హిమాయత్‌నగర్: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు అందిస్తూ నేరాలకు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర జాయింట్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు. సైబర్ కేటుగాళ్ల ఇచ్చే కమీషన్లకు ఆశపడి పలువురి నుంచి బ్యాంకు ఖాతాలను సేకరించి సైబర్‌నేరగాళ్లకు అందిస్తున్న శృతి మయూర్ బఫ్నా అనే మహిళను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రుతి తన పేరున వివిధ వ్యాపార సంస్థలు ఉన్నాయని, స్టాక్ మార్కెట్, క్రిఫ్టో మార్కెట్ ట్రేడింగ్ కోసం టెనెక్స్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో బ్యాంక్ ఖాతాను తెరిచి సైబర్ మోసగాళ్లకు అందజేసింది.
ఇందుకుగాను వారు 10 శాతం కమీషన్‌గా ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఖాతాల్లోనూ దాదాపు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. శ్రుతిపై రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయని, దేశవ్యాప్తంగా సుమారు 25 కేసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాలను అందించినట్లు గుర్తించామన్నారు. ఇదే తరహాలో పద్మారావు నగర్‌లోని హాస్టళ్లకు రేటింగ్స్ ఇస్తూ, పెట్టుబడి పెట్టేలా చేసి రూ.21.07 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలు శ్రుతి మయూర్ బఫ్నాను అరెస్ట్ చేసినట్లు జాయింట్ సీపీ తెలిపారు.
ఫెడెక్స్ పార్సిల్ పేరుతో..
ఫెడెక్స్ పార్సిల్ పేరుతో మోసాలకు పాల్పడేవారికి బ్యాంకు ఖాతాలు అందించిన జావేద్ నవాబ్ యాకూబ్ ఖాన్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కవాడిగూడకు చెందిన వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము కస్టమ్స్ అఽధికారులమని మీరు పంపిన పార్శిల్‌లో నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరించి రూ.8,74,998 వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జావేద్ నవాబ్ యాకూబ్ ఖాన్ సైబర్ నేరగాళ్లతో కుమ్మకై ్క ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వీరిపై దేశవ్యాప్తంగా 105 కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో 14 కేసులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment