జిల్లాలో విభిన్న పరిస్థితి
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈ విభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లె, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది. ఒక తోట లో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతుండటంతో మామిడి రైతులు కలవరం చెందుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న మామిడి తోట కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొంగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.
Comments
Please login to add a commentAdd a comment