Telangana Elections 2018
-
పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లు రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా..ఆ హామీని అమలు చేయనున్నారు. ప్రతి నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి పింఛన్ల పెంపుదల వర్తిస్తుందని.. జూలైలో లబ్దిదారులకు ఆ మొత్తాన్ని అధికారులు అందజేస్తారని వెల్లడించింది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇవ్వనున్నారు. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
ఓడినవారికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశమున్నవారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా? – రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. లోక్‌సభకు పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది సీనియర్లు ఈసారి లోక్‌సభకు పోటీచేయాలనే ఆలోచనలో ఉండటం, తమకు అవకాశమివ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. బహిరంగంగా కొందరు.. అంతర్గతంగా మరికొందరు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చాలా మంది సీనియర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మహామహులనుకున్న కాంగ్రెస్ నేతలు సైతం ఓటమి పాలుకావడం ఆ పార్టీ కేడర్‌ను కుంగదీసింది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంతో పాటు కేడర్‌లో మనోస్థైర్యం నింపాలంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ఒక్కటే మార్గమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. వీరిలో కొందరు తాము లోక్‌సభకు పోటీచేస్తామని బహిరంగంగానే చెబుతూ దరఖాస్తు చేసుకోగా, మరికొందరు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విషయం చెప్పిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా అదే మాట చెప్పారు. చెప్పడమే కాదు.. తనకు నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాలంటూ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ఛరిష్మాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తున్నారు. నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడనుంది. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిల పేర్లు కూడా వినిపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ సీనియర్లు టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపిక సంచలనాత్మకమవుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, అరుణలలో ఎవరైనా టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, జహీరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలే రేసులో ఉన్నారు. వీరి విషయంలో హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుందా..? కనీసం ఒకరిద్దరికైనా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకునే అవకాశం ఇస్తుందా..? లేదా మూకుమ్మడిగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే...! నెలాఖరుకు ఎంపిక లోక్‌సభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈనెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పంపనున్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు పేర్లు మాత్రమే హైకమాండ్‌కు పంపుతారని, అనివార్యమైతేనే మూడోపేరు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. పీఈసీ సమావేశం అనంతరం 20వ తేదీ లోపు అభ్యర్థుల జాబితా అధిష్టానానికి వెళుతుందని, నెలాఖరుకల్లా అభ్యర్థుల అధికారిక ప్రకటన ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ తరచూ చెప్పే సీఎం కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీన్ని ప్రతిబింబించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెటే అయినా ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విధాన ప్రకటనలను ఇందులో పొందుపరచడం ద్వారా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకుగాను 16 సీట్లను గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల లెక్కలను ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే పరిస్థితుల నేపథ్యంలో ఐదారు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలివే.. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వికలాంగుల పెన్షన్లను రూ. 1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతామని పేర్కొంది. మిగిలిన అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ. 1,000 నుంచి రూ. 2,016 వరకు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగింపుతోపాటు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు అంశాలు టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి. రైతుబంధు కింద ఏటా ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు. రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి. ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అమలు చేయడం. రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. వివిధ కులాల కేటగిరీ మార్పు విజ్ఞాపనల పరిశీలన. అగ్రవర్ణ కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల అమలు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలకు సత్వర పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారీ. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్య లు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే ప్రయత్నాలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, యూనిట్ల నిర్వ హణ బాధ్యత మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఒక్కొక్కటిగా అన్నీ... ఎన్నికల హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్ అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమలు చేసే హామీలు ఏమిటనే జాబితా రూపొందిస్తున్నారు. హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగలకు రూ. 3,016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్లోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
కాంగ్రెస్ నేతల పిటీషన్లు.. హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్స్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తమపై గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక టీడీపీ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు వేసిన పిటిషన్లన్నిటిని ఒకే కేసు కింద పరిగణించి విచారిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. కొడంగల్ అధికార పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నియమావాలిని ఉల్లంఘించారని, ఎన్నికల్లో రూ. 6.5 కోట్లు ఖర్చు చేసినట్లు డైరీ దొరికిందని కాంగ్రెస్‌నేత రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలని అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేసారు. కొంత మంది అధికారులు కొప్పుల ఈశ్వర్‌తో కుమ్మక్కై ఈవీఎంల టాంపరింగ్ చేశారని, ఈవీఎంలు భద్రపరిచిన గదులకు కనీసం సీల్ కూడా వేయలదని, భద్రతను గాలి కొదిలేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల జరిగిన 45 రోజులు లోపు మాత్రమే కోర్ట్‌ను ఆశ్రయించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, దాసోసు శ్రవణ్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ ,టీడీపీ అభ్యర్థి చంద్ర శేఖర్లు పిటిషన్లు వేసారు. -
తెలంగాణ అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీకి రెండు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎంకి 7 స్థానాలు, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు.. తొలిసారి ఎమ్మెల్యేలు.. 1. హరిప్రియ నాయక్ - కాంగ్రెస్ (ఇల్లందు) 2. నాగేశ్వరరావు - టీడీపీ (అశ్వరావు పేట) 3. సురేందర్, కాంగ్రెస్ - (ఎల్లారెడ్డి) 4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ - (చొప్పదండి) 5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ - (వికారాబాద్) 6 .రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ - (తాండూరు) 7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ - (కొల్లాపూర్) 8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ - (అంబర్పేట్) 9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ - (పాలేరు) 10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ - (మేడ్చల్) 11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు) 12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్ 13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం) 14. నరేందర్, టిఆర్ఎస్ - వరంగల్ వెస్ట్ 15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ - (నర్సంపేట) 16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ - (ఉప్పల్) 17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ - (ముషీరాబాద్) 18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ - (గద్వాల్) 19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్) 20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ - కోదాడ) 21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ - (నల్గొండ) 22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల) 23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్) 24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ - (వనపర్తి) 25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ - (మునుగోడు) 26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్ 27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి - (టీఆర్ఎస్) -
తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు షెడ్యూల్..
సాక్షి హైదరాబాద్ : తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మండలి సభ్యులు, ఎమ్మెలేయలు జూబ్లీహాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ షెడ్యూల్.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభాపతి ఎంపిక కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులు. 11.20కి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు చేరుకుంటారు. 11.30కి ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన శాసనసభా సమావేశం ప్రారంభం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ముందుగా సీఎం కేసీఆర్ చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, తర్వాత కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం చేశారు. అటు తర్వాత మొదటగా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేశారు. చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో తాత్కాలిక సభాపతి అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగనుంది అనంతరం మండలి ప్రాంగణంలో జరిగే విందుకు అంతా హాజరవుతారు. తాత్కాలిక సభాపతి స్థానంలో శాశ్వత సభాపతిని ఎంపిక చేసేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 18న శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, మండలి ఉభయసభల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. -
సీఎల్పీ లీడర్‌ను రాహుల్ నిర్ణయిస్తారా..?!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్‌లో హాట్‌హాట్ మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియకు అధిష్టానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీకి అందించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని, సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు టీకాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించాలని అన్నారు. అయితే, సీనియర్ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్‌గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌లో విలీనమా.. ముచ్చటే లేదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవచేశారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం చర్చించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు. కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశచెందలేదని.. రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఓటమి చెందినట్లు భావిస్తున్నామన్నారు. సీబీసీఐడీ విచారణ జరగాలి రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరికలేదన్నారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు భత్యం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఉందని, ఈమేరకు బుల్లెట్ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టీఎస్ 09పీఏ1653, టీఎస్ 09పీఏ1654 వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ ఈ కోడ్ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్‌కు రూ.37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936 చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అధికార పార్టీకి సైతం రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, ఇతర వీఐపీలు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సైతం ఇదే రీతిలో చెల్లించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఎవరెవరికి ఇచ్చారు? ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశాలపై సాక్షి ఆరాతీసేందుకు ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరు అందుబాటులోకి రాలేదు. -
అసలెందుకు ఓడిపోయాం..?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా సమీక్షించుకుంది. ఘోర పరాజయానికి గల కారణాలను నియోజకవర్గాల వర్గాల వారీగా విశ్లేషించుకుంది. ఏఐసీసీ నేతలు ఆర్సీ కుంతియా, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటమికి గల కారణాలను ఏఐసీసీ నేతలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను, జిల్లా పార్టీ ముఖ్యనేతలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసిన అభ్యర్థిత్వాల ఎంపిక ఎందుకు గెలుపు తీరాలకు చేర్చలేదు.? కనీసం అభ్యర్థుల సంబంధిత సామాజికవర్గాల ఓట్‌లైనాయి ఎందుకు రాలేదు.? ఎవరైనా నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా.? వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైన విషయం విధితమే. అభ్యర్థిత్వాల ప్రకటన ఆలస్యం కావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వంటి అంశాలే తమ ఓటమికి కారణమైనట్లు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఏఐసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అతితక్కువ ఓట్లతో ఓటమి పాలైన చోట్ల వీవీపీఏటీ స్లిప్పులను లెక్కించేలా న్యాయస్థానాలను ఆశ్రయించాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, ఆ పార్టీ అభ్యర్థులు తాహెర్‌బిన్ హందాన్, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్, సౌదాగర్ గంగారాం, కాసుల బాల్‌రాజ్, డీసీసీ అధ్యక్షులు కేశవేణు, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, ప్రేమలత అగర్వాల్‌లు హాజరయ్యారు. స్థానికంగా లేకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. -
తలసానికి మెజారిటీ తగ్గడం బాధగా ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2009లో చావునోట్లో తలపెట్టి మరీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. టీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం జలవిహార్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ధన్యజీవి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ఇలా ఎంతోమంది నేతలు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా.. ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈసారి మెజారిటీ తగ్గడం తనకు బాధ కలిగించిందన్నారు. ‘నిత్యం ప్రజల్లోనే ఉండే తలసానికి భారీ మెజారిటీ వచ్చి ఉండేది. కానీ, రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయి. మొత్తం 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం ఆ తప్పును తిరిగి సవరించుకుంటోంది. ఈవీఎంలను తప్పుబట్టే ప్రతిపక్షాలకు, బుర్ర తుప్పుపట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి గెలుపు నుంచి ఓటమి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని, అంతేకానీ, ఓటు వేయని ప్రజలను ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని ఆయన హితవు పలికారు. -
‘మోదీకి మద్దతుగానే కేసీఆర్ వెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, జాతీయ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. అన్ని రాష్ట్రాల పార్టీల నాయకులను కూడా కలుస్తామన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. 38 ఈవీఎంలు పనిచేయలేదని, పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తప్పులతో 22 లక్షల ఓట్లు కోల్పోయామని వాపోయారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించారని ఆరోపించారు. మోదీకి మద్దతుగానే సీఎం కేసీఆర్.. ఒడిశా, బెంగాల్ వెళ్లారని ఆరోపించారు. మోదీకి బీ టీమ్‌గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కుంతియా తెలిపారు. ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం తక్కువ ఓట్ల తో ఓడిపోయామని.. దీనిపై న్యాయం పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటి వరకు ఈసీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. గెలిచిన ఎమ్మెల్యేలు రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పొంగి పొర్లింది!
మహబూబ్‌నగర్ క్రైం : ఈ ఏడాది జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది కాలానికి మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు కాసుల పండింది. రెండేళ్ల కాలానికి వైన్స్ అనుమతులు ఇవ్వగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర గా.. వైన్స్ యాజమానులకు కూడా కాసుల పంట పండింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమ్మకాలు జరగడం విశేషం. ఈ మేరకు ప్రస్తుత ఏడాదిలో మద్యం అమ్మ కాలు, ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం. గత ఏడాది అక్టోబర్ నుంచి.. వైన్స్‌ల అనుమతులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అనుమతులు 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఆనవాయితీ’ ప్రకారం మద్యం పంపిణీ కోసం నేతలు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నాయకులు ముందుగానే మద్యం డంప్‌లు దించేశారు. అటు వైన్స్ యాజమాన్యాలు కూడా ముందస్తుగా భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు. ఇక ఎన్నికల వేళ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.1,100.10 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో కొత్త ఏడాదిలో కూడా మద్యం అమ్మకాలు భారీగా సాగే అవకాశముంది. 2019లో కూడా మద్యం అమ్మకాలు ఇదే స్థాయిలో కొనసాగితే అమ్మకాలు ఉంటే దీని విలువ ఉమ్మడి జిల్లా నుంచి 2018, 2019 ఏళ్లకు గాను రూ.2,300 కోట్లకు చేరే అవకాశముంది. దుకాణాదారులకు కాసుల పంట ఈ దఫా లైసెన్స్ పొందిన వైన్స్ యజమానులకు అదృష్టం కలిసొచ్చినట్లే చెప్పాలి. ఏడాదికి రూ.45లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్దేశించగా రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ చెల్లించేందుకు కావాల్సిన నగదును యజమానులు కేవలం ఈ ఒక్క నవంబర్ నెలలో సంపాదించినట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అక్టోబర్ 1వ వరకు ప్రస్తుత లైసెన్సుల కాలపరిమితి ఉంది. ఈ మేరకు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం.. వైన్స్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది రికార్డులో ఆదాయం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో జిల్లాలో రూ.800కోట్ల నుంచి రూ.900కోట్ల వరకు అమ్మకాలు సాగేవి. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.1,100.10 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2015 అక్టోబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో రూ.872.93 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు రూ.959.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2016 కంటే 2017 ఏడాదిలో అమ్మకాలు పెరగగా.. ఈ ఏడాది ఇది మరింత పెరగడం గమనార్హం. ఉన్నతాధికారుల మన్ననలు 2018లో జిల్లాలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లా అధికారు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆబ్కారీ శాఖకు అవసరమైన సిబ్బంది లేకపోయినా.. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించడం ద్వారా అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్ పోలీసులు (ఫైల్) ఏడాది మొత్తం కష్టపడ్డాం ఈ ఏడాది కాలంలో మొత్తం ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. ఇదే ఏడాదిలో వంద రోజుల ప్రణాళిక, అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. మా పనితీరును కమిషనర్ అభినందించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకున్నాం. 24గంటల పాటు మా శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. – జయసేనారెడ్డి, డీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ -
రాజకీయ రణరంగం
ముందస్తు ఎన్నికలతో 2018 చివరి ఐదు నెలలు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల నామ సంవత్సరం అధికార టీఆర్ఎస్ను మరింత ఉత్తేజితం చేసి అధికారాన్ని అప్పగించింది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్ వ్యూహాలతో.. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. జమిలి ఎన్నికల నినాదం దేశమంతటా వినిపిస్తున్న వేళ ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎంచుకున్నారు. దీనికితోడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటూ కేసీఆర్ ఈఏడాదిలోనే ‘ఫెడరల్ ఫ్రంట్’జాతీయనేతగా తన ప్రయాణాన్ని మొద లుపెట్టారు. అటు, టీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తయిపోయాయి. కాంగ్రెస్ మరోమారు పరాభవం పొందగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా కమలనాథులు రాష్ట్రంలో కనీస ప్రతిభ చూపలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు, అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు, తెలంగాణ జనసమితి పేరిట ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ, సీపీఎం జాతీయ మహాసభలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం, ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎన్నికల వేళ రాజకీయ హడావుడి, జంపింగ్‌లు జపాంగ్‌లతో పార్టీలు మారిన నేతలు వంటి ఘటనలతో 2018 ఎన్నికలనామ వత్సరంగా మిగిలిపోయింది. టీఆర్ఎస్ అడ్డాగా తెలంగాణ 2018 సంవత్సరం టీఆర్ఎస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్కు.. 2018 మరో అతిపెద్ద విజయాన్ని అందించింది. కుటుంబ పాలన, అవినీతి అక్రమాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజానీకం కేసీఆరే తమ ఛాంపియన్‌గా నిర్ణయించారు. 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న సాహసో పేత నిర్ణయానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిపించిన టీఆర్ఎస్కు ఇప్పుడు ఏకంగా 88 స్థానాలను కట్టబెట్టి తెలంగాణ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అనే రీతిలో తీర్పునిచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు వచ్చి బలీయశక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నలుగురు మంత్రులు మాత్రమే ఓటమి పాలుకాగా, చాలా మంది కొత్త నేతలు శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై పట్టును నిరూపించుకున్న టీఆర్ఎస్.. హైదరాబాద్‌లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. ఎలాగూ ఉత్తర తెలంగాణలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో లభించిన అనూహ్య విజయంతో పూర్తిస్థాయిలో కుదురుకుంటుందనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇక పార్టీ పరంగా కూడా కీలక మార్పులకు 2018 వేదిక అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగింది. రెండు, మూడేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తికావడంతో టీఆర్ఎస్కు రెండోబాస్గా కేటీఆర్ మరింత క్రియాశీలమవుతున్నారు. దీంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి పావులు కదుపుతుండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రెండో‘సారీ’ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా వరుసగా రెండోసారి ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అధికారం దక్కుతుందనే కోటి ఆశలతో టీడీపీ సహా పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోరాడినా పెద్దగా కలసిరాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటలో పయనిస్తే ఇక్కడ మాత్రం బోల్తాకొట్టింది. ఎన్నికల్లో ఓటమితో కేడర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా, కనీసం ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ముందుకు రాకపోవడం, సమీక్షించుకుని మళ్లీ రణరంగంలో దిగేందుకు టీపీసీసీ ముఖ్యులు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసివచ్చిందేమీ లేదు. ఎన్నికలు జరిగినప్పటికీ పార్టీ నుంచి ఎంత మంది వచ్చారో.. అంతే మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం లాంటి పరిణామాలు తప్ప పెద్దగా జరిగిందేమీ లేకపోవడం గమనార్హం. మీ సోపతి.. మాకొద్దు ‘బాబో’య్ రాష్ట్ర రాజకీయాల్లో 2018లో జరిగిన కీలక పరిణామం.. తెలంగాణ ప్రజలు చంద్రబాబుతో సావాసాన్ని అంగీకరించకపోవడమే. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ను కలిపి కుమ్మేశారు. చంద్రబాబు ప్రచార పటాటోపాలకు ఏమాత్రం తలొగ్గని తెలంగాణ ప్రజలు ఆయనతో సోపతి మాకు వద్దంటే వద్దని తేల్చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న టీడీపీ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేతలు పార్టీ మారినా కేడర్పోలేదని, తమ ఓట్లు తమకున్నాయని గొప్పలు చెప్పుకున్న తమ్ముళ్ల గూబగుయ్‌మనేలా ప్రజలు తీర్పునిచ్చారు. పైన ఉన్నా.. ఇక్కడ సున్నా 2018 కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతోనయినా కొంతమేర గట్టెక్కుదామని ఆశించిన రాష్ట్ర బీజేపీ నేతలకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దక్షిణ భారతదేశంలో కాషాయదళం పాగా వేసేందుకు ప్రయోగాత్మకంగా తెలంగాణను బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం ఉన్నస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని స్వీకరించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో మళ్లీ సున్నా నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పలేదు. ఇక, పార్టీ పరంగా కూడా ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామాలేవీ సంభవించలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు రాని నేతలు ఎన్నికల వేళ పార్టీలో చేరడం మినహా బీజేపీకి 2018లో కలిసివచ్చిందేమీ కనిపించలేదు. కమ్యూనిస్టులు ఖతమే! ఈ ఏడాది రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్‌తో గుడ్డిగా పొత్తు కుదుర్చుకుని సీపీఐ, సామాజిక న్యాయం ఎజెండా అంటూ బీఎల్ఎఫ్ పేరుతో కూటమి కట్టిన సీపీఎంలు బొక్కబోర్లా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో అసెంబ్లీలోనే వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష ఓట్లు చీలుస్తామని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేమని తెలిసినా కులాల వారీ టికెట్లు కేటాయించి సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకోగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎంఐఎంకు మాత్రం 2018 మంచి మిత్రుడిని తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ రూపంలో లభించిన దోస్తానాతో మంచి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పాతబస్తీలో మరోమారు తన పట్టు నిరూపించుకుంది. 2018లో జరిగిన ముఖ్య రాజకీయ ఘటనలు మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం. మార్చి 13: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెన్షన్. ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా చర్యలు. మార్చి 23: జె.సంతోశ్, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక. ఏప్రిల్ 2: తెలంగాణ జనసమితి పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం. అదే నెల4వ తేదీన పార్టీ జెండావిష్కరణ. ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం. ఐదు రోజుల పాటు సభలు. ఏప్రిల్ 27: కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ. హైదరాబాద్‌లోనే ఉండి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్. మే 2: ఫెడరల్‌ఫ్రంట్ రూపకల్పనలో భాగంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. మే 23: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం. తొలిసారి బహిరంగంగా ఒకేచోట కనిపించిన రాహుల్, చంద్రబాబు. జూన్ 28: విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్. వజ్రఖచిత ముక్కుపుడక సమర్పణ. జూలై 27: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా ప్రభుత్వ భూమి కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఆగస్టు 4: ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్. జమిలి ఎన్నికలపై చర్చ. ఆగస్టు 13, 14: హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. స్వయం సహాయక సంఘాల మహిళలు, సెటిలర్లతో భేటీలు. సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ గర్జన. ఆగస్టు 22: ప్రగతి భవన్లో మంత్రివర్గ సహచరులతో ఏడుగంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించిన మంత్రివర్గ సహచరులు. ఆగస్టు 24: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయిన కేసీఆర్. ఆగస్టు 25: ఢిల్లీ వెళ్లి ప్రధానితో కేసీఆర్ ముందస్తుపై భేటీ. సెప్టెంబర్ 2: కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రగతినివేదన సభ. సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో సన్నబియ్యం, సొంతిల్లు లాంటి ప్రజాకర్షక హామీలు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. సెప్టెంబర్ 6: శాసనసభను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం. 8 నెలల 26 రోజుల ముందే సభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు అందజేసిన సీఎం కేసీఆర్. వెంటనే 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. సెప్టెంబర్ 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెప్టెంబర్ 19: ఎన్నికల సైన్యాన్ని ప్రకటించిన కాంగ్రెస్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం నియామకం. అక్టోబర్ 4: ఎన్నికల నగారా ఆలంపూర్ నుంచి ప్రారంభించిన కాంగ్రెస్. అక్టోబర్ 10: రాష్ట్రంలో ఎన్నికలకుషెడ్యూల్ విడుదల. నవంబర్ 5: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ. నవంబర్ 12: 65 మందితో కాంగ్రెస్, 9 మందితో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల. నవంబర్ 20: టీఆర్ఎస్కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా. నవంబర్ 23: మేడ్చల్ కాంగ్రెస్ బహిరంగసభ. హాజరయిన సోనియా, రాహుల్. నవంబర్ 27: నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీ బహిరంగసభలు. ప్రజాకూటమి మేనిఫెస్టో విడుదల. డిసెంబర్ 7: ప్రశాంతంగా శాసనసభకు ఎన్నికలు. డిసెంబర్ 11: ఎన్నికల ఫలితాలు విడుదల. 88 స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు. డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్. మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ. డిసెంబర్ 14: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎన్నిక. -
అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవిధంగానే ఈ ప్రక్రియ జరిగిందని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పెరిగిందని, అదే బీజేపీ ప్రాబల్యమున్న చోట్ల ఓట్లసంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరారని, ఓటర్ల జాబితా విషయమై జరిగిన అక్రమాలకు ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిశీలించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తమకు హామీ ఇచ్చినట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల ఓటర్ల నమోదు, తొలగింపు అంశంలో జరుగుతున్న అవకతవకలను బీజేపీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చిందని, సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తరహాలో ఈవీఎంలపై తమకు అనుకూలమైన సందర్భంలో ఒకలాగా, వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భంలో మరోలాగా తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు. -
మభ్యపెట్టి విజయం సాధించారు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు టీఆర్ఎస్కు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెట్టలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సంక్షే మ పథకాలను ఒక భిక్ష రూపంలో కాకుండా సొంత కాళ్లపై నిలబడేలా చేయగలిగినప్పుడే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అది సోషలిజం వ్యవస్థలోనే సాధ్యమని, దానికోసం కృషి సాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడబోయే విశాల ఐక్యవేదిక విచ్ఛిన్నం చేసే పనిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యమైతే గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు బలపరచారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని సురవరం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కుంటున్నదని, ప్రతి అపజయం నుంచి కొత్త గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం సవాళ్లను ఎదుర్కొంటున్నా జాతీయ స్థాయిలో బీజేపీ ఫాసిస్ట్ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ బీజేపీ మతోన్మాద విధానాలు ఎండగట్టేందుకు మిలి టెంట్ తరహా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలందరికీ మౌలిక అవసరాలు తీర్చేందుకు పోరాటాలు చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, టి. శ్రీనివాసరావు, కందిమళ్ల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో.. కొత్త ముచ్చట!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడో కొత్త ముచ్చట నడుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన వారెవరు, కోవర్టు రాజకీయాలకు పాల్పడిన వారెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆ పార్టీ మంచి విజయాలను సొంతం చేసుకున్నా.. గెలిచిన చోట కూడా అభ్యర్థులకు సహకరించని వారు, ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓటమి పాలైన నకిరేకల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ వర్గాలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి ఎనిమిదో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్కే చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్ శిబిరానికి లోపాయికారీగా సహకారం అందించారని, గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సిం హయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందునుంచీ ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే, స్థానికేతరుడన్న కారణంతో మొదట ఇక్కడి నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ, అప్పటికి ఆపద్ధర్మ మంత్రిగా ఉండిన జి.జగదీశ్‌రెడ్డి చొరవతో ఈ గొడవ సద్దుమణిగింది. నోముల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నాయకులందరితో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి వారి చేతులు కలిపించారు. ఫలితంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. అయితే.. ఇక్కడే అనుకోని ఓ పరి ణామం చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరిగింది..? అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటారని కొందరు సీనియర్ నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొద్ది రోజులపాటు ఎన్నికల వ్యవహారాలు చూసిన ఓ నాయకుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అభ్యర్థి, ఇతర నేతలు.. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించి, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌కు సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు కనిపించినవే, కార్యకర్తలు అందరికీ తెలిసినవే. అయితే.. ఆ నాయకుడు ఏకంగా ఎదుటి పక్షానికి తమ సొంతింటి సమాచారం, ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందో చేరవేశాడన్నది ప్రధాన అభియోగం. దీంతోపాటు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం అప్పజెప్పిన బడ్జెట్లో కొంత చేతివాటం కూడా ప్రదర్శించారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పిన సమయంలోనే, ఎన్నికల ఖర్చుల డబ్బులు కూడా అప్పజెప్పాలని చూసినా, డబ్బుల వ్యవహారం చూసే బాధ్యత తనకు వద్దని, అభ్యర్థికే ఆ డబ్బులు ఇవ్వాలనడంతో పార్టీ అభ్యర్థి నోములకే ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఎంత ఖర్చయ్యింది..? మిగిలింది ఎంత..? ఎంత అప్పజెబుతున్నారో లెక్కలు తీస్తే కనీసం రూ.50లక్షల తేడా కొట్టిందని, ఈ మొత్తం సదరు నాయకుడి చేతివాటం ఫలితమే అన్న నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ఓ నాయకుడు అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దగ్గర ఖర్చుల పేర ప్రతి రోజూ కొంత లెక్క తేడా చూపించారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిరేకల్‌లోనూ తెరవెనుక మంత్రాంగం ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు కారును పోలిన ట్రక్ చేసిన నష్టం వల్లే ఓడిపోయినట్లు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, దానికంటే కొందరు టీఆర్ఎస్ నాయకులే లోపాయికారీగా, తెరవెనుక చేసిన మంత్రాంగం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న అభిప్రాయం బలం గా ఉంది. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించినా, అక్కడా ట్రక్ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్ఎస్ మెజారిటీ తగ్గింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ, నకిరేకల్ నియోజకవర్గంలో ట్రక్ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ, తమ అనుచరులను కాంగ్రెస్‌కు పనిచేయాలని పురమాయించడం వంటి చర్యలు దెబ్బకొట్టాయన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
కులాల వారీ టికెట్లు సరికాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టి రాష్ట్ర నాయకత్వం తీరును సీపీఎం కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రయోగం పేరిట కులం, సామాజిక అంశాలకు తప్ప మరే అంశానికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యతనివ్వకపోవడం పార్టీ మౌలిక విధానాలకు పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తింది. ఇది పార్టీ వర్గ సమస్యకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మరుగునపరిచినట్టు అయ్యిందని తన నివేదికలో పేర్కొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమి 107 స్థానాల్లో పోటీచేసి, ఒక్క సీటునూ గెలుచుకోలేకపోగా, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లోనే రాష్ట్ర పార్టీ తీరును తప్పు బట్టగా.. తాజాగా సీపీఎం అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ నివేదికలో కూడా రాష్ట్ర నాయకత్వ తీరును ఎండగట్టింది. ఈ ఎన్నికల్లో సీపీఎం 26, బీఎల్ఎఫ్ 81 సీట్లలో కూటమిగా పోటీచేసి కేవలం 0.43 శాతం ఓట్లే సాధించడాన్ని కూడా ప్రస్తావించింది. కులాలు, సామాజికవర్గాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడంతో కులాల ఆధారంగానే ఈ కూటమి ఏర్పడిందనే భావన కలిగేందుకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొంది. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేస్తామని కూటమి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లోని కమిటీలు ఫలితాలను సమీక్షించి నివేదికను జాతీయ నాయకత్వానికి పంపించాక, పార్టీ చూపిన ప్రదర్శనపై సమగ్ర సమీక్షను నిర్వహించనున్నట్టు సీపీఎం కేంద్ర కమిటీ స్పష్టంచేసింది. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని రాష్ట్రశాఖలకు కేంద్రకమిటీ సూచించింది. మొత్తం 15 పేజీల సీసీ రిపోర్ట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను ప్రస్తావించింది. -
కేసీఆర్‌ను పొగుడుతున్నారు.. తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయానికి రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యతంటూ పార్టీ నేతలు ముక్తకంఠంతో విమర్శించారు. టికెట్లు ఇవ్వడంలో హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోలేదంటూ పార్టీ సమీక్షాసమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జగత్ ప్రకాశ్ నడ్డా ముందు బీజేపీ ముఖ్యనేతలు, అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశం, పదాధికారుల భేటీ, పోటీచేసిన అభ్యర్థుల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మూడు భేటీల్లోనూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేందుకే హడావుడి చేశారు. తీరా టికెట్లు ఇచ్చాక పట్టించుకోలేదు. ఎలా ముందుకు వెళ్లాలో చెప్పలేదు. జాతీయ పార్టీ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనల విషయంలోనూ సరైన సమాచారం లేదు. సమన్వయం లేదు. కొన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నేతలెవరూ రాలేదు. అంతా గందరగోళమే. చివరకు బూత్ కమిటీలను కూడా బలోపేతం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల నేతలను అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కొత్తవారికి రాష్ట్రాల బాధ్యతలు అప్పజెప్పండి’అంటూ నడ్డా ముందు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల తీరుపై మండిపాటు సోమవారం జరిగిన మూడు వేర్వేరు భేటీల్లోనూ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలపై జిల్లాల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కేంద్ర మంత్రులు వస్తారు. కేసీఆర్‌ను పొగిడి పోతారు. ఇటీవల వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా అదే చేసి వెళ్లారు. తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా? జాతీయ స్థాయిలో తెలంగాణ వారికి ప్రా«ధాన్యమే లేదు. ఎంపీ దత్తాత్రేయకు ఉన్న పదవిని కూడా తొలగించా రు. తెలంగాణలో పార్టీ బతకాలనుకుంటే.. ముందు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి’అని నేతలు, అభ్యర్థులు నిక్కచ్చిగా పేర్కొన్నట్లు సమాచారం. పదాధికారులు, అనంతరం అభ్యర్థుల సమావేశంలోనూ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ ఓటమికి కారణమైందని విమర్శించుకున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం తెలంగాణపై చిన్న చూపు చూస్తోందని, రాజ్యసభలో చోటు కల్పించక పోవడంతో పాటు ఉన్న ఏకైక కేంద్ర మంత్రిని తొలగించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర నేతలపై నడ్డా సీరియస్ మరోవైపు.. కోర్ కమిటీ సమావేశంలోనూ ముఖ్యనేతలపై నడ్డా సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీతో పాటు 10 మందికి పైగా కేంద్ర మంత్రులు, నలుగురు వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్లను పెంచుకోవడం పక్కన పెడితే కనీసం ఉన్న స్థానాలను కాపాడుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కోర్ కమిటీ నేతలను నడ్డా ప్రశ్నించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్దామని జేపీ నడ్డా సూచించినట్లు తెలిసింది. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహించాలని సర్ది చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టిన చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడమే.. కేసీఆర్‌కు కలిసొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధిదారులను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకోలేకపోవడంపైనా భేటీ చర్చ జరిగింది. మరోవైపు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. బలంగా ఉన్నచోట పనిచేసుంటే..! 119 నియోజకవర్గాల్లో పోటీతోపాటు పార్టీ బలంగా ఉన్న 30–40 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తే బాగుండేదని నడ్డా పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. కోర్ కమిటీ, ఆఫీస్ బేరర్లు, అభ్యర్థులు అంతా ఫలి తాలను సమీక్షించుకొని సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, సమష్టిగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రజల భావనను మార్చడంలో విఫలమయ్యామని నడ్డా పేర్కొన్నారు. సమన్వయ లోపంతోనే ఓటమి: దత్తాత్రేయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణమేనని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాలను సమీక్షించుకున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో వాటిని సరిదిద్దుకుంటామన్నారు. పార్టీకి సంప్రదాయ ఓట్లు ఉన్నా చంద్రబాబుపై వ్యతిరేకత కారణంగానే టీఆర్ఎస్కు ఓట్లుపడ్డాయన్నారు. ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై ఉండదని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లుతోంది : జయప్రకాష్ నారాయణ
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి ప్రజ్వరిల్లుతుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా పనులు చేయించుకునే వ్యవస్థ ఎప్పుడు వస్తుందోనని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎ౦తో నమ్మకంతో ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే ఎన్నో పన్నులు కడుతున్నా ఎ౦దుకు మళ్లీ ఎదైనా పనులు చేపించుకోవాలనుకున్నప్పుడు లంచాలు ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు. భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలసి దారుణమైన చట్టాలు తీసుకు వచ్చాయని, లంచం ఇస్తే ఏడు ఏళ్ళ శిక్ష కనీసం మూడేళ్ళు... అదే లంచం తీసుకున్న వాడికి ఎలాంటి కేసు ఉండదు అనే చట్టం తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పనులు గడువులోపల ఆ పని జరిగేలా చట్ట బద్ద౦ చెయ్యాలని చెప్పారు. వీటన్నిటిని అధికమించాలంటే నిజమైన ప్రతిపత్తికల లోకాయుక్త రావాలి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తికల ఎవ్వరినైనా నిలదీసి శిక్షించగల లోకాయుక్త కావాలని ఆయన తెలిపారు. తెలగాణ ప్రజల్ని ఒక్కటే కోరుతున్న లంచం వేధింపులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎర్పడితే ఎమి లాభం లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవ్వడం పై ఈసీ రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరియైంది కాదని అన్నారు. ఓట్లు గల్లంతుపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోందని, దీనిపై పోస్టాఫీసులను నోడల్ ఎజన్సీలుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసీది ఘోరమైన తప్పిదమేని జయప్రకాశ్ ఆరోపించారు. -
పార్టీ ఇమేజీ.. పొత్తుతో డ్యామేజీ!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై సీపీఐలో అంతర్మథనం సాగుతోంది. కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో చేరాక సీట్ల సర్దుబాటు, కేటాయించే సీట్ల ఖరారులో పార్టీ నాయకత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయిందనే విమర్శలు సీపీఐలో వ్యక్తమవుతోన్నాయి. కూటమిలో చేరగానే కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా సీపీఐ వ్యవహరించిన తీరును అంతర్గత చర్చల్లో ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీకి గట్టి పట్టున్న సీట్లు, గెలిచే అవకాశం ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టకుండా కేటాయించిన 3 సీట్లకే సంతృప్తి చెందడం వల్ల పార్టీ ఇమేజీకి భంగం వాటిల్లిందని పలువురు వాదిస్తున్నారు. సొంతంగా ఎన్నికల బరిలో నిలిచినా, పరిమిత స్థానాల్లోనే పోటీచేసినా ఆ గౌరవమైనా పార్టీకి దక్కేదనే వాదనను వినిపిస్తున్నారు. 5 సీట్లలో పోటీ చేయాల్సింది! కూటమి పొత్తుల్లో భాగంగా కనీసం 5 స్థానాల కోసమైనా పట్టుబట్టాల్సి ఉండాల్సిందని.. సీపీఐ బలంగా ఉన్న కొత్తగూడెం, మునుగోడు సీట్లను కచ్చితంగా సాధిస్తే మంచి ఫలితాలుండేవని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ కోరుకున్న మేరకు కాంగ్రెస్ సీట్లు కేటాయించని పక్షంలో సొంతంగా 25 స్థానాల్లో పోటీ చేసే లా ప్లాన్–బీని అమలుచేసేందుకు సిద్ధమైతే పరిస్థితి మరోలా ఉండేదని వాదిస్తున్నారు. ఒక్క సీటైనా గెలవకపోయినా పార్టీ ఓటింగ్ పెరిగి, భవిష్యత్‌లో ఆయాస్థానాల్లో మళ్లీ పోటీకి, పార్టీ విస్తరణకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఈ విషయంలో కనీసం కాంగ్రెస్‌కు హెచ్చరికలు చేసి ఒంటరిగా పోటీ చేసేం దుకు సైతం సిద్ధమనే సంకేతాలు ఇవ్వకపోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని అంటున్నారు. కాంగ్రెస్‌కు అలుసై పోవడంతోనే.. సీపీఐ ఎక్కడికిపోదనే పరిస్థితిని కాంగ్రెస్ అలుసుగా తీసుకుందని సీపీఐ నేతలు వాదిస్తున్నారు. వైరాలో సీపీఐ గెలిచే అవకాశమున్న చోట రెబెల్ అభ్యర్థిని బరిలో కొనసాగించడంతో చివరికి ఆ తిరుగుబాటు అభ్యర్థే విజయం సాధించడం రుజువు చేస్తోందని వెల్లడిస్తున్నారు. పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీచేసిన హుస్నాబాద్‌లోనూ కాంగ్రెస్ పూర్తి స్థాయి లో సహకారం అందించకపోవడంతో పార్టీ ఓడిపోయిందని అంగీకరిస్తున్నారు. పార్టీ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి తనకు కేటాయించే సీటు కోసం గట్టిగా కోరుకోవడం వల్ల ఇతర స్థానాల కోసం పట్టుబట్టే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో ఆరోగ్యం అంతగా సహకరించని సీనియర్ నేత గుండా మల్లేశ్‌ను పోటీ చేయించడం పార్టీ నాయకత్వం చేసిన తప్పుగా ఎత్తిచూపుతున్నారు. భవిష్యత్‌లోనైనా కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చునే పక్షంలో పార్టీ గౌరవానికి భంగం కలగనీయకుండా, కోరుకునే సీట్లను గట్టిగా పట్టుబట్టాలని లేని పక్షంలో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. -
చంద్రబాబు వైఫల్యం తెలంగాణ ఎన్నికలు
-
టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు