ఆటో డ్రైవర్ దారుణ హత్య
● టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
రాయగడ: ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోను మాట్లాడుకొని తీసుకొని వెళ్లిన వ్యక్తులు కొంత దూరం వెళ్లాక తన వద్ద గల పదునైన ఆయుధంతో గొంతుకొసి హత్య చేశారు. ఈ ఘోర ఉదంతం రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీస్ స్టేషన్ పరిధి కంసారిగుడ కూడలిలో ఆదివారం మధ్యాహ్నం వెలుగు చూసింది. మృతుడుని దొరాగుడ గ్రామానికి చెందిన బలరాం ఖొరగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌డీపీవో రస్మీరంజన్ సేనాపతి, టికిరి ఏఎస్సై మనోజ్ జెన్న, మహేశ్వర్ పలక, కాసీపూర్ ఐఐసీ సూర్యప్రకాష్ నాయక్ తదితరులు క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా బంధుగాం సమితి గారిడి గ్రామానికి చెందిన ఖొర కొంత కాలంగా తన కుటుంబంతో సహా దొరాగుడ గ్రామంలోని ఆర్‌ఆర్ కాలనీలో నివస్తుండేవాడు. ఈనెల 11వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఆటోను పులోజోబ గ్రామం వరకు వెళ్లేందుకు బేరం కుదుర్చుకొని వెళ్లారు. ఈ క్రమంలో ఆటోలో ఉన్న దుండగుడు పదునైన అస్త్రంతో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. అసలు హత్యకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. పాత కక్షలు కారణంగా ఈ దారుణం జరిగిందా లేక ఇతరత్రా కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment