ఉచిత వైద్య శిబిరం అభినందనీయం
దోమకొండ: ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మండలంలోని అంచనూరులో గురువారం హార్వెస్ట్ మినిస్ట్రీస్, హ్యాండ్ ఆప్ హోప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. శిబిరంలో దంత, కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. హార్వెస్ట్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ క్యాలేబ్ రాయపాటి, పాస్టర్ రత్నాకర్ హార్వెస్, తహసీల్దార్ సంజయ్ రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, బురాని మమత, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ రవాణా అథారిటీ మెంబర్‌గా ఎజాజ్‌ఖాన్
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాంతీయ రవాణా అధారిటీ మెంబర్‌గా మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన ఎజాజ్ ఖాన్ నియమితులయ్యారు. గురువారం రాష్ట్ర రవాణా శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఎజాజ్ ఖాన్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తపాలా సేవలు ప్రజలకు చేరువ చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): తపాలా సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి సూచించారు. లింగంపేట సొసైటీ ఛాంబర్‌లో గురువారం ఆయన లింగంపేట, గాంధారి, తాడ్వాయి మండలాల పరిధిలోని బీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తపాలా జీవిత బీమా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు, ఐపీపీబీ ఖాతాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పెన్షన్లు, ఉపాధి హామీ పథకం డబ్బుల చెల్లింపులో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి తపాలా ఇన్‌స్పెక్టర్ సుజిత్‌కుమార్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు మేనేజర్ పవన్‌రెడ్డి, మెయిన్ ఓవర్ సీనియర్ మహబూబ్‌రెడ్డి, లింగంపేట సబ్ పోస్టుమాస్టర్ సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మెల్లకుంటతండాలో గురువారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్(ఎస్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో కెనరా బ్యాంకు సహకారంతో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌టీ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనం సంపాదించే సొమ్ములో కొంత మొత్తాన్ని పిల్లల భవిష్య త్తు కోసం పొదుపు చేయాలని చెప్పారు. పొదుపు చేసే మొత్తాన్ని తప్పనిసరిగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలన్నారు. అలాగే బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఎస్‌టీ కౌన్సిలర్లు మన్నె కృష్ణ, జోడు లక్ష్మణ్, తండాపెద్దలు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రిన్సిపాల్ శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్ 8, అసోసియేట్ ప్రొఫెసర్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ 28, ట్యూటర్ 4, జూనియర్ రెసిడెంట్ 18, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 7 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. ఈ నెల 20న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 21న ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment