సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరస్తులు బాధితురాలిని భయభ్రాంతులకు గురి చేసి రూ.1.58 కోట్లు మోసం చేశారు. దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్వర స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకోవడమే కాకుండా రూ.70 లక్షలు సొమ్మును బాధితురాలికి రీఫండ్ చేయగలిగారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా, వేగంగా స్పందించి, బాధితురాలికి న్యాయం చేసిన ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ, అతని బృందాన్ని, డీసీపీ నాగలక్ష్మిలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 8న ఉప్పల్ ప్రాంతానికి చెందిన గీతా ఉపాధ్యాయ (65)కు గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను ముంబై సైబర్ క్రైమ్ అధికారి మోహిత్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి గుర్తింపు కార్డుతో సిమ్ కార్డు జారీ అయిందని, దీన్ని ప్రజలను వేధించడానికి, అసభ్యకరమైన కథనాలను ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎంహెచ్ 1045/2024 ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన 24 ఫిర్యాదులలో కూడా ఈ సిమ్ కార్డునే చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఉపయోగించారని భయభ్రాంతులకు గురి చేశాడు. విచారణ పేరుతో బాధితురాలి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను తీసుకున్నాడు. కేసు నుంచి బయట పడాలంటే తాము సూచించిన విధంగా చేయాలని బాధితురాలికి సలహా ఇచ్చారు. దీంతో ఆమె పలు దఫాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీఎఫ్ సొమ్మును డ్రా చేసి రూ.1.58 కోట్ల సొమ్మును నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. పైగా డిజిటల్ అరెస్టు, విచారణ తదితర వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని ఆమెను హెచ్చరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే ఎల్బీనగర్‌లోని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన ఏసీపీ ఎస్ శివశంకర్ కేసు నమోదు చేసి, సత్వరమే బాధితురాలు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లోని ఖాతాలో ప్రీజ్ అయిన రూ.70 లక్షల సొమ్మును తిరిగి బాధితురాలికి ఇప్పించారు. ప్రజలు మోసపూరిత కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగించే వ్యక్తులకు స్పందించకూడదని, ఎటువంటి సందర్భంలో అయినా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతే తక్షణమే నేషనల్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు సూచించారు.
సత్వరమే స్పందించిన రాచకొండ పోలీసులు
దీంతో బాధితురాలికి రూ.70 లక్షలు రీఫండ్
Comments
Please login to add a commentAdd a comment