కోలారు: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని వినాయక నగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నెహర్ అంజుం(22) అనే యువతికి రెండున్నరేళ్ల క్రితం వినాయక నగర్‌కు చెందిన అఫ్జల్ బేగ్‌తో వివాహమైంది. రూ.4 లక్షల వరకట్నం, నగలు, ఇంటికి అవసరమైన సామగ్రిని ఇచ్చి వివాహం చేసిచ్చారు. ఏడాదిన్నర పాటు అన్యోన్యంగానే ఉన్నా ఇంట్లో వరకట్న వేధింపులు ప్రారంభించారని తమ కుమార్తె తమతో చెప్పుకుందని మృతురాలి తల్లి కేజీ మొహల్లాకు చెందిన జబీన్‌తాజ్ తెలిపింది. తన కుమార్తెను కట్నం కోసం భర్త, మామ మీర్జా అఖీర్‌బేగ్, అత్త తన్వీర్‌లు హత్య చేసినట్లు నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.
గత నెల నుంచే వేధింపులు
మరో రూ.5 లక్షల వరకట్నం ఇవ్వాలని గత నెల 25న ఇంటి నుంచి బయటకు పంపారని, తమ ఇంట్లో కుమారుడి పెళ్లి ఉండడం వల్ల అల్లుడు అడిగిన కట్నం ఇవ్వడానికి సాధ్యం కాలేదన్నారు. కుమార్తెకు నచ్చచెప్పి ఈ నెల 5న భర్త ఇంటికి పంపామని తెలిపింది. అయితే రాత్రి తమకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపారని భోరుమంది. తాము వెళ్లేసరికి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారన్నారు.
ఆత్మహత్య చేసుకుని ఉంటే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారని ప్రశ్నించింది. దీన్నంతా చూస్తుంటే తన కుమార్తెను అత్తింటివారే హత్య చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోందని తెలిపారు. కాగా అంజుంది హత్య అని ఆమె బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గల్‌పేటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment