sarpanches
-
బిల్లులు ఇస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్‌లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచులు దశలవారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే పోలీసులు ప్రధాన గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజావాణికి వచ్చే వారిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి పంపించారు.మాజీ సర్పంచ్‌లు దఫదఫాలుగా బృందాలుగా ఏర్పడి ప్రధాన గేట్ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పీటీసీ సెంటర్‌కు తరలించారు. తాజా మాజీ సర్పంచ్‌లు పంజాల జగన్మోహన్గౌడ్, శ్రీధర్, సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఏడాదిగా మంజూరు చేయకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిల్లుల మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమన్నారు. -
మాజీ సర్పంచ్ల చలో హైదరాబాద్ భగ్నం
బంజారాహిల్స్/ రసూల్‌పురా (హైదరాబాద్): గ్రామ పంచాయతీల్లో చేసిన వివిధ పనులకు సంబంధించి తమకు రావాల్సి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చేరుకుని, పోరుబాటకు సిద్ధమైన మాజీ సర్పంచులు, సంఘం నేతలను బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చలో పోరుబాట పేరుతో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి వినతిపత్రాన్ని అందజేస్తామని వారు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సమయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా.. ప్రభుత్వం వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళతామనడం సరికాదని పేర్కొన్నారు. 2019 నుంచి హరిత హారం, మిషన్ భగీరథ, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు అప్పటి సర్పంచులు అప్పులు చేశారని.. పెండింగ్‌లో ఉన్న ఆ బిల్లు లు ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మాజీ సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాపోయారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కార్యదర్శి రాపాక నాగయ్య, నవీన్‌గౌడ్, సుభా‹Ùగౌడ్, గణేశ్ ముదిరాజ్, రాజేందర్, మల్లేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా హరీశ్‌రావు నిరసన పోలీసులు మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడికి చేరుకుని మాజీ సర్పంచులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు హరీశ్‌రావు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో వారు పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచి్చన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ దొంగలనో, టెర్రరిస్టులనో అరెస్టు చేసినట్టుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వారు అప్పులు చేసి, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని.. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.సర్పంచ్ల బకాయిలకు మాదీ గ్యారంటీ» పొలిటికల్ ట్రాప్‌లో పడకండి: పొన్నం» సర్పంచుల ఆత్మహత్యలకుకారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే సాక్షి, హైదరాబాద్: సర్పంచులు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని, వారి బకాయిలను చెల్లించే గ్యారంటీ తాము తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.సర్పంచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపిక పట్టాలని, మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు దఫాలవారీగా చెల్లిస్తామని అన్నారు. సర్పంచులకు నిధుల బకాయిలు బీఆర్ఎస్ చేసిన పాపమేనని, వారి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిది తెలంగాణ డీఎన్ఏ కాదు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ డీఎన్ఏ లేదని, ఆ డీఎన్ఏ ఉంటే తెలంగాణ కోసం ఆయన ఏదైనా చేసేవారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని ఆ పార్టీ నేతలకు పొన్నం సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. -
అప్పటి పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తాం
సాక్షి, హైదరాబాద్: మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందొద్దని..పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అప్పుడు జరిగిన పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లతో బలవంతంగా పనులు చేయించలేదని, బిల్లులు ఆపలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, అయినా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ‘మీ బిల్లుల ను ఆపిన మాజీ మంత్రులకు మీరు వంత పాడటం తగదు. వారి రాజకీయ కుట్రలకు మాజీ సర్పంచ్ లు బలి కావొద్దు’అని కోరారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా రాలేదని, అలాంటప్పుడు వాటి ని దారి మళ్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మాజీ సర్పంచ్‌లను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదని సోమ వారం ఒక ప్రకటనలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులపై పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా కథనాలను ఆమె మీడి యాకు విడుదల చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకపోగా, వారితో బలవంతంగా పనులు చేయించింది. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది’ అని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు మాజీ సర్పంచ్‌లపై ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆర్థిక మంత్రిగా హరీశ్ ఉన్నప్పుడే తమ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచ్‌లకు స్పష్టంగా తెలుసని, తాము వచ్చాక రూ. 580 కోట్లు చెల్లించామన్నారు. కేసీఆర్, హరీశ్‌ల ఇళ్ల ఎదుట ధర్నా చేయండి ‘డ్రామాలు చేయడం.. ఆత్మహత్యలకు పురికొల్పడం హరీశ్‌రావుకు అలవాటు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమై...నేడు తిరిగి వారిని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే హరీశ్, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌లను వాడుకుంటోంది. గతంలో సర్పంచ్ల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌రావు కారణం కాదా ? బిల్లులు పెండింగ్‌లో పెట్టిన వారి ఇళ్ల ముందు మాజీ సర్పంచులు ధర్నా చేయాలి’ అని సీతక్క అన్నారు. -
మన సర్పంచులు @ ఐరాస
మహిళాసాధికారతపై ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో ప్రసంగించడానికి భారతదేశం నుంచి ముగ్గురు సర్పంచులకు ఆహ్వానం అందింది. ఈ నెల 3న అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి నిర్వహిస్తున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి నుంచి సర్పంచ్ హేమకుమారి, త్రిపుర నుంచి సుప్రియాదాస్ దత్తా, రాజస్థాన్ నుండి నీరూ యాదవ్ పాల్గొంటున్నారు.‘భారతదేశంలో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారతదేశం నుంచి ముగ్గురు మహిళా ప్రతినిధులతో ఒక ΄్యానెల్ చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారు తమ విజయగాథలను పంచుకుంటారు. అలాగే లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి వారి పంచాయితీలలో చేసిన కృషిని కూడా పంచుకుంటారు. వీరిని మూడు రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.మూడు కీలకమైన స్తంభాలు: హేమకుమారిపశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీలో స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం కోసం కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది. సర్పంచ్‌గా హేమకుమారి 2021లో పదవిని చేపట్టినప్పటి నుంచి మూడు కీలకమైన స్తంభాలపై దృష్టి సారించి పరివర్తన కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. అవి.. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం. సరైన ΄ోషకాహారం, ప్రసవానికి సంబంధించిన అవగాహన పెంచడానికి క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు, విద్యాకార్యక్రమాలను చేపట్టింది. దీని ఫలితంగా ముప్పు అధికంగా గల గర్భధారణ కేసుల సంఖ్య, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాలపై హేమకుమారి తాను చేసిన ప్రయోజనకరమైన పనులను, వచ్చిన ఫలితాలను తెలియజేయనుంది.హాకీ సర్పంచ్: నీరూయాదవ్ రాజస్థాన్‌లోని బుహనా తహసీల్‌లోని లంబి అహిర్ గ్రామ సర్పంచ్ నీరూ యాదవ్ ‘నాయకత్వ అనుభవం’పై తన అభి్రపాయాలను వెల్లడించనున్నారు. నీరూ యాదవ్ 2020లో లంబి అహిర్ గ్రామపంచాయితీకి సర్పంచ్ అయ్యింది. బాలికలు, మహిళల సాధికారత కోసం నీరూ యాదవ్ ఎన్నోపనులు చేశారు. భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడానికి ఐక్యరాజ్యసమితి నీరూని పిలవడానికి కారణం ఇదే. పంచాయితీ పనులతో పాటు రాష్ట్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా తన పంచాయితీలోని బాలికల హాకీ జట్టును తన సొంత ఖర్చుతో సిద్ధం చేసింది. ఈ చొరవ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఆమెను హాకీ సర్పంచ్ అని పిలుస్తారు. గ్రామ పంచాయితీని ΄్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చొరవ తీసుకుంది. పాత బట్టల సంచులను తయారు చేయడం ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించింది. గ్రామ ప్రజలరె పర్యావరణం వైపుగా ్ర΄ోత్సహించేలా కొత్త ప్రచారాన్ని ్రపారంభించింది. ప్రతి నెలా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే పింఛన్ వెళ్లేందుకు శ్రీకారం చుట్టింది. పంచాయితీ స్థాయి సర్పంచ్ పాఠశాలను ్రపారంభించి, బాలికలకు కంప్యూటర్ విద్యతో పాటు డిజిటల్ అంగన్వాడీ, మోడ్రన్ ప్లే స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. చిన్న పల్లెటూరిలో ఉండి కూడా గొప్ప పని చేయగలమని నీరూ నిరూపించింది.చర్చావేదిక: సుప్రియా దాస్ దత్తా ఫార్మసీలో డిప్లమా చేసిన సుప్రియా దాస్ దత్తా త్రిపుర నివాసి. సెపాహిజాల జిల్లా పంచాయితీ అధ్యక్షురాలు. ప్రజాతీర్పులో మహిళల భాగస్వామ్యాన్ని చాటడానికి సుప్రియ బలమైన న్యాయవాదిగా ఎదుగుతున్నారు. సుప్రియ తన జిల్లాలో మహిళల కోసం చర్చా వేదికను ్రపారంభించారు. ఇక్కడ ప్రజలు జిల్లా పంచాయితీ అధికారులకు ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి సమస్యలపై తమ ఆందోళనలు, ఆలోచనలను తెలియజేయవచ్చు. సుప్రియ చేస్తున్న పనులను ప్రధాని మోదీనీ ఆకట్టుకున్నాయి. పిల్లల సంరక్షణ సౌకర్యాలను ్ర΄ోత్సహించడంలో కూడా చురుకుగా పాల్గొంటున్నది. లోతుగా పాతుకు΄ోయిన సామాజిక నిబంధనలను పరిష్కరించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించవచ్చని సుప్రియ గట్టిగా నమ్ముతోంది. సమాజంలో తాను ΄ోషించే పాత్ర ద్వారా మహిళలు పురుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాలనుకుంటోంది. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
ముగియనున్న పంచాయతీల పదవీకాలం.. ఆవేదనలో సర్పంచ్‌లు!
మిర్యాలగూడ : సర్పంచ్ల పదవీకాలం 20 రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. పదవీ కాలం ముగిశాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్‌లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సర్పంచ్‌లకు అందని బిల్లులు.. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి లైట్ల ఏర్పాటు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లను అందించింది. మల్టీ పర్పస్ వర్కర్లను నియమించింది. కాగా, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో సర్పంచ్‌లు అప్పలు చేసి మరీ పనులు పూర్తి చేశారు. ఇలా ఒకొక్కరు సుమారు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు అప్పులు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో తమ పదవీకాలం ముగుస్తుండడం.. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రూ.300 కోట్లకు పైగా పెండింగ్! గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు పనులు అధికారులు సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పూర్తి చేయించారు. ఒక్కో రైతు వేదికను రూ.22లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా అందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా మిగిలిన రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధిహామీ నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఇంత వరకు అందలేదని పలువురు చెబుతున్నారు. ఇలా ప్రతి పనికీ అరకొరగానే బిల్లులు విడుదలయ్యాయని అంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ప్రభుత్వమైనా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. రూ.70లక్షలు రావాల్సి ఉంది.. గ్రామాభివృద్ధి కోసం వడ్డీకి తీసుకొచ్చి పని చేశా. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి సమస్య తీర్చేందుకు బోరు మోటార్లకు ఖర్చు చేశా. ఈనెల చివరన పదవీకాలం ముగియనుంది. నేను గ్రామాభివృద్ధి కోసం పెట్టన ఖర్చులో ఇంకా రూ.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలి. – చల్లా అంజిరెడ్డి, సర్పంచ్, వీర్లపాలెం అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం గ్రామాభివృద్ధికి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు చేపట్టాం. దానికి సంబంధించిన ఎంబీ రికార్డులను కూడా సమర్పించాం. వెంటనే బిల్లులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా గ్రామంలో రూ.30 లక్షల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని అందించాలి. పదవీ కాలం పొడిగించాలి. – దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, రావులపెంట -
బీఆర్ఎస్కు షాక్.. సర్పంచ్ల మూకుమ్మడి రాజీనామా
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): అధికార పార్టీకి చెందిన ఆదివాసీ సర్పంచ్‌లు రాజీనామా అస్త్రం సంధించారు. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగడంలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు సమావేశమై గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆదివాసీ సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి సిడాం అన్నిగా విలేకరులతో మాట్లాడుతూ 2021 నుంచి నేటి వరకు ప్రభుత్వ విధానాలతోపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా అందడంలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని సమస్యలను పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. భూప్రక్షాళన తర్వాత చాలామంది రైతులకు కొత్తపట్టాలు రాలేదని, రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. రాజీనామా ప్రతులను వాట్సాప్ ద్వారా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసినవారిలో ఆదివాసీ సర్పంచుల మండల అధ్యక్షుడు కోట్నాక కిష్టు, సర్పంచులు దేవ్‌రావు, పెందూర్ పవన్, జంగు, మనోహర్ తదితరులు ఉన్నారు. గతంలోనూ రాజీనామా.. ఏడాది క్రితం మండలంలోని సర్పంచులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేందుకు సైతం వెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. -
అభివృద్ధి పనులంటేనే హడల్!
కూలి పనికి వెళ్తున్న సర్పంచ్ ఈమె పేరు బానోతు బుజ్జి ఖాసీం నాయక్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా సర్పంచ్. గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ప్రహరీ నిర్మాణం, ఇతరత్రా పనులకు రూ.18 లక్షలు వెచ్చించారు. పూర్తయి ఏడాదైనా బిల్లులు రాలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఆమె కూలి పనులకు వెళ్తోంది. ►నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి గతంలో ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.1.35 లక్షలు వచ్చేవి. కానీ ఇప్పుడవి రూ.89 వేలకు తగ్గిపోయాయి. ఇందులో రూ.25 వేలు కరెంటు బిల్లు, రూ.25 వేలు కార్మికుల వేతనాలు, రూ.10 వేలు ట్రాక్టర్ ఈఎంఐ, రూ.10 వేలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు పోతోంది. ఇవి కాకుండా పేపరు బిల్లులు, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతే మరమ్మతులు చేయించడం, పైపు లైన్లు పగిలితే వేయించడం, పల్లె వనాలు, పంచాయతీ స్థలాలకు ఫెన్సింగ్ వేయించడం, డ్రైనేజీల నిర్వహణ పనులు కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ►చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే ముందస్తుగా వైకుంఠధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, డంపింగ్ యార్డులు, వాటిల్లో సెగ్రిగేషన్ (చెత్తను విభజించే) షెడ్లు నిర్మించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) మెటీరియల్ కాంపోనెంట్ కింద వీటికి నిధులు రావలసి ఉంది. కానీ రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలా ఒక్కో గ్రామంలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీల్లో నెలవారీ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదు. దీంతో సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి వస్తోంది. రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు సకాలంలో రాకపోగా, అదనంగా వెచ్చించినవి నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డు వంటి నిర్మాణాలు ఏడాది, రెండేళ్ల కిందటే పూర్తయినా బిల్లులు రాలేదు. ఆరు నెలలుగా పైసా విడుదల కాలేదు. ఇవే రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్లు రావాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన సర్పంచ్‌లు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్నారు. ఈ కారణంతోనే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట సర్పంచ్ బండి ఎల్లయ్య ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది సర్పంచ్‌లు అప్పులు తీర్చేందుకు కూలి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తాము మళ్లీ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎక్కడ అప్పులు చేయాలని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనుల కోసం మరోసారి అప్పు అంటేనే వారు హడలెత్తిపోతున్నారు. బిల్లులు విడుదల చేయమంటే బెదిరింపులు తాము చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని, లేదంటే పల్లె ప్రగతిలో పాల్గొనబోమని ఇటీవల స్పష్టం చేసిన సర్పంచ్‌లను అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాలకు చెందిన సర్పంచ్‌లను నిధులు రాలేదని బహిరంగంగా ఎలా విమర్శిస్తారని ఆ మండల ఎంపీడీఓలు బెదిరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను నోటీసు బోర్డు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదీ జిల్లాల్లో పరిస్థితి.. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.43 కోట్లకు పైగా బకాయిలున్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.49.82 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రెజరీలో 200కు పైగా గ్రామపంచాయతీల చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు డబ్బులు రావాల్సి ఉంది. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.150 కోట్లకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా రావాల్సిన బిల్లులు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.98 కోట్లు పెండింగ్ ఉన్నాయి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఇతర పనులవి కోట్ల రూపాయల బిల్లులు ఐదారు నెలలుగా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ కావటం లేదు. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రావాల్సినవి రూ.62 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు రూ.95 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలకు రూ.60 కోట్లు, మెదక్ జిల్లాలో 445 గ్రామ పంచాయతీలకు రూ.40 కోట్లు రావాల్సి ఉంది. ►జనగామ జిల్లాలో రూ.3.10 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ములుగు జిల్లాలో రూ.2 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.6 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.7 లక్షల అప్పు.. తీర్చలేక ఆత్మహత్యాయత్నం సీసీ రోడ్లు, శ్మశానవాటిక, పారిశుధ్య పనులకు రూ.11 లక్షలు ఖర్చు చేశా. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలే వచ్చాయి. రెండేళ్లుగా రూ.9 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో రూ.7 లక్షలు అప్పు చేసినవే. అవి చెల్లించలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశా. – బండి ఎల్లయ్య, సర్పంచ్, అవుసలికుంట, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా వడ్డీలు పెరిగిపోతున్నాయి రూ.5 లక్షలు అప్పు చేసి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించా. పూర్తయి ఏడాది దాటింది. మరో రూ.4 లక్షలు ఇతర పనులు చేశా. రూ.9 లక్షలు రావాలి. ఆలస్యం అవుతుండటంతో వడ్డీలు పెరుగుతున్నాయి. –బానోత్ రాందాస్, చుంచుపల్లి మండలం ధన్‌బాధ్, భద్రాద్రి కొత్తగూడెం బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది రూ.18 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, రైతు వేదిక, స్మశానవాటిక నిర్మించా. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది అవుతోంది. –తోట సుజాత, నెన్నెల సర్పంచ్, మంచిర్యాల -
AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్!
పలాస/జంగారెడ్డిగూడెం: ఇప్పటికే వలంటీర్లు ఎంతో మంది సర్పంచ్‌లుగా ఎన్నికై ప్రజా సేవ చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు మరికొందరు వలంటీర్లు చేరారు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్లా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన ఆ గ్రామ వలంటీర్ తుంగాన రమణమ్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బంగారి జ్యోతిపై 1,199 ఓట్ల మెజారిటీ సాధించారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన రమణమ్మ ఇంటర్ వరకూ చదివారు. జీవనోపాధి కోసం వలంటీర్‌గా పనిచేస్తున్నారు. తన సేవల ద్వారా అతి తక్కువ కాలంలోనే గ్రామంలో మంచి పేరు తెచ్చుకుని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం వలంటీర్‌గా పనిచేస్తున్న తానిగడప నిర్మలకుమారి కూడా అమ్మపాలెం ఎంపీటీసీగా గెలుపొందారు. తాను పనిచేస్తున్న నిమ్మలగూడెం గ్రామం అమ్మపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. తన సమీప ప్రత్యర్థి, జనసేన అభ్యర్థి దాసరి ప్రవీణ్‌కుమార్‌పై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఈడీ వరకూ చదివిన నిర్మలకుమారి.. వలంటీర్‌గా తనకున్న అనుభవంతో మరింత సమర్థంగా ప్రజా సేవ చేస్తానని చెప్పారు. ఆమెను ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా అభినందించారు. -
వారికి ఆ పదవే తొలిమెట్టు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గ్రామ స్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ సర్పంచ్‌లకు పరిపాలనను సులభతరం చేశారన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో సర్పంచ్ల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు గ్రామ సర్పంచ్ పదవి తొలిమెట్టు అని, సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత సర్పంచులదే అని పేర్కొన్నారు. గ్రామ పరిపాలనలో సర్పంచ్ల పనితీరే కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచాలని పెద్దిరెడ్డి తెలిపారు. -
అదే ఆనవాయితీ.. వారే సర్పంచ్‌లు..
మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్‌కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్‌లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్ మహిళగా రిజర్వ్ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది. చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
తుది విడతలో 553 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: చివరి విడతగా ఈనెల 21న జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 553 పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. తుది విడతలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల సంఖ్యతోపాటు మిగిలినచోట్ల ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నాలుగో విడతలో మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీకాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 553 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,744 చోట్ల సర్పంచ్ స్థానాలకు ఈ నెల 21వ తేదీన చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 7,475 మంది అభ్యర్ధులు సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 33,435 వార్డులున్నాయి. వీటిలో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22,422 వార్డుల్లో ఈ నెల 21న జరగనున్న ఎన్నికల బరిలో 49,083 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన 92 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. చదవండి: ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు.. పేదలపై భారం మోపలేం.. -
523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా.. సర్పంచ్ పదవుల కోసం 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) 18,168 మాత్రం సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలి విడతలో విజయనగరం జిల్లా లేదు. మిగిలిన 12 జిల్లాలను పరిశీలిస్తే.. తొలి విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 454 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,499 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డులకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.(చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) -
అనగనగా ఒక ఊరు.. అందరిదీ ఒకేమాట
ఉలవపాడు: పెదపట్టపుపాలెం.. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార గ్రామం. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదంటే అతిశయోక్తికాదు. ఇప్పటి వరకు సర్పంచ్‌లందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. పెద్దలందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉంటారు. పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయాలు జరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం కూడా లేకుండా చేస్తారు. తొలుత చాకిచర్ల నుంచి 1998లో పెదపట్టపుపాలెం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఆ తరువాత నాలుగు సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన ఎన్నికల్లో ప్రళయ కావేరి సుబ్రమణ్యం, 2003లో ఆవుల జయరాం, 2008 లో వాయల పోలమ్మ, 2013 లో తుమ్మల తిరుపతమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న రెండు శతాబ్దాల నాటి చెట్టు కింద కూర్చుని గ్రామస్థులందరూ కలసి కాపుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. పెదపట్టపుపాలెం గ్రామం వ్యూ .. ఆదర్శప్రాయం... పెదపట్టపుపాలెం గ్రామం విడిపోయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇటీవల సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియతో సహా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎంపీటీసీ ఎన్నికలు జరగాయి. అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 4239. ఇందులో 2147 మంది పురుషులు, 2098 మంది మహిళలు. 3070 మంది ఓటర్లలో 1574 మంది పురుషులు, 1496 మంది మహిళలు ఉన్నారు. ఇంత మంది ఓటర్లు ఉన్నా అందరూ కలసికట్టుగా ఒకే నిర్ణయానికి కట్టుబడుతున్నారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవానికి నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల నిధులు కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. ఈ సారీ ఏకగ్రీవమే అయితే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నజరానా అందే అవకాశం ఉంది. ఇలా ఈ గ్రామం వివాదాలకు తావులేకుండా ఎన్నికల వ్యయం ప్రభుత్వానికి భారం కాకుండా ఆదర్శవంతంగా నిలుస్తోంది. చదవండి: ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు! పెద్దల మాటకు గౌరవం..: ఇక్కడ గ్రామçస్థులు పెద్దల మాటకు గౌరవం ఇస్తారు. అధికారులకు కూడా సమస్యలు రాకుండా చూస్తారు. ఇక్కడ పని చేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. – మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శి -
‘హుజూర్నగర్ ఉపఎన్నికలో 251 నామినేషన్లు’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం నుంచి 251 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేసి పోటీ చేస్తారని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్నయాదవ్ వెల్లడించారు. సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌లపై ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో సర్పంచ్ల సంఘం పోటీ చేస్తుందని తెలిపారు. ‘హలో సర్పంచ్ చలో హుజూర్నగర్’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా అమలు చేయలేదని ఆరోపించారు. ఇటీవల బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సారధ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, జి.కిషన్‌రెడ్డిలను కలిసి గ్రామ సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో సంఘం నేతలు జూలూరి ధనలక్ష్మి, పి.ప్రణీల్‌చందర్, మల్లేష్ ముదిరాజ్, శ్రీరాంరెడ్డి, ఎం.యాదన్న యాదవ్, బి.శంకర్ తదితరులు ఉన్నారని ఆయన తెలిపారు. (చదవండి: హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్) -
ఎట్టకేలకు చెక్ పవర్
మోర్తాడ్/ధర్పల్లి/నిజామాబాద్‌అర్బన్: నాలుగున్నర నెలల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర పడింది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరికి కలిపి చెక్‌పవర్ అప్పగించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత నాలుగున్నర నెలల పాటు నిధుల వినియోగానికి అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. కొంత మంది సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పిస్తూ వచ్చారు. అయితే, ఎట్టకేలకు చెక్ పవర్ రానుండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జూలై 17 నుంచి పంచాయతీల్లో చెక్ పవర్ అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవో నెం.30 జారీ చేసింది. నాలుగున్నర నెలులుగా ఖాళీగానే.. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్ అమలు ఉన్నందున పంచాయతీలకు చెక్ పవర్‌పై జాప్యం ఏర్పడింది. గత జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి రెండో తేదీన సర్పంచ్‌లకు పదవీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే చెక్ పవర్‌ను కల్పించాల్సి ఉన్నా తీవ్ర కాలయాపన చేసిందనే విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంది. చెక్ పవర్ విషయంలో జాప్యం చేయడంపై సర్పంచ్‌లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు సర్పంచ్‌లు భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఎట్టకేలకు చెక్ పవర్‌ను కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ లభించనుంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు కూడా ఇదే విధానం వర్తించనుంది. కొత్త చట్టంతో ఉప సర్పంచ్‌లకు.. గతంలో సర్పంచ్‌లకే చెక్ పవర్ ఉండేది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగం కోసం ఎంపిక చేసిన వార్డు సభ్యుడితో జాయింట్ చెక్ పవర్ విధానం అమలైంది. అయితే సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ ఉండటంతో పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సర్పంచ్‌లకు, కార్యదర్శులకు కలిపి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. అయితే, ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది. సర్పంచ్, కార్యదర్శి జాయింట్ చెక్ పవర్ విధానానికి స్వస్తి పలుకుతూ, సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌లకు ఈ అధికారం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు సంబంధించి అన్ని రకాల నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఇరువురికి అధికారం అప్పగించింది. అయితే, నిధుల వినియోగం ఆడిట్‌కు సంబంధించిన బాధ్యత మాత్రం సర్పంచ్, కార్యదర్శులకు ఉంది. దీంతో ఉప సర్పంచ్ కేవలం జాయింట్ చెక్ పవర్‌కు మాత్రమే అర్హత లభించినట్లయింది. నిధుల వినియోగం, అందుకు సంబంధించిన లెక్కల బాధ్యత అంతా సర్పంచ్, కార్యదర్శులే మోయాల్సి ఉంది. ఉప సర్పంచ్‌ల్లో ఆనందం.. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందని ప్రభుత్వం అప్పట్లోనే జీవో జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధం లేకుండానే ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవచ్చని వార్డు సభ్యుల్లో ఉత్సాహం నిండింది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేసి పదవిని దక్కించుకున్నారు. కానీ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయక పోవటంతో వారు ఆందోళన చెందారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్‌ను ఇస్తున్నారని లీకులు రావటంతో ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు ఆశలు వదులుకున్నారు. అయితే, కొత్త పంచాయతీ చట్టం ప్రకారమే ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ రావడంతో వారిలో ఆనందం వెల్లి విరుస్తోంది. మొండికేస్తే తొలగించే అధికారం.. నిధుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌తో పాటు చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచ్‌లు.. చెక్కులపై సంతకాలు చేయడానికి మొండికేస్తే ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్‌ను తొలగించే అధికారం జిల్లా పంచాయతీ అధికారులకు ఉంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. అయితే, అనేక చోట్ల సర్పంచ్‌లతో ఉప సర్పంచ్‌లు సమన్వయంతో పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిధుల వినియోగంపై తీర్మానం చేసినా చెక్‌లపై సంతకాలు చేయడానికి ఉప సర్పంచ్‌లు నిరాకరిస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి డీపీవోకు నివేదిక పంపాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు చేయడానికి సహకరించక పోతే వారి చెక్ పవర్‌ను తొలగించి కార్యదర్శికే ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సర్కారు తాజా మార్గదర్శకాలు ఇవి.. పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు సర్పంచ్, ఉపసర్పంచ్ బ్యాంక్ చెక్కులపై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యాలయం నుంచి ఏమైన ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రం సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆడిట్ బాధ్యతలను సర్పంచ్, కార్యదర్శులకు అప్పగింత. గ్రామసభ నిర్వహణ, పంచాయతీ నిధుల వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శిని భాగస్వామ్యం చేశారు. పంచాయతీల్లోని ప్రతి పని ఆన్లైన్ ద్వారా అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామసభలు, పంచాయతీ సమావేశాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి మూడు రోజుల్లో ఈవోపీఆర్డీకి పంపించాలి. పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానాలను కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై ఉంచాలి. వాటిని పంచాయతీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కార్యదర్శికి అప్పగించిన బాధ్యతలను అమలు చేస్తూ, వాటిని పై అధికారులకు అందించాల్సి ఉంటుంది. అట్టి నివేదికల్లో ఏమైన పొరపాట్లు జరిగినట్లు తేలితే కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. గ్రామసభ నిర్వహించేందుకు నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామసభ నిర్వహిస్తే అట్టి గ్రామ పంచాయతీ జనాభాకు అనుగుణంగా ప్రజలు హాజరుకావాల్సి ఉంటుంది. 500 ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలంటే కనీసం 50 మంది హాజరుకావాలి. ప్రజలు హాజరు కాని ఎడల గ్రామసభను వాయిదా వేసి, మరో రోజు నిర్వహించాలి. గ్రామసభకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీయించి వెబ్సైట్లో ఉంచాలి. పంచాయతీ విధులను నిర్వహించే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారిని కలెక్టర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసే అధికారం ఉంది. పంచాయతీ పాలన సక్రమంగా నిర్వహించేందుకు పాలకవర్గం సభ్యులు కట్టుబడి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పాలనకు గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం ప్రకారం చెక్ పవర్ అమలు చేస్తుండటంతో గ్రామ పాలనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. పంచాయతీ పాలకులు ఎన్నికై నాలుగున్నర నెలలకైనా చెక్ పవర్ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం. ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తాం. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పాలన అందిస్తాం. – ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్, సర్పంచ్ ఆనందంగా ఉంది.. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్లో భాగస్వామ్యం కల్పించటం ఆనందంగా ఉంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ అందిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయటం మంచి పరిణామం. ఇద్దరికి కలిపి చెక్ పవర్ ఇస్తేనే గ్రామం త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. – నూకల రమేశ్, ఉప సర్పంచ్, దుబ్బాక -
పంచాయతీకి ‘పవర్’
నల్లగొండ : పల్లె పాలన ఇక పట్టాలెక్కనుంది. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసింది. సోమవారం నుంచి చెక్ జాయింట్ చెక్‌పవర్ విధానం అమల్లోకి రానుంది. చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్ పవర్ ఉండగా, ఈ సారి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్‌ను ఇచ్చారు. కాగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌పై సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 844 పంచాయతీలు.. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా 831 గ్రామ పంచాయతీలకు జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక సర్పంచ్‌లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం చెక్ పవర్‌ను సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వాలా..? సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు ఇవ్వాలా అనే అంశాలపై సమాలోచన చేసింది. మొన్నటి వరకు వరుసగా ఎన్నికలు రావడంతో.. కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో చెక్‌పవర్‌పై నిర్ణయం వెలువరించింది. ఖాతాల్లోనే 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ముందు గ్రామంలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోతున్నందున వారు నిధులు ఇష్టానుసారంగా డ్రా చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిపై ప్రీజింగ్ పెట్టింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా నాలుగున్నర నెలలుగా ఏ సర్పంచ్ కూడా ఖర్చు చేయలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అప్పులు చేసి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వని కారణంగా ప్రస్తుత సర్పంచ్‌లు అప్పులు చేసి మరి గ్రామాల్లో పనులు చేపట్టారు. కొత్తగా ఎన్నిక కావడంతో.. పనులు చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయంతో గ్రామాల్లో పనులు చేప్టటేందుకు సొంతంగా నిధులు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడలేదు. వేసవి కావడంతో గ్రామాల్లో పెద్దయెత్తున నీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి అత్యవసర పనులకు అప్పులు చేయాల్సి వచ్చిందని.. పలువురు పేర్కొన్నారు. అసంతృప్తిలో సర్పంచ్‌లు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంపై సర్పంచ్‌లు అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ వేర్వేరు పార్టీలకు చెందినవారు ఉంటే.. పనులపై నిర్ణయం తీసుకోవడంలో, నిధులు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొందరు మాత్రం జాయింట్ చెక్ పవర్ ఉంటేనే.. పంచాయతీ పాలకవర్గమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్రామంలో ఏది అత్యవసరమైన పనో వాటిని చేపట్టేందుకు అవకాశం ఉండడంతో పాటు పనుల్లో కూడా అవతకవకలకు అవకాశం ఉండదని కొందరు పేర్కొంటున్నారు. కార్యదర్శుల పర్యవేక్షణ.. ప్రభుత్వం నిధుల ఖర్చుపై ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని, చేయకపోతే కార్యదర్శిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా సమావేశాల తీర్మాణాలను కూడా నోటీస్ బో ర్డుపై ఉంచాల్సి ఉంటుంది. లేఅవుట్లు, భవన ని ర్మాణాల అనుమతులకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. తద్వారా పనులు గడువులోపు పూర్తికావడంతో పాటు గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చేఅవకాశం ఉంది. -
ఇక ‘జాయింట్’ పవర్
జైనథ్: నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీల్లో నూతనంగా కొలువుదీరిన సర్పంచులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చెక్ పవర్‌ను జారీ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. దీంతో గ్రామాల్లో ఎన్నో రోజుల నుం చి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి మార్గం సుగమమైంది. సమస్యలతో సతమతం.. గ్రామాల్లో పాలకవర్గం ఫిబ్రవరిలో కొలువుదీరింది. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. కనీసం మురికి కాలువలు తీయడం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేని స్థితిలో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2018 చివర్లో జిల్లాకు ఎఫ్ఎఫ్సీ నిధులు విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీల వారీగా ఖాతాల్లో జమ కావడంతో అప్పటి పాలక వర్గాలు 60 శాతం నిధులు ఖర్చు చేశాయి. 2019 ఫిబ్రవరిలో కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. కానీ నిధులు ఉన్నప్పటికీ కూడా చెక్‌పవర్ లేకపోవడంతో నిధులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. మళ్లీ 2019 మార్చిలో ఎఫ్ఎఫ్సీ మరోవిడత కింద 14కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమఅయ్యాయి. కానీ చెక్‌పవర్ లేకపోవడం ఎఫ్ఎఫ్సీ నిధులు ఖాతాల్లో మూలుగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో నిధులను ఉపయోగించుకోవచ్చు. జాయింట్ చెక్ పవర్‌పై అసంతృప్తి.. సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అప్పట్లో చెక్‌పవర్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో సర్పంచులు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే శనివారం హఠాత్తుగా జాయింట్ చెక్‌పవర్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వార్డు మెంబర్‌తో గెలిచిన వ్యక్తికి సర్పంచ్‌తో సమానంగా చెక్‌పవర్ కల్పించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప సర్పంచులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పర్యవేక్షణకే కార్యదర్శులు.. కార్యదర్శుల స్థానంలో ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ ఇవ్వడంతో కార్యదర్శుల పాత్ర పర్యవేక్షణకే పరిమితం కానుంది. కార్యదర్శికి ఏ మాత్రం చెప్పకుండా సర్పంచ్, ఉపసర్పంచ్లు నిధులను డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో జవాబుదారీతనం, పారదర్శకత లోపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగి, అధికారులకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉండదని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చెక్ పవర్ కల్పించడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.. నాలుగు నెలలుగా గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నాం. ఉన్న నిధులతో వీధిదీపాలు, తాగునీరు, పలు వసతులు క ల్పించాం. ప్రస్తుతం చెక్ పవర్ ఇవ్వడంతో గ్రామ పంచాయతీలు నిధులు ఉపయోగించుకునేందుకు అవకాశం లభించింది. ఎట్టకేలకు ప్రభుత్వం చెక్‌పవర్ జారీ చేయడం సంతోషంగా ఉంది. – ఎడ్మల పోతరెడ్డి, సర్పంచ్, పూసాయి -
జాయింట్ చెక్ పవర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చెక్ పవర్‌పై సందిగ్ధం వీడింది. గ్రామ సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక గ్రామస్థాయిలో పంచాయతీ పాలన వేగవంతం కానుంది. ఇప్పటి వరకు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన సర్పంచ్‌లకు ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది. జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా ఏన్కూరు మండలం నూకాలంపాడు సర్పంచ్ మినహా 583 పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఈ అధికారం దక్కింది. సుమారు ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వీరికి ఈ అవకాశం లభించడంతో ఆనందంగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్ పవర్ లేకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఇప్పటివరకూ నెలకొంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పంచాయతీ పాలకులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. ఏన్కూరు మండలంలో నూకాలంపాడుకు సర్పంచ్ లేకపోవడంతో ఉప సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి నిరీక్షణ.. జిల్లాలో జనవరి నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరగ్గా ఫిబ్రవరి 2వ తేదీన పాలకవర్గం ఏర్పడి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. అయితే..అప్పటి నుంచి తమకు చెక్ పవర్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెక్‌పవర్ వస్తే త్వరగా గ్రామాభివృద్ధిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించవచ్చనే ఆలోచనలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఉన్నారు. గతంలో ఇలా... గతంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేది. సర్పంచ్, కార్యదర్శి ఇరువురు ఉప సర్పంచ్‌కు, గ్రామ ప్రజలకు తెలియకుండా తమకు నచ్చిన పనులు చేసేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఉప సర్పంచ్‌కు ఎలాంటి అధికారాలు లేకుండా నామమాత్రంగా పేరుకే అన్న చందంగా నాటి పరిస్థితి తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం అమలు చేయబోతున్న జాయింట్ చెక్ పవర్‌తో ఉపసర్పంచ్ పదవికి విలువ పెరగబోతోంది. నిధులున్నా..వెనుకంజ జిల్లాలో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ కింద పలు గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్‌పవర్ లేకపోవడంతో పనులు చేసేందుకు గ్రామ పంచాయతీలు వెనుకంజ వేశాయి. ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్ పవర్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించడంతో ఎంపీడీఓలు వారి పేర్లు, సంతకాలను సేకరించడంతో పాటు ఎస్టీఓ, డీటీఓ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయితేనే చెక్ పవర్ విధానం అమలవనుంది. శుభ పరిణామం.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను ఇవ్వడం శుభ పరిణామం. ఇరువురికి చెక్‌పవర్ ఉండడం వల్ల అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉప సర్పంచ్‌లకు మరింత గుర్తింపు లభించినట్లయింది. –నున్నా వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్, రేగులచలక, రఘునాథపాలెం మండలం -
ఉత్కంఠకు తెర!
ఒంగోలు టూటౌన్: ప్రభుత్వం నిర్ణయం పంచాయతీ పాలకవర్గాలకు నిరాశే మిగిల్చింది. సర్పంచులను పర్సన్ ఇన్చార్జులుగా నియమిస్తారన్న ఆశలు ఆడియాశలయ్యాయి. సర్పంచుల సంఘం హైకోర్టుకెళ్లి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రత్యేక అధికారుల నియామకానికే సర్కారు మొగ్గు చూపింది. అనుకున్నదే తడవుగా వెంటనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని బుధవారం జీవో 269 కూడా జారీ చేసింది. దీంతో గురువారం నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా అధికారులు వెంటనే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కంటే ముందే రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రత్యేక అధికారుల నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో స్థానిక సంస్థల్లో ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని 1028 గ్రామ పంచాయతీల్లో సకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయించింది. అయినా సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లోతీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేసింది. దీంతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసే వరకు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసింది. పాలక వర్గాల గుడువు ముగిసే రోజున ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గు చూపింది. రూ.150 కోట్ల నిధులకు గండి... ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితి రానుంది. పంచాయతీ పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. కాని ప్రస్తుత పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడానికే మొగ్గు చూపింది. దీంతో ఏటా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఇక నిలిచిపోనున్నాయి. దాదాపు ఏటా రూ.150 కోట్లకు పైగా నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేవి. ఆ నిధుల ద్వారానే పంచాయతీలు మనుగడ సాగిస్తూవస్తున్నాయి. ప్రస్తుతం అవి కూడా లేకుండా పోయాయి. ఇంటిపన్నులే దిక్కు.. 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే.. పంచాయతీలకు ఇంటిపన్నులే దిక్కు అవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు, తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాయి. తగినన్ని నిధులు లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మేజర్ పంచాయతీలలో ఇంటిపన్నుల వసూళ్ల వలన కొంత నెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. మైనర్ పంచాయతీలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. -
పల్లె పాలన..ఇక ప్రత్యేకం
నెల్లూరు(అర్బన్): పల్లె పాలన..ఇక ప్రత్యేకం. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు కొలువుదీరన్నారు. జిల్లాలో 940 మంది సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ముందుగా ఊహించినట్టుగానే ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ బుధవారం జీఓ నంబర్ 269ను విడుదల చేసింది. ప్రత్యేకాధికారులను నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్పంచ్‌లు మాజీలయ్యారు. పల్లెపాలన సాగేందుకు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ తదితర క్యాడర్ కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిబంధనలు ఉండటంతో ఆ దిశగా కలెక్టర్, డీపీఓ చర్యలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ఇక ప్రత్యేక పాలనే అంటూ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వం విధి, విధానాలు రూపొందించింది. ఈ విధివిధానాల ప్రకారమే అధికారులు పారిశుద్ధ్యం, కార్మికుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా, పైపులైను మరమ్మతులు తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్లు, పబ్లిక్ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే జరిమానా సైతం విధించవచ్చు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ సభల తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు జరిగేవి. ఇప్పుడు గ్రామ సభల తీర్మానాలు అవసరం లేదు. ప్రత్యేకాధికారులే అభివృద్ధి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన పర్ కాపిటా(తలసరి నిధులు), ఎస్డీఎఫ్ (రాష్ట్రాభివృద్ధి నిధులు) వంటి నిధులను సైతం కొన్నేళ్లుగా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చే నిధులపైనే పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోనున్నాయి. దీంతో అభివృద్ధి పనులకు నిధుల గండం పొంచి ఉంది. దీంతో అభివృద్ధి కుంటుపడనుంది. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా పంచాయతీ అ«ధికారి సత్యనారాయణను వివరణ కోరగా గురువారమే నియమిస్తామని తె లిపారు. పాలన యథావిధిగా జరుగుతుందన్నారు. -
ఇవేం ఆంక్షలు..!
► కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ► రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వచ్చిన నిధులపై కొర్రీలు విజయనగరం కంటోన్మెంట్ : అత్త సొమ్ముపై అల్లుడి పెత్తనమన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించడాన్ని సర్పంచ్‌లు తప్పుబడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా తిరిగి కేంద్రం నుంచి వచ్చిన నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించడంతో మాకెందుకీ నిబంధనలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న 938 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ఆధారం. దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలనే నానుడి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి సహకరించకపోగా కొర్రీలు వేస్తుండడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. జిల్లాకు ఇటీవల 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.43.31 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అయితే మంజూరైన రూ.43 కోట్లలో రూ.4.64 కోట్లు జెడ్పీకి బదలాయించారు. మిగతా నిధులను ట్రెజరీల ద్వారా పంచాయతీలకు సర్దుబాటుచేశారు. చంద్రన్నబాటకు నిధులు.. పంచాయతీలకు కేటాయించిన నిధులను చంద్రన్నబాటలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సుమారు 50 శాతం నిధులు సీసీ రోడ్లకే కేటాయించాలని ఆదేశించడంతో సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే సిమెంట్ తక్కువ ధరకు బేరమాడిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సిమెంట్ వచ్చేలా చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన సిమెంట్‌కు తాము ముందుగానే డీడీలు తీస్తున్నా కంపెనీలు పట్టించుకోవడం లేదని, పైగా 14వ ఆర్థిక సంఘ నిధులు కూడా సీసీ రోడ్లకే కేటాయించాలని నిబంధన విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అలాగే మరో 30 శాతం నిధులను మలవిసర్జన రహిత గ్రామాల కోసం వెచ్చించాలన్నారు. అది కూడా ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ నిధులను గ్రామాలకు ఖర్చు చేయాలని నిబంధన విధించారు. అలాగే మరో పది శాతం నిధులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కులకు , మరో పది శాతం నిధులను ఈ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో జనరల్ ఫండ్స్ లేకపోవడం, వచ్చిన నిధులు ఇతర పనులకు వినియోగిస్తే పంచాయతీలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయని సర్పంచ్‌లు ప్రయత్నిస్తున్నారు. -
సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి గుంటూరు రూరల్ : గ్రామ సభలు జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఇక మీదట అలా జరిగితే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. నగరంలోని సీతానగర్ రెండో లైనులోని సర్పంచ్ల సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్న జన్మభూమి కమిటీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడనే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. గ్రామ స్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు, సమావేశాల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సర్పంచ్‌లకు సర్వహక్కులు ఇవ్వాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇళ్ల ప్లానులు, ఇతర ప్లానులు తదితర రెవెన్యూ అధికారాలు సర్పంచ్‌లకు కేటాయించాలని కోరారు. విద్యుత్ బిల్లులు, ఆర్థిక సంఘాల నిధుల వినియోగానికి ఈవోపీఆర్డీల కౌంటర్ సంతకాలను వెంటనే ఎత్తివేయాలన్నారు. సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన సర్పంచ్ల హక్కులను ప్రభుత్వాలు కాలరాయటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం సక్రమంగా అమలు జరిగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం తమ సమస్యపై కలెక్టర్ కాంతిలాల్‌దండేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్ సంధాని, గౌరవాధ్యక్షుడు కళ్ల పానకాలరెడ్డి, ఎస్సీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మన్నెం సుజాతకిషోర్, ప్రధాన కార్యదరిశ జగన్, నరసరావుపేట సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోగినేని వసుధ, చల్లావారిపాలెం సర్పంచ్ ఉగ్గం వెంకటేశ్వరరావు, ఓబులునాయుడు పాలెం సర్పంచ్ జి శివపార్వతి సుబ్బారావు, జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా
బసంత్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించే ధర్నాను మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు విజయవంతం చేయాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పర్శవేని శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ఈవోపీఆర్డీ జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని, వీటిలో 30 శాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు, పది శాతం సీసీ ఆపరేటర్సు చార్జీలు రద్దు చేసి వాటిని ప్రభుత్వమే భరించాలని, ఎస్ఎఫ్సీ నిధులు వెంటనే విడుదల చేయాలని, సర్పంచుల జీతాల చెల్లింపులు, ఇతర అధికారాల కోసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. -
అవినీతిపై పచ్చతమ్ముళ్ల మధ్య రచ్చ..రచ్చ..
♦ టీడీపీ ఎంపీపీ వర్సెస్ టీడీపీ సర్పంచులు ♦ ఎంపీపీ పేరుతో ఉన్న బోర్డు ధ్వంసం ♦ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన కళ్యాణదుర్గం : అవినీతి విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య రచ్చరచ్చ జరిగింది. టీడీపీ మహిళా ఎంపీపీ మంజులకొల్లప్ప టీడీపీ సర్పంచులు చిక్కన్న, అనీల్, వైస్‌ఎంపీపీ వెంకటేశుల మధ్య వర్గ పోరు మొదలైంది. కొంత కాలంగా ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా తూర్పుకోడిపల్లి పంచాయతీ పరిధిలో మెగావాటర్‌షెడ్ పనుల్లో అవినీతి, డ్రైల్యాండ్ హార్టికల్చర్ పనుల్లో అక్రమాలపై ఎంపీపీ విచారణకు ఆదేశించడంతో వివాదం ముదిరింది. తూర్పుకోడిపల్లి సర్పంచ్ చిక్కన్న అవినీతి విచారణ విషయంలో ఎంపీపీ మంజుల, ఆమె భర్త కొల్లప్పను మంగళవారం సాయంత్రం నిలదీశారు. ఇరువర్గాల మద్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం సర్పంచ్ చిక్కన్న ఆయన వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎంపీడీఓ డీఎంకేబాషాను చుట్టుముట్టి నిలదీశారు. ఎంపీపీ మంజుల కుర్చీలో ఆమె భర్త కొల్లప్ప కూర్చునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎంపీపీతో పాటు ఆమె భర్త ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పేదాక కదలకూడదంటూ ఎంపీడీఓను అడ్డుకున్నారు. ఇంతలో అక్కడి చేరుకున్న కొండాపురం సర్పంచ్ అనీల్, వైస్ ఎంపీపీ వెంకటేశులు, జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ రామ్మోహన్ కొల్లప్పకు ఏమిఅధికారముందని అందరిపైనా అజమాయిషి చేస్తున్నాడంటూ నిలదీశారు. సుమారు గంట పాటు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటు చేసుకుంది. తూర్పుకోడిపల్లి పంచాయతీకి చెందిన పలువురు చివరి సమయంలో రెచ్చి పోయారు. ఎంపీపీ మంజుల కొల్లప్ప పేరుతో ఉన్న బోర్డును ధ్వంసం చేశారు. ఈసమయంలో జోక్యం చేసుకున్న జెడ్పీటీసీ ఇది మంచిపద్ధతి కాదని హితబోధ చేశారు. అందరూ అక్కడి నుంచి మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా కొల్లప్ప తీరుపై ఆగ్రహం వెళ్లగక్కి నాయకులను నిలదీశారు.