నిత్యం కన్నడలోనే మాట్లాడాలి
శ్రీనివాసపురం: తాలూకా ప్రజలు నిత్య వాడకంలో అధికంగా కన్నడ భాషనే ఉపయోగించాలని ఎమ్మెల్యే జికె వెంకటశివారెడ్డి తెలిపారు. శనివారం తాలూకాలోని యల్లూరు గ్రామంలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాషతో పాటు కన్నడిగులు జీవనం సాగించాలి. అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తాలూకాలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి గాను తాలూకాలో పరిశ్రమలను తీసుకు రావడం జరుగుతోంది. రైతులు ఇందుకు అవసరమైన భూమిని అందించి సహకరించాలన్నారు. మదనపల్లి రహదారిలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దీని వల్ల తాలూకాలో నిరుద్యోగ సమస్య తొలిగిపోతుందన్నారు. జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కె గోపాలగౌడ మాట్లాడుతూ... కన్నడ అత్యంత ప్రాచీన మైన భాష దీనికి తనదైన ఇతిహాసం ఉంది. కన్నడ సాహిత్యానికి 8 జ్ఞానపీఠ అవార్డులు రావడం కన్నడిగులు అందరికి గర్వకారణమన్నారు. జిల్లా సరిహద్దులో కన్నడ భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం అందించారు. యల్తూరు ఫిర్కా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కన్నడ ఏకీకరణ కోసం ఎంతో మంది మహనీయులు శ్రమించారని, వారందరిని ఈ సమయంలో స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి హెచ్ రెడ్డప్ప, మాజీ అధ్యక్షుడు కె ప్రకాషయ్య, కరవే అధ్యక్షుడు ఆర్ అమరేష్, కార్యదర్శి ఎల్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment