ఫారిన్‌ పోదాం.. చదువుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ పోదాం.. చదువుకుందాం

Published Tue, Apr 2 2024 12:10 AM | Last Updated on Tue, Apr 2 2024 11:11 AM

- - Sakshi

విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువులకు చక్కటి అవకాశం

పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం

కరీంనగర్‌: డిగ్రీచేసి విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి ఉన్నవారికి విదేశీ విద్యా నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఒక్కోవిద్యార్థికి రూ.20లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తోంది. నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ ఉపకార వేతనం, బీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి పథకాలు భరోసానిస్తున్నాయి. 2014–15 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీలకు, 2018 నుంచి బీసీలకు ఈ పథకాలను అమలు చేస్తున్నారు.

చేయూతనిస్తున్నా అంతంతే..
విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొందరే సద్వినియోగం చేసుకుంటున్నారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ప్రారంభమై తొమ్మిదేళ్లయినా ఇప్పటివరకు విదేశాలకు వెళ్లింది 26 మందే. ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు 51మంది విదేశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. మహాత్మా జ్యోతిబాఫులే విద్యానిధి పథకం ద్వారా జిల్లా నుంచి 18 మంది ఎంపికై నట్లు సమాచారం.

అవగాహన డొల్ల..
జిల్లా నుంచి ఏటా వందలాది మంది డిగ్రీ పట్టాలు పొందుతున్నారు. చాలా మందికి విదేశాల్లో చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్ధిక స్థితిగతుల దృష్ట్యా వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యానిధి పథకాలతో విదేశీ విద్యను ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో అందరికీ దక్కడం లేదు. జిల్లాలో 130కి పైగా ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల యాజమాన్యం విదేశీవిద్యపై అవగాహన కల్పిస్తే చాలా మంది సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.

ఇవీ.. అర్హతలు
ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, వ్యవసాయం, నర్సింగ్‌, సామాజిక శాస్త్ర కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసి, 60 శాతానికి పైగా మార్కులు సాధించాలి. టోఫెల్‌లో 60శాతం, ఐఈఎల్‌ టీఎస్‌ 80మార్కులు, జీఆర్‌ఈ టోఫెల్‌, జీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి పీఈటీలో 50శాతం అర్హత మార్కులు ఉన్నవారికి అవకాశం ఉంటుంది. విద్యార్థి వయసు 35 ఏళ్లలోపు, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.

పదిదేశాల్లో అమలు
గతంలో నాలుగు దేశాల్లోని యూనివర్సిటీల్లో మాత్రమే విద్యార్థులు చదువుకుంటే రుణసౌకర్యం కల్పించేవారు. ఈసారి ఆ సంఖ్యను పది దేశాలకు పెంచారు. దక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ దేశాల్లో విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ఇక్కడ వైద్యవిద్య, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ప్యూర్‌సైన్స్‌, వ్యవసాయం, సోషల్‌సైన్సెస్‌, హ్యూమానిటీస్‌, తదితర కోర్సుల్లో పీజీ చేయడానికి అవకాశముంది.

ఈ సర్టిఫికెట్లు అవసరం
కులం, ఆదాయం, జనన ధ్రువీకరణపత్రాలు, ఆధార్‌ కార్డు, పదో తరగతి, డిగ్రీ, ఇంటర్‌, పీజీ మార్కుల జాబితాలతోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌, టీఎస్‌జీఆర్‌ఈ, జీమ్యాట్‌, పీఈటీ అర్హత కలిగి ఉండాలి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయడానికి సంబంధిత కళాశాల ప్రవేశ అనుమతిపత్రం, ప్రవేశ రుసుం చెల్లించిన రశీదు. బ్యాంకుఖాతా పుస్తకాలు. వీటి ఆధారంగా మీసేవాకేంద్రంలో గానీ, ఆన్‌లైన్‌లో కానీ తెలంగాణ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10 విలువైన నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంపును అతికించి రిజిస్ట్రార్‌ సంతకంతో కూడిన పత్రాన్ని ఆదాయ ధ్రువపత్రానికి జత చేసి దరఖాస్తు సమర్పించాలి. ఆయా సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. ఎస్సీ సంక్షేమశాఖ నుంచి విద్యానిధి దరఖాస్తులకు మార్చి31వరకు గడువు ముగిసింది. బీసీ సంక్షేమశాఖ నుంచి ఏప్రిల్‌ 5 వరకు అవకాశం కల్పించారు.

జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారి సంఖ్య

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం

(ఎస్సీ,ఎస్టీ): 26 

ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ పథకం(మైనార్టీ): 51

మహాత్మాజ్యోతిబాపూలే (బీసీ): 18

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement