World Tourism Day
-
HYD : నిధంలో అట్టహాసంగా పర్యాటక దినోత్సవం (ఫొటోలు)
-
ప్రపంచ పర్యాటక దినోత్సవం: టాప్ 10 పర్యాటక ప్రాంతాలు (ఫొటోలు)
-
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
పర్యాటక శోభ
కృష్ణా: ఆఆధ్యాత్మిక క్షేత్రాలు.. సముద్రతీరంతో కృష్ణా తీరంలోని నాగాయలంక మండలం పర్యాటక శోభతో పరిఢవిల్లుతోంది. ప్రకృతి సౌందర్యాల మధ్య షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. మది ఆనందంతో పరుగులు తీస్తుంది. పర్యాటక సోయగాలు కొందరికి ఉల్లాసాన్ని కలిగిస్తే మరికొందరికి విజ్ఞానాన్ని అందిస్తాయి. బుధవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నాగాయల లంక మండలం వారాంతపు ఆహ్లాదానికి విలాసంగా విరాజిల్లుతోంది. ఇక్కడ దక్షిణ బంగాళాఖాతం, పశి్చమ కృష్ణా పరివాహక తీర ప్రాంతం పర్యాటకులకు నిత్యం ఆహా్వనం పలుకుతోంది. దివిసీమతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండుదీవులు(ఎదురుమొండి–ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈప్రాంత పర్యాటక ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. స్థానిక శ్రీరామపాదక్షేత్రం ఘాట్, కృష్ణానది, లైట్హౌస్లు పర్యాటక వేదికలుగా మారాయి. ఈ తీరానికి వస్తున్న సందర్శకులు కృష్ణానదిలో బోటుíÙకారు చేసేందుకు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి ప్రవేటు బోట్లతో నవలంక ఐలాండ్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవల నవలంక ఐలాండ్ ఆధునిక ప్రీ వెడ్డింగ్ షూట్లకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో నిత్యం కనిపించే సూర్యాస్తమయ దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి మరిన్ని హంగులు సమకూరిస్తే విశేష ఆదరణ లభిస్తుందని సందర్శకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శ్రీరామపాద క్షేత్రం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. దీంతో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. జలక్రీడల శిక్షణకు వాటర్‌స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యాన వాటర్‌స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుచేశారు. స్థానిక విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి జలక్రీడల్లో ఇక్కడ శిక్షణ పొందిన గాయత్రి జాతీయ స్థాయి రజిత పతకం సాధించిన విషయం విదితమే. రూ.1.10కోట్ల వ్యయ అంచనాతో పూర్తైన ఫుడ్‌కోర్టు భవన నిర్మాణం తుది దశలో ఉంది. ఆకర్షిస్తున్న నాగాయలంక లైట్‌హౌస్ ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేసేది సాగర సంగమ ప్రాంతంలోని నాగాయలంక లైట్‌హౌస్. కృష్ణా దక్షిణ పాయ నాగాయలంక మీదుగా వెళ్లి మూడు పాయలుగా చీలి సాగర సంగమం చెందే సమీపంలో ఉన్న ఈ దీపస్తంభం విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి 20 కి.మీ నదీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుటుంబాలు, స్నేహితుల బృందాలు ప్రైవేట్ బోట్లలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో, లైట్‌హౌస్ పరిసరాల్లో విస్తరించిన వందలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవలసిందే. ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై చేపట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం పూర్తైతే నాగాయలంకకు లైట్హౌస్కు నడుమ ఉన్న ఈ ప్రాంతం మరింత గొప్ప పర్యాటక ప్రదేశంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి పర్యాటకానికి అన్ని వనరులూ ఉన్న నాగాయలంక తీరప్రాంతాన్ని దివిసీమ పర్యాటక కేంద్రంగా మరింత తీర్చిదిద్దాలి. అమరావతికి దక్షిణ నదీ ముఖద్వారం (రివర్‌ఫ్రంట్)గా ఆకర్షణగా ఉంది. శ్రీరామ పాదక్షేత్రం నుంచి లైట్‌హౌస్ వరకు పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఈ ప్రాంతం దివిసీమ పర్యాటకంలో కలికితరాయిగా ప్రాచుర్యం పొందుతుంది. –తలశిల రఘుశేఖర్, ఔత్సాహిక కేజ్‌కల్చరిస్ట్, నాగాయలంక -
పర్యాటకం శోభించేలా..
కర్నూలు కల్చరల్/ నంద్యాల(సెంట్రల్): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రదానం చేస్తున్న టూరిజం ఎక్సలెన్స్ అవార్డుల్లో జిల్లాకు స్థానం దక్కింది. బెస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు విభాగంలో కర్నూలు ఎయిర్ పోర్టు టూరిజం ఎక్సలెన్స్ అవార్డును దక్కించుకుంది. దీంతో పాటు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ ఉత్తమ పర్యాటక, సాంస్కృతిక అధికారిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్, జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారిణి పి.విజయ బుధవారం విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో అవార్డులను అందుకోనున్నారు. పర్యాటక దినోత్సవ వేడుకలు వాయిదా కర్నూలు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించాల్సిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడకులు కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారి పి.విజయ తెలిపారు. వేడుకలను ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు సిల్వర్ జూబ్లీ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ డి.సృజన, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. నంద్యాల జిల్లాకు నాలుగు అవార్డులు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లాకు నాలుగు విభాగాల్లో స్టేట్ ఎక్సలెన్సీ అవార్డులు దక్కినట్లు జిల్లా పర్యాటక–సాంస్కృతిక అధికారి సీ.హెచ్.ఎస్.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హరిత టూరిజం హోటల్స్‌లో నుంచి ఉత్తమ మేనేజర్ కేటగిరీలో శ్రీశైలం హరిత హోటల్ నిర్వహణాధికారి పవన్‌కుమార్‌కు అవార్డు వరించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా అహోబిలం, ఉత్తమ సివిక్ మేనేజ్మెంట్ గ్రామంగా పాండురంగాపురం, ఉత్తమ ఫ్రెండ్లీ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్గా బెలుం గుహలు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామం అవార్డును అహోబిలం దేవస్థానం కమ్యూనికేషన్స్ అధికారి సేతురామన్, ఉత్తమ ఫ్రెండ్లీ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ అవార్డును పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు రజిత, ఉత్తమ సివిక్ మేనేజ్మెంట్ అవార్డును పాండురంగాపురం సర్పంచ్ యర్రబోలు డోలావతమ్మ అందుకోనున్నట్లు తెలిపారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఉన్నతాధికారుల చేతుల మీదుగా సత్కారం పొందనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకానికి జిల్లా కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి చైర్మన్ ఇస్తున్న ప్రాధాన్యతతోనే ఈ అవార్డులు సాధ్యమైనట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా టూరిజం శాఖ తరపున పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. -
విశాఖ అందాలు..మంత్రముగ్ధులను చేసే సాగర కెరటాల హోయలు
విశాఖపట్నం: కై లాసగిరి కొండ అంచు నుంచి సాగర కెరటాల హోయలను చూస్తూ నైట్ స్టే చేస్తే.. కొండపై నుంచి విశాఖ అందాలను చూస్తూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తుంటే.. ఊహించుకోడానికే ఎంతో బాగుంది కదూ.. సముద్ర తీరాన భారీ నౌకలో అతిథ్యం.. కారవాన్‌లో విహారం.. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా నేచ్యురల్ హిస్టరీ పార్కు.. సైన్స్ మ్యూజియం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా వినూత్న, బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలకు పోటీ పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా త్వరలోనే పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆతిథ్య రంగం మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్‌లో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఎటు చూసినా అందమే.. ఎటు చూసినా ఆనందమే.. చూసే కనులకు మనసుంటే.. ఆ మనసుకు కూడా కళ్లుంటే.. అని చెప్పిన సినీ కవి మాటలు.. అచ్చుగుద్దినట్లు ప్రకృతి రమణీయతతో ఓలలాడే విశాఖకు సరిపోతాయి. విశాఖను చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఒకవైపు విశాఖ అభివృద్ధితో పాటు మరో వైపు పర్యాటకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని సమగ్ర నివేదిక దశలో.. ఇంకొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి. నగరం నుంచి భీమిలి వరకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడంతో పలు బీచ్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్‌లో చేపట్టిన అభివృద్ధితో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. విశాఖపై దిగ్గజ సంస్థల ఆసక్తి అతిథ్య రంగంలో విశాఖ ఇప్పటికే తనదైన ముద్ర వేస్తోంది. నగరంలో త్రీస్టార్ నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లు అనేకమున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల తాకిడి పెరుగుతుంది. తద్వారా హోటళ్లు, రిసార్టుల వ్యాపారం రెట్టింపవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తగ్గట్టుగానే విశాఖలో దిగ్గజ అతిథ్య రంగ సంస్థలు ఒబెరాయ్, మేఫెయిర్ సంస్థలు 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్ల వ్యయంతో విల్లా రిసార్టుల నిర్మాణం చేపడుతోంది. ఈ రిసార్టు పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే భీమిలి మండలం అన్నవరంలోనే మేఫెయిర్ సంస్థ 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 7 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటితో పాటు వీఎంఆర్డీఏ పార్కు వెనుక మైస్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. భవిష్యత్‌లో విశాఖ అతిథ్య రంగానికి ఉన్న డిమాండ్‌కు ఈ సంస్థల రాకే నిదర్శనం. వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి విశాఖలో వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సింహాచలం, కనకమహాలక్ష్మి దేవస్థానాలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ప్రసాదం స్కీమ్‌లో భాగంగా సింహాచలం ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ ప్రాచీన ఆలయాలను సర్క్యూట్‌గా చేసి స్పిరిచ్యువల్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలన ప్రారంభమైతే నగరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా విమాన సర్వీసులు కూడా రెట్టింపవుతాయి. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం ద్వారా మెడికల్, స్పిరిచ్యువల్ టూరిజంకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట దొండపర్తి: పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట పండింది. రాష్ట్ర వార్షిక టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను వివిధ కేటగిరీల కింద విశాఖలో ఉన్న హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ 5 స్టార్ హోటల్‌గా రాడిసన్ బ్లూ అవార్డును దక్కించుకుంది. అలాగే 4 స్టార్ విభాగంలో హోటల్ దసపల్లా, బెస్ట్ బడ్జెట్ హోటల్‌గా ఎలిగంట్ హోటల్, బెస్ట్ హరితా హోటల్‌గా అరకు హరిత వ్యాలీ రిసార్ట్, బెస్ట్ హోటల్ బేస్డ్ మీటింగ్ వెన్యూగా వరుణ్బీచ్ నోవోటెల్, బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్‌గా గ్రీన్‌పార్క్‌లో మెకాంగ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్–అలోన్ రెస్టారెంట్‌గా టైకూన్ అండ్ హెరిటేజ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్‌గా వైజాగ్ కన్వెన్షన్స్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అలాగే బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్(డొమస్టిక్)గా ట్రావెల్ హోం, బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా ట్రావెల్ ఐక్యూ గ్లోబల్ సొల్యూషన్స్, మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా హాలిడే వరల్డ్, బెస్ట్ టూరిజం ప్రమోషన్ కొల్లాటిరల్ పబ్లిసిటీ మెటీరియల్‌గా విశాఖపట్నం పాకెట్ టూరిస్ట్ గైడ్, మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బెస్ట్ టూరిజం వెబ్‌సైట్‌గా యో వైజాగ్‌కు అవార్డులు లభించాయి. అతిథ్య రంగానికి మహర్దశ విశాఖలో పరిపాలన ప్రారంభమైతే అతిథ్య రంగానికి మహర్దశ పడుతుంది. ప్రముఖుల రాకతో హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ల వ్యాపారం బాగుంటుంది. తద్వారా అనేక సంస్థలు విశాఖలో హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి రూ.కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక, ఆతిథ్య రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావంతో అన్ని రంగాలు కూడా పుంజుకుంటాయి. – పవన్ కార్తీక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా.. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విశాఖలో అతిథ్య రంగం పుంజుకుంది. ఒబెరాయ్, మేఫెయిర్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ లగ్జరీ హోటళ్లు నిర్మాణానికి ముందుకొచ్చాయి. వీటితో పాటు మెడికల్, స్పిరిచ్యుటవల్ టూరిజంపై కూడా దృష్టి పెడుతున్నాం. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే తద్వారా పెట్టుబడులు, దాంతో ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఆ దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. – శ్రీనివాస్ పాని, రీజినల్ డైరెక్టర్, పర్యాటక శాఖ -
రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల వెల్లువ
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పర్యాటకులు దేశంలో ఎక్కువ శాతం రాష్ట్రాన్ని సందర్శిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా రిజర్వాయర్లు కడుతున్నారని వాటిని సందర్శకులు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం విశేషంగా ఆకట్టుకుంటోందని వివరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం వరల్డ్ టూరిజం డే–2023 వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఫుడ్ ఫెస్టివల్, చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో చివరిరోజు అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ పర్యాటక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక కమిషనర్ శైలజారామయ్యర్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్ నిఖిల పాల్గొన్నారు. -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
" వరల్డ్ టూరిజం డే " వేడుకలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా ప్రకటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జియో పోర్టల్ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్‌పోర్టల్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ మేరకు వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా సీఎం జగన్ ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
World Tourism Day: లోకం చుట్టేద్దాం
నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్‌గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు రీ థింకింగ్ టూరిజం పేరుతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి... కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్ టూరిజం’ థీమ్‌తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్ చేస్తున్నాయి. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్‌కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్‌కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితరాలున్నాయి. టాప్ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం! ఎటు చూసినా ఎకో టూరిజమే ఎకో టూరిజం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపైç ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్‌ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్ అడవులతో అలరారే బ్రెజిల్ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. పర్యాటకానిది పెద్ద పాత్ర ► పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే! ► ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి. ► ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది. ► 2019లో అత్యధికంగా ఫ్రాన్స్‌ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది. ► 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది. ► 2019లో 1.8 కోట్ల మంది భారత్‌ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది. ► 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది. భారత్.. పర్యాటక హబ్ ► పర్యాటక రంగ పురోగతికి భారత్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ► సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్ ఆమోదించారు. ► పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది. ► 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి అందించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు -
కొత్త అందాలు: సిక్కోలు ‘నయాగరా’ చూశారా..
పై మొదటి ఫొటో చూశారా..! అచ్చం నయాగరా జలపాతాన్ని తలపించేలా ఉంది కదా. దట్టమైన అడవి మధ్య.. కనువిందు చేసే ప్రకృతి సోయగాల వడిలో పర్యాటకుల్ని రా.. రమ్మని పిలుస్తోన్న ఈ ప్రదేశం ఎక్కడో తెలుసా..! మందస మండలంలోని బుడారిసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా– ఒడిశా మధ్య కళింగదళ్ రిజర్వాయర్ ఎగువ భాగంలో కొండలపై నుంచి దూకుతున్న జలపాతమిది. దీన్ని బత్తర్సాయి జలపాతంగా పిలుస్తున్నారు. రెండో చిత్రం చూశారా? వనగిరుల నుంచి స్వచ్ఛమైన జలధార ఎలా కిందికి జారుతుందో..! పచ్చందాల మధ్య చెంగున దూకుతూ కనువిందు చేస్తున్న ఈ జల పాతం మందస మండలం చీపి పంచాయ తీలోని దాలసరి అనే చిన్న గిరిజన కుగ్రామం సమీపంలోనిది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కరోనా లాక్డౌన్ కాలంలో బయట ప్రపంచానికి పరిచయమైన సుందరమైన జలపాతాలివి. ఈ రెండే కాదు భామిని మండలం నులకజోడు గ్రామ సమీపంలో గల తువ్వకొండలో మరో జలపాతం వెలుగు చూసింది. పిల్లలు సరదాగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే సరికి ఈ జలపాతాలు దర్శనమిచ్చాయి. దీంతో ఇప్పుడందరి దృష్టి జలపాతాలపై పడింది. పేదల ఊటీగా సిక్కోలు జిల్లాను చెబుతారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ చల్లగా ఉంటుందని అంటారు. ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులు, ఇంకోవైపు అటవీప్రాంతం, మహేంద్ర గిరులు ఇలా ఒకటేంటి చల్లదనాన్ని ఇచ్చే ఎన్నో వనరులు సిక్కోలు సొంతం. ఇప్పుడు ఆ జాబితాలోకి జలపాతాలు వచ్చి చేరాయి. ఇప్పటికే సీతంపేట గిరిజన మండలంలో ఎనిమిది జలపాతాలు, భామిని మండలంలో ఒక జలపాతం ఉన్నాయి. తాజాగా మందసలో రెండు, భామినిలో ఒకటి బయటపడ్డాయి. పర్యాటక శాఖ, అటవీశాఖ సంయుక్త సర్వే చేపడితే జిల్లాలో ఉన్న జలపాతాల లెక్క తేలే అవకాశం ఉంది. జలపాతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. జిల్లాలో ఇప్పటికే ఉన్న ఎనిమిది జలపాతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సుమారు రూ. 4 కోట్లతో పనులు చేపట్టాలని పర్యాటక నిర్ణయించింది. అందులో సీతంపేట మండలంలో మెట్టుగూడ, దోనుబాయి జలపాతాలను రూ. 60లక్షలతో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు మాస్టర్ ప్లాన్ ద్వారా మరికొన్ని పనులు చేపడుతున్నారు. మెట్టగూడ జలపాతాన్ని రూ. 50 లక్షలతో, సున్నపుగెడ్డ జలపాతాన్ని రూ. 45లక్షల తో, కుసిమి జలపాతాన్ని రూ. 27లక్షలు, తొత్తడి జలపాతాన్ని రూ. 21లక్షలు, మెకువ జలపాతాన్ని రూ. 46లక్షలు, బెనరాయి జలపాతాన్ని రూ.30లక్షలు, సవరగోడి జలపాతాన్ని రూ.75లక్షలు, పండరాయి జలపాతాన్ని రూ. 41లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే భామిని మండలం నల్లరాయి గూడ జలపాతం వద్ద కూడా అప్రోచ్ రోడ్డు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ‘కొత్త’ జలపాతాలపై మంత్రి సీదిరి దృష్టి... కొత్తగా బాహ్య ప్రపంచానికి తెలిసిన మందస మండలంలో దాలసరి, బత్తర్సాయి జలపాతాలపై రాష్ట్ర పశు, మత్స్య శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టిసారించారు. తన సొంత నియోజకవర్గంలో వెలుగు చూసిన జలపాతాలు గురించి తెలుసుకుని, వాటి అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇప్పటికే దాలసరి జలపాతం వద్దకు లోయల మీదుగా వెళ్లి తిలకించారు. ఎలాగైనా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేస్తాం... జిల్లాలోని జలపాతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. కొత్తగా వెలుగు చూసిన జలపాతాలపై మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టి సారించారు. త్వరలో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తాం. పర్యాటకులు సురక్షితంగా జలపాతాలను వీక్షించేలా సౌకర్యాలు కల్పిస్తాం –నారాయణరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి -
ప్రకృతి సోయగం.. అటవీ అందాలు..
సాక్షి, పెంచికల్పేట్: రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవు పెంచికల్పేట్ అడువులు.. ఎత్తైన కొండలు, గలగల పారే ప్రాణాహిత, పెద్దవాగులు ఓ వైపు.. పచ్చని అడువులు, పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి శబ్దాలు, జాలువారుతున్న జలపాతాలు, జీవ వైవిద్యమైన అడవులు మరో వైపు.. వెరసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలను చూడటానికి ఇక్కడి వచ్చే వారిని ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటలను ఆకట్టుకోవడంతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాబంధుల స్థావరం పాలరాపు గుట్ట పాలరాపు గుట్టలో రాబంధులు అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబంధులను పాలరాపు గుట్ట వద్ద గుర్తించి వాటి సంతతి అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు. అధి కారులు చేపట్టిన కృషితో వాటి సంతతి ప్రస్తుతం 30కి చేరింది. రాపుగుట్ట వద్ద రాబంధులకు ఆవా సం అనుకూలంగా ఉండటంతో ఇటీవలే అరుదైన హిమాలియన్ గ్రాఫీన్ రాబంధు, రూఫోస్‌బిల్డ్ ఈగల్‌లను అధికారులు గుర్తించారు. సిద్దేశ్వర గుట్టలు పెంచికల్పేట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో సిద్దేశ్వర గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల్లో శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండగా గుట్టలో ఏడు సొరంగ మార్గాలు, గుహలు ఉన్నాయి. గుట్టల పరిసర ప్రాంతాల్లో జాలువారే జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. కొండపల్లిలో వృక్ష శిలాజాలు వృక్ష శిలాజాలు పెంచికల్పేట్ మండలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో ఆరున్నర కోట్ల సంవత్సరాల వృక్షశిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో 9 నుంచి 25 అడుగుల పొడుకలిగిన వివిధ రకాల వృక్షశిలాజాలు ఉన్నాయి. గుండెపల్లి దొద్దులాయి జలపాతం జలపాతాలు గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం, అగర్‌గూడ అటవీ ప్రాంతంలోని కొండెంగ లొద్ది సీజనల్ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో ఆయా జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నాయి. అడవిలో ఊటల్లో నీరు తాగుతున్న వన్యప్రాణులు వన్యప్రాణులు పెంచికల్పేట్ రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉండడంతో అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకున్నాయి. ఈ అడవి ప్రాంతంలో పెద్దపులులు నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంది. అటవీ ప్రాంతంలో చిరుతపులులు, హైనాలు, తోడేళ్లు, నక్కలు, సాంబారు, నీలుగాయి, జింకలు, కనుజు, కొండగొర్రె, ముళ్లపందులు, అడవి పందులు సంచరిస్తున్నాయి. ఎల్లూర్ ప్రాజెక్టులో పక్షుల సందడి పక్షుల కిలకిల రాగాలు... ప్రాణాహిత, పెద్దవాగు, ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్టు, ఉచ్చమల్లవాగు ప్రాజెక్టుల్లో నిరంతం నీరు ప్రవహిస్తుండగా పచ్చని అటవీప్రాంతం, ఎత్తైనన కొండల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పక్షులు అడువులను నివాస యోగ్యంగా మార్చుకున్నాయి. సుమారు 250 రకాల పక్షులు పెంచికల్పేట్ అడువుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అగర్‌గూడ అడవిలో ఉబికివస్తున్న నీటి ఊటలు పొడుగు ముక్కు రాబంధులు ప్రాణాహిత,పెద్దవాగు సంగమమం -
పర్యాటకులను కట్టిపడేసే అందాలు చూసొద్దాం..
ప్రకృతి సోయగాలు.. మైమరిపించే అందాలు.. మనసును ఉల్లాసపరిచే ప్రాంతాలు.. పరవళ్లు తొక్కే నదులు, రిజర్వాయర్లు.. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలతోపాటు అబ్బురపరిచే మానవ నిర్మితాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు పర్యాటక స్థలాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో డిచ్పల్లి ఖిల్లా రామాలయం, దోమకొండ కోట, అలీసాగర్, కౌలాస్‌కోట, ఖిల్లా రఘునాథ ఆలయం, నవనాథ సిద్ధుల గుట్ట, అష్టముఖి కోనేరు, మల్లారం, బడాపహాడ్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతియేటా వేలాది మంది పర్యాటకులు వీటిని సందర్శిస్తున్నారు. ఇదీ నేపథ్యం.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను కోరింది. 1978 నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు తమ దేశ వారసత్వ సంపద, అపురూప దృశ్యాలు, చారిత్రాక కట్టడాలు, అపురూప శిల్పాలు, ఆలయాలు, పర్యాటక స్థలాలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నాయి. ప్రజలలో వారసత్వ సంపదపై అవగాహన కల్పించడం పర్యాటక దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. అలీసాగర్ నగరానికి 15 కిలోమీటర్ల దూరం, నిజామాబాద్–బాసర రోడ్డుకు 2 కి.మీ దూరంలో ఉంది. ఈ అలీసాగర్ రిజర్వాయర్‌ను 1930 దశకంలో నిర్మించారు. అలీసాగర్ ప్రకృతి రమణీయమైన ప్రదేశం. ఎంతో పర్యాటకులు తిలకించేందుకు వస్తుంటారు. సమ్మర్‌హౌస్, చక్కగా పెంచిన గార్డెన్స్, ఐలాండ్, లేళ్లపార్కు తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. బోటింగ్ సౌకర్యం ఉంది. మ్యూజియం.. నగరం నడిబొడ్డున తిలక్‌గార్డెన్‌లో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. ఇక్కడ పాతరాతియుగం నుంచి విజయనగర కాలం క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన వాటి వరకు మానవ నాగరికత వికాసాన్ని తెలియజేస్తాయి. మ్యూజియంలో పురావస్తు, శిల్పకళ, ఇత్తడి అలంకరణ వస్తువులు ఉన్నాయి. బింద్రి వస్తువులు, విసృత శ్రేణిలో ఆయుధాలు, యుద్ధసామగ్రి ప్రదర్శనకు ఉంచారు. అశోక్‌సాగర్ బోధన్ వెళ్లే దారిలో నగరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అశోక్‌సాగర్ ఉంది. ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. సెలవు రోజుల్లో సందర్శకులు ఎక్కువగా వస్తారు. సిర్నాపల్లి సంస్థానాధీశురాలైన శీలం జానకీబాయి ఈ చెరువు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. దీనిని రాక్ పార్కుగా, బోటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేశారు. పిల్లలు ఇక్కడ బోటింగ్ చేసేందుకు ఇష్టపడతారు. మల్లారం ఫారెస్ట్ మల్లారం అడవి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వలస పక్షులకు ఇది నిలయం. సహజమైన పరిసరాలు స్వచ్ఛమైన గాలి, పక్షులు వంటివి పర్యాటకుల కోసం పరిపూర్ణ విహారయాత్ర కేంద్రం. అటవీ పర్వతారోహణనకు అనుకూలంగా ఉంటుంది. మల్లారం చెరువుతో పాటు ప్రసిద్ధ పుట్టగొడుగు ఆకారంలో ఉండే రాయి చూపరులను ఆకట్టుకుంటుంది. పోచారం ప్రాజెక్టు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు కామారెడ్డి పట్టణం నుంచి 42 కి.మీ దూరం ఉంటుంది. చుట్టూ నీరు.. మధ్యలో దట్టమైన అభయారణ్యం.. అందులో గంతులేసే వన్యప్రాణుల అందాలతో ఈ ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నీరు అలుగుపై నుంచి పారుతుంది. ప్రాజెక్టుకు రెండువైపులా రెండు అలుగులు ఉన్నాయి. అలుగుపై నుంచి కిందకు 20 అడుగుల కిందకు పడుతుంటే వాటర్‌ఫాల్స్‌ను తలపిస్తాయి. అలుగుపై నుంచి కిందకు ప్రవహించే నీటిలో పర్యాటకులు తడుస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే పోచారం ప్రాజెక్టుకు కిలోమీటరు దూరంలో అభయారణ్యం ఉంటుంది. అభయారణ్యంలో చుక్కల జింకలు, లేళ్లు, సాంబార్లు, నీల్గాయ్లు, నెమళ్లు సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మల్, ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు ఎస్సారెస్పీ చౌరస్తా నుంచే వెళ్తుంది. అక్కడి నుంచి ప్రాజెక్టు వరకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు పర్యాటకంగా ఎంతో రమణీయమైన ప్రాంతం. మిగులు జలాలు గోదావరిలో విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరదగేట్లు ప్రాజెక్టుకే పెద్ద ఆకర్షణ. ప్రాజెక్టుపై నుంచి దిగువ భాగాన చూస్తే గలగల పారే గోదావరి ఓ వైపు, పచ్చని చెట్లు మరో వైపు, ఓ వైపు కాలువ, మధ్యలో రోడ్డు ప్రకృతి రమణీయంగా కనువిందు చేస్తాయి. ప్రాజెక్టు వద్ద పార్కు సైతం ఉంది. బడాపహాడ్ జిల్లా కేంద్రం నుంచి 43 కి.మీ దూరంలో బడాపహాడ్ దర్గా ఉంది. సయ్యద్ హజ్రద్ షాదుల్లా హుసేన్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ఇది వర్ని మండలం జాకోర సమీపంలో కొండపై ఉంది. సెప్టెంబర్ నెలలో జరిగే ఉర్సుకు జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయతకు నెలవు నవనాధ సిద్దుల గుట్ట, సహజ సిద్ధంగా నల్లని రాళ్లతో ఏర్పాడిన గుట్టపై ప్రకృతి సోయగాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పురాతన కాలంలోని మహర్షులు నిర్మించిన మందిరాలు ఆధ్యాత్మిక శోభను హృదయానికి హత్తుకునే వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. నవనాధులు పూజించిన సిద్దేశ్వరుడ్ని రాళ్ల గుహలోనికి వెళ్లిదర్శించుకోవడం చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. ఎత్తుయిన రాళ్ల గుట్టపై ఉన్న కోనేరు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటుంది. పాలగుండం, నీటి గుండం ప్రత్యేక ఆకర్షణ. రఘునాథ ఆలయం ఇందూరు పూర్వ నామం ఇంద్రపురి. ఈ పట్టణంలో రఘునాథ ఆల యం, కోట రాష్ట్ర కూటులతో నిర్మించబడింది. ఇది 40 అడుగుల ఏకశిల విజయ çస్తంభం. రాష్ట్ర కూటుల ఏలుబడిలో నిర్మించ బడింది. ఈ కోటను క్రీస్తుశకం 1131లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకున్నాడు. తదనంతరం బహమనీయులు, కుతుబ్‌షాహీలు, అనఫ్జాహీల వశమైంది. కోటలో బురుజులు ఉన్నాయి. విశాలమైన హాల్స్, వేసవి విడిదిలు ఉన్నాయి. బడా రాంమందిర్ ఈ కోట వైభవాన్ని వృద్ధి చేస్తుంది. దీన్ని చత్రపతి శివాజి గురువు సమర్థ రామదాసు నిర్మించారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయం డిచ్పల్లి దేవాలయం నిజామాబాద్ నగరానికి 20 కి.మీ దూరంలో హైదరాబాద్–నిజామాబాద్ జాతీయ రహదారిలో ఉంది. కొండ మీద ఉన్న అందమైన రామాలయం నలుపు తెలుపు అగ్గిరాయితో నిర్మించబడి ఉంది. కొండ ముందు భాగంలో ఉన్న ముఖద్వారం సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. యాత్రికలను, పర్యాటకులను దేవాలయ గోడల మీద సీలింగ్స్ మీద, తలుపు చట్రాల మీద ఉన్న విశిష్టమైన నగిశీలు ఆశ్చర్య పరుస్తాయి. ఆలయ దక్షిణ భాగన పెద్ద ట్యాంకు ఉంది. దాని మధ్యలో స్తంభాల మండపం ఉంది. దోమకొండ కోట దోమకొండ కోట చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇక్కడ అద్దాల మేడ, రాణి మహల్, మహాదేవుని ఆలయాలున్నాయి. కామినేని వంశీయుల చివరి రాజధానిగా వర్ధిల్లిన ఈగ్రామంలో శివరామమందిరం, చాముండేశ్వరి ఆలయం దర్శనీయమైనవి. కోటలో అద్దాల మేడ, దర్బారుహాల్, నాట్యశాల, అంతఃపురాలను అద్భుతంగా నిర్మించారు. కోట లోపల మహాదేవుని ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కామారెడ్డి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని నుంచి వంద కిలోమీటర్ల దూరంలో దోమకొండ మండల కేంద్రంలో ఈ సంస్థానం ఉంది. నీలకంఠేశ్వరాలయం నగరంలో శాతవాహన రాజు శాతకర్ని–2 ద్వారా నిర్మింపబడింది కంఠేశ్వర్‌లోని నీలకంఠేశ్వరాలయం. ఉత్తర భారతీయ వాస్తు కళకు ఈ ఆలయం అద్దం పడుతుంది. ప్రతియేటా రధసప్తమి పండుగను ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. సారంగాపూర్ ఆలయం నగర శివారులో ఉన్న సారంగాపూర్ హనుమాన్ మందిరాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ గురువు సమర్ధ రామదాసు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయ పరిసరాల్లో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. భక్తులు సేదతీరేందుకు గార్డెన్‌ను అబివృద్ధి పరిచారు. పిల్లలకు ఆటపరికరాలను అందుబాటులో ఉంచారు. చరిత్రకు సాక్ష్యం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో అపురూప చారిత్రక విశేషాలను తెలియజేసే వస్తువులు, నాటి నాణేలు, నిజాం ఆయుధాల వంటివి పురావస్తు ప్రదర్శన శాలలో ఉంచారు. మరమ్మత్తుల పేరుతో ఈ ప్రదర్శన శాలను నాలుగేళ్లుగా మూసి ఉంచారు. దీనిని తెరిపిస్తే జిల్లాలోని చారిత్రక అంశాలను తెలుసుకునే అవకాశం ఎంతో మందికి లభిస్తుంది. – దిలీప్, సీతారాంనగర్ కాలనీ ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మానసిక ప్రశాంతతను కలిగించే పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం చేస్తే అపురూప వారసత్వ సంపద కనుమరుగయ్యే అవకాశం ఉంది. మన జిల్లాలో చూసేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి. – వెంకటలక్ష్మి, వినాయక్‌నగర్ పర్యాటకాభివృద్ధికి కృషి పర్యాటక రంగాన్ని భావితరాలకు పరిచయం చేయటానికి ప్రత్యేక ప్రణాళికలను తయారుచేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీచౌక్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు హెరిటేజ్ వాక్, ఫుడ్ ఫెస్టివల్ తదితర ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. – సింహాచలం, పర్యాటక శాఖాధికారి జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట -
విశాఖ అందాలకు ఫిదా..
కొండకోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాల యాల్లో పూజ చేసినా... ఏ చోటకి వెళ్లినా.. ఏ గాలి పీల్చినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తోంది విహార విశాల విశాఖ. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలన్నీ ఓచోట చేరిస్తే.. బహుశా దాని పేరే విశాఖ అంటారేమోనన్నట్లుగా పరిఢవిల్లుతున్న అందాల జిల్లా.. పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా.. పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే అననడంలో ఎలాంటి సందేహం లేదు. –సాక్షి, విశాఖపట్నం, అరకులోయ మన్యం.. ప్రకృతి చెక్కిన శిల్పం ప్రకృతి కాన్వాస్‌పై రమణీయ అందాలు.. చక్కిలిగింతలు పెట్టే చలిలో కనిపించే.. సహజ సిద్ధమైన సోయగాలు, కాలుష్యాన్ని దరిచేరనివ్వని ప్రకృతి రమణీయత, కలకాలం గుర్తిండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను ముడుపుగా ఇచ్చే అరకు అందాలు, విశాఖ మన్యం సోయగాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి వరకూ ఎటు చూసినా.. ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో 80 శాతం మంది అరకు మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. అలాంటి మన్యం అందాలకు మెరుగులు దిద్దేలా.. రూ.156 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్ పేరుతో సమీకృత ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి పంపించింది. త్వరలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇదే ఏర్పాటైతే మన్యంలోని 11 మండలాలు అందులో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన 36 ప్రాంతాలను ఈ టూరిజం సర్క్యూట్లో భాగం కానున్నాయి. ఈ అందాలకు మరింత సొబగులద్దే నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలి విడతగా 9 ఎకరాల్లోనూ, మలివిడతగా 18 ఎకరాల్లోనూ మన్యం ప్రాంతంలో పలు చోట్ల ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. జలపాతాల సవ్వడి మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా అనంతగిరిలోని కటిక జలపాతం, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు జలపాతం, పెదబయలులోని పిట్టలబొర్ర వాటర్‌ఫాల్స్, బొంగదారి జలపాతం, ఒడిషా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ జలపాతం, చింతపల్లి మండలం దారకొండలోని జలపాతం, జిమాడుగులలో కొత్తపల్లి జలపాతం... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. అయితే.. వాటర్‌ఫాల్స్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడతంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన జలపాతాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెయ్యాలని భావిస్తున్నారు. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల్ని తొలిదశలో ఎంపిక చేశారు. ఈ జలపాతాల వద్ద రూమ్‌లు, ఫుడ్‌కోర్టులు, వాష్‌రూమ్‌లు, రెస్ట్రూమ్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్క్యూట్లతో సూపర్... జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి అవంతి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు, కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండని సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రాజెక్టులు సిద్ధమైతే.. విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి. అభివృద్ధి పథంలో నడిపిస్తాం... రెస్టారెంట్లు.. రిసార్టులు.. పెరుగుతున్న పర్యాటకానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. పలు రెస్టారెంట్లు, రిసార్టులు నిర్మిస్తోంది. ఎర్రమట్టిదిబ్బల సమీపంలో రూ.2 కోట్లతో కంటైనర్ రెస్టారెంట్‌ను నిర్మించింది. అదే విధంగా రూ.2 కోట్లతో అరకులో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్మించింది. ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఏజెన్సీలో రూ.5.5 కోట్లతో ట్రైబల్ హట్(సంత), రూ.2.2 కోట్లతో ఈట్ స్ట్రీట్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇవే కాకుండా విభిన్న ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పర్యాటక శాఖకు ఉన్న 550 ఏకరాలను లీజుకు ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రకృతి అందాల కలబోత విశాఖపట్నం. ఈ జిల్లాను పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్క్యూట్లు, టూరిజం ప్యాకేజీలతో పాటు సరికొత్త ప్రాజెక్టులు అమలు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. –అవంతి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి విదేశీయుల తాకిడి పెరుగుతోంది... విశాఖపట్నం అంటే.. విదేశీయులు చాలా ఇష్టపడుతున్నారు. అందుకే.. ప్రతి నెలా విశాఖ సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి అనుగుణంగా పర్యాటక శాఖ కొత్త కొత్త ప్రాజెక్టులు పరిచయం చేస్తోంది. – పూర్ణిమ, జిల్లా పర్యాటక శాఖాధికారి విదేశీయులు ఫిదా... విశాఖ అందాలకు విదేశీ పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. 2018లో 2,49,20,169 మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 95,759 మంది విదేశీయులు విశాఖకు వచ్చారు. మొత్తం 2,50,13,607 మంది వచ్చారు. 2019లో ఎనిమిది నెలల్లో 1,86,47,551 మంది స్వదేశీ, 69,091 మంది విదేశీయులతో కలిపి మొత్తం 1,87,16,642 మంది పర్యాటకులు విశాఖ జిల్లాను సందర్శించారు. విదేశీ క్రీడలకూ వెల్కమ్.... సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందుకోసం రుషికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలించింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు స్థానిక పర్యాటక శాఖ అధికారులు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే రుషికొండలో విశాఖ పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. మరిన్ని సందర్శనీయ స్థలాలు... నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రధానమైన రామకృష్ణ బీచ్(ఆర్కే బీచ్)కు రోజూ సుమారు లక్ష మంది వస్తుంటారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. అదే విధంగా యారాడ, తొట్లకొండ, రుషికొండ బీచ్‌లలోనూ సందర్శకుల తాకిడి కొంత మేర ఉంటోంది. ఇలా.. కొన్ని ప్రాంతాలకే పర్యాటకం పరిమితం కాకుండా మరో 5 బీచ్‌లు అభివృద్ధి చెయ్యనుంది. భీమిలి బీచ్‌తో పాటు సాగర్‌నగర్, అప్పికొండ, పూడిమడక, తంతడి బీచ్‌లను తొలి దశలో గుర్తించింది. ఈ 5 బీచ్‌లు సందర్శకులకు అనుకూలమైన వాతావరణంతో ఉంటాయి. ఏపీటీడీసీ ప్యాకేజీలు ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పరుగులు పెడుతోంది. ఏపీటీడీసీ విశాఖ వ్యాప్తంగా పలు టూరిజం హోటల్స్‌తో పాటు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచి విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరిన్ని కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తేవడం ద్వారా పర్యాటకానికి కొత్త హంగులు సంతరించుకున్నాయి. కొత్త ప్యాకేజీలు... ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పలు ప్యాకేజీలను అందిస్తోంది. ఈ గతంలో ఉన్న ఫ్యాకేజీలకు పదును పెట్టడంతో పాటు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్త ఫ్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉండగా శుక్రవారం జరిగే పర్యాటక దినోత్సవం వేడుకల్లో ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నం– శ్రీకాకుళం కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నారు. విశాఖ– శ్రీకాకుళం ప్రఖ్యాత అరసవల్లి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకూర్మలింగం, సీతంపేట అడ్వెంచర్ పార్కు సందర్శన కోసం ఏపీటీడీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. పెద్దలకు రూ.670 , పిల్లలకు రూ.535గా ధర నిర్ణయించారు. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.45 గంటలకు పర్యాటకులు విశాఖ ఆర్టీసీ కాంప్లక్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బస్సు 7 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది. రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీ గతంలో పర్యాటకులకు మంచి మజిలిని అందించిన ఈ ప్యాకేజీనిని ఏపీటీడీసీ తిరిగి ఈ నెలలో(సెప్టెంబర్) పునఃప్రారంభించింది. రూ.1500తో పెద్దలకు, రూ.1200 పిల్లలకు ఈ టికెట్ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో ఉన్న టూరిజం ఒప్పందంలో భాగంగా ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ థింసా , అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, థైడా జంగిల్ బెల్కు తీసుకువెళతారు. ఉదయం 6.15కు రైల్వేస్టేషన్‌లోని ఏపీటీడీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. అరకు– లంబసింగి మధ్య.. అరకు – లంబసింగి– అరకు.. మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. చాపరాయి వాటర్ స్ట్రీమ్స్, మత్స్యగుండం, కొత్తపల్లి వాటర్ పాల్స్, లంబసింగి, గాలికొండ వ్యూపాయింట్, యాపిల్, ఫైనాపిల్, స్టాబెర్రీ పంటల సందర్శన ఉంటుంది. పెద్దలకు రూ. 999, చిన్న పిల్లలకు రూ.799గా టికెట్ ధర. ఉదయం 6.45 గంటలకు అరకులోని హరిత వ్యాలీ రిసార్ట్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. విస్తృతమైన సేవలు పర్యటకులకు విస్తృత సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీటీడీసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాం. కార్పొరేట్ హోట ల్స్‌కు దీటుగా టూరిజం హోటల్స్‌లో సౌకర్యాలు, రూమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. విశాఖ– తిరుపతి, విశాఖ – అన్నవరం, అరకు –చిత్రకోట్ వాటర్‌ఫాల్స్, విశాఖ– భద్రాచలం ప్యాకేజీలను సైతం అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.్చp్టఛీఛి.జీn వెబ్సైట్ నుంచి అన్ని రకాల సేవలను పొందవచ్చు. – ప్రసాదరెడ్డి, డీవీఎం, ఏపీటీడీసీ -
ఆదిలాబాద్ అందాలు.. కన్నులకు నయానానందం
సాక్షి,ఆదిలాబాద్ : అబ్బురపరిచే అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగుచెంగున పరుగు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే సెలయేర్లు..ఇలాంటి ఎన్నో అందాలకు నెలవు ఉమ్మడి ఆదిలాబాద్. ఈ ప్రాంతం మరో కశ్మీర్‌లా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాసరలో నెలకొన్న జ్ఞానసరస్వతి, కుంటాల జలపాతం, కవ్వాల్‌లో వన్యప్రాణులు, జైపూర్‌లో మొసళ్లమడుగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడతగిన ప్రదేశాలకు నిలయం మన జిల్లా. నేడు పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టూరిజంపై కథనం. కవ్వాల్‌లో చూడదగిన ప్రదేశాలు... ఎటు చూసిన పచ్చదనం, దట్టంగా నిటారుగా ఉండి ఆహ్లాదాన్ని పంచే అడవులు, చెంగు చెంగున పరుగులు తీసే వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెలయేరులు ఇవన్నింటికి చిరునామ కవ్వాల్ అభయారణ్యం. నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే వారు తమ కుటుంబంతో కొంత రిలాక్స్ అయ్యేందుకు సూదూర ప్రాంతాల వారు వచ్చి బస చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. గిరిజనుల ఆటపాట, వారు తయారు చేసిన వెదురు వస్తువులు, ఇక్కడ చూడవచ్చు. పచ్చదనంతో పర్యాటకులకు అహ్లాదాన్ని పంచుతూ అడవులను చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. వీరికి పర్యటకశాఖ ఆధ్వర్యంలో బస చేసేందుకు కార్టేజీలు, రెస్టారెంట్లతో పాటుగా సఫారీ సౌకర్యం కల్పించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి నుంచి జూన్ వరకు జంగల్ సఫారీ ద్వారా అడవుల్లో 15 నుంచి 20 కీమీ దూరం తిప్పుతారు. ముఖ్యమైన ప్రదేశం టైగర్‌జోన్ కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 ఎప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఈ టైగర్‌జోన్ లో అప్పుడప్పుడు వస్తు , పోయే పులితో పాటుగా చిరుత పులులు, ఎలుగుబంట్లు, లాంటి క్రూరమృగాలతో పాటు అడవి దున్నలు, నీలుగాయిలు, సాంబర్లు, చుక్కల దుప్పులు, కొండగొర్రెలు, మనుబోతులు, కుందేళ్లు, ముళ్లపంది, అడవి పందులు, తోడేళ్లు లాంటి వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తుంటాయి. చూడాల్సిన ప్రదేశాలు కవ్వాల్ టైగర్‌జోన్‌లో అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి. కొన్ని ప్రదేశాల వరకు మాత్రమే అటవిశాఖ అనుమతి ఇచ్చింది. వాటిలో మల్యాల, కల్పకుంట వాచ్టవర్లు, నీలుగాయి కుంట, గడ్డి క్షేత్రాలు, సొలార్కుంట, బేస్క్యాంపులున్నాయి. ఎలా రావచ్చు.. జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యం చూడటానికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వచ్చేందుకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి 250కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలా బాద్ జిల్లాకు చెందిన బస్సులు ప్రతిరోజు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సుల ద్వారా జన్నారంకు చేరుకోవచ్చు. నిర్మల్, కొమురంభీం జిల్లా ల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి 100కి.మీ, నిర్మల్ నుంచి 80, కుమురంభీం జిల్లా నుంచి 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూడదగిన ప్రదేశం జోడేఘాట్ జల్.. జంగల్.. జమీన్ కోసంబ అసువులు బాసి అమరవీరుడైన ఆదివాసీ ముద్దుబిడ్డ కుముర భీం పోరుగడ్డలోని భీం మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుటుంది. ప్రతి రోజు అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని పరికరాలను తిలకిస్తారు. నాటి ప్రభుత్వం జోడేఘాట్‌ను గుర్తించక పోగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి దీనికి ప్రత్యేక ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇలా వెళ్లాలి... కెరమెరి మండలంలోని హట్టి గ్రామం నుంచి జోడేఘాట్‌కు 22కిలో మీటర్ల దూరం ఉంది. ఆసిపాబాద్ నుంచి 52, ఆదిలాబాద్ నుంచి 123 కిటో మీటర్ల దూరం, ఆసిపాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆసిఫాబాద్ నుంచి రూ.35, కెరమెరి నుంచి రూ.19బస్సు టిక్కట్టు ఉంది. కెరమెరి నుంచి ఆటోలు ప్రతి రోజు నడుస్తాయి. హట్టి నుంచి జోడేఘాట్ వరకు బీటీరోడ్డు సౌకర్యం ఉంది. చారిత్రక ప్రదేశం పార్పల్లి పర్యాటకులు కోటపల్లి మండలం పార్పల్లి గ్రామంలోని కొండపై కొలువున్న భైరవస్వామి ఆలయం చూడదగిన ప్రదేశం. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు శుభకార్యాలు ప్రారంభించే ముందు భైరవస్వామిన దర్శించుకుంటారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో పూర్వకాలంలో మునులు, రుషులు తపస్సు చేసేవారని తెలుస్తోంది. మండలంలోని పార్పల్లి సమీపంలోని గుట్టపై స్వయంభుగా వెలసిన భైరవుడి జయంతిని శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కనువిందు చేస్తున్న కుంటాల ప్రకృతి సహజ సిద్ధమైన కుంటాల జలపాతం పచ్చని అడవితల్లి ఒడిలో సెలయేళ్ల పరవళ్లు తొక్కుతున్న జలధారాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కొండ కోనలు.. పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలు.. ఇది జిల్లాలో ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం ప్రత్యేకత. ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, యువత మానసిక ఉల్లాసానికి వారంతపు సెలువుల్లో వేల సంఖ్యల్లో వస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి... రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12కిలో మీటర్ల దూరం వెళ్లితే దట్టమైన అటవీ ప్రాంతంలో పాలనురుగుల పరవళ్లతో కనిపిస్తోం ది. శని,ఆదివారాల్లో హైదరాబాద్, కరీం నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహరాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ జలధారలు, చుట్టూర అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారాలను చూస్తూ మంత్రముగ్ధులవుతారు. పాపికొండలను తలపించే అందాలు చెన్నూర్ మండలంలోని సోమన్‌పల్లి ప్రాంతంలోని గోదావరి నది తీరంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం పాండవులు సంచరించారనే ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మండలంలోని సోమన్‌పల్లి నది తీరంలో శివాలయం, భీముని లొద్ది, బుగ్గమలన్న ఆలయాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంత వాసులు ఈ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకునే వారు. గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు రోడ్డు సౌకర్యం లేక అటవీ ప్రాంతం కావడంతో భక్తుల రాక రోజు రోజుకు తగ్గుముఖం పట్టింది. భీముడు సోమన్‌పల్లి గుట్ట మీద ఒక్క అడుగు భీమినిలో మరో అడుగు వేసి వెళ్లాడని ఇక్కడ ఉన్న భీముని అడుగే ఇందుకు నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి చేస్తే మరో పాపికొండలను తలపిస్తుందని స్థానికులంటున్నారు. తెలంగాణ అన్నవరంగా.. గూడెం ఉమ్మడి రాష్ట్రంలో రెండో అన్నవరంగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నవరంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు శ్రీ గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ ఆలయం దినదినాభిభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం 63వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ సమీపాన్నే పవిత్ర గోదావరి నది ప్రవహించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యదేవున్ని దర్శించుకుంటారు. వెళ్లడం ఇలా... గూడెం సత్యనారాయణస్వామి ఆలయం జిల్లా కేంద్రం మంచిర్యాలకు 30కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట, లేదా, వయా లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందునుంచే వెళ్తాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేవారు బస్సుల్లో రావచ్చు. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు. నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లా పచ్చని చెట్లు, గలగల పారే గోదారి అలలు, ఎగిసి పడే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోకి స్వాగత తోరణంలా ఉంటుంది నిర్మల్ ఖిల్లా. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. నూతనంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో ప్రధాన పర్యాటక పుణ్యక్షేత్రం బాసర. జిల్లాకు పడమరన ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతాన గల ఏకైక సరస్వతీ క్షేత్రం. నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన నగరం నిమ్మల. అదే కాలక్రమంలో నిర్మల్‌గా మారింది. ఇక్కడి నకాశీ కళకు అంతే చరిత్ర ఉంది. ఏకైక క్షేత్రం..బాసర వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడి చేతుల మీదుగా సరస్వతమ్మ ఇక్కడ ప్రాణం పోసుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్దే రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. గోదారి ఒడ్డున పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. -
ఎన్నెన్నో.. అందాలు
• నేడు వరల్డ్ టూరిజం డే గలగల పారే గోదావరి.. కిలకిలరావాల కొల్లేరు.. పాపికొండల సోయగం.. ఏజెన్సీలోని కొండకోనల్లో సవ్వడి చేసే సెలయేళ్లు.. ఆహ్లాదపరిచే అడవులు.. మరో పక్క ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే ఆలయాలు.. ఇలా ఆనందంలో ముంచెత్తే ప్రకృతి అందాలకు.. ఆధ్యాత్మిక దేవాలయాలకు జిల్లాలో కొదవ లేదు.. పర్యాటకులను సేదతీర్చే టూరిజం స్పాట్లకు కొరత లేదు.. నేడు వరల్డ్ టూరిజం డే సందర్భంగా అలాఅలా.. ఆ వివరాలు ఇలాఇలా.. సాక్షి, బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ఆహ్లాదానికి నెలవు. ఇక్కడ చెట్టు, చేమ, నీరు, రాయి, కొండ ప్రతీది ఆకర్షణీయమే.. ప్రత్యేకమైనవే.. ఈ ప్రాంతంలోని జలపాతాలు.. కొలువైన వన దేవతలు.. ప్రసిద్ధ పర్యాట ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. గోదావరిలో కొనసాగే పాపికొండల యాత్ర అత్యంత మధురమైన అనుభూతిని ఇస్తుంది. పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పాపికొండల యాత్ర మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో ప్రయాణించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. గతంలో పట్టిసీమ, పోలవరం, రాజమండ్రి నుంచి బోట్లలో ప్రయాణం సాగించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సింగన్నపల్లి నుంచి బోటు ప్రయాణం ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది గోదావరి విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే పాపికొండల విహారయాత్రలో అనుభూతి మరువలేనిదని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల యాత్రలో పట్టిసీమ, వీరభద్రస్వామి, మహానందీశ్వరస్వామి ఆలయాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటీష్ కాలం నాటి పోలీస్‌స్టేషన్, 11వ దశాబ్దం నాటి ఉమా చోడేశ్వరస్వామి ఆలయం, కొరుటూరు రిసార్ట్స్‌ను సందర్శించవచ్చు. గోదావరి వెంబడి గట్లపై గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులకు ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తాయి. పేరంటపల్లి శివుని గుడి ఆధ్యాత్మిక విశ్రాంతినిస్తుంది. కొండల్లో కొలువైన గుబ్బల మంగమ్మ దట్టమైన అటవీప్రాంతం ఎత్తైన కొండలు మధ్య గుహలో కొలువైన తల్లి గుబ్బల మంగమ్మ. గిరిజన ఆరా«ధ్య దేవతగా పూజలందుకుంటున్న ఈమెకు వరాలిచ్చే దేవతగా పేరు. ప్రతి ఆది, మంగళవారం అమ్మ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత దట్టమైన అడవిలో కొంత దూరం వెళ్లిన తరవాత అమ్మ గుడి వస్తుంది. బుట్టాయగూడెం మండలంలోని మారుమూల కొండరెడ్డి గ్రామమైన ముంజులూరు సమీపంలో ఏనుగుల తోగు జలపాతం చూపరులను ఆకర్షిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యి టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి పరిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. కనువిందు చేసే కొల్లేరు అందాలు ఆకివీడు: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 340 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు పరీవాహక ప్రాంతంలో సుమారు 280 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో పడవలు, దోనెలు, లాంచీలలో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కొల్లేరులో పక్షి ఆవాస కేంద్రాలు ఆటపాక, గుడివానిలంక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు విదేశీ పక్షులు ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలవరకూ వలస వచ్చి విడిది చేస్తుంటాయి. మరికొన్ని విదేశీ పక్షులు ఈ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి. కొల్లేటి అందాల్ని మరింతగా తిలకించేందుకు కొల్లేరు నడిబొడ్డున ఉన్న పెద్దింటి అమ్మవారి ఆలయంకు చేరుకుంటే ఆ ప్రాంతం నుంచి కూడా కొల్లేరు అందాలు తిలకించవచ్చు. చారిత్రక ప్రసిద్ధి గుంటుపల్లి బౌద్దాలయాలు కామవరపుకోట: జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గుంటుపల్లి బౌద్దాలయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇవి క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ 10వ శతాబ్దం వరకు ప్రముఖ బౌద్దారామాలుగా విరాజిల్లాయి. ఈ గుహలను క్రీ,శ 4వ శతాబ్దంలో చైనా నుంచి షాహియాన్, 7వ శతాబ్దంలో హుయాన్సాంగ్ సందర్శించారు. నేటికి ఈ గుహలను సందర్శించటానికి విదేశాల నుంచి సయితం ప్రతీ ఏడాది విదేశాల నుంచి పర్యాటకులు రావడం విశేషం. ఈ గుహలలో వర్తులాకారములో ఉన్న స్థూపంను «ప్రస్తుతం దర్మలింగేశ్వరస్వామిగా స్థానికులు కొలుస్తున్నారు. ఇసుక రాతి కొండ అంచున వేరు వేరు పరిణామాలలో తొలిచిన గదులు కూడా ఇచట కలవు. ఉప్పలపాడు నుంచి జీలకర్రగూడెం వరకు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కొండలు సర్పం ఆకారంలో మెలికలు తిరిగి ఉండటంతో మహానాగపర్వతముగా వర్ణిస్తుంటారు. అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రకృతి నడుమ మద్ది, పారిజాతగిరి జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి ఆలయం, జంగారెడ్డిగూడెంలో పచ్చని కొండల నడుమ కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు అటు పర్యాటకులను, ఇటు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాల నడుమ ఈక్షేత్రాలు కొలువై ఉన్నాయి. నిత్యం అనేక మంది ఈ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఎర్రకాలువ ఒడ్డున మద్ది క్షేత్రం ఉండగా, ఏడు కొండల నడుమ పారిజాతగిరి వెంకన్న క్షేత్రాలు ఉన్నాయి. పారిజాతగిరి కొండ పై నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండల సముహాలు చూపే పర్యాటకులకు, భక్తులు ఎంతో కనువిందు చేస్తుంటాయి. పర్యాటక కేంద్రంగా పెనుగొండ దివ్యక్షేత్రం పెనుగొండ : వాసవీ కన్యకాపరమేశ్వరి పుట్టినిల్లైన పెనుగొండ దివ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రికార్డు స్థాయిలో పెనుగొండను రెండు లక్షలకు పైగా పర్యాటకులు అమ్మవారిని సందర్శించారని అంచనా. దేశంలోనే నలుమూలల నుంచి నిత్యం భక్తులు వచ్చి వాసవీ శాంతి థాంలోని వాసవీ మాతను, మూలవిరాట్ నగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏపీ టూరిజం సైతం పెనుగొండను పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాసవీ శాంతి థాం, మూలవిరాట్ ఆలయాలకు విస్త్రత ప్రచారం కల్పిస్తోంది. విశ్రాంతినిచ్చే దొంగరావిపాలెం రిసార్ట్స్ పెనుగొండ: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో దొంగరావిపాలెంలో వశిష్టా గోదావరి తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో రిసార్ట్స్ ఏర్పాటు చేయడంతో దొంగరావిపాలెంకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. తణుకు రాజమండ్రి జాతీయ రహదారిలో వశిష్టాగోదావరి బ్రిడ్జికు ముందుగా ఎడమవైపు నుంచి కిలోమీటరు దూరంలో గోదావరి గండి ప్రాంతంలో రిసార్ట్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో శని, ఆదివారంలు రిసార్ట్స్ సందర్శకుల తాకిడితో కళకళలాడుతుంది. భక్తుల కొంగుబంగారం.. చినవెంకన్న ద్వారకాతిరుమల: పవిత్ర గౌతమి– కృష్ణవేణి పుణ్యనదుల నడుమ శేషాకార రమణీయ సుందరగిరిపై కొలువైన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయం వ్యక్తునిగా కొలువు తీరిన చినవెంకన్న పుట్టలో వెలిశారు. స్వామివారి పాదుకలు పుట్టలో ఉండటంతో శ్రీవారికి పాదపూజ లేదు. దీంతో పెద్ద తిరుపతి నుంచి పాదపూజ కోసం సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి శ్రీవైఖానస ఆగమ శాస్త్రోక్తంగా స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామి వారు ద్విమూర్తులుగా కొలువై ఉండటం ఇక్కడ విశేషం. ఇద్దరు మూర్తులు ఉండటం వల్ల ఏటా ఈ క్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. చినవెంకన్నకు వైశాఖ మాసంలోను, పెద్ద వెంకన్నకు ఆశ్వయుజ మాసంలోను తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సన్నిధికి కుడివైపు అలివేలు మంగమ్మ, ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. స్వామివారి వార్షిక ఆదాయం రూ.100 కోట్ల పైమాటే. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆచంటేశ్వరుడ్ని దర్శించుకుందామా? ఆచంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానూ, పర్యాటక కేంద్రంగానూ ఆచంటలోని శ్రీఉమా రామేశ్వరస్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ స్వామి స్త్రీ స్తనాగ్రభాగాన ప్రత్యక్షం కావడంతో ఆచంటీశ్వరుడు... ఆచంటేశ్వరునిగానూ భక్తులచే కొలువబడుతున్నట్లు స్థల పురాణం. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి లింగోద్భవకాలమందు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన శ్రీస్వామి వారి ఆలయంలో కర్పూరజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేడుకగా సాగుతుంది. ఉత్తర భారతదేశంలోని కాశీవిశ్వేరుని ఆలయం తర్వాత ఆచంటేశ్వరాలయంలో మాత్రమే కర్పూరజ్యోతిని వెలిగించడం ఇక్కడ విశేషం. అరుదైన జైనదేవాలయం ఆచంట: ఆచంటలోని జైన దేవాలయం జైనుల పుణ్యక్షేత్రంగానూ, పర్యాటక కేంద్రగా భాసిల్లుతోంది. 2007 జూలై 22న స్థానిక రామగుండం చెరువులో జైనతీర్థంకరున విగ్రహం బయల్పడింది. జైనతీర్థంకరుల్లో 6వ వారైన శ్రీ పద్మప్రభువారిగా జైన సాధువులు గుర్తించారు. ఇది రాష్ట్రంలోని అతి పెద్ద జైనతీర్థంకరుని విగ్రహంగా నిర్ధారించారు. రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. గర్భగుడిని పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తోంది. వనభోజనాలు కేరాఫ్ బైరాగిమఠం పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడు గ్రామంలోని బైరాగిమఠంగా పిలిచే వేణుగోపాలస్వామి ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆలయం పచ్చదనం సంతరించుకొంది. కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు ఆరగిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఇక్కడ సుమారు 70కి పైగా గోవులను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పోషిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో పలు ఉపాలయాలు, దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. -
ఓ ట్రిప్పు వేసొద్దాం
ప్రపంచంలో ఏ ప్రాంతాన కాలుమోపినా... కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నిమూటగట్టుకోవచ్చు. కొత్త శక్తిని పుంజుకోవచ్చు. అందుకే పర్యటనలపై ప్రజలకు మక్కువ పెరిగింది. కాలం మారిందిఅని చెప్పడానికి ఆ దేశ పర్యాటక రంగంలో వచ్చిన అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేదినిపుణుల అభిప్రాయం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.. సెప్టెంబరు 27... పర్యాటకరంగాన్ని అభిమానించి, ఆదరించి, ప్రోత్సహించే వారందరికీ పండగరోజు. ప్రస్తుతం పర్యాటకరంగం ప్రపంచ రూపురేఖల్నే మార్చేసింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తమ దేశ అభివృద్ధికి పర్యాటక రంగమే ప్రథమావధిగా పనిచేస్తున్నాయి. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ, కోటానుకోట్ల మందికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తున్న ఈ పర్యాటకర రంగం మరింత విస్తృతపరుస్తూ, మరింత అభివృద్ధి సాధించాలని ‘సాక్షి’ మనసారా కోరుకుంటోంది. భారతదేశ జీవన విధానంలో పర్యాటక రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశ సాంస్కృతిక జీవనంలోనే అనాది కాలం నుండి తీర్థయాత్రలు చేయడం ఒక భాగంగా ఉన్న దేశం మనది. మన దేశంలో ప్రతి యేటా కోటానుకోట్ల మంది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను విహారయాత్రా ప్రదేశాలను సందర్శిస్తూ రావటం, ఆనందం పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. పర్యాటక రంగానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం తమ ప్రాధాన్యతాంశాలలో పర్యాటక రంగం చాలా విశిష్టమైనదని చెప్పడం జరిగింది. ఒత్తిడి నుంచి దూరంగా.. నిత్యం పనులతో మానసిక ఒత్తిడికి లోనయ్యేవారికి విహారయాత్రలు ఉల్లాసాన్ని, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా తెలిసిన వారి ద్వారా లేదా ఇంటర్నెట్లో తగిన సమాచారాన్ని తీసుకుని సొంతంగానో లేదా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానో విదేశాలకో లేక స్వదేశంలోనో యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. విపరీతమైన పోటీతత్వం వల్ల కూడా టూరిజం ఇండస్ట్రీ పెరిగిపోయింది. మంచి ధరలకు టూర్ పాకేజీలు తయారు చేసుకొని యాత్రలకు వెళుతున్నారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ భౌగోళిక చరిత్రలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు సహజసిద్ధంగా ఏర్పడ్డ బీచ్‌లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో అంశాలు దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో ప్రముఖంగా ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్, రాజస్థాన్‌లో రాజపుత్రుల కోటలు, ఇలా ఎన్నో చారిత్రాత్మక అంశాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆధ్యాత్మిక టూరిజం భక్తిసాగరంలో మునిగి తేలేవారికి టూరిజం ఒక వరంగా మారిపోయింది. ఇదివరకు రోజులలో యాత్రలకు వెళ్లాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది. కారణం వారు తిరిగి వచ్చే నమ్మకం చాలా తక్కువగా ఉండేది. కానీ, నేటి పరిస్థితులు దానికి భిన్నంగా, అనుకూలంగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి వెళ్లే దిశగా టూరిజం పరిశ్రమ మార్చేసింది. యాత్రలకు వెళ్లాలి అనే ఆలోచన రావడం మొదలు చక్కటి అనుకూలమైన ప్రదేశాలు ఎంచుకొని దానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తెలుసుకొని మరీ ప్రయాణమవుతున్నారు. కాలం మారింది అనడానికి సాక్ష్యంగా టూరిజం పరిశ్రమను చూపించవచ్చు. అనాది కాలం నుండి మనదేశంలో ఆధ్యాత్మిక ఆధ్యాతిక టూరిజం పై మక్కువ ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు,లక్షలాది శైవ, వైష్ణవే దివ్య క్షేత్రాలు.. ఇలా ఎన్నో ఆలయాలు. వాటి ప్రాచీన చరిత్ర, శిల్పకళారీతులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజుల్లో ఏ దేశ పౌరుడిని పలకరించినా టూరిజం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి విషయ పరిజ్ఞానం పెరిగిపోయింది. ప్రతివారూ తమ తమ జీవన విధానంలో భాగంగా పర్యటనల కోసం తప్పక సమయాన్ని, డబ్బును వెచ్చిస్తున్నారు. ఏ దేశంలో పర్యటించినా ఆ దేశంలో ప్రతి వందవ వ్యక్తిని ఒక పరదేశీయునిగా గుర్తించవచ్చు. ముఖ్యంగా భారతీయులు ఏ దేశానికి వెళ్లినా అక్కడ తప్పక కనిపిస్తారు. నాగరికత ప్రజలలో సరికొత్త దిశగా పరుగులు తీస్తోంది. భారతీయులు కొత్తదనానికి త్వరగా ఆకర్షితులవుతారు అనడానికి ఇది ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ప్రదేశ్ అర్థికాభివృద్ధిలో కూడా పర్యాటకరంగ ప్రభావం ఎంతో విశిష్టమైనది. రాష్ట్ర పునఃనిర్మాణంలో పర్యాటకరంగం కూడా కీల పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోనే అతిగొప్ప వైష్ణవ దివ్యక్షేత్రం తిరుమల, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పవచ్చు. పంచారామాలు, శక్తిపీఠాలు.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఎంతో విశాలమైన తీర ప్రాంతం కలిగిన ఈ రాష్ట్రానికి సహజసిద్ధంగా ఏర్పడిన బీచ్‌లు, కోనసీమలోని ప్రకృతి అందాలు... ఇలా ఎన్నో అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించి రాష్రప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి పెద్ద పీట వేయడం జరుగుతుంది. పర్యాటక రంగంలో తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనునిత్యం వేలాది, లక్షలాది పర్యాటకులు సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. ఈ నగరంలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు సుందరమైన పార్కులు, ఎన్నో రకాల ఎమ్యూజ్మెంట్ పార్కులు, దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక సంస్థ తెలంగాణ టూరిజం కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తూ, పర్యాటక సంక్షేమానికి, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ సందర్శనకు కూడా వేలాది భక్తులు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగం మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక రంగం కూడా విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు విదేశీ టూర్స్ పైన కూడా మక్కువ పెరగడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాలనుండి ఇతర దేశాల విమాన సర్వీసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పర్యాటకరంగం ప్రజల జీవనవిధానాలను మారుస్తుంది. ప్రజల ఆలోచనలను మారుస్తుంది. మొత్తంగా ప్రపంచ గమనాన్నే మార్చే అద్భుత శక్తి పర్యాటకరంగానికి ఉంది. -
విజయ విహారి
చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. – విజయనగరం గంటస్తంభం వీర బొబ్బిలి.. పర్యాటక లోగిలి వీర బొబ్బిలి పౌరుషానికి.. పరాక్రమానికి ప్రతీక.. త్యాగానికి పర్యాయ పదం. అలాంటి బొబ్బిలి పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి బొబ్బిలి కోట, విశ్రాంత మందిరం (గెస్ట్ హౌస్)లు చూడ ముచ్చటగా ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లోని నాట్యమందిరంలో చెక్క గచ్చులు ఆకట్టుకుంటాయి. రాజుల కోటలో యుద్ధానికి వాడిన కత్తులు, బాకులు, శూలాలు, డాళ్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాండ్ర పాపారాయుడు నాటి యుద్ధంలో గుడారంలో ఉన్న విజయరామరాజును చంపిన కత్తి ఆకట్టుకుంటుంది. వాటిని సందర్శకులు చూసేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా 18వ శతాబ్ధంలో పాత బొబ్బిలి సమీపాన నిర్మించిన యుద్ధ స్తంభం నేటికీ చెక్కు చెదరలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 72,500 ఎకరాల్లో బొబ్బిలి సంస్థానం విస్తరించి ఉండేది. తాండ్ర పాపారాయ కూడలి బొబ్బిలి యుద్ధంలో రాజుల తరపున యుద్ధం చేసిన తాండ్ర పాపారాయుడి విగ్రహాన్ని బొబ్బిలి నడిబొడ్డులో ఏర్పాటు చేశారు. నేటికీ ఆ విగ్రహం పదిలంగా ఉంది. దీని పక్కన ఇటీవల నిర్మాణాలకు ప్రయత్నిస్తే విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని తొలగించారు. ఇప్పుడు తాండ్రపాపారాయుడి విగ్రహం అల్లంత దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. తాజ్‌మహల్ వంటి నిర్మాణం తాజ్‌మహల్ ఆకృతిని పోలి ఉండే పెద్ద గెస్ట్‌హౌస్ కాలనీ ఇక్కడే ఉంది. దీని పక్కనే వెలసిన గృహనిర్మాణాల సముదాయానికి గెస్ట్ హౌస్ కాలనీ అని పేరు. ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్‌ను జరుపుకొన్నాయి. తమిళ, తెలుగు భాషా చిత్రాలతో పాటు ప్రముఖ నటులు సైతం గెస్ట్‌హౌస్, కోట, సంస్థానం ఉన్నత పాఠశాలల్లో షూటింగ్‌ను జరుపుకొన్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలు విజయవంతమవుతాయనే నమ్మకం నిర్మాత, దర్శకులతో పాటు నటులకు కూడా ఉండటం గమనార్హం. రాణీ కోట, గుర్రపుకోనేరు వంటి నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అరుదైన రైల్ బస్ కూడా బొబ్బిలిలో ఉంది. ఇది నిత్యం నాలుగు మార్లు బొబ్బిలి–సాలూరు మధ్య తిరుగుతుంది. ఇందులో బస్సులో మాదిరి కండక్టర్ ఉండటం విశేషం. గోవిందపురంలోని ముక్తిధాం క్షేత్రం జిల్లాలో పైడితల్లి అమ్మవారి దేవస్థానం దేశీయంగా మంచి గుర్తింపు పొందింది. జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలు వాసులు, ఇతర రాష్ట్ర, దేశాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించి పులకరిస్తుంటారు. శ్రీరామచంద్రులవారు కొలువైన రామతీర్థం కూడా ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో ప్రముఖ రామాలయంగా వర్ధిల్లుతోంది. విజయనగరం పట్టణంలో త్రిపురాంతకస్వామి, జగన్నాథ స్వామి, కన్యకాపరమేశ్వరి, గుమ్చి, సారిపల్లి లింగేశ్వరస్వామి, కుమిలి, బొబ్బిలి వేణుగోపాలస్వామి, తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయనగరానికి సమీపంలోని రామనారాయణం దేవాలయం కూడా ప్రసిద్ధి పొందింది. ముఖ్యమైన కట్టడాలు జిల్లా చరిత్రను ఇనుమడింప చేసే కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని నలుమూలలకు చాటాయి. ఇందులో విజయనగరంలోని రాజుల కోట, గంటస్తంభం, మోతీమహాల్, ఊద్ఖానా ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్, పెర్లా హోం, బొబ్బిలి కోట, రాజ్‌మహల్, బొబ్బిలి గెస్ట్‌హౌస్ ఇందులో ముఖ్యమైనవి. చారిత్రక ప్రదేశాలు జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కొదవ లేదు. జిల్లా కేంద్రం విజయనగరం అనేక విధాలుగా గుర్తింపు పొందింది. సంగీత కళాశాల, సాంస్కృతిక కళాశాల, కోరుకొండ సైనిక పాఠశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలతో గుర్తింపు పొందింది. వ్యాపార కేంద్రంగా భాసిల్లుతోంది. వస్త్ర వ్యాపారానికి చిరునామాగా మారింది. బొబ్బిలి కూడా రాజుల కాలం నుంచి గొప్ప చారిత్రక కేంద్రంగా పేరొందింది. సాలూరు లారీ పరిశ్రమ ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు వ్యాపారపరంగా గుర్తింపు పొందింది. పుణ్యగిరి, ధర్మవరం, శంబర, గోవిందపురం, తోటపల్లి ప్రాంతాలు ఆధ్యాత్మికపరమైన.. తాటిపూడి, తోటపల్లి పర్యాటకపరమైన గుర్తింపు పొందాయి. సాలూరు మండలం దండిగాం, కురుకూటి, గమ్మలక్ష్మిపురం తాటిగూడ తదితర ప్రాంతాలు జలపాతాలకు ప్రసిద్ధి చెందాయి. సముద్రతీర ప్రాంతం, చింతపల్లి లైట్‌హౌస్, జంఝావతి రబ్బర్‌డ్యాం ఇలా అనేక గుర్తింపు పొందిన ప్రదేశాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయి. పర్యాటక రంగం అభివృద్ధికి కసరత్తు ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో కలెక్టర్ హరి జవహర్లాల్, ఇతర అధికారులు పర్యాటక పెట్టుబడులు ఆహ్వానించడం, పర్యాటకంగా అభివృద్ధి సాధించడంపై దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇందులో కొన్నింటిని ప్రభుత్వం, మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇదీ ఆలోచన ►ఈ తాటిపూడి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో రూ.1.5 కోట్లు పర్యాటకానికి, రూ.50 లక్షలు అడ్వంచర్ పార్కుకు కేటాయించారు. తోటపల్లిలో రూ.4.5 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ రెండు చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేయాలని నిర్ణయించారు. ►ఈ సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో రూ.50 లక్షలతో సైబీరియా పక్షుల కేంద్రం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. ►చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ► విజయనగరం గంటస్తంభం ఈ సాంస్కృతిక రాజధాని విజయనగరం గుర్తింపును ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించేలా విశాఖపట్నం నుంచి విజయనగరం పట్టణంలోకి వచ్చే మార్గంలో రూ.50 లక్షలతో ముఖద్వారం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ►ఈ దేవాలయ పర్యాటకంలో భాగంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, సీతంపేట అడ్వంచర్ పార్కుతోపాటు రామతీర్థం సందర్శనకు ఒక పర్యాటక ప్యాకేజీని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభిస్తున్నారు. ►ఈ బౌద్ధ స్థూపాల పర్యాటకంలో భాగంగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా శాలిహుండం, విశాఖపట్నం జిల్లా తోట్లకొండ, అనకాపల్లి బొజ్జలకొండ, అమరావతిని కలుపుకొని ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ఇందులో రామతీర్థం, గంట్యాడ మండలం నీలావతిలో ఉన్న బౌద్ధ స్థూపాలను కూడా కలిపి సర్కిల్ తయారు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు అనుమతి రావలసి ఉంది. ►ఈ స్వదేశీ దర్శనం పథకం కింద కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రారంభమై ఆ జిల్లా నర్సీపట్నం, లంబసింగి, అరకుతో ముగిసే విధంగా ఒక రోజు పర్యాటక యాత్ర ఏర్పాటు చేశారు. దీన్ని మరోరోజు విస్తరించి విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మకొండ, పెద్దగెడ్డ జలాశయం, దండిగాం, కురుకూటి జలపాతాలు, శంబర పోలమాంబ, బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయాలు, కోట, యుద్ధ స్మారక ప్రదేశం, వీణల తయారీ, సీతానగరం చెల్లంనాయుడువలస, పార్వతీపురం మండలం అడ్డాపుశీల మహానంది, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి, కొమరాడ మండల రాజులకోట, గుమ్మలక్ష్మీపురం మండలం తాటిగూడ జలపాతాలతో ముగిసేలా పర్యాటక యాత్ర నిర్వహించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తాటిపూడి జలాశయం రా.. రమ్మని.. గంట్యాడ (గజపతినగరం): పచ్చని కొండల నడుమ అందమైన జలాశయం.. ప్రకృతి సోయగాలకు తాటిపూడి పెట్టింది పేరు. తాటిపూడి అందాలను తిలకించేందుకు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు సేదదీరేందుకు తాటిపూడి అవతల గిరివినాయక కాటేజీలను నిర్మించారు. గిరి వినాయక కొండపైకి ఎక్కితే చేతికందేలా కనువిందు చేసే మేఘాల్ని చూసి కేరింతలు కొడతారు. గిరిజనుల సంప్రదాయ వంటలు, ధింసా నృత్యం ఆకట్టుకుంటాయి. నోరూరించే బొంగు చికెన్, మట్టి చికెన్.. నూనె లేకుండా చేసే వంటకాలను పర్యాటకులు లొట్టలేసుకొని తింటారు. సినిమాల చిత్రీకరణ తాటిపూడి పరిసరాల్లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా చిత్రీకరించారు. తాటిపూడిలో చిన్న దృశ్యం చిత్రీకరించినా ఆ సినిమా హిట్ అవుతుందని నటుడు నందమూరి బాలకృష్ణకు నమ్మకం ఉంది. ఆనాటి మరోచరిత్ర మొదలుకొని, బొబ్బిలి సింహం, లెజెండ్, సోలో, గంగోత్రిలో ఒకపాట, అల్లరి నరేష్ సినిమా మడతకాజాలో ఒక పాట.. ఇలా చాలా సినిమాలను తాటిపూడి జలాశయం ఆవరణలో చిత్రీకరించారు. తాటిపూడి జళాశయం మధ్యలోని ఐలాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎలా చేరుకోవాలి తాటిపూడి చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు, ఆటోలు, టూరిస్ట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. విశాఖ, అరకు నుంచి వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా తాటిపూడి జళాశయం అందాలు తిలకించకుండా వెళ్లరు. అందాల మన్యం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో పర్యాటక రంగం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్.కె.పాడు గ్రామ సమీపంలో ఉద్యానవన నర్సరీ, శిక్షణ కేంద్రం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నర్సరీలో సుమారు రూ.38 లక్షలతో ఇటీవల చుట్టూ కంచె, సిమెంటు రోడ్లు, ప్రవేశంలో ఆర్చీ, పగోడా, యోగా ప్రతిమలు, పద్మవ్యూహం తదితర పర్యాటకాభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. మండలంలోని తాడికొండ గ్రామంలోని మొగనాళి గెడ్డ జలపాతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ జలపాతాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో పర్యాటకాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – గుమ్మలక్ష్మీపురం (కురుపాం) పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. అందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి నిధులు వచ్చాక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం వల్ల తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యం పెంచి బాధ్యత పెంచాలన్న ఆలోచనలో పెద్దలున్నారు. రానున్న రోజుల్లో జిల్లా పర్యాటకానికి మంచి రోజులు వస్తాయి. – పి.ఎన్.వి.లక్ష్మీనారాయణ, జిల్లా పర్యాటక శాఖాధికారి -
విహంగ విహారి
త్రి సముద్ర తోయ పీత వాహన... ఇది గౌతమీ పుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు. దీనర్థం మూడు సముద్రాల నీటిని తాగిన గుర్రాన్ని వాహనంగా కలిగిన వాడు అని. ఇక్కడ కవి భావం గుర్రం సముద్రం నీటిని తాగిందని కాదు. ఈ మూడు సముద్రాల మధ్యన ఉన్న ప్రదేశాన్నంతటినీ జయించిన వాడు అని అర్థం. మరి... ఈ మూడు సముద్రాల మధ్యనున్న భూభాగాన్ని ఆద్యంతం పర్యటించిన టూరిస్టును ఏమనాలి? వీటితోపాటు ఖండాలు దాటి విహరించిన విహారిని ఏమనాలి? విశ్వ విహారి అనవచ్చా? ‘‘మరో రెండు ఖండాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ విశేషణానికి అర్హత లభిస్తుంది. మరో మూడు– నాలుగేళ్లలో అవి కూడా పూర్తి చేస్తాను’’ అంటున్నారు రజని లక్కా. గుంటూరులో పుట్టి, అనంతపూర్‌లో మెట్టి, బళ్లారిలో స్థిరపడిన మన తెలుగింటి మహిళ రజని. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆమె తన పర్యాటక అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘స్విమ్మింగ్ కోచ్‌గా నేను ఏడాదిలో పది నెలలు టైట్ షెడ్యూల్స్‌తో పనిచేస్తాను. వెకేషన్ నన్ను బూస్టప్ చేస్తుంది. అందుకే ఏటా తప్పకుండా నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఏదో ఒక టూర్ చేస్తాను. అన్నవరం నుంచి అమెరికా వరకు, కూర్గ్ నుంచి కెనడా వరకు ప్రతి పర్యటన నుంచి దానికదే ప్రత్యేకమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాను. మన దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, కోటలు, సరస్సులు, సముద్రాలు, జలపాతాలను చాలా వరకు చూసేశాను. కృష్ణుడు పుట్టిన మధుర, రాజ్యమేలిన బేట్ ద్వారక, ప్రాణత్యాగం చేసిన వేరావల్ నా పర్యటనలో భాగాలయ్యాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున పూరీ పట్టణం నుంచి పశ్చిమాన సోమనాథ్ వరకు... దాదాపుగా ప్రతి వంద కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాననే చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక ఖండాల విషయానికి వస్తే ఇప్పటి వరకు నా విహారంలో నాలుగు ఖండాలను చూశాను. ఆఫ్రికా పర్యటన ఒకసారి వాయిదా పడింది. మళ్లీ త్వరలోనే ప్లాన్ చేసుకుంటాను. ఇక భవిష్యత్తులో సౌత్ అమెరికాను చూడాలి. వ్యవస్థ పనిచేస్తుంది ఇన్ని దేశాలను చూసిన తర్వాత మనకు వాళ్లకు ఉన్న ప్రధానమైన తేడా సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్లో కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో మా మనుమరాలి పాస్‌పోర్ట్ కోసం వెళ్తే... మనకిచ్చిన స్లాట్ టైమ్‌కి వెళ్తే ఒక నిమిషంలో పాపను ఫొటో తీసి ‘ఫినిష్డ్’ అని పంపించేశారు. పాస్‌పోర్ట్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాకు మన దగ్గర పాస్‌పోర్ట్ కోసం పడాల్సిన ప్రయాస గుర్తుకొచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా అంతే. మన టైమ్‌కి మనం వెళ్లేసరికి మనకంటే ముందు ఒకరు, మన పరీక్షలు పూర్తయ్యేటప్పటికి ఒకరో ఇద్దరో వచ్చి ఉంటారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా హాస్పిటల్లో గంటలకు గంటలు వెయిట్ చేయించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో మన డాక్యుమెంట్లు కచ్చితంగా ఉంటే ‘ఎస్’ అంటారు, తేడా ఉంటే ‘నో’ అంటారు. అంతే తప్ప లంచంతో పని జరగడం ఉండదు. దొడ్డ విశ్వాసం పాశ్చాత్యదేశాల్లో ఓల్డ్పీపుల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం అంటే... వాళ్లు ఒకరి సహాయం కోసం ఎదురు చూడరు. ఎనభై ఏళ్ల మహిళ కూడా తన కారు తనే డ్రైవ్ చేసుకుని వెళ్తుంటుంది. కారులో సామాను దించుకోవడానికి కూడా ఎవరి కోసమూ చూడరు. హోటల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో వాళ్లకు అవసరమైన వస్తువు అందించబోయినా కూడా సహాయం తీసుకోరు. చక్కటి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా నవ్వి సున్నితంగా తిరస్కరించి, వాళ్లే చేసుకుంటారు. మన దగ్గర వయసులో ఉన్న వాళ్లు కూడా తమ పనులు తాము చేసుకోకుండా సహాయకుల్ని పెట్టుకోవడాన్ని దర్పంగా భావిస్తారు. అక్కడ పని చేసుకోవడాన్ని గౌరవిస్తారు. మనం నేర్చుకోవాల్సిన విషయం అది. పాశ్చాత్య సమాజంలో మరొక గొప్ప సంగతి కూడా గమనించాను... అక్కడ ఒక మనిషికి ఆ వ్యక్తి హోదాలను బట్టి గౌరవం ఇవ్వడం అనేది ఉండదు. కంపెనీ సీఈఓ అయినా అటెండర్ అయినా, స్వీపర్ అయినా ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం సమానంగా ఉంటుంది. అక్కడ హోదా ప్రదర్శన కూడా కనిపించదు. వర్షం పడుతుంటే మన దగ్గర ఎస్సైకి కానిస్టేబుల్ గొడుగు పట్టుకోవడాన్ని చూస్తుంటాం. అక్కడ ప్రధానమంత్రి అయినా సరే తన గొడుగు తనే పట్టుకుంటాడు. విరిగిన కొండ చరియ ప్రపంచంలో నచ్చిన ప్రదేశాల్లో మొదటిది న్యూజిలాండ్, రెండవది కెనడా, మూడవది స్విట్జర్లాండ్. నా పర్యటన ప్లాన్‌లో గుల్మార్గ్ ఉంది. స్నోఫాల్ చూడటానికి విదేశాలకు వెళ్లడం ఏమిటి? మనదేశంలోనే చూడాలనేది నా పట్టుదల. మానస సరోవర్ యాత్రకు వయసు సహకరిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను. పర్యటనల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగని కాలు బయటపెట్టకుండా ఉండలేం కదా! మనం రోజూ ప్రయాణం చేసే రోడ్డు మీదనే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. పనులు మానుకుని నాలుగ్గోడలకు పరిమితం కాలేం కదా! కేదార్నాథ్ పర్యటన సమయంలో ఉన్నట్లుండి కొండ చరియ విరిగి పడింది. దారి పొడవునా రెçస్క్యూ సిబ్బంది ఉంటారు. వెంటనే రోడ్డు క్లియర్ చేస్తారు. అయితే కొండ చరియలు మరీ ఎక్కువగా పడినప్పుడు ఒకటి రెండు రోజులు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఆ సంఘటన తర్వాత నేనేమీ పర్యటనలు ఆపలేదు. ఈ ఏడాది జూలైలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. నా జీవిత ధ్యేయం ఒక్కటే... శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను, మానసికంగా రిఫ్రెష్ కావడానికి పర్యటనలు చేస్తూ ఉంటాను. మనిషి పక్షిలా విహరించాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆహ్లాదంగా జీవించగలుగుతారు.’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ‘భలే’బీడు గోదావరి పుట్టిన త్రయంబకేశ్వర్, కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్, హిమాలయాల నుంచి మైదానానికి దారి తీసే రొహతాంగ్ పాస్, కేదార్నాథ్, బదరీనాథ్, హరిద్వార్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, అమర్నాథ్... ఇలా ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలన్నీ చూడగలిగాను. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఆలయాలు అద్భుతంగా ఉంటాయి. శిల్ప సౌందర్యంలో కర్ణాటకలోని హలేబీడు, బేలూరుకి మించినది కాదు కదా సరిపోలేది కూడా మరోటి లేదనిపించింది. పిల్లలను టూర్లకు తీసుకెళ్లే వాళ్లకు నేను చెప్పేదొక్కటే...విదేశీ పర్యటనలకంటే ముందు పిల్లలకు ఇండియాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూపించండి. అప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వాళ్లకు సులువవుతుంది. ఇండియా గొప్పతనం తెలుసుకున్న తర్వాత విదేశాలను చూస్తే పర్యాటకం ద్వారా కలిగే విజ్ఞానంలో పరిపూర్ణత ఉంటుంది. – రజని లక్కా, స్విమ్మింగ్ చాంపియన్ రజని చెప్పిన మరికొన్ని విషయాలు ఇండియా తర్వాతనే... ప్రపంచ పర్యటనకంటే ముందు మనదేశాన్ని దాదాపుగా చుట్టేసి ఉండడంతో విదేశాల్లో నేను చూసిన ప్రతి ప్రదేశాన్నీ ఇండియాలో ఏదో ఒక ప్రదేశంతో బేరీజు వేసుకోవడం అలవాటైంది. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటెయిన్స్ దగ్గర త్రీ సిస్టర్స్ అనేవి నీటి కోత కారణంగా ఏర్పడిన రాతి శిఖరాలు. అది గొప్ప ప్రకృతి అద్భుతమే, అయితే మా బళ్లారికి అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న హంపి దగ్గర మాతంగ కొండలు కూడా అలాగే ఉంటాయి. పైగా ఎన్ని శిఖరాలుంటాయో... లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. పర్యాటక సంపదను ప్రమోట్ చేసుకోవడంలో మనం వెనుకబడిపోయాం. ప్రభుత్వం ఓ రెండు దశాబ్దాలుగా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కానీ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. పాశ్చాత్యులు ఈ విషయంలో చాలా ముందున్నారు. నయాగరా వాటర్ ఫాల్స్‌ని అమెరికా వైపు నుంచి కెనడా వైపు నుంచి కూడా చూశాను. గొప్ప జలపాతమే కానీ మన దగ్గర జోగ్ జలపాతం, హోగెనక్కల్ జలపాతాల సౌందర్యం కూడా నయాగరాకు ఏ మాత్రం తీసిపోదు. జోగ్ ఫాల్స్‌ని ఇండియన్ నయాగరా అంటారు. శ్వేత సౌందర్యం విషయంలో స్విట్జర్లాండ్‌ను చెప్పుకుంటారు. కానీ అది కశ్మీర్‌ను మించినదేమీ కాదని నా అభిప్రాయం. ఇన్ని ప్రదేశాల్లో నన్ను నిరుత్సాహపరిచిన ప్లేస్ జైపూర్. చిన్నçప్పుడు పింక్ సిటీ అని చదివినప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. చూసినప్పుడు ఆ స్థాయి సంతృప్తి కలగలేదు. మన కోహినూర్ టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో రాజకుటుంబీకులు వాడిన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకువెళ్లిన పెద్ద పెద్ద బంగారు పళ్లాలు, స్పూన్లు, ఇతర పాత్రలు, అనేక వస్తువులను చూసినప్పుడు తీవ్రమైన బాధ మనసుని పిండేసింది. మన దగ్గర ఉండాల్సిన వాటిని తీసుకెళ్లిపోవడమేకాక వాటిని దర్జాగా ప్రదర్శనలో పెట్టుకున్నారని కూడా అనిపించింది. దేశదేశాల వాళ్లు వాటిని అబ్బురంగా చూడడాన్ని గమనించిన తర్వాత అవి అక్కడ ఉండడమే మంచిదనుకున్నాను. అవన్నీ మన దగ్గరే ఉండి ఉంటే వెంకటేశ్వరుడి నగల్లాగ ఒక్కొటొక్కటిగా మాయమై ఉండేవేమో. బ్రిటిష్ వాళ్లు వాటిని చక్కగా పరిరక్షించి, ప్రపంచమంతటికీ చూపిస్తున్నారు. పైగా వాళ్ల మ్యూజియం నిర్వహణ తీరు చాలా బాగుంది. బంగారు కొండ ఎన్ని ఖండాలు చూసినా... ఇండియాలో ఉన్నన్ని ప్రకృతి అద్భుతాలు మరే దేశంలోనూ ఉండవనే నా నమ్మకం. బద్రీనాథ్ పర్యటన అయితే నా జీవితంలో మర్చిపోలేను. సూర్యోదయం సమయంలో కొండ బంగారు రంగులోకి మారుతుంది. ఆ సుందర దృశ్యం కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుంది. ఉదయం ఐదు ముప్పావుకి లొకేషన్‌కి వెళ్తే ఆ అద్భుతాన్ని చూడవచ్చు. అయితే దానికి కూడా అదృష్టం ఉండాలంటారు. మనం వెళ్లిన రోజు ఆకాశం మబ్బులు పట్టి ఉంటే ఆ అద్భుతాన్ని చూడలేం. విదేశీయులు ఈ సుందర దృశ్యాన్ని చూడటానికే వస్తారు. పర్యటనల పట్ల విదేశీయులు చూపినంత ఆసక్తి మనవాళ్లు చూపించరు. కెనడాలో మాట్రియల్ సిటీ నుంచి క్యుబెక్ సిటీకి బస్‌లో వెళ్లాను. ఆ బస్‌లో ప్రయాణించిన పదిహేను మందిలో పది దేశాల వాళ్లున్నారు. ఎక్కువగా సోలో ట్రావెలర్సే. పర్యాటకుల క్షేమమే ప్రధానం ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మనకు ఎక్కడ లేని ఉత్కంఠ. మ్యాచ్ పూర్తయిన తర్వాత టపాకాయల మోత చెవుల్ని చిల్లులు చేస్తుంటుంది. వెస్టర్న్ కంట్రీస్‌లో భారతీయులు, పాకిస్తానీయులు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీలో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తారు. కెనడా వెళ్లినప్పుడు టొరంటోలో టాక్సీ ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఒక్క క్షణం భయమేసింది. ఇక్కడ మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే నా భయానికి కారణం. కానీ అతడు చాలా స్నేహంగా మాట్లాడాడు. శ్రీనగర్‌లో సరస్వతి ఆలయాన్ని చూడాలనుకున్నప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైంది. మా టూరిస్ట్ గ్రూప్‌కి క్యాబ్‌లు పెట్టిన డ్రైవర్లందరూ ఒకే మాటగా ఆ ఆలయానికి వద్దన్నారు. అది నమాజ్ టైమ్ అని, ఆ సమయంలో వెళ్తే రాళ్లు రువ్వుతారని చెప్పారు. తమకు పర్యాటకుల క్షేమమే ప్రధానమని కూడా చెప్పారు. మేము చూడాలని పట్టుపట్టడంతో మూడు గంటల తర్వాత నమాజ్ పూర్తయి వెళ్లిపోతారు అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అలాగే చేశారు. ఆ ట్యాక్సీ డ్రైవర్లు కూడా ముస్లింలే. -
అభాసుపాలు...! ఇవేం ఉత్సవాలు...!!
పేరుకే ప్రపంచ పర్యాటక దినోత్సవం. చేసింది నామమాత్రం. పర్యాటక దినోత్సవాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా నాలుగు గోడల మధ్య జరగడం ఏంటన్న సందేహం ప్రజలది. కానీ అలాగే ఓ హోటల్లో అధికారికంగా జరిపించేశారు. మమ అనిపించేశారు. ఇలా వేడుకలను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల ద్వారా ప్రభుత్వం, నిర్వహణాధికారులు నవ్వులపాలయ్యారు. విజయనగరం ,గంటస్తంభం: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జిల్లాలో పేలవంగా జరిగాయి. ఒక హోటల్లో సాదాసీదాగా నిర్వహించి అధికారులు మమ అనిపించారు. దీంతో పర్యాటక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎంతన్నది ఇట్టే అర్ధమవుతోందని జనం గుసగుసలాడుకుంటున్నారు. పర్యాటక అభివృద్ధికి ఎలాగూ ప్రాధాన్యత లేదని, కనీసం ఉత్సవాలైనా వేడుకగా నిర్వహిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురష్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ అధికారులు జిల్లాలో ఉత్సవాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పట్టణంలో ఒక హోటల్లో గురువారం ఉదయం వేడుకలు నిర్వహించారు. ముందుగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, కలెక్టర్ హరి జవహర్లాల్, జేసీ వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు కొంతదూరం ర్యాలీ నిర్వహించారు. సాధారణంగా వేడుకలు ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు నామమాత్రంగా నిర్వహించి అధికారులు విమర్శలకు గురయ్యారు. ర్యాలీకి పెద్దగా జనం హాజరు కాలేదు. కార్యక్రమానికి జనం కూడా అంతంతమాత్రంగా వచ్చారు. ఫంక్షన్ హాల్ కేవలం 200మందికి సరిపోయే విధంగానే కుర్చీలు ఉన్నాయి. అయితే అంత మంది జనం కూడా రాలేదు. అందులో సగం కుర్చీల్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు కొందరు, విద్యార్థులు కొందరు మాత్రమే హాజరయ్యారు. సభ నిర్వహణ కూడా గంటలో ముగిసింది. అందులో జిల్లా పర్యాటక రంగ వైభవం గురించిగానీ, అభివృద్ధి గురించిగానీ చెప్పుకున్న సంగతలు అంతంతమాత్రమే. దీంతో ఎందుకు వేడుకలు పెట్టారా? అన్న అనుమానం అక్కడకు హాజరైన వారిలో కలిగింది. కొందరు ఉద్యోగులైతే పక్కన నిల్చొని మొక్కుబడిగా ఎందుకు చేయాలో? అని విమర్శించడం గమనార్హం. ఇక జిల్లా పర్యాటక రంగాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏమీ లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. నాలుగు గోడల మధ్యే... పర్యాటక ఉత్సవాలు వేడుకలు నిర్వహణకు ఎంచుకున్న స్థలంపై కొందరు బహిరంగంగానే పెదవి విరిచారు. పర్యాటక ఉత్సవాలంటే ఏదైనా ఒక పర్యాటక ప్రాంతంలో పెడితే ప్రజలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతేందుకు దూరంగా వద్దనుకుంటే విజయనగరంలో పర్యాటకంగా అభివృద్ధి చేసామంటున్న కోట ఉంది. కనీసం ఆ ప్రాంతంలో కూడా వేడుకలు పెట్టకుండా ఒక ßోటల్లో పెట్టడమేమిటని ప్రశ్న వినిపిస్తోంది. నాలుగు గోడల మధ్య, సాదారణ జనాలకు తెలియని ప్రాంతంలో వేడుకలు పెట్టి ఏమి చెప్పదల్చుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వేడుకలు నిర్వహణకు కలెక్టర్ కార్యాలయంలో రెండు సమావేశ మందిరాలు ఉండగా... జెడ్పీ సమావేశ మందిరం కూడా ఉంది. వీటిని కాదని అద్దె కట్టుకుని ఒక హోటల్లో ఎందుకు పెట్టారన్న అంశంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాధాన్యం ఇవ్వకే... ఉత్సవాలు నిర్వహణ హోటల్లో సాదాసీదాగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు. ఖర్చు చేసిన తర్వాత బిల్లులు పెట్టమనడంతో తర్వాత ఎంత ఇస్తుందో తెలియని పరిస్థితి.దీంతో అట్టహాసంగా చేయకుండా మమ అనిపించారన్న వాదన ఉంది. మొత్తానికి కారణమేదైనా వేడుకలు నామమాత్రంగా జరగాయన్నది నిష్టుర సత్యం. ఈ విషయం జిల్లా పర్యాటకాధికారి లక్ష్మీనారాయణ వద్ద ప్రస్తావించగా హోటల్ కూడా టూరిజం స్పాట్ కావడం వల్ల అక్కడ పెట్టామన్నారు. ప్రభుత్వం ప్రత్యేకించి ముందుగా నిధులివ్వలేదన్నారు.