గళం విప్పిన ‘మందా’
పాలమూరు సమస్యలపై..
నేడు అంత్యక్రియలు..
అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ దోబీ ఘాట్ వద్ద జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతితో స్వగ్రామం కొండేరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
అలంపూర్: వృత్తిరీత్యా వైద్యుడు అయిన మందా జగన్నాథం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి పాలమూరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండేరు అయినప్పటికీ.. విద్యాభ్యాసం, వృత్తి అంతా వేరే ప్రాంతాల్లో జరగడంతో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయడంతో స్థానికత గురించి జిల్లావాసులకు తెలిసింది. అయితే ఎంపీగా గెలిచిన మొదట్లో తెలియకపోయినప్పటికీ తరుచుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సమస్యలపై గళం విప్పి.. సుపరిచితుడయ్యారు. ప్రత్యేకించి పాలమూరు కరువు, వలసలకు మారు పేరైన జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు వస్తే సస్యశ్యామలం అవుతుందని.. వలసలు తగ్గిపోతాయని చెబుతుండే వారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ రూపొందించే సమయంలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. గత నెల 23న గుండె సంబంధ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన మందా జగన్నాథం చికిత్స సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం..
మందా జగన్నాథం తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాభ్యాసం సాగింది. నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదివారు. అనంతరం 5 నుంచి 8వ తేదీ వరకు నాగార్జున్ సాగర్‌లోని హైస్కూల్లో పూర్తి చేశారు. ఖమ్మంలోని నయా బజార్‌లో 9వ తరగతి కొంత వరకు చదివి అనంతరం వరంగల్ జిల్లా సంగంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 9, 10 తరగతులు పూర్తిచేశారు. వికారాబాద్ జెడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్‌ఎస్సీ, నిజాం కళాశాలలో పీయూసీ, వికారాబాద్‌లోని పద్మనాభ కళాశాలలో మళ్లీ పీయూసీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంస్‌ఎల్‌డీ, ఈఎన్‌టీ స్పెషలిస్టు సర్జన్ కోర్సులు చదివారు.
కుటుంబ నేపథ్యం..
మందా జగన్నాథం తల్లిదండ్రులు మందా పుల్లయ్య, సవారమ్మ. మందాకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు ప్రసూతి గైనకాలజీలో మెడికల్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తుంది. పెద్ద కుమారుడు మందా శ్రీనాథ్ బీటెక్ మెకానికల్ ఇంజినీర్ చేసి ప్రస్తుతం సోషల్ వర్కర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు మందా విశ్వనాథ్ ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు.
మాజీ ఎంపీ మృతితో
స్వగ్రామం కొండేరులో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment