పండుగలకు కల్తీ నూనెలు! | - | Sakshi
Sakshi News home page

పండుగలకు కల్తీ నూనెలు!

Published Wed, Dec 18 2024 12:06 AM | Last Updated on Wed, Dec 18 2024 12:07 AM

పండుగ

పండుగలకు కల్తీ నూనెలు!

క్రిస్‌మస్‌, సంక్రాంతికి టన్నులకొద్దీ విడి నూనె నిల్వలు

అనధికారిక గోదాంలే అడ్డాలు

కల్తీ చేసి, పొద్దుతిరుగుడు, పల్లినూనె పేరిట విక్రయాలు?

జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం

అధికారుల మధ్య సమన్వయలోపంతోనే అని ఆరోపణలు

కరీంనగర్‌ అర్బన్‌: క్రిస్టమస్‌, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా అక్రమార్కులు టన్నులకొద్దీ విడి నూనెను అనధికారిక గోదాంలలో నిల్వ చేశారన్న ఆరోపణలున్నాయి. అరికట్టాల్సిన ఆహార నియంత్రణ, తూనికలు, కొలతల శాఖల అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. గతంలో జరిపిన తనిఖీల్లో భారీగా కల్తీ నూనె వెలుగుచూసినా పండుగలకు ముందు తనిఖీలు లేకపోవడం గమనార్హం. పత్రికల్లో కథనాలు రావడం.. పలువురు అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం.. విడి నూనె విక్రయాలు లేవని చెప్పే వ్యాపారులు చాటుమాటుగా విక్రయించడం ఎప్పుడూ జరిగేవేనని పలువురు చర్చించుకుంటున్నారు.

ఏళ్లుగా ఇన్‌చార్జుల పాలన..

ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెల తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యం ఉంటుంది. కానీ, ఏళ్లుగా పూర్తిస్థాయి అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతోంది. ఇన్‌చార్జి అధికారులతో నెట్టుకొస్తున్నారు. ఒక గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇద్దరు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్‌, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో ఉండాలి. అయితే, 1985లో అప్పటి జనాభా ప్రతిపాదికన పోస్టులను మంజూరు చేశారు. నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికీ ఆ స్థాయిలో పోస్టులను పెంచలేదు. మంజూరైనవాటి ప్రకారం కూడా అధికారులు లేరు. గతంలో వివిధ శాఖల అధికారులతో పౌరసరఫరాల విజిలెన్స్‌ విభాగం ఉండేది. ఆహార తనిఖీలపై ప్రధానంగా దృష్టిసారించి, కఠినచర్యలు తీసుకునేవారు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీ వ్యాపారులకు చెమటలు పట్టించేవారు. ఈ విభాగంలో ఒక డీఎస్పీ, ఒక సీఐ, ఎస్సై, పౌరసరఫరాల సిబ్బంది ఇందులో ఉండేవారు. 2002లో దీన్ని రద్దు చేయడం అక్రమార్కులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఆహార తనిఖీ విభాగానికి కూడా ఇదే పరిస్థితి రాబోతోందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి..

పండుగల సమయంలో అక్రమార్కులు తక్కువ ధరకు దొరికే వివిధ రకాల నూనెలను కొనుగోలు చేసి, నాణ్యమైన నూనెలను తక్కువ మొత్తంలో తీసుకొని కలిపేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా క్రిస్టమస్‌, సంక్రాంతి, బతుకమ్మ, దసరా, తొలి ఏకాదశి పండుగల సమయాల్లో పొద్దు తిరుగుడు, పల్లి నూనె పేరిట విక్రయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయా శాఖల అధికారులతో ముందే ఒప్పందాలు కుదుర్చుకొని, తనిఖీలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని, సీజన్‌ ముగిశాక అరకొర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వారే సూచిస్తున్నారని సమాచారం. కరీంనగర్‌లోని ప్రకాశంగంజ్‌, మంకమ్మతోట, రాంనగర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కల్తీ నూనె విక్రయాలు సాగుతున్నాయని తెలిసింది. చింతకుంట, బొమ్మకల్‌, బైపాస్‌ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడి నూనెను దించుకోవడం, అక్కడి నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి, దుకాణాలకు తరలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం క్రిస్టమస్‌, సంక్రాంతి నేపథ్యంలో హుజూరాబాద్‌, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్‌ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నూనెలు నిల్వ చేసినట్లు తెలిసింది.

ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు?

హైదరాబాద్‌, రాజమండ్రి, కాకినాడ నుంచి ట్యాంకర్ల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా నూనెను కరీంనగర్‌కు దిగుమతి చేస్తున్నారని సమాచారం. ఎముకల నూనెను కూడా మిశ్రమంగా వాడుతున్నట్లు గతంలో తేలింది. తక్కువ ధరకు లభించే సోయాబీన్‌ నూనెను పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెలో కలిసి, మంచి వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. 48 కిలోల సోయాబీన్‌ నూనెలో 2 కిలోల పల్లి నూనెను కలిపి, డబ్బాలలో నింపి, పల్లి నూనె పేరిట విక్రయిస్తూ రూ.కోట్లలో సంపాదిస్తున్నట్లు సమాచారం.

అనుమతి లేని దుకాణాలు వందల్లో!

కల్తీ నూనెల విక్రయాలు, ధరలు, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. కిందిస్థాయి ఉద్యోగులు రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ దందాను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ నూనె నిల్వ చేయాలంటే పౌరసరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్‌సేల్‌ వ్యాపారులు జిల్లా కేంద్రంలో అయితే 600 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాళ్లు, జిల్లా కేంద్రంలో రిటైల్‌ అయితే 50 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్లు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 100 వరకు దుకాణాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారుల్లో కొందరు హోల్‌సేల్‌వారే రిటైల్‌ వారని సమాచారం. తమ పరిధిలో కేసులు కూడా నమోదు చేయని ఆహార నియంత్రణ, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు.. తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీ వ్యాపారాన్ని అరికడతామని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పండుగలకు కల్తీ నూనెలు!1
1/2

పండుగలకు కల్తీ నూనెలు!

పండుగలకు కల్తీ నూనెలు!2
2/2

పండుగలకు కల్తీ నూనెలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement