మద్దతు ధర కోసం జీడి రైతుల పాదయాత్ర
రావికమతం(చోడవరం)/దేవరాపల్లి: జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం రావికమతం మండలం నేరేడు బంద నుంచి అజయ్‌పురం వరకూ జీడిమామిడి రైతులు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ఆందోళన నిర్వహించారు. జీడితోటల మధ్య నుంచి వీరు పాదయాత్ర చేశారు. గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీలో స్థానిక గిరిజన జీడి రైతులతో కలిసి సీపీఎం నేత వెంకన్నశుక్రవారం జీడి పంటలను పరిశీలించారు. వెంకన్న మాట్లాడుతూ జీడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీడికి మాత్రం మద్దతు ధర ప్రకటించడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాయితీలను పునరుద్ధరించాలని, ఉపాధి హామీ పథకంలో జీడి తోటల అభివృద్ధికి ఎకరాకు రూ.9 వేల చొప్పున అందజేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు, డి. శంకర్, డి.సోమయ్య, మామిడి దేముడు, సిహెచ్. ఎరకయ్య, సోముల కృష్ణ, డి. నారాయణ, పి.అప్పలరాజు పాల్గొన్నారు.
రావికమతం మండలం నేరుడు బంద నుంచి పాదయాత్ర చేస్తున్న జీడిమామిడి రైతులు, సీపీఎం కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment