లక్ష్యం చేరేనా
ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ 1.50లక్షల మెట్రిక్ టన్నులు
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ చేపడుతోంది. ప్రభుత్వం ఐకేపీ, జీసీసీ, పీఏసీఎస్, రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతోంది. కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాకు కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. ప్రభుత్వం 33 రకాల సన్నధాన్యానికి బోనస్ ప్రకటించడంతో కొనుగోళ్లు కొంత అలస్యం అయినప్పటికీ ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యాపారులు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో సన్నధాన్యానికి ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు.
1.50లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మొత్తం 95,269 ఎకరాల్లో వరిసాగు చేశారు. అందులో సన్నరకం 84,881 ఎకరాల్లో, దొడ్డు రకం 10,388 ఎకరాలలో సాగు చేశారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో 59 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టారు. కేటాయించిన 38 మిల్లులకు ధాన్యం తరలించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలలో 10,172 మంది ధాన్యం అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నుంచి రూ.96.44 కోట్లను రైతులకు చెల్లించారు. ఇంకా రైతులకు రూ.41.09 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ప్రారంభంలో ప్రైవేట్ వైపు మొగ్గు
ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌పై సందిగ్ధంతో రైతులు ధాన్యం అమ్మకాల ప్రారంభంలో సాగు చేసిన సన్నధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కాంటాల నిర్వాహణ ఆలస్యం కావడం కూడా ఇందుకు కారణం. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మిల్లులకు తరలించిన అనంతరం రైతులకు బోనస్ ఖాతాలలో జమ కావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ వ్యాపారులు సైతం రూ.2,500 నుంచి రూ. 3వేల వరకు జై శ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్, బీపీటీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలు చేసింది
59వేల మెట్రిక్ టన్నులే..
రైతు ఖాతాలలో రూ.96.44కోట్లు జమ
జనవరి చివరి వరకు లక్ష్యం చేరుకుంటాం..
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. జనవరి నెల చివరి వరకు లక్ష్యం చేరుకుంటాం. ఇప్పటి వరకు 40శాతం ధాన్యం సేకరించాం. రైతుల ఖాతాలలో డబ్బులు సైతం సకాలంలో జమ చేస్తున్నాం. 41.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. త్వరలో చెల్లింపులు చేస్తాం.
– రాంపతి, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment