world womens day
-
ప్రతి మహిళా ఒక సోల్జర్
నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్.సి.సి. గర్ల్ కెడేట్స్, ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కణిట్కర్! షో అయ్యాక ‘‘హౌ ఈజ్ ది జోష్’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్‌గా కాదు, ఒక సోల్జర్ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్ ను మరింతగా పెంచారు కణిట్కర్. మాధురీ కణిట్కర్ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ జనరల్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఎన్.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్.సి.సి. గర్ల్ కెడెట్లు, ఎన్.సి.సి. ఉమెన్ ఆఫీసర్స్ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్ ప్రెజెంటేషన్‌లా ఉంది. గర్ల్ కెడెట్స్ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. చిత్రం పూర్తవగానే గర్ల్ కెడెట్స్ అరుపులు, చప్పట్లు! ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్ అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్ ద జోష్?’ అని! ‘సూపర్బ్‌గా ఉంది మేడమ్’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్‌లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్ విభాగంలో ఆఫీసర్ తను. లెఫ్ట్‌నెంట్‌గా చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్ జనరల్. (మొదటి ర్యాంక్ ఫీల్డ్ మార్షరల్. రెండో ర్యాక్ జనరల్). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్ కూడా పొందారు. ∙∙ నేషనల్ జియోగ్రాఫిక్ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్ గర్ల్స్‌కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్.సి.సి.లో కొత్తగా జాయిన్ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్‌కి జెండర్ ఉండదు. అది మన మైండ్‌లో ఉంటుంది. మహిళల జెండర్ వారిలో పవర్ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా. ‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్‌గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్‌లో ఆర్మీ పవర్ ఉంది. ఆర్మీకి ఉమన్ పవర్ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్ని ఇచ్చిందో అంతే జోష్‌ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్‌గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు. -
సుమంగళి నుంచి ఫిదా వరకు
సాహిత్యానికి కొంత స్వేచ్ఛ ఉంది. సినిమా జనామోదానికి లోబడి ఉండాలి. జనం, అనగా పురుషులు, అనగా పురుష భావజాలం తమపై ఉందని తెలియని స్త్రీలు కూడా మెచ్చే సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి. తెలుగు సినిమా స్త్రీ పాత్రను పాపులర్ జనాభిప్రాయాల మేరకే చూపింది. అయినా కొన్నిసార్లు వెండి తెర మీద స్త్రీ పాత్రలు కాస్త వెలుతురు చూశాయి. కొన్ని మాటలు చెప్పాయి. తమ ముఖం చూపడానికి చిన్న అద్దాలు వద్దని చెప్పాయి. తెలుగు సినిమాల్లో స్త్రీలు ఏం చెప్పారు? తెలుగు సినిమాలు స్త్రీలకు ఏం చెప్పాయి. ప్రత్యేక కథనం. ‘సతీ’ అనే పదం ఉండాలి టైటిల్లో. సినిమాను మహిళా ప్రేక్షకులకు అలవాటు చేయడానికి సినిమా మొదలైన కొత్తల్లో సినిమా వారు చేసిన పని అది. ‘సతీ అనసూయ’,‘సతీ సావిత్రి’, ‘సతి సుమతి’... దేశ వ్యాప్తంగా ‘సతి‘ సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘సతి తులసి’ కూడా తీశారు. ‘సతి’ ఏం చేయాలి? పతిని శిరసావహించాలి. కథలు సోషలైజ్ అయ్యాక కూడా ఇదే భావధారను తెలుగు సినిమా జనామోదం కోసం తీస్తూ వెళ్లారు. భర్త ప్రాణాల కోసం యమునితో పోరాడిన సతి ఉంది కాని భార్య ప్రాణాల కోసం పోరాడిన పతి లేడు. ∙∙∙ ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ (1950) తెలుగు సినిమాల్లో స్త్రీలు ఎలా ఉండాలో గట్టిగా సుబోధ చేసిన చిత్రం. అక్కినేని, అంజలి దేవి నటించిన ఈ సినిమాలో అక్కినేని స్త్రీలోలుడిగా మారితే అంజలి దేవి అత్తారింటికి చేరి ఒక్కగానొక్క కూతురితో నానా బాధలు పడుతుంది. అయినా అక్కినేని మారడు. అయితే ఆమె సతి ధర్మాన్ని వీడదు. చివరకు ఆమెను బాధించినందుకు అక్కినేనికి కళ్లుపోతే ఆ కళ్లు తన ప్రార్థనా బలంతో రప్పించి ప్రాణాలు విడిచి దేవతలా కొలుపులు అందుకుంటుంది. శ్రీ లక్ష్మమ్మ మహిళా ప్రేక్షకులకు ఇలవేల్పు. చూడండి... భర్త తనకు దక్కకపోయినా భార్య భర్త కోసమే జీవించాలి. తన సుఖానికి పనికి రాకపోయినా భర్త కోసమే జీవించాలి. ‘సుమంగళి’ (1965) కథ ఇదే మాట చెబుతుంది. ఇందులో సావిత్రిని పెళ్లి చేసుకున్నాక అక్కినేనికి యాక్సిడెంట్ అవుతుంది. అతను వైవాహిక జీవితానికి పనికి రాడు. యోగ్యమైన వయసులో ఉన్న సావిత్రి భర్తనే సర్వస్వం అనుకుంటూ ఉంటుంది. ఆమె బాధ చూడలేక అక్కినేని అవస్థ పడతాడు. ఆమెకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. భారతీయ వ్యవస్థలో స్త్రీ వివాహాన్ని ఎంత గౌరవించాలో చెబుతూ సుమంగళిగా వెళ్లిపోవడానికి సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. పై రెండు సినిమాల్లోనూ భార్యలు మరణించారు. భర్తలు జీవించారు. స్త్రీ సమస్యలను తెలుగు సినిమా పట్టించుకోలేదు. బహుశా కొద్దిపాటి బుద్ధులు, కొంచెం సంస్కారం నేర్పడం వరకు అది తన వంతు అనుకుంది. ‘మాలపిల్ల’ (1938) సినిమా వచ్చింది... అందులో బ్రాహ్మణ యువకుడు మాలపిల్లను వివాహం చేసుకుంటాడు నిజమే కాని అది సాంఘిక సంస్కరణ మాత్రమే పురుష సంస్కరణ కాదు. ‘వర విక్రయం’ (1939) సినిమా వచ్చింది. అందులో భానుమతి ‘స్వాతంత్య్రం లేదా స్త్రీలకు’ అని పాడింది. అయితే ఈ ధోరణి గట్టిగా కొనసాగలేదు. ఇంటి పట్టున ఉండటం స్త్రీ ధర్మం, సంపాదించుకు రావడం పురుషధర్మం కనుక ఇంటి పట్టున ఉన్న స్త్రీని శ్లాఘించి ఇంటి పట్టున ఉండటంలోని గొప్పతనం తెలియచేసే కథలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ‘అర్థాంగి’ (1955), ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959), ‘దేవత’ (1965), ‘గృహలక్ష్మి’ (1967) ... ఇవి చాలా ఉన్నాయి. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పాటలు కట్టారు. అసలు ఇల్లాలు అంటే ఎలా ఉండాలో మోడల్ కూడా గట్టిగా చూపించారు. పాట సాగుతుండగా ఆమె తెల్లవారే లేస్తుంది.. ఎడ్లకు గడ్డి వేస్తుంది... స్నానం చేసొచ్చి కాఫీ తీసుకుని భర్త గదిలోకి వస్తుంది... అందాక భర్త నిద్రపోతూ ఉంటాడు. అతణ్ణి రెడీ చేసి టిఫిన్ పెట్టి.. బ్రీఫ్ కేస్ ఇచ్చి... ఇలా చేయడం వల్ల ఆమె దేవత. దీనిని రివర్స్ చేయడం మన సమాజంలో కాదు కదా సినిమాల్లోనూ అనూహ్యం. అమంగళకరం. ఆఫీసుకు వెళ్లే భార్య కోసం ఉదయాన్నే లేచి పాట పాడే భర్త లేడు. దాసరి తీసిన ‘సీతారాములు’ (1980)లో ‘ఏమండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది’ అని పాట ఉంటుంది... దానిని చూసి సమస్త లోకం కంగారు పడుతూ ఉండగా పాట చివరలో అది కల అని తెలుస్తుంది. ఆ సినిమాలో పెద్ద ఫ్యాక్టరీ యజమాని జయప్రద. కాని దర్శకుడు దాసరి చెప్పినట్టు బుద్ధిగా ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణంరాజుకు కాఫీ ఇస్తుంది. ‘గుండమ్మ కథ’ (1962) ‘స్త్రీల పొగరు అణచడం’ అనే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు ఇచ్చింది. ఈ సక్సెస్ఫుల్ సినిమా స్త్రీలకు బాగా అపకారం చేసిందని చెప్పవచ్చు. ఇందులో గుండమ్మ కూతురు జమున చేసిన తప్పు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె కొంచెం పెంకిగా ఉంటుంది అంతే. గారాబంగా ఉంటుంది. ‘బాధ్యత తెలియకుండా’ ఉంటుంది. దాంతో ఎస్.వి.రంగారావు, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి మహామహులు కలిసి ఆమె ‘పొగరు’ అణచడానికి నాటకాలు ఆడతారు. ఏడ్పిస్తారు. మట్టి పని చేయిస్తారు. బెంబేలెత్తిస్తారు. ఇన్ని చేసేది ఆమె ‘భర్త పట్ల చూపాల్సిన అణకువ’ను అలవర్చుకోవడం కోసం. తెలుగు సినిమా అత్తలతో పందెం కాసే అల్లుళ్లతో, తల ఎగరేసే అలాంటి అత్తల కుమార్తెల ‘పీచమణిచే’ హీరోలతో నేటికీ వర్థిల్లుతోంది. తెలుగు హీరోకి ఏ స్త్రీ ఎదురు కారాదు... అయితే ఆమెను ‘దారికి తెస్తాడు’. ‘నరసింహ’లో రజనీకాంత్ రమ్యకృష్ణను తెచ్చినట్టు. అయితే తెలుగు సినిమా ఎప్పుడూ స్త్రీల పట్ల పూర్తి అసున్నితంగా లేదు. అప్పుడప్పుడు సదుద్దేశాల వల్ల కావచ్చు.. ట్రెండ్ కోసం కావచ్చు స్త్రీల సమస్యను పట్టించుకుంది. ‘కట్నం’ సమస్యను తెలుగు సినిమా చర్చించింది. ఎన్.టి.ఆర్ స్వయంగా ‘వరకట్నం’ (1969) తీశారు. ‘శుభలేఖ’ (1982), ‘శ్రీకట్నలీలలు’ (1985), ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984), ‘రాఖీ’ (2008) తదితరం ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్లకు బుద్ధి చెప్పే ‘న్యాయం కావాలి’ (1981), ‘మౌన పోరాటం’ (1989) సినిమాలు ఉన్నాయి. వ్యభిచార సమస్యను ‘పూజకు పనికి రాని పువ్వు’ (1986), ‘నేటి భారతం’ (1983)లో చూపారు. ‘అనుమానం’ను ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘ముత్యాల ముగ్గు’ (1975) తదితర సినిమాలలో, లైంగిక దోపిడిని ‘దాసి’ (1988), గృహహింసను ‘ఆడదే ఆధారం’ (1986), ఇంటి చాకిరీని ‘అమ్మ రాజీనామా’ (1991), రేప్‌ను ‘శ్రీకారం’ (1996) ... ఇవన్నీ తప్పక ప్రస్తావించాలి. అయితే పురుషులు పురుషులతో స్త్రీల తరఫున చేసిన సంభాషణలే ఇవన్నీ ఎక్కువగా. స్త్రీలు గట్టిగా చేసిన స్టేట్మెంట్ కాదు. స్త్రీలు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చే సందర్భం ఇంకా తెలుగులో రాలేదు. స్త్రీలు లీడ్‌రోల్స్ చేయడానికి వెనుకాడతారు తెలుగులో. ఒక్కసారి వారు తమ భుజాల మీద సినిమా మోస్తారన్న ఇమేజ్ వస్తే వారి పక్కన హీరోలు చేయరు. గతంలో చాలామంది హీరోయిన్లు అలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడూ పడుతున్నారు. స్త్రీలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులుగా, న్యాయవాదులుగా, కలెక్టర్లుగా, సంఘ సేవకులుగా కొన్ని అన్యాయాలను గొప్పగా ఎదిరించిన సినిమాలు తెలుగులో ఉన్నాయి. వాటితో సమాజానికి పేచీ లేదు. కాని స్త్రీల తరఫున స్త్రీలు మాట్లాడినప్పుడే పేచీ. అందుకు ఇంకా స్పేస్ రాలేదు. స్త్రీలు కుటుంబాలను గౌరవించం అనడం లేదు. స్త్రీలుగా తమ బాధ్యతలను విస్మరించం అనడం లేదు. పురుషులకు–స్త్రీలకు ఇల్లు సమానమే. కాని పెంపకంలో, చదువులో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ స్థలాలలో, నిర్ణయాత్మక రాజకీయ పదవులలో, ఉనికిలో, అస్తిత్వంలో, అందచందాల నిర్వచనాలలో, గౌరవంలో సరి సమాన దృష్టికోణం, సరి సమాన వేదిక గురించి వారు మాట్లాడాల్సింది చాలా ఉంది సినిమాలలో. ‘చైల్డ్ అబ్యూజ్’, ‘మేరిటల్ రేప్’, ‘అంగీకార శృంగారం’, ‘జీవిత భాగస్వామి ఎంపిక’, ‘పిల్లల్ని కనే/వద్దనుకునే హక్కు’, ‘అబార్షన్’, ‘సెక్సువల్ హరాస్మెంట్’ వీటి గురించి తెలుగు సినిమా ఎంతో మాట్లాడాల్సి ఉంది. కాస్త ఆత్మవిశ్వాసం చూపి తమ టర్మ్స్ ప్రకారం తాము ఉంటూ అబ్బాయిలు గౌరవంగా, ప్రేమగా తమకు దగ్గరయ్యే అమ్మాయిల పాత్రలు ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘పెళ్లిచూపులు’, ‘ఫిదా’ తదితర సినిమాలలో కనిపించాయి. ‘ఫిదా’లో అమ్మాయి కోసమే అబ్బాయి అమెరికా వదిలి వస్తాడు. ఇది అరుదైన జెస్చర్. అన్ని జీవన, సంఘిక సందర్భాలను స్త్రీ వైపు నుంచి తిరగేస్తే ఇలాంటి జెస్చర్స్ ఇవ్వాల్సిన కథలు ఎన్నో వస్తాయి. వాటిని తెలుగు తెర ఇంకా పట్టుకోవాల్సి ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
వినూత్నం.. ప్రపంచంలోనే మొదటిసారి
సాక్షి, విజయవాడ: మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మహిళలకు చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం వైఎస్ జగనేనని తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మహిళా చైతన్యం కోసం దిశ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. మహిళల భద్రతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. (చదవండి: ‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం) ప్రపంచంలోనే మొదటిసారి... కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మహిళల కోసం వినూత్నంగా వంద రోజుల కార్యచరణ ప్రపంచంలోనే మొదటిసారి అని, మహిళా కమిషన్ నిర్ణయం మహిళల సాధికారతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మహిళలకు అందేలా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జాయింట్ కలెక్టర్ మాధవీలత అన్నారు. మహిళలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు చాలా జరగాలని జేసీ కోరారు. -
ఎకరంలో 8 రకాల కూరగాయలు
సేంద్రియ బహుళ పంటల పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ. సేంద్రియ ఎరువులు, జీవామృతంను ఉపయోగిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి 3 లక్షల రూపాయల దిగుబడిని సాధిస్తూ ఆదర్శంగా నిలిచింది ఈశ్వరమ్మ. రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కల్లెం భీమలింగం – ఈశ్వరమ్మ దంపతులు ఐదు సంవత్సరాల క్రితం అదే మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి వలస వెళ్లారు. డ్రిప్ డీలర్ అయిన భీమలింగం ఇస్కిళ్ల – ఉత్తటూరు గ్రామాల మధ్య 3.29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని సాగు చేసే బాధ్యతను భార్య ఈశ్వరమ్మకు అప్పగించాడు. నిరక్ష్యరాస్యులైన ఈశ్వరమ్మ భర్త ప్రోత్సాహంతో నాబార్డు వారు పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులకు హాజరై వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నది. పంటల సాగుపై అవగాహన తరగతులు బోధించే రమేష్ ప్రోత్సాహంతో బహుళ పంటల విధానంలో కూరగాయలను సాగు చేయడం ప్రారంభించింది. తమ వ్యవసాయ భూమిలో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును పొలంలో చల్లి మెత్తగా దున్నించి ట్రాక్టర్‌తోనే 4 అడుగుల ఎడంలో బోదెలు(మట్టి కట్టలు) పోయించారు. ఐదు వరుసలకు ఒక పంట చొప్పున మిర్చి, వంకాయ, కాకర, టమాట, బీర, సొర, దోస, బంతి వంటి ఎనిమిది రకాల కూరగాయలను సాగు చేశారు. హైదరాబాద్‌లోని నర్సరీల నుంచి తెచ్చిన నారు, విత్తనాలు విత్తారు. భూమిలో తేమ తొందరగా ఆవిరైపోకుండా, కూరగాయలు నేలను తాకి చెడిపోకుండా, మొక్కలకు వైరస్ సోకకుండా ఉండేందుకు బోదెలపై మల్చింగ్ షీట్‌ను పరిచారు. డ్రిప్‌ను అమర్చి మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. తీగ జాతి మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు, కాయల బరువుకు మొక్కలు నేలను తాకకుండా ఉండేందుకు గాను వెదురు బొంగులను నాటి బైండింగ్ వైరుతోపాటు, సుతిలి తాడును అల్లారు. ప్రతీ ఐదు బోదెలకు ఒక వరుసతో పాటు, పొలం చుట్టూ బంతి పూల మొక్కలు పెట్టారు. కూరగాయల మొక్కలకు వచ్చే చీడపీడలను ముందుగానే బంతి మొక్కల ద్వారా గుర్తించి కషాయాలను పిచికారీ చేస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. కూరగాయల రకాన్ని బట్టి నాటిన నలభై ఐదు రోజుల నుంచి తొమ్మిది నెలల వరకు పంట దిగుబడి వస్తుంది. ఏదేని ఒక రకం పంట కాలం ముగియగానే.. చదును చేసి బోదెలు పోసి పంట మార్పిడి చేసి.. మరో రకం కూరగాయ మొక్కలు నాటుతున్నారు. పండించిన కూరగాయలను తమ టాటాఏస్ వాహనంలో తీసుకువెళ్లి పరిసర గ్రామాల్లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముతుండటం విశేషం. ఈ విధంగా సంవత్సరానికి రూ. 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను రూ. రెండు లక్షల వరకు నికరాదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఈశ్వరమ్మ తెలిపారు. సేంద్రియ పద్దతుల్లో కూరగాయలను సాగు చేస్తూ నేరుగా ప్రజలకు విక్రయిస్తున్న ఈశ్వరమ్మ గత ఏడాది జిల్లా స్థాయిలో ఉత్తమ మహిళా రైతుగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును పొందింది. గత అక్టోబర్‌లో నాబార్డు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సేంద్రియ పంటల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈశ్వరమ్మ ఒక్కరికే స్టాల్‌ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఈశ్వరమ్మ సేంద్రియ కూరగాయల స్టాల్‌ను సందర్శించి, ఆమె కృషిని అభినందించారు. (ఈశ్వరమ్మ భర్త భీమలింగంను 96668 46907 నంబరులో సంప్రదించవచ్చు) – కనుతాల శశిధర్‌రెడ్డి, సాక్షి, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
అంతటితో ‘ఆగ’లేదు!
‘పత్తి పండే వరకు అదే పని. సంక్రాంతి వెళ్లిన తర్వాత కూరగాయలు, ఆకుకూరలు పండిస్తా. బండి (మోపెడ్) మీద ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటా. ఇంకా ఖాళీ ఉంటే కూలి పనికి వెళ్తా. కాయకష్టంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నా. ఏ పంట టైములో ఆ పని చేస్తా.. పిల్లలను పోషించుకోవాలి, పెళ్లిళ్లు చేయాలి కదా.. ఎవరికీ భయపడనవసరం లేదు. మనమేమీ తప్పు చేస్తలేం కదా అని మా ఆయన చెప్పిన మాటలను ప్రతి రోజూ గుర్తుచేసుకుంటున్నా..’ ఇదీ ఒంటరి మహిళా రైతు తనుగుల ఆగమ్మ మనసులో మాట. జీవితంలో కష్టాలు కట్టగట్టుకొని ఎదురొచ్చినా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడి, దృఢచిత్తంతో ముందడుగు వేస్తోంది. ఆగమ్మ ములుగు జిల్లా బండారుపల్లిలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. చదువుకోలేదు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన పేద రైతు తనుగుల కుమారస్వామితో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు ముగ్గురు ఆడ పిల్లలు.. ఆమని, కావ్య, శ్రావణి. వాళ్లకు చిన్న పెంకుటిల్లుతో పాటు ఎకరం 30 గుంటల (ఎకరం 75 సెంట్లు) భూమి ఉంది. వర్షాధార వ్యవసాయమే. భార్యా భర్తలిద్దరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. మోపెడ్‌పై వెళ్తున్న కుమారస్వామిని రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. భర్త హఠాన్మరణం ఆగమ్మ ఆశలు చెదిరిపోయాయి. అయినా, పిల్లలను గుండెలకు హత్తుకొని దుఃఖాన్ని దిగమింగుకుంది. తనకు తానే ధైర్యం చెప్పుకొని మొక్కవోని ధైర్యంతో నిలబడింది. వ్యవసాయం కొనసాగిస్తూ కాయకష్టంతో పిల్లలను అన్నీ తానే అయి పోషించుకుంటున్నది. అన్నదమ్ములు లేకపోవడంతో.. వృద్ధులైన తల్లిదండ్రులను అవివాహితగా ఉండిపోయిన సోదరి పోషిస్తున్నది. దీంతో ఆగమ్మ పిల్లలతోపాటు మెట్టినింటిలోనే ఉండిపోయింది. సొంత భూమితో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని మరీ పత్తి, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. తన పొలంలో ఏ పనీ లేకపోతే కూలికి వెళ్తుంది. రూపాయికి రూపాయి కూడబెట్టి ఎవరిపైనా ఆధారపడకుండా గత ఏడాది పెద్ద కుమార్తె ఆమనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. రెండో బిడ్డ కావ్య ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. చిన్న కుమార్తె శ్రావణి ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి లేకపోయినా ఆగమ్మ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది. సొంత కష్టం.. సొంత మార్కెటింగ్.. కుటుంబ పెద్దగా, తల్లిగా, రైతుగా ఆగమ్మ విజయపథంలో పయనిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ విజయం వెనుక మొక్కవోని దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణతోపాటు చక్కని వ్యవసాయ ప్రణాళిక కూడా ఉంది. తన వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతులు చాలా మంది పత్తి, మొక్కజొన్న , పసుపు వంటి పంటలతో సరిపెట్టుకుంటూ ఉంటే.. ఆగమ్మ అంతటితో ఆగలేదు. ఆదాయం కోసం పత్తి, మొక్కజొన్నతో పాటు కుటుంబ పోషణ కోసం, అనుదిన ఆదాయం కోసం కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా, ధీమాగా జీవిస్తోంది. ఈ ఏడాది కౌలు భూమి రెండెకరాల్లో పత్తిని వర్షాధారంగా సాగు చేసింది. రూ. 70 వేలు ఖర్చు చేసి 12 క్వింటాళ్ల దిగుబడి తీసింది. పత్తిని రూ. లక్షకు అమ్మింది. ఎకరంలో మొక్కజొన్న, 30 గుంటల్లో పసుపు సాగు చేస్తోంది. పత్తి పంట అయిపోయిన తర్వాత 10 గుంటల (25 సెంట్ల) భూమిలో టమాటోలు, పాలకూర, కొత్తిమీర బావి కింద సాగు చేస్తోంది. ఎరువులు వేయటం, పురుగుమందు కొట్టడం, కలుపు తీయటం.. వంటి అన్ని పనులూ తానే చేసుకుంటుంది. టమాటోలు 15 రోజుల్లో కాపు మొదలవుతుంది. నెల రోజుల్లో చేతికొచ్చే పాలకూర, కొత్తిమీరతో నిరంతర ఆదాయం పొందుతోంది. ఆకుకూరలు, కూరగాయలను పండించడం తానే స్వయంగా ఊళ్లు, ఇళ్ల వెంట తిరిగి అమ్ముకుంటుంది. ద్విచక్రవాహనం(మోపెడ్)ను నడుపుకుంటూ వెళ్లి ఏ పూటకు ఆ పూట తాజా ఆకుకూరలు అమ్ముతుంది. కిలో కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) రూ. వందకు కొనితెచ్చి విత్తుకొని రూ. రెండు నుంచి మూడు వేలు ఆదాయం పొందుతున్నానని, తాము ఇంట్లో వండుకోవడానికీ కూరగాయల కొరత లేదని సంతోషంగా చెప్పింది ఆగమ్మ. దురదృష్టవశాత్తూ భర్తలను కోల్పోయిన మహిళా రైతులే ఇంటి పెద్దలై వ్యవసాయాన్ని, కుటుంబాన్నీ సమర్థవంతంగా నడుపుతున్న ఎందరో మహిళల గుండె ధైర్యానికి చక్కని ప్రతీకగా నిలిచిన ఆగమ్మ(90142 65379)కు మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ జేజేలు! ఇటువంటి క్రమశిక్షణ గల రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పితే వారి జీవితాలు మరింత జీవవంతమవుతాయి!! – పోలు రాజేష్‌కుమార్, సాక్షి, ఆత్మకూరు, వరంగల్ రూరల్ జిల్లా -
రైతు రాణులకు జేజేలు!
మన దేశంలోని రైతు కుటుంబాల్లో 80–85% వరకు ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని జీవనం సాగించే ఈ వ్యవసాయ కుటుంబాల్లో పురుషుల కన్నా మహిళా రైతుల శ్రమే అధికం. దీక్షగా, క్రమశిక్షణగా వ్యవసాయం చేస్తూ అరకొర వనరులతోనే చక్కని ఫలితాలు సాధిస్తూ కుటుంబాల అభ్యున్నతికి అహరహం కృషి చేస్తున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోబలంతో నిలబడి వ్యవసాయాన్నే నమ్ముకొని కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ఈ ధీర వనితలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ‘మీ మిరప పంటలో తాలు కూడా లేదమ్మా..’ మిర్చి పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించటం సహజం. నారు వేసిన దగ్గర్నుంచి మిర్చి కోతలు కోస్తున్నంత వరకు దాడి చేస్తుంటాయి. ఒక పురుగుమందు పనిచేయకపోతే మరొకటి వాడుతూ రసాయన మందులతో రైతులు ఒక రకంగా యుద్ధమే చేస్తారు. అటువంటిది ఎలాంటి పురుగుమందులూ వాడకుండా కేవలం కషాయాలతోనే మిర్చిని పండించాలని చూసిన మహిళా రైతును, తోటి రైతులు ఎగతాళి చేశారు. మందులు కొట్టకుండా పంట ఎట్లా తీస్తావు? అంటూ ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని ఆచరించిన ఆ రైతు చేలో మిరప విరగపండింది. అంతర పంటలతోనూ ఆదాయాన్ని తీశారు. నాడు నవ్విన రైతులే ఇప్పుడు ‘తాలు కూడా లేదమ్మా మీ పంటలో...’ అంటూ ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి ప్రపంచ బ్యాంకు బృందం సహా ఆ మిరప చేనును సందర్శించారు. శభాష్... అంటూ అభినందించారు. మిర్చి పంట సాగులో అద్భుత విజయం సాధించిన ఆ మహిళా రైతే పరమాత్ముల కోటేశ్వరమ్మ. గుంటూరు జిల్లా పెదనందిపాడు దగ్గర్లోని కొప్పర్రు. జిల్లాకు తలమానికమైన మిర్చిని కోటేశ్వరమ్మ, భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ నేపధ్యలలో రైతు దంపతులు పట్టుదలతో నూటికి నూరు శాతం రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంలో తొలి కోతకే 12 క్వింటాళ్లు దుక్కిన దున్ని ఘన జీవామృతం వేయడంతో ఆరంభించి, బీజామృతంతో శుద్ధిచేసిన నారును నాటిన దగ్గర్నుంచి ప్రతి దశలోనూ మిరప మొక్కలకు ద్రవ జీవామృతంతో సహా రోగ నిరోధక శక్తికి, దృఢంగా ఉండేందుకు సప్త ధాన్యాంకుర కషాయాన్ని వాడుతూ, వివిధ రకాల కషాయాలతో తెగుళ్లను నిరోధిస్తూ మిర్చిని పండించుకున్నారు. ఎకరం పొలంలో తొలి కోతకే 12 క్వింటాళ్ల మిరప పండ్ల దిగుబడిని తీశారు. చెట్టు నిండుగా కనిపిస్తున్న మిరపకాయ, మరో 13 క్వింటాళ్లు వస్తాయన్న ధీమానిస్తోంది. అందులో వేసిన రకరకాల అంతర పంటలతో మిర్చి చేతికొచ్చేలోగానే దఫాలుగా ఆదాయాన్నీ కళ్ల చూశారు. మిర్చి పంట సాగుకు పెట్టుబడులు రైతులందరికీ సమానమే అయినా, ఎరువులు, పురుగుమందులకే రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులందరూ ఎకరాకు రూ.75 వేలకు పైగా వ్యయం చేస్తే, ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్న కోటేశ్వరమ్మకు కషాయాలు, జీవామృతాల తయారీకి రూ.4,800 మాత్రమే ఖర్చయింది. అయితే, ఆమె మిర్చిని అందరికన్నా ఎక్కువ ధరకే అమ్మారు. రసాయన రహిత పంట తీశామన్న సంతృప్తినీ పొందానని కోటేశ్వరమ్మ అన్నారు. ప్రకృతి వైపు మళ్లించిన పుల్లమజ్జిగ కొప్పర్రు గ్రామంలో మిరప, పత్తి పంటల సాగు అధికం. కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకున్న ఎకరం మెట్ట పొలానికి, మరో ఎకరం కౌలుకు తీసుకుని అవే పంటలు సాగు చేస్తుండేవారు. కొంత భూమిలో బెండకాయ, దోసకాయ వంటి కూరగాయలను పండించేవారు. కలుపు మందులు, పురుగు మందులు చల్లాల్సి వస్తుండేది. ఒక పంట తీసేసరికి రెండెకరాలకు కలిపి రూ.1.20 లక్షల వరకు వీటికే ఖర్చు చేసినట్టయ్యేది. పెట్టుబడికి, ఖర్చులకు పెద్దగా వ్యత్యాసం వుండేది కాదు. తాతలనాటి వ్యవసాయాన్ని వదులుకోలేక, అస్తుబిస్తు సంపాదనతో కొనసాగుతున్న కోటేశ్వరమ్మకు, ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తుండే చిరుద్యోగి ఒకరు చెప్పిన చిట్కాతో తరుణోపాయం కనిపించింది. ఆ ఉత్సాహం ఆమెను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించింది. నాలుగేళ్ల క్రితం చేలోని మిరపకు పండాకు తెగులు ఆశించింది. ఎప్పట్లాగే నివారణ రసాయనిక పురుగు మందుల కోసం చూస్తున్న కోటేశ్వరమ్మకు, ‘పుల్ల మజ్జిగ కొట్టి చూడండి’ అన్న సూచన ఆలోచింపజేసింది. పోయేదేముంది.. పాలు ఖర్చే కదా! అనుకున్నారు. ‘నాలుగు లీటర్ల పాలు తీసుకొచ్చి, కాచి తోడువేశాం.. 5 రోజులు మురగనిచ్చి, నీటితో కలిపి 15 ట్యాంకులు పిచికారీ చేశాం.. కంట్రోలు అయింది... ప్రకృతి వ్యవసాయంపై అలా గురి కుదిరింది’ అని చెప్పారు కోటేశ్వరమ్మ. అదే పురుగుమందులు చల్లితే రూ.1,200 వరకు ఖర్చు. పురుగుమందు చల్లటం వల్ల చేతులు, ఒళ్లు దురదలు, కళ్లు మంటలు ఉండేవన్నారు. ఆ అనుభవంతో ప్రకృతి వ్యవసాయం సత్తా ఏమిటో తెలిసింది. గత మూడేళ్లుగా రసాయన ఎరువులు/ పురుగుమందుల జోలికే వెళ్లకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ‘మేం వేల రూపాయలు ఖర్చుపెట్టి మందులు వాడుతుంటేనే తెగుళ్లు పోవటం లేదు.. ఆకులు, ఎద్దుపేడ, ఆవు మూత్రంతోనే పోతాయా? అంటూ ఊళ్లోని రైతులు ఎకసెక్కంగా మాట్లాడారు.. ఎరువులు వేసిన చేలల్లోలా మొక్కలు గుబురుగా, కంటికి ఇంపుగా ఎదగలేదు. అది చూసి నవ్వారు. ఓపిగ్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చాం. అధిక వర్షాలకు మొక్కలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. మా కష్టం ఫలించింది. చేను అందంగా కనిపించకున్నా, మొక్క మొక్కకు నాణ్యమైన కాయ విరగ కాసింది. మొదట్లో ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీ చేలో తాలు కాయ ఒక్కటీ లేదంటూ మెచ్చుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు కోటేశ్వరమ్మ. మిర్చిలో బంతి, జొన్న, ఉల్లి, ముల్లంగి... గత ఆగస్టు 28న ఎకరంలో మిర్చి నారుతో నాట్లు వేశారు. ఎకరాకు 12 వేల మొక్కలు. సరిహద్దు పంటగా మూడు వైపులా జొన్న, మరోవైపు కంది వేశారు. ఎర పంటగా 400 బంతి మొక్కలు పెంచారు. అంతర పంటలుగా ఒక్కోటి నాలుగు వేల మొక్కలు వచ్చేలా ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర వేశారు. అనుసరించిన పద్ధతులను వివరిస్తూ, ముందుగా ఎనిమిది కిలోల బెల్లం, ఎనిమిది కిలోల శనగపిండి, నాలుగు గుప్పిళ్లు మట్టి, 40 లీటర్ల మూత్రం, 2500 కిలోల కంపోస్టు ఎరువుతో తయారుచేసిన 400 కిలోల ఘనజీవామృతాన్ని చల్లామని కోటేశ్వరమ్మ చెప్పారు. అయిదు కిలోల పేడ, అయిదు కిలోల ఆవు మూత్రం, 20 లీటర్ల నీరు, 15 గ్రాముల సున్నంతో చేసిన బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటాం. అయిదు కిలోల వేపాకు, ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి తయారుచేసిన 100 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేశాం. కిలో పండు మిర్చి రూ. వంద పచ్చళ్లకు అడుగుతున్నారని పండుకాయ వచ్చాక కోత మొదలుపెట్టారు. మార్కెట్లో పండుకాయ కిలో రూ.60 వుంటే కోటేశ్వరమ్మ పొలంలో పండు మిర్చి రూ.100 చొప్పున 1.60 క్వింటాళ్లు అమ్మకం చేశారు. మిగిలిన పంట కోసింది కోసినట్టుగా ఎండబెడుతున్నారు. మొత్తం మీద మరో 13 క్వింటాళ్లు వస్తాయని అంచనాతో ఉన్నారు. అంతర పంటల్లో ముందే పీకిన రూ.1000, బంతి పూలతో రూ.4,000, కొంతభాగం విక్రయించిన ఉల్లితో రూ.2,000, ముల్లంగితో మరో రూ.2,000 ఆదాయం సమకూరింది. ప్రకృతి వ్యవసాయం, అంతర పంటలు ఆదాయాన్నిస్తూ ఉంటే.. భూమిని నమ్ముకున్నందుకు నిశ్చింతగా అనిపిస్తోంది.. సమాజానికి ఆరోగ్యకర పంటలు అందిస్తున్నామన్న భావన తమకెంతో సంతృప్తినిస్తున్నదని కోటేశ్వరమ్మ సంతోషంగా చెప్పారు. కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చాకిరీ మాత్రం చేసుకోవాల్సిందేనన్నారు. భర్తతో కలిసి ప్రతి రోజూ ఆరింటికల్లా పొలంలో దిగి, సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటున్నానన్నారు. వళ్లు మంటలు.. కళ్లు మంటలు లేవు.. మూడేళ్ల నుంచి (రసాయనిక) మందుల్లేకుండా పట్టుదలగా పంటలు పండిస్తున్నాం. ఈ విషయం ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలిసి వచ్చి చూసెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఆ ఏముందిలే అన్న ఊహలో ఉన్నారు. ఇప్పుడు పొలంలోకి వచ్చి ఏమి వేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూస్తున్నారు. మందుల్లేని పండు మిరప కాయలకు ఈ ఏడు చాలా గిరాకీ వచ్చింది. ఎండు మిరపకాయలకు కూడా ముందే ఆర్డర్లు వస్తున్నాయి. ఎకరం కౌలు రూ. 30–40 వేలు కావటంతో ఇతర రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి వెనకాడుతున్నారు. సొంత చేనే కదా అని మేం పట్టుదలతో చేస్తున్నాం. ఎకరానికి ఎరువులు, పురుగుమందులకే రూ. 60–70 వేలు ఖర్చు చేస్తున్నారు. మాకు గత ఏడాది జీవామృతానికి, కషాయాలకు 4 వేలు ఖర్చయింది. మందులు కొట్టే వాళ్లకు, నీళ్లు పోసే వాళ్లకు వళ్లు మంటలు, కళ్లు మంటలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. అయితే, కషాయాల తయారీలో వాసనలు, చాకిరీ గురించి కొందరు ఇబ్బంది పడుతున్నారు. మిషన్లు వస్తే సులభంగా ఉంటుంది. భూమి బాగు కోసం, ఆరోగ్యం కోసం ఒకరు అడుగేస్తే కదా.. పది మందీ నడిచేది.. అని మేం డీపీఎం రాజకుమారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పంటను అమ్ముకోవటంలో అంత ఇబ్బందేమీ లేదు. – పరమాత్ముల కోటేశ్వరమ్మ(63013 51363), మహిళా రైతు, కొప్పర్రు, గుంటూరు జిల్లా కల్లెం ఈశ్వరమ్మ తనుగుల ఆగమ్మ భర్త వేంకటేశ్వరరావుతో కలిసి కళ్లంలో మిరప పండ్లను ఎండబోస్తున్న కోటేశ్వరమ్మ – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
సోషల్ మీడియా స్టార్స్
సామాజిక మాధ్యమాలలోనూ మహిళలు రాణిస్తున్నారు. వాస్తవానికి మగవాళ్ల కంటే కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్, టిక్ టాక్‌లలో తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. స్టార్లుగా వెలిగిపోతున్నారు. ఆ స్టార్లలో సెలబ్రిటీలు ఉన్నారు. సామాన్యులూ ఉన్నారు. టాప్ యూట్యూబర్: నిషామధులిక ఫాలోవర్స్.. 7 కోట్ల 65 లక్షల మంది (7.65 మిలియన్) మా కె హాత్ కా ఖానా (అమ్మ చేతి వంట) ఈ చానెల్‌ను అందిస్తున్న షెఫ్ నిషా మధులిక. స్వస్థలం ఉత్తరప్రదేశ్. మొదట.. చిన్నప్పుడెప్పుడో తల్లి దగ్గర నేర్చుకున్న ఉల్లి, వెల్లుల్లి లేని శాకాహార వంటకాలను ఓ వెబ్‌సైట్‌కు రాసేవారు. మంచి స్పందన రావడంతో భర్త, కొడుకు సహాయంతో తనే సొంతంగా http://nishamadhuli ka.com/ అనే వెబ్సైట్ పెట్టారు. దానికీ డిమాండు మొదలవడంతో 2016లో యూ ట్యూబ్‌లో వంటల చానెల్ స్టార్ట్ చేశారు నిషా మధులిక. ఆమె వంట చేస్తూ ఆ రెసిపీని హిందీలో వివరిస్తూంటే ఆమె భర్త వీడియో తీసి చానెల్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పటి వరకు ఉల్లి,వెల్లుల్లి కూడా లేని దాదాపు పన్నెండు వందల శాకాహార వంటకాలను తన యూట్యూబ్ వంటల చానెల్లో అప్లోడ్ చేశారు నిషా మధులిక. యూత్, కొత్తగా పెళ్లయిన జంటలు మొదలు వర్కింగ్ విమెన్ చానెల్ సబ్‌స్క్రైబర్స్‌లో ముఖ్యులు. ట్విట్టర్ ఫేమ్: దీపికా పదుకోణ్ ఫాలోవర్స్.. 1 కోటి 39 లక్షల మంది (13. 9 మిలియన్) ఆమె ఫాలోవర్స్‌ను పెంచిన ట్వీట్..YES!I am a Woman.I have breasts AND a cleavage! You got a problem!!?? ఎంత అమాయకమో.. అంతే బోల్డ్నెస్. ‘అవును.. నేను స్త్రీని. కాబట్టే స్త్రీకి ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మీకేమన్నా ప్రాబ్లమా?’ అంటూ ట్విట్టర్లో పెట్టింది. ఆమె ధైర్యాన్ని అభిమానులు సరే.. మహిళలు, సినిమా ఇండస్ట్రీలోని మహామహులంతా కొనియాడారు పడుకోణ్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇన్‌స్టా క్వీన్: ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోలోవర్స్.. 49.9 మిలియన్ (4 కోట్ల 99 లక్షలు) పీసీ అని ప్రేమగా పిలుచుకునే అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. పాప్ గాయనిగా పాశ్చాత్యులకూ పరిచయమయ్యారు. అక్కడి టెలివిజన్ సిరీస్‌లో నటనతోనూ వాళ్లను మెప్పించారు. తన మీద మనసు పారేసుకున్న పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడారు. ఆ ముచ్చట్లను ఫోటోగ్రాఫ్లుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్నూ తన అకౌంట్‌కు కట్టిపడేస్తున్నారు. ఇన్‌స్టా క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ లేడీ.. నిషా గురగైన్ ఫాలోవర్స్.. 21.7 మిలియన్ (2 కోట్ల 17 లక్షలు) నిషా గురగైన్ పుట్టిపెరిగింది నేపాల్‌లో. సినిమాల్లో అవకాశాలను వెదుక్కుంటూనే సోషల్ మీడియాలో ప్రతిభను ప్రదర్శించింది ఈ అమ్మాయి. బాలీవుడ్ కంటే ముందు టిక్ టాక్‌లో స్టార్ అయింది. ‘ముఝే యాద్ హై ఆతా తెరీ వో నజ్రే మిలానా’ అనే పాటకు ఆమె లిప్ సింగ్ చేస్తూ అభినయించిన తీరు వైరలై.. లక్షల్లో లైక్స్ తోడై టిక్ టాక్ స్టార్‌ను చేసింది. వ్యూస్‌ను, షేర్స్‌ను సంపాదించి పెట్టింది. -
మన క్రికెట్ మహిళా సైన్యం...
భారత మహిళలు గర్జించే రోజు వచ్చేసింది. కంగారూ జట్టును కంగారెత్తించి తొలిసారి విశ్వకిరీటం సొంతం చేసుకునేందుకు భారత బృందం విజయం దూరంలో ఉంది. లీగ్ దశ నుంచి అజేయంగా దూసుకుపోతున్న 15 మంది సభ్యుల భారత్ బృందంలో 9 మంది భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. స్మృతి మంధాన అనారోగ్యం కారణంగా 3 మ్యాచ్‌లకే పరిమితమవగా, ఆమె స్థానంలో రిచా ఘోష్ ఆడింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆమె స్థానంలో స్పిన్నర్ రాధా యాదవ్‌కు మరో 2 మ్యాచ్‌లలో అవకాశం కల్పించారు. ఇద్దరు ప్లేయర్లు హర్లీన్ డియోల్, పూజ వస్త్రకర్లకు మాత్రం మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జగజ్జేతగా నిలిచేందుకు గెలుపు దూరంలో ఉన్న భారత బృందానికి సంబంధించిన క్లుప్త సమాచారం... హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్, బ్యాటర్) వయసు: 31 ఏళ్లు స్వస్థలం: మోగా (పంజాబ్) అనుభవం: 113 టి20లు (2009లో అరంగేట్రం) విశేషాలు: 2016 నుంచి జట్టు సారథిగా ఉంది. గత టి20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ వెళ్లినప్పుడు కూడా కెప్టెన్‌గా వ్యవహరించింది. స్మృతి మంధాన (బ్యాటర్) వయసు: 23 ఏళ్లు స్వస్థలం: సాంగ్లి (మహారాష్ట్ర) అనుభవం: 74 టి20లు (2013లో అరంగేట్రం) విశేషాలు: జట్టులో టాప్ బ్యాటర్. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన అనుభవముంది. జెమీమా రోడ్రిగ్స్ (బ్యాటర్) వయసు: 19 ఏళ్లు స్వస్థలం: ముంబై అనుభవం: 43 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: జట్టులో ప్రధాన బ్యాటర్. దేశవాళీ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత. గత ప్రపంచకప్‌లో స్టాండవుట్ ప్లేయర్‌గా ఎంపిక. తానియా భాటియా (వికెట్‌కీపర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: చండీగఢ్ అనుభవం: 49 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: 13 ఏళ్లకే పంజాబ్ సీనియర్ టీమ్‌లో ఆడింది. కీపింగ్ నైపుణ్యంతో జట్టులో రెగ్యులర్ సభ్యురాలు. శిఖా పాండే (పేస్ బౌలర్) వయసు: 31 ఏళ్లు స్వస్థలం: గోవా అనుభవం: 49 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: ఈ ప్రపంచకప్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా కీలక పాత్ర పోషించింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేస్తోంది. పూనమ్ యాదవ్ (లెగ్‌స్పిన్నర్) వయసు: 28 ఏళ్లు స్వస్థలం: ఆగ్రా (ఉత్తర ప్రదేశ్) అనుభవం: 66 టి20లు (2013లో అరంగేట్రం) విశేషాలు: ఈ ఏడాది బీసీసీఐ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక. గుగ్లీలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే నైపుణ్యం సొంతం. అరుంధతి రెడ్డి (పేసర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: హైదరాబాద్ అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: తెలుగు రాష్ట్రాలనుంచి భారత జట్టులో ఉన్న ఏకైక ప్లేయర్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాణించింది. హర్లీన్ డియోల్ (ఆల్‌రౌండర్) వయసు: 21 ఏళ్లు స్వస్థలం: చండీగఢ్ అనుభవం: 6 టి20లు (2019లో అరంగేట్రం) విశేషాలు: దూకుడులో జూనియర్ హర్మన్‌గా గుర్తింపు ఉంది. దేశవాళీలో హిమాచల్‌కు ఆడుతుంది. వరల్డ్‌కప్‌లో మ్యాచ్ దక్కలేదు షఫాలీ వర్మ (బ్యాటర్) వయసు: 16 ఏళ్లు స్వస్థలం: రోహ్టక్ (హరియాణా) అనుభవం: 18 టి20లు (2019లో అరంగేట్రం) విశేషాలు: సంచలన ప్రదర్శనతో ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్. ఈ టోర్నీలో భారత టాప్ స్కోరర్. దీప్తి శర్మ (ఆల్‌రౌండర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: ఆగ్రా (ఉత్తరప్రదేశ్) అనుభవం: 47 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: వన్డేల్లో ప్రపంచ రికార్డు పార్ట్నర్షిప్లో భాగస్వామి. వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (188) సాధించిన ఘనత. వేద కృష్ణమూర్తి (బ్యాటర్) వయసు: 27 ఏళ్లు స్వస్థలం: చిక్‌మగళూరు (కర్ణాటక) అనుభవం: 75 టి20లు (2011లో అరంగేట్రం) విశేషాలు: దూకుడుగా ఆడగల సమర్థురాలు. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు. కరాటేలో బ్లాక్‌బెల్ట్ కూడా. రాధ యాదవ్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వయసు: 20 ఏళ్లు స్వస్థలం: ముంబై అనుభవం: 34 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: నిలకడగా వికెట్లు తీసే బౌలర్. కూరగాయలు అమ్మే తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. రాజేశ్వరి గైక్వాడ్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వయసు: 28 ఏళ్లు స్వస్థలం: బిజాపూర్, కర్ణాటక అనుభవం: 27 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: నాలుగు మ్యాచుల్లోనూ రాణించింది. భారత్ తరఫున వన్డే వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన రికార్డు. రిచా ఘోష్ (బ్యాటర్) వయసు: 16 ఏళ్లు స్వస్థలం: సిలిగురి (పశ్చిమ బెంగాల్) అనుభవం: 2 టి20లు (ముక్కోణపు టోర్నీలో అరంగేట్రం చేసి, ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్ ఆడింది) విశేషాలు: దూకుడుగా ఆడగల మరో టీనేజర్. పూజ వస్త్రకర్ (పేసర్) వయసు: 20 ఏళ్లు స్వస్థలం: షహ్దోల్ (మధ్య ప్రదేశ్) అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా... వరుస గాయాలతో కెరీర్ నిలకడగా సాగలేదు. గత ప్రపంచకప్ ఆడింది. -
ఆల్ ద బెస్ట్ హర్మన్
క్రికెట్ మగవాళ్ల ఆట అని అనేవాళ్లు ఇప్పుడు జంకుతున్నారు. స్టేడియంలో స్త్రీలు కొడుతున్న సిక్సర్లు అలా ఉన్నాయి. మహిళా క్రికెట్ దినదినప్రవర్థమానమవుతోంది. సంప్రదాయ ఆటను దాటి టి20 స్థాయికి ఎదిగింది. పది దేశాల మహిళలు ప్రపంచ కప్ కోసం తలపడనున్నారు. వారు ఒకరితో ఒకరు పోటీ పడినా అందరూ కలిసి రుజువు చేయాలనుకుంటున్నది మాత్రం ‘క్రికెట్ మా ఆట కూడా’ అని చెప్పడమే. మహిళలను ‘ఆకాశంలో సగం’... అంటుంటారు. కానీ ఆదరణ విషయంలో, ఆర్థిక అంశాల్లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఎంతో వివక్ష ఉంది. అయితే పురుష క్రికెటర్లకు దీటుగా తామూ మెరిపించగలమని, ధనాధన్ ఆటతో మైదానాన్ని దద్దరిల్లచేయగలని నిరూపించడానికి మహిళా క్రికెటర్లు అమితోత్సాహంతో వేచి చూస్తున్నారు. వారందరికీ ఆస్ట్రేలియా వేదిక కానుంది. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో మహిళల టి20 ప్రపంచకప్ మొదలుకానుంది. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్ అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న విఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇప్పటికే టైటిల్ వేట కోసం 10 జట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారత మహిళల జట్టు మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకుంది. మూడుసార్లు సెమిస్లోకి 11 ఏళ్ల క్రితం 2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ జరిగింది. తర్వాతి ఏడాది రెండోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. 2012 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు టి20 ప్రపంచకప్‌లలో భారత్ మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. హర్మన్ పంజా వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతోన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనుభవం ఈసారి జట్టుకు పెద్ద అనుకూలాంశం. టీనేజర్‌గా 2009లో తొలి వరల్డ్ కప్ ఆడిన ఈ పంజాబీ అమ్మాయి ఇప్పుడు జట్టులో సీనియర్ సభ్యురాలిగా మారిపోయింది. 30 ఏళ్ల హర్మన్‌ప్రీత్ వరుసగా రెండో ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ధనాధన్ ఆటకు పెట్టింది పేరైన హర్మన్ క్రీజులో నిలదొక్కుకొని బ్యాట్ ఝళిపించిందంటే స్కోరు బోర్డుపై పరుగుల వరద పారాల్సిందే. 2018 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 103 పరుగులు చేసింది. టి20ల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా కెరీర్లో 109 టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న హర్మన్ 2,156 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫీల్డర్‌గా 42 క్యాచ్‌లు పట్టిన హర్మన్ బంతితోనూ మెరిసి 29 వికెట్లు పడగొట్టింది. గత ప్రపంచకప్‌లో దొర్లిన పొరపాట్లను పునరావృతం చేయకుండా... పక్కా ప్రణాళికతో ఆడి... హర్మన్ నాయకత్వానికి ఇతర సభ్యుల ప్రతిభ తోడైతే భారత్ ఈసారి అద్భుతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాన్న ప్రోత్సాహం.. 1989లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో మార్చి 8న జన్మించిన హర్మన్‌కు క్రికెట్ కష్టాలేవీ లేవనే చెప్పాలి. హర్మన్ తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ తనూ క్రికెటర్ కావడంతో కూతురు ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. హర్మన్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో స్థానిక కోచ్ కమల్దీష్ సింగ్ కూడా కీలకపాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణించి 19 ఏళ్లకే భారత సీనియర్ జట్టులో చోటు పొందిన హర్మన్ ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ హోదాలో ప్రస్తుతం జట్టును ముందుండి నడిపించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. బంతిని చూడటం... బలంగా బాదడమే హర్మన్‌కు తెలిసిన విద్య. భారత మాజీ ఓపెనర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వీరాభిమాని అయిన హర్మన్.. 2017 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై (115 బంతుల్లో 171 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది. తలో చేయి వేస్తేనే.. జట్టు క్రీడ అయిన క్రికెట్లో ప్రతిసారీ ఒకరిద్దరి ప్రతిభ కారణంగా గెలవలేం. భారత మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా అవతరించాలంటే ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్‌కు ఆమె సహచరులు కూడా తమ నైపుణ్యంతో తోడ్పాటు అందించాల్సిందే. ముందుగా ఓపెనర్లు స్మృతి మంధాన, 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చి గట్టి పునాది వేస్తే... ఆ తర్వాత 19 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ తదితరులు ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఇక బౌలింగ్‌లో సీనియర్ పేసర్ శిఖా పాండే, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, పూజ వస్త్రకర్, స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ విజృంభిస్తే భారత్ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు. ఏ జట్టు కెప్టెన్ ఎవరంటే... ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ న్యూజిలాండ్: సోఫీ డివైన్ శ్రీలంక: చమరి ఆటపట్టు బంగ్లాదేశ్: సల్మా ఖాతూన్ ఇంగ్లండ్: హీథెర్ నైట్ పాకిస్తాన్: బిస్మా మారూఫ్ దక్షిణాఫ్రికా: డేన్ వాన్ నికెర్క్ వెస్టిండీస్: స్టెఫానీ టేలర్ థాయ్‌లాండ్: సొర్నారిన్ టిపోచ్ ► 7 - ప్రస్తుతం జరగబోయేది ఏడో టి20 ప్రపంచకప్. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలిచింది. ఒక్కోసారి ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) విజేతగా నిలిచాయి. ► 13- గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ► ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ‘ఎ’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్)... ‘బి’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, థాయ్‌లాండ్) ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు మార్చి 8న ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. ► ప్రపంచకప్ మ్యాచ్‌లు మొత్తం నాలుగు నగరాల్లోని (పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా) ఆరు మైదానాల్లో జరుగుతాయి. టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రైజ్‌మనీ విజేత జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు. – కరణం నారాయణ, సాక్షి క్రీడా విభాగం -
మగవారూ ప్రసవవేదనను తెలుసుకునేలా..
సినిమా: మగవారికి లేదు మనమెందుకు జరుపుకోవాలి అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈమె ఇతర నటీమణులకు కాస్త భిన్నం అని చెప్పక తప్పుదు. ఏ విషయంలోనూ మొహమాటానికి పోదు. మగవారైతే వారికేమైన అదనంగా కొమ్ములుంటాయా అని ప్రశ్నించే రకం. నటనలోనూ అ అమ్మడి రూటు సపరేటే. కాగా శుక్రవారం భారతదేశం అంతా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. దేశ నాయకులంతా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి సమయంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ మాత్రం పురుషుల దినోత్సవం అంటూ లేనప్పుడు మనమెందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అన్న ప్రశ్న లేవనెత్తింది. నిజానికి ప్రతిరోజూ మహిళాదినోత్సవమేనని అంది. మహిళలందరూ ప్రతిరోజూ వేడుకగా జరుపుకోండి అని చెప్పింది. అంతే కాదు మీపై మీరు నమ్మకం ఉంచుకోండని అంది. సంవత్సరంలో ఒక్క రోజు కాదు ఏడాదిలో ప్రతి రోజూ మహిళలకు మర్యాద లభించడమే నిజమైన సమానత్వం అని ట్విట్టర్లో ట్వీట్ చేసింది. చైనాలో మగవారూ ప్రసవవేదనను తెలుసుకునేలా ఒక పరికరం ఉందని, దాని గురించిన ఒక వీడియోను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ కురానా విడుదల చేసి మహిళాదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారని చెప్పింది. అదే నిజమైన మహిళాదినోత్సవం అని పేర్కొంది. అలాంటి పరికరం మన దేశానికి రావాలని నటి వరలక్ష్మీ అంది. రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్న ఈ సంచలన నటి ప్రస్తుత చిత్రాలతో చాలా బిజీగా ఉంది. -
బాలికా విద్యకు అదే విఘాతం..!
సాక్షి, హైదరాబాద్: ఒకరిపై ఆధారపడి స్కూల్‌కు వెళ్లే బాలికలు అశక్తులుగా మారుతున్నారని.. దాదాపు 90 శాతం మందిపై ఈ ప్రభావం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై) హరియాణా, బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లే బాలికల ప్రతికూల, అనుకూల అంశాలపై అధ్యయనం నిర్వహించింది. అలాగే ప్రభుత్వాల వివిధ పథకాలు దేశంలో బాలికలను విద్య వైపు ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఎవరో ఒకరిపై ఆధారపడుతూ విద్యాసంస్థలకు వెళ్లడం బాలికలను అశక్తులుగా మారుస్తుందని.. దీని ప్రభావం 90 శాతం మంది బాలికలపై ఉందని అధ్యయనం వివరించింది. ‘తరచుగా స్కూళ్లకు గైర్హాజరయ్యే బాలికలు 29 శాతం ఉంటే, మహిళా టీచర్లు లేక 18 శాతం మంది స్కూళ్లకు హాజరుకావడం లేదు. ఇవి బాలికలను మధ్యలోనే స్కూల్ మానివేసే పరిస్థితికి తీసుకొస్తున్నాయి..’అని నివేదికలో పేర్కొంది. ఇక తరచూ అనారోగ్యం కారణంగా 52 శాతం మంది, ఇంటిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 46 శాతం మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరువుతున్నారని.. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన బాలికల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిపింది. అలాగే మౌలిక వసతులు, సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేక చాలామంది బాలికలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారంది. 87 శాతం స్కూళ్లు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల్ని కోరినట్లు సీఆర్‌వై నివేదికలో తెలిపింది. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లోని 1,604 ఇళ్లలోని 3 వేలకు పైగా మంది అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు సీఆర్‌వై వెల్లడించింది. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
సాక్షి, సుజాతనగర్: సమాజంలో మహిళలు పాత్ర కీలకమైనదని ఐసీడీఎస్ సింగభూపాలెం సెక్టార్ సూపర్వైజర్ పయ్యావుల రమాదేవి అన్నారు. శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగభూపాలెం సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఆత్మ విశ్వాసంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో మహిళలు రాణించాలన్నారు. ఉపాధ్యాయులు మన్నా, పుల్లయ్య, అంగన్వాడీ టీచర్లు వి.జ్యోతి, నరసమ్మ, వరలక్ష్మి, శేషుమణి, శశికళ, లలిత, సరస్వతి, పార్వతి, నాగమణి, పద్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శరణాలయంలో పండ్లు పంపిణీ సూపర్‌బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ సేవా సమితి ఆధ్వర్యంలో శరణాలయంలో గురువారం పండ్లు పంపిణీ చేశారు. చాతకొండలోని హమాలీ కాలనీలోగల జ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో సేవా అధ్యక్షురాలు పద్మజా శంకర్ పండ్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా సింగరేణి కాలనీలలో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, మహిళా దినోత్సవం రోజున సీఈఆర్ క్లబ్లో జరిగే వేడుకల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ బేతిరాజు, సేవా సెక్రటరీ సుమభాను, సభ్యులు శ్రీలత, పుష్పలత, రమాదేవి, మునీల, సుజాత, ఝాన్సీరాణి, రాజేశ్వరి, అరుణ, పద్మ, సేవా కో–ఆర్డినేటర్ ఈఏ.షరీఫ్ పాల్గొన్నారు. ఇందిరాకాలనీ పాఠశాలలో.. సూపర్‌బజార్(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి మం డలం ఇందిరానగర్‌కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని బాలికలకు ఫ్యాన్సీడ్రెస్ పోటీలను నిర్వహించారు. విజేతలకు సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం సీనియర్ రోవర్ లీడర్, ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత మహమ్మద్ ఖాశీం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం జ్యోతిరాణి, విద్యావలంటీర్లు సైదమ్మ, విజయలక్ష్మి, అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు సూపర్‌బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలోని లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఎస్ఓ టూ జీఎం నారాయణరావు పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు శుక్రవారం ఆర్‌సీఓఏ క్లబ్లో జరిగే వేడుకల్లో బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. వాలీబాల్ ఆడుతున్న క్లబ్ సభ్యులు, మహిళా ఉద్యోగులు కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ శ్రీనివాస్, డీవైపీఎంలు కిరణ్‌బాబు, సీహెచ్.అశోక్, లేడీస్ క్లబ్ సెక్రెటరీ మాధవి నారాయణరావు, సునీత మురళి, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ వజ్రమ్మ, సమన్వయకర్తలు సంగారావు, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎడారి దేశాల్లోనూ మహిళా వికాసం..
గల్ఫ్ దేశాల్లోనూ తెలుగు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. డిపెండెంట్ వీసాలపై గల్ఫ్ దేశానికి వెళ్లిన ఎంతో మంది మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో మంది విద్యావంతులైన మహిళలు డిపెండెంట్ వీసాలపైనే గల్ఫ్ దేశాలకు వెళ్లినా తమ విద్యార్హతలకు సరిపడే ఉద్యోగ అవకాశాలను ఆయా దేశాల్లో దక్కించుకున్నారు. మన దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ కార్యాలయాల్లో ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జర్నలిజం, వైద్యం, విద్య, వ్యాపారం, బ్యాంకింగ్, న్యాయ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. అంతేకాకుండా రేడియో జాకీలుగా, టీవీ యాంకర్లుగా కార్పొరేట్ సంస్థల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా గల్ఫ్‌లో ఉపాధి కోసం వచ్చిన తమ వారికి అండగా ఉంటూ ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. సంస్కతి,సంప్రదాయాలపరిరక్షణలో.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన మహిళలు మన సంస్కతి, సంప్రదాయాలను పాటిస్తూనే సేవా కార్యక్రమాల్లోనూ తరిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్ దేశాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం, సంక్రాంతి, ఉగాది ఇతరత్రా పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. వీటితో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలో స్వదేశానికి వెళ్లే కార్మికులకు విదేశాంగ కార్యాలయాల్లో అవసరమైన కౌన్సిల్ సేవలను అందిస్తున్నారు. వివిధ కారణాల వల్ల జైలుపాలైన వారికి న్యాయ సహాయం అందించడంలో మహిళల పాత్ర అమోఘం. ఇంజనీరింగ్ చదివి.. ఆమె చదివింది సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ కార్పొరేట్ రంగంలో ఉన్నత ఉద్యోగం చేయాలనుకున్నారు. తాను ఆశించినట్లుగానే యూఏఈలోని ఒక ప్రముఖ బీమా సంస్థలో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించి తన ప్రతిభతో రాణిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సుందర ఉపాసనకు పాల్వంచకు చెందిన రాబర్ట్‌తో వివాహమైంది. అప్పటికే రాబర్ట్ దుబాయ్‌లో ఒక ప్రముఖ కంపెనీలో చార్టర్ అకౌంటెంట్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వివాహం తరువాత దుబాయ్ వెళ్లిన సుందర ఉపాసనకు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. అయితే ఆమెకు ఆ రంగంలో ఉద్యోగం ఇష్టం లేదు. బీమా సంస్థలో ఉద్యోగం సంపాదించి సీనియర్ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాంస్కతిక కార్యక్రమాలపై మక్కువ చూపే సుందర ఉపాసన.. తెలంగాణ గల్ఫ్ సాంస్కృతిక సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. పదేళ్ల నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాంస్కతిక, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కువైట్‌లో రేడియో జాకీగా అభిలాష కువైట్ ఎఫ్ఎం రేడియో జాకీగా రాణిస్తున్న అభిలాష గొడిషాల ఖమ్మం జిల్లా వాసి. హ్యూమన్ రిసోర్స్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమెకు వరంగల్‌కు చెందిన సురేష్ గొడిషాలతో వివాహమైంది. సురేష్ కువైట్‌లో స్థిరపడటంతో అభిలాష కూడా కువైట్‌కు పయనమయ్యారు. అక్కడ ఒక ప్రముఖ కంపెనీలో అకౌంటెంట్‌గా రెండేళ్ల పాటు విధులు నిర్వహించిన అభిలాష దృష్టి కమ్యూనికేషన్ రంగంవైపు మళ్లింది. దీంతో ఆమె కువైట్ ఎఫ్ఎం రేడియోలో జాకీగా చేరి టాలీవుడ్ టాక్స్ కార్యక్రమానికి వక్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణలోని ఒక న్యూస్ చానల్‌కు, ఆ చానల్ అనుబంధ పత్రికకు కువైట్ నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణ బాధ్యతను ఆమెనే చూస్తున్నారు. అభిలాష ప్రతిభను మెచ్చి 2016లో ప్రవాసీ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా అందించారు. ‘తెలంగాణ ప్రజా సమితి’ ద్వారా విదేశాంగ సేవలు జనగామ జిల్లాకు చెందిన అనుపమ సంగిశెట్టి ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సులేట్ సేవలు అందించే ఉద్యోగిగా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. బీటెక్(కంప్యూటర్స్) పూర్తి చేశారు. భర్త క్రాంతికుమార్‌తో కలిసి ఆమె తొమ్మిదేళ్లుగా ఖతార్‌లో నివాసం ఉంటున్నారు. అనుపమ మూడేళ్ల పాటు మన రాయబార కార్యాలయంలో కాన్సులేట్ ఉద్యోగిగా విధులు నిర్వహించారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఖతార్‌లోని తెలంగాణ ప్రజా సమితిలో సభ్యురాలిగా ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. మన వారికి అవసరమైన విదేశాంగ సేవలపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. బహ్రెయిన్‌లో వైద్యురాలిగా భ్రమర హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మద్దూరి భ్రమర దాదాపు 23 ఏళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. భ్రమర భర్త ప్రేమ్‌సాగర్ బహ్రెయిన్‌లోని ఓ బీమా కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తుండడంతో ఆమె కూడా బహ్రెయిన్‌కు పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్, ఎండీ (పీడియాట్రిక్) చదివిన ఆమె బహ్రెయిన్‌కు వెళ్లిన తరువాత ఎంఆర్సీపీ ఇన్ చైల్డ్ హెల్త్ కోర్సును పూర్తిచేశారు. బహ్రెయిన్‌లో నివాసం ఉంటున్న తెలుగువారికి డాక్టర్ భ్రమర సుపరిచితురాలు. వైద్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే చిన్మయి సొసైటీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా యోగ, ధ్యాన శిబిరాలను కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కోర్సులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా చిన్నారులకు అంది స్తున్నారు. అలాగే యోగా ద్వారా యువత సన్మార్గంలో నడవడంతో పాటు వారి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటా యని అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు ప్రజలకు తన వంతు సేవలు చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు డాక్టర్ భ్రమర. సౌదీలో జర్నలిస్టుగా రాణిస్తున్న అమ్రినా ఖైసర్ గల్ఫ్‌లోని మిగతా దేశాల కంటే కొంత కఠిన నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలో జర్నలిస్టుగా, కళాకారిణిగా రాణిస్తున్నారు అమ్రినా ఖైసర్. హైదరాబాద్‌కు చెందిన అమ్రినా ఖైసర్ పదహారేళ్ల నుంచి సౌదీ అరేబియాలోని జెద్దాలో అరబ్బి టైమ్స్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. పలు సామాజిక ఆంశాలపై కథనాలు రాస్తున్నారు. కళారంగంపై ఉన్న మక్కువతో కళాకారులను ప్రోత్సహించే విధంగా వ్యాసాలను రాస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని మహిళలు, భారతీయ మహిళల జీవన విధానంలో ఉన్న తేడాలపై పరిశీలనాత్మక కథనాలను అందించారు. పేయింటింగ్, రైటింగ్ స్కిల్స్, డ్రాయింగ్, మ్యూజిక్, కవిత్వం అంటే ఎంతో ఇష్టం అని ఆమె చెబుతున్నారు. గాయనిగా కూడా ఆమె తన ప్రతిభను కనబరుస్తున్నారు. సౌదీలో పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించిన అమ్రినా ఖైసర్.. హాస్పిటల్ మేనేజ్మెంట్, హెచ్‌ఆర్‌లలో ఎంబీఏ పూర్తిచేశారు. జర్నలిజంలో డిగ్రీ కూడా చేశారు. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు అందుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీలో పర్యటించిన సందర్బంలో కవరేజీ బాధ్యతలను నిర్వహించిన ఏకైక మహిళా జర్నలిస్టు అమ్రినా ఖైసర్ కావడం విశేషం. ‘వేవ్’ ద్వారాసేవా కార్యక్రమాలు చిత్తూరు జిల్లాకు చెందిన గీతారమేష్ దుబాయిలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. గీత భర్త రమేష్ ఓ కంపెనీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న గీత ‘వేవ్’ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి పలు విధాల సేవలు అందిస్తున్నారు. అలాగే దుబాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లే మహిళలకు శిక్షణ ఇవ్వాలి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే మహిళలకు వివిధ రంగాల్లో ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి. కొందరు మహిళలను ఏజెంట్లు వంచించి ఇంటి పని కోసం షేక్‌ల ఇళ్లల్లో ఉంచుతున్నారు. పని సక్రమంగా చేసినా మహిళలపై భౌతికదాడులకు దిగుతున్నారు. దీంతో ఎంతో మంది మహిళలు అవస్థలు పడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలను గౌరవించడం కాదు.. మహిళలకు ఎప్పటికీ గౌరవం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో పనిచేసి సొంత గడ్డకు చేరుకునే మహిళలకు ప్రభుత్వం రాయితీ పథకాలను అందించాలి. – స్వప్నారెడ్డి కల్లెం, కువైట్ -
మహిళలపై దాడులను ప్రతిఘటించాలి
సాక్షి, బాపట్ల: మహిళలపై దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం స్థానిక అంబేడ్కర్ భవన్లో జరిగిన సభలో విష్ణు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను సమర్ధంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. హిందూత్వ ఫాసిస్టు దాడులను, పితృస్వామిక, కులోన్మాద దాడులు, అత్యాచారాలు, హత్యలపై ప్రతిఘటించే విషయమై మహిళలను చైతన్యపరచాలని కోరారు. వివక్షను, దోపిడీని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శీలం యేసమ్మ, తెనాలి డివిజన్ అధ్యక్షురాలు టి.కల్పన, పల్లవి, కొండా అన్నమ్మ, జి.మరియమ్మ, పి.లక్ష్మి, అజిత పాల్గొన్నారు. -
కోటి మంది సేవల్లో మహిళా అధికారులు..
సాక్షి,సిటీబ్యూరో: మహానగర జనాభా దాదాపు కోటికి పైనే ఉంది. ఇంతమందికి సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని ముఖ్య విభాగాల్లో వారు సేవలందిస్తున్నారు. వీరిలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఇంజినీర్లు ఉన్నారు. నగరంలో అన్ని పనులూ జరిగేది సర్కిళ్ల పరిధిలోనే. ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా సర్కిల్ స్థాయిలోని డిప్యూటీ కమిషనర్లే (డీఎంసీ) పరిష్కరిస్తారు. ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లకపోవడం, వీధిలోని చెత్త, రోడ్లు, డ్రైనేజీ, ఆస్తిపన్ను సమస్యలు అన్నీ పరిష్కరించేది వీరే.. ఈ సేవలతో పాటు వృద్ధులకు అందాల్సిన సేవలు పర్యవేక్షించేదీ వారే. వీటితో పాటు జీహెచ్ఎంసీ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ సంఘాలు, ఎన్జీఓలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేయాల్సిందీ వీరే. ఓటరు జాబితాలో పేరు లేకున్నా ప్రజలు ఫిర్యాదు చేసేది వీరికే. ఇంతటి బాధ్యతలున్న డిప్యూటీ కమిషనర్లలో ఏడుగురు మహిళలే. సంతోష్‌నగర్ సర్కిల్ డీఎంసీగా ఎ.మంగతాయారు, చార్మినార్‌కు సరళమ్మ, గోషామహల్ కు రిచాగుప్తా, ఖైరతాబాద్‌కు గీతారాధిక, ముషీరాబాద్‌కు ఉమాప్రకాశ్, బేగంపేటకు నళిని పద్మావతి, మూసాపేటకు వి.మమత డీఎంసీలుగా సేవలు అందిస్తున్నారు. సర్కిళ్ల స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు జోనల్ కమిషనర్లు, కమిషనర్ నిర్వహించే వివిధ సమావేశాలకు హాజరు కావాల్సిన వీరికి ఖాళీ అంటూ ఉండదు. ఇక జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో నగరంలోనే ఎంతో ప్రాధాన్యమున్న, సంపన్న ప్రాంతమైన, రియల్ రంగం జోరున్న, ఐటీ ఉద్యోగులెక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన విధులు నిర్వహిస్తున్నారు. జోనల్ స్థాయిలోని సాధారణ సమస్యలతో పాటు నగరవ్యాప్తంగా ఉపకరించే కొత్త కొత్త స్కీంలను రూపొందించడం ద్వారా ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’(సీఎస్సార్) ద్వారా ఆయా పథకాలకు నిధుల సేకరణ, జీవవైవిధ్య విభాగం అడిషనల్ కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు అందిస్తున్నారీమె. నగరంలో శునకాలకు ఓ ప్రత్యేక పార్కు ఉండాలని, ఆకలిగొన్న వారిని ఆదుకునేందుకు ‘ఫుడ్ ఫర్ ద నీడ్’ వంటి పథకాలు హరిచందన ఆలోచనల్లో నుంచి కార్యరూపం దాల్చినవే. ఎన్నికల ‘స్వీప్’ నోడల్ అధికారిగా వ్యవహరించిన ఈమె దివ్యాంగుల కోసం ‘వాదా’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగుల పోలింగ్ శాతం పెరిగేందుకు కృషి చేశారు. జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్ (యూసీడీ)గా ఉన్న ఆమ్రపాలి కాటా చీఫ్ జాయింట్ ఎలక్షన్ కమిషనర్‌గానూ సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల నిర్వహణ ఒక ఎత్తు. పారిశుధ్యం బాధ్యతలు నిర్వహించడం మరో ఎత్తు. అంతటి కీలకమైన పారిశుధ్యంతో పాటు రవాణా, ఎంటమాలజీ, చెత్త నుంచి విద్యుత్, సీ అండ్ డీ వేస్ట్ తదితర విభాగాల బాధ్యతలు మరో ఐఏఎస్ అధికారి శ్రుతిఓజా తీసుకున్నారు. జీహెచ్ఎంసీలోని దాదాపు ఏడువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన విభాగం బాధ్యతలు నిర్వహించే అడిషనల్ కమిషనర్(పరిపాలన)గా విజయలక్ష్మి, జాయింట్ కమిషనర్‌గా సరోజ, ఎస్టేట్స్ ఆఫీసర్‌గా శైలజ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విభాగంలో కీలకం.. ఎన్నికల విధులు అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు. హైదరాబాద్ మహానగరంలో ఒక ఎత్తు. వందల మంది వీఐపీలతో పాటు అన్ని పార్టీల ముఖ్యనేతలు ఉండే నగరంలో ఓటర్ల జాబితా ఫిర్యాదుల పరంపరకు కొదవే లేదు. జాబితాలో పేర్ల గల్లంతు నుంచి మొదలు డూప్లికేట్ ఓటర్ల వరకు నిత్యం ఫిర్యాదులే. దీంతో పాటు హైకోర్టు కేసులు తదితరమైనవి సరేసరి. ఎంతో పనిఒత్తిడి ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్‌గా ఎస్.పంకజ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించే ఎన్నికల సమావేశాల సమన్వయం, సీఈఓ కార్యాలయం నుంచి అందే ఆదేశాల అమలు, హైదరాబాద్ జిల్లాలోని అందరు ఎన్నికల అధికారులతో సమన్వయం, వారి సందేహాల నివృత్తి, ఎప్పటికప్పుడు పూర్తిచేయాల్సిన పనులు, ఓటర్ల జాబితాలు.. సవరణలు.. ప్రస్తుత ఎన్నికల తరుణంలో నిత్యం పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఈ విభాగం జాయింట్ కమిషనర్‌గా పంకజ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బిల్లుల చెల్లింపులోనూ.. కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన జీహెచ్ఎంసీలో ప్రతి పనికీ, ప్రతి కాంట్రాక్టర్‌కూ బిల్లుల చెల్లింపుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా భారీగా లెక్కలు తారుమారవుతాయి. బిల్లుల లెక్కలు, చెల్లింపులు పక్కాగా పర్యవేక్షించాల్సిన చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌గా సీహెచ్ ద్రాక్షామణి ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో.. జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ సరోజారాణి, ఐదుగురు ఈఈలు సహా దాదాపు 160 మంది మహిళా ఇంజినీర్లు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎస్సార్డీపీ ప్రాజెక్టులతో పాటు మెయింటనెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఐటీ విభాగం చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా శ్వేత కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీకి వివిధ యాప్‌ల రూపకల్పన, ఈ–ఆఫీస్ తదితర విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో ఆరుగురు మహిళా డాక్టర్లు ఏఎంఓహెచ్‌లుగా సేవలందిస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసీలోని పలు కీలకవిభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. మేడ్చల్‌లో మహిళా శక్తి సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. అన్నీ రంగాల్లో పురుషుల కంటే తామేమి తక్కువేమీ కాదని అధికార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లాలో 12 మంది మహిళలు జిల్లా అధికారుల స్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. సీపీఓగా సౌమ్యారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయకుమారి, ఐసీడీఎస్ అధికారిగా స్వరూపరాణి, మైనార్టీ జిల్లా అధికారిగా విజయకుమారి, పౌరసంబంధాల శాఖ డీడీగా సరస్వతి, భూగర్భజల వనరుల అధికారిగా రేవతి, ఇరిగేషన్ జిల్లా అధికారిగా మంజుల, జిల్లా ఉపాధి కల్పనాశాఖ అధికారిగా నిర్మల, ఆర్డబ్ల్యూఎస్ అధికారిగా జ్యోతి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌గా సరితారాణి, డీఎస్‌ఓగా పద్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఈశ్వరి, కలెక్టరేట్ ఏఓగా విజయలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఏడింటికి తహసీల్దార్లుగా మహిళా అధికారులే ఉన్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలకు ఐదుగురు మహిళా అధికారులే ఉన్నారు. ఘట్కేసర్ ఎంపీడీఓగా అరుణ, శామీర్‌పేట్ ఎంపీడీఓగా జ్యోతి, మేడ్చల్ ఎంపీడీఓగా పద్మ, కీసర ఎంపీడీఓగా శశిరేఖ విధులు నిర్వహిస్తూనే... కుత్బుల్లాపూర్ మండల ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
బికినీ ధరిస్తావా? అంటూ వెక్కిరించారు..
హిమాయత్‌నగర్: సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె ఒకరికి భార్యగా మెట్టినింట అడుగుపెట్టింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగిగా సేవలందిస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా బరువు బాధ్యతలు చూసుకుంటూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అనూహ్యంగా బరువు పెరిగింది. తన ఆరోగ్యం కోసం బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు అమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె అంబరపేటకు చెందిన ఫిట్నెస్ మోడల్ లావణ్యారెడ్డి కేసరి. ఉన్నత విద్యనభ్యసించి ప్రముఖ సంస్థలో ఫైనాన్షియల్ ఎనలిసిస్ట్గా చేరింది. ఇద్దరు పిల్లలు. భర్త క్రికెట్ ప్లేయర్. ఉద్యోగ జీవితంలో బిజీ అయిన లావణ్య విపరీతంగా బరువు పెరిగారు. దీంతో ఉప్పల్‌లోని సిమ్ లయన్ ఫిట్నెస్ సెంటర్లో జయసింహ గౌడ్ వద్ద శిక్షణ తీసుకుని కొంత బరువు తగ్గారు. అక్కడితో అగిపోలేదు.. బాడీ బిల్డింగ్ పోటీల వైపు అడుగులేశారు. మూడేళ్లు సాధన చేసి 2018లో ‘ఫిమేల్ ఫిట్నెస్’ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘సంప్రదాయాన్ని వదిలేసి బికినీ ధరిస్తావా? అంటూ చాలామంది వెక్కిరించారు. నేనెంటో నా ఫ్యామిలీకి తెలుసు. అయినా అవేం పట్టించుకోను.. నన్ను నేను నిరూపించుకున్నాను. ప్రపంచ వేదికపై భారతదేశం సత్తా చాటాలని ఉంది. త్వరలో ఆ ఆశయాన్ని చేరుకుటా’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు లావణ్య. -
లఘుచిత్ర ‘చందనం’
సాక్షి, నల్లగొండ టౌన్ : ఎటువంటి శిక్షణ లేకుండానే షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణంతో పాటు దర్శకత్వం వహిస్తూ లఘుచిత్ర రంగంలో రాణిస్తున్నారు చందన. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పనస శంకరయ్య, లింగమ్మ చివరి సంతానం చందన. ఎంసీఏని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తన తండ్రి రిటైర్డ్ రెవెన్యూ అధికారి శంకరయ్య 2016లో మరణించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఇతివృత్తంతో నేను–నాన్న అనే లఘుచిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఆ లఘుచిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. అదే స్ఫూర్తితో తర్వాత భ్రూణహత్య(సేవ్‌గర్ల్) లఘుచిత్రాన్ని నిర్మించారు. ఆ లఘుచిత్రానికి అవణి క్రియేషన్స్ సంస్థ ఉత్తమ మహిళా దర్శకురాలు అవా ర్డుతో రవీంద్రభారతిలో సత్కరించారు. తర్వాత బంగారుతల్లి, గత సంవత్సరం బతుకమ్మ అనే లఘుచిత్రాలను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో పక్క లఘుచిత్రాలను నిర్మిస్తూ అందరి మన్ననలు పొం దుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో లఘుచిత్రాల నిర్మాణం, దర్శకత్వ రంగంపై మక్కువ పెంచుకున్నాను. నేను–నాన్న లఘుచిత్రానికి విశేష ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో యువతకు సందేశాలను ఇచ్చే ఇతివృత్తాలతో లఘుచిత్రాలను నిర్మిస్తా. – చందన -
బైక్ రైడర్.. ఫుడ్ ‘డ్రైవ్’ర్
సాక్షి, సిటీబ్యూరో: ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా, ఇంట్లోవారి ఆలనాపాల చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఓ డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఔత్సాహిక మహిళలు, యువతులకు బైక్ డ్రైవింగ్‌లో శిక్షణనిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అర్చన చిగుళ్లపల్లి ఓ పార్శం మాత్రమే ఇది. ఎంబీఏ చదివి ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఐటీ కంపెనీలో సేవలందించారు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో తన సత్తా నిరూపించుకున్నారు. అయితే, ఆమె.. బైక్ రైడర్‌గా మారి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్ డ్రైవ్’ మొదలు పెట్టారు. ఒంటరిగా ప్రయాణిస్తూ ఎక్కడ పార్టీలు, వేడుకలు జరిగినా అక్కడ మిగిలిన పదార్థాలను సేకరించి కొన్ని ఎన్జీఓలతో కలిసి బస్తీల్లోని పేదలకు అందిస్తున్నారు. ‘చిన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన నా స్కూల్ ఫ్రెండ్ కోసం మా అమ్మ రెండు బాక్స్‌లు కట్టి ఇచ్చేది. మరొకరి ఆకలి తీర్చడం అప్పుడే అలవాటైంది. ఇప్పుడదే వ్యాపకంగా మారింది. ఏడాదంతా ఫుడ్ డ్రైవ్స్ చేస్తాను. 24/7 రెడీగా ఉంటాను’ అంటున్నారామె. బైక్ డ్రైవింగ్‌లో శిక్షణ ‘బైక్‌పై ఫుడ్ సేకరించడానికి వెళుతుంటే కొందరు ఆశ్చర్యపోతున్నారు. మహిళలు సహజంగా శక్తిమంతులు. అది బైక్ రైడింగ్‌లో నిరూపించవచ్చని నా నమ్మకం. అందుకే స్కూల్ డేస్ నుంచే ఆసక్తి ఉన్న మహిళలకు బైక్ నేర్పడం మొదలుపెట్టాను. ముఖ్యంగా చాలా మంది వర్కింగ్ లేడీస్‌కి ఫ్రీగా నేర్పించాను. బైక్ రైడింగ్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్ధులు నా దగ్గరకి వస్తుంటారు’ అని వివరించారు అర్చన. -
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లా : స్వాతిరెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: కష్టాలు ఎదురైనా...కన్నీళ్లను దిగమింగుకొని...ఒకానొక దశలో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లి నేడు మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఎస్ఎస్ శ్రీఫుడ్స్ బిస్కెట్ కంపెనీ నిర్వాహకురాలు స్వాతిరెడ్డి. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా బ్యాంక్ రుణంతో ఏడాదికి కోటి రూపాయల వ్యాపారం చేసే స్థాయికి తీసుకువచ్చానని చెబుతున్నారు. మాది కరీంనగర్.. నా 16వ ఏటానే రాజేశ్వర్‌రెడ్డితో వివాహమైంది. ఒక పాప, బాబు సంతానం. 2008లో హైదరాబాద్‌కు వచ్చాం. తొలినాళ్లలో చీరల వ్యాపారం మొదలెట్టా. 2013 నుంచి ఆన్లైన్లోనే చీరలు అమ్ముతూ ఇంటిఖర్చులు వెళ్లదీశా. బంధువులతో కలిసి 2016 జూన్‌లో బిస్కెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టా. అయి తే భేదాభిప్రాయాలు రావడంతో రూ.ఎనిమిది లక్షల నష్టం చేకూర్చారంటూ భాగస్వామ్యులు పక్కకు తప్పించారు. 2017 జూలైలో దాదాపు రెండు వారాల పాటు భర్త కరీంనగర్‌కు వెళుతున్నానని చెప్పి కనీసం సెల్ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియలేదు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి వెళుతుండటంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి వెళ్లా. మరో మూడేళ్లు చదివితే నేనే ఉద్యోగం చేస్తానంటూ పాప అన్న మాట కదిలించింది. బంగారు ఆభరణాలను తనఖాపెట్టి ఫీజులు చెల్లించా. ఓ స్వచ్ఛందసేవా సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఓ అబ్బాయి బిస్కెట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడతానంటూ ముందుకురావడం ఆనందం కలిగించింది. అంతలోనే వెనక్కి వెళ్లడంతో బ్యాంక్ నుంచి రూ.24 లక్షల రుణం తీసుకున్నా. 2018లో ఐడీపీఎల్‌లో ఎస్ఎస్ బిస్కెట్ కంపెనీ ప్రారంభించా. ప్రస్తుతం 30 మంది సిబ్బందితో ఎస్ఎస్ బిస్కెట్లను మార్కెట్లో అతితక్కువ కాలంలో అందరి నోళ్లలో నానేలా చేశాం. 12 మంది మహిళలకు ఉద్యోగాలిచ్చా. -
అన్నింటా.. ‘ఆమె’..!
ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ కళలోనైనా తమదైన ప్రత్యేకతను చాటుతూ సమాజంలో చెరగని ముద్రను వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగాం జిల్లా కేంద్రంలో పలు రంగాల్లో రాణిస్తున్న వనితల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు ఈ చిత్రాలు.. మగ్గం నేస్తున్న కుందారం లక్ష్మీదేవి పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మహిళలు పెంబర్తిలో నగిషీలను తయారు చేస్తున్న మహిళ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజారిణిగా సందెల బుచ్చమ్మ -
స్త్రీ మూర్తికి ‘కళాత్మక’ అభినందన
సాక్షి, నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహపురికి చెందిన కళాకారులు తమ భావాలను కళారూపంలో వ్యక్తీకరించారు. సందేశాత్మకంగా మహిళలకు స్ఫూర్తినిస్తూ కళాభివందనాలతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మూలాపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు గంధవళ్ల ఉమాశంకర్ కోకకోలా శీతలపానీయం డబ్బా పై పిడికిలి బిగించి, జై కొడుతున్న మహిళ చిత్రాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. మహిళలు ఏ రంగంలో తీసిపోరని, సమాజంలో మహిళాసాధికారత సాధించాలని కాంక్షిస్తూ రెండు గంటల సమయంలో స్త్రీ మూర్తి రూపాన్ని తీర్చిదిద్దానన్నారు. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌కు చెందిన కార్పెంటర్ శ్రీనివాసులు తన వృత్తి నైపుణ్యంతో 8 అంగుళాల ఎత్తు, రెండున్నర అంగుళాల వెడల్పు ఉన్న కొయ్య ముక్కపై స్త్రీ రూపాన్ని రెండు గంటల సమయంలో తీర్చిదిద్దారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటాలని కాంక్షించారు. ముత్తుకూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని నారికేళపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం యూపీ స్కూల్ తెలుగు పండిట్ సోమా పద్మారత్నం గురువారం సీసాలో ‘జాగృతి మహిళ’ చిత్రాన్ని నిక్షిప్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి తన కళారూపం ద్వారా అభినందనలు తెలిపారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మరూప చిత్ర కళాకారుడు వెంకటశేషగిరిరావు చిన్న రబ్బర్ ముక్క(ఎరేజర్)పై అర సెంటీమీటర్ ఎత్తు, అర సెంటీమీటర్ వెడల్పుతో కలర్ పెయింటింగ్‌ను తీర్చిదిద్దారు. రెండు గంటల పాటు శ్రమించి చిత్రానికి రూపమిచ్చానని చెప్పారు. సుద్ద ముక్కపై మహిళకు సూక్ష్మరూపం అనుమసముద్రంపేట: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్‌పేట మండలంలోని హసనాపురం ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు పార్థసారథి సుద్ద ముక్కపై కూర్చున్న మహిళ ఆకృతిని తయారు చేశారు. ఒక మహిళ దుఃఖిస్తూ, ప్రాధేయపడుతూ దేశంలో ఉన్న మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్న అర్థం తెలిపేలా ఈ సూక్ష్మరూపాన్ని చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా చాక్‌పీసులతో ఈ బొమ్మను తయారు చేశారు. -
అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు నులిమి
ఉప్పల్: ఓ పక్క మహిళా దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా మరో పక్క అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును గుడ్డలో చుట్టి చిలుకానగర్ దారిలోని నాలా పక్కన గల శ్మశానవాటికలో చెట్ల పొదల్లో వదిలేసి వెల్లిపోయారు. మృతదేహంపై బొడ్డు అలాగే ఉందని, అప్పటికే సగభాగం కుళ్లిపోయి ఉందని పోలీసులు గమనించారు. ఉప్పల్ జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తున్న కంబాల లక్ష్మీ(40) శ్మశానవాటిక వద్ద రోడ్డు ఊడ్చుతుండగా దుర్వాసన వచ్చింది. వెంటనే శ్మశానవాటికలోని చెట్ల పొదల వద్ద వెళ్లి చూడగా మృతిచెందిన ఆడశిశువు కనబడింది. దీంతో వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్ట్రం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. -
‘వి యాక్ట్ ఎగైనెస్ట్ రేప్' : జానవి
సాక్షి,సిటీబ్యూరో: లైంగిక దాడికి గురైన వారిని సంఘటితం చేయడంతో పాటు మానవ మృగాల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందుకే ‘వార్’ ‘వార్’ (వి ఆర్ యాక్ట్ ఎగైనెస్ట్ ఫర్ రేప్) ప్రారంభించాం. మైక్రోబయాలజీ స్టూడెంట్ అయిన నేను మరి కొందరు విద్యార్ధులతో కలిసి ఉద్యమించా. దేశవ్యాప్తంగా ‘నిర్భయ’ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న 2012 రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ‘వార్’ ను ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది కాలేజీల్లో విద్యార్థినీ విద్యార్థులను సంఘటితం చేసి వారిలో చైతన్యం పెంపొందించి ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. అత్యాచారానికి గురైన బాధిత అమ్మాయిలను కలిసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం, జీవితం పట్ల ఒక బలమైన భరోసాను అందజేయడం మా విధి. హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి అత్యాచార బాధితులకు అండగా నిలిచాం. నిజానికి ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఆకస్మాత్తుగా ఒంటరివాళ్లవుతారు. జీవితం ముగినట్లేనని భావిస్తారు. కానీ అలాంటి సమయంలో ‘మనమంతా ఒక్కటేననే’ స్ఫూర్తిని వాళ్లకు అందజేయడం వల్ల చక్కటి ఫలితాలు వచ్చాయి. చాలా మంది అమ్మాయిలు తిరిగి కెరీర్ ప్రారంభించారు.. చదువుకున్నారు. ఉద్యోగాల్లో చేరారు.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చారు. కొద్ది మంది విద్యార్ధులం కలిసి ప్రారంభించిన వార్ ఎంతోమందికి ఓదార్పుగా, బాసటగా నిలిచింది. జీవితానికి బలమైన ఆయుధాన్ని అందజేసింది. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అత్యాచారం అనేది ఒక యాక్సిడెంట్ లాంటిది. ప్రతి గాయానికీ చికిత్స ఉంటుంది. -
చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే..
సాక్షి, సిటీబ్యూరో :సాహసమే శ్వాసగా.. ఆశయమే ఊపిరిగా లక్ష్య సాధనలో ఎదురైన సవాళ్లు, ప్రతిసవాళ్లను సమర్థంగా ఎదుర్కొని అమ్మాయిలు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవాలి. ఆడపిల్లలు వంటింటి కుందేలు కాదు... ప్రయత్నిస్తే, సాహసం చేస్తే వారితో కాని పని ఏదీ ఉండదు. పురుషులకు ధీటుగా ఏదైనా సాధించే సత్తా అమ్మాయిల సొంతం. అవకాశాలు ఎవరో ఇస్తారని, ఏదో చేస్తారని ఆశపడడం కంటే ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిలిచి గెలిచి సాధించడమే ధీరవనితల లక్షణం. చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకునే కంటే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, లక్ష్యసాధనలో ఓసారి విఫలమైనా, పలుమార్లు ప్రయత్నించడమే నేటి తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సిన జీవిత పాఠం. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నాపట్ల వివక్ష చూపలేదు. నేను చదవాలనుకున్న కోర్సులో చేర్పించారు. ఇక మెట్రోలో లోకో పైలెట్‌గా ఎంపికై జాబ్‌లో జాయిన్ అవుతానన్నా ఓకే అన్నారు. ఎక్కడా నో చెప్పలేదు. నా సక్సెస్‌లో నా తల్లిదండ్రుల పాత్ర మరువలేనిది. చిన్నప్పటి నుంచి వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే అంచెలంచెలుగా ఎదిగాను. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే నాకు ఇష్టం. డేరింగ్, డాషింగ్ స్పిరిట్‌తో సాగిపోతూ లక్ష్య సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలన్నదే నా ఫిలాసఫి. నేను అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఇదే. నేనూ బాధితురాలినే... ప్రొఫెసర్ కె.సర్వమంగళగౌరి పని ఏదైనా పనే. ఇది మగవాళ్ల పని, అది ఆడవాళ్ల పని అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నిజానికి ఈ పని విభజనతోనే మహిళలపై వివక్ష మొదలవుతోంది. పురుషులు, మహిళలు ఇద్దరూ సమానమేననే భావన నేటితరం పిల్లల్లో కల్పించినప్పుడే ఆడవాళ్లకు గౌరవం దక్కుతుంది. సాటి మహిళగా నేనూ కొన్ని సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాను. సమస్యఎదురైనప్పుడు సాహసంతో ఎదుర్కోవాలే గానీ.. చతికిలపడకూడదనే సత్యాన్ని బోధించిన మా నాన్న కాశీసోమయాజుల సుబ్రమణ్యం ఇచ్చిన స్ఫూరి ్తతో వివక్షను ఎదుర్కొన్నాను. ధైర్యంగా నలుగురి ముందు నిలబడగలిగాను. ఇప్పటికీ ఇండిపెండెంట్‌గా బతకడానికే ఇష్టపడుతుంటాను. బాస్‌తో గొడవ మాది గుంటూరు. అక్కడే చదివాను. మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ఆ తర్వాత 1986–2013 వరకు ఏపీ స్టడీ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లోనూ పని చేశాను. స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న సమయం లోనే ఓసారి వివక్ష విషయంలోనే మా బాస్‌తో గొడవైంది. అప్పట్లో ఆయనపై ఫిర్యాదు కూడా చేశాను. ధైర్యంగా సమస్యను దుర్కొన్నాను. ఈ వివక్ష పోవాలంటే ముందు పని విభజన పోవాలి. అప్పుడే మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఆడపిల్లలకు ప్రస్తుతం చాలా స్వేచ్ఛ ఉంది. కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు వివరించాలి. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ ఉండదు. -
ధీరమణులు!
సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైదాబాద్‌లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్‌కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజునే.. పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్‌లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు వహ్వా.. ఫరీహా..! ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది.