తప్పుల తడకగా పిల్లల హాజరు
కోడూరు: అంగన్‌వాడీ కేంద్రానికి రాని చిన్నారులకు హాజరు ఏ విధంగా వేస్తారంటూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఐసీడీఎస్ అధికారులను నిలదీశారు. శుక్రవారం కోడూరు మండలంలో కలెక్టర్ సూడిగాలి పర్యటన నిర్వహించారు. కలెక్టర్ వస్తున్నారనే సమాచారంలో మండలాధికారులు ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్ద వేచి ఉండగా, కలెక్టర్ మాత్రం నేరుగా ఉల్లిపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంలోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు జరిపారు. కేంద్రంలో ఉన్న చిన్నారుల వివరాలను సంబంధిత కార్యకర్త వద్ద నుంచి తెలుసుకున్నారు. వైద్యశాఖ రూపొందించిన చార్ట్ ఆధారంగా చిన్నారుల బరువు కలెక్టర్ పరిశీలించారు. హాజరు పట్టీని తనిఖీ చేశారు. కొంతమంది చిన్నారులు కేంద్రంలో లేకపోయినా హాజరు వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్రాన్ని సరిగ్గా పరిశీలించకుండా ఉన్న సీడీపీఓ, సూపర్‌వైజర్‌పై మండిపడ్డారు. కేంద్రం లోపల ఉన్న వాటర్ ఫ్యూరిఫైయర్ ఆరు నెలల నుంచి పని చేయడం లేదని ఐసీడీఎస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత పీడీకి ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణపై మండల, సచివాలయ అధికారులు కూడా పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. అనంతరం కేంద్రం చుట్టు పక్కల మహిళలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి, అంగన్‌వాడీ నిర్వహణపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ అధికారి మురళీకిషోర్, వైద్య విభాగం పర్యవేక్షణాదికారి ఎల్.నిత్యానందం, విద్యా పర్యవేక్షణాధికారి మహ్మద్ హాజీబేగ్, తహసీల్దార్ శ్రీనునాయక్, ఎంపీడీఓ సుధాప్రవీణ్, ఈఓపీ ఆర్డీ నాగరేవతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉల్లిపాలెం అంగన్‌వాడీలో
కలెక్టర్ బాలాజీ ఆకస్మిక తనిఖీలు
రికార్డులు సరిగ్గా లేకపోవడంతో
ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment