wrestling championship
-
చిరాగ్ చికారా ‘పసిడి’ పట్టు
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కు ఏకైక స్వర్ణ పతకం దక్కింది. అల్బేనియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ చిరాగ్ చికారా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దీమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో జరిగిన ఫైనల్లో చిరాగ్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (2022లో) తర్వాత ప్రపంచ అండర్–23 చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ రెజ్లర్‌గా చిరాగ్ గుర్తింపు పొందాడు. -
అంజలికి రజతం
టిరానా (అల్బేనియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ అంజలి (59 కేజీలు) రజత పతకం కైవసం చేసుకుంది. 55 కేజీల పురుషుల విభాగంలో చిరాగ్ ఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకం ఖాయం చేశాడు. 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్ర మోర్, మహిళల 68 కేజీల విభాగంలో మోనిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరడంతో పాటు మరో పతకం ఖాయం కాగా... అంతకు ముందు శుక్రవారం మన రెజ్లర్లు రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. దీంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో అరోరా రుసో (ఇటలీ)పై విజయం సాధించిన అంజలి... తుది పోరులో ఉక్రెయిన్ రెజ్లర్ సొలోమియా చేతిలో ఓడింది. పురుషుల 55 కేజీల ఫైనల్లో అడిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో చిరాగ్ తలపడనున్నాడు. 18 ఏళ్ల చిరాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో ఒజావా గుకుటో (జపాన్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో లుబుస్ లబాటిరోవ్పై సెమీఫైనల్లో అలాన్ ఒరల్బేక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. అభిషేక్ (61 కేజీలు), సుజీత్ (70 కేజీలు) కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. -
పతకానికి విజయం దూరంలో...
బెల్గ్రేడ్ (సెర్బియా): భారత రెజ్లింగ్ రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన అంతిమ్... ప్రస్తుతం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక రేసులో నిలిచింది. సెమీఫైనల్లో అంతిమ్ 4–5 పాయింట్ల తేడాతో వనెసా కలాద్జిన్స్కాయా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో అంతిమ్ గెలిస్తే పతకంతోపాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా ఖరారవుతుంది. సాట్ల్విరా ఒర్షుష్ (హంగేరి), ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో కాంస్య పతకం పోరులో అంతిమ్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో అంతిమ్ 3–2తో డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ ఒలివియా పారిష్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అంతిమ్ 10–0తో రొక్సానా మార్టా జసినా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–6తో నటాలియా మలిషెవా (రష్యా)పై గెలుపొందింది. భారత్‌కే చెందిన మనీషా (62 కేజీలు), ప్రియాంక (68 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, జ్యోతి బెర్వాల్ (72 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) పతాకంపై, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్ రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. -
నిఖిల్‌కు ఆర్థిక సహాయం.. రూ. లక్ష నగదు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫ్రీస్టయిల్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ కుర్రాడు నిఖిల్ యాదవ్‌కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) యాజమాన్యం ఆర్థిక సహాయం చేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమురయ్య నిఖిల్‌కు రూ. లక్ష నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు. తండ్రి, మాజీ రెజ్లర్ సురేశ్ యాదవ్ అడుగుజాడల్లో నడుస్తున్న నిఖిల్ ప్రస్తుతం బళ్లారిలోని ఇన్‌స్పయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. 2011లో హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దేవీ సింగ్ ఠాకూర్ కాంస్య పతకం గెలిచిన తర్వాత... నిఖిల్ రూపంలో మరో హైదరాబాద్ రెజ్లర్ ప్రపంచ జూనియర్ టోర్నీలో పతకం సాధించాడు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రతినిధి మల్కా యశస్వి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, నిఖిల్ తల్లి మమత, సోదరుడు అఖిల్, అంతర్జాతీయ మాజీ రెజ్లర్ అభిమన్యు, తెలంగాణ కేసరి రెజ్లర్ మెట్టు శివ పహిల్వాన్, కరాటే మాస్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే! -
UWW Ranking Series: అమన్ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు!
కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ అమన్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్ 10–9తో మెరెయ్ బజర్బయెవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్ 7–0తో రిఫత్ సైబొతలొవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్లో భారత్ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
Sakshi Malik: ఐదేళ్ల తర్వాత మరోసారి పసిడి పతకం!
అల్మాటీ (కజకిస్తాన్): భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బంగారంతో మురిసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో ఆమె 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మాన్సి అహ్లావత్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి 7–4తో ఇరినా కుజ్నెత్సొవ (కజకిస్తాన్)ను ఓడించింది. చివరిసారిగా సాక్షి 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో బంగారం గెలిచింది. తర్వాత రెండు ఆసియా చాంపియన్ షిప్ (2020, 2022)లలో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 57 కేజీల ఫైనల్లో మాన్సి 3–0తో ఎమ్మా టిసినా (కజకిస్తాన్)పై గెలుపొందింది. నలుగురు రెజ్లర్లు మాత్రమే తలపడిన 68 కేజీల కేటగిరీలో దివ్య రెండు బౌట్లలో అలవోక విజయాలు సాధించింది. కానీ ఆఖరి బౌట్లో 10–14తో బొలొర్తుంగలగ్ జోరిట్ (మంగోలియా) చేతిలో ఓడింది. అయితే జోరిట్ కూడా రెండు బౌట్లలో గెలుపొందడంతో ఆమె, దివ్య సమఉజ్జీలుగా నిలిచారు. ఓవరాల్‌గా ఎక్కువ పాయింట్లు గెలిచిన దివ్యనే విజేతగా ప్రకటించారు. చదవండి: మన అమ్మాయిలు భేష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్‌లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్‌కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్‌కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్‌లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్‌లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్‌గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్‌ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్‌కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్‌ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
తొలిరోజు భారత్‌కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ‘డ్రా’
‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున సారథి సునీల్ చెత్రీ 27వ నిమిషంలో గోల్ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్ కాగా, బ్రెజిల్ దిగ్గజం పీలే గోల్స్ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్ అరాఫత్ (74వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. రోహిత్‌కు నిరాశ ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రోహిత్ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిన తుల్గాతుముర్ ఒచిర్ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్ ద్వారా రోహిత్ కాంస్యం బరిలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ 12–2తో సెలాహట్టిన్ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్ పింకీ 6–8తో నినా హెమ్మర్ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్ సంగీతా ఫోగాట్ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుశీల్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్‌కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్‌కు గాయం ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్‌సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్ సర్‌మన్‌డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్‌బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్‌వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
సునీల్ ‘పసిడి’ పట్టు
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామానికి తెరపడింది. 27 ఏళ్ల తర్వాత ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు మళ్లీ స్వర్ణం లభించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ పసిడి పతకం నెగ్గగా... 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5–0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్‌గా సునీల్ గుర్తింపు పొందాడు. సెమీఫైనల్లో సునీల్ 12–8తో అజామత్ కుస్తుబయేవ్ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 8–2తో తకహిరో సురుడా (జపాన్)పై నెగ్గాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7–4తో డాంగ్హైక్ వన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు. ఇతర విభాగాల్లో సచిన్ రాణా (63 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) విఫలమయ్యారు. 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మెహర్ సింగ్ (భారత్) 2–3తో రోమన్ కిమ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
రాహుల్‌కు రజతం
కోల్‌కతా: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ రజత పతకం సాధించాడు. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన రాహుల్... జాతీయ చాంపియన్‌షిప్‌లో 89 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ మొత్తం 323 కేజీలు (స్నాచ్‌లో 144+క్లీన్ అండ్ జెర్క్‌లో 179) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. సాంపో లాపుంగ్ (సర్వీ సెస్) 333 కేజీలు బరువెత్తి స్వర్ణం నెగ్గగా... రామ్‌కరణ్ ప్రజాపతి (ఉత్తరాఖండ్) 314 కేజీలతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
దీపక్ పూనియా, రవి దహియాలు క్వాలిఫై
న్యూఢిల్లీ: వచ్చే నెలలలో జరుగనున్న సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌కు రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియాలు క్వాలిఫై అయ్యారు. శుక్రవారం జరిగిన రెజ్లింగ్ ట్రయల్స్‌లో దీపక్ పూనియా, రవి దహియాలు తమ తమ కేటగిరిల్లో విజయం సాధించడంతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. 86 కేజీల ఫ్రీ స్టైల్ కేటగిరీలో దీపక్ పూనియా.. కామన్వెల్త్ కాంస్య పతక విజేత పవన్ కుమార్‌పై విజయం సాధించగా, 57 కేజీల వెయిట్ కేటగిరీలో రవి దహియా 10-0 తేడాతో పంకజ్‌పై గెలుపొందాడు. దాంతో ఆసియా చాంపియనషిప్‌కు క్వాలిఫై అయ్యారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వీరిద్దరూ తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌కు సైతం క్వాలిఫై కావడం విశేషం. విజయం తర్వాత దీపక్ దహియా మాట్లాడుతూ.. ‘ ఇదే ఫామ్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టా. నా గోల్, నా కల ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే.అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటడానికి వంద శాతం యత్నిస్తా. నా అత్యున్నత ప్రదర్శనను వెలికి తీయడమే నా లక్ష్యం’ అని తెలిపాడు. ‘ నేను రెజ్లింగ్‌ను ఎంజాయ్ చేస్తా. ప్రస్తుతం నా అత్యుత్తమ సమయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నా. భారత్‌కు పతకాలు అందిస్తానని ఆశిస్తున్నా. ఒలింపిక్ పతకం సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో శ్రమిస్తున్నా’ అని రవి దహియా తెలిపాడు. -
మెరిసి.. అంతలోనే అలసి
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చుక్కెదురైంది. ఎన్నో అంచనాలతో టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఫొగట్‌కు నిరాశే ఎదురైంది. 53 కేజీల కేటగిరీలో భాగంగా మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో ఫొగట్ 0-7 తేడాతో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, జపాన్ రెజ్లర్ మయు ముకైదా చేతిలో పరాజయం చెందారు. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశం ఫొగట్ కోల్పోయారు. ఇది మయు ముకాదాపై వరుసగా రెండో పరాజయం. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ముకైదా చేతిలో ఓటమిని చవిచూసిన వినేశ్ పొగొట్.. మరోమారు పరాజయం చెందారు. ఫొగట్ చేతిలో గెలిచిన ముకైదా.. ఆపై సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ క్రమంలోనే ముకైదా ఫైనల్‌కు చేరితే ఫొగట్‌కు మరో అవకాశం ఉంటుంది. రెప్చెజ్ ద్వారా తన అదృష్టాన్ని ఫొగట్ పరీక్షించుకునే అవకాశం దక్కుతుంది. ఒకవేళ ముకైదా ఫైనల్‌కు వెళ్లని పక్షంలో ఫొగట్ పతకం ఆశలతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తు కూడా క్లిష్టంగా మారుతుంది.అంతకుముందు ఈ రోజు జరిగిన పోరులో ఫొగట్.. 12-0 తేడాతో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్‌పై ఘన విజయం సాధించారు. ఫలితంగా ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఏ దశలోనూ సోఫియాకు అవకాశం ఇవ్వని వినేశ్.. చివరకు సోఫియాను మ్యాట్ నుంచి బయటకు నెట్టడంతో భారీ ఆధిక్యం సాధించారు. అయితే వినేశ్ గెలిచే క్రమంలో కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోఫియాను మొత్తం మ్యాట్ నుంచి ఔట్ చేసిన సమయంలో వినేశ్ కాలు లైన్ లోపల ఉందా.. బయట ఉందా అనే దానిపై స్పష్టత రాలేదు. అదే సమయంలో సోఫియా చాలెంజ్‌కు వెళ్లడంతో రిఫరీలు పలు కోణాలు పరిశీలించి వినేశ్ కాలు లైన్ లోపలే ఉందని తేల్చారు. దాంతో వినేశ్ 12-0 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అడుగుపెట్టారు. అటు తర్వాత జరిగిన బౌట్లో వినేశ్ ఫొగట్‌కు పరాజయం తప్పలేదు. ఇప్పుడు ఫొగట్ రెప్చెజ్లోకి రావాలంటే.. ముకైదా ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. రెజ్లింగ్ ‘డ్రా’లో రెండు పార్శ్వాల నుంచి ఇద్దరు ఫైనల్స్‌కు చేరుకుంటారు. ఫైనల్‌కు చేరిన వారిద్దరి చేతుల్లో ఎవరైతే ఓడిపోయారో వారందరికీ ‘రెప్‌చేజ్’ ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. ఇక్కడ కేవలం కాంస్య పతకాన్ని సాధించే అవకాశం మాత్రమే ఉంటుంది. -
చాంపియన్ అజహర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అన్వర్ ఉలూమ్ కాలేజీకి చెందిన అజహర్ అలీఖాన్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో సిటీ కాలేజీకి చెందిన అబుబాకర్పై అజహర్ విజయం సాధించాడు. కె. విశ్వతేజ (వెస్లీ డిగ్రీ కాలేజి), సయ్యద్ జబ్బార్ అహ్మద్ (లార్డ్స్ కాలేజి) ఉమ్మడిగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ 72 కేజీల కేటగిరీలో కె. శివ (నిజాం కాలేజి), అబ్దుల్ కరీర్ (అన్వర్ ఉలూమ్) వరుసగా రెండు స్థానాలను సాధించగా... జె. సందీప్ యాదవ్ (ప్రగతి కాలేజి), అక్షత్ కుమార్ (క్వీన్ మేరీ కాలేజి) సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచారు. ఈ పోటీలను ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా ప్రారంభించారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు ∙గ్రీకో రోమన్: 55 కేజీలు: 1. సయీద్ (బద్రుక), 2. రాజేశ్ (జీసీపీఈ, దోమలగూడ), 3. మనీశ్ (ప్రగతి), హరిశేత్ (జాహ్నవి). ∙60 కేజీలు: 1. దిగంబర్ హజారే (ఎస్డీ సిగ్నోడియా కాలేజి), 2. మనోజ్ (ఏవీ కాలేజి), 3. శ్రీకాంత్ (అంబేడ్కర్ కాలేజి), విశాల్ (బద్రుక). ∙63 కేజీలు: 1. రామ్ కుమార్ (భవన్స్), 2. ఫర్దీన్ (విద్యాదాయని), 3. అంకిత్ (అరోరా), సయ్యద్ మొయినుద్దీన్ (అన్వర్ ఉలూమ్). ∙67 కేజీలు: 1. శశినాథ్ (నృపతుంగ), 2. మనీశ్ (అవినాశ్ కాలేజి), 3. మహేశ్ (సెయిం ట్ పాయ్స్), మొయినుద్దీన్ (అన్వర్ ఉలూమ్). ∙ఫ్రీస్టయిల్: 57 కేజీలు: 1. ఉస్మాన్ ఖాన్ (షాదన్ కాలేజి), 2. మహేందర్ (ప్రగతి కాలేజి), 3. సాయి నిశాంత్ (జాగృతి), అబ్రాబిన్ హుస్సేన్ (పుల్లారెడ్డి). ∙61 కేజీలు: 1. పవన్ కల్యాణ్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజి), 2. అబ్దుల్ వాసెద్ అసుబకర్ (అల్ ఖర్మోషి కాలేజి), 3. ఫహాద్ బిన్ సయీద్ (ప్రెసిడెన్సీ), జయంత్ (అవినాశ్ కాలేజి). ∙65 కేజీలు: 1. సయ్యద్ అబ్దుల్ అర్షద్ (లార్డ్స్ కాలేజి), 2. నూరుద్దీన్ (హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్), 3. ముజఫర్ (అన్వర్ ఉలూమ్), చంద్రశేఖర్ (అవినాశ్ కాలేజి). ∙70 కేజీలు: 1. రోహిత్ సింగ్ (నవ చైతన్య డిగ్రీ కాలేజి), 2. సయ్యద్ అబ్రార్ (ప్రెసిడెన్సీ కాలేజి), 3. సాయిదత్తా (సెయింట్ ప్యాట్రిక్), కార్తీక్ (ప్రగతి కాలేజి). -
మళ్లీ మెరిసిన హర్‌ప్రీత్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం నెగ్గగా... జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో హర్‌ప్రీత్ 0–8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9–0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్‌కిది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. అతను 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గగా... ఈసారి రజతం దక్కించుకున్నాడు. -
మహిళా రెజ్లర్లకు నిరాశ
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు నిరాశపరిచారు. ఆరు వెయిట్ కేటగిరీల్లో ఒక్కరు కూడా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయారు. సీమ (55 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రజని (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సరిత (59 కేజీలు), రీతూ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సీమ 0–11తో దావాచిమెగ్ (మంగోలియా) చేతిలో... నవ్‌జ్యోత్ 0–4తో కుంబా ఫాంటా సెలెన్ (ఫ్రాన్స్) చేతిలో... రజని 0–2తో మార్టినా క్యునెజ్ (ఆస్ట్రియా) చేతిలో... కిరణ్ 2–12తో ఎల్మీరా సిజ్దికోవా (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. షూవ్‌డోర్ బతర్జావ్ (మంగో లియా) 10–0తో సరితపై, పెట్రా మారిట్ (ఫిన్లాండ్) 6–2తో రీతూపై గెలిచారు. నవ్‌జ్యోత్ కౌర్‌పై గెలిచిన సెలెన్... రీతూపై నెగ్గిన పెట్రా మారిట్ ఫైనల్‌కు చేరుకోవడం తో వీరిద్దరికి బుధవారం కాంస్యం గెలిచేందుకు రెప్‌చేజ్ బౌట్లలో అవకాశం దక్కింది. -
‘రజత’ బజరంగ్
చివరిక్షణం వరకు పోరాడినా భారత రెజ్లర్ బజరంగ్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టలేకపోయాడు. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి చెందాడు. ఆద్యంతం దూకుడుగా, వేగంగా, వ్యూహాత్మకంగా ఆడిన జపాన్ యువ రెజ్లర్ టకుటో ఒటోగురో అనుకున్న ఫలితాన్ని సాధించాడు. జపాన్ తరఫున పిన్న వయస్సులో విశ్వ విజేతగా నిలిచిన ఘనతను 19 ఏళ్ల ఒటోగురో సొంతం చేసుకున్నాడు. బుడాపెస్ట్ (హంగేరి): కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత రెజ్లర్ బజరంగ్ పూనియా అదే ప్రదర్శనను ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పునరావృతం చేయలేకపోయాడు.సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 24 ఏళ్ల బజరంగ్ 9–16 పాయింట్ల తేడాతో టకుటో ఒటోగురో చేతిలో పోరాడి ఓడిపోయాడు. బౌట్ మొదలైన తొలి నిమిషంలోనే ఐదు పాయింట్లు కోల్పోయిన బజరంగ్ ఆ తర్వాత తేరుకున్నాడు. వెంటవెంటనే రెండేసి పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 5–4కి తగ్గించాడు. కానీ ప్రపంచ మాజీ క్యాడెట్ చాంపియన్ అయిన ఒటోగురో ఏదశలోనూ దూకుడును తగ్గించకపోవడంతో బజరంగ్‌కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. మూడు నిమిషాల తొలి భాగం ముగిసేసరికి ఒటోగురో 7–6తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో స్కోరును సమం చేసే ప్రయత్నంలో బజరంగ్ తీవ్రంగా ప్రయత్నించడం... బజరంగ్ తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకున్న ఒటోగురో ఐదు పాయింట్లు సంపాదించి 12–6తో ముందంజ వేయడం జరిగిపోయింది. చివర్లో బజరంగ్ కోలుకునే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. తొలి నిమిషంలోనే 5 పాయింట్లు కోల్పోవడం బజరంగ్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. రజత పతకంతో బజరంగ్ కొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాదిలో బజరంగ్ పాల్గొన్న ఆరు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పతకాలు నెగ్గడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్, టిబిలిసి గ్రాండ్‌ప్రి టోర్నీ, యాసర్ డోగు టోర్నీ, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన బజరంగ్... ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. -
సజన్‌కు రజతం
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. స్లొవేకియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సజన్ భన్వాల్ (77 కేజీలు) రజతం... విజయ్ (55 కేజీలు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సజన్ 0–8తో ఇస్లామ్ ఒపియెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో విజయ్ 16–8తో లిమాన్ (టర్కీ)పై గెలుపొందాడు. -
నితీశ్ యాదవ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: సుభాష్ చంద్రబోస్, శివలాల్ యాదవ్ ఎమ్మెల్యే రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కేవీబీఆర్ స్టేడియానికి చెందిన నితీశ్ యాదవ్ గెలుపొందాడు. ధూల్‌పేట్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 84 కేజీల పురుషుల విభాగంలో జై భవానీ వ్యాయామశాలకు చెందిన రూపేశ్‌పై నితీశ్ విజయం సాధించాడు. ఇదే వెయిట్ కేటగిరీలో జరిగిన ఇతర బౌట్లలో మణితేజ (గచ్చిబౌలి)పై మోహన్ గాంధీ (షణ్ముక పహిల్వాన్), డి. విశాల్ (న్యూ వలీమ్ వ్యాయామశాల)పై భీమా (కార్వాన్), కరణ్ సింగ్‌పై విశాల్ యాదవ్ (శ్రీరామ్ వ్యాయామశాల), జి. శంకర్ (ఎంసీహెచ్, జియాగూడ)పై బి. మహేశ్‌యాదవ్ (తెలంగాణ పోలీస్), పి. సురేశ్ (గోవింద్రామ్ ఉస్తాద్)పై ఎ. మనోజ్ కుమార్ (యూసుఫ్‌గూడ), ఎ. అజయ్ (మారుతి కరణ్ ఉస్తాద్)పై ముకేశ్ సింగ్ (గోవింద్ రామ్ ఉస్తాద్, సీతారాంబాగ్) విజయం సాధించారు. 74 కేజీల విభాగంలో జి. తరుణ్ యాదవ్ (సూరి పహిల్వాన్)పై, కునాల్ సింగ్ (లాలా తాలీమ్) గెలుపొందాడు. -
వినోద్, బజరంగ్ ‘కంచు’మోత
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (60 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక బౌట్లలో బజరంగ్ 10–4తో యూనిస్ అలీఅక్బర్ (ఇరాన్)పై గెలుపొందగా... వినోద్ ఆతిథ్య దేశానికి చెందిన ఎలామన్ డాగ్డుర్బెక్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బజరంగ్ 5–7తో దైచి తకతాని (జపాన్) చేతిలో... వినోద్ 3–6తో నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. అయితే తకతాని, నవ్రుజోవ్ ఫైనల్‌కు చేరడంతో బజరంగ్, వినోద్లకు కాంస్య పతకాల కోసం నిర్వహించే రెప్‌చేజ్ రౌండ్లలో పోటీపడే అవకాశం లభించింది. రెప్‌చేజ్ తొలి రౌండ్లో బజరంగ్ 12–2తో అబ్దుల్ (తజికిస్తాన్)పై నెగ్గి కాంస్యం కోసం అలీఅక్బర్‌తో పోటీపడ్డాడు. వినోద్‌కు నేరుగా కాంస్యపతక బౌట్ ఆడే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, రజతంతోపాటు ఆరు కాంస్యాలు లభించాయి. -
2 నిమిషాల 33 సెకన్లలో పసిడి!
ఇండోర్: జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్ తోపాటు గీతా ఫొగట్ తమతమ విభాగాలలో స్వర్ణాలు సాధించారు. మూడేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన సుశీల్‌కు ఎదురే లేకపోయింది. ఈ చాంపియన్ షిప్ లో 74 కేజీల విభాగంలో రైల్వేస్ తరపున బరిలోకి దిగిన సుశీల్ కుమార్ కు మూడు వాకోవర్ల లభించడంతో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఫైనల్ కు చేరిన ప్రవీణ్ రాణా గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకోవడంతో సుశీల్ కు స్వర్ణం ఖాయమైంది. అంతకుముందు క్వార్టర్స్, సెమీస్ ల్లో కూడా 34 ఏళ్ల సుశీల్ కు వాకోవర్ లభించింది. అతడు ఆరంభ రౌండ్లలో ప్రత్యర్ధులను నిమిషంలోపే చిత్తుచేయగా, ఆపై వరుసగా మూడు వాకోవర్లు దక్కాయి. దాంతో ఈ విభాగంలో సుశీల్ విజేతగా నిలిచి పసిడిని దక్కించుకున్నాడు. మొత్తంగా స్వర్ణ సాధనలో సుశీల్ అన్ని రౌండ్లలో కలిపి 2 నిమిషాల 33 సెకన్లు మాత్రమే పోరాడడం గమనార్హం. మరొకవైపు సాక్షి మాలిక్, గీతా పొగట్ లు తమతమ విభాగాల్లో పసిడి పతకాలు సాధించారు. -
సుశీల్ వస్తున్నాడు
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ‘దంగల్’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 2014 గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత సుశీల్ మరే టోర్నమెంట్లోనూ బరిలోకి దిగలేదు. బుధవారం ఇండోర్‌లో మొదలయ్యే జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల సుశీల్ రైల్వేస్ తరఫున తన ఎంట్రీని ఖరారు చేశాడు. జార్జియాలో శిక్షణ ముగించుకొని ఆదివారం భారత్‌కు చేరుకున్న సుశీల్ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు జాతీయ చాంపియన్‌షిప్‌లో తాను పాల్గొనడంలేదని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ తెలిపాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌తోపాటు గీత ఫోగట్, వినేశ్ ఫోగట్ కూడా జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్ సమయంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్, సుశీల్ కుమార్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గి ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవ్‌ను ‘రియో’కు పంపిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) స్పష్టం చేయగా... నర్సింగ్‌తో ట్రయల్ నిర్వహించి అందులో గెలిచిన వారిని ‘రియో’కు పంపాలని సుశీల్ కోరాడు. అయితే సుశీల్ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్ఐ తిరస్కరించడం, చివరకు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల విభాగంలో భారత్ తరపున ఎవరూ బరిలోకి దిగలేకపోయారు. -
మహిళా రెజ్లర్లు విఫలం
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ బౌట్లలో పోటీపడిన భారత రెజ్లర్లు నిరాశపరిచారు. లలిత (55 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), శిల్పి షెరాన్ (63 కేజీలు), పూజ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. గురువారం జరిగే బౌట్లలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు), శీతల్ (53 కేజీలు), సాక్షి మలిక్ (60 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు) పోటీపడతారు. -
భారత రెజ్లర్లకు నిరాశ
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో తొలి రోజు గ్రీకో రోమన్ విభాగంలో పోటీపడిన నలుగురు భారత రెజ్లర్లు హర్దీప్ (98 కేజీలు), యోగేశ్ (71 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (75 కేజీలు), రవీందర్ ఖత్రి (85 కేజీలు) నిరాశపరిచారు. ఈ నలుగురిలో ఒక్కరు కూడా కనీసం రెండో రౌండ్‌ను దాటలేకపోయారు. రెండో రౌండ్ బౌట్లలో హర్దీప్ 2–5తో విలియస్ లారినైటిస్ (లిథువేనియా) చేతిలో... యోగేశ్ 1–3తో తకెషి ఇజుమి (జపాన్) చేతిలో... రవీందర్ ఖత్రి 0–8తో విక్టర్ లోరింజ్ (హంగేరి) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ బౌట్లో గుర్ప్రీత్ సింగ్ 1–5తో మిందియా సులుకిద్జె (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత రెజ్లర్లను ఓడించిన వారందరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరగడంతో... మనోళ్లకు రెప్‌చేజ్ రౌండ్లలో పోటీపడి కనీసం కాంస్య పతక బౌట్లకు అర్హత సాధించే అవకాశం లేకుండాపోయింది. పోటీల రెండోరోజు మంగళవారం భారత రెజ్లర్లు జ్ఞానేందర్ (59 కేజీలు), రవీందర్ (66 కేజీలు), హర్‌ప్రీత్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలోకి దిగుతారు.