సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2019లో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇక్కడ అసమ్మతుల బెడద ఎక్కువైంది. సొంత పార్టీలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభాకర్ చౌదరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని ఆ పార్టీ నేతలే తిరగదోడుతున్నారు. ఆయనొక అవినీతిపరుడు, ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సీటు త్యాగం చేయడానికి నువ్వెవరు?
జనసేనతో పొత్తులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తన సీటు త్యాగం చేసి.. ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్‌చౌదరి చెబుతున్నారు. పవన్ కాకుండా ఆ పార్టీ అభ్యర్థిని ఎవర్ని పెట్టినా మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలే తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవ్వరు, ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా’ అని టీడీపీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా దుయ్యబట్టారు. జనసేన తరఫున పోటీ చేయడానికి తాను రెడీగా ఉన్నానని, నీ మద్దతు తనకేమీ అక్కర్లేదని, నీ పేరు చెప్పుకుంటే అవినీతి తప్ప ఇంకేమీ గుర్తు రాదు అంటూ వ్యాఖ్యానించారు.
చౌదరికి మైనార్టీల సెగ
ఓటర్ల పరంగా ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉన్న అనంతపురం అర్బన్‌లో ఆ వర్గం వారే నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తానే అభ్యర్థినని, మైనార్టీలు తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని టీడీపీ నేత జకీవుల్లా అంటున్నారు. ఆయన రెండ్రోజులుగా నియోజకవర్గంలో కుక్కర్‌లు పంచుతున్నారు. మరోవైపు టికెట్ ఇప్పిస్తానని తనకు బాలకృష్ణ అభయమిచ్చారని, తానే అభ్యర్థినంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్‌మొహిద్దీన్ ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీలో మరికొంత మంది మైనార్టీ నేతలు స్వయంప్రకటిత అభ్యర్థులుగా చెలామణి అవుతున్నారు. దీంతో ప్రభాకర్ చౌదరి అసమ్మతుల నుంచి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనసేన నుంచి జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌రెడ్డి తీవ్రంగా పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే ప్రభాకర్ చౌదరి కథ ఈ ఎన్నికల్లో ముగిసినట్టేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment