వేడుకగా జిల్లా యువజన ఉత్సవాలు
పార్వతీపురం టౌన్: జిల్లా యువజన ఉత్సవాలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వేడుకగా జరిగాయి. యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. విద్యార్థులు రూపకల్పన చేసిన విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న సెట్విజ్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి బి.రామ్‌గోపాల్ మాట్లాడుతూ జానపద గీతాలు, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శన వంటి పోటీలు ఈ ఉత్సవాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన తొలి విజేతలు రాష్ట్ర స్థాయికి వెళ్తారని, ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వీటిని ప్రారంభిస్తూ మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకొని జాతీయ స్థాయిలో జరిగే యువజన ఉత్సవాల్లో జిల్లా విద్యార్థులు పోటీ పడాలన్నారు. న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా విద్యార్థులకు తాను నిధులు సమకూరుస్తానని చెప్పారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా యువజన సంక్షేమ అధికారి కె.వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ యువత వివిధ విభాగాల ద్వారా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా అవకాశం కల్పించామన్నారు. ఇక్కడ ప్రదర్శించిన విభాగాల్లో విజేతలను ఎంపిక చేసేందుకు 19 మంది న్యాయ నిర్ణేతలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన ప్రథమ స్థానం విజేతలను రాష్ట్ర స్థాయికి, అందులో గెలుపొందిన వారికి జాతీయ స్థాయి పంపనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థింసా నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ జె.రామారావు, ఎంఈఓలు విమల కుమారి, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు శివనారాయణ, తహసీల్దారు వై.జయలక్ష్మి, ఎంపీడీఓ కె.రూపేశ్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ టి.రవికుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment