బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు..
సమతుల్య సామాన్య వర్గాల బడ్జెట్
వరంగల్: బడ్జెట్‌లో ప్రభుత్వం పప్పు ధాన్యాల ఉత్పత్తి, నీటిపారుదల, రైతు సంక్షేమంపై దృష్టి సారించింది. వ్యవసాయానికి గణనీయమైన నిధులు కేటాయించి రైతన్నకు ఊతమిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ విస్తరణకు ప్రభుత్వం నిధులను కేటాయించడంతో సామాన్యులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌నకు ఇచ్చే విరాళాలను పన్ను నుంచి మినహాయించడంతో ఉద్యోగ విరమణ పొందేవారి పొదుపును ప్రోత్సహించినట్లయ్యింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు పేద, మధ్యతరగతి జీవులకు పెద్ద ఉపశమనం.
– పీవీ.నారాయణరావు, సీఏ, ఏపీ, తెలంగాణ టాక్స్ బార్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు
నిరాశ పర్చిన బడ్జెట్
హన్మకొండ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆద్యంతం నిరాశపర్చింది. ఆదాయ పన్నులో ఉద్యోగులు పొదుపు చేసే పాత విధానంలోని 80 సీ పెంచే ప్రస్తావన కానీ, గృహ నిర్మాణ రుణం, విద్యా రుణం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రస్తావన లేదు. స్టాండర్డ్ డిడెక్షన్ గతంలో ఉన్నట్లు రూ.75 వేలే ఉంది. పెంచలేదు. విద్యా, వైద్యరంగానికి తగిన కేటాయింపుల్లేవు. వంద శాతం ఎఫ్‌డీఐలతో దేశీయ బీమా కంపెనీలు కుదేలైపోతాయి.
– తూపురాణి సీతారాం, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ
దేశగతిని మార్చే బడ్జెట్
హన్మకొండ: దేశంలో పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారత దేశగతినే మార్చే అద్భుత బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన అన్ని వర్గాల ప్రజల కలల బడ్జెట్ ఇది. 2047 వికసిత్ భారత్‌కు బాటలు వేయనుంది. వ్యవసాయం సహా ప్రతీ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు సమకూర్చడం దగ్గర్నుంచి పన్నుల భారం తగ్గించడం వరకూ ఎన్నో చర్యలు తీసుకున్నారు.
– రావు పద్మ, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
కేయూ క్యాంపస్: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపాధి రంగానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.71.437 కోట్లు కేటాయించారు, సబ్సిడీలతో కూడా ప్రోత్సాహం లభించనుంది. దేశంలో ఉపాధి రంగానికి పెద్దపీట వేస్తూ ఎంఎస్‌ఎంఈ రంగానికి 23 వేల 168 కోట్లు కేటాయించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యువతకు ఉపాధి రంగానికి దోహదం చేస్తుంది. గతేడాది బడ్జెట్ కంటే ఈసారి నాలుగు శాతం నిధులు పెంచడం గమనార్హం. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. తక్కువగానే నిధులు కేటాయించారు.
– బి.సురేశ్‌లాల్, కేయూ ఎకనామిక్స్ ప్రొఫెసర్
ప్రభుత్వ విద్యకు గ్యారంటీ లేదు
కేయూ క్యాంపస్: మొత్తం రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ. లక్షా 28వేల 650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్‌లో 2.53 శాతమే. గతేడాది కన్నా కూడా తక్కువే. గత పదేళ్లలో 3.16 శాతం నుంచి 2.53 శాతానికి విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. బడ్జెట్‌లో కనీసం 6 శాతం నిధులైనా కేటాయిస్తే బాగుండేది. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన ఎలా చేస్తారు? పాఠశాలల్లో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేయలేరు. విద్యలో ప్రైవేట్ సంస్థల ప్రాధాన్యాన్ని పెంచేలా చేయడం సరికాదు.
– కడారి భోగేశ్వర్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి
పొదుపుకు మినహాయింపు ఇస్తే బాగుండేది...
కేయూ క్యాంపస్: ఆదాయపు పన్ను విషయంలో పాత విధానంలో కూడా కొన్ని మార్పులు చేస్తే బాగుండేది. కొత్త విధానానికి పొదుపునకు సంబంఽధించిన సెక్షన్ 80 సి, కి సంబంధించిన రూ 1,50,000 గృహ రుణాల అసలు, వడ్డీ మిగతా పొదుపు పథకాలకు కూడా మినహాయింపు ఇస్తే బాగుండేది. వాటికి కూడా మినహాయింపు ఇస్తే రూ. 12లక్షల పైబడిన ఆదాయం ఉన్నవారికి కూడామేలు జరగుతుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్‌తో చిరు, మధ్య తరగతి ఉద్యోగులకు కొంత మేలు జరుగబోతోంది.
– పెండెం రాజు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ
రాష్ట్రానికి మొండి చెయ్యి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చెయ్యి మిగిలింది. ప్రత్యేక కేటాయింపులు లేవు. రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలు కేటాయింపుల్లో ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు. అంకెలతో ఆదాయపు పన్ను మినహాయింపు మధ్య తరగతికి పెద్ద ఊరట అని బీజేపీ చేస్తున్న ప్రచారం అవాస్తవం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేటాయింపులు లేవు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసేలేదు. ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీ ప్రథమ ప్రాధాన్యం.
– టి.శ్రీనివాస్‌రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పన్ను పరిమితి పెంపు హర్షణీయం
వరంగల్: ఆదాయ పన్ను పరిమితి పెంచడం వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైతులకు బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు లభించే అవకాశం ఉంది. పత్తి పంట విషయంలో 5 ఏళ్ల మిషన్ అమలు వల్ల కొత్త సీడ్స్ (వంగడాలు) రావడం వల్ల పత్తి రైతులు ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల పెద్ద మొత్తంలో అంతర్జాతీయ ఎగుమతులు చేసే అవకాశం ఉంది. టెక్స్‌టైల్ రంగం ఎక్కువ పురోగతి సాధించడం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
– బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment