State Bank of Hyderabad
-
మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ!
కాచిగూడ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాచిగూడ బ్రాంచి మేనేజర్‌ను ఓ వ్యక్తి తన వాక్చాతుర్యంతో మాయమాటలు చెప్పి అతని వద్దనుంచి డబ్బులు తీసుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్బీహెచ్ కాచిగూడ మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి అమృతయ్య చౌదరి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు యలమంచలి మహేష్ చౌదరి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. మీరు చౌదరీ.. నేను చౌదరీ ఇద్దరం ఒకే వర్గానికి చెందిన వారమని మాయమాటలు చెప్పి మేనేజర్‌తో స్నేహంగా నటించాడు. తాను హుడా ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పి తనకు వివిధ ప్రాంతాల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాడు. గచ్చిబౌలిలో బ్యాంకు వేలం పాటలో తక్కువ ధరకే ఓ ప్లాట్ వస్తుందని, ప్రస్తుతం రూ.86వేలు చాలన్ కడితే సరిపోతుందని నమ్మబలికి బ్యాంకు మేనేజర్ వద్ద రూ.86వేలు తీసుకుని వెళ్లాడు. ప్లాట్‌కు సంబంధించిన పేపర్లను చూపించి నమ్మించాడు. పేపర్లను టెబుల్పైన పెట్టి వెళ్లండని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. బ్యాంకుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టకుండానే డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి వరకు బిజీగా ఉన్న బ్యాంకు మేనేజర్ తన టేబుల్‌పైన ప్లాట్‌కు సంబందించిన డాక్యుమెంట్స్ కోసం చూడగా అక్కడ ఏమి లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్ దాసరి అమృతయ్య చౌదరి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అడ్మిన్ ఎస్ఐ యు.శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్‌బీహెచ్‌కు రూ.620 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) 2016–17 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో రూ.619.82 కోట్ల నికర నష్టం వాటిల్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.185 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం రూ.854 కోట్ల నుంచి రూ.219 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,203 కోట్ల నుంచి రూ.613 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఆదాయం రూ.1,569 కోట్ల నుంచి రూ.1,085 కోట్లకు వచ్చి చేరింది. 2016 ఏప్రిల్–డిసెంబరు కాలంలో ఎస్‌బీహెచ్‌కు రూ.1,368 కోట్ల నికర నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.812 కోట్ల నికర లాభం పొందింది. మొత్తం వ్యాపారం రూ.2.60 లక్షల కోట్లు, డిపాజిట్లు 16% పెరిగి రూ.1.50 లక్షల కోట్లు నమోదైంది. కాసా డిపాజిట్లు 43% అధికమై రూ.60,309 కోట్లకు చేరాయి. ఎస్బీహెచ్ ఎండీ మణి పల్వేశన్ సోమవారమిక్కడ ఆర్థిక ఫలితాలను విడుదల చేశారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ⇔ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా మణి పల్వేశన్ బాధ్యతలు స్వీకరించారు. ⇔ టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇటీవలే ఎంపికైన ఎన్.చంద్రశేఖరన్ తాజాగా టాటా మోటార్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. అదనపు డైరెక్టర్‌గా, బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చింది. • సమగ్రాభివృద్ధిలో 60వ స్థానంలో భారత్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో... పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ల కంటే దిగువున 60వ స్థానంలో భారత్ ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక వెల్లడించింది. చాలా దేశాలు అసమానత్వాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆర్థిక వృద్ధికి వచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. దశాబ్దాలుగా విధాన కర్తలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, ప్రమాణాలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉందని సూచించింది. సమగ్రాభివృద్ధి సూచీలో లిత్వేనియా ప్రథమ స్థానంలో ఉంది. భారత్ 60వ స్థానంలో ఉండగా, చైనా (15), నేపాల్ (27), బంగ్లాదేశ్ (36), పాకిస్తాన్ (52) మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. • టోకు ధరలకు ఇంధన సెగ! పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్ టోకు ధరల బాస్కెట్‌పై పడింది. 2016 డిసెంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్లో టోకు ధరల బాస్కెట్ ధర 3.39 శాతం పెరిగిందన్నమాట. కాగా నవంబర్‌లో ఈ రేటు 3.15 శాతం. గత ఏడాది ఇదే కాలంలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా 1.06 క్షీణతలో ఉంది. • కేజీ బేసిన్లో కెయిర్న్ తవ్వకాలకు ఓకే! కేజీ బేసిన్‌లోని కేజీఓఎస్ఎన్2009/3 బ్లాక్‌లో ఇంధనాల వెలికితీత కోసం 64 బావులు తవ్వడానికి కెయిర్న్ ఇండియాకు పర్యావరణ శాఖ కమిటీ అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టు ప్రతిపాదనకు సంబంధించి నిర్దిష్ట షరతులతో నిపుణుల కమిటీ (ఈఏసీ) ఈ అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని కేజీ బేసిన్లో 1,988 కి.మీ. మేర ఈ బ్లాక్ విస్తరించింది. ఇందులో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు సంబంధించి 55 ఇంధన అన్వేషణ బావులు, నిల్వల మదింపునకు 11 బావులు తవ్వేందుకు అనుమతుల కోసం కెయిర్న్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. • రెన్యూ పవర్‌కు ఏడీబీ రుణం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజాగా పునరుత్పాదక విద్యుత్ రంగ సంస్థ రెన్యూ పవర్ వెంచర్స్‌కి 390 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,650 కోట్లు) మేర దీర్ఘకాలిక రుణం అందజేయనుంది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని కార్యకలాపాలను విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు రెన్యూ పవర్ తెలిపింది. • హెచ్డీఎఫ్సీ ఎర్గో నిధుల సమీకరణ దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో నాన్‌కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్ రేటు 7.6 శాతంగా ఉందని తెలిపింది. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ’హెచ్డీఎఫ్సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్ రె గ్రూప్ ప్రధాన ఇన్సూరెన్స్ సంస్థ ’ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీ’ల జాయింట్ వెంచరే ఈ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్. • ఎస్బీఐకు రూ.5,681 కోట్ల నిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.5,681 కోట్ల నిధులు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని ఎస్బీఐ తెలిపింది. కేంద్రానికి 21.07 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన కేటాయించడానికి తమ క్యాపిటల్ రైజింగ్ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఎస్బీఐ నివేదించింది. రూ. 1 ముఖ విలువ గల షేర్లను రూ.269.59 ధరకు కేటాయించామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐకు ప్రభుత్వం అందించనున్న రూ.7,575 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ నిధుల సమీకరణ జరిగింది. ఇక మిగిలిన రూ.1,894 కోట్ల నిధులు ఈ ఏడాది మార్చి 31 లోగా ఎస్బీఐకి అందుతాయని అంచనా. • శాంసంగ్ నుంచి ’గెలాక్సీ సీ9 ప్రొ’ ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’శాంసంగ్ ఇండియా’ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ ’గెలాక్సీ సీ9 ప్రొ’ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. నలుపు, బంగారం రంగుల్లో లభ్యంకానున్న ఈ ఫోన్ల ధర రూ.36,900గా ఉంది. డీల్స్.. ⇔ ప్రపంచ టొబాకో పరిశ్రమలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా దిగ్గజం రేనాల్ట్స్ అమెరికన్‌ను చేజిక్కించుకున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) ప్రకటించింది. ఇందుకోసం 49.4 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.3.35 లక్షల కోట్లు) వెచ్చించేందుకు అంగీకరించింది. ఈ డీల్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో (సిగరెట్లు ఇతరత్రా పొగాకు ఉత్పత్తులు) కంపెనీ ఆవిర్భవిస్తోందని బీఏటీ పేర్కొంది. నగదు, షేర్ల రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని తెలిపింది. ⇔ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసులను అందించే ’ఫినో పేటెక్’లో 8.41 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని కోసం రూ.100 కోట్లు చెల్లించింది. ⇔ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పిన్కస్ సంస్థ మల్టిప్లెక్స్ చెయిన్ పీవీఆర్‌లో 14 శాతం వాటాను రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది. ⇔ ఆలీబాబా మొబైల్ బిజినెస్ గ్రూప్‌లో భాగమైన యూసీవెబ్ ..భారత్, ఇండొనేసియాల్లో రూ. 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో సుమారు 60 శాతం (దాదాపు రూ. 120 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ జీఎం కెనీ యీ తెలిపారు. ⇔ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ టర్కీకి చెందిన వ్యవసాయ పరికరాలు తయారు చేసే హిసర్లర్ కంపెనీలో 75.1 శాతం వాటాను రూ.129 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఎస్బీహెచ్ కొత్త ఎండీగా మణి పల్వేశన్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా మణి పల్వేశన్ బాధ్యతలు స్వీకరించారు. శనివారంనాడే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు సోమవారం బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. మణి పల్వేశన్ 1982లో ఎస్‌బీఐహెచ్‌లో ప్రొబేషనరీ అధికారిగా చేరారు. అప్పటి నుంచి బ్యాంకులోని వివిధ విభాగాల్లో పనిచేశారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాంకాంగ్ బ్రాంచ్‌కు అక్కడే సీఈఓగా పనిచేశారు. అంతకుముందు ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ఎండీగా, ముంబయిలోని డీఎండీ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజరుగా కూడా పనిచేశారు. -
నేడు ఆ ఎస్బీహెచ్ శాఖలు తెరిచే ఉంటాయి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలతో ముడిపడి ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలు సోమవారం కూడా తెరిచే ఉంటారుు. ట్రెజరీల ద్వారా లావాదేవీలు జరిగే ఈ బ్యాంకుల్లో సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి చలానాలు, రసీదులు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికె.రామకృష్ణారావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బ్యాంకు ముందు బట్టలిప్పి నిరసన
అబిడ్స్: హైదరాబాద్ నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఓ వ్యాపారి హల్చల్ సృష్టించాడు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ప్రకాష్ అనే వ్యాపారి బాసరలో హోటల్ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన బిల్డింగ్‌ను నిజామాబాద్ జిల్లా ఎస్బీహెచ్ శాఖలో మార్టిగేజ్ చేశాడు. మార్టిగేజ్ తొలగించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకు రీజనల్ అధికారిని కలిసేందుకు వచ్చాడు. కానీ అక్కడ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో తన షర్టు, బనియన్‌ను విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. దీంతో బ్యాంకు వినియోగదారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సిబ్బంది సైతం కలవరానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ గంగారాం బ్యాంక్‌కు చేరుకొని వ్యాపారి ప్రకాష్‌కు నచ్చజెప్పారు. బ్యాంకు రీజనల్ అధికారితో అపాయింట్మెంట్ ఇప్పించారు. అనంతరం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కొద్దిసేపు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
రెండు ఎఫ్ఐఆర్లనూ సీబీఐకి బదలాయించండి
నిధుల మళ్లింపు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇతర బ్యాంకుల్లో లిక్విడేషన్(మూసివేత) కంపెనీల నిధుల మళ్లింపునకు సంబంధించి సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున, ఈ వ్యవహారంలో మల్కాజ్గిరి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను, అన్ని రికార్డులను తక్షణమే సీబీఐ, డీఐజీ(ఏసీబీ విభాగం) హైదరాబాద్‌కు బదలాయించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అఫీషియల్ లిక్విడేటర్ పేరు మీద వివిధ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. -
ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీయత్నం
వరంగల్ : వరంగల్ నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎం లో చోరీ యత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఏటీఎం పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. ఏటీఎం లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఏటీఎం స్వల్పంగా దెబ్బతిన్నది. విషయం తెలిసి బ్యాంకు అధికారులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు
సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం శ్రీరామ్ ఆటోమాల్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా ద్వారా కొనే అన్నిరకాల సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను అందిస్తుంది. ట్రాక్టర్లు, నిర్మాణ యంత్ర సామాగ్రి, వాణిజ్య వాహనాలు, కార్లు, ఆటో రిక్షాల నుంచి ద్విచక్ర వాహనాల వరకు సులభంగా రుణంపొందే విధంగా ఇరు సంస్థల మధ్య అవగాహన కుదురింది. -
బేస్ రేటు తగ్గించిన ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఎస్బీహెచ్ బేస్ రేటు 10.05 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలకు చెల్లించే ఈఎంఐలు తగ్గుతాయని, 30 ఏళ్ల గృహరుణానికి లక్ష రూపాయలకు రూ. 874 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు- బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు 0.75 శాతం(7.25 శాతానికి) తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు కొంతమేర బదలాయించాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానకీ సంకేతం. -
యువ పారిశ్రామికులకు ఎస్బీహెచ్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న స్థాయి యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలను మంజూరు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ముందుకొచ్చింది. ఇందుకోసం భారతీయ యువశక్తి ట్రస్ట్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఎస్బీహెచ్-బీవైఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పోగ్రామ్’ పేరుతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జూలై1 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఎస్బీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమోదయెగ్యమైన వ్యాపార ప్రణాళిక ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు, అంగవైకల్యం కలిగినవారికి, గ్రామీణ పట్టణ యువతకు రూ. 50 లక్షల వరకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా రుణాలను అందిస్తారు. -
ఎస్బీహెచ్ ఓటీఎస్ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రుణాలు తీసుకొని కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఉన్న మొండి బకాయిలను వసూలు చేయడం కోసం అదాలత్ పేరిట ‘వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఓటీఎస్ స్కీం అమల్లో ఉంటుందని, డిఫాల్టర్లు సమీప బ్యాంకు శాఖకు వెళ్ళి రుణ బకాయిలను పరిష్కరించుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, చిన్న, మధ్య స్థాయి పారిశ్రామిక రంగాల వారు ఈ ఓటీఎస్ స్కీంను వినియోగించుకోవడం ద్వారా పెనాల్టీలు, న్యాయపరమైన చర్యల నుంచి తప్పించుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. -
ఎస్బీహెచ్ మాన్సూన్ ధమాకా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘మాన్సూన్ ధమాకా 2015’ పేరుతో ప్రత్యేక హౌసింగ్ లోన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచార కార్యక్రమ సమయంలో తీసుకునే గృహరుణాలపై ఎస్బీహెచ్ వివిధ రాయితీలను ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పేమెంట్ పెనాల్టీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 30 ఏళ్ళ కాలానికి లక్ష రూపాయలకు ప్రతీ నెలా ఈఎంఐగా రూ. 882 చెల్లిస్తే సరిపోతుంది. చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తంపై రోజువారీ విధానంలో వడ్డీని లెక్కిస్తామని, అలాగే మాక్స్‌గెయిన్ పేరుతో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియోలో 21 శాతం వృద్ధి నమోదు చేయాలని ఎస్బీహెచ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
29% పెరిగిన ఎస్బీహెచ్ లాభం
- 2014-15లో రూ.1,317 కోట్లకు చేరిక - గణనీయంగా తగ్గిన ఎన్పీఏలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 29.19 శాతం ఎగసి రూ.1,317 కోట్లకు చేరింది. 2013-14 క్యూ4తో పోలిస్తే మార్చి క్వార్టరులో నికర లాభం రూ.444 కోట్ల నుంచి అతి స్వల్పంగా పెరిగి రూ.445.5 కోట్లను తాకింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ ఆదాయం 10.49 శాతం అధికమై రూ.4,393 కోట్లు నమోదు చేసింది. నిర్వహణ లాభం 8.29 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 24 బేసిస్ పాయింట్లు ఎగసి 3.05 శాతం నుంచి 3.29 శాతంగా ఉంది. బుధవారం ఎస్బీహెచ్ బోర్డు డెరైక్టర్ల సమావేశం ముంబైలో జరిగింది. ఎస్బీహెచ్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సమక్షంలో ఆర్థిక ఫలితాలను ఎండీ శాంతను ముఖర్జీ విడుదల చేశారు. తగ్గిన ఎన్పీఏలు.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 2014-15లో రూ.5,824 కోట్ల (5.89%) నుంచి రూ.4,984 కోట్లకు (4.59%) తగ్గాయి. మొత్తం వ్యాపారం 9.19% ఎగసి రూ.2.40 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తం అడ్వాన్సులు 9.98% అధికమై రూ.1.08 లక్షల కోట్లు, మొత్తం డిపాజిట్లు 8.54% పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు రూ.36,882 కోట్ల నుంచి రూ.43,105 కోట్లకు చేరాయి. 2014-15లో కొత్తగా 127 శాఖలు జతకూడాయి. దీంతో బ్యాంకు నెట్వర్క్ 1,821 శాఖలకు విస్తరించింది. -
నేషనల్ ఇన్సూరెన్స్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాన్ని అమలు చేసేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎంవోయూ పత్రాలను ఎన్ఐసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ భార్గవా డీ నుంచి ఎస్బీహెచ్ చీఫ్ జనరల్ మేనేజర్ విశ్వనాథన్ మంగళవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ అండ్ జీఏ జీఎం శివశ్రీ వీ, డిప్యూటీ జనర ల్ మేనేజర్ థరాకాన్ టీటీఎం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ఎంఎస్‌లు పాల్గొన్నారు. ఒక్కో పాలసీకి ఏడాదికి రూ.12 చొప్పున పీఎంఎస్బీవై 1,821 ఎస్బీహెచ్ శాఖల్లో అమలులో ఉంటుంది. 18-70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న అందరు ఎస్బీహెచ్ కస్టమర్లకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాద బీమా రూ.2 లక్షల వరకూ అందుతుంది. -
బేస్ రేట్ తగ్గించిన ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కనీస రుణ రేటును (బేస్ రేటు) 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పటి వరకు 10.2 శాతంగా ఉన్న బేస్ రేటును 10.05 శాతానికి తగ్గించామని, ఈ తగ్గిన వడ్డీరేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎస్బీహెచ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. బేస్ రేటు ఆధారంగా ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారికిది ఉపశమనం కలిగిస్తుందని, అలాగే కొత్తగా తీసుకునే వారికి ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. దీంతో పాటు హోమ్‌లోన్స్‌పై వడ్డీరేట్లను ఎస్బీహెచ్ తగ్గించింది. రూ.75 లక్షల వరకు గృహరుణాలను 101.10 శాతానికి, అంతకంటే ఎక్కువ మొత్తానికి తీసుకునే గృహ రుణాలను 10.15 శాతానికి తగ్గించింది. గతంలో ఎస్బీహెచ్ 10.25 శాతం వడ్డీని వసూలు చేసేది. ఈ తగ్గిన గృహరుణాల రేట్లు సోమవారం (మే 4) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
కష్టాలే క్రెడిట్లు
మిణుగురులు సమాజానికి దివిటీలు తంగిరాల శారద హైదరాబాద్ ఆబిడ్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో విధుల నుంచి విరమణ పొందనున్నారు. ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు శారదను చూస్తే అసలేమాత్రం ఆమె అంధురాలనిపించరు! మరి ఇన్నేళ్లుగా ఉద్యోగినిగా కొనసాగుతూ బ్యాంకు అధికారులు, సహోద్యోగుల మన్ననలు పొందడం శారదకు ఎలా సాధ్యమైంది?! ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘పాతికేళ్ల క్రితం కంట్లో పిగ్మెంటేషన్ మొదలైంది. ‘చూపు ఎన్నాళ్లుంటుందో చెప్పలేం’అన్నారు డాక్టర్. మసక చూపుతో పనిలో తప్పులు దొర్లితే నాకు చెడ్డపేరు రావడం అంటుంచి, బ్యాంకు పరువు ఏం కానూ? అందుకే... మూడు నెలల పాటు ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఉద్యోగం మానేశాను. కానీ, ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. నా భర్త ఒక్కరే ఉద్యోగం చేస్తే గడిచేలా లేని జీవితం. మళ్లీ ఉద్యోగం చెయ్యడం తప్పలేదు. అదృష్టవశాత్తూ, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. చేస్తున్న ఉద్యోగాన్నే కంటిన్యూ చెయ్యమన్నారు. ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో తెలీదు! పెళ్లికి ముందే నాకు ఎస్.బి.హెచ్లో (ఖమ్మంలో) టైపిస్టుగా ఉద్యోగం వచ్చింది. మావారు ఉద్యోగరీత్యా ముంబయ్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో నేనూ వెళ్లక తప్పలేదు. ముంబయ్‌లో కాపురం. ఉండేది ఐదో అంతస్తులో. ఉదయం తొమ్మిది గంటలకు బ్యాంకుకు బయల్దేరితే, తిరిగి ఇంటికి చేరేది రాత్రి తొమ్మిది గంటలకే. నేను వచ్చిన గంటకు మా వారు డ్యూటీకెళ్లేవారు. అర్ధరాత్రి నీళ్లు వచ్చేవి. ఈ మధ్యలో పిల్లవాడి బాగోగులు. తిరిగి మూడు గంటలకు లేచి, రెడీ అయితే తప్ప సమయానికి ఆఫీస్‌కు చేరుకునేదాన్ని కాదు. ఆ పదిహేనేళ్లు ఎప్పుడు ఊపిరి తీసుకున్నానో కూడా తెలియదు. చూపు బాగుండి... మసకబారి... పూర్తిగా చూపుకోల్పోయే దశలో మావారి ట్రాన్స్ఫర్ కారణంగా హైదరాబాద్ చేరుకున్నాను. సహ సిబ్బంది సహకారం సీతాఫల్మండిలో నివాసం. ఆబిడ్స్‌లో ఉద్యోగం. అక్షరాలు పూర్తిగా కనపడటమే మానేశాయి. ఇక టైపింగ్ పనులు చేయలేను అని నిర్ధారించుకున్నాక డ్యూటీని టెలీఫోన్ ఎక్స్ఛేంజ్కి మార్పించుకున్నాను. 1991లో క్లర్క్‌గా ఉన్నవారు టెలీఫోన్ ఆపరేటర్‌గా చేరొచ్చు అనే ప్రకటన వెలువడింది. దాంతో పూర్తిస్థాయి టెలీఫోన్ ఆపరేటర్‌గా రికార్డుల్లో చేరాను. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది నాకెంతో అండగా నిలిచారు. వారి మేలు మరువలేను. పద్నాలుగు రకాల పనులు అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ (జాస్) ఉందని తెలుసుకొని, దానిని నేర్చుకున్నాను. ఆ తర్వాత నాలాగా చూపు లేని వారు చేసుకోదగిన పనులు బ్యాంకులలో ఏమున్నాయో శోధించాను. అలా చూపుతో పనిలేకుండా ‘రిస్క్ ఫ్యాక్టర్’ లేని 14 పనుల గురించి తెలిసింది. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చూపులేని ఉద్యోగులు దేశమంతటా ఎంతమంది ఉన్నారో తెలుసుకొని, వారందరికీ పెరంబదూర్‌లో నా పర్యవేక్షణలోనే జాస్ శిక్షణ ఇప్పించారు. పద్దెనిమిదేళ్ల సోదర బంధం 1998 నాటికి... చీకటి పడగానే కళ్లముందు పూర్తిగా కాంతి మాయమయ్యేది. అందుకని, చీకటి పడకుండానే ఇల్లు చేరేదాన్ని. కానీ, ఆ తర్వాత పగలు కూడా అదే స్థితి. ఓ రోజు సయ్యద్ సుల్తాన్ ఆటో ఎక్కాను. నా పరిస్థితి గమనించి, రోజూ నన్ను ఆఫీస్‌లో దిగబెట్టి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యతను ఒప్పుకున్నాడు. ఇప్పటికి 18 ఏళ్లు. నాటి నుంచి నేటివరకు తమ్ముడిలా నాకు రథసారథ్యం వహిస్తూనే ఉన్నాడు (కృతజ్ఞతగా). ఇక మా అబ్బాయి. ముంబయ్‌లో ఐఐటి చేసి, పెళ్లి చేసుకొని, ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ‘అమ్మ చాలా కాన్ఫిడెంట్’ అంటుంటాడు. నవ్వుతూనే ఆ ప్రశంసలు అందుకుంటాను’’... అంటూ తన జీవితం నిండా చోటుచేసుకున్న మలుపులను, వాటిని ఎదుర్కొన్న తీరును వివరించారు శారద. ఉద్యోగినిగానే కాదు కవయిత్రిగానూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు శారద. సంకల్ప బలం ఉంటే చూపులేకపోయినా సాధనతో విజయం సాధించవచ్చు అనేందుకు శారద చక్కని నిదర్శనం. శారదమ్మే సాయం చేసింది నాకు మొదట్లో అద్దె ఆటో ఉండేది. శారదమ్మ ప్రోత్సాహంతో బ్యాంకు లోను తీసుకొని సొంత ఆటో కొనుక్కున్నాను. నాకు ముగ్గురు ఆడబిడ్డలు. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లకీ శారదమ్మ సాయం చేసింది. - సయ్యద్ సుల్తాన్, ఆటో డ్రైవర్ -
ఎన్సీఎంఎల్తో ఎస్బీహెచ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పంట పండించి, అమ్ముకునే వరకు వివిధ దశల్లో అవసరమైన మొత్తాన్ని సమకూర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం అగ్రి ఇన్ఫ్రా కంపెనీ నేషనల్ కోల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఎన్‌సీఎంఎల్)తో ఎస్బీహెచ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రైతులు గొడౌన్లలో దాచుకున్న సరుకుపై కూడా రుణం పొందే వీలవుతుందని ఎన్సీఎంల్ ఎండీ, సీఈవో సంజయ్కౌల్ తెలిపారు. -
ఎస్బీహెచ్లో చోరీ
దేవరకద్ర : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాంకు కిటికీలోంచి చొరబడి రెండు కంప్యూటర్ మానిటర్లను, రైస్‌మిల్లు లోని ల్యాప్‌టాప్, కొంత నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం దేవరకద్రలోని స్టేట్ బ్యాంకు హై దరాబాద్ (ఎస్బీహెచ్) ను తెరిచిన సిబ్బంది సాయంత్రం మూసివేసి ఇంటికి వెళ్లారు. అదే అర్ధరాత్రి దుండగులు బ్యాంకు మేనేజర్ గది కిటికీఊచలు తొల గించి లోపలికి ప్రవేశించి రెండు కంప్యూటర్ మానిటర్లను ఎత్తుకెళ్లారు. ఎప్పటిలా గే మంగళవారం ఉదయం మొదట ఊ డ్చేవారు సిబ్బంది వచ్చి శుభ్రం చేస్తుం డగా వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే మేనేజర్ ప్రసాద్‌రెడ్డితో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ వినయ్‌రెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కిటి కీ తలుపులకు గొళ్లెం వేయకపోవడం వల్లే ఇనుపచువ్వలను తొలగించి లోపలికి దొంగలు ప్రవేశించినట్టు భావిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల దొంగల ఆచూకీ సీసీ ఫుటేజీల్లో కనిపించలేదు. మేనేజర్ గదికి రెండు వైపులా తాళాలు వేయడం వల్ల బ్యాంకు లోపలికి దొంగలు ప్రవేశించలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనతో బ్యాంకు లావాదేవీలు మధ్యాహ్నం వరకు సాగకుండా మూసివేశారు. మరో సంఘటనలో కోయిల్‌సాగర్‌రోడ్డులో ఉన్న కన్నయ్యరైస్ మిల్లులో దొంగలుపడి లాప్టాప్, టేబుల్ సొరగులను పగులగొట్టి అందులో ఉన్న *1,500 ఎత్తుకెళ్లారు. ఒకేసారి రెండుచోట్ల జరిగిన దొంగతనంలో కంప్యూటర్లే పోవడం గమనార్హం. -
ఖాతాల నిలిపివేత హైకోర్టు
ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా సమీక్ష అనంతరం గంటా వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమ ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపచేయడంపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మండలి విధులకు ఆటంక పరిచినందుకు, విద్యార్థుల పరీక్షలు భవితతో ముడిపడి ఉన్న వ్యవహారాలు ఆలస్యమయ్యేలా వ్యవహరించినందుకు క్రిమినల్ డిఫమెషన్ దావా కూడా దాఖలు వేయాలని భావిస్తోంది. ముందుగా ఖాతాల నిలిపివేతపై సోమవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తాజా పరిస్థితిపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత విద్యా మండలి అధికారులతో శుక్రవారం సమీక్షించారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి,విద్యా మండలి ఛైర్మన్‌ఎల్.వేణుగోపాలరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.నోటీసులు ఇవ్వకుండా ఎస్‌బిహెచ్ మండలి ఖాతాలను స్తంభింపచేయడం చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేబినెట్లో నిర్ణయించాక ఎంసెట్‌పై నిర్ణయం..: ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. వివిధ సెట్లకు యూనివర్సిటీల ఎంపిక, కన్వీనర్ల నియామకం, పరీక్షల ఏర్పాట్లు వంటి అంశాలను పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక దీనిపై వచ్చేనెల 2న కేబినెట్లో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ సమీక్ష వివరాలను వెల్లడించారు. -
ఏపీ విద్యామండలి ఖాతాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లోని ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాను బ్యాంకు అధికారులు (ఫ్రీజ్)నిలిపివేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చేసిన ఫిర్యాదుతో ఎస్బీహెచ్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని శాంతినగర్ ఎస్బీహెచ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలికి గురువారం లేఖ అందించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిర్యాదు మేరకు ఖాతాలు నిలిపివేస్తున్నామని, వివాదం ఏమైనా ఉంటే 2 విద్యామండళ్లూ పరిష్కరించుకొని వస్తేనే ఖాతాలను తిరిగి కొనసాగిస్తామని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఏపీ ఉన్నత విద్యామండలికి శాంతినగర్ బ్రాంచిలో రూ.25 కోట్ల వరకు వివిధ డిపాజిట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకు ఫ్రీజ్ చేసింది. ఈ పరిణామంపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు తీవ్రంగానే స్పందించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే బ్యాంకు అధికారులను నిలదీసిన మండలి అధికారులు.. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి స్పందిస్తూ.. ఎస్బీహెచ్ తీరు తీవ్ర ఆక్షేపణీయమని, చట్టాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. కాగా, ఖాతాల నిలిపివేతతో వివిధ సెట్ల నిర్వహణ, ఏర్పాట్లు నిలిచిపోనున్నాయని మండలి అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీహెచ్ తీరును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించడంతోపాటు అవసరమైతే ఎస్‌బీహెచ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు మండలి వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖలో ఎక్కడా ఫ్రీజ్ చేయాలని కోరకపోయినా.. ఎస్బీహెచ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రభుత్వం మండిపడుతున్నట్టు తెలిసింది. -
ఫిబ్రవరిలో వడ్డీరేట్ల కోత..
మార్చిలోగా ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించొచ్చు ⇒ 181% వృద్ధితో రూ. 334 కోట్లకు చేరిన క్యూ3 నికరలాభం ⇒ 5.77 నుంచి 5.32 శాతానికి తగ్గిన స్థూల ఎన్పీఏలు ⇒ త్వరలో టైర్2 బాండ్స్ ద్వారా రూ. 400 కోట్ల సమీకరణ ⇒ ప్రస్తుతానికి విలీన అవకాశాలు లేవు - ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొన్న ఆర్బీఐ చేసిన పావు శాతం వడ్డీరేట్ల తగ్గింపును వచ్చే నెలలో ఖాతాదారులకు బదలాయిస్తామని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. డిపాజిట్లు రేట్ల తగ్గిస్తేనే తప్ప రుణాలపై వడ్డీరేట్లు తగ్గించలేమని, వచ్చే నెలలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ చెప్పారు. మంగళవారమిక్కడ బ్యాంకు 3వ త్రైమాసిక (సెప్టెంబర్- డిసెంబర్) ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. మార్చిలోగా ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందన్నారు. ‘‘రిటైల్ రుణాలకు తప్ప ఇపుడు కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదు. 4వ త్రైమాసికం నుంచి రుణాలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే ఏడాది రుణాల్లో 17-18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. వ్యాపార విస్తరణకు కావాల్సిన మూలధనాన్ని టైర్-2 బాండ్ల ద్వారా సేకరించాలని చూస్తున్నాం. ఈ మార్చిలోగా బాండ్లు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పేరెంట్ బ్యాంక్ ఎస్బీఐలో విలీనమయ్యే అవకాశాలు కనిపించడం లేదు’’ అని తెలియజేశారు. నికర లాభంలో రికార్డు స్థాయి వృద్ధి నికర లాభంలో బ్యాంకు రికార్డు స్థాయిలో 181 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.334 కోట్లకు చేరింది. అధిక వడ్డీరేటున్న బల్క్ డిపాజిట్లను రూ.44,295 కోట్ల నుంచి రూ. 31,965 కోట్లకు తగ్గించుకోవడం, ఇతర ఆదాయం 92 శాతం వృద్ధితో 185 కోట్ల నుంచి 356 కోట్లకు పెరగడం దీనికి ప్రధాన కారణాలని ముఖర్జీ చెప్పారు. ఇదే సమయంలో తక్కువ వడ్డీ రేటున్న కాసా డిపాజిట్లను 27 నుంచి 31 శాతానికి పెంచుకోవడంతో నికర వడ్డీ లాభదాయకత (నిమ్) 3.04 శాతం నుంచి 3.26 శాతానికి పెరిగింది. నాల్గవ త్రైమాసికంలో కూడా నిమ్ ఇదే స్థాయిలో ఉంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.988 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు చేరింది. తగ్గుతున్న నిరర్థక ఆస్తులు నిరర్థక ఆస్తులను ఎస్బీహెచ్ గణనీయంగా తగ్గించుకుంది. దీనికోసం చేపట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్తో సహా ప్రత్యేక కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని ముఖర్జీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే స్థూల ఎన్పీఏలు 5.73 నుంచి 5.32 శాతానికి, నికర ఎన్పీఏలు 2.82 నుంచి 2.43 శాతానికి తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రుణ మాఫీ ఖాతాల్లో 94 శాతం పునరుద్ధరించడం పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఆలస్యంగా మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి కావచ్చని చెప్పారు. -
కొత్త ప్రాంగణంలోకి ఎస్బీహెచ్ ఎన్నారై బ్రాంచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై బ్రాంచ్‌ను వేరే ప్రాంతానికి మార్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. 1992, నవంబర్‌లో ఫతే మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఇప్పుడు హిమాయత్ నగర్‌కు మారింది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ మార్పు చేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రాంగణంలో ఈ ఎన్నారై శాఖను ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, వి. విశ్వనాధన్(సీజీఎం, ఆర్బీ), అనిల్ మల్హోత్ర(జనరల్ మేనేజర్, పీబీ), దేవేంద్ర కుమార్(జీఎం, హైదరాబాద్ నెట్వర్క్), ఎస్.సి. ధావన్ (డీజీఎం, మెట్రోజోన్), హర్షవర్థన్ మాడభూషి(జనరల్ సెక్రటరీ, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. సుధాకర్ రెడ్డి(బ్రాంచ్ హెడ్) తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీహెచ్ నికరలాభం 91% అప్
గత 3 నెలల్లో రూ.300 కోట్ల ఎన్పీఏల అమ్మకం ఈ ఏడాది వ్యాపారంలో 12 శాతం వృద్ధి అంచనా తెలంగాణలో 42 శాతం వ్యవసాయ రుణాలు రోలోవర్ హుదూద్ ప్రాంత రుణగ్రహీతల కోసం ప్రత్యేక పథకం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం కన్నా లాభాలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక వ్యాపారంలో ఎటువంటి వృద్ధి నమోదు చేయకుండానే నికరలాభంలో 91% వృద్ధిని ఎస్బీహెచ్ నమోదు చేయడం విశేషం. గతేడాది ఇదే కాలానికి రూ. 163 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.311 కోట్లకు చేరింది. మంగళవారం సాయంత్రం ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ శాంతను ముఖర్జీ మాట్లాడుతూ లాభాలను పెంచుకోవడం కోసం అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, తక్కువ వడ్డీరేట్లు ఉన్న రుణాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల్లో అధిక వడ్డీలు ఉన్న 6,000 కోట్ల బల్క్ డిపాజిట్లను వదిలించుకున్నామని, దీంతో డిపాజిట్ల వృద్ధిలో క్షీణత నమోదయ్యిందన్నారు. ఈ విధానం అనుసరించడం ద్వారా గత మూడేళ్లలో నమోదు చేయని విధంగా నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధి చెందిందన్నారు. గతేడాది రూ. 945 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ ఏడాది రూ. 1,095 కోట్లకు పెరిగిందని, నికర వడ్డీ మార్జిన్లు 3.09% నుంచి 3.17 శాతానికి పెరిగాయని చెప్పారు. ఇదే సమయంలో వ్యాపారం రూ.2.18 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు మాత్రమే పెరిగిందని, ఈ ఏడాది వ్యాపారంలో 12% వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరగలేదని, చివరి త్రైమాసికం నుంచీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాని డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. తగ్గుతున్న నిరర్థక ఆస్తులు నిరర్థక ఆస్తులు తగ్గించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇందులో భాగంగా నిరర్థక ఆస్తులను విక్రయించడం, రుణాల్ని పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు చెప్పారు. గడచిన మూడు నెలల కాలంలో రూ.300 కోట్ల ఎన్పీఏలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీల (ఆర్క్స్)కు విక్రయించడం జరిగిందని, అలాగే వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 75 కోట్ల ఎన్పీఏలను వదిలించుకున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా సుమారు మరో రూ. 300 కోట్ల కార్పొరేట్ రుణాలను పునర్వ్యవస్థీకరించారు. ఇక నికర ఎన్పీఏలు 3.37 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గాయి. గత 3 నెలల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఎన్పీఏలు నమోదు కాలేదని, ఇకపై కూడా ఇదే విధంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ముఖర్జీ వ్యక్తం చేశారు. 75% వ్యవసాయ రుణాల రోలోవర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రుణాల రోలోవర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ప్రస్తుతం 42 శాతం రుణాలను రోలోవర్ చేసినట్లు ముఖర్జీ తెలిపారు. రుణ మాఫీ పథకంలో భాగంగా మొదటి దశ కింద తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.6,000 కోట్లు చెల్లించదన్నారు. ఇందులో ఎస్బీహెచ్ వాటా రూ.965 కోట్లుగా ఉందన్నారు. నవంబర్ నెలాఖరునాటికి 75 శాతం రుణాలను రోలోవర్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి నిధులు రాలేదని, దాంతో అక్కడ రోలోవర్ మొదలవ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హూదూద్ తుఫాన్లో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే విధంగా కొత్త పథకాన్ని తీసుకురావడంపై ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నట్లు ముఖర్జీ తెలిపారు. చిన్న వ్యాపారస్థులు తీసుకున్న రుణాలు చెల్లింపుపై మారిటోరియం లేదా ఉత్తారఖండ్ తరహాలో విడతల వారీగా రుణాలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
ఉప్పల్ ఎస్బీహెచ్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీహెచ్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు అధికారులు ఎస్బీహెచ్ వద్దకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.