ (బిమల్ రాయ్ – 1953), ఆవారా (1951). మాస్కోలో మన ప్రభుత్వం పూనికతో ‘దో భిగా జమీన్’ పోస్టర్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే రష్యన్లు అలాంటి సినిమాలను మెచ్చుతారని. ఒక్కరోజు. రష్యన్లు దో భిగా జమీన్, ఆవారా రెండూ చూశారు. రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. మాస్కో అంతా ఎక్కడ చూసినా ఆవారా పోస్టర్లే. 4 రోజుల్లో 15 లక్షల మంది మూడు నగరాల్లో చూశారు. అదీ రాజ్‌కపూర్. రాజ్ కపూర్ ఏది చేసినా పెద్దగా ఆలోచించి చేసేవాడు. అతడు సన్నివేశాన్ని ముందు సంగీతంతో ఊహిస్తాడని అంటారు. సంగీతం ఇలా ఉంటే సన్నివేశం అలా తీయొచ్చు అనుకుంటాడట. ‘ఆవారా’లో డ్రీమ్ సీక్వెన్సు, ‘శ్రీ 420’లో ‘΄్యార్ హువా ఇక్రార్ హువా’ పాటకు వేసిన సెట్.. సినిమా అంటే విజువల్స్... మ్యూజిక్.... ఇవి రెండు బెస్ట్‌గా ఉంటే సినిమా హిట్. ‘సంగం’కు ఇంకో ఆకర్షణ అమర్చాడు– లొకేషన్స్. విదేశీ లొకేషన్లలో తీసిన మొదటి హిందీ సినిమా అది. భారీ హిట్. ఆ తర్వాతి రోజుల్లో యశ్ చోప్రా ఫార్ములాను స్థిరపరిచాడు. రాజ్‌కపూర్ గొప్పగా కలగని... కాలం కంటే ముందుకెళ్లి రెండు ఇంటర్వెల్స్తో తీసిన ‘మేరా నామ్ జోకర్’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచింది. ఆ సినిమాలో మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. కౌమార స్థితిలోని రిషి కపూర్, అతని టీచర్‌గా సిమి గెరెవాల్... వీరి ఎపిసోడ్ ఫ్రెంచ్ సినిమాకు తగ్గదని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌ను కొనసాగిస్తూ, ‘మేరా నామ్ జోకర్’ను ఫ్లాప్ చేసినందుకు ప్రేక్షకుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ రాజ్ కపూర్ తీసిన సినిమాయే ‘బాబీ’. ఈ టీనేజ్ లవ్ స్టోరీ నేటికీ వందల భారతీయ సినిమాలకు కథను అందిస్తూనే ఉంది. రాజ్ కపూర్ ప్రకృతిలోని, మగాడిలోని, స్త్రీలోని స్త్రీత్వాన్ని గొప్పగా పట్టించుకున్న దర్శకుడు. స్త్రీ పురుషుల భావోద్వేగాలను, వీటిని ప్రేరేపించే లేదా నియంత్రించే సాంఘిక పరిమితులు, నియంత్రణలు... వీటినే అతడు ఎక్కువగా కథాంశాలు తీశాడు. అయితే మార్పు గురించి తన తాపత్రయం ఒదులుకోలేదు. ‘జాగ్తే రహో’, ‘బూట్ పాలిష్’, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’, ‘దిల్లీ దూర్ నహీ’, ‘సత్యం శివమ్ సుందరం’, ‘ఈ దేశంలో బీదవాళ్లు ఎక్కువ. వారు బాగు పడితే దేశం బాగు పడినట్టే’ అని రాజ్ కపూర్ అంటారు.ఉజ్వలమైన కాలాన్ని చరిత్రలో నుంచి తుడిచి పెట్టడం అసాధ్యం. జనులు మెచ్చిన కళాకారుణ్ణి సాంస్కృతిక పుటల్లో నుంచి చెరిపివేయడం దుస్సాధ్యం. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ అతని సరిజోడిగా గొప్ప ప్రతిభ చాటారు. కాని రాజ్ కపూర్ సినిమానే తన జీవితం చేసుకున్నాడు. సినిమా నుంచి పొందాడు. సినిమాకు ఇచ్చాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గొప్ప సంగీత సాహిత్యాలకు వారధిగా... దేదీప్యంగా నిలిచిన స్ఫూర్తిగా... ఇలా మరొకరు లేరు.అందుకే రాజ్ కపూర్ శత జయంతి ముగింపును దేశమంతా సగౌరవంగా జరుపుకుంటోంది. రాజ్ కపూర్‌ను గుర్తు చేసుకోవడం ద్వారా తన సినీ సౌందర్యాన్నీ, సినీ రసాత్మకతను గుర్తు చేసుకుంటోంది. ఒక పూట వెచ్చించి రాజ్ కపూర్ సినిమాలు చూసినా, పాటలు విన్నా జీవిత కాలం అంటిపెట్టుకొని పోయే ప్రియమైన కళాకారుడతడు. మళ్లీ మళ్లీ పుట్టడు. అతని కాలంలో మనం ఉన్నాం. అతని శత జయంతి ముగింపులోనూ ఉన్నాం. ఎంత సంతోషం. ఈ ఘనత కొనసాగాలి. ది షో మస్ట్ గో ఆన్.జీనా యహా మర్నా యహా ఇస్కే సివా జనా కహా. -
గ్రేటెస్ట్ షో మేన్‌కి గ్రాండ్ షో
భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో కృషి చేసిన ఎందరో సినీ ప్రముఖుల్లో నటుడు–దర్శక–నిర్మాత రాజ్‌కపూర్ ఒకరు. రాజ్ సాహెబ్, ది షో మేన్ ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియన్ సినిమా, చార్లీ చాప్లిన్ ఆఫ్ ఇండియన్ సినిమా... ఇలా రాజ్‌కుమార్‌ను ఆయన ఫ్యాన్స్, సన్నిహితులు, ప్రేక్షకులు పిలుచుకునేవారు. రాజ్ కపూర్ చేసిన ఎన్నో అద్భుత చిత్రాలు ఆయన్ను ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. కాగా ఈ నెల 14న రాజ్‌కపూర్ శత జయంతి. ఈ సందర్భంగా డిసెంబరు 13 నుంచి 15 వరకు రాజ్‌కుమార్ ఐకానిక్ సినిమాలను దేశంలోని 40 నగరాల్లో దాదాపు 150 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ పేరిట ‘ఆర్కే ఫిలిమ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా’ల నేతృత్వంలో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుంది. రాజ్‌కపూర్ కెరీర్‌లోని ఐకానిక్ ఫిల్మ్స్ ‘ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), జాగ్తే రహో (1956), జిష్ దేశ్ మే గంగా బహ్తీ హై (1960), సంగం (1964), మేరే నామ్ జోకర్ (1970), బాబీ (1973), రామ్ తేరీ గంగా మైలీ (1985)’ వంటి సినిమాలు ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ వేడుకల్లో ప్రదర్శితం కానున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్ సినిమాస్‌లో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాల టికెట్ ధర వంద రూపాయలుగా నిర్ణయించారు. భారతీయ సినిమా దార్శనికుడు‘‘రాజ్‌కపూర్ భారతీయ సినీ తెరకు భావోద్వేగాలు అద్దిన దార్శనికుడు. ఆయన విజన్‌కు ఈ ఫెస్టివల్ ఓ నివాళి’’ అన్నారు రణ్‌ధీర్ కపూర్ (రాజ్‌కపూర్ తనయుడు). ‘‘రాజ్ కపూర్ సినిమాలు మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి’’ అన్నారు రణ్‌బీర్ కపూర్ (రాజ్‌కపూర్ మనవడు).అవిభక్త భారతదేశంలోని పెషావర్‌లో పృథ్వీ రాజ్‌కపూర్, రామ్ సర్నీదేవి దంపతులకు డిసెంబరు 14, 1924లో జన్మించారు రాజ్‌కపూర్ (అసలు పేరు సృష్టినాథ్ కపూర్). యాక్టర్‌గా పృథ్వీరాజ్ కపూర్ కెరీర్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఆయన పలు ప్రాంతాలకు మకాం మార్చాల్సి వచ్చింది. ఇలా రాజ్ కపూర్ చదువు వివిధ స్కూల్స్‌లో జరిగింది. ఇక తన తండ్రి ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఇన్క్విలాబ్’ (1935) చిత్రంతో బాల నటుడిగా పదేళ్ల వయసులో తెరపైకి వచ్చారు రాజ్ కపూర్. ‘నీల్ కమల్’ (1947) మూవీతో లీడ్ యాక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత హీరోగా ‘బర్సాత్’తో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో రాజ్‌కపూర్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఇక 1951లో విడుదలైన ‘అవారా’ చిత్రం రాజ్ కపూర్ కేరీర్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందంటే ఆయన కెరీర్ ఈ టైమ్‌లో ఎంతటి పీక్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నాటి తరంలో ఇండియన్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారిలో రాజ్ కపూర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన స్టార్డమ్ కొనసాగేలా ‘శ్రీ 420, సంగం’ వంటి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక రాజ్‌కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేరా నామ్ జోకర్’ చిత్రం ఆయన్ను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. నాలుగు గంటల నిడివితో రెండు ఇంట్రవెల్స్తో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే సినిమాకు కాలక్రమేణా కల్ట్ మూవీ స్టేటస్ దక్కడం విశేషం. ఇక 1948లో ఆర్కే స్టూడియో సంస్థను స్థాపించి, సినిమాలు నిర్మించారు రాజ్ కపూర్. తన కుమారుడు రిషి కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బాబీ’ సినిమా 1973లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడిగానూ రాజ్ కపూర్ సూపర్‌హిట్. ‘బర్సాత్, ఆవారా, శ్రీ 420, సంగం, మేరా నామ్ జోకర్’ వంటి చిత్రాలు అందుకు ఓ నిదర్శనం. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇంకా జాతీయ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు రాజ్ కపూర్. ఈ గ్రేట్ షో మేన్ 1988 జూన్ 2న ఢిల్లీలో కన్నుమూశారు. -
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన!
రాజ్‌కపూర్- నర్గీస్.. వీరి ప్రేమాయణం గురించి అందరూ కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. 18 చిత్రాల్లో కలిసి నటించిన వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ.. కానీ అప్పటికే రాజ్ కపూర్‌కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రేమ సఫలం కాలేదు. అనంతరం నర్గీస్.. సునీల్ దత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత రాజ్ కపూర్‌తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు కూడా వెళ్లేది కాదు. 24 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి.రాజ్ కపూర్, భార్య కృష్ణ, హీరోయిన్ నర్గీస్పెళ్లికి హాజరుదశాబ్దాల తర్వాత రాజ్.. తన కుమారుడు రిషి కపూర్ పెళ్లికి రావాలంటూ నర్గీస్‌ను ఆహ్వానించాడు. ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను తీసుకుని పెళ్లికి హాజరైంది. కానీ ఎందుకో అదోలా ఉంది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రాజ్ కుమార్ భార్య కృష్ణ తనను దగ్గరకు పిలిచింది. నా భర్త అందగాడు, రొమాంటిక్ కూడా! అతడు అందరినీ ఆకర్షిస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.భార్య కృష్ణతో రాజ్ కపూర్గతాన్ని మర్చిపోదయచేసి గతం గురించి వదిలేయు.. దాన్ని తవ్వుకుంటూ కూర్చుని బాధపడొద్దు. మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వచ్చావు. ఇప్పుడు మనం స్నేహితులం అని చెప్పింది. ఈ విషయాలను రిషి కపూర్ తన పుస్తకంలో రాసుకొన్నాడు. అలాగే తన తండ్రి.. హీరోయిన్ వైజయంతిమాలతోనూ సన్నిహితంగా ఉండేవాడని పేర్కొన్నాడు. కాగా రాజ్ కపూర్ 1988లో కన్నుమూశాడు.చదవండి: ‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..? -
OTT: ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ అండ్ మిసెస్ మహినటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులుదర్శకత్వం: శరణ్ శర్మ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామిఎడిటింగ్: నితిన్ బైదిఓటిటి వేదిక: నెట్ ఫ్లిక్స్స్ఫూర్తి అన్నది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ స్ఫూర్తికి సిద్దాంతం, వేదాంతం ఉండవు. తాను ఆడలేని పరిస్థితులలో తన ఆటను వేరొకరిలో చూసుకుని ఆడిస్తే అదే నిజమైన స్ఫూర్తి. అ కోవకు చెందినే ఈ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహీ. కథ మూలం వర్ధమాన ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ అని చెప్తున్నా ఈ సినిమాలో ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. కాని సినిమా పేరు తో పాటు ధోనీ పుట్టిన రాష్ట్రంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఒక విధంగా ఇదొక మామూలు కథ. క్రికెట్ ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డ కథానాయకుడు ఓ సంఘటన వల్ల అదే క్రికెట్ కి దూరమవుతాడు. తాను దూరం చేసుకుంది ఎలాగైనా సాధించాలన్న సదుద్దేశంతో తన భార్యకు క్రికెట్ కోచ్ గా మారతాడు. ఆట అంటే వచ్చే ఆనందం కన్నా ఆడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్ళు ఎన్నో ఎన్నెన్నో. అది కూడా మగవాళ్ళైతే కొంత వరకు పరవాలేదు. కాని ఆడవాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అంతా ఇంతా కాదు. మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో ఈ పాయింట్ చాలా హృద్యంగా చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం వరకు ప్రేక్షకుడిని కట్టిబడేసేలా రాసుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు శరణ్ శర్మ. ముఖ్య తారాగణంలో నటించిన రాజ్ కుమార్ రావ్ మరియు జాహ్నవి కపూర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. వర్త్ టు వాచ్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ.- ఇంటూరు హరికృష్ణ -
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
గోల్డెన్ బాబీ
50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి. ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్ఫిట్స్, వోవర్ సైజ్డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి. -
ఆ హీరోతో డేటింగ్ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!
ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయే పాటల్లో దమ్మారో దమ్ సాంగ్ ఒకటి. ఈ పాటను ఆస్వాదించినవాళ్లంతా జీనత్ కాన్ను అంత ఈజీగా మర్చిపోలేరు. బాలీవుడ్ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను ఆరాధించారు. కెరీర్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో హీరో రాజ్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటికి జీనత్‌ను మరో హీరో దేవ్ ఆనంద్ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. తన ఆటోబయోగ్రఫీలో మాత్రం... తాను ప్రేమిస్తున్న జీనత్ మరొకరితో ప్రేమలో ఉందన్న వార్తలు బాధించాయని రాసుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయింది జీనత్. పబ్లిక్‌గానే కంగ్రాచ్యులేషన్స్ చెప్పా 'నా కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో గోల్డెన్ త్రయం నడుస్తోంది. దేవ్ సాబ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ హిందీ సినిమాకు తలమానికంగా నిలిచారు. ఈ క్రమంలో 1973లో రాజ్ కపూర్ డైరెక్షన్లో వచ్చిన బాబీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా అవార్డులు సైతం గెల్చుకుంది. పబ్లిక్‌గానే అతడికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. వకీల్ బాబు, గోపీచంద్ జసూస్ సినిమాల్లో అతడితోపాటు నటించాను. అతడి డైరెక్షన్లో సినిమా చేయాలనుండేది. తీరా ఆ అవకాశం వచ్చేసరికి నేను సత్యం శివం సుందరం సినిమా ఒప్పుకోవడంతో దాన్ని తిరస్కరించక తప్పలేదు. తర్వాత రాజ్ కపూర్ సినిమాల్లోనూ నటించాను. కానీ మా మధ్య ఉన్న సాన్నిత్యాన్ని దేవ్ సాబ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అబద్ధాన్ని ప్రచారం చేశాడు 2007లో వచ్చిన ఆయన ఆటోబయోగ్రఫీ రొమాన్సింగ్ విత్ లైఫ్ పుస్తకంలో దేవ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ రాజ్‌కు నాకు మధ్య బంధం చిక్కపడటం చూసి తన మనసు ముక్కలైందని రాసుకున్నాడు. అది చూశాక నాకు విపరీతమైన కోపం వచ్చింది. దేవ్ నన్ను ప్రేమిస్తున్న విషయమే నాకు తెలియదు, ఆయనను గురువుగా ఆరాధించాను, ఎంతో అభిమానించాను. కానీ తను ఓ అబద్ధాన్ని నమ్మి నాపైనే దుష్ప్రచారం చేశాడు. చాలా బాధేసింది. ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాక నా ఫోన్ రింగవుతూనే ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో అవమానకరంగా భావించిన ఈ విషయం గురించి ఇన్నేళ్లుగా మాట్లాడలేకపోయాను. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ ఇవ్వాలనిపించింది. దేవ్ ఆనంద్ అరుదైన ప్రతిభ కలవాడు. ఆయన్ను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది జీనత్. సంజయ్ఖాన్తో ప్రేమ పెళ్లి, హింసతో బ్రేకప్ జర్నలిస్టు, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో హల్చల్తో నటిగా పరిచయమైంది. హరే రామ హరే కృష్ణతో స్టార్డమ్ తెచ్చుకుంది. కుర్రకారంతా ఆమెను ఆరాధించింది. ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడు, హీరో సంజయ్ ఖాన్‌ను ఆమె అందం కలవరపెట్టింది. అటు జీనత్కూ సంజయ్ అంటే ఇష్టం మొదలైంది. ఇద్దరూ అబ్దుల్లా సినిమాలో జంటగా నటించారు. ఈ క్రమంలో వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే సంజయ్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా అతడు ముక్కోపి! ఓసారి పార్టీలో అందరి ముందే దవడ ఎముక విరిగేలా జీనత్‌కు కొట్టాడట సంజయ్. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలో నుంచి తప్పించుకుంది. జీనత్. మూడేళ్ల వారి ప్రేమ హింసాత్మకంగా ముగిసింది. ఆ తర్వాత 1985లో మజర్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తుందనుకున్న సమయంలో 1998లో మజర్ కన్నుమూశాడు. సింగిల్ పేరెంట్‌గానే పిల్లలను పెద్ద చేసింది జీనత్. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార -
లెజెండ్రీ యాక్టర్ ఐకానిక్ బంగ్లా, గోద్రెజ్ ప్రాపర్టీస్ చేతికి: రణధీర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ముంబై బంగ్లాను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ముంబైలోని చెంబూర్‌లో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్ బంగ్లాను కొనుగోలు చేసినట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. కపూర్ కుటుంబానికి చెందిన వారసులనుంచి చట్టబద్ధంగా ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ముంబైలోని చెంబూర్‌లోని డియోనార్ ఫామ్ రోడ్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రక్కనే ఈ బంగ్లా ఉంది. అయితే కొనుగోలు డీల్ విలువను వెల్లడించలేదు. ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌ను తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడం సంతోషంగా ఉందని,ఈ అవకాశం ఇచ్చిన కపూర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ గౌరవ్ పాండే. ఈ ప్రాజెక్ట్ చెంబూర్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనుందని పాండే చెప్పారు. గతకొన్నేళ్లుగా ప్రీమియం డెవలప్మెంట్లకు డిమాండ్ బలంగా ఉందన్నారు. ఈ ఐకానిక్ ప్రాపర్టీకి తమ కుటుంబానికీ మధ్య సంబంధం కేవలం భావోద్వేగమైంది మాత్రమే కాదు చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని రణధీర్‌కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. గోద్రెజ్ గ్రూప్‌లో భాగస్వామ్యంపై ఆయన సంతోషం ప్రకటించారు. 2019, మేలో ప్రీమియం మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఆర్కెఎస్ను అభివృద్ధి చేయడానికి కపూర్ కుటుంబం నుండి చెంబూర్‌లోని ఆర్కె స్టూడియోస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం డెలివరీ కానుందని అంచనా. ఆర్కే బంగ్లా లేదా కృష్ణరాజ్ బంగ్లా 76 సంవత్సరాల క్రితం 1946లో ఆర్కే కాటేజీగా నిర్మించారు బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ . ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో కొలువుదీరిన ఈ అందమైన భవనం ఆర్కే బంగ్లా (కృష్ణ రాజ్ బంగ్లా) కొన్ని దశాబ్దాలుగా పాపులర్ అయింది. అయితే రిషి కపూర్ , నీతూ వివాహం సందర్భంగా ఈ బంగ్లా పేరును 'కృష్ణ రాజ్ బంగ్లా'గా మార్చారట. దాదాపు 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో రాజ్ కపూర్, భార్య కృష్ణ కపూర్, పిల్లలందరూ నివసించారు. రాజ్ కపూర్ పిల్లలు రిషి కపూర్, రణధీర్, రాజీవ్ కపూర్ ఈ బంగ్లాలో వివాహం చేసుకున్నారు. గత 76 ఏళ్లుగా, కపూర్ కుటుంబంలోని వివాహాలు, పెద్ద పెద్ద ఈవెంట్లకు ఈ బంగ్లానే వేదిక కావడం విశేషం. -
ఆ స్టార్ హీరోతో లతాజీకి వాగ్వాదం.. అయినా సరే నో చెప్పింది
When Lata Mangeshkar Refused To Sing Raj Kapoor Song: లతా మంగేష్కర్ లెగసీ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగీత సరస్వతి ఆవిడ. చిన్న వయసులోనే స్టార్ సింగర్‌గా ఫేమ్ తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే ఎడిటింగ్‌లో ఆ పాటను తీసేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. అసలు ఆమె కాల్షిట్ల కోసం సంగీత దర్శకులు పోటీ పడేవారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే లతాజీ సినిమాల్లో ద్వందర్థాలు వచ్చే పాటలు పాడేందుకు ససేమీరా నిరాకరించేవారు. అలా ఆమె పాడనని మొండికేయడంతో ఎన్నో పాటల లిరిక్స్‌ని సైతం మార్చాల్సి వచ్చింది. 1964లో సంగం సినిమా కోసం 'మై కా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గాయా' పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్‌కపూర్‌తో గంటన్నరకు పైగా లతాజీకి వాగ్వాదం జరిగింది. పాటలో సాహిత్యం బాగుందని ఎంతగా నచ్చజెప్పినా లతాజీ మాత్రం వినలేదట. దీంతో ఆ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఆ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీ ఇంతవరకు ఆ పాటను కానీ, ఆ సినిమాను కానీ చూడలేదని లతాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. చదవండి: లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా? -
బాలీవుడ్ నటుల ఇళ్లు కొంటాం: పాక్
ఇస్లామాబాద్: బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇవి శిథిలావస్థలో ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. నేషనల్ హెరిటేజ్‌గా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ భవనాలు పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్నాయి. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ పంపారు. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో దిగ్గజ నటుడి తాత దేవాన్ బాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు. రాజ్ కపూర్, అలానే అతని మామ త్రిలోక్ కపూర్ ఈ భవనంలో జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.(చదవండి: గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం) ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 100 సంవత్సరాల పురాతన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని సంరక్షించాలని పురావస్తు శాఖ భావించింది. దాంతో అలాంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ మాట్లాడుతూ.. ఈ భవనాన్ని కూల్చివేయడానికి తాను ఇష్టపడనని, దేశ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులతో అనేక సార్లు విన్నవించానని తెలిపారు. దీన్ని ప్రభుత్వానికి అమ్మేందుకు యజమాని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.(చదవండి: బాలీవుడ్ నటుడి ఇంట మరో విషాదం) ఈ ఏడాది ముంబైలో మరణించిన రిషి కపూర్ చేసిన అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చాలని 2018 లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఈ ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇవేకాక పెషావర్‌లో సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్ని 300 సంవత్సరాలకు పూర్వం నాటివి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- రాజ్ కపూర్
-
హిందీ తెరకు రొమాంటిక్ హీరో..
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, చాకొలెట్ బాయ్‌గా పేరొందిన రిషి కపూర్ శాశ్వత నిద్రలోకి జారుకుని అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. కొంతకాలంగా కాన్సర్‌తో పోరాడిన ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య నీతూ కపూర్, కుమార్తె రిధిమా కపూర్ సాహ్ని, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్నారు. కాగా గత కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందిన రిషి కపూర్ కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన జర్నీ గురించి పంచుకునేవారు. ఎల్లప్పుడూ సరదాగా ఉండే ఆయన ఇలా అకస్మాత్తుగా కానరానిలోకాలకు తరలివెళ్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిషి కపూర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఇక సినీ కుటుంబం నుంచి బాలీవుడ్ తెరపై అడుగుపెట్టిన రిషి కపూర్ తనదైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రిషి కపూర్ సినీ ప్రస్థానంలోని కొన్ని సినిమాల విశేషాలు.(ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) బాబీ రిషి కపూర్ తండ్రి, లెజెండరీ రాజ్ కపూర్ సారథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఇది. డింపుల్ కపాడియా, రిషి కపూర్ జంటగా నటించారు. 1973లో విడుదలైన ఈ సినిమాతో రిషి కపూర్ రూపంలో హిందీ తెరకు మరో రొమాంటిక్ హీరో దొరికాడు. ఖేల్ ఖేల్ మే రవి టాండన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1975లో విడుదలైంది. రిషి కపూర్, నీతూ సింగ్, రాకేశ్ రోషన్ ఈ సినిమాలో కాలేజీ విద్యార్థులుగా నటించారు. భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నవ యుగపు ప్రణయ దృశ్యకావ్యాలను తెరపై ఆవిష్కరించింది. ఇక ఈ సినిమాలో నటించిన నీతూ సింగ్ రిషిని వివాహమాడి నీతూ కపూర్‌గా మారారు. కర్జ్ 1980లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. షౌమన్ సుభాష్ ఘాయ్ సారథ్యంలోనే తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కభీ కభీ బాలీవుడ్ దిగ్గజం యశ్ చోప్రా రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, రాఖీ, శశి కపూర్, వహీదా రెహమాన్‌లతో రిషి కపూర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1976లో ఈ సినిమా విడుదలైంది. లైలా మజ్నూ హర్నం సింగ్ రావేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1976లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషి కపూర్, రంజీత, డానీ, అరుణ్ ఇరానీ తదితరులు నటించారు. మదన్ మోహన్, జైదేవ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. అమర్ అక్బర్ ఆంటోని అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 1977లో విడుదలైంది. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెస్ట్ యాక్షన్ కామెడీగా నిలిచింది. షబానా అజ్మీ, నీతూ సింగ్, పర్వీన్ బాబీ, ప్రాణ్, జీవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ రాగ్ వితంతువును పెళ్లాడలనుకునే ఓ యువకుడి కథ ఇది. రిషి కపూర్, పద్మిణీ కొల్హపురి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా సామాజిక అంశాల గురించి చర్చించింది. రాజ్ కపూర్ ఈ సినిమాకు సారథ్యం వహించారు. నగీనా 1986లో విడుదలైన ఈ సినిమాలో రిషి కపూర్, శ్రీదేవి జంటగా నటించారు. హర్మేశ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిషి కపూర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో హృతిక్ రోషన్, సిద్దార్థ్ మల్హోత్రా యువతరం నటులతో కూడా తెర పంచుకున్నారు. అగ్రిపథ్, కపూర్ అండ్ సన్స్, జూతా కహీ కా వంటి సినిమాల్లో నటించారు. -
శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం
సీనియర్ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్ కుమారుడు షారూఖ్‌కపూర్ అనారోగ్యంతో సోమవారం మక్కాలో మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తాలాట్టు కేట్కు దమ్మా, అవ న్ వరువాళా, ఆనంద పూంగాట్రు తదితర చిత్రాల దర్శకుడు రాజ్‌కపూర్. ఈయనకు భార్య సజీలాకపూర్, కుమారుడు షారూఖ్‌కపూర్, కుమార్తెలు షమీమా, షాని యా ఉన్నారు. కొడుకు షారూఖ్కపుర్ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్యం బాగు అయితే మక్కా కు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట. షారూక్కపూర్కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్ భార్య కొడుకును తీసుకుని మక్కా కు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌కపూర్ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వాతావరణ ప్రభావం అని భావించిన అతని తల్లి ఉదారంగా ఉన్నారు. దీంతో షారూఖ్‌కపూర్ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ధిగ్భ్రాంతికి గురైంది. షారేఖ్కపూర్ మయసు 23 ఏళ్లు. చదువు పూర్తి కాగానే నటనలో శిక్షణ ఇప్పించాలని తండ్రి రాజ్‌కపూర్ భావించారట. అయితే చిన్న వయసులోనే షారూక్కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. -
మా వియ్యపురాలు ఇకలేరు: అమితాబ్
బాలీవుడ్ అలనాటి హీరో రాజ్ కపూర్ కుమార్తె, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వియ్యపురాలు రీతూ నంద(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రీతూ.. ఢిల్లీలో మంగళవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బిగ్ బీ... ‘ మా వియ్యపురాలు, శ్వేత అత్తమ్మ రీతూ నంద హఠాన్మరణం చెందారు. ఉదయం 1.15 నిమిషాలకు కన్నుమూశారు. ప్రస్తుతం నేను ప్రయాణంలో ఉన్నాను’ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. కాగా రాజ్ కపూర్ పెద్ద కుమార్తె రీతూ వివాహం వ్యాపారవేత్త రాజన్ నందాతో జరిగిన విషయం తెలిసిందే. వీరి కుమారుడు నిఖిల్ నందా.. అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతాను పెళ్లిచేసుకున్నారు. ఇక కపూర్ కుటుంబంలో పెద్దక్క(రిషీ, రణ్‌ధీర్, రాజీవ్, రీమా కపూర్ల సోదరి)గా పేరొందిన రీతూ మరణంపై ఆమె మరదలు, రిషీ కపూర్ భార్య నీతూ కపూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నా ప్రియమైన రీతూ... నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. రీతూ మేనకోడలు, రిషీ కుమార్తె రిధిమా సైతం..‘ మీ అంత దయకలిగిన వ్యక్తిని నా జీవితకాలంలో ఎన్నడూ చూడలేదు. మీకు ఎవరూ సాటిరారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అత్తా’ అని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. కాగా రీతూ నంద భర్త రాజన్ నందా 2018లో మరణించిన విషయం విదితమే. View this post on Instagram To the kindest most gentle person I‘ve ever met - They don’t make them like you anymore - RIP bua #missyoualways❤️🙏🏻 A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Jan 13, 2020 at 8:06pm PST -
విషాదంలో షారూక్ ఖాన్
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ విషాదంలో మునిగిపోయారు. ఫౌజీ టెలివిజన్ షోతో షారూక్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కల్నల్ రాజ్ కపూర్ (87) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని రాజ్ కపూర్ కుమార్తె రితంబర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజ్‌కపూర్ మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. ‘ప్రియమైన మా తండ్రిగారు రాజ్‌కుమార్ భువినుంచి దివికేగారం’టూ ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయన కుమార్తె వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆయన వయసు సంబంధిత కారణాల రీత్యా అనారోగ్యానికి గురయ్యారనీ, చికిత్స పొందుతూ ఆకస్మాత్తుగా చనిపోయారనీ... గురువారం ఆయన అంత్యక్రియలు పూర్తి అయినట్టు రితంబర్ తెలిపారు. కాగా ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేసిన రాజ్‌కపూర్ ఓషో శిష్యరికం తీసుకున్నాక..ఆర్మీకి రిజైన్ చేసి ముంబైలో సెటిల్ అయ్యారు. అనంతరం అనేక టీవీ సీరియళ్లను నిర్మించారు, కొన్నింటిలో నటించారు కూడా. మూడు యుద్ధాల్లో పాల్గొన్నా, నటుడిగా , నిర్మాతగా రాణించినా రాని గుర్తింపు 20 ఏళ్ల క్రితం పరిచయం చేసిన షారూక్ ఖాన్ ద్వారా లభించిందని సమార్ ఖాన్ రాసిన ‘ఎస్ఆర్కే 25 ఇయర్స్ ఆఫ్ ఏ లైఫ్’ అనే పుస్తకంలో రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అయితే సరియైన పాత్రకు, సరియైన వ్యక్తిని ఎంచుకోవడమే మాత్రమే తప్ప ఇందులో తన గొప్పతనమేమీ లేదని గుర్తు చేసుకున్నారు. అతని తల్లిదండ్రులే షారూక్‌ను సూపర్‌స్టార్‌గా మలిచారని తాను కాదని చెప్పారు. -
సింగిల్ అంటే ఒకరుకాదు
సింగిల్ పేరెంట్ అంటే అమ్మా లేక నాన్న కాదు. అమ్మానాన్న రెండూ! ఇద్దరి ప్రేమనూ ఆ ఒక్కరే పంచాలి. రెండు బాధ్యతలు తీసుకోవాలి. సింగిల్ పేరెంట్ కావడానికి కారణాలు, వాటి నేపథ్యాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ నిలబడే తీరు ఒకటే.. స్థయిర్యంగా. ఛాలెంజెస్ను ఎదుర్కొనే ఆయుధమూ ఒకటే.. ఆత్మ విశ్వాసం! ‘‘భార్యాభర్తలు విడిపోవచ్చు.. కానీ అమ్మానాన్నా విడిపోకూడదు’’..‘భామనే సత్యభామనే’ అనే సినిమాలోని డైలాగ్. వినడానికి బాగుంది. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. అమ్మానాన్న మానసికంగా విడిపోయాక కూడా వాళ్లు భార్యాభర్తలే. పిల్లల కోసం ఒకే చూరు కింద సర్దుకుపోయే భార్యాభర్తలు. కొన్ని జంటల విషయంలోనే విడాకులు తప్పనిసరవుతాయి. అమ్మా... నాన్న.. ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటే సింగిల్ పేరెంట్ ప్రయాణం కాస్త తేలిక కావచ్చు. లేకపోతే.. సామాజికపరమైన సవాల్ అదనం. ముఖ్యం గా ఆడవాళ్లకు. నైతిక స్థయిర్యం చాలా అవసరం. అలా సింగిల్ హ్యాండెడ్‌గా పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన సింగిల్ పేరెంట్స్ సినిమా ఫీల్డ్‌లో చాలా మందే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ బాలీవుడ్. సినిమా కథకేమీ తీసిపోని జీవితాలు వాళ్లవి. వాళ్లెవరో చూద్దాం. బబిత బబిత... బాలీవుడ్ నటి. హిందీ సినిమా లెజెండ్ రాజ్‌కపూర్ పెద్ద కోడలు. నటుడు రణధీర్ కపూర్ భార్య. కరిష్మా, కరీనా కపూర్ల తల్లి. భార్యాభర్తలుగా బాగున్నారు. అమ్మానాన్న అయ్యాకే గొడవలు మొదలయ్యాయి. కరిష్మాను నటిని చేద్దాం అని బబిత తల్లిగా బిడ్డ పట్ల ఉన్న తన కోరిక చెప్పగానే తండ్రిగా రణధీర్ కపూర్ వద్దు అన్నాడు. ఈ స్పర్థ ఇంకా అనేక గొడవలకు దారితీసి.. ఎడతెగని వాగ్వివాదాలతో ఆ ఆలుమగలు విడిపోవడం అనివార్యం అయింది. కరిష్మా, కరీనాల బాధ్యత బబితే తీసుకుంది. ఒంటరి తల్లిగా ఆ ఇద్దరినీ పెంచి, పెద్దచేసి తాను నటీమణులుగా నిలబెట్టింది. 2007లో పిల్లలిద్దరూ తమ తల్లిదండ్రులను ఒకే కప్పు కిందకు తెచ్చారు. అమ్మానాన్నగా మాత్రమే కలిసి ఉంటున్నారంతే! అమృతాసింగ్ బాలీవుడ్ నటిగా అందరికీ తెలుసు. సైఫ్ అలీఖాన్ మాజీ భార్యగానూ అంతే పరిచయం. ఈ జంట పిల్లలే సారా అలీఖాన్, ఇబ్రహీం. సారా అలీఖాన్ కూడా ‘కేదార్నాథ్’ సినిమాతో ఈ మధ్యే బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. సారా, ఇబ్రహీంలకు లోకజ్ఞానం వచ్చేటప్పటికే వాళ్ల అమ్మానాన్నా విడిపోయారు. పిల్లలిద్దరినీ అమ్మ అమృతే పెంచింది. నీలిమా అజీమ్ నీలిమా కూడా నటే. కాని షహీద్ కపూర్‌కి అమ్మగానే ఎక్కువ మందికి పరిచయం. నటుడు పంకజ్ కపూర్, నీలిమాలది ప్రేమ వివాహం. షహీద్ కపూర్‌కి మూడేళ్లప్పుడు ఈ ఇద్దరూ విడిపోయారు. షహీద్ తల్లి దగ్గరే పెరిగాడు. తండ్రితోనూ షహీద్‌కు మంచి అనుబంధమే ఉంది. అదంతా నీలిమా పెంపకం గొప్పదనమే అంటారు బాలీవుడ్ ఫోక్స్. షహీద్ కపూర్ బాలీవుడ్ జర్నీ మొత్తం బాక్సాఫీస్ హిట్లుగానే సాగలేదు. అతని ఫెయిల్యూర్స్‌లో వెన్నంటి ఉంది నీలిమే. కొడుకు మానసిక స్థితిని అర్థం చేసుకుని అండగా నిలబడింది. పూజా బేడీ సంచలన నటి. సినిమాల కన్నా ఆమె నటించిన యాడ్స్‌తో ఎక్కువ పాపులర్ అయింది. నటుడు కబీర్ బేడీ – నర్తకి, మోడల్ ప్రతిమా బేడీల ముద్దుల కూతురు. పూజా వైవాహిక జీవితమూ కష్టాలమయమే. బజినెస్ టైకూన్ ఫర్హాన్ ఇబ్రహీమ్‌ను పెళ్లిచేసుకుంది. ఆలియా, ఒమర్ (కూతురు, కొడుకు) పుట్టాక ఫర్హాన్ ఇబ్రహీమ్‌తో సాహచర్యం పూజకు కన్నీళ్లనే మిగిల్చింది. పిల్లలను తీసుకొని ఆ గడపదాటింది. ఒంటరి తల్లిగానే పిల్లల మంచిచెడుల బాధ్యతలను భుజాలకెత్తుకుంది. కోరుకున్న పేరెంటింగ్ కరిష్మా, కొంకణాసేన్‌లు కూడా సింగిల్ మదర్ జాబితాలో ఉన్నారు. వీళ్లు కాక.. బై చాయిస్ అంటే పెళ్లి, విడాకులతో సంబంధం లేకుండా కూడా సింగిల్ మదర్‌గా పిల్లలను పెంచుతున్న సెలబ్రిటీలు ఉన్నారు. రవీనా టాండన్.. అనిల్ థడానీతో పెళ్లికంటే ముందే పూజ, ఛాయ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ కూడా ఈ విషయంలో రవీనాను ఆదర్శంగా తీసుకున్నట్టుంది. పాతికేళ్ల వయసులోనే ఆడపిల్లను దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో ఇంకో పాపనూ అడాప్ట్ చేసుకొని సింగిల్ మదర్‌గానే వాళ్లను పెంచుతోంది. నీనా గుప్తా.. థియేటర్ అండ్ బాలీవుడ్ నటి. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌ను ఇష్టపడింది. పెళ్లిబంధం లేకుండానే మసాబాను కన్నది. అంతే ఇష్టంగా వివ్ రిచర్డ్స్ తోడు లేకుండానే మసాబాను పెంచి పెద్ద చేసింది. మసాబా... సెలెబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. అపర్ణా సేన్ నటి, దర్శకురాలు అయిన అపర్ణాసేన్ ప్రముఖ బాలీవుడ్ నటి కొంకణా సేన్ వాళ్ల అమ్మ, ఫిల్మీ లైఫ్‌లో గ్రేట్ సక్సెస్ సాధించిన అపర్ణ వైవాహిక జీవితంలో చేదునే చవి చూసింది. కొంకణా సేన్‌కు ఆరేళ్లున్నప్పుడు అపర్ణ తన భర్త ముకుల్ శర్మతో విడిపోయింది. అప్పటికే ఆమె నటిగా, దర్శకురాలిగా కూడా బిజీ.. ఇటు హిందీ, అటు బెంగాలీ భాషల్లో. అయినా కూతురిని తనే పెంచుకుంది. జీవితం ఏం ఇచ్చినా తీసుకోవాలి అన్నది అపర్ణాసేన్ ఫిలాసఫీ. ఆ తత్వాన్నే కూతురికీ బోధించింది. ప్రాక్టికల్‌గా ఉండడం నేర్పింది. అందుకే కొంకణా సేన్ చెప్తుంది.. ‘‘మొదట్లో అమ్మానాన్నా వేరువేరుగా ఉండడం మింగుడుపడలేదు. స్కూల్ ఫంక్షన్స్‌కి నా ఫ్రెండ్స్ పేరెంట్స్ కలిసి వచ్చి, మా అమ్మ మాత్రం ఒక్కతే వస్తుంటే నాకు దిగులుగా, బాధగా.. అనిపించేది. కానీ ఊహ తెలిసింతర్వాత.. మా ఇంటి పరిస్థితిని అమ్మ వివరిస్తుంటే.. అర్థమైంది. అందరి ఇళ్లు ఒకేరకంగా ఉండవని, అమ్మానాన్నలందరూ కలిసి ఉండరని. విడిపోవడం సాధారణ విషయమే అని, విడిపోయినా అమ్మా, నాన్న ఇద్దరూ పిల్లలకు ఉంటారు అని’’ అంటోంది. -
రాజ్‌కపూర్ భార్య కన్నుమూత
సాక్షి, ముంబై: బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత రాజ్ కపూర్ భార్య కృష్ణ కపూర్ (87) సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మరణించారని ఆమె పెద్ద కుమారుడు , బాలీవుడ్ నటుడు రణదీర్ కపూర్ వెల్లడించారు. నటులు రాజేంద్ర నాథ్, ప్రేమ నాథ్‌ల సోదరి అయిన కృష్ణ కపూర్ 1946,మే లో రాజ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. రాజ్‌కపూర్, కృష్ణకపూర్ దంపతులకు అయిదుగురు సంతానం. రణధీర్, రిషీ కపూర్, రాజీవ్ కపూర్ కొడుకులు, రితూ నందా, రిమా కపూర్ కుమార్తెలు. ఈ ఉదయాన్నే నా తల్లిని కోల్పోయాను, ఆమె ప్రశాంతంగా కన్నమూసారంటూ రణధీర్ కపూర్ ట్వీట్ చేశారు. రిషీ కపూర్ కుమార్తె రిధిమ ఇన్స్టాగ్రామ్ ద్వారా నాన్నమ్మకు సంతాపం తెలుపుతూ లవ్ యూ ఆల్వేస్..దాది అని పోస్ట్ చేశారు. మరోవైపు కృష్ణ కపూర్ మరణంపై చలన చిత్ర పరిశ్రమ పెద్దలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నటి రవీనా టాండన్ సహా పలువురు ప్రముఖులు సంతాప సందేశాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. -
అమ్మకానికి ఆర్కే స్టూడియో
ముంబై: ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ స్థాపించిన ముంబైలోని ఆర్కే స్టూడియోను అమ్మేయాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. 1948లో నిర్మించిన ఈ స్టూడియోలో చాలా భాగం గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దెబ్బతింది. మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే అమ్మేయాలని నిర్ణయించినట్లు రణ్‌ధీర్ కపూర్ తెలిపారు. ‘మేం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆర్కే స్టూడియోను అమ్మకానికి ఉంచాం’ అని ఆయన చెప్పారు. 1988లో రాజ్‌కపూర్ మరణం అనంతరం ఈ స్టూడియో బాధ్యతల్ని పెద్ద కుమారుడు రణధీర్ చూసుకుంటున్నారు. -
రీగల్‌లో ఆఖరి షో..హౌస్‌ఫుల్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత రీగల్ థియేటర్ ఆఖరి షోకు సిద్ధమవుతోంది. రాజ్‌కపూర్ బ్లాక్ బస్టర్ సినిమాలు సగం, 1964 నాటి మేరానామ్ జోకర్ సినిమాల ప్రదర్శనతో చరిత్రలో నిలిచిపోనుంది. దాదాపు 80 ఏళ్ల థియేటర్ ప్రస్థానం హౌస్‌ఫుల్‌తో ఆగిపోనుంది. కపూర్ కుటుంబానికి చెందిన సినిమా, నాటకరంగాలకు వేదిక అది. మహామహులు చూసేది ఇక్కడే: 1932వ సంవత్సరంలో బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైన ఈ థియేటర్లో ప్రప్రథమ ప్రధానమంత్రి జవాహర్‌లాల్‌నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీతోపాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లాంటి మహామహులు సినిమాలు చూశారు. అలనాటి చలనచిత్ర వైభవాన్ని చాటే చిత్రాలు, నర్గీస్, మధుబాల, దేవానంద్, రాజ్‌కపూర్ తదితర మహానటుల పోస్టర్లు ఇప్పటికీ రీగల్ కారిడార్లలో కనిపిస్తుంటాయి. థియేటర్ సిబ్బంది అంతా చివరి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారని థియేటర్ అకౌంటెంట్ అమర్‌సింగ్ వర్మ తెలిపారు. శుక్రవారం నాలుగు షోలు ముగిసిన తర్వాత సిబ్బందితో సహపంక్తి విందు ఏర్పాటు చేశామని చెప్పారు. చివరి ప్రదర్శన అయినప్పటికీ టికెట్ల ధరలను మాత్రం పెంచలేదని అన్నారు. ఇదివరకటి మాదిరిగానే రూ.80, రూ.100, రూ.120, రూ.200 గానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని తెలిపారు. ప్రస్తుతం థియేటర్ కోసం పనిచేస్తున్న 15 సిబ్బంది భవితవ్యంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మల్టీప్లెక్స్ నిర్మాణం: అయితే, థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచన యాజమాన్యానికి ఉందని, అది కార్యరూపం దాలిస్తే వీరందరికీ అందులో ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా ఈ థియేటర్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. బాబీ సినిమా మొదటి షోకు రీగల్‌నే వేదిక. గుడ్‌బైటు రీగల్.. డిమోలిష్. అడియోస్ రీగల్ థియేటర్ అంటూ సినియర్ నటుడు రిషి కపూర్ ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. -
మసకబారని మహానటి
నేడు సావిత్రి వర్ధంతి ఆమె పేరు నిశ్శంకర సావిత్రి. తెలుగు, తమిళ ప్రజల గుండెల్లో నుండి చెరిగిపోని మహానటి. ఏ పద్మ పుష్పమూ ఆమె సిగలోకి చేరలేదు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్నీ ఆమె అందుకోలేదు. రఘుపతి వెంకయ్య పురస్కారానికీ ఆమె నోచుకోలేదు. అయినా అవార్డులకు అతీతమైనది సావిత్రి. గత 100 ఏళ్లలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపుపొందిన ఎన్.టి. రామారావు ఆమె గురించి మాట్లాడుతూ – ‘‘సావిత్రితో నటించడం గొప్ప అనుభవం. ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదిద్దుతుంది. ఒక్కోసారి ఆమెను అందుకోగలమా! అని భయపడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అన్నారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు. శివాజీ గణేశన్ లాంటి గొప్ప నటుడు కూడా సావిత్రి సరసన నటించాలంటే ఒకింత జంకేవారు. వందేళ్లలో వచ్చిన అత్యుత్తమ భారతీయ చిత్రంగా ‘మాయాబజార్’ గుర్తింపు పొందింది. ఆ చిత్రం చూసిన రాజ్‌కపూర్ అట్లాంటిది వందేళ్లకు కూడా మళ్లీ రాదని చెప్పారు. ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మాయాబజారులో డ్యూయెట్లు పాడిన నేను హీరో కాదు. కృష్ణుడు పాత్ర వేసిన ఎన్.టి. రామారావు కూడా హీరో కాదు, ఘటోత్కచుని పాత్ర వేసిన ఎస్.వి. రంగారావు కూడా హీరో కాదు. ఆ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే... సావిత్రి’ అన్నారు. ప్రముఖ చిత్రం మిస్సమ్మలో ఎన్.టి. రామారావు, సావిత్రి ఒక జంటగా; నాగేశ్వరరావు, జమున ఒక జంటగా నటించారు. మొదట్లో ఆమె పోషించిన (మేరీ / మహాలక్ష్మి) పాత్రకు సావిత్రిని అనుకోలేదు. ఆమె స్థానంలో భానుమతి ఉండాల్సింది. జమున (సీత) పాత్రకు సావిత్రి ఉండాల్సింది. నిర్మాతలు ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. నిర్మాణ సమయంలో భానుమతి ఆలస్యంగా వస్తున్నారని, చక్రపాణి ఆమె ఎదుటనే అంతవరకు తీసిన 4 రీళ్లను తగులబెట్టి, ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చి ఇంటికి పంపారు. (నిజానికి, భానుమతి ఆలస్యంగా రావడానికి ఆ సమయంలో ఆమె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాలు కారణం). భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సావిత్రి ఉండాల్సిన స్థానంలో జమునను తీసుకొని సినిమాను పూర్తి చేశారు. తరువాతి జీవితంలో ఈ విషయాన్ని తాత్వికంగా తీసుకున్న భానుమతి ‘‘పోనీ లెండి, నా మూలాన ఒక మహానటికి అవకాశం వచ్చింది కదా!’’ అని నచ్చచెప్పుకున్నారు. సావిత్రి పుట్టింది చిర్రావూరు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. (డిసెంబర్ 6, 1935) (విక్కీపీడియాతో సహా అనేక చోట్ల ఆమె జన్మించింది. జనవరి 4, 1936గా నమోదయింది. అనేక వ్యయప్రయాసలకోర్చి రచించిన ‘ఎ లెజెండరీ యాక్ట్రెస్, మహానటి సావిత్రి’ పుస్తకంలో వీఆర్ మూర్తి, వీ శోభరాజుగార్లు జనన–మరణ రిజిస్టర్ని అడిగి, పక్కా ఆధారాలతో ఆమె పుట్టిన తేదీని డిసెంబర్ 6, 1935గా నిర్ధారించారు) ఆరు నెలల వయస్సులో తండ్రి నిశ్శంకర గురవయ్య మరణించారు. సంగీతం, నృత్యం అభ్యసించిన సావిత్రి, సుంకర కనకారావు ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ సంగీత నాట్యమండలి, ఎన్.టి. రామారావు బావగారైన పుండరీకాక్షయ్య ఆధ్వర్యంలో నడిచే నేషనల్ ఆర్ట్స్ థియేటర్, పెదనాన్న కె.వి. చౌదరి నడిపించే నవభారత నాట్యమండలి తరఫున నాటకాల్లో కొంతకాలం నటించింది. తరువాత సినిమాల కోసం ఆ కుటుంబం మద్రాసు వెళ్లింది. కోన ప్రభాకరరావుకు రాజకీయ నేపథ్యంతో పాటు కళలపై అభినివేశం ఉంది. ఆయన బాపట్లలో పుట్టి మద్రాసులో లా పూర్తిచేశారు. 1967, 1972, 1978లో కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి ఎన్నికైనారు. కొంతకాలం ఆం.ప్ర. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980–81లో అసెంబ్లీ స్పీకర్‌గా, భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా, పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రల గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాలకంటేSముందు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. 1949లో కె.ఎస్. ప్రకాశరావు నిర్మించి, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘ద్రోహి’ చిత్రంలో ప్రతినాయకుడి భూమిక పోషించారు. 1951లో ఆయన దర్శకత్వం వహించిన ‘రూపవతి’ నటనాపరంగా సావిత్రికి మొదటి చిత్రం. అంతకుముందు ‘సంసారం’ చిత్రంలో నాగేశ్వరరావు సరసన నటించడానికి అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ప్రఖ్యాతులైన నాగేశ్వరరావు సరసన మొదటిసారే నటిస్తున్నప్పుడు కలిగే సహజమైన భయాందోళనలతో నామమాత్రమైన చిన్న పాత్ర పోషించింది. తరువాత ‘పాతాళభైరవి’లో ఓ నృత్యానికి మాత్రమే పరిమితమైంది. ఆ రకంగా చూస్తే సినిమా రంగంలో సావిత్రిది గతుకుల ఆరంభమనే చెప్పాలి. 1952లో వచ్చిన ‘పెళ్లిచేసి చూడు’, తమిళ సినిమా ‘కళ్యాణం పన్నిపార్’ సావిత్రిని సినిమా రంగంలో నిలదొక్కుకోనిచ్చాయి. 1953లో వచ్చిన ‘దేవదాసు’ సినిమా ఆమెకు పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. 1952లో సావిత్రికి జెమినీ గణేశన్‌తో మద్రాసులోని చాముండేశ్వరి దేవాలయంలో రహస్యంగా పెళ్లయింది. చాలారోజుల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్నేళ్ల తర్వాత లక్స్ సబ్బు అడ్వర్టయిజ్మెంట్ కోసం సావిత్రి గణేశ్ అని సంతకం చేయడంతో అది బయటకు పొక్కింది. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌తో మరో పెళ్లికి తన తల్లి, పెదనాన్న ఒప్పుకోరని పెళ్లిని రహస్యంగా ఉంచింది సావిత్రి.జెమిని గణేశన్‌ను ఒక జ్చిbజ్టీu్చ∙lౌఠ్ఛిటగా భావించవచ్చు. ఆయనది ఆడవాళ్లను ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ. ఈ విషయంలో ఆయనకు, ప్రముఖ హాలీవుడ్ నటుడు గ్యారీ కూపర్‌కు పోలికలున్నాయంటారు. అలమేలు అనే ఆవిడతో ఆయనకు అసలు పెళ్లి జరిగింది. ఆ తరువాత తెలుగు నటి పుష్పవల్లితో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రముఖ హిందీ నటి రేఖ, ఆమె చెల్లెలు రాధ వారి సంతానం. 1966లో 12 ఏళ్ల ప్రాయంలో, తెలుగు సినిమా ‘రంగులరాట్నం’తో సినీరంగ ప్రవేశం చేశారు రేఖ. పుష్పవల్లి సోదరి సూర్యప్రభ వేదాంతం రాఘవయ్య (దేవదాసు సినిమా దర్శకుడు) గారి భార్య. జెమినీ గణేశన్‌కు సావిత్రికి సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లికి దారితీసింది. (సాంకేతికంగా జెమినీ గణేశన్కిది రెండవ పెళ్లి). వారి సంతానం విజయ చాముండేశ్వరి, శ్రీరామ నారాయణ సతీష్‌కుమార్. విజయ చాముండేశ్వరి మద్రాసులోనూ, సతీశ్‌కుమార్ అమెరికాలోనూ స్థిరపడ్డారు. జెమినీ గణేశన్‌తో పెళ్లయిన తరువాత 15, 20 ఏళ్ళ దాకా తాను తప్పు చేశానేమో అన్న సందేహం అంతగా కలగలేదు సావిత్రికి. తన భార్య అలమేలుకు, తమ ఇద్దరి మధ్య ప్రేమ గురించి తెలుసనీ, ఆమెకు తన సంబంధం పట్ల అభ్యంతరం లేదని జెమినీ గణేశన్ చెప్పడమూ ఒక కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత జెమినీ గణేశన్ నిరాదరణతో సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది. సావిత్రికి నటనాపరంగా అత్యుత్తమ పురస్కారం ‘చివరకు మిగిలేది’ చిత్రం ద్వారా లభించింది. 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రానికి ప్రముఖ రచయిత బుచ్చిబాబు అదే పేరుతో రాసిన గొప్ప నవలకు సంబంధం లేదు. ఆయన పేరు మెన్నేని సత్యనారాయణ. మూడుసార్లు ఎంపీగా, ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా, వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ సభ్యునిగా వ్యవహరించారు. అడపాదడపా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ విలేకరుల నుండి ఆదరణ పొందారు. సత్యనారాయణరావు గారిని కలుపుకుని ‘చివరికి మిగిలేది’ చిత్ర నిర్మాతలు దాదాపు 10 మంది. ఇందులో ముఖ్యులు అప్పుడు యువజన కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న సత్యనారాయణరావు, వి. పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి. ఈ విషయం తెలిసి అప్పటి మంత్రివర్గ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ‘వీరు ఉత్సాహవంతులైన యువకులు, వీరికి సహాయం చేయండి’ అని కోరారు. నిర్మాతలు నాగేశ్వరరావుని నటించమని కోరారు. అయితే, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల అమెరికాకు వెళ్లవలసి వస్తుందనీ, ఫలితంగా షూటింగ్‌కు అంతరాయం కలగొచ్చనీ, అందువల్ల నటించలేనని చెప్పారు. బాలయ్య, కాంతారావుల పేర్లను నిర్మాతలకు సూచించి, స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించారు. నిర్మాతలు మద్రాసులో సావిత్రిని కలిసి చిత్రంలో నటించమంటే, తన షెడ్యూల్ చాలా బిజీగా ఉందనీ, నటించలేనని చెప్పారు. బలమైన కారణం మాత్రం నిర్మాతలు అపరిచితులు, కొత్తవారు కావడమే. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, వి. పురుషోత్తంరెడ్డి, యం సత్యనారాయణరావులు నాగేశ్వరరావును కలిసి ‘ఏ విధంగానైనా మీరు ఆమెను ఒప్పించాలి’ అని ప్రాధేయపడ్డారు. నాగేశ్వరరావు సావిత్రికి ఫోన్ చేసి, ‘చూడు సావిత్రీ... మనం అర్టిస్టులం. మన తృప్తికొరకు మనం కొన్ని చేయాలి. మనం బతకాలంటే ప్రజల తృప్తి కొరకు ఎక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది. నీకు ఈ సినిమా అపారమైన పేరు తెచ్చిపెడుతుంది’’ అని చెప్పారు. సావిత్రి ఒప్పుకుంది.నాగేశ్వరరావు అటు బాలయ్య, కాంతారావులను, ఇటు సావిత్రినే కాకుండా మద్రాసులోని విజయా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సహకరించమని చెప్పారు. చివరకు మిగిలేది ఇతివృత్తం – ఒక మానసిక రోగిని మామూలు మనిషిని చేయడానికి నర్సు అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. పోనుపోను నటనకు, ప్రేమకు హద్దు చెరిగిపోయి అతనితో నిజంగానే ప్రేమలో పడుతుంది. అతను మామూలు మనిషవుతాడు. నర్సు ప్రేమ రోగి అవుతుంది. ఇక మరో వృత్తాంతం ఏమిటంటే... మందాడి ప్రభాకర్‌రెడ్డి అనే ఆర్టిస్టుది నల్గొండ జిల్లా. తుంగతుర్తి పట్టణం. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. 1955 నుండి 1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివారు. 1959లో విడుదలైన ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమా దర్శకుడైన గుత్తా రామినీడు ‘చివరకు మిగిలేది’ సినిమాకు కూడా దర్శకుడు. ‘మా ఇంటి మహాలక్ష్మి షూటింగ్ కొరకు హైదరాబాద్‌కు వచ్చిన రామినీడు అంతర్గత కళాశాలల నాటక పోటీలో బహుమతి ప్రదానోత్సవానికి వచ్చారు. అక్కడ బహుమతి అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తరువాత రామినీడును కలిసి ‘నేను సినిమాలకు పనికొస్తానా?’ అని అడిగారు. రామినీడు అతనికి ధైర్యం చెప్పారు. రామినీడు ‘చివరికి మిగిలేది’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు ప్రభాకర్‌రెడ్డిని గుర్తుపెట్టుకుని అతనికి డాక్టర్ పాత్రలో సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చారు. అయితే.... అప్పటికే ఉన్నత శిఖరాన్ని చేరుకున్న సావిత్రితో నటించడానికి, అప్పుడే ఎంట్రీ చేసిన ప్రభాకర్‌రెడ్డి మానసికంగా సిద్ధంగా లేరు. ఒక సన్నివేశంలో, సావిత్రిని ప్రభాకర్‌రెడ్డి చెంపదెబ్బ కొట్టాలి. ఆ పని చేయడానికి ఆయనకు ముచ్చెమటలు పోస్తున్నాయి. పరిస్థితి గమనించిన సావిత్రి ఒక మగ జూనియర్ ఆర్టిస్టును పిలిచి చెంపదెబ్బ కొట్టారు. ఆ సందర్భంలో ఒక మహిళ మరో మగవాడిని చెంపదెబ్బ కొట్టడం ప్రొవొకేటివ్గా పనిచేసింది. ప్రభాకర్‌రెడ్డికి ధైర్యం చెప్పి రిలాక్స్డ్గా నటించమని ప్రోత్సహించారు సావిత్రి. సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా ముగిసింది. ఆ తరువాత ప్రభాకర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 472 సినిమాల్లో నటించారు. 27 సినిమాలు నిర్మించారు. 21 చిత్రాలకు కథారచన చేశారు. ‘భూమికోసం’ చిత్రంలో నటించిన ప్రభాకర్‌రెడ్డి సలహా మేరకు అందులో తెరంగేట్రం చేసిన ‘లలితా రాణి’ పేరును ‘జయప్రద’గా (ఎం. ప్రభాకరరెడ్డి గారి వదిన పేరు జయప్రద) మార్చారు. ఈ చిత్రంలో పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.జి. సత్యమూర్తి (శివసాగర్) రెంజిమ్ పేరుతో రాసిన ‘చిన్నారీ చిలకమ్మా, చెల్లీ చంద్రమ్మా’ అనే పాటను జయప్రదపై చిత్రీకరించారు. సావిత్రి నటించి, ఆమె మృతి తరువాత. చివరిగా 1985లో విడుదలైన ‘అందరికంటే మొనగాడు’లో ప్రభాకర్‌రెడ్డి నటించడం ఒక ఆసక్తికరమైన ఘటన.‘చివరకు మిగిలేది’ సినిమా 1960 ఏడాదికి ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. సావిత్రి ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారమందుకున్నారు. తాను నటించిన చిత్రాలన్నిటిలోనూ ‘చివరకు మిగిలేది’లో పోషించిన పాత్ర తనకెంతో నచ్చిందని సావిత్రి చెప్పారు. అయితే ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ‘దేవదాసు (1953)’ పార్వతి పాత్ర, ‘కన్యాశుల్కం’ (1955)లో మధురవాణి పాత్ర, ‘మాయాబజార్’ (1957)లో శశిరేఖ పాత్ర, సావిత్రి నటజీవితంలో కలికితురాయిలని భావిస్తారు. కొంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, కొంత వితరణశీలిగా దానం చేసి, మరికొంత మత్తుపదార్థాల వ్యసనానికి బానిసై చాలా డబ్బు పోగొట్టుకుంది సావిత్రి. అదే కాకుండా సావిత్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్ని ఇన్‌కంటాక్స్ కేసుల్లో కరిగిపోయాయి. ఆమె కొన్నాళ్లు కూతురు విజయచాముండేశ్వరి దగ్గర ఉన్నారు. అయితే ఆమె పేదరికంలో చనిపోయిందని కొంతమందిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు. చనిపోయేనాటికి ఆమెకు కొన్ని ఆస్తులు మద్రాసు, హైదరాబాద్, బెంగుళూరులలోనూ ఉన్నాయని చెప్తారు. సినీ విమర్శకుడు నందగోపాల్‌కు ఇచ్చిన ఆఖరి ఇంటర్వూ్యలో సావిత్రి తన మనసులో మాటను వెలిబుచ్చారు. – ‘‘నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి. ‘జీవితంలోనూ, మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది. ఎవ్వరూ ఇచ్చట సానుభూతితో వేడి కన్నీటిబొట్టు విడువనక్కర్లేదు. సమాజం దృష్టిలో ఏ తారైనా హీనంగా చూడబడకుండా ఉండటానికి ఇచ్చట నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు స్మృతిచిహ్నంగా ఒక చిన్ని పూలమాలికను ఉంచండి. అది చాలు’’ అన్నారామె.ఆమెను మనం స్మరించుకున్న రోజున ఆమె అంగీకరించే ఒక చిన్ని పూలమాలికతోపాటు, ఆమె వారించినా కూడా, ఒక వేడి నిట్టూర్పును విడవకుండా ఉండలేం. ఒక బరువెక్కిన కన్నీటి చుక్కను కార్చకుండానూ ఉండలేం. సావిత్రికి వచ్చిన చెప్పుకోదగ్గ గుర్తింపులు: ► 1960లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నటనకు రాష్ట్రపతి పురస్కారం. ► 1961లో మద్రాసు ఆళ్వార్‌పేటలో ‘శ్రీనివాస గాంధీనిలయం’ అనే సామాజిక సేవా సంస్థ ‘నడిగయర్ తిలకం’ బిరుదునిచ్చి సత్కరించడం. నడిగయర్ తిలకం అంటే నటీశిరోమణి అని అర్థం. ► 1964లో ఆంధ్ర మహిళా సభకు అనుబంధ సంస్థ అయిన ఆంధ్ర యువతీ మండలి ‘మహానటి’ బిరుదునిచ్చి సత్కరించడం. ► 1968లో తమిళనాడు ప్రభుత్వం తరఫున, అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై గారి చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం. ► ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్త్రీ శిల్పులున్నారు. రాయిని ఉలితో కొడుతూ అందమైన శిల్పాన్ని శిల్పి సృష్టిస్తాడు. కేవలం ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నైనా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఇద్దరు మన తెలుగువారు కావడం యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం. మన సినిమా రంగంలోని ఆ స్త్రీ శిల్పులు సావిత్రి, జి. వరలక్ష్మి, మూడవ ఆమె హిందీ నటి మీనాకుమారి’’ – శ్రీశ్రీ. ► శ్రీశ్రీ ఉటంకించిన ముగ్గురు స్త్రీ శిల్పుల్లో ఒకరైన మీనాకు మారి సినిమాల్లో ఎక్కువగా దుఃఖపూరితమైన పాత్రలే పోషించారు. సావిత్రి కొన్ని సరదా పాత్రలు, కొన్ని సమతు ల్యమైన పాత్రలు, కొన్ని దుఃఖపూరితమైన పాత్రలు పోషిం చారు. ఇద్దరివీ సంతృప్తికరమైన వైవాహిక జీవితాలు కావు. ► గొప్ప నటి అయిన మీనా కుమారి సావిత్రి గురించి ఇలా చెప్పారు – ‘సావిత్రి నటన చూస్తుంటే చాలాసార్లు నా నటన గురించి నాకే సందేహాలు కలుగుతాయి. భావస్ఫోరకమైన కళ్లు, ఆకర్షణీయమైన పెదవులు, సందర్భోచితమైన హావభావాలు, అన్నీ కలిపి ఆమెను అత్యున్నత నటీమణుల సరసన ఉంచుతాయి.’’ ► సావిత్రికన్నా 7 సంవత్సరాలు పెద్దదైన, ముగ్గురు స్త్రీ శిల్పుల్లో మూడవ వారైన జి. వరలక్ష్మి సంతృప్తికరంగానే జీవితం గడిపారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్నమైన అనుభవాలను చవిచూశారు. నిర్మాత కె.ఎస్. ప్రకాశరావును పెళ్లి చేసుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1995లో రఘుపతి వెంకయ్య పురస్కారమిచ్చారు. ► ఒక సందర్భంలో జి. వరలక్ష్మి ‘అమాయకురాలైన సావిత్రికి రెండవ వివాహం చట్టరీత్యా చెల్లదని తెలియదు’ అని చెప్పడం జరిగింది. 78 ఏళ్ల చివరి దశలో జెమినీ గణేశన్ 36 ఏళ్ల క్రిస్టియన్ అమ్మాయి, నర్సు అయిన జూలియానాను పెళ్లి చేసుకున్నారు. ఈ దశలో పెళ్లేమిటని అడిగితే ముదుసలి దశలో పిన్నవయస్కురాలే సరైన పరిచర్యలు చేయగలుగుతుందన్నారు. కొంతకాలం తరువాత జూలియానా జెమినీ గణేశన్ నుండి విడాకులు తీసుకున్నారు. జీవితంలో సరైన ఆదరణ, ఆప్యాయత చూపని తండ్రి జెమినీ గణేశన్ దహన సంస్కారాలకు రేఖ వెళ్లలేదు. ► 1953లో వచ్చిన దేవదాసు చిత్రం సావిత్రి నటనా జీవితానికి ఒక పెద్ద మలుపు. సావిత్రి మాటల్లో – ‘‘నేను పార్వతి లాంటి కష్టమైన పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్రను పోషించవలసి వుందని తెలియగానే చక్రపాణి గారి పుస్తకం (దేవదాసు అనువాదం) అయిదుసార్లు చదివాను. ప్రతిసారి పార్వతి పాత్రలో లీనమైపోయేదాన్ని. ఆ పాత్రను గురించి తలచుకుంటేనే ఏడుపు వచ్చేది. నా పాత్రను నిర్వహించడానికి డైరెక్టరు గారు (వేదాంతం రాఘవయ్య) పూర్తి అవకాశాలిచ్చారు. నాకు తృప్తి లేక మళ్లీ షాట్ తీయమంటే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తీసేవారు. అనేకమార్లు నాకు ఆ సంభాషణలు చెబుతుంటేనే పార్వతి జీవితమంతా జ్ఞాపకం వచ్చి దుఃఖం పొంగివచ్చేది. అసలీ పిక్చర్లో గ్లిసరిన్ వాడే అవకాశమే కలగలేదు. షాట్ అయిపోయాక కూడా ఏడ్చేసేదాన్ని. ఒకవంక డైరెక్టర్ గారు (వేదాంతం రాఘవయ్య) కూడా ఏడ్చేస్తుండేవారు. మాకే విచిత్రంగా ఉండేది.’’ ► దానధర్మాల విషయంలో సావిత్రిది ఎముకలేని చెయ్యి. ఒకసారి ప్రఖ్యాత గాయని సుశీల సినీరంగంలోని సీనియర్ల సహాయార్థం విరాళాల కోసం సావిత్రి దగ్గరకు వెళ్లింది. సావిత్రి పర్సులో ఎంత డబ్బుంతో లెక్కపెట్టకుండానే ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేసింది. ఒకసారి ఒళ్లంతా బంగారు నగలు వేసుకుని తన భర్త జెమినీ గణేశన్‌ను వెంటబెట్టుకుని ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి మద్రాసుకు వచ్చినప్పుడు కలిసి, తాను ధరించిన ఒక్కొక్క నగను ఒలుచుకుంటూ జాతీయ రక్షణ నిధికి ఇచ్చివేశారు. పేద విద్యార్థుల సహాయార్థం ముఖ్యమంత్రి యంజిఆర్ వేసుకున్న పూలదండను వేలం వేస్తే అందరికంటే ఎక్కువ ధరకు పాడి, ఆ తరువాత కట్టడానికి చేతిలో డబ్బు లేక బంగారం అమ్మి అవస్థలుపడ్డ వ్యక్తి సావిత్రి. ► జ్ఞానపీuŠ‡ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ‘‘గాలి నిండా సువాసనను నింపే మంచి గ్రంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూర తునక వంటిది సావిత్రి!’’ అన్నారు. ► ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావుతో, బాపు, రమణలు అన్నారట – ‘‘ఈ విశ్వంలో మానవాళికి ... ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం! ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి!’’ వి.కె. ప్రేమ్‌చంద్ 98480 52486 – వి.కె. ప్రేమ్‌చంద్ -
లెజెండరీ నటుడి 'హవేలి'ని కూల్చేస్తున్నారు!
పెషావర్: పాకిస్థాన్ పెషావర్‌లోని బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజ్‌కపూర్‌కు చెందిన చారిత్రక నివాసాన్ని పాక్షికంగా కూల్చేశారు. ఈ నివాసం స్థానంలో ఓ ప్లాజా కట్టాలని భావిస్తున్న యజమానులు.. దాని మొదటి అంతస్తును కూల్చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఖైబర్ పఖ్తూన్ఖా అధికారులు కూల్చివేతను ఆపివేయించారు. స్థానిక కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకురావడం ద్వారా తాత్కాలికంగా కూల్చివేతకు బ్రేక్ పడింది. అయితే ఈ ఉత్తర్వులు వచ్చేలోపు యజమానులు 'హావేలి' (కోట) మొదటి అంతస్తును మొత్తం కూల్చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటులు రాజ్‌కపూర్, దిలీప్కపూర్ పెషావర్‌లో జన్మించారు. దీంతో వారి నివాసాలను చారిత్రక వారసత్వ సంపదగా కాపాడుతామని ఖైబర్ పఖ్తూన్కా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ రాజ్‌కపూర్ 'హవేలి' భారీగానే ధ్వంసమైంది. పాక్ ప్రభుత్వం ఏమైనా చేసుకోని! రాజ్‌కపూర్ నివాసాన్ని కూల్చివేయడంపై ఆయన కుమారుడు, నటుడు రిషి కపూర్ స్పందించారు. పెషావర్‌లోని తమ తాత పృథ్వీరాజ్ కపూర్ నివాసంతో తమకు ఎలాంటి భావోద్వేగమైన అనుబంధం లేదని, ఆ నివాసాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఏం కావాలంటే అది చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఆ నివాసాన్ని తామెన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. -
ముగ్గురు లెంజడరీ హీరోలు కలిసి పాడిన వేళ!
ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ అరుదైన ఫొటోను ట్విట్టర్లో తన అభిమానులతో పంచుకున్నారు. లెంజడరీ హీరోలు రాజ్‌కపూర్, శశికపూర్‌తో కలిసి తాను పాట పాడుతున్న ఫొటో అది. అలానాటి మధురజ్ఞాపకమది. 'అప్పట్లో సోవియట్ రష్యాలో ఉన్న తాష్కెంట్లో రాజ్‌కపూర్ జీ, శశికపూర్‌జీతో కలిసి 'సారే జహా సే అచ్చా' అనే పాట పాడాను' అంటూ ఆ జ్ఞాపకాన్ని బిగ్ బీ నెమరువేసుకున్నారు. ఈ ఏడాది 'పీకూ' సినిమాతో ఘనవిజయం సాధించిన అమితాబ్ బచ్చన్ త్వరలోనే 'వజీర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'వజీర్'లో ఫర్హాన్ అఖ్తర్, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. T 2096 - With Raj Kapoor ji and Shashi ji in Tashkent, then Soviet Russia .. singing 'sare jahan se achcha' ..! pic.twitter.com/HPtZreF2kk — Amitabh Bachchan (@SrBachchan) December 29, 2015 -
రాజ్‌కపూర్ టెక్నిక్
నాస్టాల్జియా బాబీ సినిమాతో రాజ్‌కపూర్ ఎక్స్పోజింగ్ సన్నివేశాలకు తెరలేపాడు. బాబీలో డింపుల్ కాపాడియాను ఆ తర్వాత సత్యం శివమ్ సుందరంలో జీనత్ అమాన్‌ను, ఆ తర్వాత రామ్ తేరి గంగామైలీలో మందాకినిని ఆయన చూపించిన తీరు వల్లే ఆ సినిమాలు ప్రేక్షకుల్లో కుతూహలం రేపాయన్నది వాస్తవం. అయితే ఇవన్నీ సెన్సార్‌ను దాటి ఎలా బయటపడినట్టు? దీనికి రాజ్‌కపూర్ ఒక టెక్నిక్ పాటించేవాడు. సెన్సార్ డేట్ వచ్చి లోపల కమిటీ సినిమా చూస్తూ ఉండగా నలిగిన పైజామా నలిగిన లాల్చీ వేసుకొని వెళ్లేవాడు. గడ్డం అప్పటికే మాసి ఉండేలా చూసుకునేవాడు. ఈ సినిమా లేకపోతే తన పరిస్థితి లేదు అన్నట్టుగా దిగాలు ముఖం పెట్టుకుని కూచునేవాడు. సినిమా చూసి బయటకొచ్చిన కమిటీ ఈయన ముఖం చూసి గట్టిగా కట్స్ చెప్పడానికి మొహమాట పడేది. సరేలే ఏదో పెద్దాయన... ఏడవనీ అని వదిలేసేది. రాజ్‌కపూర్ పథకం పారి పోస్టర్స్ అన్నీ హాట్ హాట్ స్టిల్స్‌తో నిండిపోయేవి.