yadadri bhuvanagiri
-
పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్‌సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్‌సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్‌మాస్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్‌రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఫామ్ ల్యాండ్ బురిడీ
సాక్షి, యాదాద్రి: ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు..అధికారులతో కుమ్మక్కై ప్రధానంగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు, అలాగే అనధికారిక లేఅవుట్లు, చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి. స్థానిక సంస్థల స్థిరాస్తి ఆదాయానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నాయి. వాస్తవానికి అనధికారిక లే అవుట్లను అదుపు చేయడంతో పాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్టర్ల మోసాల బారిన పడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీని ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో 0.20 ఎకరాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ గుంట, రెండు గుంటల భూమిని కూడా ఫామ్ ల్యాండ్ వెంచర్ల కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చిన నాలా కన్వర్షన్ పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్లాట్లను 2000 చదరపు గజాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ 121 (గుంట), 242 (రెండు గుంటలు) గజాల ప్లాట్లను కూడా రిజిస్టర్ చేస్తున్నారు. అలాగే డీటీసీపీ, హెచ్ఎండీఏ, రెరా, వైటీడీఏల అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ఆయా వెంచర్లకు సంబంధించిన మొత్తం సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ ఓపెన్ ప్లాట్లకు నాలా కన్వర్షన్‌తో 121, 242, 363 గజాల ప్లాట్లకు కూడా వెంచర్‌కు సంబంధించిన అన్ని సర్వే నంబర్లు వేసి, ఆ ప్లాటు చుట్టూ హద్దులు ఇతర ప్లాట్లకు సంబంధించిన నంబర్లు వేయడం ద్వారా అన్ని అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను నమ్మిస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో యధేచ్చగా రిజిస్ట్రేషస్లు చేసేస్తుండటం గమనార్హం. కొనుగోలుదారులకు ఎర ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త కొత్త పేర్లతో వేల ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వెంచర్ ప్రారంభోత్సవం రోజునే ప్లాటు కొనుగోలు చేసిన మొదటి 50 మందికి నెలకు రూ.10 వేల చొప్పున 30 నెలల పాటు రెంటల్ చెల్లిస్తామని ఆఫర్ ఇస్తూ పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రియల్టర్లు డెవలప్మెంట్ చార్జీల చలాన్ల నిమిత్తం ఎకరానికి సుమారు రూ.లక్ష చొప్పున చెల్లించకుండా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు 10 శాతం స్థిరాస్తి భూమిని గిఫ్ట్ డీడ్ చేయకుండా ఎగవేస్తున్నారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన జీఓ ప్రకారం అప్పటి కలెక్టర్ పమేలా సత్పతి ఫాంల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కొంత కాలం నిలిచిపోయినా తిరిగి ఊపందుకున్నాయి. 900 వరకు అక్రమ వెంచర్లు! జిల్లాలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తున్న సుమారు 900 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు అంచనా. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, ఆత్మకూర్(ఎం) వలిగొండ, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు సాగుతున్నాయి. ప్రధానంగా వంగపల్లి, సర్వేపల్లి, కాచారం, రఘునాథపురం, కొలనుపాక, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు శ్రీనివాసాపురం, పటేల్‌గూడెం, గుండ్లగూడెం ఆలేరులలో ఫామ్ ల్యాండ్ ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కుదరదు..రుణం రాదు ఫామ్ ల్యాండ్ పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లలో ప్రధానంగా ఇంటి నిర్మాణాలకు అనుమతి లభించదు. డీటీసీపీ అనుమతి లేనందున బ్యాంకు రుణం రాదు. కొనుగోలుదారు ప్లాటు పొజిషన్‌కు స్థానిక సంస్థలు చట్టబద్ధతను సైతం ఇవ్వడం లేదు. 70 ఎకరాల్లో అనధికార లేఅవుట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం ధర్మపురం రెవెన్యూ శివారులో శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్.. రాయల్ గార్డెన్–2 ఫామ్ ల్యాండ్ పేరుతో సర్వే నంబర్లు 26 నుంచి 28 వరకు, అలాగే 30 నుంచి 38 వరకు, 42, 49ల్లోని సుమారు 70 ఎకరాలు అనధికారికంగా లేఅవుట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. వ్యవసాయ భూమిని కేవలం వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్), 60, 40, 30 ఫీట్ల రోడ్లు వేసి, విద్యుత్ స్తంభాలు నాటి గజం రూ.4,600 చొప్పున విక్రయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 300 గజాల ప్లాట్ (నం.806)ను మోత్కూర్ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో (డాక్యుమెంట్ నంబర్ 4716/19) సర్వే నంబర్లు మొత్తం వేసి రిజిస్టర్ చేశారు. ఈ ఒక్క వెంచర్‌లోనే వివిధ విస్తీర్ణాల్లో 2 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. -
రైతుల చేతులకు సంకెళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో.. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టరేట్లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రిమాండ్‌లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు. కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా? నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
యాదాద్రి కొండపై భక్తులకు కష్టాలు
సాక్షి, యాదాద్రి : వేసవి కాలం భానుడి భగభగలు ప్రారంభంతోనే యాదాద్రికొండపైకి వచ్చిన భక్తులు ఉరుకులు పరుగులు పెట్టక తప్పడంలేదు. దేవస్థానానికివస్తున్న వేలాది మంది భక్తులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. రాతికొండపై కృష్ణ శిలలతో నిర్మించిన నూతన దేవాలయం ప్రాంగంణం అంతా భగభగమండిపోతోంది. ఉదయం 11 గంటల నుంచే ఫ్లోరింగ్ బండల నుంచి వేడి సెగలు భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. రూ.150 టికెట్‌తో శీఘ్ర దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకు నిలువ నీడ లేకుండాపోయింది. ఆలయంలో శ్రీ స్వామి దర్శం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఫ్లోరింగ్ బండలపై నడిచే భక్తుల కాళ్లు కాలుతున్నాయి. వృద్ధులు వేగంగా నడవలేక అరికాళ్లు కమిలిపోతున్నాయి. దూరంగా ఉన్న ప్రసాదాల విక్రయం వద్దగల నీడ కోసం పరుగులు తీస్తున్నారు. కొండపైన విశాలమైన స్థలం ఉన్నా కనీసం చలువ పందిళ్లు వేయకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
BRS Party: ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి? నేరుగా కేసీఆర్, కేటీఆర్‌తోనే..
సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్ఎస్లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకుంటున్నారు. తమకే వస్తుందన్న ధీమా అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్‌కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి ఆ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్‌నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక సమీకరణలపై లెక్కలు ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి. మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. -
ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు.. గుండెపోటుతో భూ నిర్వాసితుని మృతి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న తమ భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాలని బీఎన్ తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసితులు 58 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇదేమీ పట్టించుకోకుండా ఈ నెల 24న రెవెన్యూ అధికారులు వారికి ఇళ్లు ఖాళీచేయాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. దీంతో పరిహారం ఇవ్వకుండా.. ఇల్లు ఖాళీచేయమంటున్నారని మనస్తాపం చెందిన జూపల్లి నర్సింహ(46 ) అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మృతునికి చెందిన అర ఎకరం భూమి రిజర్వాయర్ ముంపు కింద పోతుండడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా గ్రామస్తులంతా నర్సింహ మృతదేహంతో కలె క్టర్ కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు మాసు కుంట వద్ద హైదరాబాద్–వరంగల్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు వీరి ఆందోళన కొనసాగింది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్తుల వద్దకు చేరుకుని.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారదా అంజనేయులు, సర్పంచ్ లతరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: పిల్లల్లో పోషకాహార లోపం.. తెలంగాణలో 1.20 లక్షల మందిలో గుర్తింపు -
పోస్టులు పంచుకున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. ఒక్కో పోస్టు రూ.50 వేలు?
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ 18, బీజేపీ 5, కాంగ్రెస్ 5 ఇవేవో ఎన్నికల ఫలితాలు అనుకుంటే పొరపాటే.. భువనగిరి మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగాలను ఆయా పార్టీలు పంచుకున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పొరుగుసేవల ఉద్యోగుల భర్తీ కోసం ఒక్కటయ్యారు. అధికార పార్టీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు ఒక్కొక్కరు చొప్పున, బీజేపీ, కాంగ్రెస్‌లు కౌన్సిలర్లతో సంబంధం లేకుండా ఐదుగురు చొప్పున తమకు నచ్చిన వారిని నియమించుకోవాలని అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందులో కొందరు కౌన్సిలర్లు ఉద్యోగాలు పెట్టిస్తామని సదరు నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం హడావుడిగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. చేయాల్సిన పనులు: మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చడం, డ్రెయినేజీలను శుభ్రం చేయుట, చెత్త సేకరణ ఇతరత్రా పారిశుద్ధ్య పనులు చేయడానికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 9 మంది మహిళలు, 19 మంది పురుషులు మొ త్తం 28 మందిని నియమించుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగినవారు ధరఖాస్తు చేసుకోవా లని ఉపాధి కల్పన అధికారి శాంతిశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) నియామక ప్రకటన ఇదీ పారిశుద్ధ్య పోస్టుల్లో నియామకం కోసం ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సున్నవారు అర్హులు. అనుభవం అవసరం లేదు. అరోగ్యవంతులై ఉండాలి. అభ్యర్థులు భువనగిరికి చెందిన వారే అర్హులు. నెలకు రూ.15,600 పారి తోషకం చెల్లిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, కలెక్టరేట్లోని తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ (టీమ్) ఆఫీస్‌లో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 లోపు అందజేయాలి. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు మున్సిపాలిటీలో పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. 28 పోస్టులను పార్టీల వారీగా పంచుకున్న వెంటనే కొందరు కౌన్సిలర్లు అశావహుల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో పక్క ఉద్యోగాల కోసం వసూళ్లు అంటూ ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా) -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
అంచనాలు తారుమారు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ: టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నియామకాలతో జిల్లా నేతల అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన వారెవరికీ పదవి దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భావించారు. తద్వారా జిల్లాలో అన్ని వర్గాలను దగ్గర చేసుకోవ్చనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకాలను చూస్తే మంత్రి మాట నెగ్గినట్టు అవగతమవుతోంది. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు తనకు ఇస్తారని కిషన్‌రెడ్డి భావించినా.. నల్లగొండలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కోటాలో తనకు కచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి భావించారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఇస్తారని ఎదురుచూసినా దక్కలే. ఆయనతో పాటు గుత్తా జితేందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవీంద్రకుమార్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. చదవండి: అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అంతే.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఊహించని విధంగా నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నుంచి వై.వెంకటేశ్వర్లు, ఎస్ఏ రజాక్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. చివరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బూడిద భిక్షమయ్యగౌడ్, ఆకుల ప్రభాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని తారుమారు చేస్తూ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఒకటి ఎస్టీ, మరొకటి బీసీ, ఇంకొకటి ఓసీ సామాజికవర్గానికి కేటాయించారు. పవర్ సెంటర్‌గా మారకూడదనే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ నేతలను అందరిని కలుపుకుపోయే వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీలో మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గాల్లో కీలకమైన ఎమ్మెల్యేల మాట కాదనకుండా ముందుకు వెళ్లే వారికే పార్టీ బాధ్యతల అప్పగించాలన్న ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అధిష్టానం అప్పగించింది. ఇక్కడా అదే అమలు చేసింది. దేవరకొండ ఎమ్మెల్యేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పార్టీ నేతలు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కలిసిపోయే తత్వం కావడం.. మంత్రికి అనుగుణంగానే ఉండే నాయకుడు అయినందున ఆయన్ని నియమించింది. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే సూర్యాపేటలో ఎంపీ లింగయ్య యాదవ్ కూడా మంత్రి జగదీష్‌రెడ్డికి అనుకూలంగా ఉంటారు. యాదాద్రిలోనూ అంతే. కాగా, మూడు జిల్లాల్లోనూ అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఇస్తే ఎమ్మెల్యేలకు వారికి మధ్య కొంత గ్యాప్ వస్తుందనే భావన నెలకొంది. పైగా పార్టీ అధ్యక్షులు అయినందున వారు మరో పవర్ సెంటర్‌గా మారుతారనే వాదన ఉంది. అవేమీ లేకుండా మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేవారికి అధ్యక్ష పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు దీటుగా.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శంకర్‌నాయక్ ఉండగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా వెంకన్నయాదవ్ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనిల్‌కుమార్‌రెడ్డి ఉండగా, ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కూడా అదే సామాజిక వర్గాల వారిని అధ్యక్షులుగా నియమించింది. విధేయత, సమన్వయమే లక్ష్యంగా.. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ గతంలో కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల్లో తిరిగిన అనుభవంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉంటారని పార్టీ అంచనా. బడుగుల లింగయ్య యాదవ్ కూడా టీడీపీ అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పని చేశారు. రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి విధేయునిగా ఉండటంతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటారన్న అంచనాలతోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి దేవరకొండ : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేను అయిన నాపై పూర్తి విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. బయోడేటా పేరు : రమావత్ రవీంద్రకుమార్ స్వస్థలం : దేవరకొండ మండలం రత్యాతండా రాజకీయ ప్రస్థానం: రవీందక్రుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే 1995లో దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సీపీఐ మద్దతుతో ఆయన సర్పంచ్‌గా గెలుపొందారు. 2001లో రెండోసారి కూడా సర్పంచ్‌గా గెలిచారు. సర్పంచ్‌గా మూడేళ్ల మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక 2004లో సీపీఐ తరఫున దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాక సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఐ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. -
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా వర్షాలు
-
Menhir: 3000 ఏళ్ల నాటి.. సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి
సాక్షి, హైదరాబాద్: ఇది దాదాపు మూడు వేల ఏళ్లనాటి మెన్హిర్. అంటే ఆదిమ మానవుల సమూహంలో కాస్త ముఖ్యమైన వ్యక్తులుగా భావించే వారి సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి. అలాంటి రెండు అరుదైన మెన్హిర్లు యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామ శివారులో వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, గోపాల్ వీటిని గుర్తించారు. అందులో ఒకటి కొంత విరిగి నేలపైకి ఒరిగిపోగా, 4–5 అడుగుల వెడల్పు, 15–16 అడుగుల ఎత్తు ఉన్న మరో మెన్హిర్ నిలిచే ఉందని పరిశోధకులు చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సమాధులు ఉండేవని, వాటికి చెందిన పెద్దపెద్ద రాతి గుండ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం తరలించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని కాపాడి చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు. -
రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకిన ఎస్సై.. శభాష్ సైదులు
సాక్షి, యాదాద్రి : అధికారిగా ఆదేశాలిచ్చేకంటే తానే పనిలోకి దిగితే ఆదర్శవంతమైన ఫలితం ఉంటుందన్న అతని నమ్మకం సత్ఫలితాలనిచ్చింది.బాలుర మృతదేహాలను బయటకు తీయడానికి తానే ధైర్యంగా రిజర్వాయర్‌లోకి దిగిన భువనగిరి రూరల్ ఎస్ఐ సైదులుపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.కరోనా కాలంలోనూ అభాగ్యుల ఆకలితీర్చాడు. ప్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు సేవలందిస్తున్న భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులుపై ప్రత్యేక కథనం రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకి భువనగిరి కిసాన్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(14), హనుమాన్‌వాడకు చెందిన హేమంత్(15)సోమవారం సాయంత్రం భువనగిరి మండలం బస్వాపురం శివారులోని నృసింహ రిజ ర్వాయర్‌ను చూడటానికి వెళ్లి నీటిలో మునిగి పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సైదులు అక్కడకు చేరుకున్నాడు. పిల్లల చెప్పులను చూసి రిజర్వాయర్‌లో మునిగిపోయారని ధ్రువీకరించుకున్నాడు.ఎన్డీఆర్ఎఫ్, గజ ఈత గాళ్ల కోసం సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి తానే రంగంలోకి దిగాడు. 15 ఫీట్ల లోతున్న నీటిలోకి దిగి మూడు గంటలు గాలించి బాలుర మృతదేహా లను బయటకు తీశారు.ఎస్ఐని బ స్వాపు రానికి చెందిన నాయకులు సత్కరించారు. మతిస్థిమితం లేని కోటీశ్వరుడి గుర్తింపు హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన శ్రీ కాంత్ కోటీశ్వరుడు. 15 రోజుల క్రితం రాయగిరికి వచ్చాడు. రోడ్ల పక్కన తిరుగుతుండటంతో ఎస్ఐ గమనించి చేరదీశాడు. వివరాలు తెలుసుకోగా అతడు కోటీశ్వరుడని తేలింది. అతన్ని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాడు. లాక్డౌన్లో.. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లోనూ ఎస్ఐ సైదులు అనేక సేవలందించాడు. వందలాది మంది అభాగ్యులకు సొంత ఖర్చుతో భోజనం అందిజేసి ఆకలి తీర్చాడు. నేనే ముందుంటా.. అధికారిగా తాను ముందుండి పనిచేయ డం ద్వారా మిగతావా రు కలిసి వస్తారు. బ స్వాపూర్ రిజర్వాయర్‌లో అదే చేశాను.గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చాను కాబట్టి నా కు ఈత వచ్చు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లకోసం ప్రయత్నించాం. కానీ,ఆలస్యం అవుతుందని భావించి నేనే రిజర్వాయర్‌లోకి ది గాను.ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశాను. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో వందలాది మంది ఆకలి తీర్చాను. –కె.సైదులు, ఎస్ఐ, భువనగిరి రూరల్ -
భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు!
హైదరాబాద్: యాదాద్రికి సమీపంలో భారీ రియల్ దందా బయటపడింది. యాదాద్రి, భువనగిరి చుట్టుపక్కల భూముల కొనుగోళ్లలో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య గత ఆరేళ్లలో రూ.700 కోట్ల విలువైన లెక్కల్లో చూపని అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాల్లో అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్టతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంస్థలు వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లను నిర్మిస్తుంటాయి. యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివారులో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక సమాచారం సేకరించారు. భూముల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఈ సోదాల సందర్భంగా లెక్కలు చూపని రూ.11.88 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఆరేళ్లలో లెక్కలు చూపకుండా (నల్లదనం) సాగించిన లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన విలువ కంటే ఎక్కువ నగదు స్వీకరించి, ఆ నగదును భూముల కొనుగోలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. కలకలం రేపిన సోదాలు.. మార్చి 23, 24వ తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ సోదాలు జరిపిన కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్పెక్ట్రా, సన్‌సిటీ సంస్థలు ఉన్నాయి. స్పెక్ట్రా సంస్థ చైర్మన్ జగన్, సన్‌సిటీ సంస్థ చైర్మన్ నారాయణగౌడ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రాలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న కాంగ్రెస్ ఆలేరు ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఇంటిపై మార్చి 23, 24 తేదీల్లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ 2 సంస్థల మధ్య జరిగిన దాదాపు రూ.700 కోట్ల మేర లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఎవరీ బీర్ల ఐలయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య రాజకీయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. కొంతకాలంగా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో భూములు కొంటూ.. అమ్ముతూ వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు. గతంలో సైదాపురం సర్పంచ్‌గా, పాల సంఘం చైర్మన్‌గా, యాదగిరిగుట్ట పట్టణంలో ఎంపీటీసీగా కొనసాగారు. ఈ క్రమంలోనే కొందరు భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడం, అమ్మడం చేసేవారు. హైదరాబాద్‌కు చెందిన స్ప్రెక్టా రియల్ ఎస్టెట్ కంపెనీతో పరిచయం పెంచుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. బీర్ల అయిలయ్య రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
యాదాద్రిలో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్
యాదాద్రి, భువనగిరి : దేశ, విదేశాల నుంచి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్ధీకి అనుగుణంగా ఆలయ సమీపంలో 7 ఎకరాల్లో ఆధ్యాత్మిక బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయంలో నిర్మించే బస్ టెర్మినల్, బస్ డిపోకు కావల్సిన స్థలాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సైదాపురం గ్రామ శివారులో 150 బస్సులు పార్కింగ్ చేసేలా డిపో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదంతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలను చేపడతామన్నారు. ఆలయ ప్రారంభానికి ముందే బస్ టెర్మినల్, డిపోలను ప్రారంభించడానికి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకమైన స్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు మరో స్టేషన్ నిర్మాణం నూతన బస్ టెర్మినల్ లో నిర్మించేలా ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారుఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సుశీల్ శర్మ, కలెక్టర్ అనితా రామచంద్రన్, రవాణా శాఖ కమిషనర్ శ్రీ ఎం.ఆర్.ఎం. రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ పురుషోత్తం, శ్రీ పి.వి.మునిశేఖర్, నల్గొండ ఆర్.ఎం శ్రీ వెంకన్న, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈ ఓ గీత, ఆర్ అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్‌ను ఆదివారం ఫాంహౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు. వెంటనే జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను ఎక్స్పోజర్ విజిట్ కోసం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు తీసుకుపోవాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. ఎర్రవల్లిని అభివృద్ధి చేసిన అప్పటి సిద్దిపేట, ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు అధికారులు సోమవారం వాసాలమర్రికి రానున్నారు. గ్రామసమస్యలపై సర్వే చేపట్టనున్నారు. గ్రామాభివృద్ధికిగాను బ్లూ ప్రింట్ తయారీ కోసం ప్రత్యేకాధికారిగా డీఆర్డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డిని నియమించారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం వాసాలమర్రిని సందర్శించి సర్పంచ్, గ్రామస్తులతో అభివృద్ధి, ఉపాధి అంశాలపై చర్చించారు. -
కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ
యాదాద్రి, భువనగిరి : జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. భువనగిరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్ క్షేమంగా బయటపడ్డారు. అకాల వర్షంతో వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
దిల్ రాజు కీలక నిర్ణయం
ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సత్యనారాయణ ఏడాది క్రితం కాలం చేశాడు. అతని భార్య అనురాధ కూడా ఇటీవలే మరణించారు. దీంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ కథనం ఎంతో మందిని కదిలించగా నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర) వారు ఎంతమాత్రం అనాథలు కారని, వారి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారిని మహారాష్ట్రలోని నాసిక్‌కు తీసుకువచ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతానని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి పరిస్థితికి చలించిపోయారు. ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరకు వెళ్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదు. (సోనూసూద్ అన్లిమిటెడ్ : వారి బాధ్యత నాదే) -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్‌లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) -
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్.. జార్జియాలో శివాణి
యాదాద్రి జిల్లా : భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు విద్యార్థులు సమాచారం అందించారు. దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్‌కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్‌కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్‌రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్‌ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
యాదాద్రి మున్సిపాలిటీలు కారు కైవసం
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్ చైర్మన్లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్ చైర్మన్ దక్కింది. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్‌చైర్మన్ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్ చైర్మన్ దక్కింది. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్‌గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, చౌటుప్పల్‌లో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందుండి నడిపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దిశానిర్దేశంతో క్లీన్ స్వీప్ చేశారు. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించారు. క్యాంపుల్లోనే కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచారు. దీంతో కౌన్సిల్ హాల్ లోకి వచ్చేవరకు ఎవరు చైర్మన్, వైస్‌చైర్మన్ అవుతున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ తరఫున విప్ జారీ చేసి ఎన్నికల అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధికా రులు ప్రకటించిన పేర్లకు మద్దతుగా చేతులెత్తడం ద్వారా తమ సమ్మతిని తెలియజేసి ఎన్నుకున్నారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులను పోటిలో నిలిపింది. సకాలంలో హాజరుకాని బీజేపీ 22 వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేశ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. భువనగిరిలో పోటాపోటీ.. 35 వార్డులున్న మున్సిపాలిటీలో టీ ఆర్ఎస్ కు ఇండిపెండెంట్లతో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్స్ ఆఫిషియో ఓట్లతో కలిసి టీఆర్ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్, బీజేపీల పొత్తుతో వారిబలం 18కి చేరినప్పటికీ బీజేపీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ సకాలంలో హాజరు కాలేదు. దీంతో వారి బలం 17కు పడిపోయింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనబోయిన ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోత్నక్ ప్రమోద్‌కుమార్ పోటీ పడ్డారు. అయితే అంజనేయులకు 19 ఓట్లు రాగా ప్రమోద్‌కుమార్‌కు 17 ఓట్లు వచ్చాయి. దీంతో అంజనేయులు చైర్మన్‌గా గెలుపొందారు. కాగా వైస్ చైర్మన్ కోసం టీఆర్ఎస్ తరఫున చింతల కిష్టయ్య, బీజేపీ తరఫున మాయ దశరథ పోటీ పడ్డారు. అయితే చైర్మన్ తరహాలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలేరులో : 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండింపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బలం 9కి చే రింది. చైర్మన్‌గా వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూదాన్‌పోచంపల్లిలో: 13 వార్డులకు టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. పూర్తి మెజార్టీ ఉండడంతో టీఆర్ఎస్కు చెందినచిట్టిపోలు విజయలక్ష్మి చైర్మన్‌గా, బాత్కలింగస్వామి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోత్కురులో ఏకగ్రీవం: మున్సిపాలిటీలో 12 వార్డులకు టీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లను గెలుచుకోగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం 8కి చేరింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదు మాత్రమే ఉంది. దీంతో చైర్మన్ పదవికి టీఆర్ఎస్ తరఫున తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ తరఫున గుర్రం కవిత పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ నిర్వహించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి స్వాతి చైర్మన్‌గా విజయం సా«ధించింది. వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ ఏకగ్రీవం: చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. ఎన్ని కను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు బహిష్కరించారు. 20వార్డులు ఉండగా టీర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3 ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సా«ధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. అయితే టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్, సీపీఎం పొత్తును నిరసిస్తూ ఎన్నికనుఅడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను పోలీస్‌ల సహయంతో బయటకు పంపించారు. దీంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయకుండానే బయటకువెళ్లిపోయారు. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశంలో టీఆర్ఎస్, సీపీఎంలకు చెందిన 11 మంది సభ్యుల కోరం ఉండడంతో చైర్మన్‌గా టీఆర్ఎస్కు చెందిన వెన్‌రెడ్డిరాజు, వైస్ చైర్మన్‌గా సీపీఎంకు చెందిన బ త్తుల శ్రీశైలంలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత నడుమ.. ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్అఫిషియో సభ్యుల బలంలో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 12 వార్డులకు టీఆర్ఎస్ 4 చోట్ల గెలువగా, ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి టీఆర్ఎస్ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్లతో బలం 7కు చేరింది. టీఆర్ఎస్ తరపున చైర్‌పర్సన్‌గా ఎరకల సుధ, కాంగ్రెస్ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్‌గా టీఆర్ఎస్ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాటంరాజు ఎన్నికయ్యారు. -
అమల్లోకి ఫాస్టాగ్: టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్