సాక్షి, హైదరాబాద్: గృహజ్యోతి పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆదివారం సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రి మండలి సమావేశమైంది. ఆరు గ్యారంటీల పథకం అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఈ పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయనుంది.
మూడు జిల్లాల పరిధిలో మొత్తం 50.99 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఉచిత విద్యుత్‌కు 19.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 100 యూనిట్లలోపు 12 లక్షల మంది వినియోగిస్తుండగా, మిగిలిన వారు 200 యూనిట్ల లోపు వాడుతున్నారు. వీరికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే నెలకు రూ.210 కోట్ల మేరకు వ్యయం అవుతుంది.
జిల్లాల వారీగా ఇలా...
జీహెచ్‌ఎంసీ పరిధిలో 18.95 లక్షల మంది దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, వీరిలో 14.04 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు నెలకు సగటున 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. కేబినెట్ ఆమోదంతో వీరందరికీ నెలవారీ విద్యుత్ బిల్లుల నుంచి ఊరట లభించనుంది. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో 5.10 లక్షల దఖాస్తుల్లో 3.99 లక్షల దరఖాస్తులు ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక మేడ్చల్ జిల్లాలో 2.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 1.81 లక్షల మంది వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment