Science Fair
-
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
సైన్స్ సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
హైదరాబాద్: అనాథ అక్కాచెల్లెళ్లను కలిపిన ‘సైన్స్ ఫేర్’ ఫోటో
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిలో పెద్దవారు ఇద్దరిని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. చిన్న అమ్మాయి వారి నానమ్మతాతయ్యల దగ్గర ఉంటుంది. కానీ దురదృష్టం కొద్ది వారు కూడా చనిపోవడంతో.. ఆ బాలిక వీధుల వెంబడి భిక్షాటన చేస్తూ కాలం గడపసాగింది. ఈ క్రమంలో తన అక్కలను చేరదీసిన అనాథాశ్రమం వారే ఆ బాలికను కూడా అక్కున చేర్చుకున్నారు. అయితే వేరే బ్రాంచ్‌లో ఆ చిన్నారిని చేర్పించారు. చివరకు సైన్స్ ఫేర్ ఫోటోలో చెల్లెని గుర్తించిన అక్కలు తన గురించి హోమ్ నిర్వహకులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒకే చోటకు చేర్చారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిని ఆ చిన్నారులు.. కనీసం అందరం ఒకే చోట ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అమ్మ వారి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి(14), మరో అమ్మాయి(12)ని నగరంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఇక అందరికంటే చిన్నదైన బాలిక తన తాతనానమ్మల దగ్గర ఉండేది. కానీ దురదృష్టం కొద్ది కొన్ని నెలల క్రితం వారు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవించసాగింది. బాలిక గురించి సమాచారం తెలిసిన అనాథాశ్రమం వారు ఆ చిన్నారిని చేరదీశారు. విచిత్రం ఏంటంటే చిన్నారి అక్కలిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. కాకపోతే వేరే బ్రాంచ్‌లో. ఇక దీని గురించి ఆ అక్కాచెల్లెళ్లలకు ఏమాత్రం సమాచారం తెలీదు. ఈ క్రమంలో ఓ రోజు వేర్వేరు అనాథశ్రమాల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఫోటోలను బాలిక అక్కలు చూశారు. ఆ ఫోటోలో ఉన్న తమ చెల్లిని గుర్తించారు. ఇక దీని గురించి ఆశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ముగ్గురు బాలికలకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. వారంతా తోబుట్టువులే అని తేల్చారు. అనంతరం ముగ్గురిని ఒకే చోటకు చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్క చోట కలిసి ఉండే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో ఉన్న పలు అనాథాశ్రమాల్లో అధికారులు, కౌన్సిలర్లు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తారు. అలానే సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒక్కచోటకు చేర్చింది’’ అన్నారు. -
బాల మేధావులు భళా !
సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి. – నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్ గాలి ద్వారా వంట.. గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్‌కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. – తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడ విషజ్వరాలు సోకకుండా.. ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు. – వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్ఎస్, మావల సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి. – యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్ దోమలు వృద్ధి చెందకుండా.. దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి. – దీపాలి, మారుతి, జెడ్పీఎస్ఎస్, మన్నూర్ సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చల్లని, వేడి గాలిచ్చే కూలర్.. తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్ ద్రియ సాగు.. బహుబాగుసేం ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్‌గ్యాస్ తయారు చేసుకోవచ్చు. – కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్ -
ప్రోత్సాహం ఏదీ?
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయాలి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నిరంతరం పుస్తకాలతో కుస్తీ సరికాదు. అందుకు అనుగుణంగా ఆనందవేదిక... నోబ్యాగ్ డే వంటివాటిని సర్కారు ఎంతగానో ప్రోత్సహిస్తోంది. కానీ కేంద్రమా నవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన పోటీలపై మాత్రం పాఠశాలలనుంచి ప్రోత్సాహం కరువవుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే దానిపై చిత్తశుద్ధి కొరవడింది. ఇప్పుడు ప్రోత్సహించే సర్కారు ఉన్నా... వాటిని వినియోగించుకోవడంలో ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. విజయనగరం అర్బన్: తరగతి గదిలోని విద్యార్థి ఆలోచనకు గుర్తింపు తేవాలంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహం తప్పనిసరి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల ప్రేరణ తోడయితే వారు రూపొందించే ఆవిష్కరణలకు కేంద్ర మానవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శనల జాతీయ స్థాయిలో పోటీలపై జిల్లా పాఠశాల నిర్వాహకులు శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఈ పోటీలకు ప్రతి ఉన్నత, ప్రాధమికోన్నత పాఠశాల నుంచి నమూనాలు రావాలనే నిబంధన పాటించడంలో జిల్లా విద్యాశాఖ విఫలమయింది. అందుకే గత రెండేళ్లుగా అత్యల్ప సంఖ్యలో జిల్లా నుంచి పోటీలకు వెళ్లాల్సివస్తోంది. ప్రస్తుత సర్కారు ప్రోత్సహిస్తున్నా... విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వ అధికంగా ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగానే పాఠశాల విద్యలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఆనందవేదిక, బ్యాగ్‌కు సెలవు, అలా, రా (ఆర్‌ఏఏ), ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన వంటి పోటీలు పాఠ్యాంశాలతో పాటు ప్రవేశ పెట్టారు. చిన్నారుల్లో మొలకెత్తిన ఆలోచనలు సాకారం చేసుకునే వేదికే ‘ఇన్స్పైర్’. ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సమాజానికి భావి శాస్త్రవేత్తలను అం దించే గురుతర బాధ్యత పడకేసింది. ఎంతో ఉ న్నత ఆశయంతో చేపట్టిన ఈ ప్రక్రియపైప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్యంనెలకొం ది. ఫలితంగా విద్యార్థుల శాస్త్ర విజ్ఞాన ఆలోచనలు నాలుగు గోడలకే పరిమితం అవుతున్నాయి. వేలల్లో అర్హులు... వందల్లోనే ప్రతిపాదనలు.. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు నమూనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్న 3,441 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 920 ఉన్నత, ప్రాధమికోన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో లక్ష 30 వేల మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌కి ఐదు నమూనాలతో సుమారు 5 వేల మంది విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా... ఈ ఏడాదికి ఇప్పటివరకు 308 స్కూళ్ల నుంచి కేవలం 1,205 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. గత రెండేళ్లలో కూడా ఇదే నిర్లక్ష్యంతో గడువు చివరి తేదీలలో 1,250, 1,600 సంఖ్యలో విద్యార్థులు నమూనాలు అన్లైన్లో పంపారు. అయితే వాటిలో తొలి ఏడాది 54, గత ఏడాది 48 నమూనాలు మాత్రమే పోటీ ప్రదర్శనలకు ఎంపికయ్యాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రకటన వెలువడిన తొలి తేదీల్లో వచ్చినవాటికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి చివరి తేదీల్లో నమోదు కావడం కారణంగా ఎంపిక సంఖ్య తగ్గిందనే వాదన లేకపోలేదు. గత నెల 31వ తేదీలోగా ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల నుంచి జాతీయ స్థాయిలో స్పందన లభించకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రతి నమూనాకు రూ.10 వేలు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనకు తమ వంతు సహకారం అందించి ఆన్లైన్లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు రూ.10 వేలు మంజూరవుతుంది. ఆ నిధులతో నమూనాకు అవసరమైన పరికరాలు సమకూర్చుకోవచ్చు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ పోటీ ప్రదర్శనకు హాజరుకావడానికి అవసరమైన చార్జీలు వెచ్చించుకునే వెసులు బాటు ఉంది. విద్యార్థుల ఆలోచనల ఆవిష్కరణను ‘ఇన్స్పైర్అవార్డ్స్డీఎస్టీ.జీఓవి’వెబ్ సైట్లో నమోదు చేస్తే ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. పెంచిన గడువు వినియోగించుకోవాలి.. జిల్లాలో ఇంతవరకు 308 స్కూళ్ల నుంచి 1,205 మంది విద్యార్థులు నమూనాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. గతేడాది 1,250 మంది నమోదు చేసుకుంటే కేవలం 54 మాత్రమే ప్రదర్శన పోటీకి ఎంపికయ్యా యి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కలిగించాం. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు దానిని ఉపయోగించుకోవాలి. – కె.సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ -
సైన్స్ ఫెయిర్: ఆకట్టుకున్న విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్స్
-
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా
బాసర(ముథోల్) : బాసర ట్రిపుల్‌ఐటీలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైజ్ఞానిక మేళా గురువారం రాత్రి ముగిసింది. దాదాపు 221 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగింపు సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, తెలంగాణ యూనివర్సిటీ సాంబయ్య, ఎ¯Œఆర్ఎస్ఏ డైరెక్టర్ సూజాత గోశ్, పాలమూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సులార్ రాజరత్నం, వీసీ డాక్టర్ అశోక్‌కుమార్, ముఖ్య అథితులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఆకస్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ఐటీ ఉండడం అదృష్టమన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న వైజ్ఞానిక దృష్టి కోణాన్ని బహిర్గతం చేయడానికి విజ్ఞాన ప్రదర్శన ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏవో వెంకటస్వామి, అకాడమిక్ డీన్ రణదీర్ సాగీ, టెక్ ఫెస్టు కన్వీనర్ స్వప్నిల్, నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వినువీధిలోకి విజ్ఞాన శిఖరం
లండన్: విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) తనువు చాలించారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యా లయం సమీపంలోని తన ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్ర జ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్క రణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుం టాయి. ఆయన ధైర్యం, మేధస్సు, హాస్యం ప్రపంచంలో అనేక మందిలో స్ఫూర్తి నింపాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హాకింగ్ మృతికి నివాళిగా కేంబ్రిడ్జి వర్సిటీ కాలేజ్‌లో జెండాను అవనతం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాకింగ్‌కు నివాళులర్పించారు. 21ఏళ్ల వయసుకే అత్యంత అరుదైన ‘అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్’ (ఏఎల్ఎస్) అనే వ్యాధి బారిన పడి వీల్‌చైర్‌కే పరిమితమైన హాకింగ్.. పట్టుదలతో తన శారీరక లోపాలను అధిగమించి విశ్వ రహస్యాలను ఛేదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల సరసన చోటు సంపాదించుకున్నారు హాకింగ్. ‘మెదడు బాగా పనిచేస్తున్న తరుణంలో అవయవ లోపాలు ఉన్నంత మాత్రాన మనుషులు తమ సామర్థ్యాలకు పరిమితి విధించుకోవాల్సిన అవసరం లేదని నేను ప్రపంచానికి చాటాలనుకున్నాను’ అని హాకింగ్ గతంలో అన్న మాటలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రముఖుల నివాళులు బ్రిటన్ ప్రధాని థెరెసా మే, భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాకింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘తన తరం శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ మహోన్నతమైన వారు. ఆయన కృషిని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. స్టీఫెన్ మెదడు అత్యద్భుతం. సంకల్పం, హాస్యం, ధైర్యాల మేళవింపు అయిన ఆయన జీవితం రాబోయే తరాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం’ అని థెరెసా మే అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా హాకింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మనం గొప్ప మనిషిని కోల్పోయాం. విజ్ఞానశాస్త్రానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని సత్య పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేసిన అనంతరం ఓ రోజు హాకింగ్‌కు బ్రిటన్ ప్రభుత్వం ‘ప్రైడ్ ఆఫ్ బ్రిటన్’ పురస్కారాన్ని అందజేసింది. థెరెసా మే హాజరైన ఆ సభలో హాకింగ్ మాట్లాడుతూ ‘ఎంతో కష్టమైన గణిత సమస్యలను నేను రోజూ పరిష్కరిస్తుంటాను. కానీ బ్రెగ్జిట్ లెక్కలు చేయమని మాత్రం నన్ను దయచేసి అడగొద్దు’ అని అనడంతో సభలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. యంత్రాల సాయంతో మాట్లాడుతున్నా ఇలాంటి చలోక్తులతో హాకింగ్ ఎప్పుడూ చుట్టుపక్కల వారిని ఉల్లాసంగా ఉంచేవారు. ఆయన స్ఫూర్తిప్రదాత ప్రధాని నరేంద్ర మోదీ స్టీఫెన్ హాకింగ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, శరీరం సహకరించకపోయినా అంతరిక్ష శాస్త్రం అధ్యయనానికి ఆయన చూపిన పట్టుదల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త, విద్యావేత్త అని తన ట్వీటర్ సందేశంలో పేర్కొన్నారు. చెరగని ముద్ర: రాహుల్ స్టీఫెన్ మృతికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. తర్కం, ప్రజ్ఞ, శాస్త్రీయ జిజ్ఞాసలో ఆయన ప్రపంచానికే మార్గదర్శకుడని అన్నారు. ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారని ట్వీటర్లో పేర్కొన్నారు. శారీరకంగా ఎన్ని అవరోధాలెదురైనా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఆయన అత్యంత ప్రముఖుడిగా నిలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసిన హాకింగ్.. మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, తన మేధోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కేసీఆర్ అన్నారు. ఓ మేధావిని కోల్పోయాం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రపంచం ఓ మేధావిని కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరణం తర్వాత జీవితం లేదనీ, స్వర్గం అనేది ఓ కట్టుకథ అన్న హాకింగ్ నమ్మకాన్ని, ఆయన రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ (కాలం కథ) అనే రచనను జగన్ గుర్తుచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వీల్‌చైర్‌కే పరిమితమైనప్పటికీ సరికొత్త మేధో కోణాన్ని ఆవిష్కరించేందుకు హాకింగ్ చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఆయన ప్రతీ కదలికలో ధైర్యం, కృతనిశ్చయం కనిపించేదన్నారు. విజ్ఞాన శాస్త్ర అవధులను తాకిన ఆయన మేధో సంపత్తికి ఘన నివాళి అర్పించారు. ఇంకొన్నాళ్లే అన్నా చదువు కొనసాగించారు.. ఏఎల్ఎస్ వ్యాధి సాధారణంగా ప్రాణాంతకమైనది. 21 ఏళ్ల వయసులో హాకింగ్‌కు ఈ వ్యాధి ఉందని బయటపడినప్పుడు ఆయన ఇంకొన్నేళ్లు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెప్పారు. అయినా ఆయన దాని గురించి ఆలోచించకుండా కేంబ్రిడ్జిలో చదువు కొనసాగించారు. ఏఎల్‌ఎస్‌తో హాకింగ్ వీల్‌చైర్‌కి పరిమితమయ్యారు. ఒక చేతిలోని కొన్ని వేళ్లను మాత్రమే ఆయన కదపగలిగేవారు. ఇతరులు లేదా యంత్రాల సాయం లేకుండా కనీసం మాట్లాడటం సహా ఏ చిన్న పనీ చేసుకోలేని స్థితి. కానీ యంత్రాల సాయంతోనే ఆకట్టుకునేలా మాట్లాడుతూ సంకల్ప బలానికి, ఆసక్తికి ఓ చిహ్నంలా నిలిచారు హాకింగ్. 1970లో రోజర్ పెన్రోస్తో కలసి కృష్ణ బిలాలపై హాకింగ్ చేసిన పరిశోధనలు తొలిసారి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. వ్యాధి సోకినట్లు కనుగొన్న తొలినాళ్లలో భార్యతో... నోబెల్ మినహా.. ఎన్నో అవార్డులు శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకుగానూ హాకింగ్కి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, వోల్ఫ్ ప్రైజ్, ద కోప్లీ మెడల్, ద ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్, కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, గోల్డ్ మెడల్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ తదితర పురస్కారాలు ఆయనను వరించాయి. హాకింగ్ బ్రిటిష్ పౌరుడై నప్పటికీ 2009లో ఒబామా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’తో ఆయనను సత్కరించారు. తనకు ఏఎల్సీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు తన ఆలోచన ఎలా ఉండేదో 2013లో ఆయన ఓ సారి చెప్పారు. ‘నాకు ఇలా జరగడం చాలా అన్యాయమని నేను బాధపడ్డాను. నా జీవితం ఇక అయిపోయిందనీ, నాలోని శక్తి సామర్థ్యాలు వృథా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు, 50 ఏళ్ల తర్వాత, నా జీవితంతో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 2014లో స్టీఫెన్ హాకింగ్ జీవితంపై ‘ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని సినిమా కూడా తీశారు. ఈ సినిమాలో స్టీఫెన్ పాత్ర పోషించిన రెడ్‌మేన్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరిస్తున్న ఒబామా నోబెల్ మాత్రం అందలేదు భౌతిక శాస్త్రం మౌలిక సూత్రాలతో విశ్వాంతరాళంలోని వస్తువులు, వాటి ఉనికిపై విశేష పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్‌కు నోబెల్ బహుమతి అందని ద్రాక్షగానే మిగిలింది. జీవితంలో ఒక్కసారైనా పొందాలని శాస్త్రవేత్తలు కలలు గనే ఆ అరుదైన గౌరవం హాకింగ్‌కు ఎందుకు దక్కలేదు? కృష్ణ బిలాలు అంతరించిపోతాయన్న ఆయన ప్రతిపాదన నిరూపణ కాకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే కృష్ణ బిలాలపై హాకింగ్ పరిశోధనలను ప్రస్తుతం సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఆమోదిస్తున్నారు. -
చిన్నారులతో ఐటెమ్ సాంగ్స్‌కు డ్యాన్సులు
-
విజ్ఞాన ప్రదర్శనలతో.. వెలుగులోకి సృజనాత్మక శక్తి
కొరాపుట్ : విద్యార్థుల సృజనాత్మక శక్తి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా వ్యక్తమవుతుందని జిల్లా విద్యాధికారి మర్కట కేసరి రాయ్ అన్నారు. జిల్లా విద్యావిభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పాటు చేసిన కొన్ని విజ్ఞాన ప్రదర్శనలు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార సూచనలుగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి విద్యార్థి విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే విధంగా అందరి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా సైన్స్ సూపర్వైజర్ శివ పట్నాయక్ మాట్లాడుతూ ఆన్లైన్లో పోటీపడిన 382 ప్రాజెక్టులలో 42 ప్రాజెక్టులను పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేసి ప్రదర్శనకు ఆహ్వానించినట్లు చెప్పారు. వాటిలో 34 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న వాటిల్లో 4 ప్రాజెక్టులను ఎంపిక చేసి భువనేశ్వర్‌లో రాష్ట్రస్థాయిలో ఈ నెల 12,13 తేదీలలో జరగనున్న విజ్ఞాన ప్రదర్శనలకు పంపనున్నామన్నారు. కార్యక్రమంలో సునాబెడ ఏఈఎఫ్ కళాశాల అధ్యాపకుడు ఉదయనాథ్ సామల్, కొరాపుట్ కళాశాల అధ్యాపకులు దీపక్ పట్నాయక్, తపన్ కుమార్ బెహర, కొరాపుట్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వికాస్చంద్ర సర్కార్ పాల్గొన్నారు. -
సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైన్స్ ఫెయిర్
-
‘సర్కారీ’ విద్యార్థులు సూపర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, టీచర్లు తమ సృజనాత్మక ప్రదర్శనలతో ప్రథ మ స్థానంలో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 12 వరకు సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్లో నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో తమ ప్రదర్శనలను ఉంచబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఎగ్జిబిషన్లో ఉంటా యి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి 50 ఆవిష్కరణలకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శనకు అవకాశం ఇచ్చామని, మొత్తం గా 300 ప్రదర్శనలు ఉంటాయని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.శేషుకుమారి తెలిపారు. 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలవే.. సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే 50 ప్రదర్శనల్లో 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి ఉండగా 10 ప్రదర్శనలు మాత్రమే ప్రైవేటు పాఠశాలలకు చెందినవి ఉన్నా యి. అలాగే 15 గ్రూపు ఎగ్జిబిట్స్‌లో 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలే మెరుగు..: బి.శేషుకుమారి ప్రైవేటు స్కూళ్లకంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైనవని మరోసారి నిరూపితమైందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం.. ఈ నెల 8 నుంచి నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరవుతారని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. 12న జరిగే ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌కు హాజరుకావాలనుకునే పాఠశాలలు హైదరాబాద్ డీఈవోను సంప్రదించాలన్నారు. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం కొత్త పుంతలు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం శాస్త్ర, సాంకే తిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతోందని, సామాన్యుల కష్టాలను తీర్చే దిశగా పరిశోధన లు పురోగతి సాధిస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నారు. తమిళనాడులోని చెన్నై లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) శుక్రవారం ప్రారంభమైంది. సమాజంలోని అసమానతలను రూపుమా పేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు. దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. నానో టెక్నాలజీ రంగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో సీఎస్ఐఆర్ గతేడాది 12వ స్థానంలో ఉండగా.. తాజాగా 9వ స్థానానికి చేరుకుం దని అన్నారు. సీఎస్ఐఆర్ వంటి సంస్థలు ఇప్పుడు అన్ని రంగాల్లో సామాన్యుల సమ స్యలకు ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా పరిష్కా రాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. వివిధ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో ఐఐఎస్ఎఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. సాంకేతికతతో సమస్యల పరిష్కారం: సుజనా చౌదరి గ్రామీణ భారత ప్రజల అనేక సమస్యలకు శాస్త్ర, సాంకేతికత ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. గ్రామీణ సమస్యలకు ఆ ప్రాంతాల సృజనశీలురు ఎన్నో వినూత్నమైన పరిష్కారాలు ఆవిష్కరించారని వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేసేందుకు ఐఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అఫ్గానిస్తాన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ రోషన్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు విజయ్ భట్కర్, తమిళనాడు మంత్రి అన్బలగణ్, కేంద్ర భూశాస్త్ర విభాగ కార్యదర్శి రాజీవన్ పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలు తమ పరిశోధన వివరాలను ప్రదర్శిస్తున్నాయి. భారత్‌కు రుణపడి ఉన్నాం: బంగ్లాదేశ్ మంత్రి తమ దేశం పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విముక్తమయ్యేందుకు సాయం చేసిన భారత్‌కు బంగ్లాదేశ్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ దేశానికి చెందిన మంత్రి యశ్ ఉస్మాన్ అన్నారు. ఆసియా రీజియన్‌కు భారత్ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, బంగ్లాదేశ్‌లు అన్ని రంగాల్లో కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
దాశరథి సైన్స్ గీతం
సరిగ్గా ఒక పక్షం రోజుల క్రితం ఒక మిత్రుడు తణుకులో కలసినప్పుడు ఒక క్యాలెండర్ బహూకరించాడు. అది సైన్స్ సభ; క్యాలెండర్లో సైన్సూ, చరిత్ర కలగలసిన కవిత. నాకు మహదానందం కలిగింది. నిజానికి ఆ కవిత లేదా ఆ పాట కొత్తది కాదు, పాతి కేళ్లుగా అలాంటి వేదికలమీద వింటూనే ఉన్నా. అయినా క్యాలెండర్‌గా చూసినప్పుడు, కలకాలం గోడమీద మరెందరికో అవగాహనా, స్ఫూర్తీ కలిగిస్తుందని ఆశ. ఆ ఆనందం ఇంకా తాజాగా ఉండగానే, ఆ పాట రచయిత జన్మదినం నవంబరు 22 అని కూడా అదే క్యాలెండర్ చెబుతోంది. ఇంతకీ ఆ పాట ఏమిటి? ఆ కవి ఎవరు? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంత? ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో– అని మొద లయ్యే ఈ గీతానికి రచయిత దాశరథి కృష్ణమాచా ర్యులు. అద్భుతమైన ఎత్తుగడ, లోతైన భావం, తీక్షణ మైన చూపుతో రూపొందిన ఈ గీతం... తర్వాతి చరణం ఇలా ఉంటుంది. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో జరిగిన నర కంఠాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలిౖయెన పవిత్రులెందరో విశ్వాంతరాళంలో మహా విస్ఫోటనం జరిగిన తర్వాతే భూమి రూపొందిందనేదీ, మనిషి ప్రస్తుత ఆకారం ధరించడానికి చాలా పరిణామక్రమం ఉందనేదీ శాస్త్ర విజ్ఞానం. వీటిని గొప్పగా స్ఫురింపజేస్తూ మన చరిత్ర తీరును వివరిస్తారు కవి. గతాన్ని హేతుబద్ధంగా అక్షరీకరించి, వర్తమాన పోకడల గురించి మరింతగా కవితా చిత్రిక పడతారు. మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఈ గీత ప్రస్తావన ఇదివరకు చెప్పిన విషయమే అయినా, నడుస్తున్న చరిత్ర తీరు అదే కాబట్టి.. మరో పోలికతో మరింత స్పష్టంగా అంటాడు. ఎందుకంటే ఆ దోపిడీ, దౌష్ట్యం, దుర్మార్గం అలా సాగుతోంది మరి. ఇక పరిష్కారం ఎలా ఉండాలి? అదే ఈ కవితగా ముగిసిన భవిత కల. అన్నార్తులు అనాథలు అని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంత గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో? అని ముగిస్తాడు ఆ పాటను దాశరథి కృష్ణమా చార్యులు. పాతికేళ్లుగా ఈ గీతాన్ని పాడించి, ప్రచారంలోకి తెచ్చిన జన విజ్ఞాన వేదిక ఇటీవల క్యాలెండర్‌గా ముద్రించడం మరింత కొత్తగా దాశరథిని మనల్ని చూడమంటోంది. తండ్రి దగ్గర సంస్కృతం, తల్లి దగ్గర తెలుగు, గురువు దగ్గర ఉర్దూ నేర్చుకున్న తర్వాత– జీవితం పేదరికాన్నీ, నిజాంపాలన కష్టాన్నీ నేర్పాయి. ఇంటా, బయటా దాశరథి కృష్ణమాచార్యులు ఎదుర్కొన్న ఇడు ములు ఇన్నీ అన్నీ కావు. తిరగబడి ఉద్యమంలా సాగాడు, తెగబడి సాహిత్యం సృజించాడు. పద్యంతో, పాటతో చిరంజీవిగా మిగిలిపోయాడు. ‘‘లోకం నిండా విరివిగా శాంతి పంచే రీతిని కొత్త రకం విత్తనాల్ని కనిపెట్టే వీలు’’ గురించి శోధించి, సాధించిన సాహితీ శాస్త్రవేత్త దాశరథి కృష్ణమాచార్యులు (22.7.1925 – 5.11.1987) (నేడు దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా) వ్యాసకర్త సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి మొబైల్ : 94929 60868 -
ఎస్సై ఫలితాలు మరింత జాప్యం!
మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ కొనసాగుతుండటం వల్లే... సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్‌లో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) తుది పరీక్ష ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. మొత్తం 539 ఎస్సై, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు తుది పరీక్ష జరగ్గా ఫలితాలపై ఇప్పటివరకు రిక్రూట్మెంట్ బోర్డు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే రాష్ట్ర పోలీసు అకాడమీలో ప్రస్తుతం 2,800 మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్న నేపథ్యంలో ఎస్సై ఫలితాలు ప్రకటిస్తే కొత్తగా వచ్చే 539 మంది ఎస్సై, ఫైర్ ఆఫీసర్లకు ఒకే సమయంలో శిక్షణ ఇవ్వడం సాధ్యంకాదని పోలీసు ట్రైనింగ్ విభాగం భావిస్తోంది. మొత్తం 9 నెలల కానిస్టేబుళ్ల శిక్షణను ప్రస్తుతం రెండు సెమిస్టర్లుగా విభజించారు. అందులో భాగంగా మొదటి మూడున్నర నెలలు శిక్షణ ముగిస్తేనే ఎస్సై ఫలితాలపై కొంత ముందుకెళ్లే అవకాశం ఉందని శిక్షణ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఒకేసారి రెండు విభాగాలకు శిక్షణ ఇవ్వడం కుదరదని శిక్షణ విభాగం తేల్చిచెప్పడంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలపై వెనక్కి తగ్గిందన్న వాదన వినిపిస్తోంది. కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమై దాదాపు నెలన్నరకాగా మరో నెలన్నర దాటితేగానీ ఎస్సై ఫలితాలు రావన్నది పోలీసుశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు కానిస్టేబుల్ ఫలితాల్లో రిజర్వేషన్ అమలు తీరు, కటాఫ్ వంటి అంశాలపై 143 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల ఎంపికకు ఒకే రకమైన విధానాలుండటంతో ఈసారి రోస్టర్, కటాఫ్, రిజర్వేషన్ తదితరాలను పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది. -
పాలమూరు ప్రతిభ
⇒ వినికిడి యంత్రాన్ని రూపొందించిన లక్ష్మి ⇒ మార్చి 3న రాష్ట్రపతి భవన్లో సైన్స్ ప్రదర్శనకు పిలుపు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన పేద విద్యార్థిని లక్ష్మి.. వినికిడి యంత్రాన్ని రూపొందించి అందరిచేత భళా అనిపించుకుంది. మార్చిలో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగే సైన్స్ ఇన్ స్పైర్ ప్రదర్శనకు హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు అందుకుంది. రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్‌కు చెందిన బాలమణికి ఇద్దరు కూతుళ్లు. లక్ష్మి మొదటి సంతానం. తండ్రి లక్ష్మయ్య చనిపోవడంతో ఆమె కూలీ పనులు చేస్తూ కుమార్తెలను చదివిస్తోంది. లక్ష్మి నవాబ్‌పేట మండలం ఎన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఎన్మన్ గండ్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా గతేడాది వినికిడి యంత్రాన్ని తయారుచేసి నాగర్‌కర్నూల్‌లో జరిగిన సైన్స్‌ప్రదర్శనలో ప్రదర్శించగా రెండోస్థానం దక్కింది. గత డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ఇది ఉత్తమప్రదర్శనగా ఎంపి కైంది. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతు ల మీదుగా అవార్డును అందుకుంది. దీంతో మార్చి 3న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రావాలని పిలుపు అందింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడు తున్న లక్ష్మి ఢిల్లీకి వెళ్లేందుకు ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తోంది. సాయం చేసే వారు టీచర్ శ్రీధర్ 9490140477 నంబర్‌కు సంప్రదించవచ్చు. -
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
జిల్లా చెకుముకి సై¯Œ్స సంబరాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట : విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే శాస్రీ్తయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి చెకుముకి సై¯Œ్స సంబరాలు–2016 (సై¯Œ్స ప్రతిభా పరీక్ష) జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట కాంతిభారతి హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ మండల శాఖ అధ్యక్షుడు బండారు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆదివారపుపేట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు–కాంతిభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ టి సత్యవాణి పర్యవేక్షణలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ ఆర్ఎస్, జేవీవీ పతాకాన్ని ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీహెచ్ స్టాలి¯ŒS ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ చెకుముకి సై¯Œ్స ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కాంతిభారతి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ మాట్లాడుతూ ఈ దేశభవిష్యత్తు గురువులు, విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అనాగరికత నుంచి నాగరికతలోకి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామంటే దాని వెనుక సై¯Œ్స హస్తం ఉందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల మేధస్సుతో సై¯Œ్స తద్వారా దేశం ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎండీ ఖాజామొహిద్దీన్, కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ఎంఈఓ వై. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
విజ్ఞానం.. వికాసం
-
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమం న్యూటన్ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు. కేడీవీ ప్రసాద్ వర్మ, జెడ్పీహెచ్ఎస్, ఎన్ఆర్పీ అగ్రహారం ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ద్వారా ఆయిల్‌ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్ఎస్, దెందులూరు రైల్ వైబ్రేషన్స్‌తో విద్యుత్ ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్ ద్వారా విద్యుత్‌ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్ క్రిస్టల్స్‌తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్ఎస్, పాలకొల్లు వ్యర్థ జలాల శుద్ధీకరణ వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్ స్కూల్, ఏలూరు కొల్లేరును కాపాడుకుందాం సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు గోల్డెన్ రైస్ గోల్డెన్ రైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్ ఉన్నాయి. ఎస్.భాస్కర్ ప్రభాత్, సెయింట్ అలోషియస్, ఆకివీడు -
సైన్స్ కాంగ్రెస్‌కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక
సిద్దవటం: సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి కడప లోని సైన్స్ మ్యూజియంలో జరిగిన 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలో తమ పాఠశాలకు విద్యార్థిని లక్ష్మిప్రసన్న ఆహారం మరియు వ్యవసాయం అనే అంశంపై సెమినార్లో పాల్గొని చక్కటి ప్రతిభను కనపరచడంతో న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. డిశంబర్ 3,4, తేదీలలో విజయవాడలో జరిగే రాష్ఠ్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థికి గైడ్ ఉపాధ్యాయుడుగా నరసింహబాబు వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో గురువారం లక్ష్మిప్రసన్న ను ప్రధానోపాధ్యాయుడు లోకేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
19 నుంచి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు
ప్రదర్శనలో 525 నమూనాలు డీఈఓ రామలింగం నెల్లూరు (టౌన్): ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. సుబేదార్‌పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో బుధవారం అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జరగనున్నాయని వెల్లడించారు. సైన్స్ ఫెయిర్‌లో మొత్తం 525 నమూనాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి రోజుకు 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందకు 18 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో నమూనాకు రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సలహాదారుడు సతీష్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. ముగింపు రోజున మంత్రి నారాయణ హాజరవుతారని తెలిపారు. డిప్యూటీ డీఈఓలు షా అహ్మద్, మంజులాక్షి, యస్దానీ అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవిజ్ఞానం వైపు ప్రోత్సహించాలి
విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి ఎంపీ తోట నరసింహం ముగిసిన సై¯Œ్స పండుగ భానుగుడి(కాకినాడ) : విద్యార్థుల సృజనకు అద్దం పట్టే మరిన్ని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు రూపకల్పన చేయాలని ఎంపీ తోట నరసింహం సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు శాస్త్ర విజ్ఞానం వైపు అడుగులు వేసేలా చూడాలని కోరారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. స్థానిక ఏఎంజీ పాఠశాలలో నిర్వహించిన ముగింపు సభలో ఎంపీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలులో ఉందని, దీని ద్వారా పరిశీలనాత్మక విజ్ఞానం పెరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయన్నారు. వారి ఆలోచనలకు ఉపాధ్యాయులు పదునుపెడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయికి 101 ప్రాజెక్టులు ఎంపిక జిల్లాలోని 25 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. 560 ప్రాజెక్టులు రావాల్సి ఉండ గా 545 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. ఇందు లో 55 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. రాజమండ్రిలో 511 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచగా అందులో 46 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ ఏడాది జిల్లా నుంచి మొత్తం 101 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్ళనున్నాయి. ఇందులో ఎక్కువగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, విద్యుత్‌లేని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌సిటీ, స్మార్ట్ విలేజ్ అంశాలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ఎంపికకు సంబం«ధించి ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, ఎం. ఎం.పాషా, వంకా గణపతిరావుల నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. చివరి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు, డీవైఈవో వాడపల్లి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలల మేధకు ప్రతిబింబంగా..
ప్రారంభమైన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన భానుగుడి (కాకినాడ) : పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉపకరణాలు, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛభారత్, నూతన సాగు పద్ధతులు, రీసైక్లింగ్ ప్రాసెస్.. ఇలా వినూత్న వైజ్ఞానిక ఆవిష్కరణలకు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇ¯ŒSస్పైర్–2016) వేదికగా నిలిచింది. కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఇన్స్పైర్–2016ను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇన్స్పైర్ లోగోను, పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ స్థితిగతులను అంచనా వేస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థుల ఆలోచనలకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని అన్నారు. తొలుత జిల్లా ఖ్యాతిని కీర్తిస్తూ కళా ఉత్సవ్‌కు ఎంపికైన ఎంఎస్ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యరూపకం, గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చేసిన కోలాటం, గీతం శాంతినికేతన్, ఎస్ఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల శాస్త్రవేత్తల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు వచ్చాయి. సోలార్ సిస్టమ్స్‌పై నమూనాలను ఎక్కువమంది విద్యార్థులు ప్రదర్శించారు. ప్రతి ప్రాజెక్టూ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్టులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 14 కమిటీల సభ్యులు ఈ ప్రాజెక్టులను స్క్రూట్నీ చేశారు. కార్యక్రమంలో డీఈవో ఆర్.నరసింహరావు, ఆర్జేడీ భార్గవ్, డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసతులు లేక విలవిల ఈ కార్యక్రమంలో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆలస్యంతోపాటు, అన్నం ఉడకకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారివెంట ఉన్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూములు దుర్వాసన రావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా బాత్రూములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యార్థులకు గదుల కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ప్రాజెక్టులతో విద్యార్థులు గంటల తరబడి గదుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కానీ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ప్రదర్శనకు రాలేదు. రాత్రి బస కోసం కేటాయించిన గదుల్లో దోమలు అధికంగా ఉండడం, ఎక్కువమందికి ఒకే గదిని కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టుగా అధికారులు వదిలేయడంపై పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేశారు.