సంస్కృతికి ప్రతిబింబాలు నాటికలు
ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు
యద్దనపూడి: సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రతిబింబాలే నాటికలని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు. మండలంలోని అనంతవరంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు బుధవారం ప్రారంభించారు. తొలుత పువ్వాడ సుధాకర్ నటరాజ పూజ నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారులు జనాబ్ మహమ్మద్ షరీఫ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు నాటిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ కళలను, కళాకారులను గౌరవించే చోట ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. సమాజంలో రుగ్మతులను రూపుమాపడానికి నాటక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిషత్ నిర్వాహకులు గుదే తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ, మద్దినేని జయరామకృష్ణ, పెడవల్లి శ్రీనివాసరావు, పోపూరి శివసుబ్బారావు, నిమ్మల సాంబశివరావు, పెడవల్లి వెంకటేశ్వర్లు, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అలరించిన నాటికలు
విశ్వశాంతి కల్చరల్ ఆసోసియేషన్ హైదరాబాద్ వారు ‘స్వేచ్ఛ’ అనే నాటికను ప్రదర్శించారు. స్వేచ్ఛ అంటే యథేచ్చ కాదని, మన మనసుకు నచ్చినట్లు మన ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా చేయకూడదని తెలిపారు. మితిమీరిన స్వేచ్ఛ, పరిమితులు లేని జీవితం తెగిన గాలిపటం లాటిందనే సందేశంతో ప్రదర్శించిన నాటిక ఆహూతులను అలరించింది.
●న్యూస్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ హేట్ ఇండియా’ నాటికలో ఆకుట్టుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సామాన్యుల జీవితాల్లో మార్పు రాలేదని, ఇప్పటి వరకు పేదలు పేదలుగానే మిగిలిపోయారని చాటి చెప్పారు. కడుపుమండిన ఓ పేదవాడు ఓటు కోసం వచ్చిన నాయకుడిని ప్రశ్నల వర్షంతో నిలదీయటం ఆహుతులను ఆలోచింపజేసింది.
●శ్రీసద్గురు కళా నిలయం గుంటూరు వారు ప్రదర్శించిన ‘కమనీయం’ నాటిక అలరించింది. కళాకారుడు తన వారసత్వాన్ని మరో కళాకారునికి అందిస్తున్నట్లే కళా హృదయులు కూడా తమ కళాభిమానాన్ని భావితరాలకు పరిచయం చేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment