No Headline
కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికీ తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది. బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాలా వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే విరబూసిన పూతను బట్టి జిల్లాలో మామిడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం మామిడి పంటకు అనుకూలంగా లేకపోవడంతో భారీగా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment