పట్టుదలే విజయ సూత్రం
జయపురం: నేటి విద్యార్థులే.. రేపటి దేశ రథ సారథులని, వీరిని ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఒడిశా రాష్ట్ర స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. సోమవారం స్థానిక నేహ్రూ నగర్‌లోని సిటీ ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ తెలుగు సంస్కృతిక సమితి కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ ఉంటుందని, ఆత్మ విశ్వాసంతో ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చన్నారు. తానేమీ చేయగలను అని భావిస్తే ఏమీ చేయలేరన్నారు. టీ విక్రయించే వ్యక్తి నేడు దేశ ప్రధాని అయ్యారని, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా ఉదహరించారు. విద్యార్థులలో ఆత్మస్థర్యం, సాధించాలన్న పట్టుదల ఉండాలన్నారు. తెలుగు సంస్కృతిక సమితి కార్యవర్గం పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి నడపటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు 1981లో ఈ పాఠశాల ఏర్పాటుకు ఏర్పడిన పరిస్థితులు వివరించారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో తెలుగు మాద్యమాన్ని ఎత్తివేయటంతో 6వ తరగతి నుంచి తెలుగు బోధనతో ప్రారంభించిన సిటీ స్కూల్ అనేక బాలారిష్టాలు అధిగమించి నేడు ఈ స్థాయికి ఎదిగిందని వివరించారు. తెలుగు సంస్కృతిక సమితి, సిటీ గర్‌ల్స్ ఉన్నత పాఠశాలల ఫౌండర్ శశిపట్నాయక్ ఉపాధ్యాయుల కొరతను వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు, ఈ సభలో నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, జిల్లా విద్యాధికారి ప్రశాంత్‌కుమార్ మహంతి, హెచ్‌ఎం సుజాత పాల్గొన్నారు. కమిటీ సభ్యులు విద్యామంత్రిని సన్మానించారు. పాఠశాల విద్యార్థులు ఆదివాసీ నృత్యాలతో మంత్రికి స్వాగతం పలికారు.
రాష్ట్ర స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్
Comments
Please login to add a commentAdd a comment