బి.కొత్తకోట/కురబలకోట : బి.కొత్తకోట మండలం మొగసాలమర్రి వద్ద బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో భర్త వి.అన్నయ్య (45) దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న అన్నయ్య భార్య మధుప్రియ (40) నీ వెంటే నేనూ అంటూ లోకం విడిచి వెళ్లింది. గాయపడిన మధుప్రియను కాపాడుకునేందుకు ఆదివారం రాత్రి తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కురబలకోట మండలం ఎర్రమద్దివారిపల్లెకు చెందిన అన్నమయ్య, మధుప్రియ దంపతులు ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం బి.కొత్తకోటలో స్థిరపడ్డారు.
పీటీఎం రోడ్డులో పానీపూరి బండి నడుపుకొంటూ జీవిస్తున్నారు. ఏడాది క్రితం కుమార్తె మానసకు పెళ్లిచేశారు. కుమార్తె ఒక్కతే కావడంతో భార్యాభర్తలు బి.కొత్తకోటలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం ఎర్రమద్దువారిపల్లెలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా మొగసాలమర్రి వద్ద కారు ఢీకొనడంతో అన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన భార్యను చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108లో తిరుపతికి తరలిస్తుండగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు వద్ద మృతి చెందింది. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో ఇద్దరి మృతదేహాలకు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఒకేసారి పోస్టుమార్టం నిర్వహించారు.
భర్త మరణం తెలియకనే..
ఆదివారం రాత్రి మొగసాలమర్రి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో భర్త అన్నయ్య ఘటనాస్థలిలోనే దుర్మణం చెందాడు. ప్రమాదం జరగ్గానే భార్య అపస్మారక స్థితికి వెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత భర్త మృతి చెందిన విషయం కూడా తెలియలేదు. శరీరంపై గాయాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని భావించారు. అయితే శరీరంలో రక్తప్రసరణకు సంబంధించిన సమస్య ఉత్పన్నమైనట్టు తెలిసింది. ఈ సమస్య వల్లే తిరుపతికి చేరుకోవడానికి ముందే మధుప్రియ మృతి చెందింది. తమ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంపై మొగసాలమర్రి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒంటరైన కుమార్తె
అన్నయ్య, మధు దంపతులకు మానస ఒక్కరే కుమార్తె. కుమారులు లేరు. ఇంటర్ దాకా చదివిన మానసకు ఏడాది క్రితం రాజంపేట మండలం ఈడిగపల్లెలో వివాహం చేశారు. కన్నవారు దూరం కావడంతో వారి ఒక్కగానొక్క కుమార్తె మానస దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లుతోంది. స్వగ్రామం ఎర్రమద్దివారిపల్లెలో ఆదివారం వీరి అంత్యక్రియలు జరిగాయి. పక్కపక్కనే వీరిని సమాధి చేశారు. వీరు అన్యోన్యంగా జీవించేవారు.
ఎక్కడికెళ్లినా కలసి వెళ్లేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లిపోయారు..ఇక నాకు పెద్దదిక్కు ఎవరమ్మా...అంటూ కుమార్తె మానస తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదించడం చూపరుల కంట తడిపెట్టించింది. ఈమెకు తల్లిదండ్రులు ఇద్దరూ దూరమవడం అంతులేని వ్యథను మిగిల్చింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment