మిస్టరీ.. బ్రయాన్‌ నిసెన్ ఫెల్డ్‌ | Mystery Of Brian Bienenfeld | Sakshi
Sakshi News home page

మిస్టరీ.. బ్రయాన్‌ నిసెన్ ఫెల్డ్‌

Published Sun, Nov 3 2024 11:33 AM | Last Updated on Sun, Nov 3 2024 11:33 AM

Mystery Of Brian Bienenfeld

స్టీవ్‌ గాఢనిద్రలో ఉండగా హాల్లో ఫోన్‌ మోగింది. అదే మత్తులో మెల్లగా నడిచి వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి, కాస్త అసహనంగా ‘హలో?’ అన్నాడు స్టీవ్‌. ‘డాడ్‌.. డాడ్‌.. డాడ్‌! నాకు చాలా భయంగా ఉంది. నన్ను వాడు వదిలిపెట్టడు. కిడ్నాప్‌ చేస్తానంటున్నాడు. సేవ్‌ మీ డాడ్‌.. సేవ్‌ మీ డాడ్‌’ అని అరుస్తూనే ఉన్నాడు అవతలి నుంచి బ్రయాన్‌ నిసెన్  ఫెల్డ్‌. కొడుకు అరుపులు విని స్టీవ్‌కు గుండె ఆగినంత పనైంది. ‘ఏం అంటున్నావ్‌ బ్రయాన్‌? ఏమైందిరా?’ అన్నాడు కంగారుగా. ఆ అలికిడికి లేచిన అతని భార్య మరియాన్  . భర్త మాటలను బట్టి కాల్‌ చేసింది బ్రయాన్‌ అని అర్థం చేసుకుంది. 

బ్రయాన్‌ మాటల్లో తడబాటు, వణుకు స్టీవ్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. స్టీవ్‌ గట్టిగా ఊపిరి తీసుకుని, ‘బ్రయాన్‌ ఏమైంది నాన్నా! ఎందుకు అలా మాట్లాడుతున్నావ్‌? ప్లీజ్, నువ్వు వివరంగా చెబితేనే కదా నేనేదైనా చేయగలను’ అన్నాడు. దాంతో బ్రయాన్‌ కాస్త కూల్‌ అయ్యి ‘డాడ్‌ , జోష్‌ అని నా సీనియర్‌.. చదువు పూర్తి చేసుకుని ఈ క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయాడు. కానీ వెళ్లేముందు మా మధ్య పెద్ద గొడవైంది. దాన్ని మనసులో పెట్టుకుని, ఫోన్‌ చేసి బెదిరిస్తున్నాడు. నన్ను కిడ్నాప్‌ చేసి చంపుతానంటున్నాడు. ఏ సమయంలోనైనా మా యూనివర్సిటీకి వచ్చి, నన్ను ఎత్తుకుపోతాడట! నా శవాన్ని కూడా ఎవరికీ కనిపించనివ్వడట! ప్లీజ్‌ నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లిపో’ అని ఏడుస్తూ వణికిపోతూ చెప్పాడు బ్రయాన్‌. దాంతో స్టీవ్, తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ కొడుక్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉండి కంగారుపడుతున్న మరియాన్  కి కొద్దికొద్దిగా విషయం అర్థమైంది. 

‘నాన్నా బ్రయాన్‌! భయపడకు, నువ్వు ఉన్నది పెద్ద క్యాంపస్‌లో. అలాంటి చోటికి వచ్చి ఒక మనిషిని ఎత్తుకెళ్లడం సాధ్యం కాదు. ముందు నువ్వు అక్కడి సెక్యూరిటీకి కాల్‌ చేసి అతడిపై కంప్లైంట్‌ చెయ్యి. తర్వాత నీ ఫోన్‌ నంబర్‌ మార్చేయ్, రేపు నేను వస్తాను’ అంటూ చాలాసేపు నచ్చజెప్పి ఫోన్‌ పెట్టేశాడు స్టీవ్‌. మధ్యలో ఫోన్‌ అందుకున్న మరియాన్‌ కూడా ప్రేమగా సర్దిచెప్పింది. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు కావస్తో్తంది. మరునాడు కొడుకుని చూసుకునేదాకా వారికి నిద్రపట్టలేదు.
రోజర్‌ విలియమ్స్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ రెండో ఏడాది చదువుతున్న బ్రయాన్‌కి 18ఏళ్లు. సంగీతం నేర్చుకోవడమన్నా, వినడమన్నా, యూనివర్సిటీ సమీపంలోని టౌంటన్‌ నది మీదున్న వంతెనపై ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడమన్నా చాలా ఇష్టం. బ్రయాన్  కి మాటిచ్చినట్లే మరునాడు స్టీవ్‌ దంపతులు వెళ్లి కలిశారు. 

వాళ్లు చెప్పినట్లే ఫోన్‌ నంబర్‌ మార్చేశాడు. తన జాగ్రత్తలో తాను ఉండటం మొదలుపెట్టాడు. అయితే సరిగ్గా నెలకి బ్రయాన్‌ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్‌ రాకపోవడంతో వారు మళ్లీ యూనివర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది. కాని, బ్రయాన్‌ అక్కడ లేడు. యాజమాన్యంతో సహా ఎవరిని అడిగినా తెలియదనే చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ‘బ్రయాన్‌ వారం క్రితం సంగీతం క్లాస్‌కి హాజరైన తర్వాత నుంచి ఎవరికీ కనిపించలేదు’ అని తేల్చారు. మరి బ్రయాన్‌ ఏమైనట్లు? ఈ ప్రశ్న రాగానే, జోష్‌ అనే పూర్వవిద్యార్థి గురించి స్టీవ్‌ పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా విచారణ మొదలైంది.

స్టీవ్‌ అనుమానించిన జోష్‌ అనే కుర్రాడితో బ్రయాన్  కి గతంలో గొడవ అయిన మాట నిజమేనని, వారిద్దరూ మొదట్లో మంచి స్నేహితులని, తర్వాత శత్రువులై కొట్టుకున్నారని తేలింది. అయితే జోష్‌ని పిలిపించి నిలదీస్తే, ‘నాకేం తెలియదు. గొడవ తర్వాత బ్రయాన్  ని నేను కలిసిందే లేదు’ అన్నాడు. అయితే కొన్నిరోజులకు ఆ యూనివర్సిటీ నుంచి ఒక గుర్తు తెలియని అమ్మాయి స్టీవ్‌ ఇంటికి కాల్‌ చేసి, బ్రయాన్‌ తల్లి మరియాన్  తో మాట్లాడింది. ‘బ్రయాన్‌ మిస్సింగ్‌ వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. దీని వెనుక ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. మరి అది నిజమా? కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమా? అనే అనుమానంతోనే ఆ దిశగా కూడా విచారించారు. కానీ బ్రయాన్‌ ఆచూకీ తెలియలేదు.

ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే టౌంటన్‌ నది ఒడ్డున లోరీ వేల్స్‌ అనే 30 ఏళ్ల మహిళ తన కూతురితో కలిసి వాకింగ్‌ చేస్తుంటే, ఒక షూ దొరికింది. దగ్గరకు వెళ్లి చూస్తే అందులో మనిషి పాదం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాదాన్ని డీఎన్  ఏ పరీక్షకు పంపారు. అది బ్రయాన్  దని తేలింది. రేపోమాపో దొరుకుతాడనుకున్న కొడుకు ఇక లేడు, రాడనే వార్త స్టీవ్‌ కుటుంబాన్ని అంతులేని దుఃఖంలో ముంచేసింది.

బ్రయాన్  కి బ్రిడ్జ్‌ మీద కూర్చుని చదువుకునే అలవాటు ఉంది కాబట్టి, పొరపాటున కాలు జారి నదిలో పడుంటాడని, లేదంటే ఏవో భయాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అధికారులు అంచనా వేశారు. అయితే స్టీవ్, మరియాన్  లు మాత్రం నమ్మలేదు. ఆ యూనివర్సిటీలో స్వయంగా రహస్య సమాచార సేకరణ మొదలుపెట్టారు. అయితే వారికి తెలిసిన విషయాలు వారిని మరింత బాధపెట్టాయి.

‘బ్రయాన్, జోష్‌లిద్దరూ స్వలింగ సంపర్కులు. బ్రయాన్‌ మొదటి సెమిస్టర్‌లో ఉన్నప్పుడు ఇద్దరూ ప్రాణమిత్రుల్లా ఉండేవారు. కొన్ని నెలలకు వారి బంధం ఎక్కడ బయటపడి పరువు పోతుందోనని బ్రయాన్‌ భయపడేవాడు. జోష్‌ మాత్రం బయటపడితే తప్పేంటి? అన్నట్లుగా ఉండేవాడు. అందుకే వారి మధ్య గొడవలొచ్చాయి’ అని చాలామంది చెప్పారు. బ్రయాన్‌ స్వలింగ సంపర్కుడని ప్రపంచానికి తెలిస్తే తన పరువుపోతుందని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు, జోష్‌ ప్రేమోన్మాదిగా మారి చంపేసి ఉంటాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే వేటికీ ఆధారాలు లేవు. జోష్‌ని మరోసారి విచారించినప్పుడు, ‘బ్రయాన్  కు కాల్‌ చేసి బెదిరించింది నేనే. కాని, అది ప్రాంక్‌. అతని మిస్సింగ్‌కి, నాకు ఏ సంబంధం లేదు’ అని చెప్పాడు.

1997 ఫిబ్రవరి 6న బ్రయాన్‌ తన యూనివర్సిటీ నుంచి మిస్‌ అయినట్లు ఫిబ్రవరి 13న కేసు నమోదైంది. ఆరు నెలలకు నది ఒడ్డున తెగిపోయిన అతని పాదం దొరికింది. మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. అసలు బ్రయాన్  కి ఏమైంది? జోష్, బ్రయాన్  ల మధ్య నిజంగానే రహస్య బంధం ఉందా? అది బయటపడకూడదనే బ్రయాన్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? దూరంపెట్టడాన్ని భరించలేక జోష్‌ ఉన్మాదిగా మారి బ్రయాన్  ని చంపేశాడా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం స్టీవ్‌ కుటుంబం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. 
సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement