పంచాయతీ కార్యదర్శులకు అప్పుల గండం
● అప్పులపాలవుతున్న వైనం ● ఐదునెలలుగా కార్మికులకు వేతనాలు కరువు
జగిత్యాలరూరల్: గ్రామాల పాలన పంచాయతీ కార్యదర్శులకు గండంగా మారింది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో మొత్తం భారమంతా వీరిపైనే పడుతోంది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, నీటి సరఫరా, ఏ చిన్న సమస్య తలెత్తినా కార్యదర్శి చేతి నుంచే డబ్బులు పెట్టి చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా కార్యదర్శులు తమ జీతాల నుంచి ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత, పచ్చదనం, కార్మికుల వేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. బిల్లులు పాస్ కావడంలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు తమకు వేతనాలు ఇస్తేనే పనులకు వస్తామని, లేకుంటే మానేస్తామని చెప్పడంతో కార్యదర్శులు అప్పు చేసి వారికి వేతనాలు చెల్లిస్తున్నారు.
అత్యవసర పనులకు తప్పని అప్పులు
గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టకపోతే ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో శానిటేషన్, బ్లీచింగ్, విద్యుత్ బల్బుల ఏర్పాటు, మోటార్ల రిపేరు, పైప్‌లైన్ లీకేజీ వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులే అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం.. మంజూరైన నిధులకూ బిల్లు పాస్ కాకపోవడంతో కార్యదర్శులంతా ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని ప్రత్యేకాధికారులు
జిల్లాలో 380 పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేకాధికారులు పంచాయతీ పాలనలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బిల్లులు సమర్పిస్తున్న సమయంలో మాత్రం ప్రత్యేకాధికారులు ఇంత ఖర్చు ఎలా అయింది..? ఎప్పుడు పెట్టారు..? అంటూ కార్యదర్శులను నిలదీస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో బరువు బాధ్యతలంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతుండటంతో వారికి పనిభారంతో పాటు, అప్పుల భారం అధికమై ఆందోళన చెందుతున్నారు.
పండుగల ఏర్పాట్లకు పెట్టినా.. అందని బిల్లులు
ఇటీవలి దసరా, బతుకమ్మ, దీపావళి పండగల ఏర్పాట్లకు పంచాయతీ కార్యదర్శులే అప్పు చేసి ఏర్పాట్ల కోసం ఖర్చు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో మళ్లీ కొత్త పనులకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిల్లులు చెల్లించాం
గ్రామపంచాయతీల అభివృద్ధి పనుల కోసం రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చాలాచోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం.
– రఘువరణ్, ఇన్‌చార్జి డీపీవో
Comments
Please login to add a commentAdd a comment