నూతన సంవత్సరం..ఆనంద జీవితం
(బైబై 2024– వెల్‌కమ్ –2025)
అందరి జీవితంలోనూ న్యూ ఇయర్ వస్తుంది. కొందరేమో కొత్త అలవాట్లతో ముందుకెళ్తారు. మరికొందరేమో రొటీన్ జీవితానికే అలవాటు పడతారు. కొత్త కలలు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. మీకు సరికొత్త ఉత్సాహాన్నిస్తాయి. మీ అలవాట్లలో స్వల్ప మార్పులు మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. 2025 లో ఈ 5 సూత్రాలు పాటిస్తే ఉన్నత శిఖరాలకు చేరొచ్చని మానసిక వికాస నిపుణులు అంటున్నారు. – సాక్షి ప్రతినిధి వరంగల్ / హన్మకొండ కల్చరల్
‘కొత్త’ కలలు కందామా..
కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి.
– మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
కుంచిత భావన మనసుకే కానీ.. ఊహకు కాదు.. కాస్త పెద్ద కలలు కందాం. ‘నేస్తమా.. బిగ్ డ్రీమ్’..
– జిడ్డు కృష్ణమూర్తి,
ప్రముఖ రచయిత
● విజయానికి పంచ సూత్రాలు
● ఉద్యోగం, ఉపాధితో
మెరుగైన జీవనం
● ముందస్తు అప్రమత్తతతో సైబర్ మోసాలకు దూరం
● పాత జ్ఞాపకాలను మరిచి కొత్త ఆశయాలతో ముందుకు
కొత్త కలలు కందాం. సరికొత్తగా అడుగులు వేద్దాం. ఇన్నాళ్లు ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. నువ్వేంటో నిరూపించుకునే రోజొకటి రానే వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ.. అందరికీ విష్ చేయడం కాదు. నీ జీవితంలో ఎంత హ్యాపీ నెస్ ఉందో ఆత్మపరిశీలన చేసుకో. జీవితంలో ఆనందం నిండాలంటే.. నీ విలువ పెంచుకోవాలి. అందుకే ‘లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్’ అన్నారు. ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తావ్. కొత్త అలవాట్లు నిన్ను సరికొత్తగా చూపిస్తాయ్.
ఆరోగ్యమే ఆనంద యోగం
మిమ్మల్ని నడిపే సిస్టం ఒకటి మీలోనే ఉంటుంది. అదే ఆరోగ్యం. రోజులో కొంత సమయాన్ని దాని కోసం కేటాయిస్తే.. రోజంతా మీరేపని చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది. ఉదయాన్నే వాకింగ్ లేదా రన్నింగ్‌కు వెళ్లారనుకోండి.. రోజంతా తేలికగా అనిపిస్తుంది. రోజులో కనీసం పావుగంట మీకిష్టమైన మ్యూజిక్ వినడం, మెడిటేషన్, యోగా వంటివి సాధన చేస్తే రోజంతా హాయిగా గడుస్తుంది. ఏపని మీదైనా శ్రద్ధ పెట్టగలుగుతారు. ‘రోజూ అరగంట సేపు ఆరోగ్యం కోసం కేటాయిస్తే జీవితంలో డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు’ అని ఇటీవల అమెరికాలోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడించారు.
ఉద్యోగమే ఉన్నతికి మార్గం
పొరుగు దేశాల్లో బాల్య దశ నుంచే పార్ట్ టైం జాబ్‌లు చేస్తారు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలని.. చిన్నా చితకా పనులు చేసి సంపాదిస్తారు. ప్రపంచ కుభేరుడు వారెన్ బఫెట్ కూడా చిన్నతనంలో ఇళ్లు.. ఇళ్లు తిరిగి చూయింగ్ గమ్స్, కొకాకోలా అమ్మేవాడు. ఇలా.. కోట్లు కూడబెట్టిన వాళ్లైనా.. జీవితంలో స్థిర పడ్డ వారైనా చిన్నతనం నుంచే పని చేయడం ప్రారంభించారు. డిగ్రీలు, పీజీలు చేసి సరైన ఉద్యోగం లేక ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. ఉద్యోగమంటే బానిసత్వం కాదు. ఉన్నతికి మార్గం. చిన్నదో పెద్దదో దొరికితే ఉద్యోగం లేదంటే వ్యాపారం.. ఏదో ఒక పనిచేస్తే పేదరికాన్ని పారదోలవచ్చు.
పర్యావరణమే మనుగడకు మూలం
‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’ అక్కడక్కడా ఈ నినాదం చూస్తూ ఉంటాం. మీరో మొక్క నాటకపోయినా పర్లేదు. ‘పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ ప్రచారం చేయకపోయినా పర్లేదు. మరింత కలుషితం చేయకుండా ఉంటే చాలు. సిగరేట్లు తాగడం, ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించి పడేయడం. విచ్చలవిడిగా పాలిథిన్ వినియోగించడం. ఇలాంటివి చేయకుండా ఉంటే పర్యావరణానికి మేలు చేసినవారే.
అతినే ప్రమాదానికి కారణం
కరోనా సమయంలో కేవలం యూట్యూబ్‌లో వీడియోలు చూసి, ఆన్‌లైన్‌లో క్లాస్‌లు విని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిన వారు ఉన్నారు. రీల్స్ స్క్రోల్ చేస్తూ సమయాన్ని హరించిన వారూ ఉన్నారు. విజేతలకు, పరాజితులకు ఎవరికై నా సోషల్ మీడియా ఒకటే. ఎవరు ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. అరచేతిలో ఇమిడే పరిజ్ఙానాన్ని మీఉన్నతికి ఉపయోగిస్తే ఉన్నతులుగా తయారవుతారు.
దురాశే దుఃఖానికి తీరం
గ్రేటర్ వరంగల్ నగరంలో సైబర్ వలలో చిక్కిన వారిలో దాదాపు 90 శాతం మంది యువకులే. వారి అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్ అని ఒకరు. రూపాయి పెడితే పది రూపాయలొస్తుందని మరొకరు. తెలియని లింకులు నొక్కి ఇంకొకరు ఇలా నిత్యం నష్టపోతూనే ఉన్నారు. టెక్నాలజీ వాడకంతో పాటు అందులో వస్తున్న విపరీతమైన పోకడలను సైతం యువత ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మోసపోకుండా జాగ్రత్త పడాలి.
Comments
Please login to add a commentAdd a comment