ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తు.. ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఐదుగురిని బలి తీసుకుంది. ఇద్దరిని తీవ్రంగా, మరో 12 మందిని స్వల్పంగా గాయాల పాలు చేసింది. ఇలా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. సిమెంటు ట్యాంకర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుల హాహాకారాలు, బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఓబులవారిపల్లె : కడప– రేణిగుంట జాతీయ రహదారి 716 శనివారం సాయంత్రం రక్తమోడింది. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును సిమెంటు ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప ఐసీఎల్ నుంచి చైన్నెకి సిమెంటు పొడి లోడుతో వెళ్తున్న లారీ చిన్నఓరంపాడు డాబా హోటల్ వద్దకు రాగానే వేగంగా వచ్చి అదుపు తప్పింది.
అదే సమయంలో తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ట్యాంకర్ డ్రైవర్ వేగంగా రోడ్డుకు అటు, ఇటు తిప్పుతూ వస్తుండాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. లారీ డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నారని గ్రహించి.. ప్రమాదం నుంచి బస్సును తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించి కుడి వైపునకు పూర్తిగా పక్కకు తిప్పాడు. ట్యాంకర్ లారీ బస్సు మధ్య భాగంలో కండక్టర్ సీటు వద్ద నుంచి, బస్సు వెనుక భాగంలో బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కడప సమీపంలోని కోగటం గ్రామానికి చెందిన బి.కమాల్‌బాషా (65), చిన్న ఓరంపాడు జ్ఞానంపల్లె దళితవాడకు చెందిన జి.శ్రీనివాసులు (60), రాజంపేట మండలం వెంకట రాజంపేటకు చెందిన కొమరావతి శేషహాద్రి కె.శేఖర్ (55) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిట్వేలి గ్రామానికి చెందిన చెవ్వు అమర్‌నాథ్‌రెడ్డి (33) కడపకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(70)ను తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మంగళం వద్ద చనిపోయాడు.
గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలింపు
తిరుపతిలోని శ్రీ చైతన్య బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నిఖిత, వెన్నెలకు తీవ్రంగా గాయాలు కావడంతో.. 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. కళాశాలకు హోం సిక్ హాలీడేస్ ఇవ్వడంతో సిద్దవటం గ్రామానికి చెందిన నిఖిత, నందలూరు ఎర్రచెరువుగ్రామానికి చెందిన వెన్నెల తన స్నేహితులతో కలిసి బస్సులో తిరుపతి నుంచి బయలుదేరారు.
మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కొందరిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. చిన్న ఓరంపాడు దళితవాడకు చెందిన జి.శ్రీనివాసులు రాజంపేటకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. పది నిమిషాల్లోపు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు. కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న శ్యామలాదేవి భర్త కె.శేఖర్ తిరుపతి నుంచి రాజంపేట మండలం వెంకట.. రాజంపేటకు వస్తుండగా మృతి చెందాడు.
స్తంభించిన ట్రాఫిక్
ట్యాంకర్ బస్సును ఢీకొని రోడ్డు మధ్యలో పడిపోవడంతో దాదాపు మూడు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రైల్వేకోడూరు నుంచి పుల్లంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాజంపేట డీఎస్పీ చైతన్య, రైల్వే కోడూరు సీఐ నరసింహులు, ఓబులవారిపల్లె ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి, కడప, రాజంపేట డిపో మేనేజర్లు డిల్లీశ్వరావు, రమణయ్య, రాజంపేట, కడప ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్లు మాధవీలత, కన్యాకుమారి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్యాంకర్, బస్సును భారీ క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాద విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల హాహాకారాలతో సంఘటనా స్థలం దద్దరిల్లింది. చుట్టుపక్కల గ్రామాల యువత, ప్రజలు స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్‌లు, 108 వాహనాల్లో తరలించేందుకు సహకారాన్ని అందించారు.
బాధితులకు పరామర్శ
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment