రాజంపేట :నందలూర మండలం చింతలకుంట గ్రామానికి చెందిన పప్పు వెన్నెల (16) మృత్యువుతో పోరాడి ఓడింది. సరిగ్గా తొమ్మిది రోజుల కిందట ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లింది. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు నిర్వహించారు. చింతలకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెన్నెల మృతితో కుటుంబంతోపాటు, బంధువులు, గ్రామస్తులు తల్లిడిల్లిపోయారు.
హోమ్‌సిక్ సెలవులతో..
తిరుపతిలోని కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వెన్నెల హోమ్‌సిక్ సెలవులు ఇవ్వడంతో ఎంచక్కా ఊరిలో ఉందామని తిరుపతి–కడప బస్సులో ఈ నెల 22న బయలుదేరింది. తోటి విద్యార్థిని, సమీప బంధువు సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన, మేనమామ కూతురు నిఖితారెడ్డితో కలిసి బస్సులో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మృత్యువు లారీ రూపంలో కబళించింది. సీట్లలో కూర్చున్న ఇద్దరూ తీవ్ర గాయాల బారిన పడ్డారు.
బతికి వస్తుందనే ఆశలతో..
తమ గ్రామానికి చెందిన వెన్నెల బతికి వస్తుందనే ఆశతో చింతలకుంట గ్రామస్తులు, బంధువులు ఎదురుచూశారు. మూడు రోజులు దాటిపోతే ప్రమాదం లేనట్లే అనే భావనలో ఉండేవారు. మృతదేహం రాక జీర్ణించుకోలేకపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. వెన్నల తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి రమాదేవిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. వెన్నెల మృతదేహానికి ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. వెన్నెలకు కన్నీటి వీడ్కోలు పలికారు చింతలకుంట వాసులు.
Comments
Please login to add a commentAdd a comment