క్రైస్తవులు హృదయ శుద్ధి కలిగిఉండాలి
పెదకూరపాడు: క్రైస్తవులు హృదయ శుద్ధి కలిగి, క్రీస్తు మార్గంలో నడవాలని గుంటూరు పూర్వ పీఠాధిపతులు, కడప అపొస్తలిక పాలనాధికారి మహాఘన, రైట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి తెలిపారు. ముగ్గురు రాజుల దేవాలయ శత వార్షికోత్సవంలో భాగంగా శనివారం డాక్టర్ గాలి బాలి గురుత్వ వజ్రోత్సవం, పీఠాధిపత్య రూబీ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక దివ్యపూజ బలిని డాక్టర్ గాలి బాలి నిర్వహించారు. 20 సంవత్సరాలు గురువుగా, 40 సంవత్సరాలు ఉమ్మడి గుంటూరు జిల్లా పీఠాధిపతులుగా దైవసేవలు అందించిన ఆయనకు పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ సంఘ పెద్దలు, సంఘస్తులు, గ్రామ ప్రజలు, కన్య సీ్త్రలు, విచారణ గురువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ గాలి బాలి మాట్లాడుతూ చెడు వ్యసనాలు , చెడ్డ ఆలోచనలు లేకుండా దైవ చింతనతో ఆధ్యాత్మిక జీవనం సాగించాలని తెలిపారు. పుట్టిన గ్రామానికి సేవలు అందించాలనే సంకల్పంతో అనేక దైవ సేవలు, పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషితో పాటు సామాజిక సేవలను అందించామని గుర్తు చేసుకున్నారు. గురుత్వం దేవుడు ఇచ్చిన వరమని, అనుక్షణం అందులో జీవించడం మహా సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గాలి బాలి జీవిత విశేషాలను ఆడియో వీడియో రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యబలి పూజ అనంతరం వందకు పైగా గురువులు, మఠకన్యలు, సంఘ పెద్దలు, కడప, అనంతపురం, పల్నాడు, గుంటూరు, హైదరాబాద్, విదేశాల నుంచి వచ్చిన భక్తులు డాక్టర్ గాలి బాలిని సత్కరించారు.
గ్రామానికి అంకితం
గురుత్వ వజ్రోత్సవం, పీఠాధిపత్య రూబీ జూబ్లీ వేడుకల వేళ, ముగ్గురు రాజుల ఆలయ శత వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ గాలి బాలి తన తల్లిదండ్రులు గాలి చిన్నప్పరెడ్డి శౌరమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన నూతన కల్యాణ మండపం, భోజనశాల భవనాన్ని ప్రారంభించి గ్రామానికి అంకితం చేశారు. గ్రామంలో శుభకార్యాలను గ్రామస్తులు రోడ్లపై చేయడం చూశానని, అందుకే ఈ భవనాలు నిర్మించి గ్రామానికి అంకితం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇందులో కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పారు. స్థానిక విచారణ గురువులు, సంఘ పెద్దల సమన్వయంతో కల్యాణ మండపం, భోజనశాలను నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయ కుమార్, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. చివరగా అన్నదానం నిర్వహించారు.
గుంటూరు పూర్వ పీఠాధిపతులు, కడప అపొస్తలిక పాలనాధికారి డాక్టర్ గాలి బాలి ఘనంగా గురుత్వ వజ్రోత్సవం, పీఠాధిపత్య రూబీ జూబ్లీ వేడుకలు వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు
Comments
Please login to add a commentAdd a comment