rice prices
-
బియ్యం ధరలు పైపైకి.. వారంలోనే 15% పెరుగుదల
మార్కెట్లో బియ్యం ధరలు చూస్తే గుండె గుభిల్లుమంటోంది. రోజురోజుకీ సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలులేని అన్ సీజన్లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.కేవలం వారం రోజుల్లో దేశంలో బియ్యం ధరలు దాదాపు 10-15 శాతం వరకు పెరిగాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్ వాటా 45 శాతం వరకు ఉంటుంది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. అయితే, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతులపై సుంకాన్ని కేంద్రం మినహాయించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ సెప్టెంబర్ 28న కేంద్రం నిర్ణయం తీసుకుంది.కేంద్రం నిర్ణయంతో భారత్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో దేశంలో వారం వ్యవధిలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆఫ్రికాకు ఎక్కువగా ఎగుమతయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకుముందు రూ.35 కిలో ఉండగా ఇప్పుడు రూ.41కి పెరిగింది. బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల బియ్యం ధరలు 10-15 శాతం పెరిగాయని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారు. -
భగ్గుమంటున్న బియ్యం
సాక్షి హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నాణ్యమైన సన్న బియ్యం కొనాలంటే కిలోకు రూ.65 నుంచి రూ. 55కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఫస్ట్ క్వాలిటీ పాత సన్నబియ్యం కిలోకు రూ.45 నుంచి 50లోపు లభించేవి. ప్రస్తుతం కిలో రూ.65 నుంచి రూ 75 చెల్లిస్తే కాని మార్కెట్లో లభించడం లేదు. ఇక ఫస్ట్‌క్లాస్ కొలమ్ బియ్యం తినాలంటే మాత్రం రూ.80–85 చెల్లించాల్సిందే. గత, ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో కంటే 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అధికంగా సేకరణ జరిగిందని పౌరసరఫరాల అధికారులకు లెక్కలు చెబుతున్నాయి. డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం మార్కెట్‌కు వచి్చనా ధరలు మాత్రం తగ్గడం లేదు. ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ధరల నియంత్రణలో పౌర సరఫరాల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు, రిటైల్ వ్యాపారుల దగా.. జీఎస్టీ రాకముందు మిల్లర్లు, వ్యాపారులు ప్రతి క్వింటాల్‌పై 4 శాతం పన్నులు చెల్లించేవారు. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చాక వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగానే బియ్యంపై వ్యాట్‌ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు వరిని ధాన్యం రూపంలో చేసి తెలంగాణ వ్యాపారులకు అమ్మితే గతంలో ఉన్న 1 శాతం పన్నును 2019 జీవో నంబర్ 219 ద్వారా ప్రభుత్వం ఎత్తివేసింది. రైస్ మిల్లర్లు కేవలం 1 శాతం ప్యాడీపై మాత్రమే మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వచ్చాక 4 శాతం వ్యాట్‌ను ఎత్తివేశారు. 1 శాతం పన్నును కూడా ఎత్తి వేశారు. అయినా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. వ్యవసాయాధారిత ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పన్నులు ఎత్తివేసింది. కానీ కేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వ్యాపారులు పన్నులు చెల్లించినప్పుడు బియ్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పన్నులు రద్దు అయిన తర్వాత బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కొనుగోలుదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం సరైన రీతిలో పర్యవేక్షణ చేయని కారణంగానే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఉత్పత్తులు పెరిగినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం వరిధాన్యం ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు అందజేశారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద భారీఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద కూడా ప్రస్తుతం లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగానే బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం.పొంతన లేని ధరలు.. గ్రేటర్ పరిధిలో అధికారుల పర్యవేక్షణలో లేకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్లో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో 250 రైస్‌మిల్లర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రతి సంవత్సరం ఒక్కో మిల్లర్ వద్ద 40 నుంచి 50 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్టు పౌరసరఫరాల వద్ద లెక్కలు ఉన్నట్లు సమాచారం. గ్రేటర్లో రోజుకు 35 నుంచి 40 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం అవుతున్నట్టు అధికారుల అంచనా. బియ్యం వినియోగం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్‌కు రూ.3200 నుంచి రూ.3500 పలుకుతోంది. మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాల్‌కు రూ.6500 నుంచి రూ.7500 చేరింది. -
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
దేశంలో భారీగా పెరిగిన బియ్యం ధరలు!
భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి, ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా సుమారు రూ. 1500 పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో రూ. 4500 నుంచి రూ. 5000 వరకు ఉన్న క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 6200 నుంచి రూ. 7500కు చేరాయి. క్వింటాల్ ధరలు గతం కంటే కూడా రూ. 1000 నుంచి రూ. 15000 పెరిగింది. బియ్యం ధరలు పెరగటానికి ప్రధాన కారణం వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా.. వారి సాగు కూడా బాగా తగ్గడం అని సమాచారం. -
ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!
ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు. కాగా ఈ ధరలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది మున్ముందు తెలియాల్సి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు. బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్‌లాండ్, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: భారత్ బ్యాన్ డెసిషన్.. యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే.. -
రికార్డు స్థాయికి బియ్యం ధరలు.. తినలేం, కొనలేం!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం గత ఏడాది కిలోకు రూ.40 నుంచి రూ.45 పలికితే ప్రస్తుతం రూ.48 నుంచి రూ.55కు చేరాయి. డిమాండ్ కంటే ఎక్కువగా మార్కెట్‌కు బియ్యం నిల్వలు వస్తున్నా ధరలు మాత్రం తగ్గడంలేదు. వ్యవసాయాధారిత ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. వ్యాపారులు పన్నులు చెల్లించిన సమయంలో బియ్యం ధరలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పన్నులు రద్దయినా ధరలు పెరగడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇష్టారీతిన రిటైల్ వ్యాపారులు ► జంట నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన కుదరడంలేదు. ►గ్రేటర్ పరిధిలో దాదాపు 240 రైస్‌మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి రిటైల్ వ్యాపారులు తక్కువ ధరకే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ► ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాలు బియ్యానికి రూ.3,200 నుంచి రూ.3,600 పలుకుతున్నాయి. కానీ మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ► ప్రస్తుతం సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,500 చేరింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు 2,500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను శాసిస్తున్నారు. చిన్నాచితకా కిరాణా వ్యాపారులు సైతం ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. ►గత ఏడాది క్వింటాలు సన్న బియ్యం రూ.4,200 నుంచి రూ.4,500 పలకగా ప్రస్తుతం సుమారు రూ.వెయ్యి వరకు పెంచి అమ్ముతున్నారు. దిగుబడులు పెరిగినా.. ► రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి ప్రభుత్వం మిల్లర్లకు అందజేసింది. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద లక్షన్నర మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ►జంటనగరాల్లో బియ్యం వినియోగం పెరుగుతోంది. రోజుకు 32 నుంచి 35 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నట్లు అంచనా. -
భగ్గుమంటున్న బియ్యం
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఫస్ట్ క్వాలిటీ ఏడాది పాత బియ్యం ధర కిలో రూ.45 లోపే ఉంది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే అంతకుముందు ఏడాది కంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా సేకరించారు. మార్కె ట్ డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం వచ్చినా ధరలు మాత్రం పెరగడం గమనార్హం. అయినా ధరలు మాత్రం నియత్రించే పౌర సరఫరాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. పన్నులు ఎత్తివేసినా తగ్గని ధర జీఎస్టీ రాక ముందు మిల్లర్లు, వ్యాపారులు క్వింటాల్‌పై 4 శాతం పన్ను చెల్లించేవారు. జీఎస్టీ అమలతో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగా బియ్యంపై కూడా వ్యాట్‌ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ధాన్యం సేకరించి వ్యాపారులకు అమ్మితే గతంలో విధించిన ఒక శాతం పన్నును కూడా ప్రభుత్వం తొలగిస్తూ 2019 జీవో నంబర్ 219 జారీ చేసింది. దీంతో రైస్ మిల్లర్లు కేవలం ఒకశాతం మార్కెట్ ఫీజు మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం మిల్లర్లకు, బియ్యం వ్యాపారులకు ఇన్ని వెసలుబాట్లు కల్పించినా ధరలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందునే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్లో ధరల మోత గ్రేటర్ పరిధిలో అధికారులు పట్టించుకోకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్లో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్ పరిధిలో 250 మంది రైస్‌మిల్లర్లు ఉన్నట్లు సమాచారం. ఏటా ఒక్కో మిల్లర్ వద్ద 40 నుంచి 50 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్లో రోజుకు 35 నుంచి 40 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం అవుతున్నట్లు అధికారుల అంచనా. గతంలో పోలిస్తే రోజుకు 5 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం పెరిగింది. రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరలకే బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు . ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్‌కు రూ.3200 నుంచి 3500 పలుకుతోంది. మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాల్‌కు రూ.5000 నుంచి 5500 చేరింది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 2500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. చిన్నా చితకా కిరాణా వ్యాపారులు కూడా ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటాల్ సన్నబియ్యం ధర రూ.4200 పలుకగా ప్రస్తుతం ప్రతి క్వింటాల్‌పై రూ.800 వరకు పెరుగుదల కనిపించడం గమనార్హం. దీంతో జీఎస్టీ పరిధిలోంచి బియ్యాన్ని తొలగించినా కూడా సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయింది. -
బియ్యం భగ్గు! ధరలు పైపైకి
సాక్షి సిటీబ్యూరో: బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. రెండేళ్లుగా ధాన్యం దిగుబడి భారీగా పెరిగి.. మార్కెట్‌ను ముంచెత్తుతున్నా బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మాయాజాలం కారణంగానే బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుతం కిలో బియ్యం రూ.55కు తక్కువ దొరకడం లేదు. దీంతో రోజుకూలీలు, చిరు వ్యాపారులు, నిరుపేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఈసారి వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అటు ప్రభుత్వ గోదాములు.. ఇటు మిల్లర్ల గోదాముల్లో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. మార్కెట్లో మాత్రం బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. రెండేళ్లుగా బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని మిల్లులకూ గత ఏడాది ఖరీఫ్‌తో పాటు ఈ ఏడాది రబీలో పండిన ధాన్యం భారీగా చేరింది. దీనిని బియ్యంగా మార్చి మిల్లర్లు ప్రభుత్వానికి ఇస్తున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కొందరు మిల్లర్లు మాత్రం బియ్యాన్ని తమ గోదాముల్లో నిల్వచేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పంట రావడంతో బియ్యానికి మంచి రేటు రావడంలేదని వారు వాపోతున్నారు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలతో వినియోగదారులను దోచేస్తున్నారు. రెండింతలైన వరి ఉత్పత్తి 2017–18 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18.25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మార్కెట్‌కు వచ్చిందని, 2018–19 ఖరీఫ్‌లో ఇది రెట్టింపై...40.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు చేరిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు మిల్లర్ల నుంచి క్వింటాల్ బియ్యాన్ని రూ.3,000 నుంచి 3,600 మధ్య ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదే బియ్యాన్ని రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు మాత్రం క్వింటాల్‌కు 4,800 నుంచి 5500 రూపాయల వరకూ అమ్ముతున్నారు. అంటే వ్యాపారులు ఒక్కో కిలోకు దాదాపు 20–25 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో ఇంత మొత్తంలో బియ్యం వ్యాపారంపై లాభాలు ఉండేవి కావని మార్కెట్ వర్గాల అభిప్రాయం. జీఎస్టీ మినహాయించినా... వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించడం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు 2016 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బియ్యంపై ఉన్న 1 శాతం మార్కెట్ ఫీజును కూడా రద్దు చేసింది. ప్రస్తుతం కేవలం వరి ధాన్యంపై మిల్లర్ల నుంచి 1 శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు మండిపోతున్నాయి. బియ్యం ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే చెప్పాలి. రిటైల్ వ్యాపారులు కేజీ బియ్యాన్ని 20 నుంచి 25 రూపాయల లాభానికి అమ్ముకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రేటర్ పరిధిలో రిటైల్ వ్యాపారమే రోజుకు రూ.200 నుంచి 250 కోట్ల మేరకు జరుగుతోంది. ఇందులో వ్యాపారుల లాభం 20 కోట్ల నుంచి 25 కోట్ల మేరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచన. అప్పటి ధరలే ఇప్పటికీ.. గత మూడేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు దిగుబడి బాగా తగ్గింది. దీంతో ఆటోమేటిక్‌గా బియ్యం ధరలు పెంచేశారు. కానీ ఇప్పుడు దిగుబడి పెరిగాన గతంలో పెంచిన రేట్లనే అమలు చేస్తున్నారు. జీఎస్టీకి ముందు మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి ప్రభుత్వం 5 శాతం వ్యాట్‌ను వసూలు చేసింది. ప్రసుత్తం వ్యాట్ కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బియ్యం ధరలకు రెక్కలు
కారంచేడు: బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటున్న తరుణంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నాయి. మార్కెట్లో బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతుంటే ఉద్యోగులు పెరుగుతున్న ధరలను చూచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నెల నెలా బియ్యం ధరలు పెరుగుతుంటే ఎలా కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరిసాగు లేకపోవడమే.. జిల్లా ధాన్యగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో రెండేళ్ల క్రితం ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. సాగుకు అసవరమైన నీరు లేకపోవడంతో వరి సాగు 80 శాతానికి పైగా నిలిచిపోయింది. దీంతో ధాన్యం లోటు వచ్చింది. రైతుల ఇళ్లల్లో పురులు ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో వారంతా తిండి గింజలకు కూడా వారు వెతుక్కునే పరస్థితి వచ్చింది. తరువాత ఏడాది మాగాణి సాగు బాగానే ఉంది. అయినా రెండు సంవత్సరాల ప్రభావంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం 2 వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 25 వేల ఎకరాల్లో వరి సాగుంది. రెండేళ్ల క్రితం 60 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది 8,75,000 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం ధరలపై స్పస్టత లేదు.. జిల్లాలోనే అత్య«ధికంగా వరి సాగు చేసే ప్రాంతంగా కా>రంచేడు మండలం ప్రసిద్ధి,. ఈ ఏడాది కొమ్మమూరు కాలువ పరి«ధిలో సుమారు లక్ష ఎకరాల్లో అ«ధికారిక, అనధికారిక లెక్కల ప్రకారం వరి సాగైంది. దీంతో ఎకరానికి 35 బస్తాల చొప్పున 35 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడులున్నాయి. ధాన్యం ధరల్లో మాత్రం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ధాన్యానికి ప్రస్తుతం దళారులు బస్తా (75 కేజీలు) ’ రూ.1700–1750 వరకు కొనుగోలు చేస్తున్నారు. రూ.2000 ధర ఇస్తే రైతులకు ఊరటగా ఉంటుందని వారు వాపోతున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి: ప్రస్తుతం బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ ధరలు లేవు. గత ఏడాది 25 కేజీల బియ్యం బస్తా రూ.1100 ఉంటే ఈ ఏడాది బియ్యం బస్తా రూ.1250లకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిరుద్యోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.- పి. శ్రీనివాసరావు, కారంచేడు బియ్యం ధరలు అదుపు చేయాలి: వై బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం గానీ అ««ధికారులు గానీ వీటిని అదుపు చేయాల్సి ఉంది. కేజీ రూ.50 వరకు ఉంది. ఒక కుటుంబంలో రోజుకు రెండు కేజీల చొప్పున బియ్యం ఖర్చుకే రూ. 100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటున నెలకు బియ్యానికే రూ.2,500 వరకు ఖర్చవుతోంది. -సుబ్బారావు, కారంచేడు -
బువ్వ తినగలమా...?!
- రోజురోజుకు కొండెక్కుతున్న బియ్యం ధర - క్వింటాల్‌కు రూ.350కి పైగా అప్ - బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు చెన్నూర్ : మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు బియ్యం కొనాలంటేనే భయపడుతున్నారు. ఈ ఏడా ది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ వరి సాగు తగ్గిన నేపథ్యంలో మరికొద్ది నెలల్లో బియ్యం ధరలు ఇంకా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు పైపైకి... వారం వ్యవధిలో బీపీటీ సన్న రకం బియ్యం క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.350 వరకు పెరగగా, హెచ్ఎం టీ, జైశ్రీరాం రకం ధరలు రూ. 350 నుంచి 400 వరకు పెరిగారుు. దీనికి తోడు వంట నూనెలు, కూరగాయలే కాకుండా రోజూ వాడే ఉల్లిగడ్డల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు స్థాయిని దాటిపోయూయి. సామాన్యులపై పెనుభారం... సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెరిగిన బియ్యం ధరలతో పెనుభారం పడుతోంది. రోజంతా పని చేస్తే రూ.200 కూడా గిట్టుబాటు కావడంలేదు. ఈ నేపథ్యం లో బియ్యం, ఉల్లితో పాటు నిత్యావసర వస్తువులు, కూ రగాయల ధరలు మండిపోతుండగా ప్రజలకు ఏం చే యూలో అర్థం కావడం లేదు. తగ్గిన ఖరీఫ్ సాగు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో జి ల్లాలో 50 శాతం వరి సాగు తగ్గిందని అంచనా. వర్షాలు లేని కారణంగా రబీ సాగు సైతం అంతంత మాత్రంగా నే ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో సాగు గణనీయంగా పడిపోరుు వచ్చే ఏడాది బియ్యం అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం కిలో రూ.45 ఉన్న సన్న రకం బియ్యం ధర మరింత పెరిగే అ వకాశముందని వ్యాపారులు అంటున్నారు. ఖరీఫ్‌లో వరి సాగు తగ్గింది. ఈ లెక్కన చూస్తే వచ్చే రోజుల్లో కిలో బియ్యం రూ.60కి చేరినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని వ్యాపారులు చెబుతున్నారు. ‘మధ్య తరగతి’కి కష్టమే... బియ్యం ధరలు చూస్తే కన్నీరోస్తుంది. ఇలాగే ధరలు పెరుగుతే మధ్య తరగతి ప్రజలు బతకడం కష్టమే. రోజంతా పని చేస్తే వచ్చే రూ. 200 ఎలా బతకడం? ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. - మారుపాక పోచం, ప్రైవేట్ ఉద్యోగి, కిష్టంపేట ప్రభుత్వం చొరవ చూపాలి.. బియ్యం ధరలు ఇలా పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టమే. ప్రజలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుంది. బియ్యం ధరలు పెరగడానికి గల కారణాలను ఆరా తీసి నియంత్రణకు ప్రభుత్వం చొరవ చూపాలి. - గుర్రం శ్రీనివాస్, ఎల్ఐసీ ఏజెంట్, చెన్నూర్ ఇప్పుడే ఇట్లా ఉంటే... బియ్యం ధరలు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌లో వరి అన్నం పరమాన్నంగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. సామాన్యు ల ఇబ్బందులను పట్టించుకోకపోవడం లేదు. - సురేష్, సెల్ వ్యాపారి, చెన్నూర్ -
నిప్పుల్లా పప్పులు
కిలోకు రూ.50 పెరుగుదల జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం యలమంచిలి : జిల్లాలో పప్పుల ధరలు నిప్పుల్లా మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో వాటి ధరలు నింగిని తాకుతున్నాయి. ఒక పక్క బియ్యం ధరలు పెరుగుతుండగా పప్పుల ధరలు అట్టుడుకుతుండటంతో వినియోగదారులకు దిక్కుతోచడం లేదు. కంది, మినుము, పెసర తదితర రకాల పప్పులు రెండు నెలల ముందు ధరలతో పోలిస్తే కిలోకు రూ.50 వంతున పెరిగాయి. ప్రస్తుతం కిలో కందిపప్పు రూ.140 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మినప పప్పు రూ.130, పెసర పప్పు రూ.120, శనగపప్పు రూ.70కు పెరిగింది. ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా ప్రజలకు అన్ని రకాల పప్పులు కలిపి నెలకు 60వేల క్వింటాళ్లు వినియోగిస్తుంటారు. కంది, మినప పప్పుల ధరలు కిలోకు రూ.50, పెసరపప్పుకు రూ.40, శనగపప్పుకు రూ.20 వంతున పెరగడం వలన జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం పెరుగుతోంది. ధరలు పెరిగిపోతుండటంతో పప్పుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. సామాన్యులైతే పప్పులను కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. నిద్రావస్థలో పర్యవేక్షణ కమిటీ... నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నప్పుడు వాటిని కట్టడి చేయాల్సిన ‘పర్యవేక్షణ కమిటీ’ నిద్రావస్థలో ఉందనే విమర్శలు ఉంటున్నాయి. నల్లబజారుకు తరలే వస్తువుల నిరోధానికి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుని దాడులు చేయడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు విజిలెన్స్, వాణిజ్య పన్నులు, తూనికలు, కొలతల శాఖాధికారులతో టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసి అక్రమ నిల్వలను బయటకు తీయాల్సి ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే అక్రమార్కుల ఆటలు కొనసాగుతున్నాయి. అవసరమైనపుడు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి సరుకులను దిగుమతి చేసుకుని మార్కెట్లో ధరలను క్రమబద్ధీకరించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం కిలో రూ.50కు కందిపప్పును సరఫరా చేస్తున్నా జిల్లా ప్రజల అవసరాలను తీర్చడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు, పాలకులు పప్పులను తక్షణమే రాయితీ ధరలకు విక్రయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పెరుగుదలకు ఇదీ కారణం. దేశంలో పప్పుల ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఉన్న నిల్వలను ముందుగానే వ్యాపారులు నల్లబజారుకు తరలించడంతో పప్పుల లభ్యత తగ్గించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిల్వలను బయటకు తీయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సన్న బియ్యం ధర మరీ లావు !
చింతలపూడి : మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి, డిమాండ్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాని ఎలాంటి లాజిక్కూ లేకుండా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఓవైపు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోపక్క బియ్యం ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. సోనా మసూరి బియ్యం ధర 25 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,250కు అమ్ముతున్నారు. పీఎల్ రకం అయితే కిలో రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. కొద్ది సంవత్సరాలుగా ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు వ రి దిగుబడిని దెబ్బతీయడం, కృష్ణా డెల్టాలో సన్న బియ్యం పండించే రైతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. అయితే బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో వీటి పెరుగుదలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. జిల్లాలో ఆకివీడు, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో బియ్యం ఎగుమతి చేసే మిల్లులు 300కు పైగా ఉన్నాయి. అయితే జిల్లాలోని ట్రేడింగ్ మిల్లుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేదని, మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాళ్లమని స్థానిక వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఐకేపీ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంతో మార్కెట్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. దీంతో మెట్ట ప్రాంతంలో మిల్లులు మూతపడే పరిస్థితి వచ్చిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండపేట నుంచి దిగుమతి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి సన్న బియ్యం రకరకాల బ్రాండ్ల లో జిల్లాలోని స్థానిక బియ్యం వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి హోల్ సేల్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుని బియ్యం ధరలు విపరీతంగా పెంచి మార్కెట్‌ను శాసిస్తున్నారు. మార్కెట్లో ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. కర్నూలు రకం సన్న బియ్యం, జీలకర్ర సోనా రకం అంటూ వినియోగదారులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి సోనా బియ్యంలో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే అంటున్నారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది గుంటూరు, కృష్ణా డెల్టాలో రైతులు అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదు. అదీ కాక మెట్ట ప్రాంతంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వా ణిజ్య పంటలను సాగు చేస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యం కోసం ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టి ధరలను అదుపులోకి తేవాలని మధ్యతరగతి, సామాన్య ప్రజలు కోరుతున్నారు. -
అదిరేట్లు
♦ ఏం కొనాలన్నా అందుబాటులో లేని ధరలు ♦ కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ♦ పట్టించుకోని విజిలెన్స్ అధికారులు సత్తెనపల్లి : బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరిగి పోతున్నాయి. ఆ మేరకు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వనరులు పెరగక పోవడంతో సగటు జీవి నెలబడ్జెట్ తలకిందులైంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో వంటింటి బడ్జెట్ దాదాపు రెట్టింపు అయింది. సాధారణ, ఇంధన ధరలు అన్ని భారంగా మారుతున్నాయి. నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబానికి గత ఏడాది వంటింటి బడ్జెట్ సగటున రూ. 5వేలు ఉంటే... ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో అది రూ. 9వేలకు పెరిగింది. గత ఏడాది కిలో కంది పప్పు రూ. 75 కాగా... ఇప్పుడు అది రూ. 145కు పెరిగింది. మినపప్పు రూ. 80 నుంచి రూ. 125కు చేరుకుంది. ఇలా అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగి సగటు జీవి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. విజిలెన్స్ ఎక్కడ?.. మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటో తెలుసుకుని నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదాముల్లో స్థాయికి మించి అధికంగా నిల్వలు చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆదిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. బియ్యం ధరలూ అంతే.. జిల్లాలో ఎక్కువగా సన్నరకం బియ్యాన్ని వాడతారు. బీపీటీ బియ్యం విరివిగా వాడుతు న్నారు. సంవత్సర కాలంగా బియ్యం ధరలు కూడా సామాన్యులకు అందన్నంత స్థాయిలో పెరిగాయి. మరీ వారం రోజులుగా విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ.25 నుంచి రూ.28 వరకు పలికిన బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 40 నుంచి రూ. 45ల వరకు పెరిగిపోయాయి. మేలు రకం బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి పోతుండటం, స్థానికంగా బియ్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే నిత్యవసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. బడ్జెట్ సరిపోవడం లేదు.. పెరిగిన నిత్యవసర ధరలతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ సరిపోవడం లేదు. ఉద్యోగులకే కష్టంగా ఉంది.ఇక పేద, మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టం. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కె.లక్ష్మీ, ఉపాధ్యాయురాలు ధరలు తగ్గించాలి.. పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర ధరలు తగ్గించాలి. పెరిగిన ధరల కనుగుణంగా ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో ఎంత కష్టపడుతున్నా పూటగడవని పరిస్థితి. కూరగాయల ధరలు సైతం బాగా పెరిగి పోయాయి. బియ్యం కొనాలన్నా చాలా కష్టంగా ఉంది. - జి.రోజారాణి, అంగన్వాడీ కార్యకర్త -
బియ్యం ధరలు పైపైకి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సన్నం బియ్యం ధరలు గత రెండు నెలల్లోనే ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. బీపీటీ, సోనామసూరి, జేజీలుకు క్వింటాల్‌కు రూ.350 నుంచి రూ.600 వరకు పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటాల్‌కు ధర మార్కెట్లో రూ.3,500 ఉండగా.. ప్రస్తుతం రూ.4,000లకు చేరింది. కొత్త బియ్యానికే ఈ ధర పలుకుతోంది. ఇక పాత బియ్యానికి అదనంగా రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. సన్న బియ్యం హెచ్ఎంటీ గతంలో క్వింటాల్‌కు రూ.5,500 ఉండగా.. ప్రస్తుతం రూ.6,000లకు చేరింది. జైశ్రీరామ్ క్వింటాల్‌కు రూ.5,500 నుంచి రూ.6,100కి పెరిగింది. బీపీటీ (బాపట్టా) రూ.3,300 నుంచి రూ.4,000లకు చేరింది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వరి సాగు తగ్గి మార్కెట్‌కు ధాన్యం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. కరువు కాటు.. జిల్లాలో గడిచినా ఏడాది ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు వరి సాగుకు మొగ్గు చూపలేదు. వరి విత్తనాలు అలికినా నాట్లు వేసుకునే సమయానికి వర్షాలు పడలేదు. దీంతో పొలాల్లోనే నారు వదిలేశారు. రబీ నీరు అందించేందుకు కరెంటు కోత తలెత్తేలా ఉం దని ప్రభుత్వమే వరి సాగు చేసుకోవద్దని సూచించింది. దీంతో పంట వేసుకోలేదు. సాధారణ వరి విస్తీర్ణం 1.45 లక్షల ఎకరాలు కాగా.. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో 59 వేలకే పరిమితమైంది. రబీ సాధారణ వరి విస్తీర్ణం 72 వేల ఎకరాలకు గాను 29 వేల ఎకరాలే సాగైంది. ఇది కూడా ప్రధాన ఆయకట్టు కింద సాగు చేసిందే. ఖరీఫ్‌లో కరువు కాటేస్తే, రబీలో అకాల వర్షా లు దిగుబడి దశలో తీవ్రంగా దెబ్బతిశాయి. ఏటా ఖరీ ఫ్, రబీలో ధాన్యం దిగుబడి 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సుమారుగా అందుబాటులో ఉండేది. కానీ.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ కలిపి లక్ష మెట్రిక్ ట న్నులు కూడా అందుబాటులో లేకుండాపోయింది. వరి దిగుబడి అనంతరం రైతుల కోసం తమ వద్ద కొంత నిల్వ చేసేవారు. మిగతా ధాన్యాన్ని మార్కెట్ తరలించేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్నదాతకు తినేందుకు తిండిగింజా దొరకని దుస్థితి దాపురించిం ది. ఖరీఫ్, రబీ సాగులో వరితోపాటు కంది, మినము లు, పెసర, శనగ, గోధుమ పంటలదీ అదే పరిస్థితి. సాధారణం కంటే సాగు తగ్గడమే కాకుండా విత్తుకున్న పంట దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రీసైక్లింగ్ దందా.. కరువు కారణంగా వినియోగానికి ధాన్యం అందుబాటు లో లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు కల్తీ వ్యాపారానికి తెరలేపారు. జిల్లాలో ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుల ద్వారా అందిస్తున్న రేషన్ (దొడ్డు) బియ్యాన్ని కొంత మంది మిల్లర్లు ప్రధాన పట్టణాల్లో ఆధునిక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేస్తే సన్నబియ్యంగా మార్చుతున్నారు. కొంత మంది మిల్లర్లు రేషన్ డీలర్లను మచ్చిక చేసుకుని లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.1,200 నుంచి 1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ద్వారా తదితర జిమ్మిక్కులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నరకంగా మార్చి రూ.3,800 నుంచి రూ.4,500 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో నెలకు లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు గుర్తు పట్టనంతగా మారుతున్నాయి. క్విం టాలు దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేస్తే 75 నుంచి 80 క్విం టాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు, మిల్లర్లు లక్షల్లో లా భాలు ఘడిస్తున్నారు. ప్రధానంగా ఈ రీసైక్లింగ్ వ్యవహారం బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా సాగుతోంది. నియంత్రణ కరువు.. బియ్యం ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధరలు సమీక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో వ్యాపారుల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులు బియ్యంతోపాటు, నిత్యావసర పప్పులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గతేడాది ఇదే సమయంలో ఉన్నతాధికారులు సమీక్షించి ధరల నియంత్రణకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపట్టారు. సోనమసూరి బియ్యం రూ.కిలో 27 చొప్పున విక్రయించాలని జిల్లాలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం ధరలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు. -
బియ్యం ‘ధర’వు.. బతుకు బరువు
పెరుగుతున్న బియ్యం ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు జంగారెడ్డిగూడెం : నెలనెలా పెరుగుతున్న బియ్యం ధరలతో పేదలు విలవిల్లాడుతున్నారు. వచ్చే ఆదాయంలో మూడోవంతు బియ్యం కొనుగోలుకే పోతోందని, దీనికి దీటుగా పచారీ సరుకుల ధరలు కూడా పెరగడంతో బతుకు బండి నడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులమ్మే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో చేతులెత్తేసిన సర్కారు.. బియ్యం ధరలను నియంత్రించడంలో కూడా తన చేతకానితనాన్ని చాటుకుంటోంది. దీంతో మింటికెగసిన ధరలతో తమ ఇంటి బడ్జెట్ తల్లకిందులవుతోందని సామాన్యులు వాపోతున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిల్లర్లు, వ్యాపారుల మధ్య సమన్వయం కుదర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాంబ మసూరి, పీఎల్, 1001, స్వర్ణ రకాలను వినియోగదారులు వారి స్థాయిలను బట్టి కొనుగోలు చేస్తుంటారు. రేట్లు భారీగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పీఎల్ 1వ రకం కేజీ రూ. 30, 25 కేజీల బస్తా రూ. 750, దీనినే కేజీ రూ. 31కి కూడా అమ్ముతున్నారు. పీఎల్ 2వ రకం 25 కేజీల బస్తా రూ.650, 1001 రకం కేజీ రూ. 22, 25 కేజీల బస్తా రూ.550, సాంబ కేజీ రూ. 47, 25 కేజీల బస్తా రూ. 1,150 నుంచి రూ. 1200 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. భారీగా పెరిగిన బియ్యం ధరలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే వచ్చే కూలి సొమ్ములో బియ్యం కొనుగోలుకే చాలావరకు పోతోందని, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు సొమ్ములు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో బియ్యం రేట్లు కూడా పైకే చూడటంతో ఒకపూట కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉండటం లేదని పేదవర్గాల వారు వాపోతున్నారు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యాన్ని అమ్మితే గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు పంటలు వేసి అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరి పండించిన రైతులు సైతం షాపులకెళ్లి బియ్యం బస్తా కొనాలంటే కళ్లంటా నీళ్లు వస్తున్నాయని పేర్కొంటున్నారు. తాము పండించిన పంట అమ్మకానికి వచ్చినప్పుడు ధర ఉండటం లేదని, తీరా తాము బియ్యం కొనుక్కోవాల్సి సమయంలో ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసి సామాన్యుడు అన్నం తినే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
‘ప్రభుత్వ’ బియ్యం కొనే వారేరీ?
ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకు విక్రయిస్తున్నా అమ్మకాలు అంతంత మాత్రమే ప్రజల్లో అవగాహన కల్పించని సర్కారు పలు చోట్ల అందుబాటులో లేని కౌంటర్లు 5 నెలల్లో విక్రయించింది 12 వేల క్వింటాళ్లే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణతో పాటు సాధారణ ప్రజలకు మేలు రకం బియ్యం తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లతో ప్రయోజనం కనిపించడం లేదు. ఈ ప్రత్యేక కౌంటర్లపై సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించకపోవడం, సరైన చోట్ల, సరైన సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో వాటిని వినియోగించుకునే వారే కరువయ్యారు. దాదాపు ఐదు నెలల్లో మొత్తంగా 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయం మాత్రమే జరగడం దీనిని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఫైన్ రకం బియ్యం ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా పెంచే అవకాశాన్ని ముందుగానే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ ఏడాది జూన్‌లోనే తగిన చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాల్లో మేలు రకం బియ్యానికి మంచి ధర లభించడంతో గతంలో రైస్‌మిల్లర్లు అక్కడికి తరలించి రాష్ట్రంలో కొరత సృష్టించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని... ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు సామాన్య, మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని, రైస్‌మిల్లర్లతో చర్చించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలను అధికారులు చేపట్టారు. ఇలా జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో 337 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మేలు రకం సోనామసూరి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తుండగా.. ‘ప్రభుత్వ’ కౌంటర్లలో కిలో రూ. 35కే అందిస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక కౌంటర్లపై ప్రజలకు అవగాహన కొరవడటంతో.. విక్రయాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ కేంద్రాల ద్వారా దాదాపు 23 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు సాగగా... అందులో ఆగస్టు మొదటి వారానికి 335 కౌంటర్ల ద్వారా 11 వేల క్వింటాళ్లు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఐదు నెలల కాలంలో 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. సోనామసూరి ధరలు అధికంగా ఉన్న హైదరాబాద్‌లో కేవలం 1,173 క్వింటాళ్ల బియ్యం విక్రయాలు జరుగగా.. మహబూబ్‌నగర్‌లో 777, మెదక్‌లో 1,266, ఆదిలాబాద్‌లో 1,371 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం 60 కేంద్రాల ద్వారా అత్యధికంగా 8,085 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక కౌంటర్లు 20కు మించి లేకపోవడంతో విక్రయాలు బాగా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో అసలు బియ్యం కౌంటర్ల ఏర్పాటుపై అవగాహన లేకపోవడం కారణంగా చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో వరి సాగు 28 శాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో... బియ్యం ధరలకు రెక్కలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి. -
మండుతున్న నిత్యావసరాల ధరలు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సన్న బియ్యం ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. పప్పులు, నూనెలు... అన్ని సరుకులదీ ఇదే తీరు. గత ఏడాదితో పోల్చితే అన్ని సరుకుల ధరలూ పెరిగాయి. వర్షాలు లేక ఈ ఏడాది పంటల సాగు తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. అరుుతే, పంట ఉత్పత్తులు తక్కువగా వచ్చే పరిస్థితి ఉండడంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసర వస్తువులు, బియ్యూన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం స్పందించి తనిఖీలు చేయాలి. నిత్యావసరాలను అక్రమ నిల్వ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరుకుల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం అక్రమాల విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా చేయూల్సి ఉండగా.. దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలతో పోల్చితే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడం గమనార్హం. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, ఆహార సలహా కమిటీ(ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. దీనిపై కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. 2013 మే 29న ఎఫ్ఏసీ సమావేశం జరిగింది. అప్పటి నుంచి సమావేశం నిర్వహించ లేదు. ఇలా 14 నెలలు గడిచినా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ధరల మోత పట్టదు... పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్వో), ఐదుగురు ఆహార ఇన్స్పెక్టర్లు, 15 మంది ఉప తహసీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), ఈ విభాగం సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం.. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా.. ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. కానీ, అవేమీ జరగడం లేదు. ఎన్నికలు, ఇతర పరిపాలన పనుల్లో రెవెన్యూ శాఖ ఉద్యోగులు పని ఒత్తిడితో ఉన్నా... పౌర సరఫరాల శాఖలోని 27 మంది సిబ్బంది నెలకు ఒకటి చొప్పున తనిఖీలు చేసినా 27 అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. ఇలా ఒక్కో అధికారి ఒక తనిఖీ చొప్పున చేసినా వీటి సంఖ్య ఇప్పటికి 189 అయ్యేవి. జిల్లాలో ఇలా జరగడం లేదు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిల్వలు, ధరలు పెరగడం యథావిధిగా జరుగుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడం లేదు. అన్ని శాఖల్లో అక్రమాలపై నిఘా బాధ్యతల నిర్వహణ కోసం ఉన్న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతోంది. నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరల పెరుగుదల విషయంలో పౌర సరఫరాలు, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఈ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
సన్న బియ్యం సుర్రుమంటోంది!
మిల్లర్ల చేతివాటంతో కిలో 40 నుంచి 50 రూపాయలకు.. హైదరాబాద్: బియ్యం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలతో పోలిస్తే.. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం సన్న రకం రూ.40 నుంచి ఏకంగా రూ.50కు చేరింది. ఎన్నికలకు ముందు మిల్లర్లు చూపించిన చేతివాటంతో ప్రస్తుతమీ పరిస్థితి నెలకొంది. ఇక్కడ బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటూ తప్పుడు లెక్కలు చూపించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు భారీగా బియ్యాన్ని తరలించారు. దీంతో తెలంగాణ జిల్లాల్లో సన్న బియ్యం కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని గమనించిన రాష్ట్ర సర్కారు పది జిల్లాల నుంచి బియ్యం బయటకు వెళ్లరాదని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ పది జిల్లాల్లోనూ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బియ్యాన్ని తరలించాలన్నా...అధికారుల అనుమతిని తీసుకోవాలని షరతు విధించింది. ఎక్కువ ఉందని చెబుతూ.. కర్నూలు బియ్యంతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పండే సన్న రకం బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతేడాది కాలంగా రాష్ట్రంలో పరిస్థితి మారింది. ఎన్నికల కాలం.. రాష్ట్ర విభజన ప్రక్రియ.. దీంతో ఇటు అధికారులు కానీ, అటు ప్రభుత్వం కానీ చాలా అంశాలను పట్టించుకోలేదు. ఇదే సమయాన్ని మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాలో బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ.. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతిని ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరారు. అలా భారీ ఎత్తున సన్న రకాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కొరత కారణంగా ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం రోజూ సుమారు 3 వేల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తున్నారు. అంటే నెలకు 90 వేల టన్నుల బియ్యం కావాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడానికి మరో నాలుగు మాసాల కాలం పడుతుంది. అంటే...అక్టోబర్‌లో కొత్త బియ్యం వస్తుంది. అప్పటి వరకు ఇప్పుడున్న నిల్వ బియ్యాన్నే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ నాలుగు నెలల కాలానికి 3.60 లక్షల టన్నుల బియ్యం అవసరముంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు మరింత భగ్గుమనే ప్రమాదముంది. -
వామ్మో..!
బియ్యం మాటెత్తితేనే సామాన్యులు హడలిపోతున్నారు. రోజురోజుకూ ధరలు అమాంతం దూసుకెళుతుండటం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కుంగదీస్తోంది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కనుక కొనక తప్పని పరిస్థితి. జిల్లాలోని వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతుండటంతో ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అక్రమ నిల్వలను వెలికితీయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. కడప కలెక్టరేట్: నెల రోజుల నుంచి బియ్యం ధరలు ఎండలతో పోటీపడుతూ మండిపోతున్నాయి. కడప మార్కెట్లో జిలకర మసూర కొత్తవి క్వింటాల్ రూ. 3,300గా ఉన్నాయి. పాతబియ్యం రూ. 4,300 నుంచి రూ. 4,400 పలుకుతోంది. స్కీం బియ్యం బద్వేలు రకం క్వింటాల్ రూ.3600 నుంచి రూ. 3700 వరకు పలుకుతోంది. ఇవి హోల్‌సేల్ ధరలు కాగా చిల్లర దుకాణాల్లో రిటైల్‌గా కొత్త బియ్యం కిలో రూ.46, పాత బియ్యం కిలో రూ. 56 చొప్పున విక్రయిస్తున్నారు. బాగానే ఉన్న ధాన్యం దిగుబడి.. : 2013-14 సంవత్సరంలో జిల్లాలో ధాన్యం దిగుబడి బాగానే వచ్చింది. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 45,476 హెక్టార్లు కాగా, 51,753 హెక్టార్లలో వరిపంట సాగైంది. ఈ సీజన్లో 1,89,623 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగింది. రబీలో సాధారణ విస్తీర్ణం 11,604 హెక్టార్లు కాగా, 10,417 హెక్టార్లలో వరి సాగైంది. ఈ సీజన్లో 39,233 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇలా మొత్తం 2,28,850 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో పండింది. రైతులకు దక్కింది స్వల్పమే.. ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఈ యేడు దక్కింది స్వల్పమే. ఎకరా సాగుకు రూ.20వేలు వరకు ఖర్చవుతోంది. దిగుబడి ఎకరాపై 21 నుంచి 24 క్వింటాళ్లు సగటున వచ్చిందని రైతులు అంటున్నారు. జిలకర మసూర, ఎన్‌డీఎల్‌ఆర్-8 రకాల వరిధాన్యాన్ని క్వింటాల్ 8వేల నుంచి రూ.8,500లతో రైతులు మిల్లర్లకు విక్రయించారు. పంట మిల్లర్ల చేతికి వెళ్లిన తర్వాత నేడు అదే ధాన్యం ధర రూ. 13,500 నుంచి రూ. 14వేల వరకు పెరిగింది. అలాగే ఎన్‌ఎల్‌ఆర్ రకం ధాన్యాన్ని రైతులు క్వింటాల్ రూ. 7,500లతో విక్రయించగా నేడు రూ. 9,500కు చేరింది. అక్రమ నిల్వలు అప్పులు చెల్లించడానికో లేదా కుటుంబ అవసరాల నిమిత్తమో దాదాపు రైతులంతా ఇప్పటికే తాము పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించుకున్నారు. కొంత స్థోమత ఉన్న రైతులు మాత్రం ధర వస్తుందన్న ఆశతో ఇళ్ల వద్ద ధాన్యం నిల్వ చేసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేయకుండా వ్యాపారులు అక్రమ నిల్వలు ఏర్పాటు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల పేర్లతో కూడా వ్యాపారులు గోదాముల్లో నిల్వలు ఉంచినట్లు చెబుతున్నారు. వెలికితీతకు చర్యలేవీ.. అక్రమ నిల్వల వెలికితీతకు పౌరసరఫరాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గోడౌన్ల తనిఖీ కంటితుడుపు చర్యగా ఉంటోంది. ఎవరైనా అక్రమ నిల్వలపై సమాచారమిస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలోని గోదాముల్లో బుడ్డశనగలు మినహా వరి ధాన్యం లేదంటూ బుకాయిస్తున్నారు. జిల్లాలో ధాన్యం దిగుబడి తగ్గిందని, మిల్లర్లు లెవీ చెల్లించడానికి కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి బియ్యాన్ని తీసుకొస్తున్నారంటూ వారికి వంత పాడుతున్నారు. బియ్యం ధరలు పెరిగి సామాన్యులు గగ్గోలు పెట్టే సందర్భాల్లో మిల్లర్లు, ట్రేడర్ల ద్వారా బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది. కడప, ప్రొద్దుటూరు రైతుబజార్లలో గతంలో ఏర్పాటుచేసిన విక్రయ కేంద్రాలు చాలా రోజుల క్రితమే మూతపడ్డాయి. ప్రస్తుతం తక్కువ ధరలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోకుండా నియంత్రించడంలో భాగంగా అధికార యంత్రాంగం ‘ప్రైజ్ మానిటరింగ్ కమిటీ’(ధరల పర్యవేక్షణ కమిటీ) ఏర్పాటు చేసి సమీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కమిటీ జాడే లేకుండా పోయింది. -
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల
కూర‘గాయాలే’.. కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వీటిని కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తారు. కిలో కూరగాయలకు బదులు పావుకిలోతోనే సరిపెట్టుకున్న కుటుంబాలున్నాయంటే ధరలు ఏవిధంగా ఎగబాకాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో కూరగాయల కంటే చికెన్ కొనుగోలు సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ 15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ 60కి తాకింది. వంకాయ రూ 15 నుంచి రూ 40, బెండ రూ 20 నుంచి రూ 40, మిర్చి రూ 20 నుంచి రూ 60, బీర రూ 25 నుంచి రూ 40, క్యాబేజీ రూ 20 నుంచి రూ 35, దోస రూ 10 నుంచి రూ 35కి పెరిగాయి. ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యతరగతి కుంటుంబాల మాటేమోగాని.. సామాన్యుల కుటుంబాలు విలవిలలాడాయి. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంతమేర ధరలు క్షీణించాయి. అమ్మో ఉల్లి.. ఉల్లి.. అంటేనే జనాలు జంకారు. కోస్తే నీరొచ్చే ఉల్లి... అసలు ధర వింటే కంటతడి పెట్టించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్, గుజరాత్, కర్నూలు ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఉల్లి రేటు మూడింతలైంది. మరోవైపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ 30 నుంచి ఒక దశలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ 70 వరకు ఉల్లిధర పలికింది. పెట్రో బాంబ్... ఏడాది పొడవునా పెట్రో బాంబు పేలుతూనే ఉంది. ప్రభుత్వం పలుమార్లు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు 1.86 లక్షలు, 17 వేల కార్లు, 21 వేల ఆటోలు, మరో 9 వేల ఇతర వాహనాలు ఉన్నాయి. 170 బంకుల ద్వారా నిత్యం 7 లక్షల లీటర్ల డీజిల్, 2 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. పెట్రోలు లీటర్‌పై ఫిబ్రవరిలో రూ 1.42, జూన్‌లో రూ 2, ఇదే నెలలో మరోసారి రూ 1.82, జూలైలో రూ 1.55, ఆగస్టులో 70 పైసలు, సెప్టెంబర్‌లో ఏకంగా రూ 2.35 పెంచేసింది. అదేనెలలో మరోసారి రూ 1.65లు బాదింది. తాజాగా ఈనెల 20వ తేదీన మరో 41 పైసలు వడ్డించింది. అడపాదడపా స్వలంగా తగ్గించినా అందుకు రెట్టింపుగానే ధరల బాజా మోగించింది. ఏడాది మొదట్లో సుమారు రూ 70 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ 77.60కు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే ఒక్కో లీటరుపై వినియోగదారులు రూ 7.60 అదనపు భారం మోశారన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ 54 కోట్ల భారం ప్రజలపై సర్కారు మోపింది. జనవరిలో లీటరు డీజిల్ ధర రూ 50.23 ఉండగా ప్రస్తుతం రూ. 58.60కు చేరుకుంది. రూ 8.37 అదనంగా పెరగడంతో రవాణా వ్యవస్థపై పెనుభారం పడింది. ఏడాదికి రూ 210 కోట్ల భారం వినియోగదారులకు వడ్డించింది. ఈ పెంపుతో రవాణా చార్జీలు ఎగబాకడంతో పరోక్షంగా సామాన్యుడు విలవిలలాడాడు. గ్యాస్ మంట.. జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.54 లక్షల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ‘ఆధార్’ తప్పనిసరి చేసింది. అయితే అందరికీ పూర్తిస్థాయిలో ఆధార్ లేకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు పూర్తిస్థాయిలో గ్యాస్ ధర చెల్లిస్తున్నారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమవుతోంది. ప్రస్తుతం సబ్సిడీ కాకుండా సిలిండర్ ధర రూ 1,107. గ్యాస్ ధర రూ 420 పోను రూ 687 సబ్సిడీ బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. రూ 50లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించింది. కనెక్షన్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసిన వినియోగదారులకు ఈ రూ 50 ల సబ్సిడీని ఎత్తివేసింది. మిగిలిన రూ 637 మాత్రమే ఖాతాలో వేస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 2.50 లక్షల మంది వినియోగదారులపై మూడు నెలలుగా భారం పడుతూనే ఉంది. ఈ లెక్కన రూ 3.75 కోట్ల భారం భరించారు. కష్టాల‘పాలు’.... ఈ ఏడాది ప్రతి నిత్యావసర సరుకు ధర ఎగబాకింది. సగటున ప్రతి వస్తువు ధర 20 నుంచి 50 శాతం వరకు పెరిగిందని అంచనా. లీటరు పాల ధర మూడు రూపాయల చొప్పున పెంచారు. ఏడాది ఆరంభంలో పాల పాకెట్ లీటర్ సుమారు రూ 33 ఉండగా.. ఏకంగా రూ 36 నుంచి రూ 38కి పెరిగింది. సరాసరి రోజుకు ప్రైవేటు డెయిరీలలో 2.15 లక్షల లీటర్లు, గ్రామాల్లో, పట్టణాల్లో విడిగా 6.50 లక్షల లీటర్లు అమ్ముతున్నారు. మొత్తం 8.65 లక్షల లీటర్ల పాలను జిల్లా ప్రజలు నిత్యం వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ 25.95 లక్షలు, నెలకు రూ 7.78 కోట్లు, ఏడాదికి రూ 93.42 కోట్ల భారం ప్రజలపై పడింది. బస్సు ప్రయాణం భారం.. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్‌చార్జీలు పెంచేసింది. రెండు సార్లు చార్జీలు పెంచి ప్రయాణికుల నెత్తిన రుద్దారు. చివరికి విద్యార్థుల బస్ పాస్ చార్జీలూ పెంచేసింది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. ఆర్డినరీ( పల్లెవెలుగు) బస్‌లకు కిలోమీటర్‌కు 5 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు, డీలక్స్‌కు 10 పైసలు, సూపర్ లగ్జరీకి 12 పైసలు పెంచి చుక్కలు చూపించింది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 739 సర్వీలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. చార్జీల పెంపుతో ప్రయాణికులపై *రెండు కోట్ల భారం పడింది. సర్‌ర్‌ర్... షాక్ విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు సర్కారు షాకిచ్చింది. మార్చిలో చార్జీలను సగటున 15 శాతం పెంచి ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చింది. సర్‌చార్జీల పేరుతో పెనుభారం మోపింది. పాన్‌డబ్బా నుంచి మొదలుకుని పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులకూ వడ్డించింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే కుటుంబాలను సైతం వదిలిపెట్టలేదు. ఈ ఏడాది జిల్లా ప్రజలపై విద్యుత్ సర్‌చార్జీల రూపంలో అదనంగా సుమారు రూ 130 కోట్ల భారం పడిందని అంచనా. ఓ వైపు విద్యుత్ కోత లు పెడుతూనే.. మరోవైపు బిల్లుల రూపంలో వాతలు పెట్టింది. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు అధిక సంఖ్యలో మూతబడ్డాయి. ఏప్రిల్ లో చార్జీలు పెంచి పదిశాతం అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు కార్యాచరణను అమలు చేసింది. ఇందులో భాగంగా గృ హ వినియోగ విద్యుత్‌కు యూనిట్‌పై 50 పైసల నుంచి రూ 1 వరకు పెంచింది. ఇంకా ఎల్టీ వినియోగంపై 58 పైసలు, హెచ్‌టీ వినియోగదారులపై రూ 1.12 యూనిట్‌పై అదనపు భారాన్ని మోపింది. పప్పు, బియ్యం ధర పైపైకి.. పప్పు, బియ్యం ధరలు ఈ ఏడాది పాడవునా పెరుగుతూనే వచ్చాయి. పెసరపప్పు రూ 70 నుంచి రూ 92, పల్లి నూనె రూ 90 నుంచి రూ 110 పలికింది. బియ్యం ధరలు అడ్డగోలుగా ఎగబాకాయి. సన్న బియ్యం ధరలైతే ఓ మోస్తరు సంపాదన ఉన్నవారు కూడా కొనలేనంతగా పెరిగాయి. బీపీటీ రకం రూ 30 నుంచి ఏకంగా రూ 37కి చేరింది. ఫలితంగా మధ్యతరగతివారికి కుటుంబం గడవడం కష్టంగా మారింది. అన్నదాత అతలాకుతలం.. పుడమి బిడ్డలపై ప్రకృతి కత్తి కట్టింది. ఖరీఫ్‌లో వచ్చిన పై-లీన్ తుపాను జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు ఏకధాటిగా వర్షం విరిసిన పంజాకు అన్నదాత విలవిలలాడిపోయాడు. దిగుబడి చేతికి వచ్చే దశలో పంటలన్నీ కొట్టుకుపోయాయి. పొలాలు జలసంద్రమయ్యాయి. 3.80 లక్షల ఎకరాల్లో పత్తి, 91,865 ఎకరాల్లో వరి పైరు పనికిరాకుండా పోయింది. అంతేగాక 15 వేల ఎకరాల మిరప, 5060 ఎకరాల కంది, 1035 ఎకరాల వేరుశనగ, 930 ఎకరాల మొక్కజొన్న, 256 ఎకరాల ఆముదం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. దాదాపు రూ 900 కోట్ల మేర రైతులు నష్టపోయారని గుర్తించారు. అయితే పూర్తి స్థాయి సర్వే చేపట్టిన తర్వాత అధికారులు వెల్లడించిన వివరాలను చూసి రైతులు నిర్ఘాంతపోయారు. 50 శాతం, ఆపై పంట నష్టపోయిన వాటినే పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం. జిల్లాలో పత్తి, వరి, ఇతర అన్ని పంటలు కలిపి 1.20 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. మొత్తం 1,35,603 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు రూ 54.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా 15 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితుల్లో 95 శాతం పేదలే ఉన్నారు. మొత్తం రూ 60 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు లెక్కలుగట్టారు. దీనికితోడు మత్స్య కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారు. -
చుక్కల్లో ‘సన్నాలు’
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు. తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. -
పెరిగిన ధాన్యం, బియ్యం ధరలు
నిజామాబాద్ బిజినెస్/ మోర్తాడ్, న్యూస్‌లైన్ : జిల్లాలో 15 రోజుల క్రితం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,400 నుం చి రూ. 1,500 పలికింది. దాదాపుగా ధాన్యం రైతుల వద్దనుంచి దళారులు, మిల్లర్ల వద్దకు చేరిపోయింది. దీంతో ధాన్యం ధర పెరుగుతోంది. ప్రస్తుతం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,700 నుంచి రూ. 1,800 పలుకుతోంది. హెచ్ఎంటీ ధాన్యం ధర రూ.1,700ల నుంచి రూ. 2 వేలకు చేరింది. జైశ్రీరాం రకం ధాన్యం ధర రూ. 2 వేలనుంచి రూ. 2,300లకు పెరిగింది. కాగా దొడ్డురకం ధాన్యం ధర రూ. 1,300 ఉండగా ఇప్పుడు రూ. 1,400 లభిస్తోంది. దీంతో బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం బీపీటీ పాత బియ్యం ధర క్వింటాలుకు రూ. 3,400 ఉండేది. కొత్త బియ్యం రూ. 2,400 నుంచి 2,700 మధ్య విక్రయించేవారు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. పాత బియ్యం రూ. 3,800లుదాటింది. కొత్త బియ్యం రూ. 2,800 నుంచి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నారు. హెచ్ఎంటీ ధర రూ. 2,800 నుంచి 3,200లకు చేరింది. జై శ్రీరాం రకం బియ్యం మార్కెట్లో క్వింటాలుకు 4 వేల రూపాయలు పలుకుతోంది. ధర తగ్గుతుందనుకుంటే.. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పంటలు సైతం బాగానే పండాయి. దీంతో ఈసారి బియ్యం ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నెల క్రితం వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పండిన పంటను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించారు. బీహార్, మధ్యప్రదేశ్‌ల నుంచి వరి ధాన్యం దిగుమతి కొనసాగుతున్నా.. ఆ ధాన్యాన్ని పట్టిస్తే నూక ఎక్కువగా వస్తుండడంతో ధర పెరుగుతోంది. ధాన్యాన్ని ముందుగానే విక్రయించిన రైతులు ఇప్పుడు పెరిగిన ధరను చూసి నిరాశ చెందుతున్నారు. ధర పెరగడం వల్ల రైతుల కంటే వ్యాపారులు, రైస్‌మిల్లర్లు ఎక్కువగా లాభపడుతున్నారని స్పష్టం అవుతోంది. కాగా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు నిల్వ చేసుకొని ధర పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో పంట చేతికి వస్తోందని, త్వరలో అక్కడినుంచి ధాన్యం దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధాన్యం దిగుమతి అయిన తర్వాత బియ్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. -
ఆందోళన వద్దు
= బియ్యం ధరలపై ముఖ్యమంత్రి భరోసా = త్వరలో లెవీ సమస్య పరిష్కరిస్తాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మిల్లుల యజమానులు నిరవధిక సమ్మెకు దిగినప్పటికీ, బియ్యం ధర పెరగకుండా అన్ని చర్యలూ చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనిక్కడ జనతా దర్శన్‌లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. మిల్లర్లతో చర్చించాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావుకు సూచించామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల నుంచి మిల్లర్లు క్వింటాల్ రూ.1,600 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, క్వింటాల్ బియ్యం ధరను రూ.2,600గా నిర్ణయించామని వివరించారు. దీనికంటే ఎక్కువ ధరను కోరడం న్యాయం కాదన్నారు. రూపాయి కిలో బియ్యం పథకం అన్న భాగ్యకు 13.5 లక్షల టన్నుల లెవీ బియ్యం అవసరమని తెలిపారు. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఒకే సీఈటీని నిర్వహిస్తామని వెల్లడించారు. ఫీజు నిర్ధారణకు ఓ కమిటీని, సీట్ల పంపకానికి మరో కమిటీని నియమించామని చెప్పారు. ఈ దశలో 2006లో మాదిరే సీట్ల పంపకం ఉంటుందంటూ వస్తున్న వదంతులను ఆయన కొట్టి పారేశారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, ఒక వేళ నిర్లక్ష ్య వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్‌లో రైస్ మిల్లర్లు, సహకార సంఘాల చైర్మన్లు, ఐకేపీ సభ్యులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ప్రమాణాలతో కూడిన ధాన్యానికి మద్దతు ధర రూ.1345 ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూకం వేసిన 72గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించాలన్నారు. రైస్‌మిల్లులను, కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. మద్దతు ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద ధరల పట్టిక, హెల్ప్‌లైన్ నంబర్‌ను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ యంత్రాలు, టార్పాలిన్లు, తూకాలు, బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు బ్యాంకర్లకు అప్పులుంటే వాటితో ధాన్యం డబ్బులను ముడిపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. మరో రెండు వారాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలవుతుందన్నారు. బ్యాంకులో ఖాతాలు లేని రైతులకు అధికారులు సహకరించి ఖాతాలు తెరిచేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్ మాట్లాడుతూ మిల్లర్లు ఎల్లప్పుడు రైతుల పక్షానే ఉంటారన్నారన్నారు. సమావేశంలో జేసీ శరత్, ఆర్డీఓలు వనజాదేవి, ముత్యంరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి ఏసురత్నం, జిల్లా వ్యవసాయఅధికారిణి ఉమా మహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
పంట పండింది
= బియ్యం ధరలు తగ్గు ముఖం = గత ఏడాది కంటే 40 వేల టన్నులు అధికం = ఈసారి వర్షాలు బాగా పడటమే కారణం = ‘బ్లాక్’ వ్యాపారుల్లో గుబులు = మార్కెట్లోకి పాత నిల్వలు = రూ.60 నుంచి రూ.45కు త గ్గనున్న ‘సోనా’ = బ్లాక్ మార్కెట్లో ‘అన్న భాగ్య’ బియ్యం = అధికారులు, డీలర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కు = వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేసిన సర్కార్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇన్నాళ్లూ బియ్యం ధరలతో ఠారెత్తిపోయిన వినియోగదారులకు శుభ వార్త. ఈ ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో బియ్యం ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 40.24 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 40 వేల టన్నులు అధికం. ఈసారి వర్షాలు బాగా పడడంతో 10.45 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. గత ఏడాది కంటే సుమార లక్ష హెక్టార్లు ఎక్కువ. వచ్చే నెలలో పంట నూర్పిడి ప్రారంభమవుతుంది. దీంతో వర్తకులు గత కొద్ది వారాలుగా పాత నిల్వలను మార్కెట్‌కు విడుదల చేస్తున్నారు. దరిమిలా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. జనం మెచ్చే సోనా మసూరి బియ్యం సగటున రూ.60 నుంచి రూ.45కు తగ్గింది. ఈ సారి వరి దిగుబడి అంచనాల కంటే పది శాతం ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. పంట నూర్పిడి తర్వాత మార్కెట్‌ను బియ్యం ముంచెత్తడం ఖాయమని వర్తకులు చెబుతున్నారు. తదనంతరం బియ్యం ధర మరింతగా తగ్గవచ్చని వారు కూడా అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలో విసృ్తతంగా వర్షాలు పడడంతో జలాశయాలన్నీ నిండిపోయాయి. కనుక రైతులు రెండో పంట పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ పంటలు చేతికందతాయి. దీని వల్ల కూడా ధరలు మరింతగా తగ్గవచ్చని భావిస్తున్నారు. అడ్డదారిలో ‘అన్న భాగ్య’ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీలర్లు, బియ్యం వర్తకులు, దళారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. అన్న భాగ్య పథకానికి అవసరమైన బియ్యం లభించక పోవడంతో ప్రభుత్వం వర్తకుల ద్వారా నేషనల్ కమోడిటీస్ అండ్ డిరెవైటివ్స్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌సీడీఎక్స్) నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ పథకానికి నెలకు 2.46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా కేంద్రం నుంచి 1.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుతోంది. మిగిలిన బియ్యాన్ని ఎన్‌సీడీఎక్స్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అన్న భాగ్య బియ్యాన్ని నకిలీ బిల్లుల ద్వారా దారి మళ్లిస్తున్నారు. రేషన్ షాపుల స్థాయిలోనే ఈ విధంగా జరుగుతుండడంతో ఇటీవల ఆహార, పౌర సరఫరా శాఖ అధికారులు తుమకూరు, బెల్గాం, మైసూరు, హాసన, హుబ్లీలలో వంద చౌక దుకాణాల డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.