ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోండి
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులతో కలిసి జిల్లా, మండల కేంద్రాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం 75 శాతం ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాలతోనే చోటు చేసుకుంటున్నాయన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసి, భవిష్యత్తులో వారికి మళ్లీ లైసెన్స్ జారీ చేయడానికి అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గురుకులాల్లోని విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి
మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, రంగోళి, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథుల ఆధ్వర్యంలో గ్రామాల్లో పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను అంబులెన్స్‌లో ఏ ఆస్పత్రికి తీసుకవెళ్లాలో తెలిపే విధంగా ఆస్పత్రుల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ట్రాఫిక్ రూల్స్ తెలిపే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీఈవో రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్ సంగ్వాన్, అధికారులు
వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment