రూ.65 వేలకోట్లతో 500 ప్లాంట్ల ఏర్పాటు
సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం
దీనికి పునాది పడింది వైఎస్ జగన్ సర్కారులోనే
ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం జగన్
సాక్షి, అమరావతి: రిలయన్స్ ఎనర్జీ రాష్ట్రంలో రూ.65 వేలకోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూపు ప్రతినిధులు, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ విజయానంద్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమైంది.
రిలయన్స్ రూ.1,024 కోట్లతో తొలిదశలో ఏర్పాటు చేయనున్న ఎనిమిది ప్లాంట్లకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి సీఎం వైఎస్ జగన్ పునాది వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఆ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రెండోదశలో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని రిలయన్స్ అప్పుడే చెప్పింది. ఇప్పుడు 500 ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు లోకేశ్ ఘనత అని మీడియాకు లీకులివ్వడం విమర్శనీయంగా మారింది.
మూడేళ్లలో పూర్తిచేయాలి
ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్కొక్కటి రూ.130 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ల పనుల్ని మూడేళ్లలో పూర్తిచేయాలని రిలయన్స్ ప్రతినిధులను కోరారు. వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నారు. వృధా భూముల్లో ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ చెత్తను పండించడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.
క్లీన్ ఎనర్జీ పాలసీలో రైతులకు ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని పేర్కొన్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 8 ప్లాంట్లకు మున్సిపాలిటీల తడిచెత్తను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు రిలయన్స్ ప్రతినిధి మాట్లాడుతూ రాష్ట్రంలో కాకినాడలో మూడు, రాజమహేంద్రవరంలో రెండు, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో ఒక్కోప్లాంటు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అవి వచ్చే మార్చి నుంచి నవంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. మంత్రులు లోకేశ్, రవికుమార్, టి.జి.భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment