● డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసులో కుట్ర కోణం
● ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడి పాత్రపై అనుమానాలు
డోన్: మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు అందరూ రోడ్డు ప్రమాదంగా భావిస్తున్న కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. ఓ భూమి వివాదంలో అతడిని అంతమొందించాలనే కుట్రలో భాగంగా పథకం ప్రకారం వాహనంతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీ స్థానిక గుత్తి రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్‌ను గుర్తు తెలియని కారు ఢీ కొంది. ఈ కేసులో డోన్ పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. పట్టణంలోని హరికిషన్‌కు సంబంధించిన భూ వివాదంలో అతని ప్రత్యర్ధులు ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నాయకుడు ఆశ్రయించారు. ఈ క్రమంలో జరిగిన సంఘటన రోడ్డు ప్రమాదం కాదు.. హత్యాయత్నమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు గాయపడిన హరికిషన్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. అయితే ప్రసార మాధ్యమాల్లో వార్త వైరల్ కావడంతో పోలీసులు 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుత్తి రోడ్డులో ఉన్న పలు దుకాణాల బయట ఉన్న సీసీ కెమెరాలను గత రెండు రోజులుగా క్షుణంగా పరిశీలించిన పోలీసులు ఢీకొన్న వాహనం ఆళ్లగడ్డకు చెందినదిగా నిర్ధారించినట్లు తెలిసింది. ఈ క్రమంలో హరికిషన్‌తో భూ వివాదం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించగా ఆళ్లగడ్డకు చెందిన ఒక టీడీపీ నాయకుడి సహకారంతో హరికిషన్‌ను హత మార్చేందుకు కుట్ర పన్ని, గుర్తు తెలియని వాహనంతో ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ సంఘటన గురించి సీఐ ఇంతియాజ్‌ను వివరణ కోరగా కేసు విచారణలో ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment