Telangana Budget 2020-21
-
దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నేడు(మార్చి 16న) దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు. చదవండి: (విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేనన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదని,. నోముల నర్సింహయ్య తనకు వ్యక్తిగతంగాదగ్గరి మిత్రులని పేర్కొన్నారు. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు పని చేశామని, తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని నర్సింహయ్య హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు. అనంతరం సభ వాయిదా పడింది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పనున్నారు.18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ సమావేశాలు కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్’పై అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ కుదించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 20న ముగియాల్సి ఉంది. కోవిడ్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో శనివారం మధ్యాహ్నం సీఎం.. ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం, రాత్రి ప్రగతి భవన్లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని శనివారం ఉదయమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలను 16వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. దీంతో సభ కార్యకలాపాల షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను ప్రవేశ పెట్టారు. 2 రోజుల సాధారణ చర్చ అనంతరం, శుక్ర, శనివారాల్లో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు 15 పద్దులపై చర్చించి శాసనసభ ఆమోదించింది. 16 నుంచి 19 వరకు మరో 25 పద్దులౖ పె చర్చించేలా బీఏసీలో తొలుత షెడ్యూలు సిద్ధం చేశారు. తాజాగా సమావేశాలను కుదించాలని నిర్ణయించడంతో 15, 16 తేదీ ల్లోనే సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ షెడ్యూలులో 15న, ఆదివారం విరామం ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు కూడా పద్దులపై చర్చిస్తారు. 25 పద్దులకు గాను నీటిపారుదల, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి కీలక పద్దులకే చర్చను పరిమితంచేసే అవకాశం ఉంది. చర్చకు నోచుకోని మిగతా పద్దులను గిలొటిన్ చేసే అవకాశముంది. 20న ప్రవేశ పెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లును 16న ప్రవేశపెట్టి ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేస్తారు. సోమవారం మండలి సమావేశం ఈ నెల 6 నుంచి 14 వరకు జరిగిన శాసన మండలి.. బీఏసీ నిర్ణయం మేరకు తిరిగి 20న సమావేశం కావాల్సి ఉంది. తాజాగా మండలి షెడ్యూల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 16న సమావేశమయ్యే శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ మేరకు శాసనమండలిని సోమవారానికి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కాగా బీఏసీ సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆది, సోమవారాల్లో ప్రశ్నోత్తరాలను శాసనసభ నిబంధన 38 కింద రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. -
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్‌పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
ఇది వాస్తవిక బడ్జెట్ : అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు స్పెషల్ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్ సిటీ వైపు విస్తరించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని, వక్ఫ్ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఏమాత్రం క్షేమకరం కాదని, బడ్జెట్లో సామాజిక స్పృహ లోపించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అభూత కల్పనలతో సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టి ప్రభుత్వం సభను, ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం అప్పులు, మద్యం విషయంలోనే బడ్జెట్లో అభి వృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చలో ఆయన ప్రసంగిం చారు. ప్రభుత్వం చూపిన ద్రవ్యలోటు రూ. 33 వేల కోట్లను పూడ్చుకొని మరో రూ. 30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబడితే కానీ బడ్జెట్ వాస్తవ రూపంలోకి రాదన్నారు. రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్లో ద్రవ్యలోటు, పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 63 వేల కోట్ల రాబడి ప్రశ్నార్థకం కానుందన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలి... గత బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఈసారి దానికి అదనంగా రూ. 16 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ‘తాగండి.. తాగండి.. తాగండి, అమ్మండి..అమ్మండి..అమ్మండి’ అనే రీతిలో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వెంటనే మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని భట్టి డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు అమ్మొద్దు... పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 30 వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని భట్టి ప్రశ్నించారు. భూములు అమ్ముతారా? రాజీవ్ స్వగృహ ఆస్తులు అమ్ముతారా? దిల్ భూములు అమ్ముతారా... ఏ మార్గంలో పన్నేతర ఆదాయం వస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మొద్దని, వాటిని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కింద కేటాయించాలని కోరారు. 2007–08లో ప్రభుత్వం వేలం వేసిన భూములను కొన్ని సంస్థలు కొని నిరర్ధకంగా వదిలివేశాయని, ఆ భూములను మళ్లీ తీసుకొని వాటిని ప్రస్తుత ధరల్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో వివక్ష.. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని భట్టి ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాల వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందిందే తప్ప ఇందులో టీఆర్ఎస్ సాధించిందేమీ లేదన్నారు. పరిశ్రమల స్థాపనలో సర్కారు వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వారికి, ప్రజాప్రతినిధులకు వాటాలున్న కంపెనీలకు ప్రత్యేక జీవోలిచ్చి ప్రోత్సాహకాలిస్తున్నారని, మిగిలిన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో పెద్ద అవినీతి జరిగిందని, పౌల్ట్రీ రైతుకు సబ్సిడీపై ఇవ్వాల్సిన మొక్కజొన్నలను బడా కంపెనీలు గంపగుత్తగా టన్ను రూ. 18 వేలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రూ. 26 వేలకు బయట అమ్ముకుంటున్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. విద్యకు కేటాయింపులు పెంచాలి... యూనివర్సిటీలకు కేటాయించిన మొత్తం జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోవని భట్టి అభిప్రాయపడ్డారు. పీహెచ్డీ విద్యార్థులు కేటరింగ్ పనులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 58.71 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేవలం 5.14 శాతం అంటే 3.02 లక్షల మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని చెప్పారు. 46.82 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కాలం? బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు చూపినా వాటిని ఎలా ఖర్చు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలు కలపి రూ. 3.19 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్లో రూ. 22 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, భవిష్యత్‌లో అవి మోయలేని స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తిరిగి చెల్లించే గడువు కూడా 40 ఏళ్లు పెట్టారని తెలుస్తోందని, దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. లక్షల కోట్లు చూపుతూ కేటాయింపులు మాత్రం ఈసారి రూ. 11 వేల కోట్లకే పరిమితం చేశారని, ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎన్నేళ్లు కడతారని భట్టి ప్రశ్నించారు. పదేపదే రుణాలు తీసుకునేందుకే ప్రభుత్వం ఇలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. మిషన్ భగీరథను పెద్ద ఫ్రాడ్‌గా అభివర్ణించిన భట్టి... గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు సంతకాలు చేయించుకొని వెళ్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో విభేదిస్తున్నానని, ప్రజలకిచ్చిన హామీలకు అనుగుణంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్ కేటాయింపులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పేరు చెప్పేటప్పుడు అనుమతి తీసుకున్నారా? పౌల్ట్రీ రంగంపై భట్టి మాట్లాడుతున్న సమయంలో మార్క్‌ఫెడ్ నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు, వాటి యజమానుల పేర్లు చెబుతూ రంజిత్‌రెడ్డికి చెందిన రాజరాజేశ్వరి హేచరీస్ పేరును ప్రస్తావించారు. దీంతో కలగజేసుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే రికార్డుల నుంచి ఆ పేరును తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రంజిత్‌రెడ్డి ఎంపీ అని తనకు ఇంతవరకు తెలియదని, కానీ తాను ఎంపీ అని సంబోధించలేదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన అంశంపై భట్టి మాట్లాడుతుండగా ప్రభుత్వ విప్ సునీత కలగజేసుకొని సభ నుంచి భట్టిని సస్పెండ్ చేయలేదని కామెంట్ చేసి నాలుక కరుచుకున్నారు. మద్యం, యూనివర్సిటీలు, మిషన్ భగీరథపై భట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ అధికార టీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. -
ఆర్థిక మాంద్యంలోనూ బీసీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : ఆర్థికమాంద్యంలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2020–21కు ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నా యని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద వ్, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ తెలిపా రు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సోమవారం మంత్రులు మీడియాతో మాట్లాడా రు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు పెరిగాయని, 70 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సబ్‌ప్లాన్ కంటే ఎక్కువ మేలు బీసీలకు కలిగేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, కేసీఆర్‌ను బీసీలు శాశ్వతంగా గుర్తుకు పెట్టుకుంటారని అన్నారు. గతంలో అంకెల కోసం బడ్జెట్ రూపొం దిస్తే, తాము ఆచరణ సాధ్యమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. బడ్జెట్ తీరుతెన్నులపై ప్రతిపక్షా లు అర్ధం లేని విమర్శలు చేస్తున్నాయని తలసాని వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యంలోనూ బీసీలు, అణగారిన వర్గాల కోసం రూ.30వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శా ఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము బీసీ అనుకూల అనుకూల విధానాన్ని కొనసాగిస్తున్నందునే బీజేపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తోందన్నారు.దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బీజేపీ కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ను మరో జ్యోతీరావు ఫూలేగా అభివర్ణించిన శ్రీనివాస్‌గౌడ్ పని చేసే వ్యక్తిని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలు కక్ష కట్టి మరీ ఓడిస్తాయని హెచ్చరించారు. బీసీలకు సబ్ ప్లాన్ అవసరమనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని భవిష్యత్తులో పరిశీలిస్తారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంబీసీలకు రూ.500 కోట్లు.. అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) చెందిన వారి కోసం రూ.500 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని, అనేక ఇతర పథకాల ద్వారా కూడా బీసీలకు మేలు కలుగుతుందన్నారు. బీసీ ఫెడరేషన్ల ఖాతాలో నిధులు లేవనే ఆరోపణలను ఖండిస్తూ, గీత కార్మికుల సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు పెరిగిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో వివిధ వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచేవని, కానీ తమ ప్రభుత్వ విధానం మాత్రం అన్నివేళలా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. -
పాత ప్రాజెక్టులకు.. అరకొర నిధులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్లో సాగునీటిశాఖకు చేసిన నిధుల కేటాయింపుల్లో నిర్మాణంలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది. ప్రాజెక్టుల పూర్తికి రూ. వందల కోట్లలో కేటాయింపులు కోరితే కేవలం రూ.పదుల కోట్లలో మాత్రమే నిధులు దక్కాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రా జెక్టు, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకూ అరకొర నిధులే ఇచ్చి ంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. వీటికింద ఉన్న కొద్ది పాటి భూసేకరణ, సహాయ పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే గణనీయంగా ఆయ కట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కల్వకుర్తి పరిధిలో భూసేకరణకోసం రూ. 24.18 కోట్లు, పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల పెండింగ్ బిల్లులు ఉండగా, నెట్టెంపాడు పరిధిలో పనులకు చెందినవి రూ.11.47 కోట్లు, భూసేకరణవి రూ.8.98 కోట్లు, పునరావాసానివి రూ.1.83 కోట్లు బకాయిలు ఉండగా, భీమా పరిధి లోనూ రూ.36 కోట్ల బకాయిలున్నాయి. వీటిని తీర్చడంతో పాటు చివరి దశ పనుల పూర్తికి కనీసం రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది.అయినప్పటికీ బడ్జెట్లో మొత్తంగా రూ.50 కోట్ల నిధులే దక్కాయి. అధిక నిధుల అవసరాలున్న కల్వకుర్తి ప్రాజెక్టుకు కేవలం రూ.2.29 కోట్లతో సరిపెట్టారు.గతేడాది సైతం ఈ ప్రాజెక్టుకు రూ.3 కో ట్లు నిధుల కేటాయింపు జరగడం విశేషం.ఇక బీమాకు రూ.3.69 కోట్లు,నెట్టెంపాడుకు రూ.16.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.17.40 కోట్లతో నామమాత్రపు కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తి ఎలా సాధ్యమన్నది భవిష్యత్తే చెప్పాల్సి ఉంది. టన్నెల్ అక్కడే..ప్రాణహిత పడకే.. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల పూర్తికి నిధులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో పనులకు గాను రూ.126 కోట్ల మేర నిధులు పెండింగ్‌లో ఉండగా కేటాయించింది మాత్రం రూ.3.16 కోట్లు మాత్రమే. ఈ నిధులతో 43.89 కి.మీటర్ల టన్నెల్ పనుల్లో మిగిలిన మరో 10 కి.మీ.లకు టన్నెల్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంపై ఇప్పటికీ స్పష్టత లేదు.బ్యారేజీ దిగువన పనులు జరుగుతున్న ప్యాకేజీల్లో ఇంకా భూసేకరణ అవసరాలకు రూ.269 కోట్ల నిధులు అవసరమున్నా ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని భావించినా కేవలం రూ.12 కోట్లు కేటాయించి ప్రభుత్వం పూర్తిగా నిరుత్సాహ పరిచింది. -
6 లక్షల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం. -
‘కేసీఆర్ కరోనాకు మందు కనిపెట్టారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మోసపూరిత, అబద్దాల బడ్జెట్ అని అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీతో బడ్జెట్‌ను మసిపూసి మారేడు కాయలా చేశారన్నారు. బడ్జెట్ బారెడు- ఖర్చు చారెడుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తలసారి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని వరుస ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం.. ఇలా కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నొటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?) ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా... తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఎన్నికలు ఉన్నందున నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారు. ఇది పచ్చి మోసం. డబ్బులు లేవని ఆస్తులను అమ్మే వారు ఏ రకంగా ఆదర్శప్రాయులో వారే చెప్పాలి. రాష్ట్రంలో ఆర్థిక మందగమనం లేదు. ఉన్నదల్లా కేసీఆర్ మందగమనమే. కేంద్రం మీద సాకు చూపి వీరి అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. నిరుద్యోగ, ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో పార్టీ నేతృత్వంలో ఉద్యమం చేపడతాం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైంది? కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? కేసీఆర్.. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం అంటున్నారు’ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. (రోహింగ్యాలకు పింఛన్లా?) -
రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం
సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్ ) గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త) ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు కూడా జిల్లాలోని బ్యాంక్‌లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రాబ్యాంక్(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్) రుణం పొందిన రైతులు 2.63 లక్షలు జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 2018 డిసెంబర్ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. చింతా చంద్రశేఖర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఖమ్మం -
డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నగర భద్రతకు పెద్దపీట వేసింది. ఆ కోణంలోనే నిధుల కేటాయింపు చేసింది. బంజారాహిల్స్‌లో నిర్మాణమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కమ్ టెక్నాలజీ ప్యూజన్ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. దీంతో పాటు మూడు కమిషనరేట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రగతి పద్దు కింద రూ.672 కోట్లు కేటాయింగా... దీని నుంచి రాజధానిలోని మూడు కమిషనరేట్లకే రూ.329 కోట్ల కేటాయింపు జరిగింది. అయితే.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పోలీసుస్టేషన్లకు మాత్రం నామమాత్రపు కేటాయింపులతో మొండిచేయి చూపింది. డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శరవేగంగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. 2018–19ల్లో ఈ బడ్జెట్లో రూ.147.5 కోట్లు కేటాయించింది. ఇదే ప్రాజెక్టుకు తాజాగా రూ.50 కోట్లు కేటాయించింది. మరోపక్క ముగ్గురు కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా సంఖ్య రెండు లక్షలకు చేరుతోంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ఇతర కేటాయింపులు ఇలా... ♦ నగర ట్రాఫిక్ విభాగానికి: రూ.2.56 కోట్లు ♦ గణేష్ ఉత్సవాల నిర్వహణకు: రూ.6.14 కోట్లు ♦ నగర నేర పరిశోధన విభాగానికి: రూ.12 లక్షలు ♦ కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.5 లక్షలు ♦ ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు: రూ.10 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకు: రూ.10 కోట్లు ♦ సైబరాబాద్ ట్రాఫిక్‌కు: రూ.2.22 కోట్లు ♦ సైబరాబాద్ గణేష్ ఉత్సవాలకు: రూ.28 లక్షలు ♦ సైబరాబాద్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.15 లక్షలు ♦ రాచకొండ గణేష్ ఉత్సవాలకు: రూ.2.05 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకి: రూ.4 కోట్లు ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టెక్నాలజీ ప్యూజన్ సెంటర్‌గా ఉండే సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్– క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించింది. ఈ భవనానికి సీఎం కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అప్పట్లో అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017– 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.280.8 కోట్లు కేటాయింపు జరిగింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో పూరిత చేయడం ఆలస్యమైంది. తాజాగా రూ.125 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది చివరి నుంచి దీని సేవలు ప్రారంభంకావడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రానికే తలమానికం... దేశంలోనే ప్రతిష్టాత్మకంగా, ‘ట్విన్ టవర్స్’ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ రాష్ట్రానికే తలమానికం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 83.4 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్నాయి. వీటి ద్వారా పోలీసు సింగిల్ విండో, కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం, సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం, లా అండ్ ఆర్డన్ సిస్టం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఒకే గొడుగు కిందికి రానున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంలో భాగంగా డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోటకు చేరతాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. ‘రాచకొండ’ నిర్మాణం ఇక షురూ.. సైబరాబాద్ నుంచి విడిపడి, నల్లగొండలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్ తదితర ప్రాంతాలను తనలో కలుపుకొంటూ ఏర్పడిందే రాచకొండ పోలీసు కమిషనరేట్. 2016లో ఆవిర్భవించిన ఈ కమిషనరేట్ 5091.48 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్దదిగా మారింది. దీనికంటూ ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో గతంలో గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లో కొన్నాళ్లు కొనసాగింది. ఆపై నేరేడ్మెట్లోని తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. కమిషనరేట్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి దీని పరిధిలోని అనువైన ప్రాంతంలో ప్రత్యేక కమిషనరేట్ అవసరం ఉందని భావించిన సర్కారు మేడిపల్లిలో 56 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం ప్రహరీ నిర్మానంలో ఉండగా... ఈ బడ్జెట్లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు ప్రగతి పద్దు కింద దీని నిర్మాణానికి రూ.62.95 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణం ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి.. నగర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం భారీగా కేటాయింపు జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 60 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఈ కేటాయింపుల్ని సద్వినియోగం చేసుకుని రాజధానిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – అంజనీకుమార్, సిటీ కొత్వాల్ -
మహా నగర ప్రాజెక్టులపై ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఓఆర్ఆర్ జైకా రుణం, ఓఆర్ఆర్ బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాశపరచడంతో హెచ్ఎండీఏ అధికారులకు ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. 2020–21 సంవత్సరంలో ఓఆర్ఆర్ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.20 కోట్లు, బీఓటీ అన్యూటీ పేమెంట్ల కింద రూ.331.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన రూ.351.38 కోట్లలో రూ.351.18 కోట్లు హెచ్ఎండీ సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్ఆర్ టోల్ ఫీజు ఆదాయంతో పాటు ఎల్ఆర్ఎస్ నిధులు, బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో సరిపెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆదేశాలివ్వడంతో కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ రూపంలో సమకూరిన రూ.1100 కోట్లలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలోనే ఉండటంతో మరిన్ని నిధుల అవసరముంది. అభివృద్ధి ప్రాజెక్టులకు కష్టకాలమేనా..? అంతర్జాతీయ స్థాయి హంగులతో నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ను తగ్గించే క్రమంలో నిర్మించాలనుకున్నా మియాపూర్‌లోని ఇంటర్సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఇప్పటికీ మొదలుకాలేదు. పెద్దఅంబర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, . శంషాబాద్, మనోహరబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇవి కూడా పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. మినీ పట్టణాలకు సైతం.. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్నా 60వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ వైపే ఎవరూ చూడటం లేదు. తాజా బడ్జెట్ పరిస్థితి చూశాక హెచ్‌ఎండీఏపైనే భారం పడటంతో మినీ పట్టణాల పరిస్థితి కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు. -
ఖాకీ బడ్జెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్‌లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్‌మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది. గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్‌హౌస్‌లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు. -
పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధులు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వార్షిక బడ్జెట్ 2020–21లో రూ.11,917 కోట్లను కేటాయించింది. పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధుల్ని అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ ప్రాజెక్టు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు ప్రత్యేక కాలనీలుగా నిర్ధారిత ప్రాంతంలో ఇళ్లను నిర్మించేవారు. యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ప్రస్తుతం తాముంటున్న ఇల్లు ఒక చోట ఉండటం, కొత్తగా మంజూరై నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరోచోట ఉండటాన్ని లబ్ధిదారులు ఇష్టపడలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులనే సొంతంగా తమ స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటుగా డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్లో ప్రభుత్వం రూ.11,917 కోట్లను ప్రతిపాదించింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది ఉంటారని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రగతి పద్దుకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.3,850 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తం గ్రామ ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్‌ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
గ్రేటర్ ఎన్నికలకు వేళాయే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన పుర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది. కార్పొరేషన్లకు మళ్లీ కోత.. రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్‌కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. ఆలయాలకు రూ.400 కోట్లు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. -
విద్యాశాఖకు 12,127.55 కోట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెం బ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటా యించగా ఈసారి దానికి అదనంగా 2,238.43 కోట్లు ఇచ్చింది. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. ఇక ఈసారి అదనంగా ఇచ్చిన రూ.2,238.43 కోట్లలో పాఠశాల విద్యలోనే నిర్వహణ పద్దు కింద రూ.1,642.32 కోట్లను కేటాయించగా, ప్రగతి పద్దులో 598.82 కోట్లను కేటాయిం చింది. ప్రగతిపద్దులో ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయింపులు జరి పింది. వాస్తవానికి పాఠశాల విద్యకే రూ.14 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలను పంపించినా రూ.10,405.29 కోట్లకు ప్రభుత్వం కేటాయింపులు పరిమితం చేసింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్‌కు రూ.100 కోట్లు కేటాయించింది. విభాగాల వారీగా కేటాయింపులివీ.. నిర్వహణ పద్దులో పాఠశాల విద్యకు కేటా యించిన రూ.9,113.10 కోట్లలో సాధారణ విద్యకు రూ.8,864.25 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.9.59 కోట్లు, వయోజన విద్యకు రూ.7.40 కోట్లు, ప్రభుత్వ గ్రంథాల యాలకు రూ.54.11 కోట్లు, జవహర్ బాలభ వన్‌కు రూ.2.99 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.34.49 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.135.99 కోట్లు కేటాయించిం ది. సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ.135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటా యించింది. అయితే ఈ నిధులన్నీ నిర్వహణ కు, వేతనాలకే సరిపోనున్నాయి. ఇక ప్రగతి పద్దులో రూ.1,292.19 కోట్లు ప్రభుత్వం కేటా యించింది. అయితే అవి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏమాత్రం సరిపోవని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు ఈ నిధులతో సాధ్యం కావని అంటున్నాయి. రెండేళ్ల కిందటితో పోల్చితే తక్కువే.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రెండేళ్ల కిందటి తో పోల్చితే ఈసారి చేసిన కేటాయింపులు తక్కువే. ఈ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లిం చాల్సిన మొత్తం కింద గతేడాది రూ.491.56 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,239.46 కోట్లను కేటాయించింది. గతే డాదితో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు పెరి గింది. అయితే అంతకుముందు సంవత్స రాల్లో చేసిన కేటాయింపుల కంటే ఈసారి తగ్గిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి పథకాలకు 40 శాతం రాష్ట్ర వాటా తప్పనిసరి. వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 1,876.42 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,546.39 కోట్లకు సవరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం లో ఈ పథకాల కోసం రూ. 491.56 కోట్లు మాత్రమే కేటాయించగా, 2020–21 కోసం రూ.1,239.46 కోట్లను కేటాయించింది. ఇక ఉన్నత విద్యలో కేంద్ర పథకాల కోసం రూ. 15.04 కోట్లను మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో 6.62 శాతమే.. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం తగ్గు తోంది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను పెం చినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిం పుల వాటా తక్కువే. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.28 శాతం తగ్గిపోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు అది 6.62 శాతానికి పడిపోయింది. ఫీజులకు ఫుల్ బడ్జెట్ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయిస్తూ.. ఇకపై పాత బకాయిల ప్రస్తావన లేకుండా చేసింది. 2020–21 వార్షిక సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ప్రతి సంవత్సరం సగటున రూ.2 వేల కోట్ల డిమాండ్ ఉంటుంది. పాత బకాయిలు, కొత్త వాటి చెల్లింపులకు సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండిం గ్లో ఉండేవి. ఈ క్రమంలో పాత బకాయిలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో అన్ని సంక్షేమ శాఖలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాయి. 2019–20 వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని పూర్తి స్థాయిలో చెల్లిస్తే 2019–20 వార్షిక సంవత్సరానికి సంబంధించి 75 శాతం చెల్లింపులు చేయవచ్చు. ఫీజులకు మిగులు నిధులు.. 2020–21 వార్షిక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మిగులు నిధులు ఉంటాయని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.2,650 కోట్లు కేటాయింపులు జరపడంతో.. అప్పటి డిమాండ్ రూ.2,050 కోట్లు ఉంటుందని, 2019–20 లో రూ.450 కోట్ల మేర ఉండే బకాయిలన్నీ చెల్లించినప్పటికీ కొంత మేర నిధులు సంక్షేమ శాఖల వద్ద ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి వచ్చే నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభకు ప్రతిపాదించిన 2020–21 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు బలం చేకూర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్డీపీ కార్యక్రమంతో నగరంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను చేపట్టి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాసులను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రణాళికలు కొనసాగుతున్నాయని వివరించారు. -
వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయ పట్టికలో రూ. 14,615 కోట్లను వడ్డీ చెల్లింపుల కింద ప్రభుత్వం చూపింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో వడ్డీ చెల్లింపుల కింద రూ. 14,574 కోట్లు ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 14,385 కోట్లు చెల్లించారు. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటుగానే వడ్డీ చెల్లింపులు చూపెట్టారు. అయితే, వడ్డీలకు తోడు రుణాలు, అడ్వాన్సుల అసలు చెల్లింపుల కింద రూ. 15,662 కోట్లు ప్రతిపాదించారు. దీంతో అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులు రూ. 30 వేల కోట్లు దాటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ. 10,835 కోట్లు ఉండగా మూడేళ్లలో అది రూ. 3,780 కోట్ల మేర పెరిగిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. తప్పని అప్పుల తిప్పలు.. ఇక, ఈ ఏడాదీ పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ. 35,500 కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 2,600 కోట్ల రుణం ఎక్కువగా ప్రతిపాదించింది. ఇందులో ఓపెన్‌మార్కెట్ రుణాల కింద రూ.34 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర రుణాలు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,900 కోట్ల రుణాలు అంచనా వేయగా, రూ. 31,800 కోట్లు సమీకరించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం రూ.200 కోట్లే వచ్చాయి. ఇక, ఇతర రుణాల కింద రూ.1000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదన ఉన్నా రూ.500 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయి. మూలధన వ్యయం పెరిగింది.. కాగా, ఈ ఏడాదితో పోలిస్తే మూల ధన వ్యయాన్ని పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17,274 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,165 కోట్లు ఖర్చయింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తమాన ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.8 వేల కోట్లు అధికంగా రూ. 22,061 కోట్లు మూల ధన వ్యయంగా ప్రతిపాదించారు. అదే 2018–19 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం 33,369 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 22,640 కోట్లకు తగ్గింది. ఇక, ఈసారి అంచనాల్లో ప్రతిపాదించిన మొత్తంలో ఎంత వ్యయం సంపద సృష్టికి జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది. -
పీఆర్సీ, ఐఆర్ ఈసారి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కోసం ఇంకొన్నా ళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్లో పీఆర్సీ అమలు కోసం నిధులను కేటాయిం చకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో పడ్డా రు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవ డంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మధ్యం తర భృతి (ఐఆర్) ప్రస్తావన కూడా లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగులు, 2.68 లక్షల మంది పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాల న్నా, ఐఆర్ ఇవ్వాలన్నా రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ అంశానికి బడ్జెట్లో చోటు క ల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థి క సంవత్సరం బడ్జెట్లోనే పీఆర్సీ అమలు అంశా న్ని చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యో గుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ల కు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గానే ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఉద్యోగులను కొంత శాంతపరిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యరంగానికి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019–20 ఆర్థిక సంవ త్సరంలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించడం విశేషం. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్ కావడం గమనార్హం. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటా యించారు. గత బడ్జెట్లో రూ.886.49 కోట్లు కేటా యించగా, ఈసారి మరింతగా పెంచడం గమనార్హం. ఆయుష్ విభాగానికి గత బడ్జెట్లో రూ. 6.86 కోట్లు ఇవ్వగా, ఈసారి 33.25 కోట్లు కేటాయించారు. అంటే గతం కంటే ఏకంగా రూ. 26.39 కోట్లు అదనం కావడం విశేషం. ఇక ఎంతో ప్రాధాన్యం కలిగిన కేసీఆర్ కిట్‌కు గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఈసారి 443 కోట్లకు తగ్గింది. ఈజేహెచ్ఎస్ స్కీంకు గతంలో రూ. 417 కోట్లు కేటా యించగా, ఈసారి 410.35 కోట్లు దక్కాయి. ఆరోగ్యశ్రీకి గతంలో రూ. 720. 12 కోట్లు కేటాయిం చగా, ఈసారీ అదే స్థాయిలో ఉంది. ఇక ఔషధాల కోసం గత బడ్జెట్లో రూ.236.14 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.262.41 కోట్లు ఇచ్చారు.ఇక ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసు పత్రికి గతంలో రూ.20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడూ అంతే ఇచ్చారు. ఆ వ్యాధుల నిర్ధారణకు కార్యాచరణ... కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబం«ధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణ లోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి . వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటి సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు, మరో 232 ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించాలని బడ్జెట్లో ప్రకటించారు.ప్రతీ డివిజన్లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల కంటి సంబంధ సమస్యలను పరిష్కరించడానికి కంటి వెలుగు పేరుతో ప్రపంచంలోనే అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగానే మందులు, అద్దాలు పంపిణీ చేశారు. కరోనాపై ప్రస్తావన... రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు. వేసవిలో ఉండే ఎండ వేడికి వైరస్ మనుగడలో ఉండే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా వైరస్‌పై చెలరేగే వదంతులను నమ్మవద్దని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది. ఇదిలావుండగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
తలసరి అప్పు 65,480
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగు తోందని బడ్జెట్ లెక్కలు చెపుతున్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. అంటే రాష్ట్రం లోని ప్రతి వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు రూ.65,480 అన్నమాట. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. కాగా, రాష్ట్ర అప్పు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరడం గమనార్హం. రూ.1.87 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పరిశీలిస్తే బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో రూ.1.87 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8,682 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 13,961 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,954 కోట్లు సమీకరించినట్టు బడ్జెట్ ప్రతి పాదనల్లో ప్రభుత్వం వెల్లడిం చింది. గత ఐదేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పుంటే 2020–21 నాటికి అది 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పు అక్షరాల లక్ష కోట్ల రూపాయలన్నమాట.