సీసీఐ కొనుగోళ్లపై విజిలెన్స్ ఆరా
ఇప్పటికే విచారణకు ఆదేశించిన వైనం
రైతుల పేరిట వందల క్వింటాళ్లు విక్రయించడంపై అనుమానం
వివరాల సేకరణలో మార్కెటింగ్ శాఖ
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ పత్తి కొనుగోళ్లలో గోల్‌మాల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జిల్లాలో కొందరు వ్యాపారులు రైతుల పేరిట సీసీఐకి విక్రయాలు జరిపి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు రైతులు వందల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించడంపై విజిలెన్స్ దృష్టి సారించింది.
ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులకు లేఖ రాసింది. వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వందల క్వింటాళ్లు అమ్మిన రైతులకు ఎంత భూమి ఉంది.. ఎంత దిగుబడి వచ్చింది.. రైతుకు ఉన్న భూమిలో పత్తి పంట వేశారా.. ఇతర పంటలు వేశారా.. ప్రస్తుతం సాగు జరుగుతుందా.. లేదా అనే పది రకాలకు సంబంధించి ప్రశ్నలను మార్కెటింగ్ అధికారులను అడిగారు. వారు రైతులా, వ్యాపారులా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇందుకు సంబంధించి వారం క్రితమే ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ అధికారులకు సీసీఐ విజిలెన్స్ అధికారులు వివరాలు కోరారు.
ఈ క్రమంలో ఆ శాఖ అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అంతా సవ్యంగానే ఉందని, ఎలాంటి తప్పిదాలు జరగలేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. విచారణ చేపట్టకముందే వారు చెప్పే మాటలను చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితమైన నివేదిక సమర్పిస్తారా.. లేదా తూతూమంత్రంగా విచారణ చేపట్టి ముగిస్తారా అనే చర్చ సాగుతోంది.
ఐదుగురు రైతుల వివరాలు అడిగిన విజిలెన్స్..
జిల్లాలో ఈ ఏడాది 4లక్షల 34వేల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 71వేల ఎకరాల్లో సోయా, 52వేల ఎకరాల్లో కంది సాగైంది. అయితే ఇప్పటివరకు 16లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు లక్ష 50వేల క్వింటాళ్ల కొనుగోలు చేశారు. ఇందులో పలువురు రైతులు మాత్రం వందల క్వింటాళ్ల మేర సీసీఐకి విక్రయించడంపై విజిలెన్స్ అధికారులు విచారణకు దిగారు. పత్తిని విక్రయించిన వారు రైతులేనా, లేక వ్యాపారులా, వారికి ఎంత దిగుబడి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
జైనథ్ మండలానికి చెందిన ఓ రైతు పేరిట 256 క్వింటాళ్లు, తలమడుగు మండలానికి చెందిన రైతు పేరిట 280 క్వింటాళ్లు, ఆదిలాబాద్‌అర్బన్‌కు చెందిన రైతు పేరిట 336 క్వింటాళ్లు, ఆది లాబాద్‌రూరల్ మండలంలోని జందాపూర్‌కు చెందిన ఓ రైతు పేరిట 306 క్వింటాళ్లు, గుడిహత్నూర్ మండలానికి చెందిన ఓ రైతు 312 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర లభించింది. అయితే ఈ ఏడాది పత్తి దిగుబడి ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
గోల్‌మాల్ జరుగుతోందా..?
ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు శనివారం ఓ ఐచర్ వాహనంలో వందల క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చారు. సిబ్బంది నామమాత్రంగా తేమ పరిశీలించారు. అయితే ఓ ట్రాక్టర్‌లో మరో రైతు పత్తిని తీసుకురాగా తేమ శాతం ఎక్కువగా ఉందని, కొనుగోలు చేయమని సిబ్బంది చెప్పడంతో సంబంధిత రైతు ఆందోళనకు దిగాడు. వ్యాపారులు అధికారులతో కుమ్ముకై ్క పత్తిని విక్రయించుకొని మద్దతు ధర పొందుతున్నారని, రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని, తేమ పేరిట కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. పట్టణంతో పాటు జిల్లాలోని పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి వందల క్వింటాళ్లు సీసీఐకి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి నిబంధనలు వర్తించవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సీసీఐ సిబ్బంది, దళారులు, కొంత మంది మునీమ్‌లు మిలాఖతై అక్రమాలకు తెర లేపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అంతా సక్రమంగానే ఉంది
సీసీఐ విజిలెన్స్ అధికారులు ఈనెల 20న ఐదుగురు రైతులకు సంబంధించి వివరాలను అడిగారు. వారి వివరాలు సేకరించి పంపుతున్నాం. అంతా సక్రమంగానే ఉంది. ఎలాంటి గోల్‌మాల్ లేదు. ఓ రైతుకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. వచ్చిన తర్వాత సీసీఐ విజిలెన్స్ అధికారులకు సమర్పిస్తాం.
– మధుకర్, మార్కెట్ కార్యదర్శి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment